కావ్య పరిమళం-26

0
2

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

చేమకూర సారంగధర చరిత్ర

చేమకూర వెంకటకవి విజయవిలాసంతో బాటు సారంగధర చరిత్ర కావ్యం కూడా వ్రాశాడు. అది మూడాశ్వాసాల కావ్యం. తాను “శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ సారస్వత సుధాసారజనిత యశోలతాంకూరుడ”ననీ, చేమకూర లక్ష్మణామాత్య కుమారుడననీ అశ్వాసాంత గద్యాలలో చెప్పడం వల్ల కవిత్వం దైవదత్తమని ఎంచాలి. ఇది విజయవిలాసం కంటే ప్రౌఢ రచన. వసుచరిత్రకారుని పద్యాలు వీణపై పాడుకోవడానికి వీలైతే, చేమకూర పలుకులే సంగీతమయం. సంగీత సాహిత్యాలు నాటి కవులకు కరతలామలకాలు. “రసికత గీతి సాహితీ మోహన వాణుల యొక్క ఫలితమేయని వారి తలంపు. క్షేత్రయ్య, వేంకటకవి ఆంధ్ర సాహిత్యంలో రెండు ఉత్తమ శిఖరాలు. గీతిలో క్షేత్రయ్య, సాహిత్యంలో వేంకటకవి” అని పింగళి లక్ష్మీకాంతం విశ్లేషించారు (ఆంధ్ర సాహిత్య చరిత్ర, పుట 422).

సారంగధర చరిత్రను దీపాల పిచ్చయ్యశాస్త్రి పరిష్కర్తగా ఆంద్రపదేశ్ సాహిత్య అకాడమీ వారు 2000 సంవత్సరంలో ముద్రించారు. గ్రంథావతార పీఠికలో చేమకూర తన పుట్టుపూర్వోత్తరాలను పేర్కొనక పోవడం వల్ల పండితులు రకరకాల ప్రవాదాలు చేశారు. చేమకూర రచనలలో ఇది తొలి రచన. ఈ గ్రంథం తొలిసారి 1885లో ముద్రితమైంది. లఘు టీకతో వేదం వేంకటరాయశాస్త్రి 1910లో ప్రచురించారు. 1942లో దీపాల పిచ్చయ్యశాస్త్రి ‘జితకాశి’ అనే పేర విపుల టీకతో వెలువరించారు.

“ఇంటిపేరు నస యైనను కవిత్వము పసగా నున్నది” అన్నాడొక రసజ్ఞుడు. “ఇతనిన్ మహాకవి వ్రజ సమానుడుంచును ప్రబంధము చూచి నుతింతు” అని తిరుపతి వేంకట కవులు ప్రస్తుతించారు. “ఈ చేమకూర చక్కెర మడిలో అమృతం పారించి పెంచినది గాని, మట్టిలో నీరు పారించి పెంచినది కాదు” అని వేదం వేంకటరాయశాస్త్రి అభిప్రాయపడ్డారు. “ఏ తల్లి కన్నదో గాని, వేంకటరాజు తమ తల్లి కడుపు చల్లగా కలకాలం బ్రతికే కవి. ఏ వనంలో నైనా చెట్లు చేమ లుంటాయి గాని, తెలుగు సాహిత్య వనంలో ఎన్ని చెట్లున్నా, చేమకూర ఒక్కటే ఉంది” అని ఆరుద్ర భావించారు.

సారంగధరుని కథ మాళవ దేశంలో మాంధాతపురంలో పుట్టి అంచెల మీద ఆంధ్రదేశానికి దిగి రాజమహేంద్రవరంలో నిలిచింది. ఇక్కడ చిత్రాంగి మేడలు, సారంగధర మెట్టలు వెలశాయి. బాణాల శంభుదాసు, కూచిమంచి తిమ్మకవి సారంగధరుని కథ రాజమహేంద్రవరంలో జరిగినట్లు స్పష్టంగా వ్రాశారు.

విషాద సారంగధర:

కావ్యం విషాదాంతం కాకూడదనే ఆలంకారిక సంప్రదాయానుసారం సారంగధరుని కాలుసేతులు నరకడంతో కథ ముగించక, మత్స్యనాథుడనే సిద్ధుడు తన దివ్యశక్తిచే సారంగధరునికి కాళ్ళు, చేతులు వచ్చేలా చేస్తాడు. యోగియైన సారంగధరుడు తల్లిదండ్రులను దర్శించినట్లు చేమకూర వర్ణించాడు. ఆధునిక నాటకకర్తలలో ఆంధ్ర నాటక పితామహుడిగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు ఏడంకాల నాటకంగా విషాద సారంగధరను 1908లో ప్రచురించాడు. “పది శోకాంత నాటకాలు చేసినంత పని తెలుగువారికి ఇది ఒకటే చేసిందని” సుప్రసిద్ధ విమర్శకులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అభిప్రాయపడ్డారు. ఈ నాటకాన్ని సంక్షిప్తపరచి వచన రూపంలో నేను నా ‘భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు-తెలుగులో’ 1997లో పబ్లికేషన్స్ డివిజన్ ద్వారా ప్రచురించాను. న్యాయస్థానంలో నేరారోపణ జరిగి అరణ్యంలో సారంగధరుని కాళ్ళుచేతులు నరికివేసే శిక్షను రాజు విధించాడు. చిత్రాంగి తన దురవస్థను నిందించుకొంది. రాజు కుమారునికి శిక్ష పడకుండా ఆపాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇదీ ఆ నాటకంలో ముగింపు.

కవితా చమత్కృతి:

చేమకూర వెంకటకవి దేశం నలుమూలలా తిరిగి తెనుగు ప్రజల ఆటలు, పాటలు, ఆచారాలు, సంప్రదాయాలు చక్కగా ఆకళించుకొని ఆయా ప్రాంతాలలోని జాతీయాలను, పలుకుబళ్ళను సందర్భోచితంగా  నుడికారపు సొంపుతో ప్రతిపద్య చమత్కృతితో సారంగధర చరిత్రను మలచాడు.

కవి శబ్దాలంకార ప్రియుడు. అనుప్రాసమో, యమకమో ఏదో ఒకటి ప్రతిపద్యంలో గుప్పించాడు. అహమహమికలో పదసామగ్రి వచ్చి చేరాయి. వసుచరిత్ర వలె సారంగధర చరిత్ర, విజయవిలాసములు రెండును శ్లేష ప్రధాన కావ్యాలు. ఆ సారంగధర చరిత్రలో అవతారికా భాగం లేదు. బ్రౌన్ పండితుడు ఇలా విశ్లేషించాడు: “విజయవిలాసం – A poem in three books describing the marriage of Arjuna” అన్నాడు. “సారంగధర – This poem is greatly admired for the beauty of its style which is very intricate” అన్నాడు.

రఘునాథరాయలు – ‘ఒకటగా దన్నిటను ప్రయోజకుడ నీవు’ (విజయ-51) అని మెచ్చుకున్నాడు. అంతే కాదు, సరసమృదుపదకలితసరళ రచనలు చేయగల సమర్థుడు.

“తలవరు లేగ, లేగపులి తండము నెత్తుటి గేలుకై హళా
హళిమెయి రాగ, రాగలయినట్టి వృకంబులు కోల్పులుల్ రొదల్
చిలుకుచు నీగ, ఈగలును, చీమలు దొంతరగాగ పై పయిన్
బిలపిలమూగ, మూగవలె బెగ్గిలి పల్కగ లేక వేదనన్.” (3-117).

ఈగలు, చీమలు, పులిపిల్లలు, తోడేళ్ళు, పెద్దపులులు సారంగధరుని చుట్టూ మూగాయి. అతడు భయంతో నోరెత్తక, మూగవాని వలె పడి వున్నాడు.

కథా కథనం:

రాజనరేంద్రుడు ప్రజారంజకుడిగా ఇంద్రుని వైభవంతో పరిపాలిస్తున్నాడు. ఆయనకు కులసతి రత్నాంగి. ఎలజవ్వనియైన చిత్రాంగి మరో భార్య. ఆయనకు ముగ్గురు మంత్రులు. రామరాజ్యంగా పరిపాలిస్తున్న ప్రభువు ఒకనాడు తన పట్టమహిషి రత్నాంగితో సంతానలేమి గూర్చి ప్రస్తావించాడు.  ముద్దులార కుమారునితో ముచ్చటలాడాలని ఉవ్విళ్ళూరాడు. కాశీ విశ్వేశ్వరుని దయతో కుమారుడు కలగాలని ఈశ్వరుని దంపతులిద్దరు భక్తిశ్రద్ధలతో అర్చించి హర్షబాష్ప పులకాంకుఠితులైనారు.

ఒకనాటి రాత్రి స్వప్నంలో పరమశివుడు కనిపించి – ‘రత్నాంగికి రత్నాల వంటి తనయుడు జన్మిస్తాడ’నీ, అతనికి ‘సారంగధరు’డని నామకరణం చేయమని హితవు పలికాడు. మరునాడు రాజసభలో రాజు సభాసదులకు స్వప్నవృత్తాంతాన్ని వివరించాడు. రత్నాంగి గర్భం ధరించి నవమాసాలు గడిచిన పిదప ఒక పుణ్యలగ్నంలో కుమారుని ప్రసవించింది. ఆ సారంగధరుడు పెరిగి పెద్దవాడై వేదశాస్త్ర కళాకోవిదుడయ్యాడు. తండ్రి మాట జవదాటక నడచుకొని మంజువాణి అనే అలివేణిని వివాహమాడాడు.

ఒకనాడు చెంచులు రాజును దర్శించి వేటకు రమ్మని ఆహ్వానించారు. వేట సన్నాహం చేసి ఉత్తమాశ్వంపై ఎక్కి రాజు వేటకు దండకారణ్యం వెళ్ళాడు. రకరకాల మృగాలను వేటాడాడు. జింక, దుప్పి, కడితి, మనుబోతు, కొండగొరిమి, ఏదుపంది, కుందేలు, గురుపోతు వంటి జంతువులను వేటాడి ఒక చోట పోగులు పెట్టించాడు. ఈ దండకారణ్యంలో సీతారామలక్ష్మణులు సంచరించిన ప్రదేశాలు చూడగలిగానని సంతోషిస్తూ, ఆ మహనీయ స్థలంలో విడిది చేశాడు.

పావురాల పందెం:

ఉబుసుపోకకు సారంగధరుడు పావురాలను పట్టి తెమ్మని భృత్యులను పురమాయించి తెప్పించాడు. పారావత రత్నమని జగ బిరుదు గల దానిని పట్టుకుని తన సరి రాజకుమారులతో వినోదంగా పందెమొడ్డాడు. ఆ పావురాన్ని విడిపించాడు. అది పరుగులు తీసింది. అది నేరుగా రాజపత్ని అయిన చిత్రాంగి మేడ మీద వాలింది. ఆమె ఆ పావురాన్ని తన ఎడమ చేతిలో పట్టుకుని – దీని వలన సారంగధరుడు నా కడకు రాగలడని – కామవాంఛతో సంతోషించింది. వివిధ ఆభరణాలు ధరించి మోహనాంగిగా సింగారించుకొంది.

ఆ సమయంలో సారంగధరుని చెలికాడు సుబుద్ధి రాజకుమారునికి వివిధ రకాలుగా హెచ్చరికలు చేశాడు. రాజు నగరిలో లేని సమయంలో వొంటరిగా వున్న చిత్రాంగి మేడకు యవ్వనంలో వున్న నీవు వెళ్ళడం ప్రమాదం కొని తెచ్చుకొన్నట్లే నని గట్టిగా పలికాడు. అందగాడివైన నిన్ను చూస్తే ఏ యువతికైనా మనసు చలించక తప్పదన్నాడు.

చిత్రాంగి కుట్ర:

రాకుమారుడు ‘మనసుకు మనసే తార్కాణ’ అని పలికి విధి వంచితుడై చిత్రాంగి మేడలో ప్రవేశించాడు. చిత్రాంగి తన వలపును ప్రకటించింది.

“చక్కని వారిలో మిగుల చక్కని వా, డిటువంటు నే
నెక్కడ చూచికాన, జగతీశ్వర! చిత్తరువందు వ్రాయ రా
దిక్కమనీయ రూప మొక యింతయు; భాగ్యము గాదె మొచ్చెముల్
దక్కిన కూర్మి నా కితడు దక్కిన తక్కిన మాట లేటికిన్.” (2-44)

అని సారంగధరుని ముందు తన వాంఛను ప్రకటించింది. సారంగధరుడు నిగ్రహంతో ప్రవర్తించాడు. నాకు తల్లివైన నీవు ఇలా కోరడం భావ్యం కాదని తిరస్కరించాడు. వినాశకాలే విపరీత బుద్ధి-యని చిత్రాంగిని నిరసిస్తూ తాను చేసిన తప్పిదానికి వగస్తూ వెళ్ళిపోయాడు.

చిత్రాంగి వాసెనకట్టు గట్టి సొంపు తరిగి అంతఃపురంలో కోపంతో ఊగిసలాడుతోంది. రాజనరేంద్రుడు విరాళితో వేట చాలించి ఆమె అంతఃపురం ప్రవేశించాడు. చిత్రాంగి పరిస్థితిని చూచి రాజు ఓదార్చాడు. ఆమె తన పైట తొలగించి సారంగధరుడు నేరం చేశాడని స్తనాలపై గాట్లు చూపింది.

రాజు కోపోద్రేకంతో సభను ఏర్పాటు చేసి మంత్రులతో ఆలోచించాడు. పెద్దలు సారంగధరుని విచారించాడు. తాను నిర్దోషనని ప్రకటించాడు. రాజు, మంత్రులు చిత్రాంగిని అదిలించి అడిగి చూశారు. ఆమె తన కుచాలపై గోటి గుర్తులు చూపింది. రాజు సారంగధరునికి శిక్ష విధించాడు. కాళ్ళు, చేతులు ఖండించమని శాసించాడు. తలారులు సారంగధరుని అరణ్యానికి తీసుకెళ్ళారు. రత్నాంగి తన సపత్నియైన చిత్రాంగితో వాదించింది. ప్రయోజనం లేకపోయింది. రాజుతో మొరపెట్టుకుంది. కుమారుని వద్దకు వెళ్ళి విలపించింది. తల్లిని కుమారుడు ఓదార్చుడు.

తలారులు సారంగధరుని కాళ్ళు, చేతులు నరికారు. పరమశివుడే తనకు రక్షకుడని అతడు ధైర్యంగా నిలిచాడు. సారంగధరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆకాశవాణి ఘోషించింది. పూర్వజన్మ దుష్కృతం వల్ల నీకీ అవస్థ కలిగిందని చెప్పింది. అదే సమయంలో మత్స్యనాథుడనే సిద్ధుడు సారంగధరుని వద్దకు వచ్చాడు. ‘నేను వెంటనే మరణించే మార్గం చెప్ప’మని ఆతడు సిద్ధుని వేడుకొన్నాదు. సారంగధరుడు నిర్దోషియని తలారులు రాజుకు విన్నవించారు. రాజు చిత్రాంగిని బావిలోకి తోయించాడు. పౌరులు చిత్రాంగిని బహుధా దూషించారు. రాజు, రత్నాంగి సారంగధరుడిని వెదుకుతూ అరణ్యాలకు వెళ్ళారు. కుమారుడు కన్పించక రత్నాంగి విలపించింది. రాజు పశ్చాత్తాపపడ్డాడు. ఆకాశవాణి సారంగధరుని క్షమావార్తను తెలిపింది. సారంగధరునికి  కాళ్ళు, చేతులు మొలిచాయి. ఆతడు యోగియై తల్లిదండ్రులను దర్శించాడు. ఈ కథను చేమకూర వెంకటకవి రసవత్తరంగా చిత్రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here