కొడిగట్టిన దీపాలు-5

0
3

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 5వ భాగం. [/box]

9

[dropcap]హో[/dropcap]రున శబ్దం చేస్తూ ఎగిసి పడున్న కెరటాల వంక కన్నార్పకుండా తదేకంగా చూస్తున్నాడు రాజశేఖరం. అతని హృదయం నిండా నిరాశా, నిస్పృహ చోటు చేసుకున్నాయి. అవేదన గూడు కట్టుకున్న అతని గుప్పెడంత గుండెల్లో ఏదో తెలియని గుబులు.

ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కెరటం ఒడ్డుకు వొరసుకుంటూ వచ్చి తిరిగి సముద్రుడ్లో కలిసిపోవడానికి వెనక్కి జరజరా యమా స్పీడులో పోతోంది. కెరటంతో కూడా కొట్టుకొచ్చిన సముద్రపు నీరు నురుగు ఆకారం పొంది పాలనురుగా అని భ్రమ కలిగిస్తోంది. ఆ నురుగుతో ఉన్న సముద్రపు నీరు అతడి పాదాల్ని తడిపి తిరిగి సముద్రుడులోకి శరవేగంతో దూసుకుపోతోంది.

సముద్రపు నీరు తన పాదాలని తడిపినా రాజశేఖరం చలనం లేని వాడిలా అలాగే ఉండిపోయాడు. అతని దృష్టంతా నింగి, సాగరం కలిసి ఉన్నట్టు అగుపించే చోట నిలిచిపోయింది. దీర్ఘంగా ఆవేదనతో ఆలోచిస్తూ అలా చూస్తూ చలనం లేని వాడిలా కూర్చున్నాడు అతను. సముద్రపు నీటితో కొట్టుకొచ్చిన పీతలు ఇసకలో కన్నాలు చేసుకుని దూరిపోతున్నాయి. తన దృష్టిని మరల్చి ఇసకలో అలా కన్నాలు చేసుకుని దూరిపోతున్న ఎండ్ర పీతల వంక వింతగా చూస్తూ తాత్కాలికంగా తన బాధను మరచిపోవడానికి వ్యర్థ ప్రయాసం చేస్తున్నాడతను.

వాతావరణంలో గంభీరత – అతనిలో గంభీరత, ప్రకృతిలో గంభీరత ఎటు చూసినా గంభీరతే అగుపడుతోంది. ఆ సముద్ర హోరు వింటుంటే తనలాగే కలత చెందిన సముద్రుడు రోదిస్తున్నాడా అని అనిపించింది అతనికి. తన గుండెల్లో కూడా రోదన – ఆవేదన గూడు కట్టుకుని ఘనపదార్థంలా గట్టిపడ్డాయి. అవి పైకి ఉబకడానికి ఆస్కారం లేదు. తన అవేదన అర్థం చేసుకుని తన రోదనలో తనని ఓదార్చే మంచి మనస్సు గల వాళ్ళ ఓదార్పు తనకి ఆ సమయంలో అవసరం. అలాంటి మంచి మనస్సు గలిగి ఓదార్చేవారు తనకి జీవితంలో తారసపడ్డారా? తన మనస్సులో అశాంతి దూది పింజల్లా పైకెగిరి పోతుందా? అన్న ఆశతో – ఆలోచనతో ఎదురు చూస్తున్నట్టు ఆ సముద్ర ఒడ్డున కూర్చుని ఉన్నాడు రాజశేఖరం.

అతని కళ్ళెదుట తన కుటుంబ సభ్యులు నిలబడ్డారు. తిరిగి అతనిలో ఆలోచనలు. తన కుటుంబ జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? తన జీవితం ప్రస్తుతం ఎలా జరుగుతోంది? వారాలబ్బాయిగా ఏదో విధంగా రోజులు నెట్టుకొస్తూ తన కుటుంబాన్ని – తన వాళ్ళని ఆదుకుని వాళ్ళ కష్టాన్ని దూరం చేసి, కన్నీళ్ళు తుడచి తన కుటుంబాన్ని పైకి తేవాలన్న తన అలోచన్లు మట్టిలో కలిసిపోతున్నాయి.

సుజాత అన్న మాటలు అతని గుండెల్లో బాకులా దిగబడ్డాయి. తన కుటుంబ పరిస్థితి ఎలాంటిదో తెలియని ఆమెకి తనో స్వార్థపరుడుగా అగుపించి ఉండచ్చు. దేశభక్తి లేని ద్రోహిగా కనిపించి ఉండచ్చు. అయితే తను స్వార్థపరుడా? తను దేశభక్తి లేని వాడా? తను తన వాళ్ళను, వాళ్ళ బానిస సంకెళ్ళ నుండి తప్పించాలన్న ఆలోచనలో భారతమాతని బానిస సంకెళ్ళ నుండి తప్పించడానికి ఆలోచించలేకపోయాడు. ఆ ఆలోచన వచ్చినా మొదట తన కుటుంబం, తన వాళ్ళు అన్న స్వార్థంతో మొదట తన వాళ్ళ మీదే తను దృష్టి సారించాడు. అందుకే తన చుట్టురా గిరిగీసుకుని కూర్చున్నాడు.

తన తల్లి, తన తోబుట్టువులు, వాళ్ళ దీన ముఖాలు తన వేపు తన సహాయం కోరుతూ చూస్తున్న చూపులే అగుపిస్తున్నాయి. తన వాళ్ళని నానా యాతనలకి గురి చేస్తున్న మేనమామ భార్య నాంచారమ్మ ఒక్కసారి అతని కళ్ళెదుట కదలాడింది. ఆమె పీక నొక్కేయ్యాలంత కసి, ఆవేశం అతని కనుదోయిలో అగుపించాయి. ఆమె మీద కోపాన్ని సూచిస్తూ అతని దవడ ఎముక ఒక్కసారి కదలాడింది.

మరుక్షణమే తన అసహాయ స్థితి, తన చేతకాని తనం, తన దీనస్థితి అతని స్మృతి పటలంపై మెలిగి గాఢంగా నిట్టూర్పు విడిచాడు. అలా నిట్టూర్పు విడవడం తప్ప ఈ పరిస్థితుల్లో తనేం చేయగలడు? పరిస్థితుల్లో సంఘర్షణ పడడం తప్పు. అలా సంఘర్షణ పడ్డం మానుకుని, పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాజీ ధోరణిలో మెలగడమే తప్ప తనేం చేయలేడు.

ప్రపంచంలో ఏ శారీరక బాధను – మానసిక బాధనైనా తట్టుకోవచ్చు కాని పేదరికం బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆకలి – పేదరికం బాధను తట్టుకోలేక ఎంతమందో చరిత్రహీనులవడానికి, తమ ఆదర్శాల్ని విస్మరించి వక్రమార్గంలో పయనించడానికి ఆస్కారముంది. బాట తప్పిన బ్రతుకులుగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది.

డబ్బున్న వాడికి ఈ సమాజంలో డబ్బులేని వాళ్ళని చూస్తే అలుసు, చులకన, హేయభావం. తమని ఈ ధనికులు చీదరించుకుంటూ ఉన్నా విధిలేని పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని – ఆత్మగౌరవాన్ని చంపుకుని వారికి అడుగులకి మడుగులొత్తుతూ బానిస బ్రతుకు బ్రతకడమే నేర్చుకుంటాడు ఈ పేదవాడు. ఈ పేదవారంటే అందరికీ లోకువే.

ఆలోచన్లు – వాటితో ఆవేదన హృదయాన్ని ఆక్రమించగా ఆ ఆవేదనా ఉద్వేగానికి ఫలితంగా కంటిలో కదలాడుతున్న కన్నీటి తెరమాటున తిరిగి నింగి – సాగరం సంగమించినట్టు అగుపడున్న చోటును గంభీరంగా చూస్తున్నాడు రాజశేఖరం.

10

రాత్రంతా కలత నిద్రలో గడిపింది సుజాత. తెల్లవారింది కాని కళ్ళు నిద్రలేమితో మండుతున్నాయి. నిద్రలేకపోవడం వల్ల కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. మనస్సు అశాంతిగా ఉంది. అసంతృప్తిగా ఉంది. రాజశేఖరాన్ని మందలించి తప్పు చేసిందా? ఇలా ఆలోచిస్తూ మథనపడుతోంది.

“నిద్రపట్టలేదా? కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి?” తండ్రి సుందరామయ్య అడిగాడు కూతుర్ని. తండ్రికి సమాధానం ఇయ్యకుండా తలదించుకుంది సుజాత.

“అందుకే నేను చెప్తూ ఉంటాను. మీ కూతుర్ని అన్ని విషయాల్లో తల దూర్చవద్దని. గొప్ప స్వాతంత్ర్య సమర యోధురాల్లా జెండా పట్టుకుని అందర్నీ వెంటేసుకుని తిరుగుతుంది పగలల్లా. రాత్రి సమయంలో ఇలా నిద్ర లేకుండా గడుపుతుంది” ఈసడింపుగా అంది సీతమ్మ. భార్య మాటలకి ఏఁ జవాబియ్యకుండా అచటి నుండి కదిలిపోయాడు సుందర్రామయ్య. కూతురికి నచ్చజెప్పి ఆమె మనస్సు మార్చాలని అనుకున్నాడు కాని సీతమ్మ జోక్యంతో తన ప్రయత్నం విరమించుకున్నాడు.

సుజాత కాలేజీకి వెళ్ళింది కాని అక్కడ రాజశేఖరం అగుపడలేదు. అతను అగుపించకపోయే సరికి ఆమె మానసిక క్షోభ మరింత ఎక్కువయ్యింది. ‘తను ఎంత తప్పు చేసింది? రాజశేఖరం మనస్సు తనవాడియైన మాటలో గాయపరిచింది. అలా గాయపరిచే అధికారం తనకి ఎవరిచ్చారు? మన ఆలోచన్ల ప్రకారం ఎదుటి వాళ్ళు నడుచుకోవాలని ఎక్కడా లేదు కదా? ఎదుటివాళ్ళని శాసించే అధికారం తనకి లేదు కదా?’ ఆత్మగ్లానిలో ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న ఆమెకి బాధ కాని దానికి ఉపశమనం కనిపించలేదు.

ఇంటికి తిరిగి వచ్చిన ఆమెకి తిండి కూడా హితవు కాలేదు. ఆలోచిస్తూనే కూర్చుంది. సూర్యాస్తమానం అవుతోంది. ‘అలా సముద్రం ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటే కొంతయినా మనస్సు తేలిక పడుతుందేమో!’ ఇలా ఆలోచించిన సుజాత సముద్రం ఒడ్డున కొంత సేపు సమయం గడపడానికి బయలుదేరింది.

బీచంతా జనాలో చాలా సందడిగా ఉంది. పిల్లలు కేరింతలు కొడూ అడుతున్నారు. పెద్దవాళ్ళు లోకోభి రామాయణం ముచ్చటించుకుంటున్నారు. యువ జంటలు ముచ్చట్లాడుకుంటున్నారు. రకరకాల మనుష్యులు, రకరకాల మనస్తత్వం గల మనుష్యులు, రకరకాల తినుబండారాలు అమ్ముతున్న దుకాణదారులు.

వేటి మీదా దృష్టి పెట్టకుండా ముందుకు సాగుతోంది సుజాత. అలోచన్ల నుండి బయటపడ్డ ఆమె దృష్టి ఒక్కసారిగా ఎదురుగుండా అగుపడున్న దృశ్యం వేపు కేంద్రీకరించి ఉలిక్కిపడింది. సందేహం లేదు. అతను రాజశేఖరమే. దేని గురించో గంభీరంగా ఆలోచిస్తున్నాడు. దేని గురించి ఏంటి తనన్న వాడి మాటలు గురించే అయిఉంటాయి. తన మాటలు అతడ్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నాయి. ఇలా అనుకున్న సుజాత అతని వేపు వడివడిగా అడుగులేసింది.

“రాజశేఖరం గారూ!”

ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్న అతనికి ఆ పిలుపు వినిపించలేదు. తిరిగి పిలిచింది. ఆమె కొంచెం గట్టిగా. ఈసారి అతని ఏకాగ్రత చెదిరిపోయింది. ఒక్కసారి బాహ్య జగత్తులోకి అడుగు పెట్టాడు ఆలోచనా ప్రపంచం నుండి.

ఎదురుగా సుజాత. పచ్చని ఆమె పాల భాగంపై పడున్న నల్లని ముంగురులు చంద్ర బింబాన్ని కప్పేస్తున్న పిల్ల మేఘాల్లా ఉన్నాయి. నుదుటిపై పడ్తున్న ఆ ముంగురుల్ని వెనక్కి నెట్టుకుంటున్న ఆమె అతని తత్తరబాటుని గమనించి చిన్నగా నవ్వింది.

చలనం లేని రాతిబొమ్మలా అలా కూర్చుండి ఆమె వేపు అయోమయంగా చూస్తున్నాడతను. ఒక్కసారిగా ఆమె అలా అగుపడేసరికి అతనికి విస్మయం కలిగింది. నోటి వెంబడి మాట రాలేదు.

“ఏఁటలా చూస్తున్నారు? నేనూ సుజాతను” మందస్మిత వదనయిన ఆమె అంది. అప్పటికీ అతని నోటి వెంబడి మాట రాకపోయేసరికి ఆమె పెదవులపై లాస్యమాడుతున్న ఆ మందహాసం మాయమయి వదనంపై గంభీరత చోటు చేసుకుంది.

“క్షమించండి. నా వేడి – వాడి అయిన పదజాలంతో మీ మనస్సుకి బాధ కలిగించే మాటలు అని మీ మనస్సు నొప్పించాను. ఇప్పుడు చాలా బాధపడున్నాను. అయితే ఒక్క విషయం గుర్తించుకోండి. అప్పటి సమయం అలాంటిది వచ్చింది. ఆ విషమ ఘడియల్లో నేను మా వాళ్ళను అలా మెత్తగా మందలించి – మిమ్మల్ని కూడా నిందించి ఉండకపోతే ఎంతో అనర్థం జరిగి ఉండేది. ఎన్నో జతల చేతులు మీ మీద తమ ప్రతాపం చూపించి ఉండేవి ఆ ఆవేశ సమయంలో.”

రాజశేఖరానికి ఆమె మాటలు నిజమనిపించాయి. “అవును మీరు ఆ విషమ పరిస్థితి నుండి కాపాడారు. మీకు కృతజ్ఞత చెప్పుకోవాలి” అన్నాడతను.

“ఎందుకు కృతజ్ఞత? మిమ్మల్ని నా వాడిమాటల బాణాలో తూట్లు పొడిచినందుకా?” అంటూ అతనికెదురుగా ఇసుకలో ఆమె కూడా చతికిలబడింది.

“లేదు… లేదు…! నాకు నా కర్తవ్యాన్ని చక్కగా బోధపరిచినందుకు! స్వార్థరహిత జీవితం గడుపుతూ దేశభక్తిని పెంపొందించుకోమని హెచ్చరించినందుకు!”

రాజశేఖరం నిజాయితీగా ఈ మాటలు అని ఉండవచ్చు. అయితే సుజాతకి అతని మాటల్లో వ్యంగ్యం అగుపించింది. అందుకే “వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా?” చిన్నబుచ్చుకుంటూ అంది. అది చూసి అతను నొచ్చుకున్నాడు.

“లేదు… లేదు…! నిజమే మాట్లాడుతున్నాను. నేను నా వాళ్ళు, నా కుటుంబం అనే సంకుచిత మనస్తత్వంతో అజ్ఞానాంధకారంలో మునిగి తేలుతున్న నాకు కళ్ళు తెరిపించి నా కర్తవ్యాన్ని నాకు చక్కగా విడమర్చి బోధపర్చారు. అయితే సుజాతగారూ! నా కుటుంబాన్ని గూర్చి మీకు పూర్తిగా తెలియదు….!” ఇలా చెప్తున్న అతని కంఠం దుఃఖంతో బొంగురుపోయి మరి నోటి వెంబడి మాట వెలువడలేదు. కళ్ళల్లో తడి తళుక్కున మెరిసింది.

రాజశేఖరం పరిస్థితిని అవలోకిస్తున్న సుజాత ఒక్కసారి చలించింది. తను పరుషంగా మాట్లాడి అతని మనస్సు గాయపర్చానేమోనన్న పశ్చత్తాప భావం ఆమె ముఖంలో తొంగిచూసింది.

“నా వల్ల…!” మధ్యలో ఆపింది.

“లేదు… లేదు…!”  తిరిగి అన్నాడతను.

తన కుటుంబ గాథను సంకోచం లేకుండా ఆమెను ఆత్మీయురాలిగా భావించి చెప్పుకొచ్చాడు రాజశేఖరం సుజాతకి. అతని కుటుంబం గురించి విన్న ఆమె గుండెల్లో సన్నని బాధలాంటి భావం కలిగింది.

ఈ సమయంలో తను బాధపడి అతడ్ని మరింత బాధకి గురి చేయడం కాదు తన బాధ్యత. అతడ్ని ఓదార్చాలి. ధైర్యాన్ని కలగచేసి అతనిలో అత్మసైర్యాన్ని కలగ చేయాలి. ఇలా ఆలోచిస్తోంది సుజాత.

“రాజశేఖరం గారూ!” పిలిచింది. ఆమె చూడకుండా కన్నీరు తుడుచుకుంటూ “కంటిలో ఇసుక పడింది” అని అన్నాడు. ఆమె వంక చూస్తూ, అతని వేపు నుండి దృష్టి మరల్చుకుని మెత్తని సముద్రపు ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ కూర్చుందామె.

“రాజశేఖరం గారూ!”

“ఏం పిలిచారు?”

“అందరి జీవితాలూ వడ్డించిన విస్తరాకులు కావు. పూలపాన్పులు అంతకన్నా కావు. మన జీవితంలో కష్టాలనే ముళ్ళపాన్పు మన సహన శక్తిని పరీక్షిస్తూ ఉంటుందిట. ఆ కష్టాలకి భయపడి పిరికిగా పారిపోయే కన్నా లేని ధైర్యాన్ని కూడగట్టుకుని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొడానికి ప్రయత్నించండి. సుడిగండంలో చిక్కుకున్న మీ కుటుంబ నావను ఒడ్డుకి తేవడానికి అదే అత్మవిశ్వాసంతో జీవించడం నేర్చుకోలేరా? మనం మనకోసం జీవించే కన్నా – బ్రతికే కన్నా ఎదుటి వాళ్ళకి సహాయ పడ్డానికే, పరోపకారానికే జీవిస్తున్నాం. ‘పీడితుల్ని – అనాథల్ని రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను’ అన్న ఆలోచనలో ఎంత తృప్తిదాగి ఉందో మీరు గమనించారా?”

ఓ చిన్న పిల్లవాడ్ని లాలించి, బుజ్జగించి ఓదారుస్తున్న పద్ధతిలో అంటున్న ఆమె మాటలు రాజశేఖరానికి అమృత గుళికల్లా తియ్యదనాన్ని కలిగించాయి.

“మీరు చెప్పిన మాటలు నిజమే. కష్టాల్లో పుట్టి, కలిమిలో కాకుండా అడుగడుగునా లేమిలో పెరిగిన వాడిని. అటువంటి నాకు కష్టాలు, కన్నీరు అంటే భయం లేదు. అయితే నాకు నా వాళ్ళ శ్రేయస్సే ముఖ్యం. వాళ్ళ శ్రేయస్సు కోసం ఎన్ని అవాంతరాలైనా అవలీలగా ఎదుర్కొంటాను.”

అతను చెప్పింది వింటోంది సుజాత. “నేను విన్న ఓ ఉదాహరణ మీకు చెప్పదల్చుకున్నాను”. ఆమె ఏఁటి చెప్తుందా అని ఆమె వంక ఆసక్తిగా చూస్తూ ఆమె చెప్పబోయే విషయాన్ని వినాలన్న కుతూహలం అతని కళ్ళల్లో కదలాడింది.

“గాంధీజీకి రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే దగ్గరికి ఓమారు రాజేంద్ర ప్రసాదు గారు వెళ్ళేరుట. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాదు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టిన మొదటి రోజులు అవి. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతమందో న్యాయవాదులు తమ పదవులు విడిచిపెట్టి స్వాతంత్ర్య సమరం వేపు ఉరుకుతున్న రోజులవి. మొదట రాజేంద్ర ప్రసాదుగారు జేలు గుండాలు, దొంగలు – రౌడీలుండే యాతనా స్థలంగా భావించేవారుట. బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల్ని గుంపులు గుంపులుగా తీసుకెళ్ళి జేల్లో పెట్టేది. స్వాతంత్ర్య సమరంలోకి ప్రాక్టీసు వదిలివెళ్తే ఒక వేపు కుటుంబం ఆర్థికంగా బాధపడుతుంది. రెండో వేపు జేలుకి వెళ్ళవల్సి వస్తుంది. తను ఇప్పుడిప్పుడే పేరు, డబ్బూ గడిస్తున్న న్యాయవాదుల జాబితాల్లోకి చేరుకుంటున్నారు.

ఆ జీవితం వదిలి ఈ జీవితంలోకి అడుగు పెట్టడమంటే వెచ్చని గదిని వదిలి పెట్టి ఆరు బయట మంచులోకి వెళ్ళినట్లనిపించిందాయనకి, ఇదే భావం రాజేంద్ర ప్రసాదుగారు గోఖలే దగ్గర వ్యక్తం చేయగా గోపాలకృష్ణ గోఖలే గారు ఏఁ అన్నారో తెలుసా…?” ప్రశ్నార్థకంగా అతని వదనం వేపు చూసిందామె. జవాబియ్యకుండా కుతూహలంగా చూస్తున్నాడతను. కన్నార్పకుండా అమెవంక.

“ఇప్పుడు దేశానికి నీవంటి నవయువకుల అవసరం ఎంతేనా ఉంది. ప్రతీ వాళ్ళూ ఇంత సంకుచితంగా ఆలోచిస్తే ఈ బానిస సంకెళ్ళు తెగేదేలా? దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందా? నా విషయమే తీసుకుంటే నేనూ ఓ సామాన్య కుటుంబంలో నుండి వచ్చినవాడినే. నేను కూడా ఉన్నత స్థానంలో ఉంటే సుఖమైన జీవితం గడపచ్చని కుటుంబ సభ్యులు ఆలోచించారు.

నేను ఇలా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం నా కుటుంబ సభ్యులెవరికీ ఇష్టం లేకపోయింది. వాళ్ళకి కోపాలొచ్చాయి. కొన్నాళ్ళు నాతో మాట్లాడ్డం మానేసేరు. అయితే తరువాత తరువాత నా భావాలు వాళ్ళు అర్థం చేసుకున్నారు. తిరిగి నన్ను ఆదరించారు. నేను అప్పుడు నా కుటుంబం అన్న ఆలోచన విడిచిపెట్టి దేశంలో ప్రజలందరూ నా వాళ్ళు, వాళ్ళ కోసం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలి. వారి కోసం పాటుపడాలి. నేను పుట్టి పెరిగిన దేశం నాకు తల్లిలాంటిది. తల్లిలాంటి నా మాతృదేశం యొక్క బానిస సంకెళ్ళు తెంచి వేయాలి. అని అనుకున్నాను ఆ ఆలోచన ఎంత ఉదాత్తమైన ఆలోచన…?

గోఖలే మాటలు విన్న రాజేంద్ర ప్రసాదులో ఎంతో పరివర్తన వచ్చింది. ఇటువంటి ప్రస్తావనే గాంధీజీ దగ్గర కూడా వచ్చిందిట. ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల రాజేంద్ర ప్రసాదు మనస్సు పూర్తిగా మారిపోయి సంకుచిత మనస్తత్వాన్ని నెట్టివేసి స్వాతంత్ర్య పోరాటం వేపు అడుగులు వేసారుట.”

చెప్పటం ఆపు చేసింది సుజాత. వింటున్న అతని కన్నుల్లో వింత వెలుగును ఆమె గమనించగలిగింది.

“నేనూ స్వాతంత్ర్య సమరం అనే యజ్ఞగుండంలో సమిధనవుతాను. నాకు నా నిజ స్వాతంత్ర్యం కంటే దేశ స్వాతంత్ర్యమే నాకు ముఖ్యం. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. ఆ పాత రాజశేఖరం చచ్చిపోయాడు. ఆ స్థానంలో కొత్త రాజశేఖరం ఉద్భవించాడు. ఈ క్రొత్త రాజశేఖరం జన్మించి కొద్ది గంటలే అయింది. ఈ స్వాతంత్ర్య సమరం సమయంలో నేనూ జేలుకి వెళాను. స్వాతంత్ర్య సమరయోధుల అడుగుల్లో నా అడుగులు కలిపి విప్లవ శంఖాన్ని పూరిస్తాను”.

దృఢమైన – నిశ్చలమైన, నిర్మలమైన భావం రాజశేఖరం వదనం పై ఒక్కసారి తొంగి చూసింది.

అతనిలో వచ్చిన ఈ మార్పుకి ఆమె అంతరంగంలో సంతోష తరంగాలు ఉవ్వెత్తున లేచి ఎగిసిపడ్డాయి. అతనిలో ఉన్న సంకుచిత వైఖరిని మార్చగలిగాను కదా అన్న గర్వ రేఖ కాదు ఆత్మవిశ్వాస భావం ఆమె కనుదోయిలో కదలాడింది.

మరుసటి రోజు స్వాతంత్ర్య జెండా చేత్తో పటుకుని ‘విదేశీ పాలన అంతమవ్వాలి, బానిసత్వం మంటగలవాలి’ అంటూ బిగ్గరగా ఆకాశం – భూమి చిల్లులు పడేలా అరుస్తూ సమరయోధుల అడుగుల్లో అడుగులు కలుపుతూ ముందుకు కదుల్తున్న రాజశేఖరాన్ని చూస్తున్న విద్యార్థి, విద్యార్థినిల కళ్ళలో విస్మయం. ఇదంతా సుజాత గొప్పతనమే అని అనుకుంటున్నారు. ఈ దృశ్యం చూస్తున్న సుజాత కనుదోయిలో ఆనందం. ఆ ఆనంద సమయంలో ఆమె కనుల నుండి జారి పడగా అతని వెనకనే ఆమె కూడా బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నడిచింది.

అలా ముందుకు అడుగులేస్తున్న వాళ్ళకి ప్రకృతి కూడా సహకరిస్తోందా అన్నట్టు చల్లని వాయు తెమ్మరలు స్వాతంత్ర్య జెండాను రెపరెపలాడిస్తున్నాయి విజయ సూచికంగా.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here