ఖాకీ చొక్కా

0
2

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘ఖాకీ చొక్కా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]ధీర్ డ్యూటీలో ఉండగా ఫోన్ వచ్చింది. అతను ఆఫీస్ పని మీద మురళీ నగర్ లోని ఇన్సూరెన్స్ ఆఫీస్‌కి వచ్చేడు. “మీ అబ్బాయి అన్వేష్‌కి ఆక్సిడెంట్ అయింది, సృజన హాస్పిటల్‌లో జాయిన్ చేసేము” అని స్కూల్ వాళ్ళు తెలిపేరు. సుధీర్‌కి పై ప్రాణం పైనే పోయింది. ఒక్కసారిగా కంగారుగా “ఏమైందండీ?” అని అడిగాడు.

“స్కూల్ వదిలేటప్పుడు పిల్లలందరూ స్కూల్ బయట బస్సు ఎక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ అబ్బాయి కొద్దిగా పక్కకి వచ్చి నుంచున్నాడుట.. ఇంతలో ఒక బైక్ ఆతను వేగంగా బస్సు పక్కనుండి వెళ్తూ, మీ బాబుని గుద్దేసాడు. పేవ్‌మెంట్‌కి తల తగులుకోవడంతో బాగా రక్తం పోయింది. వెంటనే మా స్కూల్ అటెండర్, ఒక ఆటో డ్రైవర్ దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళేరు. మీ భార్య గారి నెంబర్‌కి చేస్తూ ఉంటే, స్విచ్ ఆఫ్ వస్తోంది. అందుకని మీకు చేసేము.” అన్నారు.

“నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను” అన్నాడు సుధీర్.

సుధీర్ 5th టౌన్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్.ఐ.గా చేస్తున్నాడు. పిల్లవాడు అన్వేష్ 2వ తరగతి చదువుతున్నాడు. టింపనీ స్కూల్‌లో చదువు బావుంటుంది అని LKG నుండీ అక్కడే చదివిస్తున్నారు. వాళ్ళ ఇంటికి 7 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కాత్యాయిని ఇంటి దగ్గరలోనే గవర్నమెంట్ స్కూల్లో టీచర్.

ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లి పోతారు కాబట్టి, పిల్లవాడికి స్కూల్ బస్సుకి డబ్బులు కడతారు. స్కూల్ బస్సు ఇంటి దగ్గరే స్టాప్‌లో ఆగుతుంది. మధ్యాహ్నం స్కూల్ బస్సు వచ్చే సమయానికి, సుధీర్ తల్లి సుభద్ర రిసీవ్ చేసుకుని, వాడికి భోజనం పెట్టి చూసుకుంటుంది. ‘ఈ రోజు వాడు ఇంటికి వచ్చే సమయం అయిపోవడంతో అమ్మ కంగారు పడుతూ ఉంటుంది..’ అనుకున్నాడు సుధీర్.

ఇంతలో తల్లి సుభద్ర నుండి ఫోన్ వచ్చింది. ఈ వయసులో ఆవిడని కంగారు పెట్టడం ఇష్టం లేని సుధీర్, “స్కూల్ నుండి ఫోన్ వచ్చిందిలే, బస్సు పాడయిందిట, నేను వెళ్లి తీసుకుని వస్తాను..” అని అబద్ధం ఆడేసేడు.

ముందు హాస్పిటల్ కి వెళ్లి, పిల్లవాడిని చూసేవరకు, అతనికి ఏ విషయం పాలుపోవడం లేదు.

ఇంతలో భార్య కాత్యాయిని నుండి కూడా కాల్ వచ్చింది. “బాబు ఇంకా స్కూల్ నుండి రాలేదుట.. అత్తయ్య గారు ఫోన్ చేసేరు..” అంది. తల్లి తన కంటే ముందు తన భార్యకి ఫోన్ చేసిన విషయం అర్థం అయింది అతనికి.

భార్యకి విషయం చెప్పేడు. డైరెక్ట్‌గా హాస్పిటల్ కి వచ్చేయమని, జీపులో హాస్పిటల్‌కి వెళ్లి పోయాడు.

ట్రాఫిక్‌లో హాస్పిటల్‌కి చేరేసరికి, అరగంట పైనే పట్టింది. అప్పుడే కాత్యాయిని కూడా ఆటో దిగుతోంది. ఇద్దరూ కలిసి పిల్లల వార్డు లోకి వెళ్ళేరు. డ్యూటీ డాక్టర్ పిల్లవాడిని చూస్తున్నాడు. పిల్లవాడు స్పృహలో లేడు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. తలకి కుట్లు వేసేరుట. పెద్ద బ్యాండేజ్ కట్టి వుంది. స్కూల్ అటెండర్ అచ్చయ్య, బాబు మంచం దగ్గరే వున్నాడు. అచ్చయ్య సుధీర్‌కి తెలుసు.

సుధీర్ దంపతులను చూస్తూనే, డాక్టర్ విష్ చేసి “మరేం పర్వాలేదు.. కాసేపట్లో స్పృహ వస్తుంది. మత్తు ఇచ్చేము. తలకి యెనిమిది కుట్లు పడ్డాయి. రక్తం పోయిందని, రక్తం ఎక్కిస్తున్నాము..” అన్నాడు.

భారంగా ఊపిరి పీల్చుకున్నారు సుధీర్ దంపతులు.

అచ్చయ్య కేసి చూసేడు సుధీర్.

“ఎలా జరిగింది..” అని ప్రశ్నించేడు.

ఫోన్‌లో ఆఫీస్ వాళ్ళు చెప్పిన విషయం రిపీట్ చేసేడు. మళ్ళీ ఇలా అన్నాడు:

“ఆ మోటార్ సైకిల్ వేసుకొచ్చిన కుర్రోడు పారిపోయాడు సార్, కానీ ఆడి బండి నెంబర్ మా వాళ్ళు నోట్ చేసుకున్నారు సార్. ముందు బాబు ప్రాణం ముఖ్యం అని వెంటనే నేను, చిన్నారావు ఆటోలో బాబుని తీసుకుని వచ్చేసేము. మా స్కూల్ సూపరింటెండెంట్ గారు సుధాకర్ గారు కూడా వచ్చేరు, ఆయన ఇప్పుడే బయటకి వెళ్ళేరు సార్”.

“అన్వేష్ బాబుకి రక్తం ఇచ్చిన చిన్నారావు పక్క గదిలో వున్నాడు.. మరేం పర్లేదు సార్, పిల్లవాడు లేచిన యేలా ఇశేషం మంచిది. బతికేడు. తలకి పెద్ద దెబ్బ తగిలింది” అని విషయం అంతా ఏకరువు పెట్టేడు.

కాత్యాయిని కన్నీటి పర్యంతం అయింది. అన్వేష్ మంచం మీద ఓ పక్కగా కూర్చుని పిల్లవాడి కాళ్ళు రాస్తూ కూర్చుంది.

డ్యూటీ డాక్టర్, నర్స్‌కి సూచనలు చేసి, మళ్ళీ ఓ గంట తర్వాత వస్తానని వెళ్లి పోయాడు.

సుధీర్ అచ్చయ్య కేసి కృతజ్ఞతా పూర్వకంగా కూసేడు.

“అచ్చయ్యా, నా బిడ్డని కాపాడావు. నీ ఋణం తీర్చుకోలేను..” అన్నాడు.

“ఎంత మాట సార్.. నా కంటే, మా చిన్నారావు గొప్పోడు సార్.. ఆడు తన రగతం కూడా ఇచ్చేడు.. ఆడికి నీరసంగా వుంటాదని జ్యూస్ ఇచ్చి, పక్క గదిలో ఓ అరగంట రెస్టు తీసుకోమన్నారు డాక్టర్ బాబు..” అన్నాడు అచ్చయ్య. అతను ఏకధాటిగా మాట్లాడతాడని అర్థం అయింది సుధీర్‌కి.

ఇంతలో ఖాకీ యూనిఫామ్‌లో ఒక వ్యక్తి గదిలోకి వచ్చేడు.

“అన్నా.. నేనింక ఎల్తాను, నువ్వు బాబు కాడ ఉంటావు కదా?” అచ్చయ్య కేసి చూస్తూ అంటున్నాడు.

“నువ్వెళ్ళచ్చురా.. ఇదిగో బాబు తల్లిదండ్రులు కూడా వచ్చేసేరు రా..” అని సుధీర్‌ని ఆ వ్యక్తికి పరిచయం చేసేడు అచ్చయ్య.

సుధీర్‌ని చూస్తూనే ఆ వ్యక్తి ముఖంలో రంగులు మారేయి.

“మీరా సార్” అన్నాడు.

సుధీర్‌కి అతన్ని ఎక్కడో చూసినట్లనిపించింది. ట్రాఫిక్ ఎస్.ఐ.గా తానూ ఎందరినో రోజూ చూస్తూ ఉంటాడు రోడ్ మీద, అలాగే, ఆ ఆటోవాలా చిన్నారావుకి తానూ తెలిసి ఉంటాడని అనుకున్నాడు.

అయినా సుధీర్ తన ఆలోచనల్లో తాను వున్నాడు.

చిన్నారావు వైపు కృతజ్ఞతగా చూస్తూ.. “చిన్నారావు గారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. మా వాడికి ప్రాణ దానం చేసేరు. మీ ఋణం తీర్చుకోలేను. ఏదో నా తృప్తి కోసం..” అంటూ ఓ వెయ్యి రూపాయలు అతని చేతిలో పెట్టబోయాడు.

“వద్దు సార్, ఎవరికయినా ఆపద వస్తే, సాయం చేయడం మా నాన్న నేర్పించేడు.. చేసిన సాయానికి ప్రతిఫలం ఆశించను., ఆపదలప్పడు రూల్స్ వుండకూడదు సార్.. అంతకంటే మీలాంటి పెద్ద వాళ్ళకి నేను ఏం చెప్పగలను సార్” అని, వెనక్కి తిరిగి గబ గబా వెళ్లి పోయాడు.

కాత్యాయిని వింతగా చూస్తోంది. సుధీరకి చెంపమీద కొట్టినట్లయింది ఆ మాటలకి.

అచ్చయ్యకి కూడా చిన్నారావు ఎందుకు ఆలా అని వెళ్లిపోయాడో అర్థం కాలేదు.

సుధీర్‌కి చిన్నారావు మాటలు తూటాల్లా తగిలాయి. అప్పుడు అతనికి చిన్నారావుని ఎక్కడ చూసేడో గుర్తుకు వచ్చింది.

ఆ సంఘటన ఓ పదిహేను రోజుల క్రితం జరిగింది.

జంక్షన్‌లో బిజీగా వున్న సుధీర్‌కి ఫోన్ వచ్చింది.. మినిస్టర్ గారి కారు, ముందు జంక్షన్ నుండి ఇసుక తోట జంక్షన్ దగ్గరకి వస్తోంది అని, కాసేపు ట్రాఫిక్ నిలిపి, మినిస్టర్ గారి కారు వెళ్ళేక వదలమని.. ఆ ఫోన్ సారాంశం.

ఇంతలో ఆపిన ట్రాఫిక్ లోంచి, ఒక ఆటో వేగంగా, రాంగ్ రూట్‌లో ముందుకి వచ్చింది.

సుధీర్‌కి కోపం నషాళానికి వచ్చింది. “ఏయ్ ఆటో” అంటూ ఆటో వెనుక పరిగెత్తేడు. ఆటో ఆపకుండా ముందుకు వెళ్తూ ఉంటే, వెంబడించి, ఆటోని ఆపించేడు.

డ్రైవర్ చిన్నారావు ని సీట్లోంచి బయటికి లాగి కొట్టేడు.

ఆటో వెనుక సీట్‌లో గర్భిణీ స్త్రీ కేకలు పెడుతోంది. ఆమెని పొదివి పట్టుకున్న ఒక స్త్రీ ఆటో లోంచే, అంటోంది.. “బాబూ.. ఆడిని కొట్టకండి.. మా చెల్లి నెప్పులు తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. దాన్ని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి ఆడు రాంగ్ రూట్లోకి వచ్చేడు. దాని ప్రాణం ముఖ్యం కదా సార్..”

అప్పటికే, సుధీర్ 2 దెబ్బలు వేసేసేడు. తాను చెపుతున్నా, ఆటో ఆగక పోవడం సుధీర్ ఇగో దెబ్బ తింది. అందుకే ఆతను అనుచితంగా ప్రవర్తించేడు.

రోజూ ఆటో వాళ్లతో ఇలాంటి తగువులు అతనికి మామూలే..

విషయం అర్థం అయ్యేసరికి, కేకలేసి, వదిలేసేడు.. సాధారణంగా అయితే ఆటో పక్కకి తీయించి ఓ అరగంట క్లాస్ పీకితే కానీ వదలడు. ఆ విషయం ఆ రోజే మర్చి పోయాడు.

దెబ్బలు తిన్న చిన్నారావు మరిచిపోలేడు కదా.. అతని పరిస్థితిలో అతనూ కరక్టే..

అధికారులని ఎదిరించలేని నిస్సహాయత, పైగా ఆటోలో ఎక్కిన స్త్రీ ప్రాణం ముఖ్యం అని ఆతను ఆనాడు ఆ సాహసం చేసేడు.

మనసులో అపరాధ భావం కలిగింది సుధీర్‌కి. ‘ఆ రోజు తన చేతిలో, దెబ్బలు తిన్న వ్యక్తి, ఈ రోజు తన కొడుక్కి రక్తదానం చేసేడు’.

‘తన వంటి మీద ఖాకీ చొక్కా వుంది, ఆటో వాలా వంటి మీద కూడా ఖాకీ చొక్కాయే వుంది.’

సుధీర్‌కి ఇలా అనిపించింది.. ‘ఖాకీ చొక్కా అసలు అర్థం నిబద్ధత, వివేచన. కానీ పోలీసు వాడికి అధికారం అనే అహంకారం అసలు అర్ధాన్ని మరుగున పరుస్తోంది’

ఇవేవీ అర్థం కాని కాత్యాయిని, అచ్చయ్య, విచిత్రంగా చూస్తున్నారు.. వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు.

పరిస్థితి గ్రహించిన సుధీర్ అచ్చయ్య కేసి తిరిగి ఇలా అన్నాడు:

“చిన్నారావు, ట్రాఫిక్‌లో పోలీసులతో జరిగిన పాత గొడవలు గుర్తు పెట్టుకున్నట్లున్నాడు..” అని, ఆగి.. “చాలా థాంక్స్ అచ్చయ్యా, ఇంక నువ్వు వెళ్లి పో, మేము వచ్చేసేము కదా” అన్నాడు.

అచ్చయ్య దండం పెట్టి, బయలుదేరేడు.

గేట్ వరకు వెళ్లి, అచ్చయ్యని సాగనంపి, వెళ్ళేటప్పుడు ఓ వెయ్యి రూపాయలు అతని చేతిలో పెట్టేడు. “ఈ వెయ్యి రూపాయలు తీసుకో.. మీ పిల్లలకి ఏవయినా కొని పట్టుకెళ్ళు” అన్నాడు. అతని దగ్గర ఆటో చిన్నారావు ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

సుధీర్ అప్పుడే నిశ్చయించుకున్నాడు ఇక మీదట తన ఇగోని తగ్గించుకోవాలని. కొడుకు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేక చిన్నారావుని ఇంటి దగ్గర కలిసి క్షమాపణ అడగాలని కూడా నిర్ణయించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here