కావ్య పరిమళం-27

0
2

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

సంకుసాల నృసింహకవి – కవికర్ణ రసాయనం

[dropcap]నృ[/dropcap]సింహకవి నివాసము, కాలము నిర్ణయించుటకు తగిన గ్రంథస్త ఆధారాలు లేవు. కడప జిల్లా పులివెందుల సమీపంలో సుంకేసుల అనే ఊరు వుంది. అ ఊరిలో నృసింహస్వామి ఆలయం వుంది. సుంకేసుల కాలక్రమంలో సంకుసాల అయి వుండవచ్చును. ఈయన ఇతర గ్రంథాలు గాని, తలిదండ్రుల పేర్లు, కుల గోత్రాదులు తెలియవు. అప్పకవీయంలో రెండు పద్యాలు ఉదహరింపబడడం వల్ల అప్పకవికి ముందువాడై ఉంటాడు. అప్పకవి 17వ శతాబ్ది వాడు. భట్టపరాశరుడు తన గురువుగా నృసింహకవి తెలిపాడు.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమైనట్టు కొన్ని ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి. కందుకూరి రుద్రకవికి కూడా ఆస్థాన ప్రవేశం కొండోజు ద్వారా లభించిందని ఐతిహ్యం. నృసింహకవి దిన వెచ్చమునకై తన కావ్యంలోని పద్యములు అమ్ముకోవలసి వచ్చింది. ఈతని పద్యమొకటి రాయల కుమార్తె నాలుగు వేల వరహాలిచ్చి కొన్నది. ఒకనాడు రాయలతో ఆమె చదరంగమాడుతోంది. ఆ ఆటలో రాయల మంత్రికీ, ఏనుగుకీ మధ్య మోహనాంగి బంటు వచ్చింది. ఆమె వెంటనే ఒక పద్య పాదం చెప్పింది:

“ఉద్ధతుల మధ్య పేద కుండ తరమె!” అని బంటును తప్పించింది. రాయలు ఆ పద్యం పూర్తిగా చెప్పమని కొమార్తె నడిగాడు. సిగ్గుపడుతూ ఇలా చదివింది:

“ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి చూచి
తరుణి తను మధ్య మెచటికో తొలగిపోయె
ఉండెనేనియు కనబడకున్నె? అహాహా!
ఉద్ధతుల మధ్యమున పేద కుండ తరమే!”

ఆ తరువాత నృసింహకవి కాశ్రయం లభించింది. మోహనాంగి అళియరామరాజు భార్య. మారీచీపరిణయ గ్రంథకర్త.

రాజాశ్రయం లభించని నృసింహకవి శ్రీరంగంలోని రంగనాథునకు కవికర్ణ రసాయనాన్ని అంకితంగా ఇచ్చాడు. మాంధాత చరిత్ర ఇందులోని ఇతివృత్తం. దశరథునికి పూర్వులలో ఇరవయ్యవ తరం వాడు మాంధాత. మహాభారత, విష్ణుపురాణ, ఉత్తర రామాయణాలలో మాంధాత గాథ ఉంది.

శృంగార వైరాగ్యాలు:

“రాయలనాటి కాలంలో ప్రబంధములలో విపుల శృంగార వర్ణనలు గలవి కొన్నియు, విపుల భక్తి వర్ణనలు గలవి కొన్నియు గలవు. కాని శృంగార వైరాగ్యముల రెంటినింత విపులముగా ప్రపంచించి వ్రాసిన కవి ఇంకొకడు లేడు. ఈ కావ్యమందలి పూర్వ భాగము నాశ్రయించి శృంగారమును, ఉత్తర భాగమునాశ్రయించి వైరాగ్యము నున్నవి. మొదటిది రాగప్రవృత్తి మార్గమును, రెండవది నివృత్తి మార్గమును – అనగా రక్తి – విరక్తి. పూర్వభాగమన కవి యొక్క రాగరంజిత భావమెంతో తీక్షణమో తెలియును. ఉత్తర భాగమున ఆ భావమే ఎంతో శాంత గంభీరముగా గోచరించును. ఈ కవి చేతిలో ఈ గుణద్వయమునకు సమ ప్రాధాన్యము వచ్చినది” – అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం విశ్లేషించారు (ఆంధ్ర సాహిత్య చరిత్ర, పుట-397).

నృసింహకవి అవతారికా భాగంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు. తన కావ్యంలో శృంగార వర్ణనలు చదివిన యతి విటుడవుతాడు. వైరాగ్య వర్ణనలు చదివిన విటుడు యతి కాకపోడు.

యతి విటుడు కాకపోవు టెట్లస్మదీయ,
కావ్యశృంగారవర్ణనాకర్ణనమున
విటుడు యతి కాక పోవునే వెసమదీయ,
కావ్యవైరాగ్యవర్ణనాకర్ణనమున (కవికర్ణ – పీఠిక -22).

నరుల కంకితం చేయడం దూష్యమనీ, హరి కంకితం చేస్తే హృదయంగమమని నిర్వచించాడు. “శ్రీ రంగనాథుని వంటి ప్రభువు అత్యంత సులభుండు పరుడు గలడె?” అని శ్లాఘించాడు. శ్రీరంగనాథ దివ్యావతార వైభవాన్ని వివరించాడు. ప్రభుదురాత్ములని ధూర్జటి వలె గర్హించాడు. పురాతన కవీశ్వరుల అనుమతితో తాత్వికుల మనసు కరిగించేలా కృతి మొదలుపెట్టాడు.

కవికర్ణ రసాయనం అని ధీమాగా పేరు పెట్టాడు. పూర్వకవులను ఎక్కడా అనుకరించలేదు. ఒకటి రెండు చోట్ల ‘భోజ రాజీయం’ అనుకరణ స్ఫురిస్తుంది. పురాణకవుల అర్థ సౌలభ్యం, ప్రబంధ కవుల శబ్ద జటిలత, రీతి ప్రాధాన్యము – ఈ రెండింటి కలయిక ఈతని శైలిలో కనిపిస్తుంది. పురాణ పఠనం వల్ల కలిగే నివృత్తి, కావ్యపఠనం వల్ల కలిగే రక్తీ రెండూ కలుగుతాయి. ఇందులో కథ తక్కువ, వర్ణన లెక్కువ. ఉభయ భాషలలోనూ ఉద్దండ పాండిత్యం గలవాడు. కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహంలో నృసింహకవి పద్యాలను ఉదహరించాడు. త్రిలింగ లక్షణ శేషకర్త బహజనపల్లి సీతారామాచార్యులు ఎన్నో పద ప్రయోగాలు గ్రహించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1967లో మోచర్ల రామకృష్ణకవి పరిష్కరణలో ఈ గ్రంథం ప్రచురించారు.

కథాకథనం:

కథ చాలా చిన్నది. కవి తన వర్ణనాచాతుర్యంతో ఆరాశ్వాసాల గ్రంథంగా పెంచి వ్రాశాడు. శృంగారానికి ఆధారమైన జలక్రీడాది విలాస వర్ణనలు, ఋతువర్ణనలు మూడాశ్వాసాల నిండా వున్నాయి. విటవిటీ, వారవనితా శృంగార కేళీ మధుపాన క్రీడాదులు నన్నెచోడుని కుమార సంభవంలోని పార్వతీదేవి వివాహం నాటి రాత్రి వర్ణనలను తలపిస్తున్నాయి. ఐదో ఆశ్వాసం నిండా రాజగురువైన వశిష్ఠుడు చేసిన బ్రహ్మోపదేశం.

సాకేతపురాన్ని యవనాశ్వుడు పరిపాలిస్తున్నాడు. అతడు ఒకనాడు వేటకై అడవికి వెళ్ళాడు. అక్కడ చాలా దూరం వెళ్ళి ఒక ఆశ్రమం ప్రవేశించాడు. అక్కడ అప్పుడు ముని లేడు. ఆ పర్ణశాలలో ఒక తెల్లని అండం చూశాడు రాజు. దానిని తీసుకుని వస్తుండగా అది ప్రమాదవశాత్తు జారిపడింది. రాజు దానిని వదిలి వెళ్ళిపోయాడు. ముని తిరిగి వచ్చి అది చూచి చింతించాడు. పూర్వం తన పత్నితో వినోదంగా హంసల రూపంలో రమించడం వల్ల సద్యోగర్భం కలిగి ఆ అండం కలగగా దానిని భద్రంగా ముని దాచాడు. ముని రాజునకు శాపం ఇచ్చాడు. గర్భం అవసి చస్తాడని శాపం.

ఇక్కడ యవనాశ్వుడు పుత్రులు కలగనందుకు బాధపడుతున్నాడు. దాని కోసం ఇంద్రయాగం చేశాడు. యాగ పరిసమాప్తి కాగా హోతలు కలశోదకం ఇచ్చారు. అవి తాగిన వారికి చక్రవర్తి జన్మిస్తాడని తెలిపారు. ఆ రాత్రి జాగారం చేసిన రాజు దప్పికగొని ఆ కలశంలో నీరు త్రాగాడు. అతని గర్బం నుండి ఒక అర్భకుడు జన్మించగానే కడుపు పగిలి రాజు మరణించాడు. రాణి వశిష్ఠుని పాదాలపైబడి పతిభిక్ష పెట్టమని వేడుకొంది. వశిష్ఠుడు దివ్యదృష్టితో చూచి ఇంద్రుని రప్పించి యవనాశ్వుని పునర్జీవితుని చేశాడు. ఆ బిడ్డకు మాంధాత అని నామకరణం చేశారు. అతడు పెరిగి యౌవనవంతుడు కాగా రాజు పట్టాభిషేకం జరిపించాడు. ఆ సమయంలో రాజు మాంధాతకు సుదీర్ఘంగా రాజనీతి బోధించాడు. తండ్రి ముని వృత్తాంతంతో వానప్రస్థానానికి వెళ్ళగా మాంధాత సుపరిపాలన గావించాడు.

ఆ సమయంలో శరత్కాల వర్ణనను కవి అసదృశంగా చేశాడు:

ఉ:
కైరవబంధుబింబము ముఖప్రతిబింబము, తద్గతస్మితాం
కూరము శీతలాతపము, కుండల మాచిత మౌక్తికావళుల్
తారలుగా, శరత్ సమయలక్ష్మి కనుంగొను రత్నదర్పణా
కారమున్ నభః స్థలం కన్నులపండువ చేసె రాత్రులన్ (2-63).

ఆకాశమే ఒక యద్దం. ఆ యద్దంలో శరత్ అను సమయలక్ష్మి తన ముఖం చూసుకొంది. తన ముఖ ప్రతిబింబమే చంద్రబింబం. తన ప్రతిబింబం కనబడగానే ఆమె పెదవిపై చిరునవ్వు పొడిమింది. ఆ చిరునవ్వే వెన్నెల. ఆమె ధరించిన కుండలాలలోని ముత్యాలే నక్షత్రాలు. ఈ విధంగా ఆకాశమనే రత్నదర్పణంలో శరత్ సమయలక్ష్మి చూచుకొని చిరునవ్వు నవ్వుకొంది. అద్భుత భావన!

దిగ్విజయ యాత్ర:

మాంధాత దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. స్వర్గాన్ని ముట్టడించాడు. అది తెలిసిన రావణుడు తానాక్రమించిన స్వర్గాన్ని వేరెవరో కోరడం భావ్యం కాదని కోపించి మాంధాత వద్దకు దూతను పంపాడు. రాజు సంధికి అంగీకరించలేదు. రావణుడు దండెత్తి వచ్చాడు. ఇరు సైన్యాల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ పైన ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. లోకాలు అల్లల్లాడాయి. శివుడు ప్రత్యక్షమై మాంధాతకు విజయం ప్రకటించాడు. మూడు లోకాలలో నిన్ను జయించేవాడు వుండడని దీవించాడు.

అక్కడి నుండి మాంధాత హిమవంతం ఎక్కాడు. మందర పర్వతంపై జయస్తంభాలు నాటాడు. దిగ్విజయ యాత్ర పూర్తి చేసి వచ్చి సుపరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు చిత్రకారులు వచ్చి విమలాంగి అనే రాకుమారి – కుంతల రాజకుమార్తె – సౌందర్యాన్ని వర్ణించారు. మాంధాత ఆమెను మోహించాడు. ఆ చిత్రకారులు కుంతలరాజు వద్ద మాంధాత గుణగుణాలను పొగిడారు. మాంధాత చిత్రపటాన్ని చూచిన విమలాంగి మోహించింది. మన్మథావస్థకు గురియైంది. మాంధాత కుంతలరాజు వద్దకు దూతను పంపి పెండ్లాడడానికి కుంతలదేశానికి తరలివచ్చాడు.

వివిధ వర్ణనలు:

విమలాంగీ మాంధాతల వివాహం వైభవోపేతంగా కొనసాగింది. వివాహానంతరం మాంధాత అయోధ్యకు సతీసమేతంగా వచ్చాడు. వసంత ఋతువు ప్రవేశించగానే దంపతులు జలక్రీడలాడారు. ఈ సందర్భంలో నృసింహకవి విటవిటీ వర్ణన, వారవనితా దూషణాన్ని, యువతీ శృంగార కేళిని, మధుపాన క్రీడను విశృంఖలంగా వర్ణించాడు. ఒకనాడు వశిష్ఠాది మహర్షులు మాంధాత వద్దకు వచ్చారు. వారి వలన  మాంధాత తన పూర్వజన్మ వృత్తాంతాన్ని అడిగి తెలుసుకొని అబ్బురపడ్డాడు.

మాంధాత వశిష్ఠుని వలన వివిధ వేదాంత విషయాలను అడిగి తెలుసుకొన్నాడు. రెండాశ్వాసాల సుదీర్ఘ వివరణ కన్పిస్తుంది. ధనకాంక్ష ఎటువంటిదో తెలిపే పద్యమిది:

ఉ:
లజ్జకుబాపు, శీలంబు కులంబు వడిన్ విడిపించు, సూనృతం
బుజ్జన సేయు, మొగమాటమి తూలుచు పాతకంబులన్
మజ్జనమార్చు, ఆర్చు నభిమానము, రోతల కియ్య కొల్పు,
ముజ్జగమైన త్రిప్పు, తుదిముట్టదు తా ధనకాంక్ష ఏరికిన్. (5-121).

సంతోషించిన వశిష్ఠాదులు మాంధాతకు అష్టాక్షరీ మహామంత్రోపదేశం చేశారు. మాంధాత తమసా సరయూ మధ్య భాగంలో తపో నిష్ఠలో కూర్చున్నాడు. నారదుడు మాంధాత తీవ్ర తపస్సును ఇంద్రునికి తెలియజేశాడు. ఇంద్రుని పసుపున వెళ్ళిన రంభాదులు తపోవనంలో శృంగార క్రీడలు ఆడారు. చివరకు వారు మాంధాత శిష్యులయ్యారు. మాంధాత తపస్సు నాపడానికి దేవతలు వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుని వేడుకొన్నారు. నారాయణుడు ప్రత్యక్షమై మాంధాతకి మోక్షాన్ని ప్రసాదించాడు. అలా కవికర్ణ రసాయనం కవికంఠ విభూషణమై వెలసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here