కోడిపిల్ల కొనమంటే కొత్తపొలం కొంటానన్నాడట

0
3

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]కిం[/dropcap]డంగి గ్రామంలో కనమ్మ, కన్నంనాయుడు అనే భార్యభర్తలుండేవారు. వారి కూతురు దుర్గమ్మ. ఆమె ఆ గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. కన్నంనాయుడు తన పొలంలో ధాన్యం, ఊదలు, సామలు, చోళ్లు పండిస్తుంటాడు. ఒకరోజు దుర్గమ్మ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఆమె తలమీద ఒక కోడిపిల్ల పడింది. ఒక గ్రద్ద ప్రక్క గ్రామంలోని కోడిపిల్లను తన్నుకొని పోయి తిందామనుకుంటుండగా దాని కాళ్ల మధ్య నుండి జారిపడి క్రింద దుర్గమ్మ తలమీద పడింది.

దుర్గమ్మ ఆ పిల్లను జాగ్రత్తగా చేతితో పట్టుకుని నేలమీద పెట్టింది. తల్లిని దారం తెమ్మనగా ఆమె తెచ్చిన దారంతో దాని కాలికికట్టి వీధి అరుగు మీదనున్న రాటకు కట్టి మేతకు గింజలు వేసింది. అలా ఆ పిల్లను పెంచగా అది పెట్టగా మారింది. ఈ విషయం తన గురువుకు చెప్పగా ఆయన ఈ పిల్ల వల్ల నీకు రాబోయే రోజుల్లో బాగా కలసివస్తుందని చెప్పాడు. దుర్గమ్మ పెట్ట పుంజులతో కలిసి పెరిగింది. ఎనిమిది గ్రుడ్లు పెట్టింది. వాటిని ఒక గంపలో వుంచి గంపను ఎత్తుగా తాళ్లతో వ్రేలాడదీసింది. కోడిపెట్ట వాటిని పొదగగా అవి పిల్లలుగా మారాయి. వాటిని గ్రద్ద బారి నుంచి కాపాడింది. ఆ పిల్లల్లో ఐదు పెట్ట పిల్లలు, మూడు పుంజు పిల్లలు. వీటన్నింటి ద్వారా దుర్గమ్మ కోడిపిల్లల దుర్గమ్మని పేరు వచ్చింది.

అదే గ్రామంలో బాబాజమ్మ, లచ్చన్న అనే దంపతులుండేవారు. లచ్చన్న ఒక పెద్ద రైతు దగ్గర పశువుల కాపరిగా వుండేవాడు. ఆ రైతు తన ఆవులు ఇచ్చిన పాలను విక్రయించి, దూడపెయ్యిలను బలమైన ఎద్దులుగా పెంచి సంతల్లో అమ్మి వేలాది రూపాయలు సంపాదించాడు. ఏటా గ్రామంలోని గిరిజనులకు డబ్బులు వడ్డీకి అప్పులిచ్చి రెండు, మూడేళ్లలోనే ఒక పొలం కొన్నాడు. ఆ పొలంలో కూలీలను పెట్టి పంటలు బాగా పండించి ధనవంతుడయ్యాడు. ఇలా ఏటాకేడాది పొలం కొనడం, అమ్మడం చేయడం ద్వారా బాగా డబ్బు గడించాడు. లచ్చన్న పెళ్లాం బాబాజమ్మ తనేదో వ్యాపారం చేయాలని అనుకుంటుండగా దుర్గమ్మ గుర్తుకొచ్చింది. ఆమెలా కోడిపిల్లలు పెంచాలని అనుకుంది. మొగుడిని దుర్గమ్మ దగ్గరకు వెళ్లి రెండు కోడిపిల్లలను తెమ్మంది. లచ్చన్న ఇదిగో అదిగో అని చెప్పేవాడు. కాని ఒక కోడిపిల్ల కూడా కొనలేదు. తన తోటి పశువుల కాపర్లతో నేను నా యజమానిలాగా కొత్త పొలం కొంటానని బడాయి కబుర్లు చెప్పగా వారంతా “కోడిపిల్ల కొనలేని వాడివి కొత్త  పొలం ఎలా కొంటావురా!” అని హేళన చేయసాగారు. గ్రామంలో అందరికి లచ్చన్న సంగతి తెలుసు. వాడు అలా గొప్ప కబుర్లు చెబుతూ తన పెళ్లాన్ని మాయచేస్తున్నాడని అనుకోసాగారు. బాబాజమ్మ అలిగి పెట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తండ్రి సంతలో నాలుగు కోడిపిల్లలు కొనిచ్చి “వీటిని దుర్గమ్మలాగ పెంచుకో. వాటి మేతకు గింజలు, తవుడు నేను నీకు ఇస్తాను” అని చెప్పగా ఆమె సంతోషించింది. లచ్చన్న బాబాజమ్మను ఇంటికి రమ్మని బ్రతిమాలగా “నిన్ను వదిలి నేను వేరే పెళ్లి చేసుకుంటాను. బుద్ధిలేని వాడా! మాయమాటలు చెబితే అందరూ నవ్వుతారని తెలియదా” అని కోపంతో చెప్పింది.

“బాబాజమ్మా! అమ్మతోడు! అప్పతోడు! నేను పశువుల కాపరిగా ఎంత కాలం పనిచేస్తాను. అడవికి వెళ్లి కరక్కాయలు, నల్లజీడిపిక్కలు, అడ్డాకులు తెచ్చుకుని అమ్ముకుని బ్రతుకుదాం” అని బ్రతిమాలగా ఆమె ఒప్పుకుంది. కొంతకాలానికి బాబాజమ్మ కోళ్ల వ్యాపారం చేసి డబ్బు సంపాదించింది. లచ్చన్న డబ్బులు సంపాదించి కొంత పొలం కొని రైతుగా మారాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here