Site icon Sanchika

కొడిగట్టిన దీపాలు-22

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 22వ భాగం. [/box]

43

[dropcap]మ[/dropcap]నస్సులో దుఃఖ స్మృతులు నిలిచి ఉంటే వాటిని మరిచిపోవడమే మంచిది. మనకి అప్రియమైన వాటిని మరిచిపోవడం ఎంతయినా అవసరం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనకి ప్రియమైనవి అయినప్పటికీ ఆ విషయాలు కూడా మనలో బాధని కలగ చేస్తాయి. అటువంటి విషయాలు కూడా మరిచిపోవాలి.

మంచి విషయాలను గుర్తించుకోవడం ఎంత అవసరమో, దుఃఖ స్మృతులను మరిచిపోవటం అంతే అవసరం. మన శరీరం, మనస్సు ఆచరణ ఆరోగ్యకరంగా ఉండాలంటే అనారోగ్యం కలిగించే విషయాలు మరిచిపోవాలి.

ఒకవేళ ఎవరిద్వారానైనా మనకి కష్టం కలిగి హృదయం గాయపడితే పదేపదే దానినే గుర్తించుకుంటూ అసంతృప్తితో కుమిలి పోవడం మంచిదికాదు. ఆ చేదు సంఘటనలు మరిచిపోయి శుభకర్మలపై మనస్సును కేంద్రీకరించాలి.

సుజాత విషయంలో కూడా ఇదే జరిగింది. రాజశేఖరం ఎడబాటు ఆమెలో దుఃఖ స్మృతుల్ని మిగిల్చింది. వాటిని మరిచిపోవడానికి ప్రయత్నిస్తోంది. రాజశేఖరంతో తనకి పరిచయం అవడం, వాళ్ళ ఇద్దరి మధ్య గల మాటలు సన్నిహితం అప్పటి సంఘటనలు తలుచుకోవడం ఆమెకి ప్రియమైనవి అయినప్పటికి, వాటిని తలుచుకోవడం వల్ల ఆమెలో ఆవేదన బాధని అధికం చేస్తాయి.

స్వాతంత్ర్య పోరాటం సమయంలో రాజశేఖరంతో తనకి పరిచయం అవడం, తరువాత జరిగిన సంఘటనలే కాదు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సంఘటనలు, దేశ కాలమాన పరిస్థితుల్ని సుజాత ఒక దగ్గర కూర్చుని సంహావలోకనం చేసుకుంటోంది సుజాత.

స్వాతంత్ర్య పోరాటంలో దేశంలో ఉన్న అందరూ పాల్గొన్నారు. అందరి కృషితో పాటు బాపూజీ మార్గదర్శకంలో స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర్య పోరాటంలో ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. దేశంలోని, సమాజంలో ఉన్న మనుష్యుల అందరి భావాలు ఒకే విధంగా ఉండేవి. అలోచన్లలోని, ఆచరణలో భేదాలున్నా అందరూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఏక తాటి మీద నిల్చారు.

ఆనాటికీ ఈనాటికీ ఎంత తేడా? కొన్ని పద్ధతులకి, సిద్ధాంతాలకి కట్టుబడి పార్టీలుండేవి. మరి ఈనాడో? పార్టీలో సీటు రాని వాడు, మంత్రి పదవి దక్కని వాడూ అసంతృప్తులూ అందరూ తామున్న పార్టీని విడిచి పెట్టి కొత్త పార్టీ పెట్టిస్తున్నారు. వాళ్ళు పెట్టిన క్రొత్త పార్టీ మూనాళ్ళ ముచ్చటిగానే మిగిలిపోతోంది. క్రొత్తగా పెట్టిన తన పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నాడు ఈ అసంతృప్తి నాయకుడు.

ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో పలుకుబడి ప్రతిష్ఠ, అంగబలం, అర్థబలం ఉన్నవాళ్ళతో పాటూ రాజశేఖరం, తనలాంటి సామాన్యులు వాళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే పలుకుబడి గల వాళ్ళకి వచ్చినంత పేరు సామాన్యులకి రాలేదు. ఈ సామాన్యుల ఆస్తిత్వం లేదు. వాళ్ళ ఉనికి లేదు. బలమైన వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య నలిగిపోయిన అర్భకులయ్యారు ఈ సామాన్య జనులు.

పలుకుబడిన వ్యక్తులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటే అందరూ వాళ్ళకి నీరాజనాలు పలికారు. వాళ్ళకి పదవులు వచ్చాయి. మంచి పదవులొచ్చాయి. రాజ్యాధికారం వాళ్ళకి లభించింది. అదే సామాన్యులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటే వాళ్ళ గురించి తలిచిన వాళ్ళేలేరు.

తనకేనా పరంధామయ్యగారూ, కొందరు ప్రముఖుల సిఫారసు మీద అప్లికేషను పెట్టే స్వాతంత్ర్య సమరయోధురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కాని తనకి పెన్షను శాంక్షను అవలేదు. ఇంటి స్థలం ఇవ్వలేదు. తనకి ఇష్టమే లేదు. అయితే అందరి బలవంతం వలన ఒప్పుకోవల్సి వచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో సామాన్యులు, అతి సామాన్యులూ, చదువురాని వాళ్ళూ పాల్గొన్నారు. అయినా వీళ్ళకెవరికీ గుర్తింపే లేదు. వారి అస్తిత్వం ఉనికి లేదు. తనకే గుర్తింపే లేనప్పుడు మిగతావారి విషయం ఏంటి? అందరూ అంతే నిజమైన స్వాతంత్ర్య సమర యోధులు మరుగున పడిపోయారు.

స్వాతంత్ర్య వచ్చిన తరువాత సంఘటనలన్ని సుజాత కళ్ళెదుట నిలిచాయి. విదేశీ పాలన అంతమయి, స్వాతంత్ర్యాన్ని పొందాం. భారతమాతని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేశాము. అయితే ఆ ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు. మతాలు, కులాలు, ప్రాంతాలు ముసుగులో పోరాటం తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.

ఇలాంటి మత మార్పిడ్లు అప్పుడు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పటి మత మార్పిళ్ళలో బలవంతం ఉంటే ఇప్పటి మత మార్పిళ్ళలో స్వార్థం, ప్రలోభం ఉన్నాయి.

తను చరిత్ర చదువుకుంది. పన్నెండవ శతాబ్దం సమయంలోనే కొంతమంది మన దేశంలో పరిపాలిస్తున్న పరిపాలకులు వలనే దేశం పరాధీనం అయింది. దానికి కారణం మన పరిపాలకుల్లో ఐక్యతలేమి.

విదేశాల నుండి వచ్చిన విదేశీకులు మన దేశంలో అరాచకాలు సృష్టించారు. ఇక్కడ దేశ వాసుల్ని తమ మతంలోకి మార్పిడి చేసారు అదీ బలవంతంగా, ఈనాడు ఇతర మతాలు వారుగా చెలామణి అవుతున్నవారు ఓనాడు హిందువులే. మన దేశవాసులే. విదేశం నుండి ఊడిపడిన వాళ్ళు కాదు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పౌరులకి కొన్ని హక్కులు లభించాయి. అందులో మత స్వేచ్ఛ ఉంది. వ్యక్తి ఇష్టపడితే తను ఇంకో మతంలోకి మారవచ్చు. కాని ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలుగుతోంది. వ్యక్తికి మతం మారే కోరిక లేనప్పటికి, కొన్ని మతాల వారు ఆ వ్యక్తిని ప్రలోభ పెట్టి, ఆశలు చూపించి తమ మతంలోకి మార్పిడ్లు చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం అని తనకి అనిపిస్తోంది.

అయితే ఒక్క విషయం. ఏ మతం అయిన నరుడుని మానవత్వం గల మనిషిగా చేసి అతని అంతస్తును దైవత్వానికి దగ్గరకు చేర్చడానికి ఉపకరిస్తుంది. మతానికి ఈర్ష్య లేదు. ద్వేషం లేదు. శత్రుత్వం లేదు. మతానికి సత్యం – సహనం ప్రేమ, క్షమ ఉన్నాయి.

మనిషి సప్రయోజనం కోసం తాను రాక్షసుడవుతాడు. మతానికి రాక్షస రంగు పులుముతున్నాడు. మతాన్ని రాక్షసం చేసి తాను రాక్షస రాజ్యం ఏలుతున్నాడు. మన దేశంలో జరిగిన మత కలహాలన్నీ మతం పేర జరిగిన వన్నీ రాజకీయ కల్లోలాలే.

మతాన్మోద శక్తుల చేతుల్లో జాతిపిత బాపూజీ కన్ను మూసారు. అతని భావాలు నచ్చనంత మాత్రాన్న అతడ్ని చంపే అధికారం చంపిన వాళ్ళకి లేదు అని తను అనుకుంటుంది.

బాపూజీ సిద్ధాంతాల్ని, అతని అహింసావాదాన్ని నచ్చని వాళ్ళు ఉన్నారు. అతనిలోనూ సంకుచిత భావాలున్నాయి. అందుకే తమకి నచ్చిన వాళ్ళకే రాజ్యాధికారం అప్పగించారు అని కొందరంటారు. అయితే అతనూ మానవ మాత్రుడే. భావోద్వేగాలకి అతను అతీతుడు కాదు. అయితే అతనిలోనున్న గొప్ప గుణాల్ని కూడా మనం గుర్తించాలి.

దక్షిణాఫ్రికాలో తన సేవలందిస్తున్న సమయంలో అక్కడున్న భారతీయుల నుండి గాంధీజీకి అనేక కానుకలు వచ్చాయట. అలా కానుకలుగా వచ్చిన వాటిని అతను తిరిగి ప్రజలకే ఇచ్చేసేడుట. అందులో ఒక వజ్రాల హారం కూడా కానుకగా వచ్చిందిట. కస్తూర్బా ఆ హారాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. “మీరు ఎలాగూ నన్ను నగలు ధరించనీయరు. రేపొద్దున్న నా కోడళ్ళనేనా ధరించనీయరా,” అందిట ఆవిడ.

అప్పుడు గాంధీజీ “ఆ హారం నీవు చేసిన సేవ ఫలితంగా వచ్చిందా, నేను చేసిన సేవకి ఫలితంగా వచ్చిందా?” అని అన్నారుట. అప్పుడు కస్తూర్బా “మీరు చేసిన సేవ నేను చేసిన సేవ కాదా? మనిద్దరి మద్యా ఇలా భేదభావం చూపిస్తున్నారా?” అంటూ కన్నీరు కార్చిందట, అయినా గాంధీజీ చలించలేదుట. ఆ హారాన్ని ఇప్పించారుట. ఈ విషయం అప్పుడు అనుకుంది ఇప్పుడు తలుచుకుంది.

బావూజీలో ఆ గుణమే తనకి నచ్చుతుంది. “అదే నేటి ప్రజానాయకుడయితే ఇస్తాడా? ఎదుటి వాళ్ళ ఆస్తిపాస్తులు, భూమి కబ్జా చేస్తున్న నేటి ప్రజానాయకులు తనకి కానుకగా వచ్చినవి ఇస్తారా?” అని తనకి అనిపిస్తుంది. అది ఎందుకు గాంధీజీ మద్య నిషేధం విధించారు. నేడు దేశంలో మద్యం ఏరులై పారుతోంది. ఎలక్షన్ల సమయంలో మరీను.

పౌరుల సంక్రమించిన అధికారాల్లో వాక్ స్వాతంత్ర్యం ఉంది. అయితే అది అమలవుతోందా? ప్రజానాయకుని అవినీతిని విమర్శించడానికి హక్కు ఉందా పౌరుడికి అలా విమర్శించిన వాళ్ళ అడ్రస్సులు లేకుండా చేస్తున్నారు నేటి కొంత మంది ప్రజాప్రతినిధులు. ఇలా దౌర్జన్యం పరాకాష్ఠగా చేరుకుంది.

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మంగళ పాండే, భగత్ సింగ్ ఇంకా ప్రముఖుల్ని తలుచుకోని నేటి ప్రజలు నాయకులూ సామాన్య ప్రజల్ని అదీ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సమర యోధుల్ని ఎలా గుర్తు పెట్టుకుంటారు?

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం బాపూజీ వర్ధంతి రోజు ఎవ్వరికీ గుర్తు ఉండదు. జయంతి రోజున నామ మాత్రంగా సెలవిస్తున్నారు. అంతటిలో సరిపోతుందా? గాంధీజీ సిద్ధాంతాలకి తూట్లు పొడుస్తున్నారు. ఆ రోజే మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు.

మత సంఘర్షణ సమయంలోనే బాపూజీ కన్నుమూసారు. మత వర్గ పోరాటంలో దేశం రెండుగా చీలిపోయి పాకిస్తాను ఏర్పడింది. భారతదేశం నుండి విడిపోయింది. మొట్టమొదట ఐతిహాసిక కాలంలో సమస్త భారతదేశం ఒకటిగా ఉండి అఖండ భారత్‌గా విరాజిల్లేది. ఆ తరువాత తరువాత అఖండ భారత్ స్వరూపమే మారిపోయింది. క్రమంగా కొన్ని భాగాలు విడిపోయి పొరుగు దేశాలుగా ఏర్పడ్డాయి.

పొరుగునున్న దేశాల అక్రమణ వల్ల దేశం క్షీణించిపోతోంది. పొరుగునున్న దేశం చైనా మన దేశ భూభాగం పైకి ఆక్రమణ ప్రారంభించింది కూడా. మన దేశ భాగాల్నే తమవని వాదిస్తోంది. ఆ దేశంతో మనకి యుద్ధం సంభవించింది. ఆ సమస్య ఇప్పటికీ తేలకుండా అలాగే ఉంది. లేకపోతే హిమాలయాల్లో ఉన్న కైలాసం, మానసరోవర్, బ్రహ్మపుత్రా నది ఇవన్నీ అఖండ భారతదేశంలో భాగాలుగా ఉండేవి.

ఇక కాశ్మీర్ సమస్య ఎటూ తేలకుండా అలా తలనొప్పి వ్యవహారంగానే ఉంది. వల్లభ బాయి పటేల్ ఇంకా అన్ని సంస్థానాదీశ్వరుల నుండి వాళ్ళ సంస్థానాల్ని తీసుకుని భారతదేశంలో విలీనం చేయబట్టి భారతదేశ స్వరూపం ఇలాగేనా ఉంది కాని లేకపోతే దేశం చిన్న చిన్న భాగాలుగా విభజించబడి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పరిపాలకుడు ఉండేవాడు.

44

ఎంత మందో మహానుభావులనుకున్నవారు దేశ స్వాతంత్ర్యం కోసం అనేక బాధలు అనుభవించి, స్వాతంత్ర్యం సిద్ధించుకోడానికి కారకులైన దేశ భక్తులు, త్యాగనిరతులు, నిస్వార్థపరులు వీళ్ళందరూ ఆ తరువాత దేశంలో చోటు చేసుకున్న కుళ్ళుని – అరాజకాల్ని, నియంతృత్వ శక్తుల్ని చూడలేక కాల గర్భంలో కలిసిపోయారు.

స్వార్థపర శక్తులు విలయతాండవ నృత్యం చేయడం ఆరంభించాయి. కుట్రలు అసూయ, ద్వేషాలు సమాజంలో పేరుకుపోయి మంచికి స్థానం లేకుండా పోయింది. స్వాతంత్ర్య వచ్చిన తరువాత కూడా స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న యోగ్యులకి తగిన న్యాయం జరగలేదు. వాళ్ళు పదవులకి దూరంగా ఉండి పోవల్సివచ్చింది..

దేశ విషయం ఎందుకు? మన తెలుగు రాష్ట్రం గురించి తీసుకుంటే మద్రాసు తెలుగు రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. అక్కడ తెలుగు వారే ఎక్కువ. అలాంటి చెన్నపట్టణం కొంతమంది స్వార్థపరుల వల్ల కోల్పోవల్సి వచ్చింది. ఆ తరువాత తెలుగు భాష మాట్లాడే కొన్ని ప్రాంతాలు. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాలో కలిసిపోయి ఆంధ్రమాత చిక్కి శల్యమయింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు పోగొట్టుకుంటే కాని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. మద్రాసు నుండి కర్నూలుకి మారిన రాజధాని హైదరాబాదుకి మారింది.

హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం ఏం తక్కువ తిన్నాడా? అతడ్ని ఇప్పుడు కొందరు పొగుడుతున్నారు. అతని పరిపాలన కూడా హింస ప్రజ్వరిల్లింది. వల్లభ్ బాయి కృషి వల్ల ఆ సంస్థానం భారత్‌లో విలీనం అయింది కానీ తెలంగాణా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కలిసి విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాయలసీమ జిల్లాలు కూడా విశాల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

అయితే తెలంగాణా ప్రాంత ప్రజలకన్నా ముఖ్య నాయకులకి ఇలా ఆ ప్రాంతాలు ఆంధ్రాలో కలవడం ఇష్టం లేదు. అందుకే తరుచుగా ఆందోళనలు కూడా ఆరంభమయ్యాయి. పదవులు దక్కని రాజకీయ నాయకులే కారకులు అని తను అప్పుడూ అనుకుంది. ఇప్పుడూ అనుకుంటోంది.

పరిపాలకులు మారుతున్నారు. పరిపాలనా అధికారులు మారుతున్నారు. ఓ జాతీయ పార్టీని తొలగించి మరో జాతీయ పార్టీ పరిపాలనా పగ్గాలు చేపడున్నాయి. ఇలా పరిపాలనా పార్టీలు మారుతూ ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న నిజమైన స్వాతంత్ర్య సమర యోధుడుకి ప్రాముఖ్యత లేదు.

ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, పలుకుబడి ఉంటుందో, అర్థబలం, అంగబలం ఉంటోందో వాళ్ళే పరిపాలకులు. వాళ్ళదే అధికారం వాళ్ళు చెప్పిందే ఆట. పాడిందే పాట. రాజకీయాల్లో కూడా సినీ రంగంలాగే వారసత్వ విధానం ఆరంభమయింది. అందం చందం. యోగ్యతా నటనా కౌశల్యం లేకపోయినా వారసత్వ విధానం వల్ల ఆ రంగంలో నైపుణ్యం లేనివాళ్ళు కూడా హీరోలుగా ఎలా చెలామణి అవుతున్నారో? రాజకీయ నాయకుల వారసులు కూడా వారసత్వ విధానం వల్ల అలాగే చలామణి అయిపోతున్నారు.

జాతీయ పార్టీల ప్రాబల్యం తగ్గిపోతూ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువయింది. ఎకరం కూడా పొలం లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లులేని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కోట్లకి పడగలెత్తడం చూస్తుంటే ఓనాటి పాత తరం దేశ స్వాతంత్ర్య కోసం నిస్వార్థ సేవ చేసిన స్వాతంత్ర్య సమర యోధుల మనస్సు బాధగా మూల్గుతుంది.

రాజకీయ వాతావరణం అలా ఉంటే మన మాతృభాష తెలుగు పరిస్థితి మరింత ఆందోళనకి గురి చేస్తోంది. నిజాం పరిపాలనలో తెలుగు మాధ్యమ పాఠశాలల సంఖ్య శూన్యము. ఉర్దూ భాషకి మొదటి స్థానం, మరాఠీకి రెండవ స్థానం, తెలుగు భాషకి మూడవ స్థానం ఇచ్చేరుట.

అప్పటి పరిస్థితిలో తెలుగు భాష స్థానం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ భాష పరిస్థితి అలాగే ఉంది. భాషావేత్తల అంచనా ప్రకారం ఏ మాత్రం జాగ్రత్త తీసుకోపోతే తెలుగు భాష మృత భాషల్లో ఒకటిగా మిగిలిపోతుందిట. ఇప్పుడు పరిపాలకులు పరిభాషకి ఇస్తున్న ప్రాముఖ్యతను చూస్తుంటే ఈ విషయం నిజమే అని అనుకోకమానదు.

ఆంగ్లము మంచి భాషే. అంతర్జాతీయ భాషే. అయితే మన మాతృ భాష తెలుగును అణగదొక్కి ఇంగ్లీషు భాషకు ప్రాముఖ్యం ఇవ్వడం కాదు అని తను అనుకుంటుంది. తెలుగు భాష ఉన్నతికి ప్రతీ వాళ్ళూ పూనుకోవాలి. అయితే జరుగుతున్నది. వేరే జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడున్నాయి. ఇవే తెలుగు మీడియం పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కార్పరేటు స్కూళ్ళు ముఖ్యంగా ఇవి ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలు వాటి ప్రాముఖ్యత ఎక్కువ అవుతోంది. భాష, విద్యా విధానంలో కూడా ఈ రాజకీయాలు చోటు చేసుకోవడం తనకి బాధ కలిగిస్తుంది అందోళన కలిగిస్తాయి.

విద్యా విధానం పరిస్థితి అలాగే ఉంది. మార్చి నెల నాటికి పూర్తికావల్సిన పాఠాలు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేసేయాలి. ఔషధం మోతాదు ప్రకారం తీసుకుంటే పని చేస్తుంది కాని మొత్తం ఔషధం అంతా ఒకేసారి తీసుకుంటే ఎలా?

చదువు కూడా ఇంతే. ఉత్తీర్ణత శాతం ఆధారంగా పాఠశాల గొప్పతనాన్ని లెక్కిస్తున్నారు నేడు. ఈ కార్పొరేటు స్కూళ్ళు వచ్చిన తరువాత. ఇది తప్పు.

కార్పొరేటు పాఠశాలల్ని అందలం ఎక్కిస్తూ ప్రభుత్వ పాఠశాలల్ని క్షీణ దశకి తెస్తున్నారు. అంత ఘనత సాధించిన ఉపాధ్యాయుల్ని అదే కార్పొరేట్ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయుల్ని సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలకు పంపుతే అక్కడ నూరు శాతం సాధించగలుగుతారా అని నేటి విధానం గురించి తను అనుకుంటుంది. మొదట ఈ ఉత్తీర్ణతా శాతం అనే పిచ్చి తగ్గించుకుని విద్యా ప్రమాణాలు పెరిగే విధానం ఆలోచించాలి. అలా ఇప్పుడు ఎలాగూ చేయటం లేదు. అక్రమ పద్ధతులు అనుసరించేనా ఎలాగో అలాగ శతశాతం ఉత్తీర్ణతకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయిదు సంవత్సరాలకి పిల్లలని పాఠశాలల్లో చేర్చేవారు అప్పటి వారు శారీరకంగా మానసికంగా ఎదుగుతారు. పిల్లలు ఆ వయ్యస్సులో ఇప్పుడు అలా కాదు ప్రైవేటు పాఠశాల్ని చూసి ప్రభుత్వం పిల్లలకి ఇప్పుడు మూడు సంవత్సరాలు వయస్సు వచ్చేప్పటికి పాఠశాలల్లో జాయిన్ చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని రాయితీలు కల్పిస్తున్నప్పటికీ ఆ పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించటం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతున్నాయి. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. అప్పటికీ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉపాధ్యాయులకి శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మీడియం ప్రారంభించింది కాని ఏం లాభం. మాతృభాషలోనే వెనకబడిన పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో విద్యా ఎలా అభ్యసిస్తారు?

విద్య కూడా నేడు ఎలక్షను వాగ్దానాలకే వినియోగిస్తున్నారు. పిల్లలకి ఎల్.కే.జి నుండి పి.జి. వరకూ ఉచిత విద్య అని ప్రకటిస్తున్నారు. తల్లిదండ్రలు దృష్టిలో నేడు కొన్ని విద్యలే గొప్ప అనే భావం ఉంది. తమ పిల్లలు ఆ గొప్ప విద్యలే మెడిసిన్, ఇంజనీరింగు, ఐ.ఐ.టి చదవాలని అనుకుంటున్నారు. అది పిల్లలకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తమ పిల్లలచేత బలవంతంగా చదివిస్తున్నారు.

ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టింది. పుస్తకాలు, బట్టలు ఇస్తోంది. ఫీజులు లేవు. ఇన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించినా ఈ పాఠశాలలు క్షీణ దశకి చేరుకుంటున్నాయి.

కొన్ని పాఠశాలల్లో సదుపాయాలు లేవు. ఎందరో పనివాళ్ళు పెద్దల నిర్లక్ష్యం వల్ల మొగ్గల్లా రాలిపోతున్నారు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన పసిగుడ్డు మీద అకృత్యాలు జరుగుతున్నాయి. మురికి కాలవల్లో, పెంట కుప్పల మీద ఎక్కడ పడితే అక్కడ పసివాళ్ళని చెత్త కాగితాల్లా పారేస్తున్నారు. ప్రభుత్వం మొదట పుట్టిన పసి వాళ్ళను జాగ్రత్తగా సంరక్షించాలి.

సమాజంలో చోటు చేసుకున్న ప్రపంచీకరణ ఫలితంగా చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మన దేశానికి దిగుమతులే తప్ప ఎగుమతులు లేని దేశమయింది. విదేశీ ఋణ భారం పెరిగింది. చైనా భారత్ మార్కట్లును ముంచెత్తుతోంది. నాణ్యత జీవన ప్రమాణాలు పేరున బహుళ జాతి కంపెనీలు వందలకొలదీ వచ్చి పడ్డాయి.

రూపాయి విలువ పడిపోయింది. ప్రపంచ బ్యాంకు ఋణాలిస్తూ మన ప్రభుత్వాన్ని శాసిస్తోంది. ప్రపంచాన్ని మార్కెట్టుగా మార్చి జీవితాలను వ్యాపారమయం చేసింది. ఇది చారిత్రక వాస్తవం.

(ఇంకా ఉంది)

Exit mobile version