Site icon Sanchika

కొడిగట్టిన దీపాలు-7

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 7వ భాగం. [/box]

13

[dropcap]వి[/dropcap]శాలగుప్త ప్రతీ నెలా వడ్డీ డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్తు ఉంటాడు. తమ్ముడింట్లో మీనాక్షి జీవితం బాగాలేదు అని అతను ఏనాడో గుర్తించాడు. ఆ పరిస్థితిని చక్కబర్చే హక్కు తనకి లేదు. మాధవరావు చనిపోగానే ఆ కుటుంబంలో తనకున్న సంబంధం బీటలు వారింది. ఎంతేనా తను పరాయివాడే ఆ కుటుంబానికి.

తను వెళ్ళిన ప్రతీసారీ ఆ ఇంటి చాకిరీ చేస్తూనే అగుపడ్డారు, మీనాక్షి, శారద. “వదినమ్మా క్షేమమేనా?” అని అడిగితే, “ఏఁ క్షేమమయ్యా? మీ అన్నయ్యతోనే పోయాయి సుఖమయిన రోజులు, సమస్యలు కష్టాలు కన్నీళ్ళు లేని రోజులు. ఇదంతా మా కర్మ అనుకుని బాధపడ్డమే” ఆవేదనగా తనతో అనేది మీనాక్షి.

“వదినమ్మా! అలా అధైర్యపడద్దు. ఆత్మసైర్యాన్ని కోల్పోవద్దు” అని తను ఆమెకి ధైర్యం చెప్పేవాడు.

ఆ రోజు కూడా వడ్డీ డబ్బు ఇయ్యడానికి వచ్చాడు విశాలగుప్త. వచ్చిన తరువాత అతనికి తెల్సింది శారద పెళ్ళని. ఆ మాట విని అవాక్కు అయ్యాడు. పెళ్ళికొడుకు రెండో పెళ్ళివాడు. శారద అంత వయస్సున్న కూతురు అతనికుందని, ఈ పెళ్ళి మీనాక్షికి, శారదకి ఇష్టం లేదని కూడా గమనించాడు. వాళ్ళ ముఖాల్లో సంతోషం అగుపడలేదు.

విశాలగుప్త వెళ్లిన రోజునే దేఁవుడి గుడిలో శారదకి పెళ్ళి జరగబోతోంది తెలిసింది. తనకి తెలియజేయలేదు. తనకీ వాళ్ళకీ ఏం సంబంధం? అనుకుని తనని పిలవలేదు. మాధవరావుతోనే ఆ ఇంటి వాళ్ళతో అనుబంధం తెగిపోయిందని బాధపడ్డాడు. ఈ విషయంలో మీనాక్షి తప్పేంలేదు. వాళ్ళకి తనకి తెలియజేయాలని ఆలోచన ఉన్నా ధర్మారావు, నాంచారమ్మకి ఇష్టం లేదని తెలుస్తోంది. అనుకోకుండా ఈ రోజు రావడం వల్ల ఇష్టం లేకపోయినా పెళ్ళి చూసి ఆశీర్వదించి వెళ్ళమని చెప్తున్నాడు ధర్మారావు.

ధర్మారావు, నాంచారమ్మా పెళ్ళి పనుల్లో హడావుడిగా తిరుగుతున్నారు. మీనాక్షి, శారదా ఒంటరిగా అగుపించారు. విశాలగుప్తకి, వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నాడు విశాలగుప్త శారదతో “నీకు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టముందా?” అని అడిగాడు.

“నా యిష్టాల్తో సంబంధం ఏంటి బాబాయ్! కొన్ని కొన్ని సమయాల్లో అయిష్టాన్ని కూడా ఇష్టాలుగా మార్చుకోక తప్పదు. పరిస్థితులు అలాంటివి. ఇష్టం లేకపోయినా, జీవితంతో రాజీపడి బ్రతకడమే ఈ సమయం నుండి నేర్చుకుంటున్నాను. అన్నయ్య వస్తాడు. మా బానిస బ్రతుకుల్ని ఉద్ధరిస్తాడని ఇన్నాళ్ళు అనుకున్నాం. ఆ ఆశ కూడా అడియాశ అయింది.”

“ఏఁటి శారదా? ఏంటి మాట్లాడుతున్నావు అన్నయ్య గురించి.”

“నీకు తెలియదా బాబాయ్!”

“ఏఁటి శారదా?”

“అదేనయ్యా! ఇన్నాళ్ళు నా పెద్ద కొడుకు మమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఈ కష్టాలు, కన్నీళ్ళు దూరం చేస్తాడు. అనుకుని భ్రమలోనే బ్రతుకుతున్న మాకు ఆ భ్రమ నీటి బుడగలా క్షణ కాలంలోనే విచ్ఛన్నమయితే ఏఁటి చేయమంటావు” మీనాక్షి అంది.

“ఏఁటి జరిగింది వదినమ్మా? మన రాజు కడిగిన ముత్యం లాంటివాడు. అలాంటి కొడుకుని కన్న నీవు అదృష్టవంతురాలివి.”

“మేమూ అలాగే అనుకున్నాం ఈ రోజు వాడి గురించి తెలిసేవరకూ.”

“ఏంటి తెలిసింది?

“అన్నయ్య చదువు మానేసి స్వాతంత్ర్య పోరాటంలో తిరుగుతున్నాడట బాబాయ్!” శారద అంది.

“రాజు అలాంటివాడు కాదే. చాలా బుద్ధిమంతుడు. ఇలా చేసేడంటే ఏదో బలమైన కారణం ఏదో ఉండి వుంటుంది. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు?”

“మామయ్యకి తెలిసిందట.”

“నీకు పెళ్ళని అన్నయ్యకి తెలుసా శారదా? ఎవ్వరూ చెప్పలేదా?” విశాలగుప్త అడిగాడు.

“లేదు” బుర్ర ఊపింది శారద.

“పెద్ద కొడుకు కదా ఈ విషయం చెప్పద్దా!”

“పెద్ద కొడుకుగా వాడు వాడి బాధ్యతను విడిచి పెట్టినప్పుడు, ఎందుకు చెప్పాలయ్యా!” మీనాక్షి నిష్ఠూరంగా అంది.

“వదినమ్మా! రాజు మీద అలా కోపంగా మాట్లాడవద్దు. రాజు గురించి నాకు తెలుసు. ఇందులో ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.”

“కోపం కాదయ్యా, ఇదంతా నా బాధ. నా మనస్సు ఎంత క్షోభిస్తోందో తెలుసా!”

“అక్కడ రాజు పరిస్థితి ఏఁటో తెలసుకోవాలి. అంతేకాని పిల్లలమీద కోపం పెంచుకోవడం మంచిది కాదు వదినమ్మా. కొడుకుగా మనల్ని ఆదుకోవాలని ఆశించడం తప్పుకాదు. అయితే ఆశ, దురాశగా మత్రం మారకూడదు. మన జీవితం ఆశల – నిరాశల, దురాశల మీద ఆధారపడి ఉంటుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. నిరాశ నీరస పరుస్తుంది. దురాశ దుఃఖానికి చేటు అవుతుంది. ఆశించింది ఎక్కువయి ఫలితం తక్కువయితే నిరాశ కలుగుతుంది. తక్కువ ఆశించి ఎక్కువ ఫలితం లభిస్తే శ్రమ తెలియదు. ఒక రకంగా సంతోషం కలుగుతుంది. ఏది ఏమయినా రాజుకి ఈ పెళ్ళి విషయం తెలపకపోవడం చాలా తప్పు.”

“మామయ్యే తెలియనీయలేదు బాబాయ్! ఇంకో విషయం, నీకు కూడా ఈ విషయం తెలపద్దు అన్నారు.”

“నా విషయం వదిలి పెట్టేయ్ శారదా. రాజు ఈ ఇంటి పెద్ద కొడుకు. తండ్రి తరువాత బాధ్యత తీసుకుని నీ పెళ్ళి జరిపించే రక్తసంబంధం మీ మధ్య ఉంది. నా విషయం అలా కాదు. మన మధ్య ఉన్నది కేవలం స్నేహ సంబంధమే.”

“అలా అనకయ్యా! ఈ రోజుల్లో రక్తసంబంధాలు కంటే స్నేహ సంబంధాలే ఎక్కువ” మీనాక్షి అంది కళ్ళు తుడుచుకుంటూ.

పెళ్ళి చూసి వెళ్ళమని మీనాక్షి అంది కాని తనని పెళ్ళికి పిలవలేదు. అందుకు ఉండడం మంచికాదు అనుకున్నాడు విశాలగుప్త. ఎలాగూ వచ్చాడు, పెళ్ళి అని ఎలాగూ తెలిసింది ఉండమనకపోతే బాగుండదు అనుకున్న ధర్మారావు పెళ్ళి చూసి వెళ్ళమని చెప్పాడు. అంతలా చెప్పనప్పుడు బాగుండదని విశాలగుప్తా కూడా ఉండిపోయాడు. అతను పెళ్ళికి ఉండడం మీనాక్షికి కొంత ఊరట కలిగించింది.

“అతడ్ని పెళ్ళికి ఎందుకు ఉండమన్నావయ్యా!” నాంచారమ్మ భర్తని నిలదీసింది.

“నేనేఁ తెలివి తక్కువ వాడ్నికాదు. మన చేతికి డబ్బు వచ్చే వరకూ అతని అవసరం మనకుంది” లౌక్యంగా అన్నాడు ధర్మారావు. అతను చెప్పిన లాజిక్ నచ్చింది నాంచారమ్మకి. అందుకే ఊరుకుంది. ఈ

‘పాపం శారద బలిపశువుగా మారుతోంది. అసలే అమాయకురాలు. నోరు తెరిచి తనకి ఇది కావాలి, అది కావాలి అని తండ్రిని ఎప్పుడూ అడగలేదు. తండ్రి బ్రతికి ఉంటే ఇలా జరిగేదా? నుదుటి వ్రాత ఎవ్వరూ తప్పించలేరు’ గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అనుకుంటున్నాడు విశాలగుప్త,

మూడు ముళ్ళ బంధంతో శారద, సుందరం భార్యాభర్తలయ్యారు. జరగవల్సిన దాన్ని ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఆపలేరు. జరగవల్సింది జరగక మానదు. ఏఁ చేయగలం? పరిస్థితులు మనకి

అనుకూలంగా లేవు అని సరిపెట్టుకోవాలి. కొంత మంది తమ ప్రారబ్ధం అని సరిపుచ్చుకుంటారు. శారద కూడా అలాగే అనుకోవాలి. ఇలా సాగిపోతున్నాయి విశాలగుప్తా ఆలోచన్లు.

పెళ్ళి హడావిడిలో వేణు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. పెళ్ళి తంతు పూర్తి అయిన తరువాత మీనాక్షికి చిన్న కొడుకు గుర్తుకు వచ్చాడు. అతని మాటలు గుర్తుకు వచ్చాయి. ఏదో చిన్నతనం కొద్దీ అలా అంటున్నాడు. చిన్నవాడు, పరిస్థితులు వాడికేం తెలుస్తాయి అని అనుకుంది మీనాక్షి. కాని కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు అని ఆమె ఊహించలేకపోయింది..

చిన్నకొడుకు వేణు ఇల్లు వదిలి వెళ్ళాడు అని తెలియగానే క్షోభలో విలవిలాడింది. భర్త చనిపోగానే కుటుంబ పరిస్థితులు ఎలా చిన్నాభిన్నం అయ్యాయి, అంటూ కన్నీరు పెట్టుకుంది. శారద కూడా కన్నీరు తుడుచుకుంది.

“శుభమా అని పెళ్ళి జరిగితే ఏంటా కన్నీరు? ఇలా కంటి తడి పెట్టడం అశుభం. అయినా వదినమ్మా నీ చిన్న కొడుకు మహామొండివాడు. గడుసువాడు కూడా ఎక్కడికిపోతాడు. రెండు రోజులు కడుపు కాలితే చచ్చినట్టు వస్తాడు” నాంచారమ్మ చిరుబుర్రాడుతూ అంది మీనాక్షితో.

మీనాక్షి కళ్ళుతుడుచుకుంది కాని గుండెల్లో నుండి దుఃఖం పై కుబికి వస్తోంది. అలా వస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి ఉంచుకుంది. జరుగుతున్న ఒక్కొక్క సంఘటనా విశాలగుప్తను కూడా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. అయినా తమాయించుకున్నాడు. తనే అధైర్యపడ్తే ఆ కుటుంబ సభ్యులకి ఎవరు ధైర్యం చెప్తారు అని అనుకున్న అతడు తన భావాలు పైకి అగుపడనీయలేదు. మీనాక్షికి ధైర్యం చెప్పాలనుకున్నాడు.

“వదినమ్మా! అధైర్యపడవద్దు. వేణు తిరిగి వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నేను వెతకడానికి ప్రయత్నిస్తాను నా శాయశక్తులా” అని మీనాక్షికి భరోసా కల్పిస్తూ అన్నాడు. తాత్కాలికంగా తన దుఃఖం పోగొట్టడానికి అలా అంటున్నాడు విశాలగుప్తా కాని వేణు తిరిగి వస్తాడన్న నమ్మకం తనకిలేదు. దుఃఖ భారంతో విలవిల్లాడుతున్న మీనాక్షి కుమిలిపోతోంది.

14

బాటలు వేరయినా చేరుకునే గమ్యం ఒక్కటే. తమ అంతిమ లక్ష్యసాధనకు ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని, ఎన్నో ప్రయాసాలకు లోనయి లక్ష్య సిద్ధికి పాటుపడ్తాడు మానవుడు. జాతి – మత – వర్గ భాషా భేదాలు విస్మరించి భారతీయులందరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటున్నారు. అందరి అంతిమ లక్ష్యం బానిస బ్రతుకు నుండి ప్రజల్ని విముక్తి మార్గం వేపు పయనింప చేయడం – ప్రజలదరూ స్వాతంత్ర్య స్వేచ్ఛా వాయువులు పీల్చడం.

దేశంలో ఎటు చూసినా అశాంతే. ఎటు చూసినా అరాచకమే. ఎటు చూసినా మానవ సమాజంలో అరాచికాలే – అత్యాచారాలే. విప్లవ వాయువులు నలు దిశలా క్రమ్ముకుని రాగా ఆ వాయువుల తాకిడికి తట్టుకోలేని బ్రిటిష్ పాలక పక్షం కంపించింది. సామ, దాన, బేధ దండోపాయాలో తమకు ఎదురు తిరిగిన వాళ్ళను వశపరచుకోజూస్తోంది. అంతకూ వినని వాళ్ళని అరస్టు చేసి జేలు గదుల్లో కుక్కుతోంది.

“అబ్బాయ్! నీవరసేఁ మాకు నచ్చలేదు. మనం నిస్సహాయులం. ప్రభుత్వాన్ని ఏం చేయలేము. వాళ్ళని ఢీకొట్టడమంటే కొండను ఢీకొట్టడమే. నీవు ఇలా నీ కర్తవ్యాన్ని విస్మరించి, చదువు సంధ్యలు విడిచి పెట్టి ఇలా స్వాతంత్ర్య పోరాటంలోకి దిగడం మాకు నచ్చలేదు. మొదట నీవు నీ వెనుక నున్న కుటుంబ పరిస్థితుల్ని ఓమారు అవలోకించు” రాజశేఖరానికి వారాలిచ్చిన ఇద్దరు, ముగ్గురు అన్నారు.

“నీలాంటి వాళ్ళు దేశానికి ఇప్పుడు కావాలి. విదేశీయ ప్రభుత్వాన్ని ఇక్కడ నుండి తరిమివేసి, స్వాతంత్ర్య బావుటాని వాతావరణాన్ని తేవడానికి నీలాంటి నవయువకుల వల్లనే బానిస సంకెళ్ళ నుండి దేశం విముక్తి పొందుతుంది” వారాలిచ్చిన మరికొంతమంది అన్నారు.

పొగడ్తలు, విమర్శల మధ్య విప్లవ శంఖాన్ని పూరిస్తూ ద్విగుణీకృతమైన వీరావేశం – ఉత్సాహంతో స్వాతంత్ర్య సమపార్జనకి ముందుకు దూకుతున్నాడు రాజశేఖరం. అగ్నికి, వాయువు తోడై ఇంకా మంటల్ని మరింత ప్రజ్వలింపచేసినట్లు రాజశేఖరానికి వీరావేశం తెప్పించింది సుజాత. తన కవితల ద్వారా, అతనిలో చైతన్యాన్ని మరింత ఉద్దీప్తం చేసింది ఆమె.

రాజశేఖరం అలా చదువు సగంలో ఆపు చేసి విప్లవ శంఖం పూరించి స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టడం నచ్చని – వారాలిచ్చిన ఇంటి యజమానులు “నీవేదో బాధల్లో ఉన్నావు. నీ వాళ్ళని ప్రయోజకుడవయి ఆదుకుంటావని మా ఇంట్లో వారాలిచ్చాము. కాని నీవు ఇలా చదువు ఆపుచేసి తిరుగుతామంటే వారాలియ్యలేము” అని ఖచ్చితంగా చెప్పారు.

ఒక్కక్షణం రాజశేఖరం కన్నుల్లో సన్నటి బాధ. కళ్ళల్లో కన్నీటి తెర తళుక్కున మెరిసింది. అంతలోనే రంగులు మారిన అతని వదనంలో స్థిర నిర్ణయాన్ని తెలియజేసే భావాలు కలగడం దానికి సూచనగా దవడ ఎముక ఒక్కసారి కదిలింది. ‘తిండిలేని రోజున మంచి నీళ్ళయినా త్రాగి లక్ష్య సాధనకై ముందుకు అడుగువేయాలి’ అని అతను అనుకున్నాడు. ‘తను అనుకున్నది సాధించాలంటే నైపుణ్యం, తెలివితేటలూ, కృషి, పట్టుదలతో పాటు నిరంతరం శ్రమ, ఆత్మస్టైర్యం ఇవన్నీ ఉన్నా ఒక్కొసారి విజయం మనల్ని వెలివేస్తుంది. అపజయం అక్కున చేర్చుకుంటుంది. అంత మాత్రాన కృంగిపోకూడదు. నా జీవితం ఇలా అయిపోయిందే అని మథన పడిపోకూడదు. నిరాశ చెందకుండా మన సాధన మనం చేస్తూ ఉండాలి’ ఇదే రాజశేఖరం అప్పటి ఆలోచనలు.

“రాజూ!” ఉలిక్కిపడి తల పైకెత్తి చూశాడు. రాజశేఖరం ఎదురుగా విశాలగుప్త.

“బాబాయ్!”

“ఆఁ నేను బాబాయ్‌నే, నేను విన్నది నిజమేనా?”

“దేని గురించి.”

“నీవు చదువు మానేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటం.”

ఏఁ జవాబియ్యకుండా మౌనంగా తలదించుకుని నిలబడ్డాడు.

“అమ్మా వాళ్ళూ క్షేమమేనా బాబాయ్!”

“జీవిత సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళకి క్షేమం ఎలా వస్తుంది రాజూ! చకోర పక్షులు వెన్నెల కోసం తహతహలాడూ చూస్తున్నట్లు, చాతక పక్షులు స్వాతి వాన కోసం ఆశతో ఎదురుచూస్తున్నట్లు, స్వాతి వాన నీటి బిందువు కోసం ఎరురు చూస్తున్న ముత్యపు చిప్పలా నీ వాళ్ళు నీవు ప్రయోజకుడవై వాళ్ళని ఉద్ధరిస్తావని ఆశగా ఎదురు చూస్తున్నారు.”

“ఈ పరిస్థితిలో అదే మాతృభూమి బానిస సంకెళ్ళల్లో మగ్గుతుంటే నా స్వార్థం కోసం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం తప్పా బాబాయ్!”

“నీవు చదువు మానేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం నాకు ఇష్టం లేదని భావించవద్దు. అంత దేశభక్తి లేని మూర్ఖుడ్నికాను. అయితే మొదట మన ఇంటిని చక్కబరుచుకుని తరువాతే బయట వాళ్ళకి సాయపడాలి. నీ చర్య ఎలా ఎలా ఉందంటే ఇంటిని చీకటి చేసుకుని ప్రక్కవాళ్ళ ఇంటిలో దీపం వెలిగించినట్టుంది. దేశభక్తి నీకు ఉండచ్చు. అయితే ఇలాగా? మొదట ఇంటిని గెల్చి రచ్చగెలవాలి. అయితే నీ పని ఎలా ఉందో చెప్పనా అంతా వ్యతిరేకంగా ఉంది. మీ మామయ్య ఇంటిలో నీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా?”

“ఎలా ఉంది బాబాయ్!”

“నీవు చదువు మానేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ ఉన్నట్టు మీ మామయ్య మా అమ్మకి చెప్పేసేడు. ఈ విషయం ఆమె తట్టుకోలేక పోయింది. బాధతో మెలికలు తిరిగిపోయింది. మా అమ్మగారు నాతో ఏంటన్నారో తెలుసా? ‘నా మరదలు, తమ్ముడు చేత మాటలు పడి ఏ ఎంగిలి కూడు తినే కన్నా పస్తులుండాలనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయం. పేదవాళ్ళకి ఆత్మాభిమానం పనికిరాదు. అడుగడుగునా రాజీపడే దోరణిలో ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాలని అనుభవ పూర్వకంగా నేర్చుకున్నాను.

నేనేఁ అయిపోయినా పరవాలేదు. నా బాధంతా నా పిల్లల భవిష్యత్తు ఏంటవుతుందనే. నా ఆరోగ్యం కూడా సరిగాలేదు. అయితే నాకు ఒకొక్కసారి ఏఁటనిపిస్తోంది తెలుసా? నా కొడుకు రాజు చేసిన పని మంచిదని అటువంటి ఆదర్శవంతుడయిన కొడుకుని కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా కొడుకు ఎంత ఆదర్శవంతుడో తెలుసా? స్వార్థంతో నా కుటుంబాన్నే ఆదుకోవాలి, నా వాళ్ళ కోసం పాటుపడాలన్న ఆలోచన వదిలి పెట్టి దేశం కోసం, దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయడానికి, దేశ స్వాతంత్ర్య కోసం పాటుపడున్నాడంటే నాకెంతో గర్వంగా ఉంది. నా ఆరోగ్యం మునపటిలా లేదు. నేను చనిపోయిన తరువాత తోబుట్టువుల్ని కూడా వాడు చక్కగా చూసుకోవాలి. వాడి నుండి నేను మరేం అశించను, మరేం కోరను. ఆ భగవంతుడు నా కొడుకుని మంచి బుద్ధి, ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అంది తెలుసా.

“అమ్మ అమ్మే బాబాయ్! ఆమె పిల్లలకి చేసిన త్యాగాలు ఎలా మరిచిపోగలం? బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటే ముందు మన మనస్సుని లాక్కుపోయేది అమ్మ గురించి స్మృతులే. తరువాత తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలే. బాల్యంలోని అన్ని కోణాల్లోనూ ప్రేమతో పెనవేసుకుని ఉండేది అమ్మయే. ఎన్నో విధాలుగా పేదరికంతో బాధపడుతూ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ ఎవరికైనా ఆరాధ్య దేవతే. పిల్లలు ఆకలితో ఉంటే విలవిల్లాడుతుంది. అతిథులెవరైనా వస్తే తను పస్తులుండి వాళ్ళను ఆదరించేది అమ్మే. ఆటల్లో పిల్లలకి దెబ్బలు తగిలితే తల్లడిల్లిపోయేది అమ్మయే. పిల్లలకి జర్వమొస్తే వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్ళేది అమ్మే. అంత పెద్దగా అక్షర జ్ఞానం లేకపోయినా అంతకు మించిన సంస్కార జ్ఞానంతో పిల్లల్ని చదివించేది అమ్మయే. బ్రతికున్నంత కాలం తన సంతానం కోసం తల్లడిల్లిపోయేది అమ్మయే. నా బాల్యానికి అమ్మకి ఉండే అవినాభావ సంబంధం అది బాబాయ్!” అన్నాడు రాజశేఖరం.

“అలాంటి అమ్మ జీవితం అస్తవ్యస్తంగా ఉంటే?”

“ఏఁటి బాబాయ్! అమ్మకి ఏఁటయింది?”

“నీకు తెలియకుండా చాలా సంఘటనలు జరిగాయి రాజూ! మీ అమ్మ చేత, శారద చేత గొడ్డు చాకిరీ చేపించారు మీ అత్తయ్య, మామయ్య. వేణుని చిత్రహింసలు పెట్టింది మీ అత్తయ్య. అంతే కాదు ఆమె మా అమ్మ వారిస్తున్నా వినకుండా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శారదకి మీ అత్తయ్య అక్కయ్య కొడుకు సుందరానికిచ్చి పెళ్ళి జరిపించింది. అతనికి ఇది రెండో పెళ్ళి. శారద వయస్సుదే అతనికి ఓ అమ్మాయి కూడా ఉంది. చాలా చిన్నవాడయినా తన అక్కకి ఈ పెళ్ళి జరిపించరాదని అన్నాడుట వేణు. నీవు చిన్న వాడివి. మాట్లాడకు అని అతడిని పెద్దవాళ్ళు కసురుకున్నారుట. ఈ పెళ్ళి జరిగితే నేనే ఇల్లు విడిచి వెళ్ళిపోతానని బెదిరించాడుట. పెద్దవాళ్ళు వినకపోయే సరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడుట.”

“ఇన్ని అనర్థాలు జరిగినా నాకు తెలియ చేయలేదా బాబాయ్!” బాధగా నుదురు కొట్టుకుంటూ అన్నాడు రాజశేఖరం.

“నీ విషయం మీ అమ్మతో చెప్పి నీ కొడుక్కి ఈ విషయాలేవీ చెప్ప అవసరం లేదు. ఆ విశాలగుప్తకి కూడా చెప్పనవసరం లేదు. అతనేమైనా మన బంధువా? అని అన్నాడుట మీ మామయ్య.”

“ఎంత దారుణంగా మాట్లాడాడు మామయ్య, నా విషయం విని అమ్మ చాలా బాధపడి ఉండచ్చు.”

“బాధపడ్డమే కాదు మీ అమ్మ నీవు చేసిన పనికి చాలా అసంతృప్తిగా ఉంది. అంతే కాదు రాజూ! శారద పెళ్ళి, వేణు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, నీవు చదువు మాని ఇలా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం ఈ విషయాలన్నీ ఆమెను కృంగ తీస్తున్నాయి. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది.”

విశాలగుప్త చెప్పిన తన కుటుంబం అస్తవ్యస్త పరిస్థితి అతడ్ని అధీరుడ్ని చేసింది. అంత వరకూ అతడిలో ఉన్న ఆతసైర్యం, సడలిపో ఆరంభించింది. తను ఒంటరిగా లేడు కాని అదే ఒంటరిగా ఉంటే కరువుదీరా ఏడవాలనిపించింది. అతనిలో బేలతనాన్ని గమనించాడు విశాలగుప్త ఎందుకంటే రాజశేఖరం మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనానికి గంభీరత కూడా జత కలిసింది.

నిశ్శబ్దం వేరు, మౌనం వేరు. శబ్దం లేకపోవడం నిశ్శబ్దం. మాట్లాడకపోవడం మౌనం. నిశ్శబ్దం మనుష్యులకే కాదు ఇతర జీవులకూ, చివరకు యంత్రాలు వంటి నిర్జీవులకు కూడా వర్తిస్తుంది. కాని మౌనం కేవలం మనుష్యులకు మాత్రమే వర్తిస్తుంది. మౌనం మాటకన్నా గొప్పది.

రాజశేఖరంలో పోయిన ఆత్మసైర్యాన్ని తిరిగి ఇవ్వాలి. అతనిలో బేలతనం తొలగించాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇవ్వాలనుకున్నాడు విశాలగుప్త.

“రాజూ! ఇప్పుడు నీ లక్ష్యం వేరు, నీ దృక్పథం వేరు. సంకల్పం వేరు. నీవు పుట్టి పెరిగిన మాతృభూమి బానిస సంకెళ్ళు తొలగించడానికి నీవంతు కృషి నీవు చేస్తున్నావు. నేను చేస్తున్న పని మంచిది. ఇందులో స్వార్థం లేదు. స్వలాభపేక్ష లేదు అని నీవు భావించిననాడు త్రికరణ శుద్ధిగా నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చు. మా అందరి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి. కుటుంబ అస్తవ్యస్త పరిస్థిలు ఇప్పుడు నిన్ను కృంగదీసినట్లున్నా ఆ పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగ ఉండవు. ఆర్థికంగా నీకు ఏ సహాయం కావలన్నా ఈ బాబాయ్ ఉన్నాడన్న విషయం మరిచపోకు రాజూ!” విశాలగుప్త అన్నాడు.

అతని మాటలు విన్న తరువాత రాజశేఖరానికి కోల్పోతున్న శక్తి తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఎవరైనా మనం చేసిన పనిని ప్రశంసించక్కర్లేదు. నిరాశ మాత్రం పరచకూడదు. అలా అయిన పక్షంలో మనం ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా అవలీలగా ఎదుర్కోగలము.

“బాబాయ్! శారద లేదు. వేణు లేడు. కళ్యాణి చూస్తే చిన్న పిల్ల. నీవు చెప్పిన దాన్ని బట్టి అమ్మ ఆరోగ్యం బాగోలేదు. మామయ్యా వాళ్ళూ అమ్మను ఎన్ని చిత్రహింసలకి గురి చేస్తారో? అదే నా బాధ.”

“మనం ఏం చేయలేము. జరుగుతున్న దాన్ని అలా చూస్తూ ఉండడమే తప్ప మనమేం చేయలేము. నేను కూడా కల్పించుకోలేను. నేనంటే అసలే మీ అత్తయ్యకి మామయ్యకి కిట్టటం లేదు.” విశాలగుప్త చెప్తున్న మాటలు తలపంకించి వింటున్నాడు రాజశేఖరం.

(ఇంకా ఉంది)

Exit mobile version