Site icon Sanchika

కొడిగట్టిన దీపాలు-13

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 13వ భాగం. [/box]

25

[dropcap]స్వ[/dropcap]చ్ఛమైన పాలలో అవగింజంత విష బిందువు కలిసినా ఆ పాలన్నీ విషపూరితమవుతాయి. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం, సుందరామయ్య స్వచ్ఛమైన పాలవంటి మనసు కలవాడు. అతనికి కూతురి మీదున్న అభిమానం, అనురాగం స్వచ్ఛమైన పాలవంటివే. కూతురు మీద – మాటల మీద అతనికి అపారమైన నమ్మకం ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లి లేని పిల్ల అని సుజాత మీద అతను జాలిపడ్తూ ఉంటాడు కూడా.

తన కూతురు యోగ్యురాలు. దేశ భక్తితో కూడిన తన రచనల ద్వారా భారతీయుల్లో దేశ భక్తిని కలిగిస్తూ వారిని చైతన్య పరచడం చూసి ఆ తండ్రి గర్వపడేవాడు.

అటువంటి స్వచ్ఛమైన పాలవంటి మనస్సుగల ఆయన్ని మార్చడానికి ప్రయత్నిస్తోంది సీతమ్మ. దానికి ముఖ్య కారణం భావోద్వేగాల్లో ఒకటియిన ‘ఈర్ష్య’, అదే అసూయ. అందుకే అందరూ అంటూ ఉంటారు అసూయ ముందు పుట్టింది. ఆ తరువాతే ఆడది పుట్టిందని.

సుజాత మీద సీతమ్మకి ఈర్ష్యకి కారణం ఉంది. తన భర్త తన కూతురు రాధ మీద కంటే సవతి కూతురు సుజాత మీద ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. ఇద్దరిలో ప్రవహిస్తున్నది తన రక్తమయినప్పటికి, భర్తకి రాధకంటే సుజాత అంటేనే ప్రేమ.

సీతమ్మ ఎలా ఆలోచిస్తోందో రాధ కూడా అలాగే ఆలోచిస్తోంది. అమెకి కూడా సుజాత అంటే అసూయ. దానికి మొదటి కారణం తండ్రి తనకంటే సుజాతను ఎక్కువ అభిమానించడం. రెండో కారణం తను అభిమానించి, ప్రేమిస్తున్న మేనమామ తన మీద ప్రేమ చూపించకుండా, సుజాత మీద ఆపేక్ష పెంచుకున్నాడు. ఎంత విచిత్రం. తను శేషును ప్రేమిస్తోంది. తనవాడిగా చేసుకోవాలనుకుంటోంది. అయితే శేషు మాత్రం సుజాతను కోరుకుంటున్నాడు. ఇవే కారణాలు సుజాత మీద రాధ ఈర్ష్య పడడానికి, ద్వేషించడానికి.

“ఏవండీ!” అనుకూల సమయం చూసి గోముగా పిలిచింది సీతమ్మ భర్తని. ఆమె అలా పిలిచిందంటే ఏదో విశేషమైన విషయం ఉందనిపించింది ఆ లాయరు సుందర్రామయ్య బుర్రకి.

“ఏంటి విశేషం?” కళ్ళెగరేసి అడిగాడు భార్యని ఆ న్యాయవాది.

“అదేనండి మన సుజాతకి పెళ్ళి చేయాలి. కన్న తల్లిని కాకపోయినా తల్లి స్థానంలో ఉన్న నేను సుజాతకి పెళ్ళి చేయాలని ఆలోచించకపోతే మరి ఎవరు ఆలోచిస్తారు. ఏ వయస్సులో జరగవల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలి. వయస్సు ముదురుతే తగిన పెళ్ళి కొడుకు రావడం కష్టమే. వయస్సు పై బడుతున్న కొద్దీ ఇప్పుడున్న అందం, ఆకర్షణ ఉండవు.”

భార్య మాటలు విని తేలిగ్గా ఊపిరి పీల్చాడు సుందర్రామయ్య. ‘ఓస్! ఇంతేనా? ఇంకేదో అడిగి తనని ఇరకాటంలో భార్య పెడ్తుంది’ అని అనుకున్నాడు ఆ న్యాయవాది.

“చూద్దాం! చేద్దాం!” అని ముక్తసరిగా అన్నాడు. అతను అలా అనడం సీతమ్మకి నచ్చలేదు.

“మీరు అలా చేద్దాం – చూద్దాం అంటే సరిపోదు. వెంటనే జరిపిద్దాం. అలాగే అని ఎందుకనరూ?” కొంత విసుగును కనబరుస్తూ అంది ఆమె.

“నీతో వచ్చిన తంటా అదే. లేచిందే లేడికి ప్రయాణం అన్నట్టు మాట్లాడుతావు. అనగానే అన్ని పనులూ అయిపోతాయా? ఆడపిల్లకి పెళ్ళి చేయాలంటే ఎన్ని విషయాలు చూసుకోవాలి. అయినా పెళ్ళి కొడుకు అంటే అంగట్లో దొరికే వస్తువు అనుకున్నావా? సుజాతకి యోగ్యుడైన వరుణ్ని వెతకాలి. సంతృప్తి కలిగిన తరువాతే సుజాత పెళ్ళి.”

సీతమ్మకి భర్త మాటలు నచ్చలేదు. “బాగుంది మీ వరుస. మీ లాంటివాడే కండువా భుజం మీద ఉండగా కండువా ఎక్కడో పోయిందని నాలుగు మూలలా గాలించాడుట.”

“సీతా! నీ మాటలు లాయరు బుర్ర అయిన నాకే అర్థం కావటం లేదు.”

“అందుకే అంటున్నాను. అన్ని విషయాల్లో మీ లాయరు బుర్ర పని చేయదని.”

“పోనీ అసలు విషయం ఏదో చెబ్దూ!”

“అదేనండి. మన శేషు. అదే మా తమ్ముడు శేషుకి సుజాతనిచ్చి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుందంటారు? వాడు సుజాతను ఇష్టపడుతున్నాడు కూడా.”

“శేషుకా?” సుందర్రామయ్య విస్మయంగా నొసలు చిట్లించి అడిగాడు. ఎందుకంటే అతనికి శేషు మీద మంచి అభిప్రాయం లేదు. అంతే కాదు శేషు తన కూతురికి తగినవాడు కాదని అతని అభిప్రాయం.

“ఆఁ శేషుకే. వాడికేం తక్కువ? వాడికీ కాస్తోకూస్తో ఆస్తి ఉంది. అందం ఉంది. తగిన ఒడ్డుపొడుగూ ఉన్నవాడు. వాడికేం లోటండి? వాడు పెళ్ళి చేసుకోవాలని అనుకోవాలేకాని ఆడపిల్లల తండ్రులు క్యూలో నిలబడ్తారు వాడ్ని అల్లుడుగా చేసుకోడానికి.”

సుందర్రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఇనుము చాలా కఠినమైన లోహం. అలాంటి లోహాన్ని వేడి చేస్తే మెత్తబడి సుత్తి దెబ్బలకి లొంగుతుంది. అలాగే అంత స్థిరమైన నిర్ణయాలు – కఠిన నిర్ణయాలు తీసుకునే సుందర్రామయ్య భార్య మాటలకి మెత్తబడినట్టు ఆలోచనలో పడ్డాడు. భార్య మాటల ప్రభావం అతని మీద పని చేస్తోంది.

అవును సీత చెప్పినట్టు శేషుకేం తక్కువ? అంత చదువుకోనప్పటికీ, గొప్ప తెలివితేటలున్నాయి. బ్రతక నేర్చినవాడు. అందం ఉంది. శేషుకి సుజాతనిచ్చి పెళ్ళి చేస్తే తన కళ్ళెదుటే ఈ ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికీ వెళ్ళరు. తన భార్య కదిపే వరకూ తనకి కూతురు పెళ్ళి చేయాలన్న తలంపే రాలేదు.

‘సుజాత గురించి తనకి తెలుసు. నిప్పులాంటిదని. అయితే రాజశేఖరంతో తిరుగుతోందని లోకులు నానా విధాలుగా అనుకునే అవకాశం ఈయకూడదు. నరం లేదు నాలికకి అని అందరూ అంటారు. సుజాతకి పెళ్ళి చేస్తే చనిపోయిన తన మొదటి భార్య ఆత్మకి శాంతి కలుగుతుంది.’

సీతమ్మకి అతని ముఖ కవళికల్ని బట్టి అతని భావాలు అర్థమయ్యాయి. కొన్ని విషయాల్లోనేనా తన మాట వినడానికి అనుకూలంగా ఉండటం అమెకి సంతోషం కలిగించింది. ‘అతడ్ని వంచాలంటే ఇదే సమయం. తన పాచిక పారాలంటే ఇదే మంచి అవకాశం.’ ఇలా ఆలోచిస్తోంది సీతమ్మ.

అయితే తల్లి యొక్క మాటలు రాధకి నచ్చలేదు. ‘తను ప్రేమిస్తున్న, ఆరాధిస్తున్న శేషుకి తన తల్లి సుజాతను భార్యగా నిర్ణయించడం ఆమెకి నచ్చలేదు. ఈ విషయంలో తను తల్లిని ఎదురించాలి,’ ఇలా సాగిపోతున్నాయి రాధ ఆలోచన్లు.

‘సుజాత తన కన్నా చాలా తెలివైనది. సమయస్ఫూర్తి మెండుగా కలది. తను ఇష్టపడున్న శేషుతో సుజాత తన పెళ్ళి జరిపించడానికి సహాయ పడుతుంది,’ ఇవి రాధ ఆలోచనలు.

శేషు ఆలోచన్లు మరోలా ఉన్నాయి. తను సుజాతను ఇష్టపడున్నాడు. రాధ కంటే యోగ్యురాలు, తెలివైనది సుజాత. రాధ తనంటే ఇష్టపడుతోంది కాని తనకి రాధంటే మోజు లేదు. మోజంతా సుజాత మీదే.

ఒకసారి తన పెళ్ళి ప్రస్తావన ఇంట్లో రాగానే ఒక్కసారి ఉలిక్కి పడింది సుజాత. అదీ తన పెళ్ళి శేషుతోనా? ఆ శేషంటే తనకి మంచి అభిప్రాయం లేదు. అయినా నాకు పెళ్ళా? నాకు పెళ్ళేంటి? ఆ రోజు గుడిలో రాజశేఖరం అమ్మవారి దగ్గర కుంకం తెచ్చి కుంకం తన పాపిడిలో పెడ్తూ అన్న మాటలు ఇంకా చెవిలో గింగిర్లాడుతున్నాయి.

“సుజా! మనలో ఒక సంప్రదాయముంది. ఆ సాంప్రదాయ ప్రకారం తను ఇష్టపడిన ఆడదాని పాపిడిలో మగవాడు కుంకమేనా, సింధూరమేనా ఉంచితే వాళ్ళిద్దరికీ పెళ్ళి అయినట్టే లెక్క” అని అన్నాడు. అంటే మా ఇద్దరికీ పెళ్ళయినట్టే. తమిద్దరూ లోకం దృష్టిలో కాకపోయినా తమ దృష్టిలో దంపతులే.

‘తామిద్దరూ శారీరకంగా ఒకటి అవకపోయినా మానసికంగా తామిద్దరూ ఏకమయ్యారు. తామిద్దరూ దంపతుల క్రింద లెక్క. మా మనస్సులు కలిసిన తరువాత రాజశేఖరం తన పాపిడిలో కుంకం ఉంచిన తరువాత తామిద్దరూ దంపతుల క్రింద లెక్క. తనకి పెళ్ళయి పోయినట్టే. ఇప్పుడు తనకి పెళ్ళేంటి? అందులోనూ శేషుతోనా? శేషు మీద తనకి మంచి అభిప్రాయం లేదు. అతని చూపులు తనకి కంపరం కలిగిస్తాయి. ఆడదాన్ని నఖశిఖ పర్యంతం పరిశీలిస్తున్నట్టు అతని చూపులు తనకి ఇబ్బంది కలిగిస్తాయి, వెగటు కలిగిస్తాయి.

రాజశేఖరం లాంటి ఉత్తముడ్ని తన జీవితంలోకి ఆహ్వానించగలదు కాని శేషులాంటి కుత్సిత మనస్కుడుతో తను జీవితం పంచుకోలేదు. తనకీ, రాజశేఖరానికి మధ్యనున్న అనుబంధాన్ని తన తండ్రితో చెప్పాలి అని అనుకుంది. అయితే ఇంతలో తాను ఒకటి తలుస్తే జరిగింది మరొకటి.

తామిద్దరూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత – తమకున్న బాధ్యతలు తీరిన తరువాత ఒకటవుదామనుకున్నారు. అయితే మధ్యలో ఇలా జరిగింది. తను అతనికి అర్పించిన మనస్సుని మరొకరికి అర్పించలేదు. పెళ్ళి లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతుంది తను. అంతేకాని తన జీవితంలోకి మరొకరిని ఆహ్వానించలేదు’ సుజాత ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.

26

మన సామాజిక మైత్రీ బంధాల్లో, రక్త సంబంధాల్లో భావోద్వేగాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ భావోద్వేగాల వల్ల ఆనందం కలగచ్చు. దుఃఖం, నిరాశ కూడా కలగవచ్చు. లేకపోతే జీవితం నుండి దూరంగా వెళ్ళిపోదాం అన్న భావమేనా కలగవచ్చు. అలా కాకపోతే సమాజంలోనే ఉంటూ పరిస్థితుల్లో జీవన పోరాటం చేయాలన్న భావమేనా కలగవచ్చు. సుజాత ముందున్న మార్గం పరిస్థితుల్లో జీవన పోరాటం చేయడమే.

గదిలో సుందర్రామయ్య గంభీరంగా పచార్లు చేస్తున్నాడు. సుజాత అతనికెదురుగా మౌనంగా నిలబడి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తోంది. ఆ గదిలో వాళ్ళిద్దరే కాకుండా అక్కడున్న వాళ్ళ గుండెల చప్పుడు, పచార్లు చేస్తున్న సుందరామయ్య అడుగుల చప్పుడు, గోడ మీద కాలాన్ని చూపిస్తున్న గడియారం చప్పుడు ఒకదానితో మరోటి పోటీ పడ్తున్నాయా అన్నట్టున్నాయి. ఆ గదిలో ఆ శబ్దాలు తప్ప మరెటువంటి శబ్దాలు ఆ పరిసరాలలో వినిపించలేదు.

సుందర్రామయ్యకి భావోద్వేగంతో పాటు భావోద్రేకం. ‘తను తల్లి లేని పిల్లని సుజాతకి చనువిచ్చాడు. ఏ తండ్రీ ఏ కూతురికీ ఈయని స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. నిర్భయంగా తన మనసులో మాట తనకి చెప్పుకుని తనతో సరిగా వాదించేటంత స్వతంత్రం ఇచ్చాడు. దానికి కారణం తను కూతురు మీదుంచిన నమ్మకం. తన కూతురు తెలివైనది. వివేకవంతురాలు అనే నమ్మకం ఆమెకి సలహా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమె ఆలోచనలు, ఆచరణలు తప్పు అని చెప్పడానికి సంకల్పించాడు.

మన జీవన యానంలో సలహాలు ఇవ్వడం, తీసుకోవడం తప్పుకాదు. సలహాలు ఇవ్వడం నేరం కూడా కాదు. అయితే మనం సలహాలిచ్చినంత మాత్రాన్న అవతలవారు మారిపోతారని కాదు. మనమాట వారిని ఆలోచింప చేస్తుంది. మన మాటే నెగ్గాలనే తత్వానికి దూరం కాగలిగితే మంచి పరిణామానికి దారి తీస్తుంది.’ ఇలా సాగుతున్నాయి. సుందర్రామయ్య ఆలోచన్లు.

కూతురు మీద తనకి నమ్మకం ఉంది కనుకనే రాజశేఖరం, సుజాత గురించి పలు రకాల పుకార్లు వచ్చినా తను చలించలేదు. వాస్తవిక పరిస్థితులేంటో తనకి తెలుసు కాబట్టి కలత చెందిన కూతుర్ని ఓదార్చాడు. రాజశేఖరం – సుజాతల మధ్యనున్న బంధాన్ని అర్థం చేసుకున్నాడు. సీతమ్మ శేషుకి సుజాతనిచ్చి పెళ్ళి చేయాలన్న ప్రస్తావన తెచ్చినప్పుడు. మొదట సముఖంగా ఉన్నప్పటికీ ఆ తరువాత రాజశేఖరం – సుజాతల మధ్య బంధాన్ని అర్థం చేసుకుని, సీతమ్మ ప్రస్తావన మీద విముఖత చూపించాడు. అవసరమయితే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలని ఓ నిర్ణయానికి వచ్చాడు.

కూతురు యోగ్యురాలు, తన గౌరవానికి భంగం కలిగించే ఏ పనీ చేయదన్న పరిపూర్ణ విశ్వాసం తనది. అందుకే ఆమె మాటకి విలువిచ్చి తను చేస్తున్న న్యాయవాది వృత్తిని విడిచిపెట్టి తనూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. కూతురు దేశ భక్తి గల తన రచనల ద్వారా దేశవాసుల్ని చైతన్య పరుస్తుంటే, అందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉంటే తండ్రిగా తానెంతో గర్వించాడు?

అయితే ఇప్పుడు ఆమెలో ఉన్న మూర్ఖత్వాన్ని సమర్థించలేకపోతున్నాడు. ఏదో రాజశేఖరం దేవుని సమక్షంలో దేవుని దగ్గర కుంకం తీసి పాపిడిలో పెట్టి ‘మన పెళ్ళి అయిపోయినట్టే’ అని అంటే తన కూతురు కూడా అతని మాటల్ని విశ్వసించడం, లేనిపోని బంధకాలన్ని నిర్వర్తించడానికి, అదే రాజశేఖరం చెల్లెలు బాధ్యత తీసుకోవడం – తనకేఁ నచ్చలేదు. ఇంతకీ ఆ రాజశేఖరం ఏం అయ్యడో తెలియదు. అటువంటి అతని కోసం కూతురు మ్రోడులాంటి జీవితం గడపడానికి నిర్ణయించుకోవడం సుందర్రామయ్యకి నచ్చలేదు.

వాళ్ళిద్దరూ మధ్యా ఏ శారీరక సంబంధం లేకపోయినా, మానసిక సంబంధాన్ని పట్టుకుని రాజశేఖరాన్ని తన భర్త అని అనుకుంటోంది. ఇలాంటి మానసిక వ్యభిచారాన్ని తను సమర్థించలేడు. ఇలా మ్రోడుబారిన జీవితం తన కూతురు గడపటం తను సహించలేడు. తన కూతురు పెళ్ళి చేసుకోవాలి. పిల్లా పాపలో కలకల్లాడుతూ జీవితం గడపాలి.

ఓ తండ్రిగా తన కోరిక అదే. ఈ విషయంలో తను మెత్తబడకూడదు. తండ్రిగా తనకు కూతురు మీద ప్రేమే కాదు బాధ్యత ఉంది. తప్పు చేస్తే దండించే అధికారముంది. ఆమె భావి జీవితం కోసం, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కఠినంగా ప్రవర్తించక తప్పదు. ఇలా సాగిపోతున్నాయి సుందరామయ్య ఆలోచనలు.

సుజాత అలోచన్లు మరో విధంగా ఉన్నాయి. తన తండ్రి ఇంత కఠినంగా మారిపోయాడేంటి? లోకులు తన మీద అపనిందలు వేస్తే తనని ఓదార్చి సాంత్వన చేకూర్చిన మనిషి, దుఃఖంలో తను కుమిలి కన్నీరు కారుస్తుంటే కన్నీరు తుడిచి తనని ఓదార్చిన మనిషి. ఆ అమృతమూర్తి ఇలా మారిపోయారేంటి? ఏనాడూ – పల్లెత్తు మాటయినా అనని మనిషి ఇలా మారిపోయారేంటి? ఎవరు ఏ విధంగా ఒత్తిడి తెచ్చినా తన నిర్ణయంలో ఏ మాత్రం మార్పు లేదు. తన నిర్ణయం మారదు. మథనపడ్తూనే సుజాత ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది.

“నీ నిర్ణయంలో ఏ మార్పులేదా?” తండ్రి కంఠంలో తీవ్రతతో పాటు కాఠిన్యత తొంగి చూసింది. ఆమె ఒక్కక్షణం చలించినా తన స్థిర నిర్ణయానికి కట్టుబడి ఉంది. కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతూ ఉండగా మౌనంగా తలవొంచుకుని కూర్చుంది సుజాత. మౌనమే అంగీకారంగా తోచింది అక్కడి వారికి.

సీతమ్మకి ఇదే మంచి అవకాశం లభించింది. తన అక్కసు మాటల ద్వారా అదీ నిష్ఠూరమైన మాటల ద్వారా వెళ్ళగక్కడానికి తగిన అవకాశం లభించింది.

“చూశారా! తండ్రి మాట కూడా మీ కూతురికి లెక్కలేదు. మా మాట ఎలాగూ లక్ష్య పెట్టదు. మీ మాటకు కూడా విలువ లేకుండా పోయింది. మీ మీదేనా ఏ మాత్రమేనా గౌరవం ఉండాలా?” భర్త కోపాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తోంది సీతమ్మ. ఆమె ఈ చర్య హోమగుండంలో నెయ్యి వేసి మంటను మరింత అధికం చేసినట్టుంది.

సుందర్రామయ్యలో అసహనం పెరిగిపోతోంది. “నీ నిర్ణయం వల్ల ఎంత నష్టపోతున్నావో తెలుసా?” సుందరామయ్య కంఠం తిరిగి కఠినంగా పలికింది. అప్పటికి సుజాతకి మౌనమే శరణ్యమయింది. ఆమె మౌనం అతని సహనాన్ని పరిక్షిస్తోంది. అతనిలో సహనం క్రమంగా సడలిపోతోంది.

“ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు ఇక మీదట. నీకు తెలుసా? నీ నిర్ణయం మార్చుకోపోతే తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవల్సి ఉంటుంది. ఇప్పటికైనా తండ్రిగా నిన్ను శాసించడం – ఆజ్ఞాపించడం లేదు. అలా ఆజ్ఞాపిస్తే – శాసిస్తే వినే వయస్సు దాటిపోయింది. నేను నీకు సలహా మాత్రమే ఇస్తున్నాను.

నా సలహా పాటించకపోతే నా మాటకు విలువ ఇయ్యనట్టే లెక్క. నా మాటకి విలువ ఇయ్యని వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదనేదే నా భావన. మరి ఏ విషయం తేల్చుకుంటావో? నేను బయటకు వెళ్ళి గంటలో వస్తాను. ఈలోపున నీ నిర్ణయం తెలియచేయ్,” అని గంభీరంగా పలికి విసవిసా నడుచుకుంటూ అతను బయటకు నడిచాడు.

విషమ సమస్య ఎదురయింది సుజాతకి. పరిష్కరించుకోడానికి అనువైన మార్గం దొరకని చిక్కు పరిస్థితి ఆమెది. ఇటువంటి పరిస్థితిలోనే తను ఆత్మస్టెర్యాన్ని విడిచి పెట్టకూడదు. తండ్రి చెప్పినట్టు నడుచుకోవడం తన వల్ల కాదు. రాజశేఖరం స్థానంలో భర్తగా మరొకరిని తను ఊహించుకోలేదు. ఆ తలంపే భరించలేదు. అంతేకాదు రాజశేఖరం కళ్యాణి బాధ్యత తనకప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బాధ్యత తనపై వేసుకుని తనకి అప్పగించిన బాధ్యత తీర్చడమే తన విధి ఈ పరిస్థితిలో.

ఇలా ఆలోచిస్తున్న సుజాత ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయమే తను పుట్టి పెరిగిన ఇంటిని – ఆ వాతావరణాన్ని తన వాళ్ళని విడిచి ఇల్లు వదిలి పెట్టిపోవడమే – ఇలాంటి స్థిర నిర్ణయం తప్పని పరిస్థితిలో సుజాత తీసుకోవల్సివచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version