ఆకట్టుకునే ‘కిష్టడి కతలు’

0
2

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ ఆర్. సి. కృష్ణస్వామి రాజు రచించిన 30 కథల సంపుటి ‘కిష్టడి కతలు’. చిత్తూరు జిల్లా యాసలో ‘కిష్టడు’ ప్రధాన పాత్రగా సాగిన ఈ కథలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

గోరింటాకు పెట్టించుకోవాలనుకున్న కిష్టడికి చెంగమ్మ ఓ భయం పెడుతుంది. సంశయంలో పడ్డ కిష్టడు దిగులు చెందుతాడు. వాని బాధను గమనించిన తల్లి వివరం అడిగితే చెంగమ్మ చెప్పిన మాటలు విని – వాళ్ళమ్మ చెంగమ్మని ప్రశ్నిస్తుంది. తానెందుకు అలా చెప్పానో చెప్పి, పిల్లాడికి గోరింటాకు పెడుతుంది చెంగమ్మ. పిల్లలలో ఒక్కోసారి కలిగే అనవసరపు భయం గురించి ‘జంబలకిడి పంబ’ కథ చెబుతుంది.

బడిలో చదువుకునే రోజుల్లో మిత్రుడు టిఫిన్ డబ్బాలోని వడలని కిష్టడు తినేసిన వైనాన్ని ‘ఉద్ది వడ – అయ్యోరోళ్ల సుధ’ కథలో చెబుతారు. అయినా వారి స్నేహం చెక్కు చెదరదు.
‘భలే భారతక్క’ కథలో అక్కాతమ్ముళ్ళ అనురాగాన్ని ప్రదర్శిస్తారు. కథ చివర్లో చమక్కు చదివితీరాల్సిందే.

ఇంటరులో బైపిసి గ్రూపు తీసుకున్న కిష్టడు – లాగులేసుకుని కాలేజీకి పోకూడదని ప్యాంటు కుట్టించుకుంటాడు. డిసెక్షన్ క్లాస్‍లో కప్పలని కోయడానికి కిష్టడు పడ్డ తిప్పలని, ఆడపిల్లల హేళనలని ‘గుండెలు తీసిన మొనగాడు’ కథ చెబుతుంది.

వయసు వస్తున్నా తనకి పెళ్ళి సంబంధాలు చూడడం లేదని బాధపడతాడు కిష్టడు. ముత్యాలన్న ఒక సంబంధం తెస్తాడు. పెళ్ళిచూపులకి వాళ్ళింటికి వెళ్ళిన కిష్టడు ఖంగు తింటాడు. ఎందుకో ‘డి.ఐ.జి. సంబంధం’ కథ చదివి తెలుసుకోవాల్సిందే.

సొంత ఊరు పట్ల మమకారం ఉన్న ఓ యువతి పెళ్ళయి అత్తారింటికి వచ్చినా – తమ ఊరిపై ఆపేక్షని ఎలా నిలుపుకుందో ‘అత్తారింటికి నీలవేణి’ కథ చెబుతుంది.

కిష్టడు ఎనిమిదో తరగతిలో ఉండగా, ఓ రోజు సాంబార్ చేస్తాను, ఇంటి ముందరి మునగ చెట్టు నుంచి మంచి మునక్కాయలు రెండు కోసుకురా అంటుంది అమ్మ. ఇంతలో ఓ మిత్రుడు వచ్చి – రాత్రి ఊర్లో ఒక మీటింగ్ జరుగుతుందని, దానితో కిష్టడి బదులు ఈసారి తాను మాట్లాడుతానని, చెప్పి ఏం మాట్లాడాలో కిష్టడిని అడిగి వెళ్తాడు. మొదట్లో బాగానే మాట్లాడినా సభ చివర్లో పొరపడుతాడు. అసలు అక్కడేం జరిగిందో ‘శ్రద్ధాంజలి’ కథ చెబుతుంది.

దడదడా ఇంగ్లీషులో మాట్లాడే కన్నయ్య అంటే ఆకర్షణ ఉండేది కిష్టడికి. ఇంగ్లీషులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కన్నయ్య దగ్గర ట్యూషన్ చేరుదామనుకున్న కిష్టయ్యకి కన్నయ్య భార్య ఎదురై అసలు నిజాన్ని చెబుతుంది. ‘కువైట్ కన్నయ్య ఇంగ్లీషు ట్యూషన్’  హాయిగా నవ్విస్తుంది. బాహ్య ప్రవర్తనని చూసి మనుషుల్ని అంచనా వేయడం అన్నిసార్లు సరికాదని చెబుతుంది.

తమిళనాడు నుంచి వచ్చిన అతిథిని ఆకట్టుకోవాలని కిష్టడు పడ్డ తిప్పలని ‘ఇరుకు ఇంటిలో కంచి కన్నదాసన్’ కథ చెబుతుంది. చదుతున్నంత సేపూ పెదాలపై నవ్వులు పూస్తూనే ఉంటాయి.

గురవన్న తిరుమల పోతుంటే, హుండీలో వేయమని కిష్టడి వాళ్ళమ్మ కొంత డబ్బు ఇస్తుంది. కానీ అతను హుండీలో వేయకుండా సొంతానికి వాడుకుంటాడు. తప్పయిపోయింది, పాపం చుట్టుకుట్టుందని భయపడిన కిష్టడి అమ్మ కిష్టడిని తీస్కుని కొండకి వెళ్తుంది. ఆ యాత్రా విశేషాలను ‘గోవిందా! గోవింద!!’ కథ చెబుతుంది.

ఊరి బావిలో ఈత కొట్టాలని దూకిన కిష్టడికి ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ విషయం తల్లికి తెలిసి కిష్టడి అన్నలని బావి దగ్గరకు పంపుతుంది. అన్నలు, తోటి పిల్లలు – ఆ ముళ్ళ కంపని ఏరి తగలబెడతారు. అమ్మ ప్రేమని వ్యక్తం చేసిన కథ ‘ముల్లుంటాయి.. భద్రం కొడుకో!’.

బీమా పాలసీలు చేసే శంకరన్నతో బాటు పల్లెలకి వెళ్ళిన కిష్టడికి, శంకరన్నకి ఎదురైన ఓ వింత అనుభవం గురించి ‘దొంగ కోళ్ళు.. ఊరి కట్టుబాటు’ కథ చెబుతుంది.

కిష్టడు ఇంటర్ చదివే రోజులవి. సాలెపురుగును చూసి అబ్బురపడతాడు. ఓ రోజు జలగడు అనే పిల్లాడు వచ్చి రమక్క వాళ్ళ కుక్కపిల్ల బావిలో పడిందని చెప్తాడు. అప్పుడు కిష్టడు బావిలోకి దిగి కుక్కని కాపాడుతాడు, అందుకు ప్రతిఫలం ఏమి అడిగాడో ‘బావిలో దూకేది బ్రహ్మ విద్యా?’ కథ చెబుతుంది.

దారిలో తన కాలికింద పడబోయిన చీమని తీసి భద్రంగా ఒక ఖాళీ అగ్గిపెట్టెలో వేస్తాడు మునస్వామి. జీవహింస మంచిది కాదని తెలిసిన వాడని మునస్వామిని పొగుడుతాడు కిష్టడు. మునస్వామి అన్ని సబ్జెక్టులలో పాసవుతాడు కానీ, హిందీలో ఫెయిలవుతాడు. అప్పుడు హిందీ అయ్యోరు వాడ్ని తిట్టి ఇంట్లో హిందీ తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోమంటారు. సాయంత్రం మునస్వామి ఇంటికి పరామర్శిద్దామని వెళ్ళిన కిష్టడికి మునస్వామి భూతదయ లోని రహస్యం తెలుస్తుంది. అదేంటో తెలియాలంటే, ‘చీమా చీమా.. ఎక్కడి కెళ్తావ్..!’ కథ చదవాల్సిందే.

అప్పుడు కిష్టడు పదో తరగతి చదువుతున్నాడు. ఓ రోజు కయ్యి గెనుమ మీద కూర్చున్న కిష్టడికి తల్లి నారాయణమ్మ లేత బెండకాయలు తినిపిస్తూ ఉంటుంది. అటుగా పోతున్న సాలక్క పిల్లాడికి పచ్చి బెండకాయలు ఎందుకు తినిపిస్తున్నవాని ఆశ్చర్యంగా అడుగుతుంది. అందుకు కారణం, తరువాతి ముచ్చట్లు ‘లెక్కలేయలేను తల్లో’ కథలో చదవవచ్చు.

‘తినగ తినగ వడలు చేదుగుండు’ కథ లోనే కథాంశం ఉంది. కిష్టడికి ఇష్టమని, ఆ రోజు వాడి పుట్టినరోజు అని – తల్లి అంగడిలో వడలు తినమని డబ్బులిస్తుంది. అక్కడ తన వంతు కోసం ఎదురు చూసున్న కిష్టడి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతాయి. పాఠకులకి నవ్వొస్తుంది. వడ మధ్యలో తూటు ఎందుకు పెడతారో కిష్టడి అర్థం కాదు. అమ్మని అడిగితే, ఆమె చెప్పిన జవాబు కిష్టడికి నచ్చదు. ఇక, ఆ రోజంతా వడల విందు జరుగుతుంది కిష్టడికి. పాపం, తినలేక తింటాడు. చివర్లో అయ్యోరితో తిట్లు తిని జ్ఞానం తెచ్చుకుంటాడు.

వారం రోజులుగా వాన కురుస్తూనే ఉంటే, కిష్టడు ఎక్కడికీ పోకుండా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడూ తమ ఇంతికి వచ్చే నారమ్మ ఆ రోజు రాలేదని అమ్మ వాళ్ళింటికి వెళ్ళి చూసి రమ్మంటుంది. నారమ్మ వాళ్ళంటిలో చేపల కూర వండుకుంటున్న రహస్యాన్ని కనిపెట్టిన కిష్టడు – దాన్ని ఊరందరికీ చెప్పేస్తాడు ‘చేప పిల్లకు ఈత నేర్పాలా?’ కథలో.

దాయాదుల పెండ్లికి నారాయణవనం మిత్రుడితో కలిసి వెళ్తాడు కిష్టడు. తమ తోటి వాడయిన చంద్రడు పెళ్ళి కొడుక్కి కాళ్ళు కడగాలి. కానీ తెల్లవారుఝామున వాడెంతకీ పెళ్ళి కొడుక్కు కాళ్ళు కడగనంటాడు. అప్పుడు కిష్టడు చేసిన పనేంటో, సమస్య ఎలా పరిష్కారమైందో ‘వెళ్ళొద్దు బావా.. కాశీకి!’ కథ చెబుతుంది.

‘పంచమి తీర్ఠం పోదాం!’ చక్కని కథ. అమ్మమ్మతోనూ, మిత్రుడితోనూ కలిసి తిరుచానూరు వెల్ళి అమ్మవారి కోనేరులో స్నానం చేయాలని వచ్చిన కిష్టడికి ఎదురైన ఓ సంఘటన వారిని ఎంతో సంతోషపరుస్తుంది.

బుల్లెట్ బండి లేని బావకి ‘బుల్లెట్ బావ’ అని పేరు ఎలా వచ్చిందో కిష్టడికి అర్థం కాదు. అక్కని అడిగి ఆ కథ తెలుసుకుంటాడు ‘డుగ్గు.. డుగ్గు. బుల్లెట్టు బండి’ కథ హాయిగా చదివిస్తుంది.

నాగలాపురం వేద నారాయణ స్వామి గుడికి అమ్మతో కలిసి వెళ్తాడు కిష్టడు. దారిలో కనకక్క ఆనే ఆమె పరిచయం అవుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె, దర్శనం అనంతరం ఎందుకో ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నన్ని రోజులూ ఇలాగే జరుగుతుంది. ఆమె ఏడుపుకి కారణం ఏమిటో ‘కనకక్క కన్నీళ్ళు ఏల పెట్టెనో..’ కథ చెబుతుంది.

ఏడవ తరగతి చదివే రోజుల్లో కిష్టడూ ఏ పని చేసేవాడు కాదు. అమ్మ ఏదైనా పని చెబితే, ఎవరినైనా కాకా పట్టి వాళ్ళ చేత చేయించేసేవాడు. మన పనులు మనమే చేసుకోవాలన్న సందేశాన్ని మహాకవి శ్రీశ్రీ అందించిన వైనాన్ని పురుషోత్తమరావు అనే ఆయన కిష్టడికి చెబుతారు. దాంతో కిష్టడు అమాంతం మారి పోయి తన పనులు తాను చేసుకుంటాడు ‘తిండికి తిమ్మరాజు – పనికి పోతురాజు’ కథలో.

పుత్తూరు వైద్యం గురించి అల్లిన కథ ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు!’. ఏదో ఒకటి చేసి తామూ డబ్బు సంపాదించాలనుకుంటారు బాలాజీ, కిష్టడు. అందుకు వారేం చేశారో, వారి ప్రయత్నాలేమయినాయో తెలియాలంటే ఈ కథ చదవాలి.

కిష్టడి మేనమామ దిగులు గురించి చెప్పిన కథ ‘అల్లుడా.. మజాకా!’. మామ దిగులేమిటో అమ్మ చెబితే తెలుసుకుంటాడు కిష్టడు. మామ కూతురుకి పెళ్ళవుతుంది. అల్లుడు వస్తాడు. వైద్యం చదివిన ఆ అల్లుడికి ఉన్న ఓ భయం వల్ల మామ నలుగురిలో నగుబాటు అవుతాడు.

‘అమ్మ చూపు చల్లన!’ ఆర్ద్రమైన కథ. జీవితంలో ఏం జరిగినా సానుకూల భావంతో తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పిన కథ.

‘ఫోటో చూపిస్త మావా!’ కథ బాల్యంలోని అమాయకత్వాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది. తాను నష్టపోయినా, పసి పిల్లలని ఇబ్బంది పెట్టకూడదనుకున్న ఓ మంచి మనిషి నిబద్ధతని చాటుతుంది.

కిష్టడి అమ్మ తెలివిని చాటే కథ ‘ఉండబ్బాయ్, బొట్టు పెడతా!’. ఆమె మంచితనాన్ని, బంధుప్రీతిని తెలిపేది ‘అత్తా, నీ మనసు మెత్త!’ కథ.

దైవానుగ్రహం ఎలా ఉంటుందో ‘రెండు కళ్ళు చాలవయా, నిను చూడ!’ కథ చెబుతుంది. ఈ కథ చదువుతుంటే, పాఠకులకు కూడా తిరుమలలో తిరుగాడినట్టు ఉంటుంది. తిరుమల యాత్రదే మరో మంచి కథ ‘మూర మర్మమేమి నారాయణమ్మా!’

ఈ కథలు నవ్విస్తాయి, మంచి చెబుతాయి. పాఠకులను ఆకట్టుకునేలా కథని నడిపించడంలో రచయిత కృతకృత్యులయ్యారు. కథలకి తగ్గట్టుగా మాధవ్ గారు అందమైన బొమ్మలు గీశారు. ప్రసిద్ధ రచయిత డా. వి. ఆర్. రాసాని గారు పుస్తకానికి ముందుమాట రాయగా, ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకులు శ్రీ వై.ఎస్. శర్మ గారు వెనుక అట్ట మీద అభిప్రాయాలు అందించారు.

***

కిష్టడి కతలు
రచన: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
ప్రచురణ: సమత పబ్లిషర్స్, విశాఖపట్టణం
పుటలు: 128
వెల: ₹ 140/-
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here