ఖండసారి పిపీలీకం

0
2

[అనుకృతి గారు రచించిన ‘ఖండసారి పిపీలీకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం తొమ్మిది దాటింది. ఎవరో తలుపు తట్టినట్టు వినిపించి తలుపు తీసింది శ్యామల. మామగారు నారాయణ రావు. ఆయనని చూడగానే శ్యామల మొఖం విప్పారింది.

“రండి మామయ్యా” అంటూ సంతోషంగా ఆహ్వానించింది. చెప్పులు వరండాలో విప్పి కాళ్ళు కడుక్కోవటానికి వెనక్కి వెళ్ళారు నారాయణరావు. కోడలు అందించిన టవల్‌తో మొహం తుడుచుకొంటూ, “సాగర్ ఏడమ్మా?”అడిగారు.

“పనుందని తొమ్మిదింటికే వెళ్లారు మామయ్యా”

శ్యామల కేసి పరీక్షగా చూశారాయన. ఆమెకి ఏడవ నెల వచ్చింది అని చెప్పింది భ్రమరాంబ. మనిషి బలహీనంగా తోచింది ఆయనకు.

“వంట్లో కులాసేనా తల్లీ” కోడలి తల మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగారు ఆయన.

కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఆమెకి, “ఎందుకు తల్లీ, ఏమైంది?”ఆదుర్దాగా అడిగేరు.

ఏమి లేదన్నట్టుగా తలవూపి, “కూర్చోండి మామయ్యా, టీ తెస్తాను” అంటూ లోపలికి వెళ్ళబోయింది.

ఆయన కోడలిని వారిస్తూ “నేను హోటల్‍లో టిఫిన్ చేసే వచ్చాను తల్లీ, ఆ సంచిలో అత్తయ్య నీ కోసం యేవో చేసి పంపిందమ్మా, లోపల పెట్టు.” అన్నారు.

మామగారితో మాట్లాడుతూ కూర్చుంది శ్యామల. కానీ, ఆ అమ్మాయి అన్యమనస్కంగా వున్నట్టుగా అనిపించింది ఆయనకు.

“మామయ్యా, ఇంట్లో కూరగాయాలేమీ లేవు, మీరు కూర్చోండి, నే వెళ్లి తెస్తాను.”

“కూరగాయలు కూడా తేకుండా ఎక్కడికి వెళ్లినట్టు, ఆ సంచి ఇలా ఇవ్వు, నే తెస్తాను” అంటూ బయల్దేరారు ఆయన. రిలీఫ్‌గా ఫీల్ అయ్యింది శ్యామల.

శ్యామల ఉంటున్న వాటా చాలా చిన్నది. ముందు కామన్ వరండా, ఒక గది, వంటిల్లు అంతే, దానికే సిటీ కాబట్టి ఆరువేలు అద్దె కడుతున్నారు. పాతకాలం మేడ అది. అలాంటి వాటాలు నాలుగు వున్నాయి. పైన పోర్షన్ ఇంటివాళ్లది. ఇంటావిడ రోజుకి ఒకసారి మోటార్ వేస్తుంది, మిగతా సమయంలో బావి నుంచి తోడుకోవాల్సిందే.

ఒంటి గంట అయ్యింది, మామగారిని భోజనానికిలెమ్మంది. సాగర్‍కి ఫోన్ చేయమని ఆయనకు రెండు, మూడుసార్లు చెప్పింది. ఆయన ఒప్పుకోలేదు, “నువ్వు కూడా ఫోన్ చేయకు, ఎన్నింటికి వస్తాడో చూద్దాం” అన్నారు. ఆయనతో పాటు తను కూడా భోజన౦ చేసింది.

నాలుగైనా సాగర్ రాలేదు. “వీడు ఎక్కడున్నాడో శ్యామలా, నేను వెళ్ళి తీసుకొస్తాను” అన్నారు కోడలితో. భయపడుతూనే రామ్ ప్రసాద్ ఇంట్లో ఉంటాడని ఇంటి గుర్తులు చెప్పింది.

ఆయన రామ్ ప్రసాద్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పేకాట జోరుగా సాగుతోంది. ప్రసాద్ తండ్రి ఆయనకు గుమ్మంలోనే ఎదురై, “ఉదయం నుండీ భోజనాలు కూడా చేయకుండా ఆడుతున్నారు, మాది సొంత ఇల్లు కదా, ఇంక అడ్డేముంది” అన్నాడాయన నిరసనగా.

నారాయణ రావు ఏమి మాట్లాడలేదు, నెమ్మదిగా వెళ్ళి హాల్ గుమ్మం ముందు నిలుచున్నారు.

“సాగర్” పిలిచారు, ఉలిక్కిపడ్డాడు సాగర్, ఎదురుగా తండ్రి. గబగబా లేచి వచ్చాడు. తండ్రి సీరియస్‌గా ఉండటం చూసి, ‘ఎప్పుడొచ్చారు’ అని అడగటానికి కూడా సాహసించలేదు.

ఇంటికెళ్ళాక ఆయన అన్నారు, “నేను తొమ్మిదిన్నరకు వచ్చాను, అమ్మాయి ఫోన్ చేస్తానంది, నేనే వద్దన్నాను” ఎంత అణుచుకున్నా ఆయన గొంతులో కోపం దాగలేదు.

“వెళ్ళు, వెళ్ళి భోజనం చేయి”

“బుద్ధి లేదా నీకు, నాన్న రాగానే ఏదో ఒక రకంగా ఫోన్ చేసి చెప్పచ్చుగా”

శ్యామల జవాబు చెప్పలేదు.

తండ్రి కొడుకులు నేల మీద చాపా, దుప్పటి వేసుకొని పడుకొన్నారు. శ్యామలని మంచ౦ మీద పడుకోమన్నారు ఆయన. ఇంట్లో సరైన వస్తువులేమి లేవు. పాతిక వేలు వస్తున్నాయి, మూడేళ్ళనుండీ వుద్యోగం చేస్తున్నాడు, తనంత అయిన కొడుకుని మందలించలేక పోతున్నారు, రాత్రంతా అలోచించి ఆయనో నిశ్చయానికి వచ్చారు.

ఏడింటికల్లా స్నానం చేసి తయారయ్యారు. సాగర్ అప్పటికే లేచాడు.

“సాగర్, అమ్మ శ్యామలని తీసుకు రమ్మంది. వాళ్ళ నాన్నా వాళ్ళు సీమంతం ఏమి చేయనన్నారు. మనింట్లోనే చేద్దామన్నది”.

సాగర్ మాట్లాడలేక పోయాడు.

“నీకేమీ ఇబ్బంది లేదు కదా, నీకు వీలైతే శనివారం సాయంత్ర౦ వచ్చి సోమవారం వెళ్లుదువు గాని, వీలవుతుందా?”

ఆయన మొహంలో ఏ భావ౦ లేదు.

శ్యామల ఏదో చెప్పబోయింది, “నువ్వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా” అన్నారాయన.

శ్యామల భర్తని వంటిట్లోకి పిలిచి, “తొమ్మిదో నెల పంపుతానని చెప్పండి”

“నాన్న చాలా కోపంగా వున్నారు, అయినా నేను వారంలో రెండురోజులు వస్తాను, వెళ్ళి బట్టలు సర్దుకో”

శ్యామలకు తెలుసు, అతను రాలేడని, కంట నీరు తిరిగింది, తుడుచుకొంటూ వెళ్ళి మామగారితో బయల్దేరింది.

భ్రమరాంబ గుమ్మంలోనే శ్యామలకు ఎదురువచ్చి దగ్గరికి తీసుకొంది. తప్పిపోయి, మళ్ళీ తల్లి ఒడికి చేరిన పిల్లలా అత్తగారిని పట్టుకొంది, ఆమెకు ఎందుకో దుఃఖం ఆగలేదు. భ్రమరాంబ కోడలిని దగ్గరకు తీసుకొని, “ఏడవకూడదు, వాడు వారం వారం వస్తాడులే” అంటూ ఓదార్చి లోపలి తీసుకు పోయింది.

***

శ్యామల తల్లి చాలా విచిత్రమైన మనిషి. అందంలో శ్యామల తల్లి పోలిక. ప్రభాకర్‌కి ఆమెకి పదేళ్లు తేడా. ప్రభాకర్ రూపమూ, సంపాదన ఆమెకు సంతృప్తి నివ్వలేదు. తన అందానికి తగినవాడు కాదని, డబ్బులేని తండ్రి వలన ఈ గతి లేని సంబంధం చేసుకోవాల్సిని వచ్చిందని వాపోతుండేది. ఇంట్లో నిత్య ఘర్షణ, క్రమంగా తండ్రి తాగుడికి అలవాటు పడ్డాడు.

శుచి, శుభ్రం పాటించేది కాదు నాగమణి. శ్యామల ఇంటర్ చదివింది. ఆ పైన చదువుకోటానికి ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. ఇంట్లో పనంతా శ్యామల మీద పడింది, ఒకరకమైన ప్రేమరాహిత్యంలో పెరిగింది. ఇన్ని వైరుధ్యాల మధ్య శ్యామల మాత్ర౦ జీవితం పట్ల ఆశావహ దృక్ఫథం తోనే ఉండేది. తమ్ముడి పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. వాడి ఆలనా పాలనా శ్యామలే చూసుకొనేది. రేవంత్ ఇప్పుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శ్యామల టైలరింగ్ మీద సంపాదించిందంతా తమ్ముడి చదువుకే ఖర్చు పెట్టేది. తండ్రి ప్రభాకర్ అదో రకం మనిషి. నారాయణ దంపతుల మంచితనాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. సాగర్ ఉద్యోగం వున్న అమ్మాయి అయితే బావుండుననుకొన్నాడు. కానీ శ్యామలని చూసాక మరి మాట్లాడలేదు. ప్రభాకర్ ఒక నల్లపూసల గొలుసు కూతురికి, అల్లుడికి ఉంగరం పెట్టి, పెళ్లి మమ అనిపించాడు.

***

శ్యామలకి అత్తగారిల్లు చాలా నచ్చింది. వరుసగా అటు మూడు, ఇటు మూడు గదుల ఇల్లు. వెనుక పెరట్లో జామ, నిమ్మ, మామిడి చెట్లు, మల్లె, జాజి, కనకాంబరం మొక్కలున్నాయి.

సాగర్ తర్వాత వాసు, నీరజ వున్నారు. నీరజ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో వుంది. వాసు బికాం కంప్యూటర్స్ చేసి, చిన్న ఉద్యోగమేదో చేస్తున్నాడు. నీరజ సాయంకాలం ట్యూషన్స్ చెబుతుంది. నారాయణ రావు ప్రైవేట్ ఉద్యోగమేదో చేస్తారు. ఏభై ఐదేళ్లు, ఇంకో ఐదేళ్లు కష్ట పడగలనో లేదో అనుకుంటుంటారు.

ఆ దంపతులు కష్ట జీవులు, పొదుపరులు. అందుకే ఇల్లు సమకూర్చుకోగలిగారు. వరుస మూడు గదులు, సైడ్ పోర్షన్ ముందు గది తమ క్రింద ఉంచేసుకొని వెనుక రెండుగదులు అద్దెకిచ్చారు.

సాగర్ ఇప్పుడుంటున్న ఇల్లు దొరికిందాకా, శ్యామల అత్తగారింట్లోనే వుంది. కొత్త కోడలైన శ్యామలని ప్రేమగా చూసేదావిడ. మామగారూ అంతే. సాగర్ వారం ఉండి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా ఇంట్లో పనులు చేయటం మొదలు పెట్టింది శ్యామల. ఇంటిపని బాగా అలవాటైన శ్యామల ప్రతి పనీ బాగా చేసేది. కోడలు వచ్చాక భ్రమరాంబకి చాలా విశ్రాంతి దొరికింది. వాసు కూడా ఏ భేషజం లేకండా పనులందుకొనేవాడు. తండ్రి బట్టలూ, తనవీ అతనే ఉతుక్కొనేవాడు. చెల్లెలు ఇల్లు తుడుస్తుంటే, తాను తడిబట్ట వేసేవాడు. బజారు పని అంతా అతనే చేస్తాడు. శ్యామలతో, చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు.

నీరజ అంతే ఎంతో స్నేహంగా ఉండేది. సాగర్ బీసీఏ చేసి, ఆర్.ఎం.వో ఆఫీస్‍లో పాతిక వేలకి పనిచేస్తున్నాడు. అది కాంట్రాక్టు జాబ్. ఆఫీస్ పని మీద వచ్చిన వాళ్ళు ఏదైనా జాబ్ వర్క్ చేయాల్సి వస్తే చేసి ఎక్స్‌ట్రా మనీ సంపాదించేవాడు.

పెళ్ళైన నెల తర్వాత సాగర్ తీసుకు వెళ్ళాడు, ఆ ఇల్లు చూసాక శ్యామలకి నిరాశ కలిగింది. భ్రమరాంబ, నారాయణ రావు వచ్చి కొత్త సంసారానికి అవసరమైన సామాను, వెచ్చాలు కొనిచ్చారు. రకరకాల పొడులు, పచ్చళ్ళు చేసి వెంట తెచ్చింది. తన పుట్టింట్లో లేని ఆప్యాయతని, ప్రేమనీ అత్తగారింట్లో చవిచూసిన శ్యామలకు, అత్తా, మామ వెళ్లిపోతుంటే దుఃఖం ఆగలేదు.

పదిరోజుల తర్వాత సాగర్ ఏదో ఫాన్సీ షాప్‌లో అయిదు వేలిస్తారట అంటూ జాయిన్ అవమని చెప్పాడు. ఉదయమే లేచి ఇంటిపని, వంటపని ముగించుకొని తొమ్మిదింటికల్లా వెళ్ళేది. మళ్ళీ బస్సులో పడి ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరు. శ్యామలకు చాలా చికాకు అనిపించింది. అందుకే సాగర్‌కి చెప్పకుండానే మానేసింది. సాగర్‌కి చాలా కోపం వచ్చింది, “నీ ఇంటర్ చదువుకి ఇంతకంటే పెద్ద జాబ్ వస్తుందా” అన్నాడు విసురుగా,

శ్యామల అతని కోపం తగ్గాక దగ్గరలో వున్న లేడీస్ టైలరింగ్ షాపులో టైలరింగ్ నేర్చుకొంటానని, ఫీజు బదులు జాకెట్లకి చేతిపని చేయాలని చెప్పింది. సాగర్ అడ్డు చెప్పలేదు. అతనికి చాలా త్వరగా కోపం వస్తుంది, వెంటనే సర్దుకొంటాడు.

నిజానికి శ్యామల అతనితో ఆ రెండు విషయాలలో అబద్ధమే చెప్పింది. దానికి కారణ౦ సాగర్ అలవాట్లే, అతను ప్రతి ఆదివారం, సెలవుల్లో కూడా ఎక్కడో ఒక చోట పేకాట ఆడతాడు. ఎంత పోగొట్టుకుంటున్నాడో తెలియదు, అడిగితే కోపం, ఒక్కోసారి ఆమెకి అనిపిస్తుంది, సాగర్ బలహీనతని తాను కాష్ చేసుకొంటుందేమోనని. అతను ఎన్ని గంటలు ఇంటికి రాక పోయినా ఆమె ఏమీ అడగదు. ఏ రకమైన ప్రశ్నలు వెయ్యదు. ఒక్కోసారి అతనికి చాలా బాధ అనిపిస్తుంది, ఈ వ్యసన౦ నుంచి తాను బయపడలేక పోతున్నానని.

సంవత్సరం గడిచింది. సాగర్‌లో మార్పులేదు. ఆ ఒక్క దురలవాటు తప్పితే సాగర్ శ్యామలతో ప్రేమగానే ఉండేవాడు. వాసులాగా బాధ్యతగా ఉండడు. ప్రతి పండగకి శ్యామల అత్తగారింటికి వెళ్ళేది. తండ్రీ తల్లీ పెళ్లిచేసి చేతులు దులుపుకొన్నారు. భ్రమరాంబకి ఇవేమీ పట్టవు. శ్యామల కట్న కానుకలు ఏమి తీసుకు రాకపోయినా, ఆమెకా విషయమేమీ పట్టేది కాదు. సాగర్ విషయమే లోలోపలే బాధపడేవాళ్లు ఇద్దరూ.

శ్యామల తొమ్మిదో నెల సీమంతం చేశారు. నాగమణి ప్రభాకర్ వచ్చారు. రెండువేలు చదివించి చేతులు దులుపుకొన్నారు. పురిటికి తీసుకెళ్తామని వాళ్ళు అనలేదు, భ్రమరాంబ అడగనూ లేదు. పుట్టబోయే పాపో, బాబో తన వంశాంకురం కాబట్టి తనింట్లోనే ఉంటే ఇంకా సంతోషం ఆమెకి. తల్లీ, తండ్రీ పురిటికి తీసుకెళ్తామని ఆనకపోవటం చాలా అవమానంగా అనిపించింది శ్యామలకి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళిచ్చిన రెండువేలకి నూటపదహార్లు కలిపి తల్లి చేతిలో పెట్టింది. శ్యామలలో అంత కోపాన్ని మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాడు సాగర్.

***

శ్యామల డెలివరీ డేట్ దగ్గర పడుతున్నది. సాగర్ వస్తూ, పోతున్నాడు. తన తల్లి, తండ్రీ సరే, సాగర్ కూడా మామగారికి ఏమీ ఇవ్వకపోవటం ఆమెకి చాలా బాధ కలిగిస్తోంది. ఒక రోజు అడిగేసింది మామగారిని, “ఆయన ఏమైనా మనీ ఇచ్చారా మామయ్యా” అంటూ.

ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. భ్రమరాంబ “ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు తల్లీ” ప్రేమగా అన్నది.

“మీకు ఒకటి ఇస్తాను మామయ్యా, కాదనకూడదు, కాదనని ఒట్టేయండి” చేయి చాస్తూ అన్నది.

భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. “విషయమేమిటో తెలియకుండా మాట ఎలా ఇవ్వనమ్మా” నెమ్మదిగా అన్నారాయన.

“నన్ను ఈ స్థితిలో వద్దు అని బాధపెట్టవద్దు మామయ్యా” అన్నది. ఆయన మరేమీ మాట్లాడలేక పోయారు. తన చేతిలో వున్న కవర్ ఆయన చేతిలో పెట్టింది. కవర్లో డబ్బుని చూసి ఇద్దరూ నోటమాట లేక మౌనంగా ఉండిపోయారు.

“నలభై వేలు మామయ్యా, వనజ అని మా ఇంటి దగ్గరే ఒకావిడకి టైలరింగ్, పెట్టీకోట్స్, చీరలు కూడా అమ్మే బిజినెస్ వుంది. నేను ఈయన ఆఫీసుకి పోగానే అక్కడ పెట్టీకోట్స్, వేరే వాటికి చేతిపని చేసేదాన్నిఇక్కడకి వచ్చేదాకా. ఈయన వచ్చిన ప్రతిసారి ఏమైనా ఇస్తారేమోనని చూసాను. ఆయనకు ఇంటి పరిస్థితి అర్థం కావటం లేదో ఏమిటో, నాకు మీ అబ్బాయి వ్యవహారం ఏమి అర్థం కావటం లేదు మామయ్యా, నేను మా నాన్న మీద ఏ ఆశా పెట్టుకోలేదు” నారాయణ రావుకి అనిపించింది, ఇన్ని రోజులు శ్యామల ఎంత బాధపడిందో అని.

“ఇంకో ముప్పై వేలు ఉన్నాయి అత్తయ్యా, రేపు బాబో, పాపో పుట్టాక చాలా అవసరాలు ఉంటాయి కదా అత్తయ్యా” అంది.

భ్రమరాంబ కంట నీరు తిరిగింది. నారాయణ రావుకి డబ్బు తీసుకోక తప్పలేదు, లేచి డబ్బు జాగ్రత్త చేశారు.

శ్యామల కోరిక మీద బారసాల క్లుప్తంగా జరిపించారు నారాయణ రావుగారు. పుట్టింటి వాళ్ళని పిలవటానికి శ్యామల ఒప్పుకోలేదు. తమ్ముడిని మాత్రం పిలిచింది. ప్రణవ్ అని బాబుకి పేరుపెట్టారు. భ్రమరాంబ వాడి సేవలో మునిగిపోయింది. ఇంటిల్లిపాదీ వాడిని ముద్దు చేసేవారు. శ్యామలకి అక్కడే, ఆ మంచి మనుషుల మధ్య ఏ బెంగా లేకుండా ఉండిపోతే బాగుండుననుకొంది. మనవడికి మురుగులు చేయించారు నారాయణ రావు గారు. సాగర్ కూడా కొడుకుని బాగా ముద్దు చేసేవాడు.

కారులో బియ్యం, అన్ని రకాల పప్పులూ, రకరకాల పొడులూ తెచ్చి, కోడలి ఇల్లు సర్ది వెళ్లారు నారాయణ రావు దంపతులు. భ్రమరాంబ కోడలు చంటి వాడితో ఎలా చేసుకుంటుందో ఏమోనని బాధపడింది. కోడల్ని దగ్గరకు తీసుకొని “ఎప్పుడు ఏ అవసరమొచ్చినా కబురు చేయి, వస్తాను.” అన్నది. శ్యామలకి ఇంత మంచి మనుషులని వదిలి సిటీలో వుండాలని లేదు. అయినా తప్పదు.

శ్యామల ఇప్పుడు టైలరింగ్ సెంటరుకి పోయే వీలు లేక కేవలం చేతిపనికి మాత్రమే పరిమితమైంది. సాగర్ ఇంట్లో వున్నప్పుడు కొడుకుతో ఆడుతూ, ముద్దు చేస్తూ గడిపేస్తాడు. సెలవు దొరికిందంటే మనిషికి ఒంటిమీద సృహ ఉండదు. తొమ్మిదిగంటలకల్లా బయటపడి, ఏ ఎనిమిదింటికో ఇల్లు చేరతాడు. శ్యామల ఒక రకమైన నిస్సహాయతతో వూరుకుంటోంది.

***

బాబుకి ఆరో నెలలో జరిగిందా సంఘటన. ఉదయమే బాబు ఒళ్ళు కొంచం వేడిగా ఉన్నట్టు అనిపించింది శ్యామలకి. సాగర్ అలాంటిదేమీ లేదని చెప్పి బయట పడ్డాడు. మరో రెండు గంటలకి జ్వరం మరీ ఎక్కువైంది. సాగర్‌కి ఫోన్ చేసింది, సెల్ ఇంట్లోనే మోగుతుండటంతో హతాశురాలైంది. వాడి ఒళ్ళు తడిబట్టతో తుడుస్తూనే వున్నది, అయినా వాడి టెంపరేచర్ కంట్రోల్ కావటం లేదు. శ్యామల ఓ ఇరవై వేలు పర్సులో వేసుకొని. బాబుకి కావాల్సినవన్నీ బాగ్‌లో సర్దుకొని, దగ్గిరలో ఉన్న జాబిల్లి పిల్లల హాస్పిటల్‌లో వాడిని చేర్చింది. ముందు పదివేలు కట్టమన్నారు. ట్రీట్‌మెంట్ స్టార్ట్ అయ్యింది. బాబు ప్రక్కనే కూర్చుంది కన్నీళ్లు కారుస్తూ. బంగారు తండ్రి అందంగా, ఆరోగ్యంగా వున్నవాడు తనకు దక్కకుండా పోడు కదా. భయ౦తో వాడి ప్రక్కనే కూర్చుని నిశ్శబ్దంగా ఏడవ సాగింది.

రాత్రి ఎనిమిదవుతుండగా ఇంటికి వచ్చాడు సాగర్. ఇల్లు చీకటిగా ఉండటం, తాళమేసి ఉండటం చూసి గాభరా పడ్డాడు. పక్క వాటాల వాళ్ళని అడిగితే తెలియదన్నారు. ఫోన్ చేద్దామని జేబులు తడుముకొన్నాడు. సెల్ లేదు. డూప్లికేట్‌ కీతో తాళం తీసి లైట్ వేసి చూసాడు. సెల్ ఛార్జింగ్ పెట్టి మరచి పోయాడు. బాబు కేమైందోనని హడలిపోతూ తాళమేసి ఎప్పుడూ వాడిని చూపించే హాస్పిటలకి వెళ్ళాడు. శోకదేవతలా ఉన్న శ్యామలని చూసి గాభరాగా ఏదో అడగబోయాడు, జవాబు ఇవ్వకుండా తల తిప్పుకుంది ఆమె.

ఆ రాత్రి డిస్చార్జ్ చేస్తానన్నాడు డాక్టర్. శ్యామల ఇంటికి వెళ్ళటానికి భయపడింది. “ఫర్వాలేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నాలుగింటినుంచీ జ్వరం కంట్రోల్‌లో వుంది, మీరు ఏ టైం కి వచ్చినా డ్యూటీ డాక్టర్ ఉంటాడు. రేపు ఉదయం ఒకసారివచ్చి బిల్ సెటిల్ చేసుకోండి” అన్నాడు.

సాగర్ బాబుని ఎత్తుకొనేలోపే శ్యామల వాడిని భుజాన వేసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కింది. సాగర్ ఆమె వెనకే వచ్చాడు. పక్క, బట్టలు మార్చి బాబుకి పాలిచి పాడుకోబెట్టి కుర్చీ వేసుకొని ప్రక్కనే కూర్చుంది.

బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు సాగర్, “బాబు దగ్గిర నేనుంటాను, నువ్వు స్నాన౦ చేయి”

“మీరు చేయండి, బయటకు వెళ్లి తిని రండి, మళ్ళీ ఆదివారం రేపు, రోజంతా ఆడాలి కదా”

“పొరపాటైందని చెప్తున్నాను కదా” అనుకోకుండా అతని మాట గట్టిగా వచ్చింది.

శ్యామల నవ్వింది, “ఇదిగో ఈ అరుపుల మధ్య నా బిడ్డ ఎదగకూడదనే ఈ రెండేళ్లు నోరు మూసుకొన్నా, నా సంపాదన నా ఇష్ట౦ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నేనేం చెయ్యాలి? రోజూ మీతో తగాదా పెట్టుకొని, నేను పెరిగిన వాతావరణం లోనే నా బిడ్డని పెంచదల్చుకోలేదు. మీలో మార్పురాదు, మీరిచ్చే డబ్బు ముందు ముందు ఏమాత్ర౦ సరిపోదు. మిమ్మల్ని ఎంత గారాబంగా పెంచారో మీకు గుర్తులేదా, మూడేళ్ళనించీ జాబ్ చేస్తున్నారు, మామయ్యా గారికేమైనా ఇచ్చారా, కనీసం ఆరునెలలు అక్కడున్నానే, నెలకి వెయ్యి చొప్పున ఇచ్చారా ఆయనకి, మా అమ్మా,నాన్న లాంటి దౌర్భాగ్యుల ఇంట్లో పెరిగిన నన్ను మీరిలా హీనంగా చూడక ప్రేమగా చూస్తారని నేనేమీ ఆశపడలేదు. కనీసం ప్రణవ్ కోసమైనా మీ బాధ్యత తెలుసుకొంటారనుకొన్నా” దుఃఖంతో అంతకంటే మాట్లాడలేక పోయింది శ్యామల.

“వెళ్ళండి, వెళ్ళి హోటల్‌కి వెళ్ళి తినేసి వచ్చి పడుకోండి.”

సాగర్ చాలా సేపు బ్రతిమిలాడి, ఆమె స్నాన౦ చేసి వచ్చిందాకా బ్రతిమిలాడుతూనే వున్నాడు. శ్యామల చివరికి స్నాన౦ చేసి వచ్చింది. హోటల్‌కి వెళ్ళి ఇద్దరికీ ఇడ్లీ పార్సెల్ తెచ్చాడు. పాలు కాగబెట్టి ఆమెతో బలవంతంగా తాగించేడు. రాత్రంతా ఇద్దరూ వంతులేసుకొని కాపలా కాసారు.

బాబు మామూలుగా అయ్యేంతవరకు ఎంతో బాధ్యతగా వున్నాడు సాగర్. మూడు వరుస సెలవలు వచ్చాయి. శ్యామలని తీసుకొని ఇంటికెళ్ళాడు. “చంటివాడికి అంత జ్వరం వస్తే మాకు చెప్పలేదేం” అంటూ కోప్పడింది భ్రమరాంబ.

మర్నాడు సాగర్ తండ్రితో ఏదో మాట్లాడి తొమ్మిదింటికల్లా బయటకి వెళ్ళాడు. పదకొండింటికి ఇంటికి వచ్చాడు, వచ్చి రావటం తోనే తండ్రి కాళ్లకు నమస్కరించాడు. “భ్రమరాంబా” సంతోషంగా పిలిచారు ఆయన. ఆవిడ మనవడిని చంక నేసుకొని వచ్చింది, వెనకే శ్యామల, “అబ్బాయి ఇక్కడే జాబ్ చూసుకున్నాడు, ఇకపై మనతోటే వుంటారు” భ్రమరాంబ మొహం సంతోషంతో వెలిగి పోయింది.

“నాన్నా, ఆ రెండు గదులలో ఉంటాము” ఇంకా ఏదో చెప్పబోయాడు. నారాయణ రావు “నా మనవడిని అద్దె ఇంట్లో వుంచుతానురా” నవ్వుతూ మనవడిని ఎత్తుకొని ముద్దాడారు.

తనతో మాట మాత్రమైనా చెప్పకుండా సాగర్ 35 వేల శాలరీతో కొత్త జాబులో చేరటం, అత్తగారింట్లోనే ఇక ముందు వుండాలని తెలిసి శ్యామల మనసు సంతోషంతో పొంగిపోయింది.

***

అంతా హాల్‍లో క్రింద కూర్చున్నారు. పసివాడు అందరి ఒళ్ళలోకి మారుతూ ఆడుకొంటున్నాడు.

“టీ పెట్టు శ్యామా” అన్నది భ్రమరాంబ.

శ్యామల స్టవ్ మీద నీళ్లు పెట్టి, పంచదార డబ్బా తీసింది. అందులో అన్నీ చిన్న నల్ల చీమలు పట్టాయి.

శ్యామల బయటికి వచ్చి, “అయ్యో అత్తయ్యా, మూత సరిగా పెట్టలేదా, చూడండి చీమలు ఎలా పట్టేసాయో” అంది.

సాగర్ ఆమెకేసి చూస్తూ అన్నాడు “ఇవా, ఇవేం చేస్తాయి, ఎర్రచీమలూ, కరెంటు చీమలు, గండు చీమలని ఉంటాయి, కుట్టాయంటే చచ్చామే, ఇది ఖండసారి పిపీలికం, తిట్టదు, కుట్టదు, నాలాగా ఒంటిమీద సృహ లేకండా దారి తప్పి తిరిగేవాడిని, దారిలోకి తెస్తుంది”

అంతా పెద్దగా నవ్వసాగారు. ఖండసారి పిపీలికం సిగ్గుతో లోపలికి పారిపోయింది.

“పై అరలో పెద్ద డబ్బా వుంది, దానికి అందుతుందో లేదో, నువ్వెళ్లి ఇచ్చిరాపోరా గండుచీమా” నవ్వుతూ అంది భ్రమరాంబ కొడుకుతో

సాగర్ లోపలికి వెళ్ళాడు. ముని వేళ్ళ మీద నిలబడి డబ్బా అందుకోవటానికి ప్రయత్నిస్తున్న శ్యామల చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అడిగాడు “నేనివ్వనా?”

శ్యామల సిగ్గుతో తలవంచుకొని “నాతో ఒక్క మాటైనా చెప్పలేదు” అంది కినుకగా.

“లేదు శ్యామా, జాబ్ వచ్చాక చెబుతామనుకొన్నా, ఇప్పుడు నీ అత్తగారి చల్లని చెట్టునీడలో వుండాలన్నావుగా, ఇంక ఇక్కడే మనం ఉండేది. 35 వేలు శాలరీ, మొత్తం నీ చేతిలో పెడతాను, అంతా నువ్వే చూసుకో, పాత సాగర్‌ని నువ్విక మర్చిపో, నాన్న అంతా చెప్పారు, సారీ శ్యామా చాలా బాధ పెట్టాను నిన్ను.”

సంతోషంతో అతని గుండెల్లో మొహం దాచుకొంది శ్యామల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here