Site icon Sanchika

కొడిగట్టిన దీపాలు-20

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 20వ భాగం. [/box]

39

[dropcap]ఓ[/dropcap] రోజు సాయంత్రం వేళ బీచ్‌లో కళ్యాణి రాజేష్ ఇసకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సముద్ర తరంగాలు ఉవ్వెత్తున ఎగిపిసడ్తూ ముందుకు వస్తున్నాయి. నురుగు పాల నురుగును గుర్తుకి తెస్తోంది. ఒడ్డుకి వచ్చిన కెరటం తిరిగి వెనక్కి జరిగిపోతోంది.

ఆ కెరటంతో పాటే వచ్చిన ఎండ్రకాయలు ఇసకతో కన్నాలు చేసుకుని దూరిపోతున్నాయి. బీచ్ మహాసందడిగా ఉంది. చిన్న పిల్లలు కేరింతలు కొడ్తూ ఆడుతున్నారు. పెద్ద వాళ్ళు లోకాభిరామాయణంలో మునిగి తేలుతుంటే యువ జంటలు తన్మయత్వంతో ఒకర్ని మరొకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. పరిసరాలను పరికించడంలో లీనమయింది కళ్యాణి.

“కళ్యాణీ!”

“ఊఁ!!!”

“ఈ మధ్య నిన్ను కలవలేకపోయాను, ఎందువల్లనో తెలుసా?”

“చెప్తే కదా తెలుస్తుంది.” ఆమె మాటలకి రాజేష్ పకపక నవ్వాడు.

“నేను హైస్కూలులో చదివే రోజుల్లో ఈ శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు.” “తెలుసు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు,” కళ్యాణి గొంతుకలో విసుగుదల అగుపించింది.

“విసుక్కోకు కళ్యాణి. ఈ మధ్య శ్రీధర్ ఓ రోగిని నాకు అప్పగించాడు. అతను శ్రీధర్‌కి కావల్సిన బంధువట, అతడ్ని బ్రతికించడానికి చాలా ప్రయత్నించాను నేను. కాని ప్చ్…! ఏఁ లాభం లేదు.”

“అంటే?”

“అతడు మామూలు రోగి అనుకుంటున్నావా? అతను మందు మనిషి. ఆడ పిచ్చి ఉన్న మనిషి, మందు త్రాగి త్రాగి ఊపిరితిత్తులు పాడయి, ముండల్ని మరిగి వొళ్ళంతా సుఖ వ్యాధుల్లో పుచ్చిపోయింది. శ్రీధర్ అభ్యర్థన కాదనలేక వైద్యం చేస్తున్నాను కాని ఏఁ లాభం లేదు. అతను జీవించే కాలం చాలా తక్కువ.”

“అతని పేరు.”

“శేషు”

“శేషా?” అనుకున్న కళ్యాణి ఉలిక్కి పడింది. “శేషా?” అంది పైకే.

“ఏఁ అతను నీకు తెలుసా?” రాజేష్ అడిగాడు కళ్యాణిని. ఆమె బుర్ర అడ్డంగా తిప్పింది.

“మరి.”

“ఆ పేరు ఎక్కడో విన్నాను,” అని అనుకున్న కళ్యాణి ఎక్కడ విన్నది ఆలోచిస్తోంది.

“ఆఁ జ్ఞాపకం వచ్చింది. ఆ శేషు కాదు కదా! రాజేష్”

“ఆ శేషంటే?”

“అదే మా సుజాతక్క చెల్లెలు రాధను ఆమె ఆస్తి కోసం పెళ్ళి చేసుకుని ఆమెను చిత్రహింసలకు గురిచేసి చివరకు విడాకులిచ్చాడు.”

“ఆ రాధ ఇప్పుడెక్కడ ఉంది?”

“మ్రోడులా మిగిలిపోయిన రాధ జీవితంలోకి ఆశ్రమంలో రోగులకి వైద్యం చేస్తున్న డాక్టరు మోహను కృష్ణ ప్రవేశించారు. నిరాశ – నిర్లిప్తత చోటు చేసుకున్న ఆ హృదిలో పన్నీటి జల్లులు కురిపించి మ్రోడు బారిన ఆమె జీవితాన్ని నందనవనం చేసాడు.”

“అంటే రాధ మోహను కృష్ణని పెళ్ళి చేసుకుందా?”

“అవును.”

“చాలా అదృష్టవంతురాలు.”

“అంటే?”

“ఈ శేషు జీవించే కాలం చాలా తక్కువ. ఆ చిత్రహింసలో పాటు వైదవ్యం బాధను అనుభవించకుండా సుమంగళిగా జీవించే అవకాశం కలిగింది. ఆ శేషును రేపు శ్రీధర్ నర్సింగ్ హోమ్‍లో చూపిస్తాను.” అన్నాడు రాజేష్ కళ్యాణితో.

నలు వేపుల నుండి సంధ్యా చీకట్లు వ్యాపించాయి. క్రమంగా ఆ చీకట్లు చిక్కబడ్తున్నాయి. ఇంటికి వెళ్ళడానికి ఇద్దరూ లేచారు.

***

మర్నాడు రాజేష్, కళ్యాణి వెళ్ళేప్పటికి శేషు కిటికీలో నుండి బయటకు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. లోనికి అడుగు పెట్టిన కళ్యాణిని, రాజేష్‌ని గమనించలేదు అతను.

“శేషు గారూ!” ఉలిక్కిపడి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాడు శేషు.

“ఏఁటి డాక్టరు గారూ!?”

“మీ ఆరోగ్యం బాగు లేదు కదా! మీరు అలా తీవ్రంగా అలోచించకూడదు. విశ్రాంతి తీసుకోకూడదా?”

రాజేష్ మాటలకి శేషు పేలవంగా నవ్వాడు. “కొద్ది రోజుల్లో పోయే వాడికి విశ్రాంతి ఎందుకు డాక్టరు గారూ! ఇక ముందు ఏక విశ్రాంతే తీసుకుంటాను.”

శేషు మాటల్లో రాజేష్‌కి నిరాశ అగు పడింది.

“మీరు ఎందుకలా అనుకుంటున్నారు? మీరు తప్పకుండా బ్రతుకుతారు. ఈ పరిస్థితి మీరు అనుకున్నంత సీరియస్‌గా లేదు.”

రాజేష్ అలా అన్నాడే కాని అతని మనస్సులో చిన్న సందేహం. కొంపదీసి శ్రీధర్, తనూ అతని పరిస్థితి గురించి మాట్లాడుకున్న మాటలు గురించి విన్నాడా అనేదే రాజేష్ అనుమానం. –

అతని మాటలకి శేషు చిన్నగా మందహాసం చేసాడు. “నేను మీ మాటల్ని విన్నాను డాక్టరు గారూ!” అని అన్నాడు.

అయితే తను అనుకున్నది ఆలోచించినది నిజమేనన్న మాట. మాట మార్చాలి. శేషులో ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి. ప్రసంగాన్ని మరో వేపు మళ్ళించాలి, అనుకున్నాడు రాజేష్.

“డాక్టరు గారూ! శ్రీధర్, మీరు అనుకున్నట్టు రాధ చాలా అదృష్టవంతురాలు. చాలా ఉత్తమురాలైన సుజాత అండ దొరకడం, ఆ తరువాత ఆ మోహను కృష్ణతో జీవితం పంచుకోవడం ఇదంతా రాధ అదృష్టం. ఇవన్నీ నాకెలా తెలిసాయని వారు ఆశ్చర్యపోతున్నారు కదూ! నాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి డాక్టరు గారూ!”

“ఆ మోహను కృష్ణను నేను చూడలేదు కాని అలాంటి మంచి మనిషికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. నేనా చాలా నికృష్టుడ్ని. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే స్వార్థపరుడ్ని. మనం చేసిన పాపాలకి తగిన ఫలితం ఆ నరకంలో అనుభవిస్తాం అని అనుకుంటాం కాని నేను ఈ జన్మలోనే ఇక్కడే అనుభవిస్తున్నాను నేను.” ఆవేశంగా – బాధగా అంటున్న అతడ్ని వారించాడు రాజేష్.

“శేషూ! ఆవేశపడకండి.”

“ఆవేశం కాదు డాక్టరు గారూ! బాధ. పశ్చత్తాపంతో నా గుండెలు రగుల్తూ వుంటే గుండెల్లో గూడుకట్టుకుపోయిన బాధ, దుఃఖంగా మారి ఆ దుఃఖం – మనస్తాపం వల్ల వచ్చిన మాటలే నా నోటి వెంబడి మీరు వింటున్నారు.”

“మీరు ఏ సుజాత గురించి మాట్లాడుతున్నారు? మా అక్కయ్య సుజాత గురించి కాదు కదా!” రాజేష్ ద్వారా శేషు గుర్తించి చెప్తున్నప్పుడే కళ్యాణికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం నివృత్తి చేసుకోడానికి అడిగింది.

కళ్యాణి వేపు చూశాడు శేషు. కళ్యాణిని శేషుకి పరిచయం చేశాడు రాజేష్. చేతులెత్తి నమస్కరించింది కళ్యాణి శేషుకి. రాజేష్ మాటలు బట్టి కళ్యాణి రాజశేఖరం చెల్లెలు అని గ్రహించాడు శేషు. అతని కనుబొమ్మలు ముడిపడ్డంతో అతను ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని గమనించారు కళ్యాణి, రాజేషు.

‘సుజాత గురించి – రాజశేఖరం గురించి కళ్యాణికి తెలియనట్టుంది. అందుకే వదిన అని అనకుండా అక్కా అని అంటోంది,’ అని అనుకున్నాడు.

“రాజశేఖరం గారి చెల్లెలు కదూ మీరు!” అన్నాడు కళ్యాణితో,

అతని మాటలకి అన్నయ్య రాజశేఖరం జ్ఞాపకాలు కళ్యాణి హృదయంలో కల్లోలం నింపాయి. గుండెలు బాధతో బరువెక్కాయి. కళ్ళల్లో కన్నీటి తెర తళుక్కున మెరిసింది. ఆ బాధపైకి వ్యక్తం కానీయకుండా.

“నాకు దైవం ఇచ్చిన అక్క సుజాత అయితే, ఒకే తండ్రి పిల్లలం రాజశేఖరం అన్నయ్య నేను,” అంది కళ్యాణి.

“మీ అన్నయ్య నాకు తెలుసు.”

“ఒక్క మీ అన్నయ్యనే ఏంటి? మీ అన్నయ్యని మనసారా ప్రేమించి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే మీ అన్నయ్యని పెళ్ళి చేసుకుందామనుకున్న సుజాత నాకు తెలుసు.”

“ఈ మాటలు నాకు అయోమయానికి గురి చేస్తున్నాయి,” కళ్యాణి అంది. ఆమె మాటలకి నిర్లిప్తంగా నవ్వాడు శేషు.

“ఆ సుజాత ఎవరో కాదు మా బావగారికి మొదటి భార్య కూతురు. మా అక్కయ్యని సుజాత అమ్మగారు చనిపోయిన తరువాత బావగారు పెళ్ళి చేసుకున్నారు. రాధ మా అక్కయ్య కూతురు. రాధని పెళ్ళి చేసుకుని ఆ తరువాత విడాకులిచ్చిన నికృష్టుడ్ని నేనే.

సుజాతా మీ అన్నయా ఇద్దరూ ప్రేమించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పెళ్ళి చేసుకుందామని బాస చేసుకున్నారు. వాళ్ళ ప్రేమలో తుచ్ఛమైన కోరకల కంటే ఆరాధన ఉంది. అయితే వారి ప్రేమ నాలో ద్వేషాన్ని – ఈర్ష్యని రగిల్చింది. ఆమెను ఎలాగేనా పెళ్ళాడాలనుకున్నాను. అయితే మనం అనుకున్నది ఏదీ జరగదు. నేను అనుకున్నది ఒకటయితే జరిగింది మరోటి అయింది. ఈలోపునే రాజశేఖరం ఏంటయ్యాడో తెలియని పరిస్థితి రావడం సుజాత గుండెల్లో బాధ గూడు కట్టుకోవడం జరిగాయి.

ఇదే సమయంలో మా అక్కయ్య దగ్గర సుజాతను పెళ్ళి చేసుకుంటానని నా కోరిక బయట పెట్టాను. మా అక్కయ్య బావగార్ని ఒప్పించడం, ఆయన అంగీకరించినా సుజాత మాత్రం ఈ పెళ్ళికి అంగీకరించలేదు. ఆమె మీద నాకున్న ఆ కోరిక నెరవేరపోయేసరికి నా ద్వేషం పగగా మారింది. అటువంటి పరిస్థితిలో సుజాతకి గత్యంతరం లేక ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.

ఇవతల మా బావగారి ఆరోగ్యం క్షీణించడం – అతను రాధను పెళ్ళి చేసుకోమని నన్ను అడగడం జరిగింది. రాధకి నేనంటే ఇష్టం కాని రాధంటే నాకిష్టం లేదు. అటువంటి పరిస్థితిలో బావగారి ఆస్తి మీదే నా ధ్యాసంతా, ఆస్తి కోసం ఆ అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకుని పెళ్ళి చేసుకున్నాను. ఇంట్లో దొరకని సుఖం – క్రొత్తదనాన్ని బజారులో కొనుక్కోవాలి అన్నదే నా ఆలోచన.

బావగారి ఆస్తినంతా నా పేరున వ్రాయించుకున్న తరువాత రాధను పెళ్ళి చేసుకున్నాను. ఆ తరువాత ఆడవాళ్ళిద్దర్ని నానా హింసలకి గురిచేసి ఇంటిలో నాకు దొరకని సుఖాన్ని క్రొత్తదనాన్ని బజారులో కొనుక్కోవడం అరంభించాను.” శేషు ఆయసపడూన్నాడు.

“మీకు అలసట కలుగుతోంది. విశ్రాంతి తీసుకోండి. ఆవేశ పడకండి,” రాజేష్ అన్నాడు.

“నన్ను చెప్పనీయండి డాక్టర్. నేను చేసిన పాపాలు చెప్పుకుంటే మనస్తాపంతో మధనపడున్న మనస్సు తేలిక పడుందని నా ఆరాటం.” శేషు చెప్తున్నాడు.

“ఇంకేముంది చెప్పడానికి నేను తగిలేసిన రాధ, మాక్క సీతమ్మ వీధిన బడ్డారు. చట్టరీత్యా రాధకి విడాకులిచ్చాను. ఇన్ని నికృష్ట పనులు చేసిన నాకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు. సుఖాలు వెతుక్కుంటూ వెళ్ళిన నేను ఈనాడు సుఖ వ్యాధుల్తో శరీరం పుచ్చిపోయి – కుళ్ళిపోయి మృత్యువుకి సమీపుడ్ని అయ్యాను.” అతని కళ్ళల్లో తను చేసిన పనికి పశ్చత్తాపంతోపాటూ కన్నీటి తెర తళుక్కుమంది. గొంతుక దుఃఖంతో పూడుకు పోయింది.

“అయితే సుజాత నాకు వదినన్న మాట.” అనుకుంది కళ్యాణి, ఆ మాటే పైకి అంది.

“అవునమ్మా! నీకు నుజాత వదిన. నీకు అలాంటి వదిన లభించినందుకు నీవు అదృష్టవంతురాలివి. త్యాగానికి మారు పేరు మీ వదిన,” శేషు కళ్ళు తుడుచుకుని అన్నాడు.

“కళ్యాణీ! ఈ శేషు వల్ల ఎంత అపురూపమైన అమూల్యమైన క్రొత్త క్రొత్త విషయాలు తెలిసాయో? ఈ క్షణంలోనే రెక్కలుంటే ఎగిరి వెళ్ళి మీ వదిన ముందు వ్రాలాలనిపిస్తోంది కదూ!” రాజేష్ అన్నాడు కళ్యాణితో,

“అవును. ఆమె అలాంటి చూడదగిన వ్యక్తే. అంతే కాదు. ఆదరించవల్సిన పూజ్యునీయురాలు. సమాజం దృష్టిలో రాజశేఖరం అన్నయ్య, సుజాత వదిన ఒకటవకపోయినా, శారీరకంగా ఒకటి కానప్పటికీ, మానసికంగా వాళ్ళిద్దరూ ఏనాడో ఒకటయ్యారు. వాళ్ళిద్దరూ ఆదర్శ ప్రేమికులు. పవిత్ర ప్రేమికులు స్వచ్ఛమైన ప్రేమకి, సమాజానికి వాళ్ళు మార్గదర్శకులు,” అంది కళ్యాణి.

40

“ఏంటి కళ్యాణీ! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాజేష్ గురించేనా? అతడ్ని కొంగున ముడి వేసుకుని నీ వెంట తిప్పుకుంటున్నా అతని గురించే నీ ఆలోచనా?” పకపకా నవ్వుతూ వచ్చి ప్రక్కనే ఉన్న బండరాతి మీద చతికిలబడింది సుజాత.

కళ్యాణి అంత వరకూ ఆలోచనా ప్రపంచంలో విహరిస్తోంది. సుజాత రాకతో ఆమె ఆలోచన్లు దూది పింజల్లా పైకి ఎగిరి చెల్లా చదురయ్యాయి. ఆమె ఆ ప్రపంచాన్ని వదిలి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టింది.

“నీ గురించే వదినా.”

ఆ సంబోధనకి సుజాత వదనం గంభీరంగా మారింది. “వదినా వదినా అని అంటావు. కాని అలా నిన్ను పిలవమని ఎవరు చెప్పారు? అలా ఎందుకు పిలుస్తున్నావు కళ్యాణి? అక్కా అని పిలిచే నీవు ఈ క్రొత్త సంబోధన ఎందుకు నేర్చుకున్నావు?”

“నిజాలు బయట పడినందుకు.”

“ఏఁటి నిజాలు?”

“అన్నయ్య రాజశేఖరం – నీవూ ప్రేమించుకోవడం నిజం కాదా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పెళ్ళి చేసుకుందామని బాస చేసుకోవడం నిజం కాదా?” సూటిగా సుజాత వదనం వేపు చూస్తూ అంది కళ్యాణి.

“అలా అని ఎవరు చెప్పారు? బండి దిగగానే రాజేష్ కూడా ఈ ప్రస్తావనే తెచ్చాడు. అతని గురించి మీకెవరు చెప్పారు.”

“శేషు.”

శేషు పేరు వినగానే అదిరిపడిన సుజాత, “శేషా?” అని విస్మయంగా ప్రశ్నించింది.

“అవును శేషే. అతను నీకు మామయ్య అవుతాడుట. అతనే ఈ విషయం చెప్పాడు. ఈ పవిత్ర ప్రేమ గురించి, నిన్ను ఎన్ని పొగడ్తలో ముంచెత్తాడనుకున్నావు. అతను, నీ గురించి చెప్పిన మాటలు వింటూ ఉంటే నా దృష్టిలో నీవు అంచనా వేయలేనంత ఎత్తుగా ఎదిగిపోయావు. ఇటువంటి త్యాగమూర్తి నాకు వదినయినందుకు గర్వపడున్నాను. చేతులెత్తి నమస్కరించాలని బుద్ధి పుట్టింది,” అంటూ శేషు చెప్పిన విషయాలు – అతని పరిస్థితి సుజాతకి వివరించింది కళ్యాణి.

“హే భగవాన్! వెలిసి పోయిన బట్టలా రాజశేఖరం స్మృతులు నా మదిలో నుండి తొలగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరల ఆ విషయాలే ప్రస్తావనకి వస్తున్నాయే,” పైకే అంది సుజాత.

“అన్నయ్యని ఎన్నడూ మరిచిపోలేవు నీవు వదినా! మరిచిపోయినట్టు నటిస్తున్నావు మాత్రమే. నీవు అన్నయ్యని మరిచిపోవడం అసాధ్యం. మీ పవిత్ర ప్రేమ – త్యాగం అటు వంటిది.”

రాజశేఖరం జ్ఞాపకాలు ఆమె మనస్సుని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటే శేషు విషయం విన్న సుజాత బాధ పడింది. ‘పాపం అతని పరిస్థితి ఇంత విషమ పరిస్థితిగా మారిందా?’ అని విచారించింది కొద్ది సేపు.

చీకటి పడింది. సంధ్యా చీకట్లు నలుమూలల నుండి తరుము కొస్తున్నాయి. ఆకాశంలో అక్కడక్కడ తారకలు మిలమిల మెరుస్తున్నాయి. అశాంతితో – అసంతృప్తితో దహించుకు పోతున్న లేచి ఆశ్రమం వేపు బాధగా అడుగులేస్తోంది. ‘వదినకి బాధ కలిగించాను’ నిట్టూర్పు విడుస్తూ అనుకున్న కళ్యాణి కూడా ఆమె వెంట నడిచింది.

(ఇంకా ఉంది)

Exit mobile version