Site icon Sanchika

కొడిగట్టిన దీపాలు-4

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 4వ భాగం. [/box]

7

[dropcap]స్వా[/dropcap]తంత్ర్య పోరాటం ఉధృతం అవుతోంది. పరాయి ప్రభుత్వ పాలనలో ప్రజల కష్టాలు – సమస్యలూ, కన్నీళ్ళు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఎంతమందో దేశభక్తుల త్యాగాలూ, బలిదానాలూ, ఆత్మార్పణలు జరుగుతున్నా పరిస్థితిలో ఏ మార్పులేని గడ్డు రోజులు అవి. అప్పటి ప్రభుత్వ పైశాచిక చర్యలకి బెదిరిపోక, కృంగిపోక ద్విగుణీకృతమైన ఉత్సాహంతో స్వాతంత్ర్య సమర యోధులు ముందుకడుగు వేస్తున్నారు.

వీటి వేటి మీదా లేదు రాజశేఖరం దృష్టి, అతని మదినిండా ఆలోచన్లు. అవి రకరకాల ఆలోచన్లు. ముందు ముందు తన జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్న ఆలోచన్లు. ప్రస్తుతం తన కర్తవ్యం గూర్చి ఆలోచిస్తున్న ఆలోచన్లు. తను ఇప్పుడు తొందరగా డిగ్రీ పూర్తి చేయాలి. ఆ తరువాత తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి, ఎదుటివాళ్ళ మీద ఆధారపడకుండా తన కుటుంబాన్ని ఆదుకోడానికి ఓ ఉద్యోగం సంపాదించాలి. భారతీయులు ఎలా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారో తన కుటుంబ సభ్యులు కూడా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా పతనావస్థకి చేరుకున్న తన కుటుంబం వారిని ఆదుకోవాలి అనే లక్ష్యంతో పట్టుదలగా కాలేజీ లైబ్రరీ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని పుస్తకాల్లో తలదూర్చాడు రాజశేఖరం.

ఇవతల రాజశేఖరం ఇంత కష్టపడి చదువుతుంటే అవతల అతని తల్లి మీనాక్షి పండిన పంట చేతికొచ్చే సమయంలో రైతన్న ఎంత సంతోషిస్తాడో డిగ్రీ పూర్తి కాబోతున్న కొడుకుని తలుచుకుని ఆనంద తరంగాల్లో తేలియాడుతోంది. తన కొడుకు ప్రయోజకుడయితే తమ కష్టాలు తీరిపోతాయి. బానిస బ్రతుకు నుండి విముక్తి కలుగుతుంది. ఇలా అక్కడ అతని తల్లి మీనాక్షి ఆలోచించేది. పగటికలలు కనేది. ఇటువంటి మనస్తత్వం గల వాళ్ళకి, ఇలా పగటికలలు కనడంలోనే తృప్తి లభిస్తుంది. తాము తలిచినవి అయినా, అవకపోయినా ఆ కొద్దిపాటి తృప్తితోనే ఇటువంటి ఆశాజీవులు జీవితం సాగిస్తారు.

“చూశారా… చూశారా! మనమందరం ఇలా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ చదువులు కూడా మానేసి ఉద్యమంలో ఉరుకుతుంటే తనకే పట్టనట్టు ఆ పుస్తకాలు పురుగు ఎలా కూర్చుని పుస్తకాల్లో తలదూర్చాడో?” ఓ స్టూడెంటు అన్నాడు అందరికీ రాజశేఖరాన్ని చూపిస్తూ..

“అవునవును. ఇది మరీ అన్యాయం. దేశద్రోహం” అనేక కంఠాలు ఒకేమారు పలికాయి.

“ఇది సహించరాని విషయం. అతను అలా చదవడం ఆపు చేయించాలి” అనేక కంఠాలు ఒకేమారు పలికాయి. వాళ్ళు ఊరుకోలేదు. రాజశేఖరం చేతిలో ఉన్న పుస్తకాల మీదకి దాడి చేశారు. అనేక డజన్ల చేతులు ఆ పుస్తకాలను అతని చేతిలో నుండి లాక్కుని విసిరివేశారు.

ఈ హఠాత్పరిణామానికి దిమ్మెర పోయింది రాజశేఖరం మెదడు ఒక్క క్షణం. తరువాత మెదడు, దానితో పాటే మిగతా అవయవాలూ చురుగ్గా పని చేయడం ఆరంభించాయి.

ఉద్వేగంతో అతని వదనం అరుణిమ దాల్చింది. ‘బాపూజీ కన్న కలలేంటి? అతని ఆశయం ప్రకారం ఈ స్వాతంత్ర్య పోరాటం జరుగుతోందా?’ అని అనుకున్న రాజశేఖరం ఇదే మాటలు స్టూడెంట్సుతో అన్నాడు. “మీరు చేస్తున్న చర్చలేఁటి? ఇదేనా అహింసా పద్దతిలోనున్న మీ ఆందోళన? మీరు సాగిస్తున్న ఈ ఆందోళనలో, పోరాటంలో, మీ చర్యల్లో నాకు అహింసకు బదులు హింసే అగుపిస్తోంది. మీరు నిజమైన స్వాతంత్ర్య ప్రేమికులు కాదు, నిజమైన స్వాతంత్ర్య కాముకులు అసలేకాదు. శాంతి కాముకులు అసలేకాదు. అసలికి, మీరు అసలు సిసలైన దేశ భక్తులు కారు” ఉద్రేకంతో ఊగిపోతూ అన్నాడు రాజశేఖరం స్టూడెంట్స్‌తో.

రాజశేఖరం స్వతహగా మంచి సహనపరుడు. అయితే సహనానికి కూడా ఓ హద్దూ అనేది ఉంది. ఆ హద్దు దాటుతో మనిషిలో వివేకం నశిస్తుంది. ఆలోచనా శక్తి మందగిస్తుంది. అలా సహనం కోల్పోయిన మనిషి తానేఁ చేస్తున్నాడో? తానేం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేని అయోమయ పరిస్థితిలో పడి దానికి ఫలితం ఏం జరుగుతుందో ఊహించలేక మాట్లాడుతాడు, ప్రవర్తిస్తాడు మనిషి.

అతని ఆవేశపు పలుకులు అక్కడ గుంపులు గుంపులుగా చేరుకున్న విద్యార్థి, విద్యార్థినిలకి మరింతగా ఆవేశం తెప్పించాయి. అగ్నికి ఆజ్యం తోడయినట్లు వాళ్ళ హృదయాలు క్రోధాగ్నితో భగ్గుమన్నాయి. అనేక జతల చేతులు ఒక్కసారి గాలిలోకి మీదకు లేచాయి.

“ఆగండి.”

ఓ సింహగర్జన వినిపించింది. అందరి తలలూ ఒకేమారు అటు తిరిగాయి. వారికి సమీపంలో సుజాత నిలబడి ఉంది. వారి ఆవేశపు పైశాచిక చర్యను గమనిస్తూ ఆ అన్యాయాన్ని అక్రమాన్ని సహించలేక మనస్సు అడుగు పొరల్లో నుండి మానవత్వంపై కుబుకుతూ ఉంటే గట్టిగా గర్జించినట్టు ఉంది.

ఆమె గర్జన ఆడ బెబ్బులి గర్జనలా ఉంటే రాజశేఖరం వేటగాడి పాలుపడ్డ మృగంలా, డేగకి చిక్కుకున్న పావురంలా, క్రూరమృగానికి ఆహారమవబోతున్న సాధు జంతువులా కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించి ధైర్యంగా అందులోకి చొరబడి శత్రువులో వీరోచితంగా పోరాడుతున్న అభిమన్యుని వదనం పై కదలాడిన విజయగర్వంలాంటి భావం అతని ముఖమండలంపై తొంగి చూసింది.

“నేను మీ పైశాచిక చర్యను సమర్థించలేకపోతున్నాను. మీరు చేస్తున్న ఈ హిసాత్మక చర్య వల్ల ఈ స్వాతంత్ర్య పోరాటానికి కళంకం వాటిల్లుతుంది. ఈ అహింసాయుతమైన ఈ పోరాటంలో శాంతి మృగ్యమై అశాంతితో హింసాయుతంగా మారుతోంది. ముఖ్యంగా బాపూజీ మనల్నుండి ఆశించేది ఇలాంటి హింసాయుత పోరాటం కాదు. నా మాట మీద, బాపూజీ సిద్ధాంతాల పైనా మీకెవరికైనా విశ్వాసం, నమ్మకం, ఆదరణ ఉంటే మీ చేతులు దించండి” మేఘం గర్జించినట్టు సుజాత కంఠం నుండి గంభీర మాటలు వెలువడ్డాయి.

గాలిలోకి పైకి లేచిన అనేక జతల ఆడా, మగా చేతులు ఒకే పర్యాయం క్రిందకు వాలిపోయాయి. వారి కన్నుల్లో పశ్చత్తాప భావాలపాటు సుజాత మాటలు యడల వారికెంత గౌరవం ఉందో తెలుస్తోంది. సుజాత రాజశేఖరం వేపు తిరిగింది.

“చూడండి రాజశేఖరం గారూ! మనిషికి కాస్తో – కూస్తో స్వార్థం ఉండడం సహజమేకాని, అయితే ఇంత స్వార్థం పనికి రాదండి. ఒకవేపు దేశం విదేశీయ పరిపాలనలో పడరాని పాట్లు పడ్తూ, అత్యాచారాలకి, అన్యాయాలకీ బలైపోతుంటే, దేశమాతకి కారుతున్న కన్నీరు తుడిచి ఆ బానిస ఉక్కు సంకెళ్ళ నుండి – బానిస బంధాల నుండి దేశమాతను విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేయాలేకాని ఇంత సంకుచిత వైఖరిని అవలంబించకూడదండి. మీలో ఏ మాత్రం మానవత్వం మిగిలి ఉన్నా ఈ సంకుచిత వైఖరి విడనాడి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి మాతో చేతులు కలపండి.

ఆనాడు కొంతమంది స్వార్థపరుల కారణం చేత ఇన్నాళ్ళు బానిసత్వంలో మగ్గుతున్నాం. మన దేశం పరాయిల పాలయింది. అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్వార్థం విడనాడకపోతే దేశ విచ్చిన్నానికి కారణం అవుతుంది. ప్రగతి మార్గం పై పయనించలేము. స్వతంత్రులం కాలేము.

నా మాటలతో మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. దేశాభిమానాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధికి, దేశ స్వాతంత్ర్య సమరానికి శంఖం పూరిస్తారని ఆశిస్తున్నాను” అని అంటూ సుజాత అచటి నుండి కదిలిపోయింది. ఆమె వెళ్ళిన దిక్కు వేపు అలా చూస్తూ ఉండిపోయాడు రాజశేఖరం.

8

సమాజంలో అందరి మనుష్యులూ ఒకే విధంగా ఉండరు. వారి భావాలూ – ఆలోచన్లూ కూడా ఒకే విధంగా ఉండవు. ఎవరి భావాలు వాళ్ళవి. ఎవరి ఆలోచన్లు వాళ్ళవి. ఎదుటివాళ్ళ ఆలోచన్లని – భావాల్ని విమర్శించే హక్కు అణచివేసే హక్కు ఎవ్వరికీ లేదు.

తను రాజశేఖరం చర్యను ఖండించింది. విమర్శించింది. తప్పుబట్టింది. అతని దేశభక్తిని శంకించింది. అలా చేసే హక్కు తనకుందా అని ప్రశ్న వేసుకుంటే లేదనే జవాబు వస్తుంది.

ఎవరికైనా ఎదుటి వాళ్ళు చెప్పినవన్నీ వినాలని లేదు. ఎవరి అభిప్రాయాలు, అభిరుచుల ప్రకారం నడుచుకునే హక్కు వాళ్ళకుంది.

బ్రిటిష్ వారి పరిపాలనలో మనకి ఆ హక్కు ఎలాగూ లేకపోయింది. అయితే వ్యక్తిగత జీవితంలో ఎవరిబాట వారిది. విదేశ పరిపాలనలో దేశవాసులు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. ప్రజలు తమ భావజాలాన్ని స్వేచ్ఛగా ప్రకటించలేకపోతున్నారు. సమాజంలో మనం మన భావజాలాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దకూడదు. ఇలా తెగ ఆలోచిస్తోంది సుజాత. ఆ రాత్రి సమయంలో పక్క మీద అటు ఇటు దొర్లుతోంది కాని ఆమెకి నిద్ర రావటం లేదు.

ఆమె మదినిండా రకరకాల ఆలోచన్లు. తను బాపూజీని చూసింది. అతనిలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. అతని చిరునవ్వుల్లో చల్లదనం ఉంది. శాంతిమూర్తిగా అగుపడున్న అతనిలో ఏదో తెలియని అలౌకిక శక్తి ఉంది. ఆ రోజు తను దూరంగా నిలబడి ఉంటే తన చుట్టూ ముట్టిన వాళ్ళను దాటుకుంటూ తన దగ్గరికి వచ్చి తన రచనా కార్యక్రమాల్ని తన కవిత్వాన్ని ఎంత బాగా పొగిడారు బాపూజీ. ఆ మధుర క్షణాల్ని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేదు.

అయితే లోకోభిన్నరుచి, సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు. తెగిడిన వాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో ఒక వ్యక్తి చేసిన పని కొంతమందికి మంచిదయితే మరి కొంత మందికి ఆ పని చెడు అవచ్చు.

స్వాతంత్ర్య పోరాటంలో మార్గదర్శకుడుగా పోరాట యోధుడుగా ముందుకు వెళ్తున్న బాపూజీని కూడా విమర్శించే నాయకులున్నారు. స్వాతంత్ర్య పోరాటం అహింసా పద్ధతిలో జరగాలి. హింసకు దాన్తో తావుండకూడదు అని అనుకునేవారు బాపూజీ. కొంతమందికి ఇది నచ్చేది కాదు. అహింస… అహింస అని పట్టుకు కూర్చుంటే, శాంతియుత పోరాటం చేద్దామనుకుంటే దేశం బానిస సంకెళ్ళ నుండి బయటపడుతుందా? అలా ఎప్పటికీ జరగదు. దానికి తగినది హింసా పూరిత మార్గాన్ని అనుసరించడమే తగినది. అలా చేస్తేనే మన కోరిక సఫలీకృతమవుతుంది అనుకున్న నాయకులు కూడా ఆ రోజుల్లో ఉండేవారు అని తను వింది. ఇలా అహింసను కోరేవారూ, హింసను కోరేవారూ ఇలా అతివాదులు, మితవాదులుగా మిగిలిపోయారు.

ఒక దశలో గాంధీజీకి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అగుపించలేదు. ప్రజలు చేసిన విధ్వంసమే కనిపించిందిట ఆయనికి. ఒక సందర్భంలో బాపూజీ తన అసహనం వ్యక్తం చేస్తూ “సత్యాగ్రహంలో హింస పనికిరాదని, విధ్వంసానికి తావులేదని, నేను ఎన్నో సార్లు చెప్పాను. అయినా సత్యాగ్రహం పేరిట మీరు భవనాలు తగలబెట్టారు. ఆయుధాలను గుంజుకున్నారు. రైళ్ళు ఆపారు. టెలిగ్రాఫ్ తీగలు తెంచారు. అమాయకుల్ని ఈ విధ్వంస సమయంలో దింపి దుకాణాలు, ఇళ్ళు దోచారు. ఇలాంటి పనులు చేస్తేగాని మనకి స్వాతంత్ర్యం రాదా? మీ ఈ చర్యను నేను సమర్థించ లేకపోతున్నాను” అని ప్రజలతో అన్నారుట.

అయితే బాపూజీ ఈ మాటలు అప్పటి నాయకులకి నచ్చలేదుట. బాపూజీ మాటలూ, చేతలూ, కొన్ని బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థించినట్టుగా ఉన్నాయని వారి మీదున్న రాజభక్తిని వెల్లడి చేస్తున్నట్లున్నాయని కొందరు నాయకులు అతడ్ని విమర్శించారుట.

ముఖ్యంగా రౌలత్ చట్టం సందర్భంలో కొంతమంది నాయకుల ఉద్దేశ ప్రకారం గాంధీజీ బంగారం లాంటి ప్రజా పోరాటాలు, అణచివేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా పోరాటం వీటి అన్నిటినీ కూడా బాపూజీ నీరుకార్చేరని భావించేవారట.

పాయిఖానాల కడుగుళ్ళు, రాట్నాల వొడుకుళ్ళు అంటూ ఏళ్ళ తరబడి కాలక్షేపం చేస్తూ ఉండటం తప్పు అని అనిపించినప్పటికి దశాబ్దానికో ఉద్యమం, మొదలు పెట్టి అది కాస్తా చివర దశకి చేరుకుంటున్న సమయంలో ఏదో సాకుతో రక్కున ఆపేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంతోష పెట్టడంలో బాపూజీ పావు శతాబ్దం గడిపేశారని, బాపూజీ మీద అపవాదు కూడా ఉందట.

కొంతమంది బాపూజీని బాహుటంగానే విమర్శించేరుట. ఉద్యమ నాయకుడనుకునేవాడు. ఉద్యమం నీరు కారిపోయే విచిత్ర పరిణామం తటస్థించిన ప్రతీసారీ ఆయన్ని నమ్ముకున్న దేశవాసులు, జాతీయ నాయకుల్లో ప్రతీ ఒక్కరూ విస్తుపోయారట. అతని చర్యలకి నోట మాటరాక మ్రాన్పడ్డారుట. లోలోపల మధన పడ్డారుట. తప్పు చేశారంటూ బాపూజీకి ఉత్తరాలు కూడా వ్రాసారుట.

చివరికి అందరూ రాజీపడ్డారుట. బాపూజీ అలా నిర్ణయం తీసుకున్నప్పుడు మనమేం చేయగలం అని సరి చెప్పుకున్నారుట. అతడ్ని అనుసరించేరుట. అయితే బాపూజీ చర్యల్ని కొంతమంది బాహటంగా కాకపోయినా ఖండించారుట కొందరు. కొంతమందికి అతని చర్యలు, భావాలు అంటే చిన్న చూపుగా ఉండేవట. దానికి కారణం స్వాతంత్ర్య పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం దారుణ దమన నీతిని అనుసరిస్తున్న సమయంలో దేశవాసుల్ని భయకంపితుల్ని చేస్తున్నప్పుడు బాపూజీ దక్షిణాఫ్రికాలో ఆ బ్రిటిష్ అధినేత ముందు తన విధేయత ప్రకటించారని కొందరు విమర్శిస్తారు.

తన విధేయత తెలియజేసే తపనతో దక్షిణాఫ్రికాలో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడంలో తెల్లదొరలకి సహాయం చేశారని బాపూజీ మీద అపవాదం ఉందట.

దేశ స్వాతంత్ర్యం కోసం భారతీయులు భీకర పోరాటాల సాగిస్తూ ఉంటే అదంతా అర్థంలేని ఆవేశం అయినట్టు బాపూజీ చులకన చేశారని అతనికి అపవాదు ఉందట. తాను గందరగోళంలో పడి ఇతరులను కూడా అయోమయంలోకి నెట్టివేయడమే తప్ప భారత రాజకీయ రంగంలో వీస్తున్న గాలులు ఎటువంటివి? వాటి ఫలితం ఏంటి? అన్న అవగాహన గాంధీజీకి లేదు.

సత్యాగ్రహానికి తానే సర్వోపరి అని అహంకరించి తన వల్లే ప్రపంచానికి సత్యాగ్రహ ఆయుధం దొరికిందని అనుకునే బాపూజీకి దక్షిణాఫ్రికాలో అంతకుముందే చాలామంది అహింస, సహాయ నిరాకరణ, ప్రజా పోరాటలను, విమర్శించారని బాపూజీ చర్యలను వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల అవసరం బ్రిటిష్ ప్రభుత్వానికి కావల్సి వచ్చింది. ఆ సమయంలో బ్రిటిష్ అధికారుల్ని ఇరుకున పెట్టి మనం మన కార్యాన్ని సాధించుకుందామని చాలామంది అంటే బాపూజీ అంగీకరించలేదుట. యుద్ధకాలంలో అనేక మంది ఊచకోతకి బలయ్యారు. అయినా బాపూజీ తెల్లవారికే తన అండదండలు అందచేశారన్న అపవాదం కూడా ఉంది. ఎవరైనా ఈ విషయం గురించి ప్రశ్నిస్తే బాపూజీ – కష్టకాలంలో మనం వారికి సహాయపడ్డాం. వారు కృతజ్ఞతగా యుద్ధం ముగియగానే మనకి ఉపకారం చేస్తారని కసాయి వాడ్ని గొర్రె నమ్మిననట్టు నమ్మారు అని అతడ్ని విమర్శించిన విమర్శకులు అంటారు. ఆ తరువాత విమర్శకుల మాటే నిజమని రుజువు అయింది కూడా.

ఆ తరువాత బ్రిటిష్ వారి కుటిల నీతి బాపూజీకి తెలిసింది. అందుకే అధికార దుర్వినియోగానికి ఆస్కారమున్న రౌలత్ సిఫారసులను అతను వ్యతిరేకించారుట. అమలు చేస్తే సత్యాగ్రహానికి దిగుతానని హెచ్చరించారుట. అయినా ఆనాటి ప్రభుత్వం ఆ రౌలత్ బిల్లును ఆమోదింప చేసిందిట. బాపూజీ ప్రముకుల్ని పిలిచి, సమావేశపరచి బొంబాయిలో సత్యాగ్రహ సభను స్థాపించారుట. దానికి అధ్యక్షుడు ఆయనే. కేంద్రస్తానం బొంబాయేనట. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా ప్రజలు పనులు మాని, విద్యా సంస్థలు మూసివేసి, శాంతియుతంగా ధర్నాలు చేయాలని పిలుపు ఇచ్చారుట.

దానికి ఫలితం తెల్లవారిపాలన అంటే రోత పుట్టి స్వాతంత్ర్యం కోసం గొప్ప కదలిక వచ్చిందని, సత్యాగ్రహ సభలు వెలిసాయని తను తన చరిత్ర ఉపాధ్యాయుడు ద్వారా వింది.

ఆలోచనా ప్రపంచం నుండి బయటపడిన సుజాత బాహ్య జగత్తులోకి వచ్చింది.

మనిషి పుట్టుక పుట్టిన తరువాత వాళ్ళు మహాత్ములవచ్చు, మహాపురుషులవచ్చు కొన్ని బలాలు – బలహీనతలు ఉంటే ఉండచ్చు. మనం ఆ బలహీనతలకంటే బలాల వేపు దృష్టి పెట్టాలనుకుంటుంది. గాంధీజీలోనూ కొన్ని బలహీనతలు ఉండచ్చు. అతనూ మానవమాత్రుడే కావడం వల్ల అయితే అతనిలోని కఠిన నిర్ణయం, నిస్వార్ధ సేవ, నిరాడంబరత్వం, మానవత్వగుణాలు మెండుగా ఉన్నాయి. ఓసారి అతని జీవితంలో జరిగిన సంఘటన తను వింది.

దక్షిణాఫ్రికాలో ఓసారి అక్కడున్న భారతీయులకి బాపూజీ చేసిన సేవలకి మెచ్చుకుని అక్కడివారు అనేక కానుకలు ఇచ్చారుట. ఆ కానుకల్లో ఒక వజ్రాల హారం కూడా ఉందట. గాంధీజీ ఆ కానుకలన్నీ తిరిగి ప్రజలకే ఇచ్చేద్దామనుకున్నారుట. అప్పుడు అతని ధర్మపత్ని కస్తూరీబా ఆ వజ్రాల హారం ఇవ్వడానికి ఇష్టపడలేదుట. ఆమె బాపూజీతో “ఈ కానుకలో మీకూ, నాకూ ఏ సంబంధం లేకపోవచ్చు. కాని ఈ హారాన్ని మాత్రం రాబోయే నా కోడలికి ఇద్దామని నా కోరిక” అని అందిట. దాని మీదట గాంధీజీ “ఈ కానుకలన్నీ నేను ప్రజలకి చేసిన సేవ ఫలితంగా వచ్చినవి. అందుచేత ఇవి ప్రజలకే చెందాలి. నీకు ఈ కానుకుల్ని ఉంచుకునే హక్కు లేదు” అని అన్నారుట.

అందుమీదట కస్తూరిబా “మీరు చేసిన సేవ నేను చేసిన సేవ కాదా? మన భార్యాభర్తల్లో ఎవరు చేసినా సేవ సేవే కదా. ఇలా ఏర్పాటు దోరణిలో నన్ను వేరు చేస్తూ మీరు మాట్లాడ్డం నాకు నచ్చలేదు” అంటూ ఆమె కన్నీరు కార్చిందట. అయినా బాపూజీ చలించలేదుట. ఇలా ఉండేవి గాంధీజీలో కఠిన నిర్ణయాలు. సుజాత ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version