[box type=’note’ fontsize=’16’] అక్టోబర్ 18న కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా – డా. సి.హెచ్. సుశీల గారి ‘కిన్నెరసాని పాటలు – సమీక్ష’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. నల్లపనేని విజయలక్ష్మి. [/box]
[dropcap]ఆం[/dropcap]ద్ర కవితా ప్రపంచంలో అపూర్వ సృష్టిగా, అమృత వృష్టిగా కీర్తించబడిన కిన్నెరసాని పాటల రసగంగా ప్రవాహంలో ఓలలాడుతూ, మానవీకరించబడిన ప్రకృతి గానపు లోతులలో నిలువెల్లా తడిసి మురిసి పోవాలంటే సి.హెచ్. సుశీలమ్మ గారు వ్రాసిన ‘కిన్నెరసాని పాటలు – సమీక్ష’ చదివి తీరవలసిందే.
ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరులో తెలుగు ఉపన్యాసకురాలిగాను, ఒంగోలు మరియు చేబ్రోలు డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్ గాను పనిచేసి పదవీ విరమణ చేసిన డా. సి.హెచ్. సుశీలమ్మగారి ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసమిది. వీరు ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పి.హెచ్.డి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలను అందుకున్నారు.
‘కిన్నెరసాని పాటలు’ విశ్వనాథ వారి రచనలో అష్టదళ పద్మంగా విరిసింది. సుశీలమ్మ గారి సమీక్షలో దశదళ పద్మంగా పరిమళాలు వెదజల్లింది.
చిన్న వాగులు, వంకలు కదలి ఏదో ఒక నదిని చేరడం, ఆ నది అటువంటి చిన్న చిన్న నదీనదాలను ఎన్నింటినో కలుపుకొని సముద్రాన్ని చేరడం సహజమైన విషయం. భద్రాద్రి వెళ్ళే దారిలో ఉన్న కిన్నెరసాని వాగు క్రమంగా ముందుకు సాగి గోదావరిలో కలుస్తుంది. అటువంటి ఒక చిన్న వాగు చుట్టూ చక్కని కథను కల్పించి సమాజంలోని స్త్రీల పరిస్థితిని, వారి జీవన ప్రయాణంలోని ఒడిదుడుకులను చిత్రించి తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయ స్థానాన్ని కల్పించారు విశ్వనాథ.
‘తెలుగుదనం తెట్టు కట్టిన తేనెవాక’ గా కిన్నెరసాని పాటలను కీర్తించిన సుశీలమ్మ గారు భావకవిత్వంలోను, గేయ సాహిత్యంలోను, సమకాలిక సాహిత్యంలోను కిన్నెరసాని పాటల స్థానాన్ని చక్కగా విశ్లేషించారు. కథావస్తువుతో సామ్యం గల ప్రాచీన సాహిత్యంలోని, ఆధునిక సాహిత్యంలోని రచనలను గురించి, షెల్లీ మహాకవి రచించిన ‘ఎరితూజా’ గేయం గురించి వారు చేసిన ప్రస్తావన వారి పరిశోధనా దక్షతను తెలియజెపుతుంది.
సమకాలిక రచనలను పోల్చి చూడడమనేది సాధారణంగా విమర్శక లోకం చేసే పని. అదేవిధంగా అనేకమంది విమర్శకులు కిన్నెరసాని పాటలకు ఎంకి పాటలతో సామ్యం తెచ్చారు. అయితే ఎంకి ప్రత్యేకత ఎంకిదే, కిన్నెర ప్రత్యేకత కిన్నేరదేనని సుశీలమ్మ గారు స్పష్టం చేశారు. ఇద్దరు నాయికలు తెలుగుదనానికి ప్రతినిధులే అయినా ముగ్ధ మనోహరమైన ముద్ద బంతి పువ్వు, స్వచ్ఛమైన పల్లె పడుచు ‘ఎంకి’ అయితే, సుకుమార సున్నితత్వాలకు ప్రతినిధి యైన గులాబీబాల, నాగరికత నేర్చిన వనిత ‘కిన్నెర’ అంటారావిడ. ఎంకి నాయుడుబావల ప్రణయాన్ని వర్ణించిన ఎంకి పాటలలో కథ లేదు. కానీ కిన్నెరసాని పాటల్లో మొదటినుండి చివరివరకు కథ చెప్పబడింది. అందులోనూ మానవ స్వభావాల్ని నదీ పర్వతాలకు ఆరోపించి చెప్పబడిన గేయ కావ్యమని దాని ప్రత్యేకతను వెల్లడించారు.
‘కిన్నెర నృత్యం, కిన్నెర సంగీతం అను రెండు గీతములకు అవసరమేమి కలిగినది?’ అంటూ నండూరి బంగారయ్య గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్రస్తావించిన రచయిత్రి సముద్రునిలో రసావిష్కరణకు ఆ రెండు గీతాలు ఎలా ఉద్దీపనాలుగా నిలిచాయో చక్కగా వివరించారు. విశ్వనాథ వారి ఇతివృత్త నిర్వహణ, శిల్పప్రతిభ ఎంత పటిష్టంగా ఉంటాయో నిరూపించారు.
హైందవ నాగరికత, సంప్రదాయాలను అణువణువునా జీర్ణించుకున్న విశ్వనాథ ఏ ఇతివృత్తాన్ని నిర్వహించినా భారతీయ సంస్కృతి పట్ల తనకు గల గౌరవాన్ని ప్రదర్శించకుండా ఉండడు. అదేవిధంగా ‘కిన్నెరసాని పాటలు’ లోనూ పతివ్రత అయిన స్త్రీ నదిగా మారితే ఆమె కడలిని పరపురుషుడిగానే భావించి కడలిలో కలవడానికి ఇష్టపడక మరోనదిలో (గోదావరిలో) సంగమించడానికే ఇష్టపడినట్లుగా వర్ణించాడు. ఆ విధంగా చిరాయువును, నిత్యం దైవ సాన్నిధ్యాన వర్తించే అవకాశాన్ని పొందిందని చెప్పడం ద్వారా మరోసారి భారతీయ సంస్కృతీ వైభవాన్నిస్పురింపజేసాడు. అలాగే కిన్నెర, కిన్నెర పతి, గోదావరి, కడలిల పాత్రచిత్రణలోనూ మొదటినుండి చివరివరకూ మానవ మనస్తత్వాలను ఆరోపించడంలోనూ, ఒకానొక నీతిని ధ్వనింపజేయడంలోనూ రచయిత చూపిన ప్రజ్ఞను సుశీలమ్మ గారు చక్కగా విశ్లేషించారు.
‘కిన్నెరసాని పాటలు’ లోని రసం కరుణమన్న చివుకుల సుందరరామశర్మ గారి అభిప్రాయాన్ని, విప్రలంబ శృంగారమన్న వావిలాల సోమయాజులు గారి అభిప్రాయాన్ని కూలంకషంగా చర్చించిన రచయిత్రి ఇందులోని అంగిరసం విప్రలంబ శృంగారమేనని తేల్చి చెప్పారు.
అధికభాగం ఖండగతిలో సాగిన ‘కిన్నెరసాని పాటలు’ లోని శబ్ద రామణీయకతను, ఉపమాలంకార వైభవాన్ని, తెలుగుదనాన్ని రచయిత్రి చక్కగా వివరించారు.
నాటక రచయిత కూడా అయిన విశ్వనాథ రచించిన ‘కిన్నెరసాని పాటలు’ గేయకావ్యమైనా అందులో ఆయన అంతర్లీనంగా నాటక లక్షణాలనూ పొదిగిన తీరును విశ్లేషించడమే కాక ‘కిన్నెరసాని పాటలు’ ఎలా మోదాంతమో వివరించారు.
సుశీలమ్మ గారి సమీక్ష ప్రత్యక్ష దృష్టికి అందని మార్మిక సోయగాలపై వెలుగును ప్రసరించి రసజ్ఞులైన పాఠకులకు రసానందాన్ని చేరువ చేస్తుంది. అధ్యాపకులకు, పరిశోధక విద్యార్థులకు ఉపయుక్త గ్రంథంగానూ ఉపయోగపడుతుంది.
***
కిన్నెరసాని పాటలు – సమీక్ష
రచన: డా. సిహెచ్. సుశీలమ్మ
పేజీలు: 108
వెల: ₹100.00
ప్రచురణ:
శ్రీ సిహెచ్. లక్ష్మీనారాయణ పబ్లికేషన్స్, గుంటూరు
ప్రతులకు:
214, నారాయణాద్రి
SVRS బృందావన్,
సరూర్ నగర్
హైదరాబాద్ 500035
ఫోన్: +91 98491 17879