[box type=’note’ fontsize=’16’] కుట్రలు పన్నిన పిల్లి, నిజాయితీగా ఉన్న కోడి – ఈ రెండిటిలో ఎవరు గెలిచారు? ఆసక్తిగా చదివించే బాలల కథ – శాఖమూరి శ్రీనివాస్ అందిస్తున్న “కోడి – పిల్లి“. [/box]
[dropcap]సీ[/dropcap]తయ్య రైతు. తనొక కోడిని పెంచుతుండేవాడు. తొలుత ఆ కోడిని ఇంటికి తెచ్చినపుడు, తప్పించుకుని వెళ్ళకుండా దాని కాలికో తాడుకట్టి, ఆ తాడు గుంజకు కట్టేసేవాడు. భార్య రాధమ్మ గింజలు చల్లి, ఓ చిన్నగిన్నెలో నీళ్ళూ పెట్టేది. కొద్దిరోజులు మచ్చికయ్యాక ఇక కోడిని కట్టేయడం మానుకున్నారు. కోడికి కూడా పరిసరాలు అలవాటయ్యాయి. ఎక్కడికీ పారిపోవాలన్న ఆలోచనే దానికి రాలేదు. పగలంతా చుట్టుపక్కల చెలిగి, పురుగులను ఏరుకుని తింటూ ఉల్లాసంగా గడిపేదది. సాయంత్రం రాధమ్మ దానినో వెదురుగంప క్రింద ఉంచి గంపపై ఓ బరువైన రాయిని ఉంచేది.
కొద్దిరోజులు అలా గడిచాయి. ఎక్కణ్ణుంచో వచ్చిన ఓ పిల్లి ప్రతిరోజు సాయంత్రం సీతయ్య ఇంటి పరిసరాలలో తచ్చట్లాడసాగింది. కోడికి దాని చూస్తే భయమేసేది. పిల్లి మెల్లగా సీతయ్య ఇంట్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. అది సరిగ్గా సీతయ్య భోజనానికి కూర్చున్న సమయానికే వెళ్ళేది. సీతయ్య తాను తింటూ ఒకటిరెండు ముద్దలు కలిపి పళ్ళెం పక్కన ఉంచేవాడు. అయితే పిల్లి మాత్రం పెరుగన్నం ముద్దల్ని మాత్రమే ఆబగా తినేది. కూరన్నం వైపు కన్నెత్తి చూసేది కాదు. అది గమనించిన సీతయ్య దానికి పెరుగన్నమే పెట్టసాగాడు. సుష్టుగా తిన్నాక అది ఎక్కడికో వెళ్ళిపోయేది! అది ఇంట్లోంచి బయటకు వెళ్ళేదాకా కోడి భయంతోనే గడిపేది. కాలం ఇలా సాగుతూ ఉండగానే శీతాకాలం వచ్చింది.
పెరుగన్నం తిన్న తర్వాత పిల్లి ఇక ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఆర్పిన పొయ్యి దగ్గరకు వెళ్ళి అక్కడున్న బూడిదలో పడుకోసాగింది. పొయ్యిని ఆనుకుని పొంత(నీటి కుండ) ఉంది. ఆ పొంతలోని వేడినీళ్ళ వెచ్చదనానికి దానికి హాయిగా నిద్రపడుతోంది. సీతయ్య, రాధమ్మ కూడా దానిని బయటకు తోలే ప్రయత్నం చేయలేదు. పిల్లిని చూడగానే రాధమ్మకు కోడి గుర్తొచ్చేది. ఆమె కోడిగంప చుట్టూ ఓ గోనెసంచీతో కప్పేది.
ఉదయాన్నే ఇంట్లోంచి బయటకు రాగానే పిల్లి కోడిని పలుకరించేది. కానీ కోడికి మాత్రం దాన్ని చూస్తేనే భయం. మాట్లాడాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నట్లు ఉండేది.
“సీతయ్య ఇంకెంతకాలం నిన్ను సాకుతాడులే! నువ్వు బాగా కండపట్టాక, ఏదో ఒక పండుగరోజు చూసి చప్పరించేస్తాడు. అయినా దిగులుపడకు… నాబోటి వాళ్ళతో స్నేహం చేస్తే ప్రాణాలు కాపాడుకునే ఉపాయం చెబుతాం. అలా మూగదానిలా ఉండిపోతే నిన్నెవరూ రక్షించలేరు…. కాస్త మాట్లాడుతుండు” అని పిల్లి చెప్పి వెళుతుండేది.
ఆ మాటలతో కోడి మరింత బిక్కచచ్చిపోయేది. నోట్లోంచి మాటొస్తే ఒట్టు! తనకు ఎప్పుడు ఈ భూమ్మీద నూకలు చెల్లిపోతాయేమోనని భయపడుతుండేదది.
ఒకరోజు ధర్మయ్య అనే ధనవంతుడు గుర్రపుబండీలో పట్టణానికి వెళ్ళి గ్రామానికి తిరిగొచ్చాడు. ఇంటికి వచ్చాక తన మెడలోని రత్నాలహారం ఎక్కడో పడిపోయిందని గ్రహించాడాయన. వెంటనే బండిని తోలిన రంగడిని పిలిచి, ” దారిలో ఎక్కడో నా హారం పడిపోయింది. అది ఎక్కడ జారిపోయేందుకు అవకాశముంది?” అని అడిగాడు.
“అయ్యా… దారంతా దాదాపు చదునుగా ఉంది. అయితే సీతయ్య ఇంటిముందు, మొన్నటి వర్షానికి మట్టికొట్టుకుపోయి రాళ్ళు తేలి ఉన్నాయి. బండికి అక్కడ ఎక్కువ కుదుపులొచ్చాయి. ఆ సమయంలో మీరు కాస్త కునుకు తీస్తున్నారు కూడా!”
“అలాగా!… అయితే పద. సీతయ్య ఇంటి పరిసరాలలో వెదుకుదాం. ఆలస్యమైతే చీకటి పడుతుంది.” అంటూ ధర్మయ్య, రంగడితో కలిసి హారాన్ని వెదికేందుకు బయలుదేరాడు.
సీతయ్య ఇంటి పరిసరాలలో ఇద్దరూ హారం కొరకు వెదకడం ప్రారంభించారు. గంటసేపు వెదికినా హారం కనిపించలేదు. ఇంతలో పొలం నుంచి వచ్చిన సీతయ్య, రాధమ్మ వారిని చూశారు. రాధమ్మ గంప క్రింద ఉన్న కోడిని బయటకు తీసి కాసిన్ని గింజలు దానిముందు చల్లింది. సీతయ్య ధర్మయ్య దగ్గరకు వెళ్ళి, వెతుకులాటకు కారణం అడిగాడు. ధర్మయ్య జరిగిందంతా చెప్పాడు.
“చీకటి పడుతోంది. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. నేను, నా భార్య వెతికి హారం దొరికితే మీకు తెచ్చిస్తాం.” అన్నాడు సీతయ్య.
“సరే సీతయ్యా… ఎంత వెతికినా హారం మా కంట పడలేదు. నీకైనా కనిపిస్తుందేమో చూడు. దొరికితే సరి… లేకుంటే రేపు బాట వెంబడి వెళ్ళి ఇరువైపులా వెతికి వస్తాం.” అంటూ ధర్మయ్య రంగడితో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు.
చీకటిపడింది. సీతయ్య విషయమంతా రాధమ్మకు చెప్పాదు. ఆమె కిరోసిన్ దీపాన్ని వెలిగించి తీసుకొచ్చింది. దాని వెలుతురులో ఇద్దరూ హారం కొరకు వెదకసాగారు. వారిద్దరి సంభాషణను కోడి వినింది. వారితోపాటు అడుగులు వేస్తూ అది కూడా చుట్టుపక్కల వెదకసాగింది. దీపం వెలుతురులో ఓ పొదలో ఏదో మెరిసినట్టు దానికి కనిపించింది. వెళ్ళి చూసిన కోడికి అక్కడ రత్నాలహారం కనిపించింది. దానిని వెంటనే ముక్కున కరచుకుని తెచ్చి సీతయ్య ముందు నిలబడింది. అది చూసి సీతయ్య ఎంతో సంతోషించాడు. వెంటనే ఆ హారాన్ని తీసుకుని వెళ్ళి ధర్మయ్య చేతిలో ఉంచాడు. ధర్మయ్య ఎంతో ఆనందపడ్డాడు. కృతజ్ఞతగా సీతయ్యకు కాసింత డబ్బు ఇవ్వబోయాడు.
కానీ సీతయ్య ఆ సొమ్ము తీసుకోవడానికి నిరాకరించి, ” ఆ హారం మీది. దానిని వెదికేందుకు నేను ఎక్కువ శ్రమ పడింది కూడా లేదు. పైగా నా కోడి దానిని వెదికి పెట్టింది. ఈ మాత్రం దానికి సొమ్మెందుకు. మీ దగ్గరే ఉంచండి.” అని వెనుతిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి కోడిని పొగుడుతూనే ఉన్నాడు.
మరుసటిరోజు ఉదయం పక్కింటి భీముడు కర్రతో పిల్లిని తరుముతుండడం సీతయ్య గమనించాడు.
“పిల్లినెందుకు తరుముతున్నావు? పాపం అదేం చేసింది?” అని అడిగాడు.
“ఇది ఏంచేసిందో తెలుసా! అందరం పొలానికి వెళ్ళే సమయం చూసుకుని తలుపుసందులోంచి దూరి పాలు, పెరుగు తిని వెళుతోంది. పైగా ఇది చూసి, కొన్ని కుక్కలు సందును పెద్దది చేసి ఇంట్లోకి దూరుతున్నాయి. ఇలాంటిదాని దరిదాపుల్లో కూడా ఉంచకూడదు” మాట్లాడుతూనే చెట్టు చాటున కనిపించిన పిల్లి వైపు కర్రను బలంగా విసిరాడు భీముడు.
’ఇన్నాళ్ళూ ఈ పిల్లిని పెంచుకుందామనుకున్నానే!….’ అని మనసులో అనుకుంటూ గంపక్రింద ఉన్న కోడిని చేతుల్లోకి తీసుకుని, దాని తల నిమురుతూ, “వచ్చే దసరా పండగకు నిన్ను కూర చేసుకోవాలని అనుకున్నాం. ఇక ఆ పని మానుకుంటాం” అంటూ దానిని క్రింద వదిలిపెట్టాడు సీతయ్య.
కోడికి అమితమైన సంతోషం కలిగింది. ప్రాణభయం లేకుండా స్వేచ్ఛగా సీతయ్య కుటుంబంతో కలిసి ఉండసాగిందది. పిల్లి ఇక అటువైపు ఎన్నడూ రాలేదు.
వచ్చినా కోడి దానిని చూసి భయపడే స్థితిలో లేదిప్పుడు!