[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
శేషము వేంకటపతి శశాంక విజయం
దక్షిణాంధ్ర సాహిత్యంలో శృంగారం పాళ్ళు ఎక్కువ అని సర్వ జనాంగీకార సత్యం. ఆ కాలానికి చెందిన (18వ శతాబ్ది) పేరు మోసిన కవి శేషము వేంకటపతి. ఆయన తారాచంద్రుల ప్రణయాన్ని ‘శశాంక విజయం’ పేరుతో ఐదాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. అప్పట్లో ఈ కావ్యము, మరికొన్ని శృంగార కావ్యాలు ప్రభుత్వం నిషేధించింది. దీనితో బాటు రాధికా సాంత్వనం, బిల్హణీయం, వైజయంతీ విలాసం వంటి శృంగార ప్రబంధాలు దుష్టాలుగా వారికి తోచాయి. పండితులు మాత్రమే చదువదగిన గ్రంథాలుగా వాటిని పరిగణించారు. ప్రకాశం పంతులు గారి (మదరాసు) ప్రభుత్వం వాటిపై నిషేధాన్ని తొలగించింది.
మధుర, తంజావూరు నేలిన నాయకరాజుల యుగంలో ఇలాంటి సాహిత్యం పండింది. శేషము వేంకటపతి విజయరంగ విభుని ఆస్థానకవి. సముఖం వేంకటకృష్ణప్ప వేంకటపతిని దక్షిణాది పెద్దన్నగా వర్ణించాడు. ఆ కవి కుటుంబ విషయాలు తెలియవు. ‘కందాళ రామానుజ గురుచరణ సేవా సమాసాదిత సాహితీ వైభవుడ’నని చెప్పుకొన్నాడు. తన కావ్యాన్ని ఘనం సీసయ్యకు – చొక్కనాథుని మంత్రికి – అంకితమిచ్చాడు. సీనయ్య సంగీత సాహిత్య విశారదుడు. “సరస పద పద్యగద్య రచనా భోజుడు”.
రచనా చమత్కృతి:
శేషము వారు సృష్టించిన అద్భుత పాత్ర తార. పెద్దన్న కౌశలత, రామరాజభూషణుని ప్రౌఢిమ, చేమకుర రసపాకం, వెలిదండ్ల కవితాపాటవం వేంకటపటికి ఉన్నాయి. రసికహృదయం ఎసరేగేటట్లు సీనయ్య ఆదేశం మేరకు కవి తారాశశాంకం తీర్చిదిద్దాడు. ప్రతిపద్య, ప్రతి పద స్వారస్యం కనిపిస్తుంది. కొత్త కొత్త భావాలతో, అద్భుత చమత్కారాలతో రచన కొనసాగింది. దీనిని ‘మోహ శృంగార’ కావ్యమని ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహకారులు పేర్కొన్నారు. వీరరసాత్మకమైన శశాంక విజయ గాథను కవి గొప్పగా నిర్వహించాడు. దేవాంతక స్వారస్యం ఇందులో వుంది. తన కవితా లక్షణాలను కవి ఇలా పేర్కొన్నాడు:
చం.
“అరసి విశుద్ధ శబ్దములున్, అర్థములున్, ధ్వనివైభవం, బలం
కరణము, రీతివృత్తులును, కల్పన, పాకము, శయ్యయున్, రస
స్ఫురణము, దోషదూరత, అచుంబిత భావము లొప్ప, చిత్ర వి
స్తర మధురాశులీల కవితల్ రచియింపగ నేర్చెనంతటన్” (2-54).
చంద్రుడు నేర్చిన విద్యలను గూర్చి కవి చెప్పిన ఈ పలుకులు వేంకటపతి విషయంలో సార్థకాలు.
విమర్శలు:
శశాంకవిజయంపై పండితులు విమర్శలు గుప్పించారు. ఇది నీతి మాలిన కథ అని వీరేశలింగం పంతులు ఆక్షేపించారు. వేంకటపతి నాటకీయ శైలిలో సంభాషణలు కొనసాగించాడు. సతీ సౌభాగ్యాన్ని గురించి వర్ణించాడు. డి. చిన్నికృష్ణయ్య తారాపతి అంటే తారాశశాంకం వ్రాసిన వేంకటపతి అనీ, తారా వధూటి అంటే రాధికా సాంత్వనం వ్రాసిన ముద్దు పళని అని తీర్మానించారు. వ్రాసిన కొద్ది రోజుల్లోనే ఈ కావ్యం మధురలోనే గాక యావత్ ఆంధ్రదేశంలో ప్రసిద్ధి కెక్కింది. అది యువజన హృదయానందకరం అయింది. అదే పేరు పెట్టి బద్దెపూడి ఎర్రయ్య అనే ఉత్సాహవంతుడు తారాశశాంకాన్ని రచించాడని సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటం-12లో ఆరుద్ర ప్రస్తావించారు. ఈ గ్రంథాన్ని ఎమెస్కో వారు సంప్రదాయ సాహితీలో బాలాంత్రపు నళినీకాంతరావు సమాలోచనంతో 2009లో ప్రచురించారు.
కథాకథనం:
శౌనకాదులు సూతమహర్షి ద్వారా ఈ కథను విన్నారు. చంద్రుడు బ్రహ్మ అంశంలో అత్రిమహాముని కుమారుడుగా ఎలా పుట్టాడు? అతడు బృహస్పతి భార్య తారతో ఎలా స్నేహం కట్టాడు? దేవతలను చంద్రుడు ఎలా జయించాడు? అని వారు ప్రశ్నించగా సూతుడు సవివరంగా వారికి కథా సవిస్తారం చేశాడు.
అత్రి మహాముని పుత్రలాభం కోరి అనసూయ సతితో కలిసి హిమవత్ పర్వతానికి వెళ్ళాడు. అది మంచుతో నిండి వుంది. అక్కడి విశేషాలన్నింటినీ ధర్మపత్నికి తెలియజేశాడు. అక్కడి బదరీవనం చేరుకున్నాడు. పుత్రార్థియై తపస్సు చేశాడు. హరిహర బ్రహ్మలు సాక్షాత్కరించారు. ‘మీవంటి పుత్రుల్ని ప్రసాదించ’మని వేడుకొన్నాడు. ‘మేము పుత్ర రూపాలు ధరించి అనుగ్రహిస్తా’మన్నారు త్రిమూర్తులు. విష్ణు అంశతో, దత్తముని, శివుని అంశతో దూర్వాసుడు, బ్రహ్మ అంశతో చంద్రుడు అనసూయ గర్భంలో అత్రి ముని సంతానంగా కలిగారు.
చంద్రుడు దిన దిన ప్రవర్ధమానుడై ‘కాంతామోహన చారుమూర్తి’యై పెరిగాడు. అతని ఉపనయనానికి విచ్చేసిన బ్రహ్మ అతనికి దివ్య రథాన్ని, గాండీవాన్నీ కానుకగా ప్రసాదించాడు. చంద్రుని నివాసయోగ్యమైన ఒక పట్టణాన్ని నిర్మించి యివ్వమని విశ్వకర్మను బ్రహ్మ ఆదేశించాడు. అద్భుతమైన ప్రతిష్ఠానపురం అతని సొత్తయింది. ఆ నగరంలో వేశ్యలు అందచందాలలో మిన్నలు:
చం.
“భుజములు తమ్మితూండ్లు, కను బొమ్మలు సింగిణి విండ్లు, చన్ను ల
క్కజపు పసిండి గిండ్లు, తెలి కన్నులు శ్రీసతి యిండ్లు, వాతెరల్
నిజముగ దొండపండ్లు, రమణీయ కటి ద్వయి పైడి బండ్లు, కా
యజు విరికల్వ చెండ్లు పురమందలి క్రొవ్విరి బోండ్లు చూడగన్” (2-21)
చంద్రుని విద్యాభ్యాసము:
అత్రిమహర్షి ఒకరోజు చంద్రుని చేరదీసి “దేవ నర లోక వశీకరణీహధమైనది విద్య. నీవు దేవ గురువైన బృహస్పతికి సేవలు చేసి ఆయన దయతో విద్యలు నేర్వుము” అని పంఫాడు. ‘నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను’ అని బృహస్పతి ఆశీర్వదించి తన భార్య తారకు అప్పజెప్పాడు. తార ఆ వటువు మజ్జనభోజనాదులు స్వయంగా కనుక్కుంటూ చంద్రుని సంరక్షిస్తోంది. చంద్రుడు గురువు వద్ద చతుష్షష్టి కళలలో విశారదుడయ్యాడు. నవయౌవనం సంప్రాప్తించింది.
శశి గురువు వద్ద శ్రద్ధగా చదువుకొంటున్నప్పుదు తార తలుపు ఓరగా నిలబడి వాని అందాన్ని ఆస్వాదించేది. ‘కాయజ మోహనాంగ! వగకాడవురా!’ అని పిలిచి మురిసిపోయేది. వెయ్యి కళ్ళతో అతణ్ణి తనివితీరా చూసేది.
ఉ.
ఒక్కొక్క వేళ నా సరసు డొంటిగ నింటను నిద్రపోవగా
అక్కల కంఠి తమ్మ రసమంటగ, గెంటని ప్రేమ వాని నున్
చెక్కలు ముద్దు పెట్టుకొని, నిద్దుర లేచిన యంత, “ఇంత సే
పెక్కడ బోయితీ గురుతులేడని? అద్దము చూచుకొమ్మనన్ (2-85).
అతనిపై మరులు గొంది. చంద్రుడు ధర్మచింతనతో తర్కించుకొని ‘అందగరాని ఫల మాస మొనర్చిన చందమాయె’ అని నిట్టూర్చేవాడు.
ఇంతలో వసంత ఋతువు వచ్చింది. బృహస్పతి చేత యాగము చేయించాలని ఇంద్రుడు కబురు పంపాడు. తారకు ఆశ్రమం అప్పగించి వెళ్లాలని బృహస్పతి నిర్ణయించుకొన్నాడు. చంద్రుని ఆమెకు అప్పగింతలు పెట్టి – ‘నీకు కావలసిన పనులన్నీ తన చేత చేయించుకో’మని చెప్పాడు. ‘మిమ్ములను వెళ్ళి రమ్మనడానికి నోరు రావడం లేదు. వద్దంటే క్రతుభంగం చేసిన పాపం అంటుకొంటుంద’ని నయగారపు పలుకులు వల్లించింది. అత్రి కుమారుని ఆత్మకుమారునిగా చూసుకొంటానని నర్మగర్భంగా పలికింది.
చంద్రుని సందిగ్ధం:
బృహస్పతి వెళ్ళగానే తార చంద్రునికి పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించి తాంబూలం అందించింది. చంద్రుడు గాభరాపడి పూదోటలోకి వెళ్ళి కూచున్నాడు. తార కూడా అక్కడికి సోయగాలొలికిస్తూ చేరుకొంది. ‘లోకులు చూస్తే ఏమనుకొంటారు?’ అని చంద్రుడు అభ్యంతరం పలికాడు. ‘ఇహపరాలకు వెలిజేసే పనికి పూనుకొన్నావ’ని హితవు చెప్పాడు. తార ఆ నియమాలను నిరసిస్తూ, కోరిన దానిని ఉపేక్షిస్తే పాపం వస్తుందని గదమాయించింది. తార చంద్రుని బంధువుల రంకును, బృహస్పతి అన్నగారి భార్యను చెరచిన ఉదంతం ప్రస్తావించింది.
ఉ.
లోకములోన కొంద రబలుల్ సతులన్ తమియింప లేక, అ
స్తోక మనీష అన్య పురుషుల్ తమ కాంతల నంటకుండ, తా
టాకుల లోన వ్రాసిరి – ‘పరాంగన గూడిన పాప‘మంచు, అ
య్యాకుల పాటు చూచి, ఇపుడాకుల పా టెనయంగ నేటికిన్? (3-82)
వేదాంత చర్చ చేసింది, బ్రతిమాలింది. శశాంకుడు లోబడ్డాడు. తారాశశాంకులు కేళీవనంలో మన్మథ కేళీ విలాసాలలో తేలియాడారు.
చంద్రుడికి ఉద్వాసన:
ఇంద్రలోకం నుంచి వచ్చిన బృహస్పతి ఈ గుట్టు పసిగట్టాడు. “నీ చదువు పూర్తి అయింది. ఇంక నీవు వెళ్ళవచ్చు” అని సాగనంపాడు. చంద్రుడు తారపై విరహంతో బాధపడ్డాడు. తార తన చెలి ద్వారా చంద్రునికి వర్తమానం పంపింది. తెగువ చేసి తారాశశాంకులు ప్రతిష్ఠానపురం చేరుకొంటారు.
బృహస్పతి ఇంద్రసభకు వెళ్ళి చంద్రుని దురాగతం చెప్పాడు. ఇంద్రుడు తారను బృహస్పతి కప్పగించమని హెచ్చరించాడు. ఫలితం లేదు. దేవ దానవ సంగ్రామం మొదలైంది. సూర్యచంద్రులు తలపడ్డారు. ఇంతలో బృహస్పతి శివునికి వాయువు ద్వారా కబురంపాడు. శివుదు చంద్రునిపై పాశుపతాస్త్రం సంధించాడు. చంద్రుడు బ్రహ్మశిరోనామాకాస్త్రం వదలడానికి సిద్ధపడ్డాడు. శంకరుని మెత్తబరిచారు.
గర్భవతియైన తారను బృహస్పతి కప్పగించమని బ్రహ్మ తీర్పు చెప్పాడు. అమృతరశ్మి పొందడం చేత తార ఎంగిలి పడలేదనీ, పరిశుద్ధురాలైందనీ నిర్ధారించారు. తారకు బుధుడు జన్మించాడు. చంద్రుడు బృహస్పతి ఆశ్రమానికి వెళ్ళి పుత్రోత్సవం జరిపించాడు. వీడు చంద్రుని కొడుకని బ్రహ్మ బుధుని చంద్రుని కప్పగించాడు. ఇలా తగవు పరిష్కారమైంది.
కథలో తత్వరహస్యం:
మనస్సు (చంద్రుడు) తనను వృద్ధి పరచుకోవడానికి మహాబుద్ధి (బృహస్పతి) దగ్గరకు వెళ్ళింది. ఆ మహాబుద్ధి తన శక్తి (తార) ఆ మనస్సునకు ఇచ్చింది. మనస్సు వికసించి ఆత్మజ్ఞానం వల్ల వివేకం (బుధుడు) కలిగింది. ఇదీ తారాశశాంకంలోని తాత్వికాంశం. బ్రౌన్ దొర తారాశశాంకాన్ని దివ్యుల గాథ (Fairy Tale) అని వివరించాడు. శేషము వేంకటపతి తన అద్భుత కవనాశక్తితో ఈ కావ్యాన్ని మహత్తర గ్రంథంగా తీర్చిదిద్దాడు. ఇందులో ద్రాక్షపాక శైలి అడుగడుగునా కనిపించి పాఠకుల్ని ముగ్ధులను చేస్తుంది.