[dropcap]వి[/dropcap]హారి పేరుతో సుప్రసిద్ధులైన శ్రీ జె. ఎస్. మూర్తి రచించిన 15 కథానికల సంపుటి ఇది. కిటికీ తెరిస్తే, దృశ్యం – అదృశ్యం, బహుళరాగం, ప్రశ్న, చేయూత, ఇదీ ముగింపు, ‘నీకు తెలుసుగా నాన్నా!’, అది చూపు ఇది నడక!, కొత్త దృశ్యం, లక్ష్యం తోడు, సహజాతాలు, బొరుసు, చేదోడు, ఆఖరి జవాబు, గొంతు దాటని కేక – ఈ పుస్తకంలోని కథలు.
***
ఈ పుస్తకంలోని కొన్ని కథలపై సాహితీ ప్రముఖులు, అభిమానులు వెల్లడించిన అభిప్రాయాలు ఇవి.
“‘సహజాతాలు’ కథానిక చాలా గొప్ప రచన. దీనిని నేను మూమూలు మాటల్లో ప్రశంసించలేను. మీ కథానికా శైలీ, శిల్పాలు ఎంతో నైపుణ్యవంతమైనది. దీనికి తోడు కథా వస్తువు ఈనాటి సామాజిక అస్తవ్యస్తతకు అద్దంపడుతోంది. మీకు నా అభినందనలు” అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. ఎన్.గోపి పేర్కొన్నారు
“మీరు మంచి కథకులని, ఐదు దశాబ్దాలుగా సాహిత్య రంగంలో లబ్దప్రతిష్టులనీ ఎరిగినవాణ్నే అయినా, ‘సహజాతాలు’ చదివి చాలా ఆనందించాను. వర్తమాన సామాజిక స్థితికి అద్దంపడుతూ గొప్ప కథని రాశారు. అభినందనలు” అని ‘ఈవారం జనవార్త’ మాసపత్రిక సంపాదకులు శ్రీ కె.సత్యనారాయణ అన్నారు.
“‘సహజాతాలు’ ఈనాటి ‘మీడియోకర్ బీటెక్’ల దుర్భర పరిస్థితిని చాలా బాగా చిత్రించింది. కతానికలో మీ కథన చాతుర్యం చదువరుల మనస్సును ఆకట్టుకుంటుంది’ అన్నారు శ్రీ వి.లక్ష్మీనారాయణ.
“కథ ‘కిటికీ తెరిస్తే, ఎంతోమంది కాలేజీ పిల్లల మనసు కోతను ఆర్ద్రంగా ఆవిష్కరించింది. ఆ ఇంటి మనుషుల మధ్యనున్న మాధవిగా మనసు తల్లడిల్లింది. వారి నరకయాతన నిజంగా నిజం. విద్యార్థుల దశవర్ష, హింస ఏ గృహహింస చట్టంకిందకు రాదు. మనసులు విరిగి, మనుషుల తలిదండ్రులతో బంధాలు పగుళ్లు చూపేంతగా ఒత్తిడి ఉండకూడదని నేటి తల్లిదండ్రులు గుర్తెరగాలని చెప్పిన కథ” అన్నారు కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన శ్రీ పి.ఎం.ఇంద్ర.
***
“కొందరు కేవలం కథకులు. కొందరు కవులు. కొందరు లాక్షణికులు, కొందరు విమర్శకులు. ఇవన్నీ సమపాళ్లలో ఉన్న అరుదైన రచయిత విహారి. ఏది రాసినా అందులో తనదైన ముద్ర చూపగలరు. కథల గురించి ఆయన మంచి నిర్వచనాలివ్వగలరు. అంతేకాదు, మంచి కథలేవో రాసి చూపగలరు. చాలా కథలు కాలక్షేపానికి రాయబడి, కాలక్షేపం కోసమే చదవబడతాయి. విహారి కథలు మాత్రం అలా ఉండవు. ఆయన ఎంత గాఢమైన వ్యక్తో, ఆయన రచనల్లో కూడా అంత లోతు కనిపిస్తుంది” అన్నారు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ శ్రీ విహారిగారి సాహితీకృషి గురించి.
***
విహారిగారు ఎప్పుడే మల్లెపుప్పులా గుప్పుమన్న కవి. ఆరితేరి ఔననిపించుకున్న కథకులు. పద్యం పైమెట్టు మీద నిలబడి ఎంత పట్టుగా వ్రాస్తారో – కథనూ అంత పట్టుగా వ్రాయకలిగిన సాహితీ సవ్యసాచి విహారి గారు. సమీక్షలూ, వ్యాసాలూ సరేసరి. అవి పుంఖానుపుంఖాలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాళ్ళనూ, ఎప్పుడో ఎదిగిపోయిన వాళ్ళనూ – వీలైనప్పుడల్లా ఆయన పాఠకులకు సన్నిహితంగా తీసుకొని వస్తూనే వున్నారు” అన్నారు ‘మధురకవి’ రసరాజు.
***
కిటికీ తెరిస్తే.. (విహారి కథానికలు)
రచయిత: విహారి
పేజీలు: 129, వెల: 110/-
ప్రతులకు:
(1) చినుకు పబ్లికేషన్స్,
గరికపాటివారి వీధి,
సురేష్ ప్రొడక్షన్స్ ఎదురు సందు,
గాంధీ నగర్, విజయవాడ 520003.
(2) జె. ఎస్. మూర్తి,
16-11-310/12/A/1/1, గణపతి టెంపుల్ స్ట్రీట్,
సలీంనగర్-2, మలక్‌పేట, హైదరాబాద్ 500036.
ఫోన్: 98480 25600