కొడిగట్టిన దీపాలు-25

0
2

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 25వ భాగం. [/box]

49

[dropcap]మ[/dropcap]నిషిలో కుతూహలం పుట్టకేపోవాలి, కాని అది పుట్టింది అంటే ఎంత తొందరగా ఆ కుతూహలం తీరుతుందా? దానికి సరియైన సమాధానం ఎంత తొందరగా దొరుకుతుందా అని ఎదురు చూస్తాడు మనిషి.

చైతన్యలో కూడా అదే కుతూహలం రాజయ్య తాతయ్య సామాన్య వ్యక్తి కాదు. అతని జీవితంలో ఏవో నీలినీడలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి. అతనిలోని నిరాశ తొలగించాలి.

అతనిలో ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి. అతని జీవన పుటలోని విషయాలు తెలుసుకోవాలి. తెరిచిన పుస్తకంలా అతని జీవితం చేయాలి. తనని ఇంత ప్రయోజకుడ్ని చేసిన తాతయ్యకి తనకి చేతనయినంత సహాయం చేయాలి. ఇవే చైతన్య ఆలోచన్లు.

“చెప్పు తాతయ్యా!” తొందర పెడుతున్నాడు చైతన్య రాజయ్యని. అతడు ఏం చెప్తాడో అన్న కుతూహలం – ఆత్రుత ఆపుకోలేకపోతున్నాడు.

“నా పేరు రాజయ్య, కాదు, రాజశేఖరం,” రాజయ్య అన్నాడు. అతని వంక విస్మయంగా చూశాడు చైతన్య.

రాజశేఖరం తన కుటుంబం గురించి, తన చదువు గురించి, స్వాతంత్ర్య పోరాట సమయంలో తనకి సుజాతతో ఏర్పడిన పరిచయం గురించి ఆ తరువత వాళ్ళద్దరి మధ్యా ఏర్పడ్డ సన్నిహిత సంబంధం గురించి. వాళ్ళు చేసుకున్న బాస గురించి. తరువాత సుజాత కుటుంబ స్థితిగతులు గురించి, ఆ తరువాత స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగిన సంఘటనలు చెప్పనారంభించాడు. ఎంతో ఆసక్తిగా వింటున్నాడు చైతన్య.

***

రాజశేఖరం స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆ రోజు తనకి బాగా జ్ఞాపకముంది. చేతిలోకి మూడు రంగుల జెండా పట్టుకుని ‘వందేమాతరం’, ‘పరాయి పాలన అంతమొందాలి’, ‘బ్రిటిష్ పాలన నశించాలి’, అని నినాదాలు చేస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు తను. అతని వెనక వేలాది మంది జనం కూడా నినాదాలు చేస్తూ ముందుకు కదుల్తున్నారు.

పోలీసులు లాఠీలో బాదుతున్నారు జనాల్ని. ఆ లాఠీ దెబ్బలకి రక్తాలు కారుతూ నేలకి వొరుగుతున్నారు జనాలు స్పృహ తప్పిపోయి. అలా అయినా నినాదాలు ఆగటం లేదు. ఇంతలో రాజశేఖరం తలపై లాఠీ దెబ్బపడింది. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. ‘అమ్మా!’ అంటూ తూలి క్రిందపడ్డాడు. వెంటనే స్పృహ కోల్పోయాడు.

అతనికి తెలివొచ్చి చూస్తే అతను ఓ చీకటి కోట్లో బంధింపబడి ఉన్నాడు. వొళ్ళంతా నీరసంగా ఉంది. ఎక్కడిలేని నిస్పత్తువా అతనిలో చోటు చేసుకుంది. తల మీద నొప్పిగా ఉంది. తడిమి చూసుకున్నాడు. చల్లగా తడిగా తగిలింది. అక్కడ నుండి చేయి తీసి చూసుకున్నాడు. చిక్కటి ఎర్రని రక్తం. ‘అమ్మో! రక్తం’ అనుకున్నాడు. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. వొళ్ళు జోగుతోంది. నీరసంగా కళ్ళు మూసుకున్నాడు.

కొంత సేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూసేప్పటికి ఓ సిలవరు గ్లాసుతో నీళ్ళు, ఎండిపోయిన రొట్టె తన ముందు ఆ చీకటి గదిలో అతని ముందు అగుపించాయి. ఒక మూల దాహం. ఆకలి, మరో వేపు నీరసం అతడ్ని కృంగదీస్తున్నాయి. ఏదో ఒకటి దొరికింది తిని ఇన్ని నీళ్ళు త్రాగితే కొద్దిగా నీరసం తగ్గుతుందనుకున్నాడు. మిక్కిలి ఆకలిగా ఉన్నప్పుడు పచ్చ గట్టి నమిలినా రుచిగానే ఉంటుంది. ఆ రొట్టి ముక్క తిని నీళ్ళు త్రాగాడు. ఆకలి బాధ తీరిన తరువాత నిస్పత్తువా కొద్దిగా సడలినట్లనిపించింది. అతని మెదడు చురుగ్గా పని చేయడం ఆరంభించింది.

అతని హృదయంలో మనస్సు లోనూ, కళ్ళ ముందర సుజాత స్మృతులే. ఆమె రూపమే, ఆమె తలపుకు వస్తే అతనికి మిగిలింది బాధే. తాత్కాలికంగానేనా ఆమె తలపుల నుండి దూరంగా ఉండాలనుకున్నాడు. కాని సాధ్యం కావటం లేదు. మరిచిపోయినట్టు నటిస్తున్నాడు అంతే.

తమిద్దరూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశం బానిస సంకెళ్ళ నుండి బయట పడిన తరువాత తామిద్దరూ ఒకటవ్వాలనుకున్నారు. అది నెరవేరుతుందా? లేకపోతే సమాంతర రేఖల్లా ఇద్దరి జీవితాలు ఒకదానితో మరొకటి కలవకుండా ఒకదాని ఎదుట మరొకటిగా అలా చీలిపోయి ఉంటాయా?

సుజాత తనకి పరిచయం కాకపోతే తన జీవితం వేరే విధంగా ఉండేది. తిరిగి అలోచిస్తున్నాడు. ఓ ఉన్నత స్థాయిలో ఉన్నత పదవిలో ఉండేవాడేమో! పిల్లా పాపల్తో సుఖంగా ఉండేవాడు. అంతలోనే అతని ఆలోచన్లలో మార్పు,

అదీ ఓ జీవితమేనా? నేను, నా కుటుంబం అంటూ గిరిగీసుకుని కూర్చోడమా? అది స్వార్థపూరిత జీవితం. దేశ స్వాతంత్ర్య పోరాటంలో దేశవాసులు తమ సర్వస్వాన్ని ధారబోసి తమ జీవితాల్నే త్యాగం చేస్తుంటే తను అటువంటి సుఖమైన జీవితం గడపాలని కలలు కనడం నిజంగా స్వార్థమే.

తనలో ఉన్న అటువంటి స్వార్థ గుణాన్ని మొగ్గలోనే త్రుంచి వేసి ఉదాత్తమైన మార్గం వేపు నడిపించింది సుజాత. అధైర్య పరిస్థితిలో తనలో ధైర్యం కలిగించింది. తన కుటుంబ బాధ్యతను తన నెత్తిపై వేసుకుంది సుజాతే కదా, పరంధామయ్య దంపతులు, విశాలగుప్తా బాబాయ్ దంపతులు ఎంత ఉత్తములు? వాళ్ళు తనకి, తన కుటుంబానికి, కళ్యాణికి ఎంతో ఎన్ని విధాలో తమ సహాయసహకారాలు అందించారు.

సుజాత కళ్యాణి బాధ్యత తనపై వేసుకుంది. ఆమె ఆధ్వర్యంలో కళ్యాణి యోగ్యురాలిగా నిలుస్తుందని తనకి పూర్తిగా నమ్మకం ఉంది. ఇప్పుడు కళ్యాణి ఎక్కడుందో ఎలా ఉందో?

ఆలోచన్ల నుండి బయటపడ్డాడు రాజశేఖరం. తను ఇక్కడ నుండి ఎలా తప్పించుకోగలడు? ఉపాయాలు వెతుకుతోంది అతని మెదడు.

రాత్రి పన్నెండు గంటల సమయం వసుధనంతా వెన్నల వెండి ముద్దలా కరిగి ప్రవహించినట్లు తెల్లని పుచ్చ పువ్వులాంటి వెన్నెల. ఆ వెన్నెల రాత్రి సమయంలో శశాంకుని వెన్నెల కిరణాలు ఆ చీకటి గదిలో చీకటిని పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నాయి పైనున్న వెంటిలేటరు నుండి.

అటువంటి ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో పోలీసులు వొళ్ళు తెలియని గాఢ నిద్రలో మునిగి తేలున్నారు. తను తప్పించుకోడానికి ఇదే మంచి సమయం అని అనుకున్నాడు రాజశేఖరం. తుప్పుపట్టిన గడియలు, బలంలేక తలుపులు ఊడొచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పోలీసు స్టేషను అసలే పాత కాలం నాటిది. గోడనున్న బుర్ర మేకు ఊడదీసి గోడకి రంధ్రాలు చేశాడు. ఆ రంధ్రాలు దాపుగా చేసుకుని వెంటిలేటరు పైకి ఎగబ్రాకాడు. వెంటిలేటరు గజాలు సులువుగా ఊడొచ్చాయి. బయటకు గెంతేసి బయటకు పరిగెత్తాడు.

ఆ శబ్దానికి కొంతమంది పోలీసు సిబ్బంది మేల్కొన్నట్టు ఉంది. గోల వినిపిస్తోంది. తను నెమ్మదిగా నడుస్తూ పొదలచాటు నుండి నెమ్మదిగా అడుగులేస్తూ ఎవరికంటా పడకుండా ముందుకు సాగాడు. వెన్నెలలో మార్గం స్పష్టంగా అగుపడ్తోంది. గేటు నెమ్మదిగా దాటి పరిగెత్తాడు. ముళ్ళు గ్రుచ్చుకున్నాయి. పడ్డాడు అయినా తన పని ఆపలేదు. రాళ్ళు గుద్దుకుని కాలి వేళ్ళు చితికి పోయాయి. రక్తం కారింది. భరించరాని బాధ. అయినా పరుగు తీశాడు.

అలా పరిగెత్తగా ఓ గ్రామం అగుపించింది. తెలతెల్లారుతోంది. ఓ టీ దుకాణం దగ్గరికి వచ్చేప్పటికి మరి అతనికి ఓపిక లేకపోయింది. సొమ్మసిల్లి పడిపోయాడు.

ఆ టీ కొట్టు యజమాని రాములు. తన చిన్నప్పటి నుండి టీ, టిఫిన్ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. అతనికి పిల్లలు లేరు. అతనూ అతని భార్యా ఆ టీ కొట్టు ప్రక్కన నున్న రేకుల షెడ్డులో కాలక్షేపం చేస్తున్నారు.

రాములూ అతని భార్యకి రాజశేఖరం రాక చాలా సంతోషం కలిగింది. అతడ్ని దేవుడు పంపించిన కొడుకుగా భావించి కన్న కొడుకులా చూసుకొంటూ పిల్లలు లేని లోటు తీర్చుకున్నాడు. రాముల్ని నాన్నా అని, అతని భార్యని అమ్మా అని పిలిచేవాడు. అతడు ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరు అని ఆ దంపతులు అతడ్ని అడగలేదు. రాములు తరువాత ఆ దుకాణానికి యజమాని రాజశేఖరం అయ్యాడు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ అతనికి తెలుస్తూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చెలరేగిన మత సంఘర్షణలు, వేర్పాటు దోరణలు. దాని ఫలితమే భారతదేశం నుండి పాకిస్తాను వేరయింది. ఆ తరువాత బాపూజీ మరణం. విదేశీ శక్తులు ఆక్రమణలు, దేశ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, వాళ్ళల్లో స్వార్థం పెరగడం. పొట్టి శ్రీరాములు చనిపోయిన తరువాత ఆంధ్రరాష్ట్ర అవతరణ, నెహ్రూగారు చనిపోయిన తరువాత లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాని అవడం, ఆ తరువాత ఇందిరాగాంధీ ప్రధాని అవడం, అరాచక శక్తులు పెరగడం ఎమర్జన్సీ ప్రకటించడం, ఆ తరువాత ఆమె ఓటమి, జయప్రకాశ్ నారాయణ ప్రేరణ.

ఆ ప్రేరణలో జనతా పార్టీ ఏర్పడ్డం, ఆ పార్టీ త్వరగా పతనం అవడం. తిరిగి ఇందిరా గాంధీ ప్రధాని అవడం, ఆమె అంగరక్షకుల చేతిలో అసువులు బాయడం, రాజీవ్ గాంధీ ప్రధాని అవడం. మానవ బాంబు చేతిలో అతను కూడా మృత్యువాతపడ్డం… రాష్ట్రంలోని, దేశంలోని జరుగుతున్న పరిమాణాలు తెలుస్తున్నాయి.

దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు మారారు. రాష్ట్రంలో కూడా అనేక మంత్రి ముఖ్యమంత్రులు మారారు. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడి వాటి ప్రాభల్యం పెరగడం; దేశంలోని, రాష్ట్రంలోని చెలరేగుతున్న అలజడులు, దుర్ఘటనలు, అన్ని రాజశేఖరానికి తెలుస్తూనే ఉన్నాయి. అయినా అతను నిర్లిప్తంగా ఉండిపోయాడు.

దేశ నాయకుల్లో చిత్త శుద్ధి లేదు. ప్రతీ ఒక్కరిలోనీ పదవీ కాంక్ష, స్వార్థపరత, పదవీ వ్యామోహం ఇవన్నీ రాజశేఖానికి అసహ్యం కలిగించాయి. ఇలాంటి పరిపాలన కోసమా స్వాతంత్ర్య పోరాటం చేశామా? ఒక్కొక్కసారి తన మనస్సులో ప్రశ్న వేసుకున్నాడు.

రాష్ట్రంలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య, పేదరికం పెరిగిపోతున్నావి. అవినీతి కూడా పోటీ పడుతోంది.

ప్రపంచీకరణ ఫలితం అనేక మార్పులు అనేక అనర్థాలు, అనేక అసమానతలు తనేం చేయగలడు? తన ఇంటినే తను చక్కబరుచుకోలేకపోయాడు. సమాజాన్ని ఎలా చక్కబరచగలడు?

తను అనుకున్న వాటిలో కొన్ని జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇద్దరూ దంపతులు అవుదామనుకున్నారు. అది కలగానే మిగిలిపోయింది. ఇద్దరికీ ఇప్పుడు తొమ్మిది పదుల వయస్సు నిండింది. తనది గట్టి ప్రాణం కాబట్టి బ్రతికి ఉన్నాడు. సుజాత ఎలా ఉందో తెలియదు. కళ్యాణి ఎలా ఉందో తెలియదు. రాధ ఎలా ఉందో తెలియదు. విశాలగుప్త బాబాయ్ దంపతులు, పరందామయ్య గారి దంపతులు, నీతమ్మగారు అందరూ ఈలోకం విడిచి ఉంటారు. ఇలా ఆలోచిస్తూనే జీవితం గడిపెస్తున్నాడు రాజశేఖరం. దేశంలో కాలంతో పాటే మారుతున్న దేశ, రాష్ట్ర కాల పరిస్థితులు అవలోకిస్తూ కలిగిన క్షోభని మనస్సులోనే దాచుకుంటూ జీవితం సాగిస్తున్నాడు అతను.

రాజశేఖరం చెప్పడం పూర్తి చేశాడు. అతను చెప్తున్నది వింటున్న చైతన్య గాఢంగా నిట్టూర్పు విడిచాడు. “తాతయ్యా! నా జీవితానికి, నీ జీవితానికి చాలా పోలికలున్నాయి. నిన్ను ఆ రాములు అతని భార్య ఆదుకున్నట్టే నీవు నన్ను ఆదుకుని యోగ్యుడుగా తీర్చిదిద్దావు.” అన్నాడు.

“నీ ఉబలాటం – కుతూహలం తీరిందా. ఇంక పడుకో అన్నాడు. రాజయ్య తాతయ్య అదే రాజశేఖరం చైతన్యతో. ఇద్దరూ నిద్రకి ఉపక్రమించారు.

50

రాజశేఖరానికి నిద్ర పట్టలేదు. చైతన్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏదో రహస్యం కనిపెడ్తే ఎంత రిలీఫ్ కలుగుతుందో అటువంటి భావమే అతని ముఖంలో.

స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న అఖండ భారతదేశం ఖండాలుగా విడిపోయింది. ఇంకా దేశంలోకి అక్రమణదారులు, చోరబాటు దారులు ప్రవేశిస్తున్నారు. వారితో చేతులు కలిపి దేశాన్ని మరింత అశాంతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి స్వార్థపరశక్తులు. వాళ్ళతో చేతులు కలిపి కొంతమంది దేశ ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. రాజశేఖరానికి ఒంటరి జీవితం మొదట్లో కలవరపెట్టిందంది.

రాములు భార్యపోయిన తరువాత ఒంటరిగా ఉండవల్సివచ్చింది. ఒంటరి జీవితం భయంకరంగా ఉండేది. ఆ జీవితం విసుగును కూడా కలిగించేది. ఆ జీవితానికి దూరంగా పారిపోదామనిపించేది. రానురాను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు.

ఒక్కొక్క పర్యాయం వేదాంత భావం తనలో కలిగేది. విరక్తి భావం కలిగేది. ‘మానవుడు పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టాడు. చనిపోయేటప్పుడు కూడా ఒంటరిగా చనిపోతారు. మధ్యలో వచ్చిన బంధాలు – బాంధవ్యాలూ ఇవి. ఈ మానవ జీవితం నీటి బుడగలాంటి జీవితం క్షణికమైన జీవితం.’ ఇలా సాగిపోతున్నాయి రాజశేఖరం ఆలోచన్లు.

చైతన్య మరునాడు ఖాళీగా కూర్చోలేదు. రాజశేఖరం జీవితంలో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలన్నీ వివరిస్తూ “మట్టిలో మాణిక్యం” అనే పేరుతో ఓ వ్యాసం వ్రాసాడు. దానిక్రింద తన పేరు, తన సెల్ నెంబరు ఇచ్చాడు. ఆ వ్యాసం అన్ని ప్రముఖ వార్తా పత్రికల్లో ముద్రింపబడింది.

“అక్కా ఈ రోజు పేపర్లో రాజశేఖరం గారు క్షేమంగా ఉన్నారని వ్రాసిన వ్యాసం చదివావా?” సుజాతకి ఫోను చేసింది రాధ.

“వదినా అన్నయ్య గురించి వ్రాసిన వ్యాసం చదివావా?” అని కళ్యాణి ఫోను చేసింది. “అమ్మా! వార్తా పత్రికలో రాజశేఖరం గారి గురించి వ్రాసిన వ్యాసం చదివావా?” ఆశ్రమవాసులు ప్రశిస్తున్నారు.

సుజాత కూడా ఆ వ్యాసం చదివింది. ఒకవేపు సంతోషం, భావోద్వేగం. రాజశేఖరం బ్రతికి ఉన్నందుకు సంతోష తరంగాలు ఉప్పొంగుతున్నాయి.

మన సంస్కృతీ సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాల్లో, సామాజిక మైత్రీలలో, బంధాలలో రక్త సంబంధాలలో ఈ భావోద్వేగాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటి వలన ఒక వేపు ఆనందం కలగవచ్చు. మరోవేపు బాధా కలగవచ్చు. అలాగే జీవితం నుండి పారిపోవడమేనా జరుగుతుంది. లేకపోతే సమాజంలో ఉంటూ పోరాడటమైనా జరుగుతుంది.

ఈ ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే ఎమోషన్సు తప్పనిసరి. మనం సమాజంలో బ్రతికి ఉండాలన్నా ఎమోషన్సు అవసరం. ఒక విధంగా చూస్తే మన సంక్షేపాన్ని కాపుకాసేవి మన భావోద్వేగాలే.

మన జీవితంలో ఫీలింగ్సు వేరు, ఎమోషన్సు వేరు, ఫీలింగ్సు అనేవి మనకు మాత్రమే పరిమితమయినవి. అవి నా స్వంతం అని అనుకోదగ్గవి. ఎమోషన్సు అలాకాదు అవి అందరికీ చెందినవి. ఒకే గుణగణాలు కలిగినవి. మాటలకి అందనివి. లొంగనివి.

రాజశేఖరం విషయం తెలిసిన తరువాత సుజాతలో భావోద్వేగాలకి లోనయింది. రాజశేఖరం ఉనికి ఇప్పటికైనా తెలిసింది కదా అన్న ఆనందం. ఇన్నాళ్ళూ ఇంత ఎడబాబు కలిగిందని బాధ. ‘పరిస్థితుల ప్రభావం వల్ల తమిద్దరి మధ్యా ఎడబాటు కలిగింది. అంతేకాని జీవితం నుండి అతను పారిపోలేదు,’ అని అనుకుంటోంది సుజాతమ్మ.

చైతన్యకి అందరి దగ్గర నుండి కాల్సు వస్తున్నాయి. ఇంత మంచి పని చేసినందుకు అభినందనలు కొంతమంది తెలియజేస్తున్నారు. కొంతమంది పొగుడున్నారు. ‘రాజశేఖరాన్ని తీసుకుని రావల్సింది. మేము కూడా వస్తున్నాం ఆశ్రమానికి’ అని మోహన్ కృష్ణ – రాధ నుండి ఫోను వచ్చింది. అలాగే కళ్యాణి, రాజేష్‌ల నుండి కూడా.

‘తాతయ్యకి ఇంతమంది ఆత్మీయులున్నారా? చాలా అదృష్టవంతుడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఆత్మీయతకు దూరంగా ఉండిపోయాడు. అలా చూసుకుంటే దురదృష్టవంతుడు.’

‘తాతయ్యను తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాలి. ఆత్మీయుల్తో కలుసుకునే భాగ్యం తాతయ్యకి కల్పించాలి’ చైతన్య అనుకున్నాడు. సుజాతమ్మని చూడాలన్న కోరిక కూడా కలిగింది. రాజశేఖరానికి కూడా సుజాతను చూడాలని కోరిక ఉంది. వాళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాలు ఏవో దూర ప్రాంతాల్లో లేరు. దేశంలో వేరు  రాష్ట్రాలలో లేరు. ఒకే రాష్ట్రంలో కొన్ని గంటలు ప్రయాణం చేసేంత దూరంలో ఉన్నారు. అయినా ఇన్ని సంవత్సరాలు ఒకరి ఉనికి మరొకరికి తెలియకుండా పోయింది. దూరంగా ఉండిపోయారు ఆ ఆదర్శప్రేమికులు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here