Site icon Sanchika

కొడిగట్టిన దీపాలు-17

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం. [/box]

33

సుజాత దగ్గర సీతమ్మ, రాధ జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. ఒక్కొక్క పర్యాయం సీతమ్మ సుజాత యడల తన ప్రవర్తనకి పశ్చత్తాపం పడుతుంది. సిగ్గు పడుతుంది.

భావ మనో వికారాల్లో ఈర్ష్య మహా చెడ్డది. అది మానవుడిలోని వివేకాన్ని నశింప చేస్తుంది. దానికి స్వార్థం తోడయితే మరీను. తను ఏం చేసింది? రాధ పుట్టిన తరువాత తనలో సుజాత మీద అలుసు తనం కలిగింది. స్వార్థం పెరిగింది. రోజులు గడుస్తున్న కొలదీ రాధ కన్నా సుజాత అన్ని విషయాల్లో ముందుండడం తను సహించలేకపోయింది. దానికి ఫలితమే అవకాశం వచ్చినప్పుడల్లా సుజాత మీద తన అక్కసు చూపించడం, విసుక్కోవడం.

అయినా సుజాత ఎంతో సహనంగా మెలిగేది. ఒక్కనాడు కూడా తండ్రి దగ్గర ఫిర్యాదు చేయలేదు. తనెందుకు అలా ప్రవర్తించింది అంటే తనకి ఎదురయిన అనుభవాలు. తన బాల్య కాలంలో గడిపిన జీవనశైలి. చిన్నప్పుడు తనకి ఎదురయిన చేదు అనుభవాలు. మనస్సుకి తగిలిన గాయాలు.

శరీరానికి గాయమయితే బయటకు అగుపడుంది. బాధ కూడా బయటకు తెలుస్తుంది. అదే మనస్సుకి గాయమయితే బాహ్యంగా అగుపించకపోయినా అంతరంగికంగా ఆ బాధ భరించరానిదిగా ఉంటుంది. లోలోపలే బాధ దహించి వేస్తుంది.

తన విషయంలోనూ అలాగే జరిగింది. తనకి పదిహేను సంవత్సరాలు వచ్చే వరకూ జీవితంలో మాధుర్యాలు చూడకపోయినా ఏదో చెప్పుకున్నంత గొప్పగా లేకపోయినా బాల్యం, కౌమారం ఏదో విధంగా గడిచిపోయి, ప్రారంభిక యవ్వనావస్థలోకి చేరుకుంది.

అందరి బాల్యాలూ ఆనందకరం కాదు. పేదరికంలో మగ్గినా, సుఖంలో జీవించినా బాల్యంలో తల్లి పిల్లల కోసం చేసే త్యాగాలు అందరికీ జ్ఞాపకముండి మనస్సుని కదిలిస్తూనే ఉంటాయి. బాల్యానికి, అమ్మకి ఉండే అవినాభావ సంబంధం అటువంటిది. అలాంటి అమ్మ జీవితమయితే పిల్లలకి మిగిలేది. అమ్మతో పాటు, దుఃఖమే. అలాంటి అనుభవం తన జీవితంలో కూడా ఎదురయింది.

త్రాగుబోతు భర్తతో అమ్మ ఎలాగ కాపురం చేస్తోంది అని అనిపించేది తనకి జ్ఞానం వచ్చిన తరువాత. తనకీ శేషుకి వయస్సులో పదిహేను సంవత్సరాలు తేడా. అందుకే పసివాడయిన శేషుకి కుటుంబ పరిస్థితులు తెలియవు కాని పదిహేను సంవత్సరాలు వచ్చిన నాకు ఇంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి.

తాగి వచ్చి అమ్మను గొడ్డును బాదుతున్నట్లు బాదుతూ ఉంటే తండ్రి మీద తనకి అసహ్యం కలిగేది. మాట్లాడాలనిపించలేదు. అమ్మ సహనమూర్తి కాబట్టి భరిస్తోంది కాని మరో ఆడదయితే భర్తని ఎదిరించేది అని అనుకునేది తను.

అహ్లాదకరమైన బాల్యం అనుభూతులున్న బాల్యం తనకి, తమ్ముడికి దక్కలేదు అని తను బాధ పడేది. అమ్మని చూస్తే జాలి. తండ్రిని చూస్తే ద్వేషం, అసహ్యం. తండ్రి సరిగా ఇంటికే వచ్చేవాడు కాదు. రెండు మూడు రోజులకొకసారి వచ్చేవాడు. వచ్చినా ఏం లాభం? వచ్చినప్పుడల్లా అమ్మకి శారీరిక హింసే. రాకుండా ఉంటేనే బాగుండును అని అనిపించేది. నాన్న ఎవరితోనో ఉంటున్నాడు అని తమకి తెల్సింది.

నాన్నకి పక్షవాతం వచ్చింది. ఎంతయినా కష్టమయినా, నష్టమయినా తన మెళ్ళో మూడు ముళ్ళు వేయించుకున్నది భార్య అవుతుంది. భర్తకి కష్ట సుఖాల్లో వెంట ఉండి భర్తకి సేవ చేస్తుంది కాని, ఉంచుకున్న ఆడది భార్య అవుతుందా. తండ్రికి ఎప్పుడయితే పక్షవాతం వచ్చిందో ఆవిడ తన తండ్రిని దరిదాపుల్లోకి రానీయలేదు. అప్పుడు తన తండ్రికి తన తల్లే దిక్కు అయింది.

మన భారత స్త్రీలు సహనపరులు. సతీ సుమతి లాంటి వాళ్ళు. వీళ్ళకి భర్త ఎంత చెడ్డవాడయినా భర్తే సర్వస్వం. పక్షవాతంతో మంచంపై బడ్డ తండ్రికి సేవ చేసేది తల్లి.

“అమ్మా! నీవెందుకు అతనికి సేవ చేయాలి. నీ మెతకతనమే అతను ఇలా తయారవడానికి కారణమయింది” అని తను తల్లి మీద విసుక్కునేది.

“తప్పు సీతా! అతను నీకు జన్మనిచ్చిన తండ్రి. అతను లేకపోతే నీవు లేవు. అతను నాకు తాళి కట్టిన భర్త. మనం భారత స్త్రీలం. ఇక్కడ స్త్రీలకి సహనం, ఓర్పు, ఎంతో అవసరం. అంతకన్నా ముందు క్షమాగుణం ఉండాలి” అని అనేది. తల్లి మాటలు తనకి నచ్చేవి కావు.

మరో రెండు నెలలకి తండ్రి చనిపోయాడు. తండ్రి చావు తనకి బాధ కలిగించలేదు. ఎందుకంటే తండ్రికా తన బాధ్యత ఏనాడూ నెరవేర్చలేదు ఆయన. ఓ భర్తగా అమ్మని చూసుకోలేదు. తన వెనక ఏడు అడుగులు వేసిన తన భార్యని గాలికి వదిలివేసిన స్వార్థపరుడు అని అనిపించింది తనకి.

తండ్రి చనిపోయిన తరువాత మేనమామ ఇంటికి చేరుకున్నారు. తాము. అక్కడ కూడా తమ జీవితం సంతృప్తిగా లేదు. సెగలో నుండి పొగలోకి వచ్చినట్టనిపించింది తమకి. తలచెడిన అక్కచెల్లెలు ఇంటికి వస్తే ఆమె కష్టాన్ని దూరం చేయాలి. ఆమెను ఓదార్చాలి. ఆమెకు అండగా ఉండాలని అనుకోవాలి ఆమె రక్తం పంచుకుని పుట్టిన రక్త సంబంధం గల అన్నదమ్ముడు. అయితే అతనిలో అంత ఔదార్యమెక్కడ. వాళ్ళింటికి వెళ్ళిన మరుసటి రోజు నుండి తన తల్లికి వంట మనిషి అవతారం ఎత్తవల్సి వచ్చింది.

తను కూడా పని మనిషి అవతారం ఎత్తవల్సి వచ్చింది. ఎప్పుడూ తన జీవితం గొప్పగా లేదు. మామయ్య కూతురు కట్టుకుని వదిలి వేసిన బట్టలు తను ధరించవల్సి వచ్చేది. మామయ్య కొడుకు బట్టలు తన తమ్ముడు శేషు ధరించవల్సి వచ్చేది. మామయ్య భార్య కట్టి వదలి పెట్టిన పాత చీరలు తన తల్లి శరీరాన్ని కప్పేవి.

అమ్మ ఆరోగ్యం క్షీణించడం గమనించింది తను. “సీతా! భర్త మంచి వాడయినా, చెడ్డవాడయినా భర్త ఉన్నప్పుడు జీవితం ఉన్నంత గౌరవంగా భర్తపోయిన ఆడదానికి ఉండదు” తన తల్లి అనేది.

అటువంటి సమయంలోనే భార్య చనిపోయిన సుందర్రామయ్య సంబంధం వచ్చింది. ‘రెండో పెళ్ళివాడ్ని పెళ్ళి చేసుకోవడమా? అయినా పెళ్ళి చేసుకునే ఆలోచన తనకి లేదు. మామయ్య కూతురు కూడా తన వయస్సుదే కదా. ఈ సంబంధం కూతురికి చేయగలదా?’ తిరుగుబాటు ధోరణిలో అనుకుంది తను.

“మంచి ఆస్తిపరుడు, న్యాయవాదిగా బాగా సంపాదిస్తున్నాడు. ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి నీ పెళ్ళి జరిపించలే.. మాకు ఎదిగి వచ్చిన పిల్లలున్నారు. రూపాయి ఆస్తి లేకుండా ముగ్గురు మనుష్యులు ఇంట్లో తిష్ఠ వేసారు. ఈ పెళ్ళికి ఒప్పుకోవల్సిందే” మేనమామ భార్య ఖరాఖండీగా చెప్పింది.

పరిస్థితులు అటువంటివి. ఆ పరిస్థితులకి తను తలవొంచవల్సి వచ్చింది. మరో విషయం ఇక్కడ తన జీవితం ఏఁ గొప్పగా ఉంది కనుక. ఇక్కడ చేస్తున్న చాకిరీ అక్కడే చేస్తాను. ఇక రెండో పెళ్ళివాడంటే తప్పదు ఇష్టపడాలి పెళ్ళికి. పరిస్థితుల్లో రాజీపడాలి. ఇలా ఆలోచించింది తను.

సుందరామయ్యతో తన పెళ్ళి జరిగిపోయింది. కొంత కాలం వరకూ అక్కడ వాతావరణానికి అలవాటు పడలేకపోయింది. అయితే తప్పదు. నెమ్మదిగా అలవాటు చేసుకుంది. భర్త దగ్గర మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. సుజాతను మచ్చిక చేసుకుని సవతి కూతురు యడల సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించింది.

ఇంతలో తల్లి చనిపోయిన వార్త తన నవనాడుల్ని కృంగదీసింది. మరుక్షణంలోనే అనేక భావాలు. ‘జీవితంలో తల్లి ఏం సుఖపడింది కదా! ఇంకా ఆమె జీవితం కష్టాలు పాలవకుండా మరణంతోనేనా అమెకి విశ్రాంతి లభించింది’ అనుకుని గాఢంగా నిట్టూర్పు విడిచింది.

‘సీతా! మీ అమ్మగారు చనిపోయారు. శేషు అక్కడ ఉండడం ఎందుకు? మన దగ్గరకి తెచ్చేసుకుందాం,” భర్త అనగానే తనకి ఎంతో ఆనందం కలిగింది. శేషు తమ దగ్గరికి వచ్చేసేడు. సాధ్యమైనంత వరకూ భర్తకు ఎటువంటి లోటుపాట్లూ రాకుండా చూసుకునేది తను. భర్త చాలా మంచివాడు. లేకపోతే ఇంత ఔదార్యంగా ఎవరు ఉంటారు? తన తమ్ముడి బాధ్యత కూడా తనే తీసుకుంటున్నాడు అని తను అనుకుంది.

మరో రెండు సంవత్సరాలకి రాధ పుట్టింది. ఏమిటి విచిత్రమో కాని తన మనస్తత్వంలో మార్పు తను గమనించింది. భావ మనో వికారాలు తనలో చోటు చేసుకుంటున్నాయి. ఎంతయినా, తన బిడ్డ తన బిడ్డే, సవతి కూతురు సవతి కూతురే అన్న భావం తనలో కలిగింది. స్వార్థం పెరిగింది. అసూయ, ఈర్య పెరిగాయి. అసహనం పెరిగింది. సంకుచిత్వం తనలో చోటు చేసుకుంది. దానికి ఫలితమే సుజాత మీద విముఖత పెంచుకుని ద్వేషించడం ఆరంభించింది. ఇలా తను ద్వేషించిన సుజాతే తమని ఇలా ఆదుకుంది.

“ఏంటమ్మా! అలోచన్లు?” రాధ ప్రశ్నలో బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది సీతమ్మ.

34

సుజాత తను స్వాతంత్ర్య సమర యోధురాలిని అని ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం నుండి లాభాలు పొందాలని చూడలేదు. ఆమెలో నిర్లిప్తత – నిరాశ, అసంతృప్తి. అందుకే ఆమె తనను స్వాతంత్ర్య సమర యోధురాల్ని అని ప్రకటించుకోలేదు సమాజం ఎదుట.

తను కన్న కలలే పేక మేడల్లా కూలిపోతే తనకి పేరు ప్రతిష్ఠలెందుకు? ప్రతిఫలాలు అందుకోవడమేంటి? తాము చేసిన పనిలో తాము ప్రతిఫలం అశించలేదు. అయితే రాజశేఖరం తనూ ఒకటి అనుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మూడు ముళ్ళ బంధంతో ఒకటవుదామనుకున్నారు. అయితే తాము అనుకున్నది ఒకటి జరిగింది. మరియొకటి అయింది. రాజశేఖరం ఏమయ్యాడో తెలియకుండా పోయింది? అతనే లేనప్పుడు తనకి ఈ వైభోగాలెందుకు? పరువు ప్రతిష్ఠలు, పేరు ఎందుకు? అని నిర్లిప్తంగా ఉండిపోయింది.

స్వాతంత్ర్య పోరాటం ముందు, ఎంతమందో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పటి వాళ్ళు వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నారా? అలా ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళకి ఓ ఉనికి లేదు, అస్తిత్వం లేదు. అది ఎందుకు గాంధీజీ అహింసా పద్ధతిలో స్వాతంత్ర్య పోరాటం సాగించి దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారకులయ్యారు. అలాంటి బాపూజీని మొక్కుబడిగా కాకపోతే ఎవరు తలుచుకుంటున్నారు? అతని జయంతి రోజున జంతు బలులు, మందు పార్టీలు.

ఇక రాబోయే తరానికి గాంధీజీ ఎవరు? గాంధీ జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం అని అడుగుతారు. ఆనాడు గాంధీజీ “కాంగ్రేసు దేశ స్వాతంత్ర్య కోసం ఏర్పడిన పార్టీ. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ పార్టీని రద్దు చేయవల్సిందే” అని అన్నారు.

అయితే వాస్తవానికి అలా జరిగిందా? జరగలేదే? స్వాతంత్ర్యం సిద్ధించి అర్ధ శతాబ్దం దాటిపోతున్నా ఆ పార్టీ అలాగే ఉంది. లేని వాళ్లు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు. విదేశీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలుచున్న వాళ్ళు అని సమాధానం వస్తుంది.

చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందాన ఆ పార్టీ వల్ల బాగుపడ్డవాళ్ళు ఎంత మందో? పదువులు పొందిన వాళ్ళు ఎంతమందో? పేరు ప్రతిష్ఠలు పొందిన వాళ్ళు ఎంతమందో? పదవుల్ని అడ్డు పెట్టుకుని కోట్లకొలదీ ఆస్తిపాస్తులు పెంపొందించుకున్నవారు ఎంతమందో?

ఎన్నో అలజడులు – ఎన్నో ఆటుపోట్లు, దేశం ఎదుట ఎన్నో సమస్యలు. అన్నిటికన్నా బాధ కలిగించే విషయం పదవీకాంక్ష, నిస్వార్థంగా దేశ సేవ చేద్దాం అన్న తలంపు గల నాయకులే దేశంలో కరువయ్యారు. అందుకే కొంతమంది పెద్దలు “ఇప్పటి నాయకుల పరిపాలన కంటే ఆ తెల్ల దొరల పరిపాలనే మిన్న” అనే వారంటే నేటి పాలకుల్లో ఎంత స్వార్థపరత పెరిగిపోయిందో అని అనిపించకమానదు ఆ మాటలు విన్నవాళ్ళకి.

ఇప్పటికి సుమారు ముప్పది, నలబది సంవత్సరాల క్రితమే సినీ రంగంలో వారసత్వ పద్ధతి వచ్చేసినట్టే రాజకీయ వాతావరణాన్ని కూడా ఈ వారసత్వ దిగుమతి అయింది. రాజకీయ నాయకుల వారసులే రాజ్యమేలడానికి, పదవులు పొందడానికి ప్రజా సేవ ముసుగులో ఊసరివెల్లుల్లు చొచ్చుకురావడం చూస్తే దేశం ఎంతగా దిగజారిపోతోంది స్వార్థపరుల వల్ల అనే బాధ మనస్సుకి ముల్లులా గుచ్చకునేది.

ఇలాంటి వాతావరణానికి దూరంగా ఉండిపోవాలనుకుంది సుజాత. అయితే పరంధామయ్యగారు, మరికొంత మంది పెద్దలు ఊరుకోలేదు. “స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకపోయినా, స్వాతంత్ర్య పోరాటంలో కొద్ది కాలం మాత్రమే పాల్గొన్న వాళ్ళు, పాల్గొనని వాళ్లు, స్వాతంత్ర్య సమర యోధులం మేము అని పదవులూ, ప్రయోజనాలు పొందుతుంటే నీవు అలా మడికట్టుకుని కూర్చుంటే లాభంలేదు అమ్మాయ్!” అని సుజాతకి నచ్చజెప్పారు. వాళ్ళ మాటలు కాదనలేక పోయంది సుజాత.

సుజాత స్వాతంత్ర్య సమరయోధురాలుగా గుర్తించి ఆమెకి కూడా ప్రభుత్వం స్థలమిచ్చింది. ఫించను సదుపాయం కల్పించింది. సుజాత తనకిచ్చిన స్థలంలో దాతల ఆర్థిక సహకారంతో ఆ కొత్త ఆశ్రమాన్ని స్థాపించింది. ఆ అశ్రమానికి “సేవా కుటీరం” అని పేరు పెట్టారు.

సేవా కుటీరంలో అక్కడున్న ఆడవాళ్లు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. క్రొవ్వొత్తులు, సబ్బులు, అగ్గిపెట్టెలు తయారీ మొదలైన చిన్న చిన్న వస్తువులు నిత్యావసర వస్తువులు అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది ఆడవాళ్ళు బట్టలు కుట్టడం, ఎంబ్రాయిడరీ, కుట్లు, అల్లికలు మొదలైన రకరకాల వస్తువులు తయారు చేసి అలా తయారయిన వస్తువుల్ని బజారులో అమ్ముతున్నారు. అలా అమ్మగా వచ్చిన డబ్బు ఆశ్రమానికి ఖర్చు చేస్తున్నారు.

ఆశ్రమంలో తయారయిన వస్తువుల్ని బజారులో అమ్మడానికి ఆశ్రమం తరుపు నుండి ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ వస్తువుల్ని అమ్మే పని సంఘం చూసుకుంటుంది.

మిషను మీద బట్టలు కుడ్తోంది రాధ. అక్కడే ఓ కుర్చీలో కూర్చుంది సుజాత. వెంటనే చప్పున లేచి నిలబడింది రాధ. “కూర్చో.. కూర్చో” అంటూ వారించింది సుజాత. రాధ కూర్చుంది.

“రాధా! నీతో మాట్లాడాలి.”

“ఏ విషయం గురించి అక్కా?”

“శేషు గురించి. విడాకుల కాగితాలు పంపేడు.”

రాధ మౌనం గుర్తించిన సుజాత తిరిగి అంది.

“శేషు విడాకులకి అనుమతి ఇమ్మనమని కోర్టు వారిని కోరుతున్నాడు. కోర్టు నుండి మనకి చట్టపరంగా విడిపోడానికి పిలుపువస్తుంది. ఇద్దరికీ విడాకులు సమ్మతమయితేనే విడాకులు మంజూరవుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేకపోయినా విడాకులు కష్టమే. నీకు విడాకులు ఇష్టమయితే పరవాలేదు. లేకపోతే చెప్పు. లాయరు ద్వారా విడాకులు మంజూరు కానట్లు చూద్దాం” సుజాత అంది.

విరక్తిగా నవ్వింది రాధ. “నా భర్త మీద నాకు ఇష్టం ఉన్నంత మాత్రాన్న సరిపోతుందా? నా భర్తకి కూడా నా మీద ఇష్టం ఉండాలి. అభిమానం ఆప్యాయత ఉండాలి. ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఒక్కరిలో ఉంటే సరిపోదు. ఇద్దరిలోనూ ఒకరిమీద ఒకరికి విశ్వాసం ఉండాలి. నమ్మకం ఉండాలి. అది లేనప్పుడు మన ప్రయత్నాలు వ్యర్థమే.

శేషుకి నా మీద ఇష్టం కన్నాం నా వల్ల సంక్రమించే ఆస్తి మీద మోజు. ఏదో భ్రమలోపడ్డాను. భ్రమలో జీవించాను. ఆ భ్రమ నీటి బుడగలా పేలిపోయిన తరువాత తెలిసింది. జీవితంలో నేను ఎలా మోసపోయాను, దేన్ని కోల్పోయానని. దీపపు కాంతి ఆకర్షణకి లోనయి ఆ దీపపు కాంతి, మంటల్లో పడి మసిబారిపోయిన దీపపు పురుగుగా మిగిలిపోయాను నేను. శేషు నిన్ను కాంక్షించేడు. నీవు దక్కకపోయే సరికి నీ మీద అక్కసు పెంచుకున్నాడు. నీ మీద ఉన్నవీ లేనివీ చెప్పి నాన్నగారి మనస్సు విరిచాడు. దాని ఫలితం ఏంటయిందో నీకే తెలుసు.

ఇక నేను శేషును ఇష్టపడ్డాను. అతనికి నేనంటే ఇష్టం లేదు. ఆస్తి కోసం నన్ను పెళ్ళిచేసుకున్నాడు. దాని పర్యావసానం ఏఁటయిందో నీకు తెలుసు. ఇప్పుడు శేషు మీద నాకున్నది అభిమానం కాదు అసహ్యం. కోర్టు జోక్యంతో మా ఇద్దరినీ కలపడానికి చూస్తే మా మనస్సులు – శరీరాలూ సమాంతర రేఖల్లా అలా చీలి ఉంటాయేకాని ఎప్పటికీ కలవవు. అలాంటి మనుష్యుల్లో అసలు స్పందన అనేది ఉండనే ఉండదు.

ఆకర్షణ – అనురాగం – స్పందన లేనటువంటి నిస్సారమయిన జీవితం నాకక్కర్లేదు. స్పందన లేకుండా ఏ కోర్టులూ బలవంతంగా కాపురాలు చేయించలేవు. కాపురం చేయాలని కోర్టు ఆదేశించినా చట్టపరంగా అధికారమిచ్చినా ఆ కాపురం బలవంతపు కాపురమే. అందులో ఆనందం కొరవడుతుంది,” రాధ గంభీరంగా అంది సుజాతతో.

శేషుతో వైవాహిక జీవితం పంచుకోడానికి విముఖతగా ఉన్న రాధ వేపు అలా చూస్తూ ఉండిపోయింది సుజాత. నిట్టూర్పు విడిచింది. ‘శేషు వల్ల ఎన్ని హింసలకి గురి అయితే కాని రాధ ఇలా మాట్లాడుతుంది. రాధ గృహ హింసకి గురయింది. మానసికంగా కృంగిపోయింది. మనస్థైర్యాన్ని కోల్పోయింది. అందుకే ఇలా విరక్తిగా మాట్లాడుతోంది రాధ.’ అని అనుకుంది సుజాత.

“ఒక్క మాట అడగనా?”

“అడుగు అక్కా, ఆ హక్కు నీకు ఎప్పుడూ ఉంది?”

“జీవితాంతం ఇలాగే ఉండిపోతావా?”

“నీవు ఉండటం లేదా అక్కా”

“నా విషయం వేరు. మేమిద్దరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పెళ్ళి చేసుకుందామనుకున్నాం. మా ఆశ నెరవేరకుండా జరిగింది మరోలా జరిగింది. మా ఇద్దరికీ వివాహం జరగలేదు. వైవాహిక జీవితం గడపలేదు. ఇక నీ విషయం వేరు. మీకు వివాహం జరిగింది. కొన్నాళ్ళు వైవాహిక జీవితం గడిపారు.” అంది సుజాత.

రాధ మౌనం వహించింది. ఆ మౌనం సుజాతను అసహనానికి గురి చేస్తోంది. అయినా దాన్ని బయటకు కనబడనీయటం లేదు సుజాత.

“ఇంకెవరినీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?”

“ప్రస్తుతానికి లేదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. శేషుతో వైవాహిక జీవితంలో హింసను, అశాంతిని చవిచూసిన నేను ప్రస్తుతానికి వివాహమంటేనే విముఖతగా ఉంది.”

“అందరూ శేషు మాదిరిగా ఉండరు రాధా! మంచి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ శేషులాంటి వాళ్ళే అని అనుకోవడం మన పొరపాటు.”

“నాకు ఎదురయిన అనుభవంతో అలా అనుకోవల్సిన వస్తోంది. అయినా ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని ముఖం మీద వ్రాసి ఉండదు కదా! వారి ప్రవర్తన, నడవడికను బట్టి మనం మంచివాళ్ళూ అని నిర్ణయానికి వస్తాం.”

“అది నిజమేలే రాధ! ఒక్క మాట మోహను కృష్ణ గారి గురించి నీ అభిప్రాయమేంటి?”

“ఎవరూ? ఆశ్రమ వాసులందరికీ వైద్యం చేస్తున్న డాక్టరు గారి గురించా?”

“అవును”

“చాలా మంచి వారనిపిస్తోంది. చాలా ఉత్తముడులా అగుపిస్తున్నారు. మనిషికి గర్వం లేదనిపిస్తోంది. ఎప్పుడు చూసినా చిరునవ్వుతో రోగుల్ని పలకరిస్తూ సరదాగా మాట్లాడుతారు. చూసిన వెంటనే చూసిన వాళ్ళకి ఇతను మంచి మనిషి అనే అభిప్రాయం ఏర్పడుతుంది.”

రాధ ఆలోచనల్లో పడింది. ఎప్పుడూ డాక్టరు గారి గురించి అక్క తన దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. ఈ రోజున ఒక్కసారిగా అతని గురించి తన దగ్గర ఎందుకు ప్రస్తావన తెచ్చినట్టు? ఆలోచిస్తోంది.

రాధ ఆలోచన్లు అలా ఉంటే సుజాత ఆలోచన్లు మరో విధంగా ఉన్నాయి. రాధకి డాక్టరు గారి మీద మంచి అభిప్రాయం ఉంది. అది చాలు తాను సంకల్పించిన పని త్వరగా పూర్తి చేయడానికి.

“ఎందుకక్కా డాక్టరిగారి ప్రస్తావన నా దగ్గర తెచ్చావు?”

“సమయం వచ్చినప్పుడు చెప్తాను.”

“అంత రహస్యమా? అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా!” రాధ కంఠంలో కుతూహల భావం.

“అతని గురించి నీవు అడుగుతున్నప్పుడు అతని గురించి నీకు చెప్పాలి రాధా! అలాగే అతనూ వివాహితుడే. అయితే తొలి కానుపులోనే అతని భార్య చనిపోయింది. బిడ్డ కూడా బ్రతకలేదు. భార్యను ఎంతో బాగా చూసుకునేవాడు. భార్యంటే మిక్కలి ప్రేమ. ఆమెను ఎంతో బాగా ఆరాధించేవాడు, ప్రేమించేవాడు. అందుకే భార్య పోయిన తరువాత పిచ్చివాడయ్యాడు. అందుకే భార్య జ్ఞాపకాల నుండి దూరంగా ఉండాలన్న తలంపుతో ఈ ఊరు వచ్చారాయన. ఇక్కడ ప్రాక్టీసు మొదలుపెట్టాడు.

ఆశ్రమంలో నున్నవారికి ఏ మాత్రం అనారోగ్యం చేసినా వైద్యం చేస్తూ ఉంటాడు. ఇక్కడ పరిసరాల ప్రభావం అనుకుంటాను. అతనిలో మార్పు కనిపించింది. ఇప్పుడు గతాన్ని మరిచిపోయి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ తన పూర్వ స్థితికి చేరుకోగలిగాడు. అతని జీవితం సక్రమంగా సాగిపోతోంది.”

“డాక్టరు గారి గురించి నాకెందుకు చెప్తున్నావు అక్కా”

“అక్కడికే వస్తున్నాను. రాధా నాకు ఈ మధ్య ఓ ఆలోచన వచ్చింది. శేషుతో జీవితం పంచుకుని కాపురం చేయడం నీకు ఎలాగూ ఇష్టం లేదు. అమ్మకి వయస్సు వస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అమ్మగాని, నేను గాని ఎప్పుడూ నిన్ను అంటి పెట్టుకుని ఉండలేము కదా. నా జీవితం ఎలాగూ ఇలా అయింది. నీ జీవితమేనా మ్రోడు బారిపోకూడదు.”

సుజాత చెప్తున్నది మౌనంగా తల వొంచుకుని ఆలోచిస్తోంది రాధ. సుజాత తిరిగి మాట్లాడుతోంది.

“నీకు విడాకులు రేపో, ఎల్లుండో రాకమానదు. విడాకులు వచ్చిన తరువాత నీ జీవితం ఒంటరిగా ఉండిపోకూడదు.”

“అంటే?”

“ఆ తరువాత నీవు మోహను కృష్ణను పెళ్ళి చేసుకోవాలి. అతనంటే నీకు ఇష్టం ఉంది కదా. అతడ్ని పెళ్ళి చేసుకుని అతని సహకారంతో నీవు నీ సంసార నావ ఈడ్చుకుని ముందుకు సాగిపోతూ ఉంటే మీ దాంపత్య జీవితం చూడాలని ఉంది.”

సుజాత మాటలు వింటున్న రాధ కళ్ళల్లో విస్మయం. కళ్ళు దించుకుని నేలవేపు చూస్తోంది.

“ఏఁ అతడ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా?”

“అతని ఉద్దేశం తెలుసుకోవాలి కదా!”

రాధ తీరును బట్టి ఈ సంబంధం అంటే రాధకి అభీష్టమే అన్న విషయం గుర్తించింది సుజాత. “అతడి ఉద్దేశం తెలుసుకున్న తరువాతే నిన్ను అడుగుతున్నాను. అతనికి నిన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమే. నీ గురించి అతనికి వివరంగా చెప్పాను.”

“నా గురించి విని అతను ఏఁటన్నారు?”

“నీ గురించి విని జాలిపడ్డారు. విచారించారు. ఇద్దరం ఒకే చెట్టు కొమ్మలం అని అన్నారు. అందుకే కాబోలు మా మధ్య ఈ పెళ్ళి ప్రస్తావన వచ్చింది” అన్నారు గాఢంగా నిట్టూర్పు విడుస్తూ “అలాంటి మంచి మనిషి నీకు భర్తగా రాబోవడం నీ అదృష్టం రాధా!” అంది సుజాత. .

“అతనికి అభ్యంతరం లేకపోతే నాకూ ఇష్టమే అక్కా. శేషు వలన గృహ హింస అనుభవించిన నేను తిరిగి ఆ రొంపిలోకి వెళ్ళకూడదు అని అనుకున్నాను కాని డాక్టరుగార్ని చూసిన తరువాత నా అభిప్రాయం తప్పనిపించింది,” రాధ అంది.

“నీవెంత మంచిదానివే అమ్మాయ్! రాధ జీవితం ఏంటిలా తయారయింది? దాని జీవితం ఇలా మ్రోడులా ఉండిపోవల్సిందేనా అని నేను చింతించని సమయం లేదు. కంటినిండా కునుకు రావడం లేదు. నీవు చేస్తున్న మేలు మా కోసం నీవు పడున్న పాట్లు చూస్తుంటే అనుక్షణం మేము నీకు చేసిన అన్యాయానికి సిగ్గుతో చితికిపోతున్నాం. నీకు ఆ భగవంతుడు మంచి మనస్సు ఇచ్చాడు.” సుజాత మాటలు విన్న సీతమ్మ అక్కడికి వచ్చి అంది.

మనిషిలో మార్పు సహజం. ఆ మార్పుతోనే వాళ్ళ మనస్తత్వం మారుతుంది. వాళ్ళ ఆలోచనా విధానం మారుతుంది. వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు అద్దంలో ప్రతిబింబం అగుపించినట్లు స్పష్టంగా అగుపడ్డాయి. వాళ్ళలో పశ్చత్తాపం కలుగుతుంది. బాధ కలుగుతుంది. తమ బాధని పశ్చత్తాపాన్ని మాటల రూపంలో వెల్లడి చేయడానికి ప్రయత్నిస్తారు. సీతమ్మ విషయంలో అదే జరిగింది.

మాటి మాటికి తనని పొగుడూ ములగ చెట్టు ఎక్కించడం సుజాతకి ఇష్టం లేదు. అందుకే “నా వాళ్ళకి ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? అన్ని విషయాలూ నీవు విన్నావు కదమ్మా! ఈ పెళ్ళి విషయంలో నీ ఉద్దేశం ఏంటి?” సుజాత సీతమ్మని అడిగింది.

“ఇంకా అడుగుతావేంటే అమ్మాయ్! మళ్ళీ చెప్తున్నాను విను రాధ జీవితం ఇలా మ్రోడులా మిగిలి పోవల్సిందేనా అని కుమిలి పోతున్న సమయంలో దాని జీవితాన్ని చిగురింపచేసి నందనవనం చేస్తానంటే మాకు ఆనందం కాదూ!?”

“మాకు నీవు చేసిన ఉపకారం జన్మజన్మలకి మరచిపోలేము,” మరో పర్యాయం సుజాతను పొగిడింది సీతమ్మ. ఇలాంటి మనుష్యులో కష్టమొచ్చినా చెడు జరిగినా కష్టమే అనుకుని నిట్టూర్పు విడిచింది సుజాత.

(ఇంకా ఉంది)

Exit mobile version