ఖాతా!!

0
2

[Stephen Leacock ఇంగ్లీషు కథ ‘Financial Career’ ప్రేరణతో, శ్రీ సముద్రాల హరికృష్ణ యథేఛ్ఛగా చేసిన అనుసృజన]

[dropcap]రెం[/dropcap]డుచింతలుకు పెద్ద చదువేం లేకపోయినా, చదవటం రాయటం వచ్చిన వాడే, తెలుగులో.

తన తెలివి మీద బోల్డు నమ్మకం, పై పెచ్చు!

ఊళ్ళోనే ఉన్న మిల్లులో ఉద్యోగం. నమ్మకస్థుడూ, నెమ్మదస్థుడూ అని ప్రొప్రైటర్‌కి కూడా మంచి అభిప్రాయమే అతనంటే!

ఆ సంవత్సరం కూడా దీపావళికి, ప్రతి ఏటా లాగే ఏదో బోనసు ఇస్తారని తెలుసు గానీ, చేతి కందగానే నోట మాట రాలేదు, రెండుచింతలకి, ఆనందంతో!

ఒక ప్యాకెట్ – పది, 200/-రూపాయల నోట్లతో ఉన్నది,

“జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో”, అని చెప్పి మరీ ఇచ్చారు, ప్రొప్రైటర్, జగన్నాథం గారు!

రెండుచింతలు నాన్న కూడా అదే మిల్లులో పని చేయటం వల్ల,ఒక బంధం ఏర్పడ్డది, జగన్నాథం గారికి, ఆ కుటుంబంతో!

ఓ ఐదు నోట్లు అందరి కంటే ఎక్కువే పెట్టి ఇచ్చారు, అందుకనే!

***

ఎప్పటి నుంచో రెండుచింతలకు ఒక కోరిక ఉంది.

ఒక పెద్ద గవర్నమెంటు బ్యాంకులో, అదీ హైద్రాబాదు లాంటి నగరంలో ఖాతా తెరవాలని.

కోరిక ఉన్నా మనకెందుకులే అని ఇన్నాళ్ళూ ఊరుకున్న వాడు కాస్తా, ఈ డబ్బుతో వెంటనే ఖాతా తెరవాలని ముచ్చటపడ్డాడు.

ఎన్ని సార్లు ఎంత మంది అడిగినా వద్దన్న వాడు, మరుసటి వారం తన మిల్లు సెలవు దినమైన మంగళవారం నాడు, ఆ డబ్బుని గట్టిగా రుమాలులో కట్టి, గుట్టుగా నగరానికి బయలుదేరాడు, ఉత్సాహంగా!

***

అదో పెద్ద బ్యాంకు.

టీవీలో ప్రకటన చూశాడు అప్పుడెప్పుడో, ఆ బ్యాంకు గురించి!

అందులోనే ఖాతా తెరవాలని, అతని ముచ్చట!

లోపలికి వెళ్ళాడో లేదో, ఒక డెస్క్!

అక్కడ ఒక అమ్మాయ్ కూచుని ఉంటే, ధీరసాగా అడిగాడు.

“ఖాతా తెరవాలి, పెద్ద ఆఫీసర్‌ని కలవాలి, ఎటు?” అని!

“ఆ క్యాబిన్లో ఉంటారు సార్”, అన్నది ఆమె, వినయంగా, ఎన్ని కోట్ల డిపాజిట్టో అనుకుంటూ!

క్యాబిన్ అద్దాల లోంచి, ఒకాయన కళ్ళద్దాలు పెట్టుకొని, కనిపించాడు.

తలుపు మెల్లగా తోసుకుని వెళ్ళి నమస్కారం పెట్టాడు, చింతలు.

ఆయన కూర్చోమన్నాడు.

“పర్వాలేదండి”, అంటూనే కూచున్నాడు, రెండుచింతలు!

“చెప్పండి”, అన్నాడు మేనేజర్.

“ఖాతా తెరిచి, పెద్ద రొక్కం ఎయ్యాలండీ”, అన్నాడు చింతలు.

ఫామ్స్ అన్నీ తానే తీసి ఇచ్చి, “పూర్తి చేయండి”, అన్నాడు మేనేజర్!

“ఇంతకీ ఎంత వేస్తున్నారో”, అని ప్రశ్న కూడా సంధించాడు.

ఇంత మొహం చేసుకొని, “రెండు వేలండీ”, అన్నాడు చింతలు.

మేనేజర్ మొహంలో రంగులే మారిపోయినయ్ వెంటనే!

గట్టిగా బెల్ మోగించి, ప్యూన్ రాగానే, “రవిని రమ్మను”, అన్నాడు.

రవి అనే ఆ క్లర్కు రాగానే, విషయం ఇంగ్లీషులో అతనికి  చెప్పాల్సింది చెప్పి, రెండుచింతలుతో “మీరు ఈయనతో వెళ్ళండి, అకౌంట్ తెరుస్తారు”, అని చెప్పి తన పనిలో తల దూర్చేసాడు!

మేనేజర్ ఈ వింత ప్రవర్తన ఏమిటో అర్థం కాకపోయినా, ఏదోలే ఆయన బాధలు ఆయనవి అనుకొని, రవితో పాటు బయటకు వచ్చాడు, చింతలు!

బయటకు రాగానే, రవి, “మీరు మా దగ్గరకు రావాలి సార్, ఖాతా తెరవటానికి! నేరుగా మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే, ఎట్లా”, అన్నాడు కాస్త నిష్ఠూరంగా!

చింతలుకు, అతను ఎందుకు అట్లా అన్నాడో అర్థం కాలేదు.

అడగనూ లేదు.

అతని ‘ఖాతా ఉత్సాహం’, మెల్లగా తగ్గిపోతున్నట్టు అనిపించింది.

సరే వచ్చాము కదా, పూర్తి చేద్దామని సర్దుకున్నాడు.

వారు అడిగిన ఋజువులన్ని ఇచ్చి రెండు వేలు క్యాషియర్ కిచ్చి ఖాతా తెరిచాడు, మొత్తానికి!

‘అబ్బ, ఎన్నాళ్ళకు’ అనుకుంటూ, చేతి కివ్వబడ్డ పాస్‌బుక్కూ, చెక్కు బుక్కు చూసుకుంటూ, గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

కానీ, ఆ ఆనందం క్షణం పాటు నిలవలేదు, తాను ఖాతాలో వేయాలని అనుకున్నది 1500/- రూపాయలు మాత్రమే!

పొరబాటునో, ఆ మేనేజర్ ప్రవర్తన, ఆ క్లర్క్ సూటి మాటల వల్లనో, తడబాటు పడి మొత్తం రెండు వేలు వ్రాసి జమ చేసేశాడు!

మొహమాటబడుతూ, రవి దగ్గరికే వెళ్ళి మెల్లగా, “సార్ నాకు 500 రూపాయలు కావాలి”, అన్నాడు.

ఇతను ఎంత మెల్లిగా అడిగాడో, అతను అంత బిగ్గరగా, “ఇప్పుడే కదండీ, వేశారు, అప్పుడే తీస్తారా, ముందే ఆ పైకం ఉంచుకొని మిగతాదే వేసి ఉండొచ్చుగా?!” అని అడిగాడు.

ఆ సంభాషణ అందరి దృష్టి ఆకర్షించడంతో, మిగతా స్టాఫ్ అంతా ఇటు వైపే చూడటం మొదలు పెట్టారు. రెండుచింతలుకి ఇంకాస్త ఇబ్ఫంది పెరిగినట్టై, చిన్నతనం అనిపించింది.

ఏదో ఆందోళన కలిగింది.

రవి, ఇంతలో, “సరే చెక్ బుక్ ఇచ్చాను కదా, రాసి ఇవ్వండి” అన్నాడు.

గుట్టుగా, పక్కనే ఉన్న ఇంకో కస్టమర్‌ని అడిగి చెక్కు రాయటం తెలుసుకుని, రాసి ఇచ్చాడు, రవికి.

అతను,”నా క్కాదండీ, అక్కడ క్యాషియర్ కాబిన్‌లో ఇవ్వండి” అంటూ అటు చూపించాడు, చెక్కు ఎంతకు రాశాడో చూడకుండానే!

అది అతని పని కాదు అని తెలియని చింతలు, దీనికీ కొంత ఖంగు తిన్నాడు, ఇంత విసురు ఏవిఁటా అని!

గబగబా క్యాషియర్ కాబిన్ దగ్గరకు వెళ్ళి, చెక్ ఇచ్చాడు, చింతలు!!

క్యాషియర్ డబ్బు చేతిలో పెట్టాడు.

చూస్తే, రెండువేలు!

“ఇదేంటి రెండువేలు ఇచ్చారు”, అన్నాడు ఆశ్చర్యంగా, రెండుచింతలు.

క్యాషియర్ చాలా నిర్లిప్తంగా, “అవునండీ అంతేగా వ్రాశారు, మీరు”, అని చెక్ చూపించి మరీ, చెప్పాడు.

రెండుచింతలు, ‘ఓహో, మళ్ళీ తడబడి, 500/- బదులు 2000/- వ్రాసినట్టున్నాను’, అనుకొని ఇంకేమీ అడగకుండానే బయట పడ్డాడు, ఒకింత గందరగోళ పడ్డ మనసుతో!

వెళ్తుంటే, స్టాఫ్ నవ్వుకోవడం వినిపించి, తన గురించే అని అనిపించింది కూడా!

“భలే, జీరో బ్యాలెన్స్ అకౌంట్ హడావిడిరా, నాయనా”, అని వారిలో ఒకరు అనటం కూడా అతనికి వినిపించింది.

“సరేలే గురూ, ఏదో ఒక ఖాతా నడుచుకుంటూ వచ్చింది. ఛస్తున్నాం, కొత్త అకౌంట్లు తేలేక! వేస్తాడులే డబ్బు- రేపో మాపో” అన్నది మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ కామెంట్!

స్పష్టాస్పష్టంగా అర్థమైనా కూడా, రెండుచింతలు అవేవీ పట్టించుకో దలచుకోలేదు.

***

వెళుతూ వెళుతూ, మంచి స్వీటు షాపులో ఒక కిలో లడ్డూలు, ఇంటి దగ్గర చుట్టు పక్కల ఇళ్ళల్లో పిల్లల కోసం కొన్నాడు.

పక్కనే ఉన్న చేనేత చీరల షాపులో తన భార్యకు, ఆమెకు ఇష్టమైన మంచి ఆకుపచ్చ రంగు చీర, ఒకటి కొన్నాడు.

ఆనుకొని ఉన్న హోటల్‌లో ఒక కప్పు కాఫీ తాగి, తృప్తిగా తన ఊరి బస్సెక్కాడు – ‘చింత’ లను ఎక్కువగా దగ్గరికి రానీయని, ‘రెండుచింతలు’!!

పిల్లలు లేరే అనే పెద్ద చింతా రానీయడు, ఖాతా తెరిచి కూడా తెరవనట్టు అయిందే, అనే చిన్న చింతా రానీయడు, మనసులోకి!

ఆ మనిషి అంతే, అదొక తరహా!

పేరు మాత్రం, ‘రెండుచింతలు’, ఆశ్చర్యంగా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here