[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ భాగం. [/box]
27
సుజాత తన నిర్ణయం ప్రకారం ఇంటిని వదిలి పెట్టి పరంధామయ్య గారింటికి తన అవసరమైన వస్తువుల్ని తీసుకుని వచ్చేసింది.
“నీవు చేసిన ఈ పని నాకు అంత మంచిదిగా అనిపించటం లేదు అమ్మాయ్!” పార్వతమ్మగారు సుజాతతో అన్నారు. ఆ సమయంలో సుజాతకి ఎక్కడికి వెళ్ళాలో పాలుపోలేదు. అటువంటి సమయంలో పరంధామయ్య పార్వతమ్మగారు తప్ప తనని ఆదరించే వాళ్ళు ఈ సమాజంలో లేరు అని అనిపించింది సుజాతకి. అందుకే ఇక్కడికి వచ్చింది. కళ్యాణి కూడా అక్కడ ఉంది కదా.
పార్వతమ్మగారిని వారించారు పరంధామయ్య గారు. “మంచి, చెడు అన్న విషయం మన భావాలు – మన ఆలోచనలు మన మనస్తత్వాన్ని బట్టి ఉంటాయి. అమ్మాయి అంతకాని పని ఏఁటి చేసింది కనుక? ఆ అమ్మాయిని అలా నిరుత్సాహ పరుస్తావేఁటి? ఆ అమ్మాయికి మనకి చేతనయితే ఆశ్రయం ఇచ్చి ఆదరించాలి. లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేకాని నిరుత్సాహ పరచకూడదు. అశ్రయం కల్పించే స్థలాన్నేనా చూపాలి. అయినా మన భరోసా మీదే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది” పరంధామయ్య గారు గంభీరంగా అన్నారు.
పార్వతమ్మగారు నొచ్చుకున్నారు. తను వేరే భావంతో అనలేదు. వయస్సులో ఉన్న అమ్మాయి ఇల్లు వదిలి రావడం మంచిది కాదని తన భావం. అందుకే ఆమె తన మాటలకి వివరణ ఇచ్చుకుంది.
“నా ఉద్దేశం అది కాదండి. జీవితంలోని అర్థం పరమార్థం తెలుసుకోకుండా అసలైన జీవితంలోని పరమార్థాన్ని చవిచూడకుండా ఈ అమ్మాయి ఇంత కఠోరమైన నిర్ణయం తీసుకోడమే నాకు నచ్చలేదండి. ఆడది గడపదాటి రావడానికి సాహసించని నేటి సమాజంలో ఈ అమ్మాయి ఎలా బ్రతగలదు? వచ్చే అవాంతరాల్ని, ఆటంకాల్ని ఎలా ఒక్కర్తీ అధిరోహించగలదు?” పార్వతమ్మ భర్తకి తన అభిప్రాయం చెప్పింది.
భార్య చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించినా సుజాతను నిరాశ పర్చకూడదు. ఆమెలో ఆత్మసైర్యాన్ని పెంపొందించాలి, ధైర్యం చెప్పాలి అని అతను అనుకున్నాడు. అందుకే పరంధామయ్య గారు భార్యతో “కాలమే సుజాత సమస్యను పరిష్కరిస్తుంది. సమాజంలో ఆడదాని మీద ఆంక్షలు విధించినంత వరకూ ఇప్పుడే కాదు మరో అర్ధ శతాబ్దం గడిచినా ఆడదాని పరిస్థితి ఇలానే ఉంటుంది. మార్పు అనేది ఉండే ఉండదు.
సుజాత లాంటి ధైర్యం గల అమ్మాయిలు ఈ ప్రతిబంధకాలు అనే సంకెళ్ళను తెంచుకుని బయటకు అడుగుపెట్టి సమాజంలో తలెత్తుకుని తిరిగిన నాడు, సమాజంలో తమకని ఉనికిని, స్థానాన్ని సంపాదించిననాడు ఆడదానికి సమాజంలో ఓ గౌరవ ప్రదమైన స్థానం ఏర్పడుతుంది. సమాజ వికాసం కోసం – సమాజాభివృద్ధికి ఆమెకి కూడా తన సేవ అందించడానికి అవకాశం ఏర్పడుతుంది.”
పరంధామయ్య గారి మాటలు సుజాతకి కొండంత బలానిచ్చాయి. తనకి ఆశ్రయం ఇచ్చి ఆదరించకపోయినా పరవాలేదు, తనని నిరుత్సాహ పరచకుండా ప్రోత్సహించేవారు ఇప్పుడు తనకి కావాలి ఈ సమయంలో. ఆ సమయంలో పరంధామయ్య దంపతులు ఆమెకి దేవుళ్ళలా అగుపడ్డారు. వాళ్ళకి చేతులెత్తి నమస్కరించింది సుజాత.
తమ కాళ్ళకి వంగి నమస్కరించిన సుజాత భుజాలు చుట్టూరా చేతులు వేస్తూ “పిచ్చిపిల్లా లే… లే…!” అంటూ ఆమెను లేవనెత్తి ఆప్యాయతగా హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ. ఆమె పరిష్యంగంలో అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది సుజాత.
తల్లి ప్రేమ ఏంటో, అది ఎలా ఉంటుందో చవిచూడని ఆమెకి పార్వతమ్మ నుండి మాతృప్రేమను తొలిసారిగా అనుభవించినట్టు అనుభూతి కలిగింది.
కళ్యాణికి సుజాత రాక అంతులేని ఆనందాన్ని కలిగించింది. “అక్కా… అక్కా…!” అంటూ సుజాతను విడిచిపెట్టి ఒక్కక్షణం కూడా ఉండేది కాదు. అక్కా అని పిలవడం సుజాతకి నచ్చలేదు. ‘వదిన అని పిలు’ అని అనాలనిపించేది సుజాతకి ఒక్కొక్క పర్యాయం. మరుక్షణంలోనే నిర్లిప్తత ఆమెను ఆవరించేది. ‘రాజశేఖరమే లేనప్పుడు ఏ పేరుతో – ఏ సంబోధనతో పిలుస్తే ఏఁ?’ అని అనుకుని గాఢంగా నిట్టూర్పు విడిచేది.
కాలం వెన్న పూసలా కరిగిపోతోంది. ఆ కాలం గడుస్తున్న కొలది దైనందిక జీవితంలో అనేక మార్పులు. జీవన విధానంలో అనేక అలవాట్లు చోటు చేసుకోవడం సహజం. ఇప్పుడు సుజాత జీవితం యాంత్రికంగా అలా గడిచిపోతోంది.
కళ్యాణికి చదువు చెప్పడం, ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడ్డంతోనే సరిపోతోంది సుజాతకి.
విశాలగుప్తాకి రాజశేఖరం కనిపించకుండా వెళ్ళిపోవడం – సుజాత ఇల్లు వదిలి వచ్చేసిన విషయాలు తెలిసి చాలా బాధపడ్డాడు. ఆమెను ఓ పర్యాయం చూడాలని వచ్చాడు.
“అమ్మా! సుజాత విషయాలన్నీ నాకు తెలిసాయి. చాలా బాధపడ్డాను నేను. ఓనాడు రాజశేఖరం కుటుంబం ఎలా ఉండేది. ఈనాడు ఛిన్నాభిన్నం అవడం చూసి చాలా బాధపడ్డాను.” అన్నాడాయన.
“నేను ప్రత్యక్షంగా ఈ మధ్య వరకూ మిమ్మల్ని చూడలేదు. అయితే మిమ్మల్ని గురించి విన్నాను. రాజశేఖరం గారి కుటుంబానికి మీరు చేసిన సహాయ సహకారాల గురించి విన్నాను. మిమ్మల్ని పొగడ్డం కాదుకాని మీలాంటి మనుష్యులు ఈ సమాజంలో అరుదుగా ఉంటారు” అంది సుజాత. ఇవే మాటలు మీనాక్షి చనిపోయినప్పుడు కూడా తిరిగి అంది.
“మనం సామాజిక జీవులం. ఈ సమాజంలో ఒకరికి మరొకరి సహాయ సహకారాలు, ఒకరి మీద మరొకరికి ప్రేమతత్వం ఉండాలి. మనం మానవులం, ఒకరి మీద మరొకరికి స్నేహతత్వం, పరోపకారతత్వం, ప్రేమతత్వం లేకుండా జీవించలేము. మనుష్యుల్లోనే కాదు. సకల జీవరాశుల్లోనూ మనకి కనబడుతుంది. క్రూరమైన జంతువులోనూ, సాధు జంతువులలోనూ, మనుష్యుల్లోనూ ఈ ప్రేమతత్వం మనకి తప్పక కనిపిస్తుంది” విశాలగుప్తా అన్నాడు. అతని మాటల్లో నిజం ఉందనిపించింది సుజాతకి.
విశాలగుప్తా వెళ్తున్న సమయంలో “అమ్మా సుజాతా! ఆర్థికంగా ఏ మాత్రమైనా ఇబ్బంది వచ్చినా నేను అన్నవాడిని ఉన్నానని గుర్తించుకో అమ్మా!” అన్నాడు.
“మీ ఉదార బుద్ది నాకు తెలియదా? సమాజంలో రక్త సంబంధాలు కంటే స్నేహసంబంధాలు, మానవతా విలువలు ముఖ్యం. మానవతా విలువలకి వన్నె తెచ్చిన మంచి మనిషి మీరు. ఇది మిమ్మల్ని పొగడ్డం కాదు. పచ్చి నిజం,” సుజాత అంది.
“ఎప్పుడేనా మీ సహకారం నాకు కావల్సి వచ్చినప్పుడు తప్పకుండా మీ సహకారం నేను తీసుకుంటాను, ఏ మాత్రం మోహమాటపడను. సంకోచించను.”
“నీవు అలా ఉండాలనేదే నా కోరిక,” విశాలగుప్తా అన్నాడు. పరంధామయ్య, పార్వతమ్మ గారికి కూడా తెలిసింది రాజశేఖరం కుటుంబంతో విశాలగుప్తా కున్న అనుబంధం గురించి.
విశాలగుప్తాకి కళ్యాణిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ చిన్న పిల్ల జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో? అనుకున్న అతను తిరిగి సుజాతవంటి ఉత్తమురాలి అండ దొరికింది కళ్యాణికి. పరవాలేదు, కళ్యాణి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని తిరిగి అనుకున్నాడు.
మనిషికి కావల్సింది సాంత్వన. మనిషి కోరుకునేది అదే. అది మానవునకి చాలా అపురూపమైనది. ఎడారిలో ప్రయాణిస్తున్న మనిషికి ఒయాసిస్సు కనిపిస్తే ఎలా ఉంటుందో అలాంటిదే సాంత్వన కూడా సుజాత అనుకుంది.
28
సుజాత కళ్యాణి వేపు చూస్తూ చదువు చెప్తోంది. అనుకోకుండా ఆమె భావోద్వేగానికి లోనయింది. రకరకాల ఆలోచన్లు ఆమె కళ్ళెదుట నిల్చాయి. కళ్యాణి బాల్యం పాపం ఎలా గడుస్తోంది? తన వాళ్ళను పొగొట్టుకుని అనాథగా బ్రతకవల్సి వస్తోంది. అనాథ ఏంటి తను లేదా కళ్యాణికి అనుకుంది సుజాత.
తనున్నా కళ్యాణి వాళ్ళ కుటుంబం వాళ్ళకి దూరమయింది కదా. ఎవరికైనా తనవాళ్ళు తనవాళ్ళే. పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. తను కళ్యాణిని ఎంత బాగా చూసుకున్నా తను కళ్యాణికి పరాయిదే. ఇలా ఆలోచిస్తోంది సుజాత.
తనలాగే దురదృష్టవంతురాలు కళ్యాణి. తమిద్దరి బాల్యం ఎలా గడిచింది? మన జీవితంలో మరుపురాని మధుర దశ బాల్యం. బాల్యంలో పిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది. కల్లాకపటం ఎరుగునది. ఉల్లాసం, ఉత్సాహం సంతోషం ఆట పాటల బాల్యం ఎవరికైనా అమూల్య వరమే.
ఆహ్లాదకరమైన బాల్యం, అనుభూతుల జ్ఞాపకాలు మాసిపోని బాల్యం అందరికీ ఉండకపోయినా కొంతమందికి మనసు పొరల్లో రంగురంగుల దృశ్యాల రూపాల్లో కదలాడుతూనే ఉంటుంది. అటువంటి ఆహ్లాదకరమైన బాల్యం అందరికి ఉండదు.
పరిస్థితులెంత మారినా, ఎన్ని ప్రాకృతికానుభావాలు కోల్పోయినా బాల్యం ఎప్పుడూ బాల్యమే. అయితే తన బాల్యం, కళ్యాణి బాల్యం పిడికిలి వేళ్ళ సందుల్లోంచి ఇసుకలా జారిపోయింది. తమ బాల్యం అరచేతికి అంటిన మట్టి మరకలా మిగిలిపోయింది.
తన బాల్యంలోనూ, కళ్యాణి బాల్యంలోనూ వేధింపులే. అవి మానసికంగా అవచ్చు. శారీరకంగా అవచ్చు. కష్టాలు, కన్నీళ్ళే మేనమామ భార్య చిన్నారి కళ్యాణిని శారీరకంగా బాధించేది అని తను వింది. మరి తన విషయంలోనో తనని సవతి తల్లి మొదట్లో బాగా చూసుకున్నా రాధ పుట్టిన తరువాత తనని తన సవతి తల్లి ఎంత వేధింపులకి గురి చేసింది? ఎంత హింసించింది. అది శారీరకంగా అవచ్చు. మానసికంగా అవచ్చు.
తన బాధను ఎవరితో చెప్పుకోగలదు? తండ్రి ఎప్పుడూ తన న్యాయవాది వృత్తిలో మునిగి తేలుతూ ఉండేవాడు. తన బాధను చెప్పుకోడానికి ఎవరూ లేకపోయేవారు. తల్లి ఫోటో పట్టుకుని తను ఎన్నో రాత్రలు కుమిలి కుమిలి ఏడ్చేది. కళ్యాణి చిన్న పిల్ల కాబట్టి సరిగా జ్ఞానం రాని కారణం చేత తన పరిస్థితిని అర్థం చేసుకోలేదు.
“ఏంటక్కా అలా కూర్చుని ఆలోచిస్తున్నావు?” కళ్యాణి మాటలకి ఉలిక్కిపడి ఆలోచన్ల నుండి తేరుకుంది సుజాత. తన మనస్సులో భావాలు పైకి వ్యక్తం కానీయకుండా జాగ్రత్త పడింది.
“ఏం లేదు కళ్యాణి. నేను అలోచిస్తున్నది నీ చదువు గురించే, నీవు బాగా చదువుకుని పెద్ద దానివై చాలా వృద్ధిలోకి రావాలి.”
సుజాత మాటల్లో వృద్ధి అన్న పదానికి అర్థం ఆ చిన్న పిల్ల అయిన కళ్యాణికి తెలియకపోయినా “అలాగే,” అని తలూపింది.
“అక్కా”
“ఏఁటి కళ్యాణి?”
“అన్నయ్య… అన్నయ్య…”
“ఆఁ అన్నయ్య” రెట్టించింది సుజాత.
“అన్నయ్య కనిపించటం లేదేంటి అక్కా?”
అనుకోని సందర్భం సుజాతకి ఎదురయింది. కళ్యాణి రాజశేఖరం ప్రస్తావన తీసుకొస్తుంది ఇలా అని సుజాత అనుకోలేదు. కళ్యాణి మాటలకి ఆమెను దిగ్భ్రాంతురాల్ని చేసింది. విస్మయం నుండి తేరుకోగానే హృదయం బాధగా మూల్గింది. కల్లా కపటం తెలియని ఈ పసిదానికి తనేఁమని సమాధానం ఇవ్వాలో సుజాతకి తోచలేదు.
“ఏం అక్కా? సమాధానం ఇయ్యకుండా అలా నా వేపు చూస్తున్నావు?” కళ్యాణి తిరిగి ప్రశ్నించగానే ఏదో సమాధానం చెప్పి కళ్యాణిని సమాధాన పరచాలనుకుంది సుజాత.
“మీ అన్నయ్య వస్తారు కళ్యాణి. తప్పకుండా వస్తారు. ఏదో రోజున మన దగ్గరికి వస్తారు. ఈలోపున నీవు బాగా చదువుకుని యోగ్యురాలి వవ్వాలి.” కళ్యాణి తల మీద చేయి వేసి ఆప్యాయతగా నిమురుతూ అంది సుజాత.
ఈ మధ్యనే సుజాత ఏర్పాటు చేసిన పాఠశాల రోజు రోజుకి వృద్ధి చెందుతోంది. ఆ పాఠశాలలో చిన్న పిల్లలే కాకుండా పగలల్లా పనిపాట్లు చేసుకుని, చదవాలని ఉత్సాహం ఆసక్తి ఉన్న వయోజనులు కూడా రాత్రి సమయంలో సుజాత నడుపుతున్న పాఠశాలకి వచ్చి సుజాత దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం రావడం – బానిస సంకెళ్ళను తెంచుకుని భారతమాత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోడం జరిగింది. మనం ఇప్పుడు బానిసలం కాదు. పరాయి ప్రభుత్వ పాలన అంతమయింది. ఇప్పుడు ప్రజాసామ్య పరిపాలన ఆరంభమయింది. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రజానాయకుల ద్వారా ఇక నుండి పరిపాలన జరుగుతుంది. అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నా మన్నమాట. ఈ విషయం ప్రతీ భారతీయుడ్ని ఆనంద సాగరంలో ముంచుతోంది.
తను ఇన్నాళ్ళూ దేని కోసము ఎదురుచూసిందో ఆ మంచి రోజులు వచ్చాయి. తన దేశ భక్తి రచన ద్వారా భారతీయుల్లో దేశ భక్తి పెంచి, చైతన్య పరిచింది. తన రచనలకి సార్ధకత ఏర్పడింది. అయితే ఏఁ లాభం? తన జీవితం ఒక విధంగా మ్రోడుబారి పోయింది. ఇలా ఆలోచిస్తున్న సుజాత నిర్లిప్తంగా ఉండి పోయంది. ఆమె నిర్లిప్తతకి కారణం ఆమె ఆశలు నిరాశలవడం కన్న కలలు కల్లలవడం. ఆమె కట్టుకున్న ఆశా సౌధాలు కుప్ప కూలిపోవడం. కోరికలు పేక మేడల్లా కూలిపోవడం.
నిరాశలో కూరుకుపోయిన సుజాత మెదడులో విషాదభరితమైన రకరకాల ఆలోచన్లు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తనూ రాజశేఖరం మూడు ముళ్ళ బంధంతో ఒకటవుదామనుకున్నారు. తమ ఆలోచన్లు, తమ కోరికలు, ఆశలు, ఆశయాలూ ఇవేవీ నెరవేరలేదు. రాజశేఖరం ఏఁ అయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటి వరకూ తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయింది.
రాజశేఖరం కనిపించకుండా పోవడం తనకి చాలా మనస్తాపం కలిగింది. దుఃఖంలో చితికిపోతున్న తనని ఈ పరిస్థితిలో ఓదార్చేవారు ఎవరున్నారు? అని సుజాత మథనపడుతోంది. వెంటనే ఆమెకి కళ్యాణి గుర్తుకు వచ్చింది. తను రాజశేఖరానికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది.
‘తను ఇన్నాళ్ళ వరకూ కాస్తో కూస్తో తండ్రి ప్రేమనేనా చవిచూసింది. పాపం కళ్యాణి అదీ దక్కలేదు. తన వాళ్ళ ప్రేమకి కరువైన ఆ పసిపిల్లకి ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. రాజశేఖరానికి తనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ అని అనుకుంది సుజాత.
ఇంతలో కళ్యాణి అక్కడకి రావడంతో ఆమె ఆలోచన్లకి అంతరాయం కలిగింది.
(ఇంకా ఉంది)