కొడిగట్టిన దీపాలు-12

0
1

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 12వ భాగం. [/box]

23

తల్లి శ్రాద్ధ కర్మతంతు పూర్తి అయింది. రాజశేఖరం మనస్సులో ఏదో చెప్పలేని దిగులు. కొండంత అండ కోల్పోయినట్లు చాలా బాధ. కళ్యాణి గురించి ఆమె భవిష్యత్తు గురించే అతని ఆందోళనంతా. ‘ఇప్పుడు నాకు కళ్యాణి, కళ్యాణికి నేను తప్ప మమ్మల్ని ఆదరించేవారు, కడుపులో పెట్టుకునేవారు, మా మంచి చెడ్డలు చూసేవారు ఎవరున్నారు?’ అని ప్రశ్నవేసుకున్నాడు.

ఎందుకు లేము అన్నట్టు పరంధామయ్య దంపతులు, విశాలగుప్తా దంపతులు, సుజాత అతని కళ్ళెదుట నిలబడ్డారు.

“అన్నయ్యా! కళ్యాణి బాధ్యత నాకు వదిలిపెట్టు.” అంది శారద.

తన కన్నా చిన్నదయినా ఎంతో ఆరిందాలా అలా మాట్లాడుతున్న శారదను చూడగానే అతని దుఃఖం మరింత ఎక్కువయింది. “మనందరం దురదృష్టవంతులం.” శారద చేయి పట్టుకుని ఏడుస్తున్నాడు. అన్నయ్య కళ్ళు తుడిచి అతనికి ధైర్యం చెప్తోంది శారద. అలా చెప్తున్న శారద వేపు చూస్తున్న రాజశేఖరానికి ‘శారద ఎంతగా ఎదిగిపోయింది. తన తల్లే తనని ఓదారుస్తోందా’ అని అనిపించింది.

“మా ఆయన చాలా మంచివారు. కళ్యాణిని నాతో పంపించు అన్నయ్యా! నేను చూసుకుంటాను” అంది శారద.

“అంత మాట అన్నావు, అది చాలు శారదా. మీ ఆయన ఎంతమంచి మనిషి అయినా భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదురవచ్చు. తండ్రి తరువాత ఇంటి బాధ్యత తీసుకునేది పెద్ద కొడుకు. ఆ బాధ్యతని పెద్ద కొడుకుగా నన్ను తీసుకోనీ. నీవే అమ్మ ఉద్దేశం గ్రహించేవు కదా. కళ్యాణి బాధ్యత నేనే తీసుకోవాలని. అందుచేత మరేం మాట్లాడవద్దు.” సున్నితంగా ఆమె ప్రస్తావన తిరస్కరించాడు రాజశేఖరం. శారద కూడా మౌనం వహించింది.

‘రాజూ! మీ అమ్మా నాన్నతోనే మీ కుటుంబ సంబంధం పోయిందిరా, అలా పోకుండా ఉండాలంటే కళ్యాణి బాధ్యత మాకు అప్ప చెప్పు. మాకూ ఎలాగూ పిల్లలు లేరు. కళ్యాణిని మా పిల్ల అనుకుని సాకుతాము.” విశాలగుప్తా అన్నాడు.

“బాబాయ్! ఈ సమాజంలో రక్త సంబంధం కన్నా స్నేహ సంబంధం, మానవత్వ సంబంధమే గొప్పదని రుజువు చేశావు. ఇప్పటికే మా కుటుంబమంతా నీకెంతో ఋణపడి ఉంది. ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో విధాల మా కుటుంబాన్ని ఆదుకున్నావు. ఇక నీకు బాధ పెట్టదల్చుకోలేదు. అంతేకాదు అమ్మ కోరిక నీవే చూశావు కదా. అన్నగా కళ్యాణి బాధ్యత నేనే తీసుకుంటాను” అన్నాడు రాజశేఖరం విశాలగుప్తాతో.

అతను చెప్తున్నదీ సబబే అనిపించింది విశాలగుప్తకి. మరేం మాట్లాడలేదు.

“నేను మిమ్మల్ని ఇదే మొదటి పర్యాయం అయినా మీ గురించి గొప్పగానే విన్నాను. రాజశేఖరంగారి కుటుంబానికి వాళ్ళ నాన్నగారి సమయం నుండి మీ సహకారమే లేకపోతే ఆ కుటుంబం నడిచేదా? ఆ కుటుంబానికి కుడిభుజంగా నిలిచారు.” అంది సుజాత విశాలగుప్తతో.

“అంతగా నన్ను పొగడకమ్మా. ఏదో ఉడతా భక్తి.”

“అలా అనకండి. ఆ సమయంలో మీ చేసే ఆ చిన్న పాటి సాయం ఎంతో విలువయినది.” అంది సుజాత. ఆ తరవాత విశాలగుప్తా, సుజాత తమ తమ ఇళ్ళకి వెళ్ళారు.

రాజశేఖరం ఆలోచన్లు మరోలా ఉన్నాయి. తమ దగ్గర డబ్బున్నన్నాళ్ళూ లేని అభిమానం పెంచుకుని తన వాళ్ళని ఆదుకునే మిషతో వాళ్ళను చేరదీసి, తన వాళ్ళ చేత వెట్టు చాకిరీ చేయించి డబ్బంతా ఖర్చు పెట్టించేరు తన మేనమామ, అతని భార్య. చిన్నది, వయస్సులో ఉన్న అమ్మాయి కాబట్టి శారద ఆ చాకిరీకి తట్టుకుంది. కాని తన తల్లి విషయం అలా కాదు. అసలే వయస్సు పైబడుతోందా? పై పెచ్చు బండచాకిరీతో రోగాల పాలయింది. చివరకు కేన్సరు పాలై ప్రాణాలు పోగొట్టుకుంది. తన తల్లి చావుకి, శారద జీవితం ఇలా తయారవడానికి, వేణు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి తన మేనమామ అతని భార్య కారణం కాదా? ఇంకా విశాలాగుప్తాతో తనకు కుటుంబానికి ఏ రక్త సంబంధం లేకపోయినా తన కుటుంబాన్ని ఆదుకున్నాడు.

కళ్యాణి బాధ్యత తను వహిస్తానని తల్లికి తను మాట ఇచ్చాడు కాని తను ఏ విధంగా కళ్యాణిని చేరదీయగలడు? తనదే తెగిన గాలిపటం లాంటి జీవితం. గమ్యం లేని – గమ్యం తెలియని బ్రతుకు. ఇటువంటి పరిస్థితుల్లో తను కళ్యాణిని ఎలా తీసుకెల్లగలడు? తల్లికిచ్చిన మాట ఎలా నిలబెట్టుకోగలడు?

ఆలోచిస్తున్న అతని మెదడులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. ఆలోచనతో అతని వదనంలో సంతోష రేఖలు, హృదయంలో ఎన్నో ఆశలు, తను తల్లిని చూడ్డానికి వస్తున్న సమయంలో పరంధామయ్య దంపతులు అన్న మాటలు అతని చెవిలో గింగుర్లాడుతున్నాయి. వాళ్లు తప్పకుండా కళ్యాణిని చేరదీస్తారు. ఆదరిస్తారు. వారి ఆదరణలో కళ్యాణి జీవితం సుఖమయంగా సాఫీగా సాగుతుంది. ఇది తప్ప మరో మార్గం లేదు.

తనది ఎటువంటి పరిస్థితో సుజాతది కూడా అటువంటి పరిస్థితే. ఆమె ఇంటిలో కూడా ఆమె జీవితం అంత సంతృప్తికరంగా లేదని తను గ్రహించాడు. ఆమె స్థితే అలా ఉన్నప్పుడు కళ్యాణి బాధ్యత ఎలా వహించగలదు?

వచ్చీ రాని జ్ఞానం కళ్యాణిది. చాలా అమాయకమైన ముఖం, బెరుకు చూపులు, కల్లాకపటం తెలియని పసిది. బస్సులో వస్తున్న సమయంలో అన్నయ్య వొడిలో తల పెట్టుకుని నిద్రపోతోంది. కళ్యాణి తల్లి చనిపోయిన రెండు రోజుల వరకూ తల్లిని తల్చుకుని ఏడ్చింది.

రాజశేఖరం తల్లిని మరిపింపజేసి చెల్లెల్ని మచ్చిక చేసుకున్నాడు. అప్పటి నుండి కళ్యాణి అన్నయ్యని వదలటం లేదు. తిండి తినిపించటం అతనే. పక్కవేయటం అతనే. నిద్ర పుచ్చటం అతనే. చెల్లెలు ఆలనా పాలనా అన్ని చూడ్డం అతనే ఈ వారం రోజుల్లో వారిద్దరి మధ్యా అంత బంధం ఏర్పడింది. అన్నలా కాకుండా తానే తల్లిదండ్రీ అయి ఆమెకి ఆప్యాయతానురాగాలు పంచి ఇచ్చాడు.

“కళ్యాణి… కళ్యాణి…! లే… లే…! మనూరు వచ్చేసింది.” కళ్యాణిని కుదిపిలేపాడు రాజశేఖరం. కళ్ళు విప్పి చూసిన కళ్యాణి అన్నయ్య మెడలో రెండు చేతులూ వేసి హత్తుకుపోయింది. “భయం లేదు. పద… పద…” అంటూ ఆమె చేతుల్ని విడిపించుకుని ఆ చిన్నారి చేతుల్ని విడిపించుకుని కళ్యాణి చేతులు పట్టుకుని నడిపించుకుంటూ బస్సు దిగాడు రాజశేఖరం.

పరంధామయ్య దంపతుల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు రాజశేఖరం. అతన్ని ఓదారుస్తున్నారు పరంధామయ్య దంపతులు. అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని కళ్యాణి బిక్కమొగం వేసింది. అలా అన్నయ్యని బెరుకుగా చూస్తున్న కళ్యాణిని, పార్వతమ్మగారు ఆప్యాయతగా చేతులు జాచి పిలిచారు కళ్యాణిని.

తన తల్లిని తప్ప తనని ఇంత ఆప్యాయతగా పిల్చిన వారెవరూ ఇంత వరకూ కన్పించలేదు కళ్యాణికి. నాంచారమ్మ ఒక్కసారి గుర్తుకు వచ్చింది. వెంటనే వొణికింది. ఎవ్వరూ చూడకుండా తన లేత బుగ్గల్ని రక్కేది. సొంటి పిక్కలు తీసేది.

“కళ్యాణీ! వెళ్ళమ్మా! ఈవిడ కూడా నీకు అమ్మలాంటిది” రాజశేఖరం అన్నాడు. మెల్లమెల్లగా బెరుకుపోయిన కళ్యాణి పార్వతమ్మ వేపు అడుగులేసింది. క్రమంగా అమరికలు లేకుండా తమలో కల్సిపోతున్న కళ్యాణిని చూసి ముచ్చటపడ్డారు పరంధామయ్య దంపతులు, సుజాత.

పార్వతమ్మ సంరక్షణలో అమె అప్యాయతతో తల్లిని కూడా మర్చిపోగలుగుతోంది కళ్యాణి.

సమయం ఉన్నప్పుడల్లా వచ్చి సుజాత కళ్యాణికి చదువు చెప్తూ ఉండేది. సుజాత దగ్గర కళ్యాణికి రోజు రోజుకి చనువు పెరుగుతోంది. తల్లి చనిపోగానే అన్నయ్యని వదలక అతడ్ని పెనవేసుకుపోయిన కళ్యాణి ఇప్పుడు ఆ ఇద్దరు ఆడవాళ్ళని తన ముద్దు ముద్దు మాటల్తో మురిపించి వారిని జీవితంతో పెనవేసుకుపోయింది. పార్వతమ్మ అంటే ఆ పసిదానికి మమత – అనురాగమయితే సుజాతంటే భక్తి గౌరవం.

సుజాత కళ్యాణికి చదువు చెప్తుంది. అది రాజశేఖరానికి తృప్తినిచ్చింది. ‘తను లేకపోయినా పరవాలేదు. కళ్యాణికి తను ఉండకూడదని కాదు. సుడిగుండంలో చిక్కుకున్న నావలాంటి బ్రతుకు బ్రతుకుతున్న తన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏఁటవుతుందో తెలియదు. ఈ స్వాతంత్ర్య పోరాటం అనే అగ్నికి ఆహుతేనా అవచ్చు. అటువంటి చాలా చికాకు పడవల్సివస్తుంది. అందుచేత ఇదీ ఒకందుకు మంచిదే. కళ్యాణి తనను మరిచి పార్వతమ్మ, సుజాతల సంరక్షణలో ఉన్నత స్థాయికి చేరుకోగలదు. మమతానురాగాలు చవిచూడగలదు’ అనుకున్నాడు రాజశేఖరం.

ఓనాడు తను ఈ భావన్నే సుజాత ముందు వెల్లడించాడు. “ఛ…! ఏంటా అపశకునం మాటలు? మీరు సుఖంగా ఉంటారు. మీరు అనుకున్నంతగా – ఊహించనంతగా జీవితం నామరూపాలు లేనంతగా నాశనం అవదు. ఆ నమ్మకం నాకుంది. మీ ఆశ నెరవేరుతుంది. మీ ఆశయం ఫలిస్తుంది. కోరిక సఫలీకృతం అవుతుంది. చివరికి మనం అశించిన దేశ స్వాతంత్ర్యం సిద్ధించి మనిద్దరం ఒకటవుతాము.” తన విశాలమైన కళ్ళలో విశ్వాసం తొణికిసలాడుతూ ఉండగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా రాస్తూ అందామె. ఆమె కర స్పర్శలో అనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంగా ఆమె వంక చూస్తూ “అలా అయిన పక్షంలో మనమిద్దరం చాలా అదృష్టవంతులం” అన్నాడు రాజశేఖరం.

“అలా జరగదనా మీ అనుమానం?” అలా అన్న సుజాత ముఖంలో అకస్మాత్తుగా రంగులు మారటం వలన విషాద భావం అగుపడింది అతనికి. అంత వరకూ ఆ కన్నుల్లో ఉన్న విశ్వాసానికి బదులు భయం – పిరికితనం, అపనమ్మకం, భావాలు అగుపించాయి.

ఆమె మానసిక స్థితి గమనించిన అతను ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. “మన జీవితాలు సఫలీకృతం అవవని, మన ఆశలు నెరవేరవని, మన కోరికలు పేకమేడల్లా కూలిపోతాయని కాదు నా భావన. ఏదీ మన చేతుల్లో లేదు. మనం నిమిత్త మాత్రులం మాత్రమే. ఎప్పుడు ఏఁటి జరుగుతుందో చెప్పలేం” ఇలా అంటున్న అతని మాటల్లో నిర్లిప్తత అగుపించింది.

“సుజా…!!!” అతను పిలిచాడు.

“ఊఁ!!!” ఆమె పలికింది.

“అలా జరుగుతుందని కాదు నా భావన. ఒకవేళ నేను రేపొద్దున్న ఏంటయినా కళ్యాణి బాధ్యత నీ…!” అతను ఆ మాటలు పూర్తి చేయకుండానే అతని పెదవులపై తన చూపుడు వేలుంచి అతడ్ని వారించింది సుజాత.

అతని మాటలు ఆమెను కలవరపాటుకి గురి చేస్తున్నాయి. “మీరు మరెప్పుడూ అటువంటి మాటలు మాట్లాడవద్దు. అలాంటి మాటలు తలుచుకోడానికే భయంగా – బాధగా ఉన్నాయి. మన నిజ జీవితంలో అటువంటి రోజులు రావద్దని కోరుకోండి శేఖర్…..! ప్లీజ్ ఆ మాటలు నేను భరించలేను. మీ జీవితంలో భాగం పంచుకోబోతున్న నా ఈ కోరిక నెరవేరుతుంది కదూ…! నెరవేరాలని నేను కంటికి కనిపించని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.” అంది. ఆమె కళ్ళల్లో బేలతనం చూసి అతను నొచ్చుకున్నాడు.

జాలిపడ్డాడు. “హే భగవాన్! ఈ అమాయకురాలి కోరికల్ని భగ్నం చేయకు” అని భగవంతుడ్ని మనస్సులోనే ప్రార్థించాడు. అంత గొప్ప సాహిత్యంతో, తన రచనలో అందర్నీ చైతన్యం చేసిన విప్లవకారిణి అతనికి ఆ సమయంలో ఓ అమాయకురాల్లా అగుపడింది.

దినమంతా లోకానికి తన వేడి, వెలుతురు ప్రసాదించి అలిసిపోయి విశ్రాంతి తీసుకోడానికి పడమటి కొండల్లోకి పయనమవుతున్న దినకరుని వేపు చూస్తూ మౌనంగా కూర్చున్నాడు రాజశేఖరం.

24

కాలచక్రం అలా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. అది ఎవరి కోసం, దేని కోసం ఆగదు. సాగిపోవడమే దాని పని. సెకెండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, రోజులుగా, నెలలుగా, నెలలు సంవత్సరాలుగా అలా కాలం సాగిపోతూనే ఉంది.

కాలంతోపాటే సమాజంలో అనేక మార్పులు. మనుష్యుల సామాజిక జీవితంలో అనేక మార్పులు. మార్పు ప్రకృతి సహజం. మార్పుకి లొంగనిది సృష్టిలో ఏదీ లేదు. వృద్ది క్షయాలే మార్పులే. ప్రకృతిలో ఏ పదార్థానికి నాశనం లేదు. మార్పు మాత్రమే ఉంటుంది. అంటే అది రూపం మాత్రమే మార్చుకుంటుంది. కర్రనే తీసుకుంటే అది కాలుతుంది. బొగ్గు అవుతుంది. అది భూడిద అవుతుంది. భూడిద మట్టి అవుతుంది. అలాగే నీరు ఆవిరవుతుంది. మేఘ రూపం దాల్చుతుంది. ఆ మేఘం తిరిగి నీరు అవుతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ మార్పుల్ని పరిశీలించడమే గాని మార్చడం అసాధ్యం, అసంభవం కూడా.

ప్రకృతిలో మార్పులున్నట్టే మానవ మనుగడలో కూడా అనేక మార్పులు. రాజశేఖరం ఒక వేపు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూనే సుజాత చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలకి తనవంతు సహకారం అందిస్తున్నాడు. పూర్తిగా పరంధామయ్య దంపతులపై ఆధారపడకుండా ఆ పాఠశాల నడపగా వచ్చిన డబ్బును పరంధామయ్య దంపతులకి ఇస్తున్నారు రాజశేఖరం, సుజాత. ఇలా కళ్యాణి తను ఉండడం వలన ఆర్థికంగా ఆ దంపతులకి భారం అవకూడదని రాజశేఖరం భావన.

ఏ పనినైనా మనం ఓ ఆదర్శం కోసం, ఓ మంచి కోసమేనా ఆరంభిస్తాము. లోకోభిన్న రుచి అన్నట్లు మనం మంచి అని ఆరంభించిన పని అది ఎదుటి వాళ్ళకి మంచి అని అనిపించకపోవచ్చు. ఎదుటివాళ్ళు మంచి అనుకొన్నది. మనకి హాని కలిగిస్తుందని మనం అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చింది.

సుజాత ఇలా రాజశేఖరంతో కలిసి తిరగడం, వాళిద్దరూ కలిసి పాఠశాల నిర్విర్తించడం సీతమ్మకి నచ్చలేదు. అందుకే భర్త దగ్గర చాలా సార్లు ఈ విషయం గురించే ప్రస్తావన తెచ్చేది. ఎలాగేనా తండ్రి దృష్టిలో సుజాతను చెడ్డదానిగా నిలబెట్టాలన్నదే ఆమె ఉబలాటం. అయితే సీతమ్మ గురించి తెలిసిన అతను మౌనం వహించేవాడు. సుజాతను సమర్థించలేదు. భార్యని సమర్థించలేదు. అందుకే సుజాతను చరిత్రహీనురాలిగా చిత్రీకరించాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. తను అనుకున్నది జరగకపోయే సరికి ఆమె నిరాశపడింది.

అలా నిరాశపడ్డం తాత్కాలికమే తన మనస్సుకి నచ్చజెప్పుకోడానికి ప్రయత్నించింది. ‘తను అనుకున్నది సాధించాలంటే నైపుణ్యం తెలివితేటలూ, కృషి, పట్టుదల వాటితోపాటు నిరంతరం శ్రమ అవసరం. ఇవన్నీ ఉన్నా ఒక్కొక్క సారి విజయం మనల్ని వెలివేస్తుంది. అపజయం అక్కున చేర్చుకుంటుంది. అంత మాత్రాన్న క్రుంగిపోకూడదు. మథనపడకూడదు. నిరాశ చెందకుండా మన సాధన మనం చేయాలి’ ఇలా తన మనస్సుకి సర్ది చెప్పుకుంది సీతమ్మ.

అంత తొందరగా తన ఓటమిని అంగీకరించే మనిషి కాదామె. సుజాత చేసినవి తప్పు కాకపోయినా, తప్పు అన్నదే ఆమె భావన. దాన్ని బూతద్దంలో అందరికీ చూపించి ఆమెను తిరిగి తలెత్తుకుని తిరగకుండా ఉండేటట్లు చేయడానికి కారణాలు వెతకసాగింది. పథకాలు వేయసాగింది సీతమ్మ.

తగిన సమయం రాకపోతుందా? అప్పుడు తన పంతం నెగ్గించకుండా ఉంటానా అని అవకాశం కోసం ఎదురు చూస్తోంది.

రోజు రోజుకి స్వాతంత్ర్య పోరాటం ఉదృతం అవుతోంది. “తెల్ల దొరల దొరతనం – పెత్తనం మాకొద్దు. మా దేశ పరిపాలన మేమే చేసుకుంటాం. మా దేశం విడిచివెళ్ళాలి.” అని దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహగర్జనలు నలు దిక్కులూ మారుమ్రోగుతున్న సమయం అది ప్రతీ భారతీయుడు బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేతిలో భారత జెండా పట్టుకుని ముందుకు కదుల్తున్నారు.

ఆనాడు విదేశ ప్రభుత్వం విభజించి పాలించు అనే రాజనీతిని ఉపయోగిస్తున్నారు. ఈనాడే కాదు ఆనాడు కూడా సమాజంలో సమాజంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థించిన వారున్నారు, విమర్శించే వారున్నారు. విదేశీయ పరిపాలకులు ప్రజల్ని వర్గాలుగా చీల్చి పరిపాలన చేయడానికే ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.

భారతదేశ వాసులు వారి కుటిల నీతి ప్రకారం రెండు వర్గాలుగా విడిపోయారు. అప్పటి ప్రభుత్వాన్ని సమర్థించిన వారు ఒక వర్ణమయితే వ్యతిరేకించిన వారు మరో వర్గం. కొంతమంది ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తే ఫలితంగా లబ్ధి పొంది ఉన్నత పదవులు పొందారు. అయితే సమర్థించిన వారంతా వారి మీదున్న భక్తి గౌరవంతో సమర్థిస్తున్నారా అంటే అదీ లేదు. వారి పబ్బం గడువుకోడానికే అలా చేస్తున్నారు. లేకపోతే గౌరవిస్తున్నట్టు, సమర్థిస్తున్నట్టు, ఆదరిస్తున్నట్టు నటిస్తున్నారేమో అని అనిపిస్తుంది.

ఆనాడే కాదు, ఈనాడు కూడా కొన్ని విషయాల్లో అప్పటి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ స్వార్థపరత, సంకుచిత్వం అని అనిపిస్తుంది.

రాజశేఖరం, సుజాత పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. ఇంతలో చాలా మంది పాఠశాల దగ్గరికి వచ్చారు. “రాజశేఖరం గారూ! మన నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి జేల్లో నిర్భందించారు. మనం వాళ్ళని విడిపించాలి. రండి” అన్నారు. వెళ్ళడానికి సిద్ధపడ్డాడు రాజశేఖరం.

ఎందుకో ఆ సమయంలో అతను అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అనిపించింది సుజాతకి. అయితే ఆమె అతడ్ని వారించలేకపోయింది. ఆమె స్థితి అడకత్తెరలో పోక చక్కలా తయారయింది. బుద్ధిగా చదువుకుంటున్న అతడి మనస్సుని స్వాతంత్ర్య పోరాటం వేపు మళ్ళించింది తను. అలాంటిది తనే ఇప్పుడు వెళ్ళద్దు అని ఎలా చెప్పగలదు? అందుకే వారించలేకపోయింది కాని ఆమె మనస్సులో ఏదో దిగులు ఏదో చెప్పలేని బాధ.

పరంధామయ్య గారి పరిస్థితి అంతే. అతనికి కూడా ఆ సమయంలో రాజశేఖరం ఇల్లు వదిలి వెళ్ళకుండా ఉంటే బాగుండును అని అనిపించింది. కాని అతను కూడా వారించలేకపోయాడు రాజశేఖరాన్ని.

రాజశేఖరం కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఆందోళనకారులతో కలిసి ముందుకు అడుగులేస్తున్నాడు. సింహగర్జనలు చేస్తున్న వారి గొంతుకలో గొంతుక కలిపి వీరావేశంతో ముందుకు వెళ్తున్నాడు అలా ముందుకు చొచ్చుకు వస్తున్న వాళ్ళని పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సాధ్యం కావటం లేదు. అలా ముందుకు చొచ్చుకు వస్తున్న వాళ్ళని కొంతమందిని బలవంతాన్ని జేలుకి తరలిస్తున్నారు. ఇంకా అసాధ్యమనిపిస్తే పిట్టల్ని కాల్చినట్టు కనిపించిన వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నారు. అలా కిరాతకంగా అణచి వేస్తున్నారు. అలా వారి ఉక్కు పాదాల క్రింద నలిగిపోయిన వారెందరో నామ రూపాలేకుండా పోతున్నారు.

తుపాకి దెబ్బలకి గురై అసువులు బాసిన వారి శవాలు అలా ఉంచుతే మరింత ఉద్రేక వాతావరణం ఏర్పడుతుందని శవాల్ని ఖననం చేయడం వెంటనే జరిపించేస్తున్నారు.

రాజశేఖరం జాడలేదు. అరెస్టు చేసి జేల్లో పెట్టిన వాళ్ళలోనేనా రాజశేఖరం ఉండాలి. లేకపోతే చనిపోయిన తరువాత ఖననం చేసిన వాళ్ళలోనేనా ఉండచ్చు అనుకుంటున్న సుజాతకి అంతులేని దుఃఖం పొంగిపొర్లుకోస్తోంది. గుండెలు బాధతో బరువెక్కాయి. ఆమె కలవరపాటుని – దుఃఖాన్ని చూస్తున్న పరంధామయ్య గారికి, పార్వతమ్మ గారికి రాజశేఖరానికి, ఆమెకి మధ్యనున్న అనుబంధం అర్థమయింది. వారు ఆమెను ఓదారుస్తున్నారు.

“సుజాతా! రాజశేఖరానికి ఏ హానీ జరగదు. మాకు అలా అనిపిస్తోంది. నీవు అలా బేలగా తయారయి బెంబేలెత్తి పోతే ఎలా? యోగ్యురాలివి. చదువుకున్న దానివి. మేము నీకు చెప్పక్కర్లేదు. ఎటువంటి కష్ట పరిస్థితినేనా ఎదుర్కొనే ఆత్మసైర్యం నీలో ఉంది.” పరంధామయ్యగారు అన్నారు. అతని మాటలు సుజాతకి మనో నిబ్బరానికి బదులు దిగులు కలగజేస్తున్నాయి.

“అమ్మాయ్! నీవే అలా డీలా పడిపోతే ఎలా? చిన్న పిల్ల కళ్యాణి సంగతి ఆలోచించేవా? కళ్యాణి మరింత దిగులు పడుతుంది. కళ్యాణి బాధ్యత శేఖరం బాబు నీకప్పగించాడు. అది గుర్తించుకో” పార్వతమ్మ అంది. సుజాతకి వాళ్ళ మాటలు వినగానే తన కర్తవ్యం ఆ సమయంలో ఏంటో తెలియ వచ్చింది. స్థిర నిర్ణయానికి వచ్చిన ఆమె కన్నీళ్ళు తుడుచుకుంది.

కళ్యాణిని చూడగానే దుఃఖం పొంగిపొర్లుకొస్తోంది సుజాతకి. ఆమెను పట్టుకుని ఏడ్వాలనిపించింది కరువుదీరా. అయినా తమాయించుకుంది. ఓసారి రాజశేఖరం తనతో అన్న మాటలు ఆమె చెవిలో గింగుర్లాడుతున్నాయి.

“కళ్యాణికి, నీ దగ్గర, పార్వతమ్మ గారి దగ్గర చనువు పెరిగింది. ఇదీ ఒక విధంగా మంచిదే. రేపొద్దున్న నేను కళ్యాణికి దూరమయినా తట్టుకోగలదు.” రాజశేఖరం అన్నమాటలు గుర్తుకు రాగానే ఆమెలో బాధ మరింత ద్విగుణీకృతం అయింది.

రాజశేఖరం జ్ఞాపకాలు సుజాతను వెంటాడుతూనే ఉన్నాయి. ‘ఇటువంటి సమయంలో ఆమెను ఒంటరిగా ఉండనీయకూడదు. ఏదో వ్యాపకంలో నిమగ్నురాల్ని చేయాలి.’ అనుకున్నారు పరంధామయ్యగారు. తన ఉద్దేశ్యాన్ని సుజాతకి తెలియపర్చారు ఆయన. ఆమెకి కూడా అలాగే అనిపించింది. అలా అనుకుంది కాని అంత సులువుగా రాజశేఖరం చేష్టలూ – మాటలూ తన స్మృతి పటలం నుండి తొలగించుకోగలవా? అది తనకి సాధ్యమవుతుందా? తను అతని చుట్టూ అల్లుకున్న ఆశల లతను – కన్న కలల్ని త్రుంచి వేయగలదా?” ఇలా ఆలోచిస్తోంది సుజాత.

కాలమే అన్ని ప్రశ్నలకి, సమస్యలకీ నమాధానం ఇవ్వగలదు. కాల ప్రవాహంలో కొట్టుకుపోతే ఏదీ అసాధ్యమైనది లేదు. కాలమే అన్ని సమస్యలకీ పరిష్కార మార్గం సూచిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here