కొడిగట్టిన దీపాలు-2

0
2

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]

3

[dropcap]రో[/dropcap]జులు గడుస్తున్న కొలదీ మాధవరావు ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. మెరుగుపడటం లేదు. ఇక లాభం లేదు కొడుక్కి ఈ విషయం తెలియజేయడం మంచిది అని అనిపించింది మీనాక్షికి. అదే ఉద్దేశంలో ఉన్నాడు విశాలగుప్తా.

ఎందుకంటే రాజశేఖరానికి అనుమానం వచ్చినట్టుంది. తనతో ఓ పర్యాయం “బాబాయ్! ఈ మధ్య నాన్నగారిలో ఏదో తేడా కనిపించింది. నాన్నగారి ఆరోగ్యం బాగుందా? ఏ సమస్యా లేదు కదా! మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకనిపిస్తోంది. నాన్నగారు నీరసంగా కూడా అగుపడ్తున్నారు” అని అన్నాడు.

“మీ నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు. లేనిపోని ఆలోచన్లు పెట్టుకుని నీ ఆరోగ్యం, చదువూ పాడు చేసుకోకు. ఇలా అయితే నీ చదువు సక్రమంగా సాగదు. పని ఒత్తిడి వల్ల కొద్దిగా నీరసంగా ఉన్నారు. మీ నాన్నగారిని చూసుకోడానికి మేము లేమా?” అని విశాలగుప్తా రాజశేఖరానికి సర్ది చెప్పాడు. అంతేకాని అసలు సంగతి చెప్పలేదు. చదువుకుంటున్న ఆ అబ్బాయి చదువు ఎందుకు పాడుచేయడం? అసలు విషయం చెప్తే బెంబేలు పడ్తాడు అని అనుకున్నాడు విశాలగుప్తా. అయితే చివరికి చెప్పక తప్పలేదు మీనాక్షి ఒత్తిడి వల్ల,

“బాబాయ్! నాకు ఎందుకు తెలియజేయలేదు. నాకు మొదటే అనుమానం వచ్చింది. నన్ను అందరూ మధ్య పెట్టారు” నిష్ఠూరంగా అన్నాడు రాజశేఖరం. విశాలగుప్తకి ఏం చెప్పాలో పాలుపోవటం లేదు. “నీ చదువు పాడవుతుందని” నీళ్ళు నముల్తూ అన్నాడు.

“ఏంటి బాబాయ్! జన్మనిచ్చిన తల్లిదండ్రుల క్షేమం కన్నా నాకు చదువు ముఖ్యమా? నా తల్లిదండ్రులే లేకపోతే నేను లేనే లేను. ఒక్కసారి మన బాల్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనకి కళ్ళెదుట కదలాడేది తల్లిదండ్రుల స్మృతులే. వాళ్ళు తమ పిల్లల కోసం చేసిన త్యాగాలే. వాళ్ళు పిల్లల అవసరాలు తీరుస్తూ, పిల్లలకి తమ ప్రేమ, వాత్సల్యం చూపించేది అమ్మ అయితే కష్టపడి పని చేసి చెమటోడ్చి సంపాదించి తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి ప్రయత్నిస్తాడు నాన్న. ఇద్దరి త్యాగాలూ మరిచిపోలేనటువంటివి. అటువంటి నాన్న కన్నా నాకు చదువు ముఖ్యమా బాబాయ్!” తిరిగి అన్నాడు రాజశేఖరం.

“రాజా! ఇందులో బాబాయ్ తప్పేం లేదు. నేనే తెలియజేయ వద్దన్నాను నీకు” మీనాక్షి అంది కొడుకుతో.

“ఎంత పని చేశావమ్మా! జీవిత చరమాంకంలోనేనా తండ్రికి సేవ చేసే అవకాశం నాకు కలిగించలేదు. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా?” నుదురు కొట్టుకుంటూ అన్నాడు రాజశేఖరం. అతని మానసిక క్షోభని చూసి తల్లడిల్లి పోవడమే తప్ప ఏం చేయలేకపోయారు ఆ కుటుంబ సభ్యులు.

తండ్రి పరిస్థితిని కొద్దిగా అర్థం చేసుకుంటున్నాడు ఎనిమిదేళ్ళ వేణు. కాని జ్ఞానం తెలియని పసిపిల్ల కళ్యాణికి పరిస్థితులు అర్థం కావటం లేదు.

నీరసంగా కళ్ళు తెరచాడు. మాధవరావు. తను అవసాన దశలో ఉన్నానన్న విషయం అతనికి బాగా తెలుసు. తన జీవిత అంతిమావస్థలో కొడుకుతో తన అంతరంగిక విషయాలు తెలియజేయాలన్నదే అతని ఆశ, ఆరాటం కూడా. కొడుకుని చూడగానే సంతోషంగా మెరిసింది అతని కనుదోయి.

“నాన్నగారూ!”

“ఊఁ!!!”

“ఎలా ఉంది మీ ఆరోగ్యం?”

“చూస్తున్నావు కదా రాజా! నీతో ఒక్కమాట చెప్పాలి. ఇప్పటివరకూ ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా నేను ఉన్నాను. నేను పోయిన తరువాత నా బాధ్యతను నీవు తీసుకోవాలి” కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మాధవరావు.

కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతూ ఉండగా రాజశేఖరానికి మాట పెగలనీయకుండా దుఃఖం అడ్డుపడూ ఉంటే “తప్పకుండా నాన్నగారూ! నా వాళ్ళకి ఏ లోటూ రానీయను.” ఇలా అంటున్న సమయంలో అతని స్థిర నిర్ణయాన్ని తెలియజేస్తూ అతని దవడ ఎముక కదిలింది.

“రాజా! మరోమాట. విశాలగుప్త బాబాయ్ చాలా మంచివాడు. నీతి, నిజాయితీ గల మనిషి. ఉత్తముడు కూడా. ఇన్నాళ్ళూ కష్టాల్లో ఉన్న మన కుటుంబాన్ని ఆదుకున్నాడు. మన కుటుంబానికి ఎంతో డబ్బు సహాయం చేసాడు. అయితే అతని ఋణాన్ని నేను ఉంచుకోలేను. అతనిచ్చిన ప్రతీ రూపాయికీ పద్దు నేను వ్రాసాను. నీకు తెలియజేయకుండా ఓ పని చేశాను” కొడుకు ముఖం వేపు నిశితంగా చూస్తూ అన్నాడు మాధవరావు. మాట్లాడకుండా తండ్రి చెప్పింది వింటున్నాడు.

“బాబాయ్‌కి కూడా చెప్పకుండా (వారిస్తున్నా వినకుండా) అతని పేరున మన ఇల్లు (వీలునామా) వ్రాసి రిజిష్టరు చేశాను. ఈ విషయాలు బాబాయ్‌కి తెలియదు. తెలిస్తే ఒప్పుకోడు. నేను చనిపోయిన తరువాత ఆ రిజిష్టరు చేయించిన పత్రాలు బాబాయ్‌కి అందచేయాలి. ఈ మాటే ఓసారి బాబాయ్‌తో అంటే అలాంటి ఉద్దేశం మార్చుకోమని నన్ను వారించాడు. కాని అతని ఋణం తీరకుంటే నా ఆత్మకి శాంతి ఉండదు” ఆయాసపడ్తూనే అన్నాడు మాధవరావు.

“మీ ప్రాణాలు, మీ ఆశయాల కంటే ఇల్లు ముఖ్యం కాదు నాన్నగారూ! మీరే లేనినాడు ఇల్లు నాకెందుకు నాన్నగారూ? ఇక విశాలగుప్త బాబాయ్ గురించి నాకు తెలియదా? మీ రక్తం పంచుకుని పుట్టిన స్వంత బాబాయ్‌లకేనా స్వార్థం ఉంటుంది కాని, రక్త సంబంధం కాదు. కేవలం స్నేహ సంబంధం మాత్రమే అతనితో. కులం వేరు – అయినా విశాలగుప్త బాబాయ్ మన కోసం ఇన్ని విధాలుగా సహాయం చేస్తుంటే అతడి మంచితనాన్ని ఎలా మరచిపోగలను?”

కొడుకు మాటలు విన్న తరువాత మాధవరావుకి పెద్ద బరువు దించినంత రిలీఫ్ కలిగింది. తృప్తిగా శ్వాస వదిలాడు. కొడుకు తల మృదువుగా ప్రేమగా నిమురుదామనుకున్నాడు కాని అది సాధ్యపడలేదు. తండ్రి ఉద్దేశం గ్రహించి కొడుకు తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

తల్లిదండ్రుల వల్లనే పిల్లలకి కుటుంబంలో అనుబంధాలు తెలుస్తాయి. కుటుంబ వ్యవస్థలోని పరస్పర ప్రేమలు, కదలకుండా నిలుస్తాయి. ముద్దు చేసి గోరుముద్దలు తినిపించి, వినయ విధేయతల్ని, సంస్కారం, పరోపకార భావం ఇవన్నీ తల్లిదండ్రుల వలనే పిల్లలకి అలవడుతాయి. ‘విశాలగుప్త బాబాయ్ తల్లిదండ్రులూ ఉత్తములై ఉంటారు. అందుకే అతనిలో పరోపకార భావన మెండుగా ఉంది’ అని అనుకున్నాడు రాజశేఖరం.

తండ్రి మరణం రాజశేఖరాన్ని కృంగదీసింది. తండ్రి పార్థివ శరీరంపై పడి బోరున ఏడుస్తున్నాడు. మీనాక్షి, శారద, రాజశేఖరం అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియని వయస్సులో ఉన్న చిన్నపిల్లలు వేణు, కళ్యాణి అలా అయోమయంగా చూస్తూ నిలబడ్డారు.

విశాలగుప్తా భార్య శారదని, మీనాక్షిని ఊరుకోబెడ్తోంది. విశాలగుప్తా మాధవరావు బావమరిదికి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏడుస్తున్న రాజశేఖరాన్ని ఓదార్చడం విశాలగుప్తాకి సాధ్యం కావటం లేదు.

మొదటే చెప్పుకున్నాం విధి చేతిలో మనిషి ఓ కీలుబొమ్మ, ఆటబొమ్మ. ఆ విధి మనిషిని ఆటబొమ్మగా చేసి ఆడించి వినోదిస్తుంది. ఆ విధే మానవుని మనుగడపై కటాక్షించని పక్షంలో వారి జీవితాల్లో మిగిలింది విషాదం మాత్రమే. ఆ విషాదానికి ఫలితంగా బాధితులు దుఃఖం, నిరాశ, అసంతృప్తికి లోనవుతారు. ఆ విధి చేతిలో చిత్తుగా ఓడిపోయింది మీనాక్షి.

“అలా ఏడవకండమ్మా! మీరు అలా ఏడుస్తే పిల్లలు మరింత డీలా పడిపోతారు. ధైర్యం తెచ్చుకోండమ్మా. పిల్లలు కోసమేనా మీరు ఆ ఏడుపు ఆపాలి” విశాలగుప్త భార్య మీనాక్షిని ఓదారుస్తోంది.

‘ఏడవనీ అలా చేస్తే గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కొంతయినా తేలికపడుతుంది. తగ్గుతుంది’ అని అనుకున్న విశాలగుప్త ఎప్పటికీ రాజశేఖరం ఏడువు ఆవకపోయేసరికి అతడ్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు.

“రాజా! ఏడవకు, ఏడ్చినంత మాత్రాన్న మరణించిన మీ నాన్నగారు తిరిగి వస్తారా? నీ కన్నా చిన్న వాళ్ళయిన నీ తోబుట్టువుల్ని, నీ తల్లిని నీవు ఓదార్చాలి. మీ అందరూ ఆనందంగా ఉంటేనే మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇప్పుడు నీ పని ఏడవడం కాదు. ఇప్పుడు జరపబోయే తంతు గురించి ఆలోచించు.”

“అవన్నీ నాకు తెలియవు బాబాయ్! అవన్నీ నీవే చూసుకోవాలి” వెక్కుతూ కళ్ళు తుడుచుకుంటున్న రాజశేఖరం అన్నాడు.

“అలాగే!” అంటూ బయటకు నడిచాడు విశాలగుప్త.

మనం సుఖంగా ఉన్న సమయంలో మేము మీ వాళ్ళం అంటూ అందరూ మన చుట్టూ తిరుగుతారు. అదే ఏ మాత్రం కష్ట పరిస్థితి మనకు వచ్చినా సుఖంలో మన చుట్టూరా తిరిగిన మనుస్యులే ముఖం చాటేస్తారు. ఇది లోక సహజం.

సుఖంలో మనకి ఎవరి సహకారం అక్కర లేకపోయినా కష్ట సమయంలో మనకి ఇతరుల సహాయం అప్పుడప్పుడు అవసరం అవుతుంది. మాధవరావు సంబంధీకులు ఏనాడో ముఖం చాటువేశారు. మీనాక్షి అన్నదమ్ముడు వస్తాడో, రాడో తెలియదు. ఎందుకుంటే అతడు భార్యా విధేయుడు. భార్య ఎంత చెప్తే అంత. ఆ కుటుంబం బాగోగులు చూడ్డానికి ఆ కుటుంబంలో ఏ సంబంధం లేని విశాలగుప్త తప్ప ఎవ్వరూ లేరు.

4

తమ్ముడు ధర్మారావును చూసి బోరున ఏడ్చింది మీనాక్షి. భావోద్వేగం వల్ల ఆమెకి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. ఈ కష్టకాలంలో బాధితులు ఎదుటి వాళ్ళ నుండి సాంత్వన కోరుకుంటారు. వారి ఓదార్పులో ఊరట చెందుతారు. కొంతయినా దుఃఖాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మానవ నైజం.

మీనాక్షి తమ్ముడు పేరుకి ధర్మారావే కాని అతని ఆలోచనలు, ఆచరణలు అన్నీ అధర్మమే, వక్రమైనవే. ఒక్క పైసా పెట్టుబడి పెడ్తే రూపాయి లాభం వస్తుందా, రాదా అని కాంక్షించే వ్యక్తి అతనికి తగ్గ భార్య నాంచారమ్మ.

టెలిగ్రామ్ అందగానే “మనకెందు కొచ్చింది ఈ లంపటం. ఇన్నాళ్ళూ ఎలాగున్నామో అలాగే ఉందాం. వాళ్ళ పాట్లు ఏవో వాళ్ళే పడతారు. వాళ్ళ ఏడుపు వాళ్ళే ఏడవనీ” భర్త ధర్మారావుతో అంది నాంచారమ్మ. భార్య మాటలు నిజమే అని అనిపించాయి ధర్మారావుకి. అయితే తనకి చెడ్డ పేరు వస్తుంది. అందరూ తనని ఆడిపోసుకుంటారు. మనస్సులో అక్కచెల్లెలు కుటుంబం మీద అభిమానం లేకపోయినా లోకానికి వెరిసి అయినా వెళ్ళాలనుకున్నాడు.

అంతేకాదు అతను ఫలాపేక్ష లేనిదే ఏ పనీ చేయడు. ఆ ఫలాపేక్ష ఏమిటో భార్యకి నచ్చజెప్పే ప్రయత్నంలో పడ్డాడు.

“నాంచారీ! నేనేఁ తెలివి తక్కువవాడ్ని అనుకుంటున్నావా? వాళ్ళకి ఇల్లు ఉంది. అర ఎకరం ఖాళీ స్థలం కూడా ఉంది. వాళ్ళని చేరదీసినట్టు చేరదీసి ఆ ఆస్తిపాస్తులు మన పేర వ్రాయించుకుందాం. అంతేకాదు మా అక్కయ్య, శారదా అప్పడాలు, వడియాలు తయారు చేసి అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు కదా! ఆ పనేదో మన ఇంట్లోనే చేస్తారు.

వేనీళ్ళకి చన్నీళ్ళు తోడయినట్టు దీని వలన మనకీ ఆదాయం వస్తుంది. అంతే అంటావా ఇంకా విను. ఇంటి చాకిరీ నీవు ఒక్కర్తివే చేయ అవసరం లేదు. వాళ్ళు వస్తే, పని మనిషిని మాన్పించి వేస్తే డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. ఇంటి పనులు వాళ్ళు చేస్తుంటే నీకు కూడా కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది. నీవు కాలు మీద కాలు వేసుకుని ఉండవచ్చు.”

భర్త మాటలు నాంచారమ్మను ఆలోచనలో పడవేసాయి. అతను చెప్పింది నిజమే అని అనిపించింది. ఇంటి చాకిరీ చేయలేక తను నానా హైరానా పడిపోతోంది. ‘ఇంటి పని, వంట పని చేసి పెట్టే మనుష్యులు దొరుకుతుంటే తను ఎందుకు కాదనాలి. అంతే కాదు బంగారం గ్రుడ్లు పెట్టే బాతులు తన ఆడబడచూ వాళ్ళూ, డబ్బు సంపాదించే యంత్రాలు తన భర్త చెప్పినట్లు రేపొద్దున్న అప్పడాలు, వడియాలు తయారు చేసి అమ్మి డబ్బు సంపాదించే సంపాదనాపరులు’ అని అనుకున్న నాంచారమ్మ “సరే పదండి” అంది భర్తతో. అందు మీదట భార్యాభర్తలిద్దరూ ఇలా వచ్చారు.

“ఊరుకో అక్కయ్యా! పోయిన వాళ్ళతో మనం పోలేము కదా! అతని ఆయుష్షు తీరిపోయింది. మిమ్మల్ని ఇలా ఏకాకులుగా చేసి వెళ్ళిపోయాడు. పోయిన వాళ్ళంతా మంచివాళ్ళే నీవు ధైర్యం తెచ్చుకుని పిల్లలకి ధైర్యం చెప్పాలి” అని అక్కయ్యని ఓదారుస్తూ అన్నాడేకాని ఆ మాటలు అతని నోటి వెంబడి మనస్ఫూర్తిగా రాలేదు అని అనిపించింది మీనాక్షికి,

“అవును వదినా నా తమ్ముడు చెప్పింది నిజం. మీరే ధైర్యం తెచ్చుకోవాలి. పిల్లలకి ధైర్యం చెప్పాలి.” అంది నాంచారమ్మ కూడా. ఏ రక్త సంబంధం, ఎటువంటి బంధుత్వం లేకపోయినా విశాలగుప్తకి ఆ ఇంటిలో ఎంత ప్రాముఖ్యత ఉందో; కుటుంబ సభ్యులందరూ అతని మాటలకి ఎంత విలువిస్తారో గమనించిన ధర్మారావుకి, నాంచారమ్మకి మంటగా ఉంది. ఈర్ష్యతో రగిలిపోతున్నారు వారు.

అంతేకాదు గోరుచుట్టు మీద రోకటి పోటులా విశాలగుప్త తన బావగారి వైద్యం నిమిత్తం. డబ్బు మదుపు పెట్టాడని దానికి ప్రతిఫలంగా తన బావగారు మాధవరావు అతనికివ్వవల్సిన డబ్బుకి బదులుగా ఇంటిని అతని పేరున రిజిష్టరు చేశాడని తెలిసిన తరువాత ఆ దంపతులకి విశాలగుప్త మీద మరింత కోపం, ఈర్య కలిగాయి. అయితే మ్రింగలేక, కక్కలేక అలా మనస్సులోనే మథనపడున్నారు వాళ్ళు.

ఆ తరువాత వాళ్ళకి తెలిసిన విషయమేమిటంటే విశాలగుప్త కొంత డబ్బు మీనాక్షి పేరు మీద బ్యాంకులో జమ చేశాడని. ఈ విషయం ఆ దంపతులకి కొంత ఊరట కలిగించాయి. అందుకే మౌనం వహించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here