Site icon Sanchika

కావ్య పరిమళం-9

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

ఎర్రన హరివంశం

కవిత్రయంలో ఎర్రనకు స్థానం మహాభారతంలోని అరణ్యపర్వ శేష రచనతో మాత్రమే రాలేదు. భారతానికి ఖిలా పురాణమైన (పరిశేషం) హరివంశాన్ని కూడా అనువదించడం వల్ల లభించింది. ఎర్రాప్రెగడ నృసింహపురాణం కూడా బాగా ప్రసిద్ధం.

వ్యాసభగవానుడు భారతకథలో భాగస్వామి. కౌరవ పాండవుల కథ చెప్పడంలోనే కాదు ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ పాండవుల ధర్మ పక్షాన నిలబడి వారికి మార్గదర్శనం చేసిన వ్యక్తి. భారత రచనలో ఆయన ప్రధానంగా శ్రీకృష్ణుని కథను చెప్పదలచుకున్నాడు.  కాని సన్నివేశాలు కురుపాండవ యుద్ధానికి దారితీయడం ఆయన కళ్ళారా చూశాడు. కృష్ణుడి కథ ఆనుషంగికమైపోయింది. స్వర్గారోహణ పర్వం తర్వాత వెనుదిరిగి చూస్తే కృష్ణ కథ మరుగున పడిపోయిన విషయం గుర్తించాడు. అందుకే హరివంశంలో కృష్ణకథకు ప్రాధాన్యమిచ్చాడు. ఇంచుముంచు భాగవత కృష్ణుడే హరివంశ కృష్ణుడు.

నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు వ్యాసుని ప్రశిష్యుడైన ఉగ్రశ్రవసుని వలన మహాభారత కథను ఆసాంతం విని, తృప్తి చెందక యాదవ వంశ శ్రేష్టుడైన శ్రీకృష్ణుని గాథ చెప్పమన్నారు. అప్పుడు ఆతడు వరుసగా చంద్ర, యదు, అంధక, వృష్ణి వంశాల గురించి వివరించాడు.

కృష్ణ చరిత్ర భారతం, విష్ణు, బ్రహ్మ, వాయు, అగ్ని, పద్మాది పురాణాలలోనూ, భాగవతంలోను వుంది. విష్ణు పురాణం, హరివంశం, భాగవతాలు మూడింటిలో ప్రధాన కథ కృష్ణునిదే అయినా మార్పులు, చేర్పులు అనేకం. సంస్కృత హరివంశానికి లోకంలో రకరకాల ప్రతులున్నాయి.

ఎర్రన హరివంశం అనువదించే నాటికి “సకలభాషా కవిత్వ విశారడుదు”. రామాయణాన్ని వేమారెడ్డికి అంకితమిచ్చి ఆయనకు కీర్తి తెచ్చిపెట్టాడు. ఆయన కోరిక మేరకు హరివంశం అనువదించి వేమారెడ్డికే అంకితమిచ్చాడు. ఎర్రన్న యుగం క్రీ.శ. 1320 – 1400 మధ్య కాలమని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం నిర్ధారించారు. హరివంశాన్ని ఎర్రన పూర్వభాగము, ఉత్తర భాగము – అని రెండుగా విభజించాడు. పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలు ఉన్నాయి. నాచన సోమన కేవలం ఉత్తర హరివంశాన్ని మాత్రమే అనువదించాడు. ఎర్రన పూర్వభాగంలో నాలుగు ఆశ్వాసాలలో హరివంశ పర్వ కథాసందర్భం చెప్పాడు.

ఐదో ఆశ్వాసం నుండి ఉత్తర భాగంలో ఎనిమిదో ఆశ్వాసం వరకు కృష్ణుని జీవిత చరిత్రను సాంగోపాంగంగా వర్ణించాడు. ప్రభావతీ ప్రద్యుమ్న గాథ ఇంచుమించుగా ఉషాపరిణయం వంటిదే గాన వానిని వదిలివేశాడు. తిక్కనకు పరోక్ష శిష్యుడనని చెప్పుకొన్నాడు.

శ్రీకృష్ణుని బాల్యవిహారాలకు రంగస్థలమైన గోకులాన్ని, గోపకుల జీవితాలను వర్ణించిన ఘట్టాలు ప్రత్యేకంగా ఒక pastoral poem గా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం తమ ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభివర్ణించారు. గోపికా యశోదల సంవాదము, యశోధ ధూర్త గోపాలుని మందలించడం వంటి సాంసారిక సన్నివేశాలలో హరివంశం భాగవతం కంతే గుణోత్తరమని చెప్పినా తప్పుకాదని లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు.

ఎర్రన భారతానువాదంలో నన్నయ్య తిక్కనల మార్గాన్ని అనుసరించాడు. హరివంశంలో ప్రత్యేక శిల్పం చూపించాడు. మూలంలో ఇద్దరు చిత్రరేఖలున్నారు. ఎర్రన కుంభాండకుడి కూతురు చిత్రరేఖను మాత్రమే ప్రవేశపెట్టాడు. ఆమెయే ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుణ్ణి శోణపురానికి తెచ్చి ఉష దగ్గరకు చేరుస్తుంది.

వ్రేపల్లె నుంచి గోపబృందం బృందావనానికి వలసపోతారు. అక్కడ వర్ణన వ్యాసుని మూలంలో ఉన్న వర్ణన కంటే రమ్యంగా తెనుగుతనం చూపిస్తోంది. బృందావనానికి బయలుదేరే ముందు నారదుడు వచ్చి కృష్ణుడితో ఏకాంతంగా మాటలాటడం మూలంలో లేదు. ఎర్రన స్వతంత్ర కల్పన చేశాడు.

ఇంద్రోత్సవాన్ని కాదని యాదవులు తిరస్కరించడంతో ఇంద్రునికి కోపం వచ్చింది. వ్రేపల్లె మీద ప్రళయ మేఘాలు ప్రయోగిస్తాడు. వర్షం కుమ్మరించే ముందు ప్రకృతిలో కలిగే సూచనలు కనిపెట్టి యాదవులు అకాలవర్షం తప్పదని భావించారు. ఎర్రన అనుభవ పూర్వకంగా శాస్త్రజ్ఞానంతో స్వతంత్రంగా కొన్ని పద్యాలు వ్రాశాడు.

ఎర్రన హరివంశం రమ్యకథ!

ఎర్రన కవిత రమ్యకవిత! మీదు మిక్కిలి ‘కవీంద్రకర్ణపుటపేయం’.

పూతనా సంహారఘట్టంలో ఎర్రన పాండితీ ప్రకర్ష కనిపిస్తుంది:

ఉ:

ఎత్తిలి కావుకావు రన నేడ్చి తదీయ పయోధరాగ్రముల్
కుత్తుక దాక పెట్టికొని క్రోలె క్రమంబున చన్నుబాలతో
నెత్తురు మున్నుగాగ గణనీయములై చను సప్తధాతువుల్
పొత్తుగ ప్రాణములు చెనటి బొందియ త్రిక్కగ నొక్క వేల్మిడిన్.

(హరివంశం, పూర్వ-)

కథా సంవిధానం:

సత్రాజిత్తుకు సూర్య వరప్రసాదంతో శమంతక మణి లభించింది. శ్రీకృష్ణుని వలన శంకతో ఆ మణిని సత్రాజితు ప్రసేనునికిచ్చాడు. అతనిని చంపి ఒక సింహం ఆ మణిని నోట కరచుకుని వెళుతోంది. జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన బిలంలోకి చేరి తన కుమారుడు సుకుమారుని ఆటవస్తువుగా ఇచ్చాడు. ప్రసేనుడు రాకపోవడానికి కారణం శ్రీకృష్ణుడేనని అందరు శంకించారు.

కృష్ణుడు జాంబవంతుని ఎదిరించి అతనిచే శమంతక మణిని, అతని కుమార్తె జాంబవతినీ బహుమతిగా తెచ్చాడు. అది సత్రాజిత్తుకిచ్చాడు. సత్రాజిత్తు తన ప్రియపుత్రి సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం జరిపాడు.

భూభారాన్ని సహించలేని భూదేవి శ్రీ మహా విష్ణువు వద్దకు వచ్చి తన మొర విన్నవించుకుంటుంది. ఫలితంగా దుష్ట శిక్షణ కోసం ప్రయత్నాలు బ్రహ్మ కొనసాగించాదు. సముద్రుడు శంతనుడై జన్మించాదు. విచిత్రవీర్యునకు దృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు. కాలనేమి కంసుడై జన్మించాడు. కశ్యపుడు వసుదేవుడిగా జన్మించాడు. నారదుడు కంసునికి కృష్ణుడు జన్మించబోతున్నాడని చెప్పాడు. విష్ణువు యోగమాయ పుట్టేలా చూశాడు.

ముందుగా బలరాముడు అవతరించాడు. దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు పుత్రునిగా అవతరించాడు. బిడ్డను చంపడానికి ముందుకు వచ్చిన కంసుని దేవకి వారించింది. వసుదేవుడు శ్రీకృష్ణుని యశోద వద్దకు చేర్చాడు. పొత్తిళ్ళలో ఉన్న బాలునిగా కృష్ణుడు పూతనని సంహరించాడు. శకటాసుర సంహారం జరిగిపోయింది.

శ్రీకృష్ణుని బాల్యక్రీడలు:

శ్రీకృష్ణుడు నంద గోకులంలో ఎన్నో విలాసాలు చూపాడు. గోపికలు యశోదతో కృష్ణుని దుందుడుకు పనులు చెప్పుకొన్నారు. యశోద కోపంతో కృష్ణుని రోకటికి కట్టివేసింది. అతడు మద్దిచెట్లు కూల్చాడు. గోపకులందరూ వ్రేపల్లెను వదిలి బృందావనం చేరుకొన్నారు. బృందవనంలో ఎన్నో ఉపద్రవాలు కలిగాయి. గోపాలురతో కృష్ణుడు జలక్రీడలాడాడు.

యశోదకు సోదరుడైన కుంభకుని కుమార్తె నీలాదేవిని కృష్ణుడు వివాహమాడాడు. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసి గోపబాలురను ఆశ్చర్యపరిచాడు. బలరాముడు ధేనుకాసర సంహారం చేశాడు. అలానే ప్రలంబ రాక్షసుని అంతమొందించాడు. నందాదులు ఇంద్రోత్సవం చేద్దామని సంకల్పించగా కృష్ణుడు వారించి పర్వతోత్సవం మంచిదని సూచించాడు.  దేవేంద్రు డాగ్రహించి కుంభవృష్టి కురిపించాడు. శ్రీకృష్ణుడు తన హస్తంతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి గోపాలకులను, గోవులను రక్షించాడు. ఇంద్రుడు శ్రీకృష్ణుని గోపాధిపత్యానికి అభిషేకించాడు.

శ్రీకృష్ణుడు గోపికలతో రాసక్రీడలాడాడు. కంసుడు వసుదేవాదులతో కృష్ణుని చరిత్ర చెప్పి ఆక్షేపించాడు. కంసుని పనుపున అక్రూరుడు శ్రీకృష్ణుని తోడ్కొని రావడాని వ్రేపల్లెకు వచ్చాడు. దేవకీ వసుదేవులు బాధపడుతున్నారని చెప్పాడు. బలరామకృష్ణులు మధురకు బయలుదేరారు. మార్గమధ్యంలో యమునానదిలో అక్రూరునికి కృష్ణుడు తన మహత్యమ్ చూపాడు. మధురలో కృష్ణుడు కుబ్జను అనుగ్రహించాడు.

కంససభలో కృష్ణుడు చాణూరముష్టికలను, కంసుని హతమార్చాడు. ఉగ్రసేనునికి పట్టాభిషేకం చేశాడు. బలరామకృష్ణులు సాందీపని వద్ద విద్యాభ్యాసం చేసి గురుదక్షిణగా మృతుడైన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి సమర్పించారు

ఉత్తరభాగం:

జరాసంధుడు మధురపై దండెత్తి రాగా బలరామకృష్ణులు మధురను వీడి గోమంతానికి చేరారు. జరాసంధుడు రెండుసార్లు ఓడిపోయాడు. ద్వారకా పురాన్ని నిర్మించిన శ్రీకృష్ణుడు సుధర్మ అనే దేవసభను ద్వారకకు తెప్పించాడు.

రుక్మిణీ కల్యాణం:

ఇది రసవత్తర సన్నివేశం. భీష్మకుని కుమార్తె రుక్మిణి శ్రీకృష్ణునిపై మనసు పడింది. శిశుపాలుని కిచ్చి వివాహం చేయాలని రుక్మి పట్టుబట్టాడు. ఆ విషయం నారదుడు కృష్ణునికి వివరించాడు:

శా:

నీ వాకన్నియ కోరినాడవు మదిన్ నీకీక వైదర్షుడి
ట్లా విద్వేషిమతంబు సేయగలవాడైనాడు; తత్కార్య మిం
కే విఘ్నంబును లేక సిద్ధమగు; అట్లేనిన్ యశోహాని యొం
డే విశ్వంబున నింతకంటె కలదే ఏ భంగి నీ పేర్మికిన్

(ఉత్తర భాగం)

పోతన అగ్నిద్యోతనుని ప్రస్తావన ఇందులో లేదు. రుక్మిణిని కృష్ణుడు శుభముహూర్తంలో వివాహమాడాడు. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడు. ప్రద్యుమ్నుని శంబరాసుడు అపహరించగా అతనిని ప్రద్యుమ్నుడు సంహరించాడు. ప్రద్యుమ్నునికి అనిరుద్ధుడు జన్మించాడు.

నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించాడు. పౌండ్రక వాసుదేవుడు ద్వారకపై దండెత్తి రాగా యుద్ధం చేశాడు. కృష్ణు డతనిని సంహరించాడు. బాణాసురుని కుమార్తె ఉషపై అనిరుద్ధుడు మనసు పడ్డాడు. బాణాసురుడు శివభక్తుడు. అతని రక్షణార్థం శివుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేశాడు. పార్వతి బాణాసురుడి చావును తప్పించింది. ఉషా అనిరుద్ధుల వివాహం జరిగింది. ఈ విధంగా హరివంశగాథ పరిసమాప్తమైంది.

Exit mobile version