కొడుకుల్ పుట్టరటంచు…

0
2

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన కుంతి. [/box]

[dropcap]అ[/dropcap]ది నగరములోని విశాలమైన పార్కు.

వాకింగ్ పాత్, యోగా కేంద్రము, వ్యాయామాలు చేసుకోవడానికి కావలసిన ఇరన్ బార్స్, పిల్లలు ఆడుకోవడానికి తగిన జారుడు బండ వంటి క్రీడా సదుపాయాలు అక్కడ ఉన్నాయి.

పరిశుభ్రముగా, అందముగా ఉన్నది. ఎక్కడెక్కడి వాళ్ళు సాయంత్రము కాగానే అక్కడికి చేరుకుంటారు.

జనాలతో రద్దీగా ఉండడముతో ప్రేమ జంటలు రావు. పెళ్ళైన వారు మాత్రము ఇరుకు గదులలో సంసారము చేస్తూ, మానసికంగా ఉక్కపోసిన వారై సాయంకాలాలు విహారానికి వస్తారు.

అదే పార్కులో మారుమూల ఒక రావి చెట్టు. దాని ప్రక్కన మరొక పెద్ద చెట్టు. ఈ రెండింటి మధ్య నీడా, గాలి ప్రసరిస్తూ, సేద దీర్చుకోవడానికి వీలుగా సిమెంట్ బెంచీలు. ఆ సిమెంట్ బెంచీలపై సాయంవేళలలో లోకాభిరామాయణము.

అక్కడ అదొక పెద్ద అన్ రిజిస్టర్డ్ అసోసియేషన్. అందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, రిటైర్డు ఉద్యోగులు ఉన్నారు. అక్కడ చర్చలలో దేశ విదేశ రాజకీయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సంస్కరణలు, సాహిత్యము, సినిమాలు, క్రీడలు, కుటుంబ సమస్యలు, స్త్రీలు, ఫ్యాషన్లు వంటి అనేక విషయాలు చర్చల్లోకి వస్తాయి. అక్కడికి రోజూ వచ్చే వారిలో గాఢమైన స్నేహము యేర్పడడముతో, ఒకరికొరకు ఒకరు ఎదురు చూడడము, కష్ట సుఖాలు పంచుకోవడము చేస్తుంటారు. అయితే ఈ సమావేశాలు చాలా వరకు నిస్వార్ధముగా, ఎడ్యుకేటివ్‌గా సాగుతుంది.

పెద్దగా క్యారెక్టర్ అసాసినేషన్‌లు, గోతులు తవ్వడాలు ఉండవు.

సాయంకాలం వేళ చల్లగా గాలి వీస్తుంది. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. సిమెంట్ బెంచ్‌లు క్రమంగా నిండుతున్నాయి.

బెంచ్ పైన కూర్చుని ఉన్న ఒక పెద్ద మనిషి వైపు, పాలుగారుతున్న ఒక పసివాడు అటుకేసి వచ్చాడు. ఆ బుడతడిని చూసి, “ఎవరు వీడు, వీడి తాలూకు వాళ్ళు ఎవరూ, ఇక్కడ లేరే?” అనుకుంటూ, ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని మీద కూర్చుండ బెట్టుకున్నాడు.

ముద్దుగా, బొద్దుగా ఉన్న ఆ పిల్లవాడు కొత్త వ్యక్తులను చూసి ఏడవసాగాడు. అక్కడ కూర్చున్న వారు తమకు తోచిన విధముగా సముదాయించసాగారు.

కొంత సేపు గడిచింది, ఒక వ్యక్తి ఆదుర్దాగా అటుకేసి వచ్చాడు. అతని మొహములో టెన్షన్, భయము కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. కాసేపయితో యేడ్చేట్లుగా ఉన్నాడు.

అతడిని చూడగానే పిల్లవాడు, “నాన్నా” అంటూ ఏడుపు ఆపి, పెద్దాయన భుజము మీది నుండి దిగి, తండ్రి దగ్గరికి వెళ్ళాడు.

“పాన్ పోసుకోవడానికి వీడిని దింపి పక్కకు వెళ్కానండి. నిముషములో మాయమయ్యాడు” సంజాయిషీ చెప్పాడు.

అక్కడ ఉన్న వారు అతడిని గుర్తించడము చేత, పిల్లవాడు “నాన్నా” అంటూ పోవడము చేత, అతని ఐడెంటిటీ, వగైరాలు ఎవరూ ప్రశ్నించలేదు.

పిల్లవాడు తండ్రి భుజము మీద నవ్వుతున్నాడు, ఆ తండ్రి తన భుజాల మీద ఉన్న బాబును దగ్గరికి హత్తుకొని, ఆదమరిచి పారేసుకున్న వజ్రాల మూట దొరికినంత సంబర పడుతూ , “నా బాబూ! నా కన్నా! వజ్రాల కొండ! నా వరాల మూట!” అంటూ ముద్దాడుతూ, కళ్ళల్ళో అప్పటికే తిరిగిన కన్నీటిని అణుచుకుంటూ, అందరికీ థాంక్స్ చెబుతూ, మందుకు సాగిపోయడు.

“యేమిటో ఈ పితృ వాత్సల్యము?” అన్నాడు బ్యాంక్ ఎంప్లాయి మోహన్ రావు.

“పుత్రవ్యామోహము” అన్నాడు రైల్వే గార్డు అయిన లక్ష్మీపతి,

“అన్నట్లు దేశికులు కనబడడము లేదే?” అన్నాడు లెక్చరర్ రమణారావు.

“అయ్యో! మీకు తెలియదా? వాళ్ళింటిలో పెద్ద ఘోరము జరిగింది” దేశికులు ఇంటి పక్కన స్టేషనరీ షాపు నడుపుతున్న ముకుందము.

“ఏమి జరిగింది?”మూకుమ్మడి ప్రశ్న.

“దేశికుల రెండవ అబ్బాయి రెండు రోజుల క్రితము బాగా త్రాగి వచ్చాడు. ఆ మైకములో వాడు వాడి భార్యను చావబాదాడు. అడ్డు వెళ్ళ బోయిన దేశికులను, అక్కడే ఉన్న కూరలు కోసే కత్తితో పొడిచాడు. గొడవ బాగా ముదరడముతో చుట్టుపక్కల వాళ్లమైన మేము గుమిగూడి, దేశికులను హాస్పిటల్‌లో చేర్చాము. ఎవరో పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వడముతో, పోలీసులు వచ్చి దేశికుల అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు.”

“అయ్యయ్యో! ఎంత పెద్ద విషాదము” ముక్త కంఠముగా.

“ఇదేమి ట్రాజడీ అండి. ఆయన కధ అంతా వింటే రక్త కన్నీరే” ముకుందము.

“ఏమిటీ?” ముక్త కంఠము.

“దేశికులకు ఇద్దరు కొడుకులు. మధ్య తరగతి సంసారము. కష్టపడి పైకి వచ్చాడు. రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరి పిల్లలను చదివించాడు. పెద్దవాడి పై చదువులకై తెగ అప్పులు చేసాడు, పెద్దవాడు ఢిల్లీ విశ్వ విద్యాలయములో రీసర్చ్ చేసి, పెద్ద ఉద్యోగము సంపాదించాడు. ఎదిగిన కొడుకు తన కష్టాలలో ఆదుకుంటాడనుకున్నాడు దేశికులు. కానీ వాళ్ళ అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోని, ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ‘అప్పుల సంగతి యేమిటి?’ అని దేశికులు అడిగితే, ‘నన్ను అడిగి అప్పు చేసారా? అయినా పెంచడము, చదివించడము మీ బాధ్యత కాబట్టి మీరు చేసారు. నేను ఇపుడిపుడే సంపాదించుకుంటున్నాను. నాకు పెళ్ళి అయింది. నాకు ఖర్చులు ఉంటాయి. నేనూ బాగా సెటిల్ అవ్వాలి, కావాలంటే ఇల్లు అమ్మేయండి’ అంటూ ఉచిత సలహాలు” ఇచ్చాడట. ‘ఉన్న ఇల్లు అమ్మి వేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలిరా’ అని అడిగిందట దేశికుల భార్య. ‘దేశములో ఎన్ని రైల్వే ప్లాట్‌ఫారములు లేవు’ అంటూ వెళ్ళిపోయాడట. అక్కడితో ఆ వ్యవహారము ముగిసింది. అసలు కష్టాలు రెండవ కొడుకుతో ప్రారంభమయ్యాయి. వాడు చిన్నప్పటి నుండి జులాయిగా తిరిగేవాడట.”

“అంటే దేశికులు సాబ్‌ను పొడిచిన వాడేనా” అడిగాడు రిటైర్డ్ కానిస్తేబుల్ మస్తాన్ వలీ.

“ఔను! వాడే. పదవతరగతి నుండి అన్ని అన్ని రకాల వ్యసనాలు, అల్లరి మూకతో చేరి వీధుల్లో యుద్ధాలు.. ఇది చూసి తల్లి, తండ్రి కోపగిస్తే ఇంటి నుండి పారిపోవడము, వాడిని అక్కడా ఇక్కడా వేదికి పట్టుకొని రావడము, మళ్ళీ చిల్లర దొంగతనాలు, మట్కా బ్రాకెట్టు ఆడటము, తాగడము వంటి వాటితో గడపడము.. ఈ మధ్యలో ఇంటర్‌లో నాలుగు సార్లు తప్పడము. కనీసము యేదైనా పని నేర్పించాలని ఫ్రిజ్ మెకానిజము, టీవీ మెకానిజము వంటి కోర్సులలో చేర్పిస్తే అక్కడ యేదీ నేర్చుకోకుండా సమయాన్ని, డబ్బును వృధా చేయడము. వీడిని ఎలాగైనా దారిలో పెట్టాలి అనుకున్న దేశికులు చిన్నపాటి వ్యాపారము పెట్టిస్తే, అది సక్రమంగా చేయక నష్టాలు మిగిల్చడము…. ఇది ఇలా ఉండగా.. కాలనీలో ఉన్న అమ్మాయిలను వేధించడముతో కాలనీ వాళ్ళు దేహశుద్ధి చేసారు.”

“ఈడు వచ్చింది కాబట్టి పెళ్ళి చేస్తే బాగుపడతాడు” అని ఎవరో సలహా ఇస్తే, ఆ మాట పట్టుకొని పిచ్చి దేశికులు వాడికి పెళ్ళి చేస్తే…. పెళ్ళి అయిన తరువాత వాడు ఆ అమ్మాయిని కూడా వేధించసాగడము.. రోజు బాగా త్రాగి ఇంటికి రావడము, అపుడపుడు ఎవరినో వెంట పెట్టుకొని సరాసరి ఇంటికే రావడము, ఇదంతా యేమిటని ప్రశ్నిస్తే, ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టడము, భార్యను చితక బాదడము, అడ్డు వచ్చిన తల్లిదండ్రులను కొట్టడము…. ఇదంతా మేము కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న భాగోతమే. మనము మాత్రము యేమి చేయగలము”

“అక్కడికి ఒక్కసారి నేను మా ఫ్లాట్ సెక్రెటరీ వాడిని పిలిచి మందలించాము. ఆ కోపముతో ఒక రోజు మా ఇంటికి వచ్చి నానా గొడవ చేయడమే కాక, నా భార్యతో మిస్ బిహేవ్ కూడా చేసాడు. అప్పుడు దేశికులు, అతని భార్య అక్కడికి వచ్చి, “ఇదంతా మా ఖర్మ, పెద్దాడు అట్లా చేసాడు. చిన్నాడు ఇలా చంపుకు తింటున్నాడు. మా వల్ల మీకు ఇబ్బంది. క్షమించండి’ అంటూ అక్కడి నుండి వాడిని లాక్కొని పోయారు. ఈ నేపధ్యములో మళ్ళీ బాగా త్రాగి వచ్చాడు. దానితో అంత పెద్ద గొడవ జరిగింది” కధ ముగించాడు ముకుందము.

దేశికుల గురించి విన్న అక్కడి వాళ్ళంతా కాసేపు అదోలా అయ్యారు.

“తల్లిదండ్రి మీద దయలేని పుత్రులు పుట్టనేమి వాడు గిట్టనేమి” రమణారావు

“తలకు కొరివి పెడతాడని, నరకాన్ని దూరము చేస్తారని కొడుకుల్ని కోరి కోరి కంటే, బ్రతికున్నపుడే కొరివి పెడుతూ, నరకాన్ని చూపిస్తున్నారు” లక్ష్మీపతి.

“మీరిలా అంటున్నారు. మా అపార్ట్‌మెంట్ లోని రాఘవరావుగారి ఇంటి పరిస్థితి వింటే మనసున్న వారెవరూ తట్టుకోలేరు” అన్నాడు రిటైర్డ్ టీచర్ సోమరాజు.

“యేదో ఫ్యాక్టరీలో పని చేస్తాడు. చిన్న మోపెడ్ ఉంటుంది” అతడేనా అన్నాడు సెల్ షాపు ఓనర్ జోసఫ్.

“ఔను! అతనికి ఒక్కడే కొడుకు. వాడిని బాగా చదివించాలని, ఉన్నత ఉద్యోగములో చూడాలని ఆశ. తన తాహతుకు మించిన ఖర్చుతో పబ్లిక్ స్కూల్‌లో చేర్పించాడు. ఆ పైన చెన్నైలో పెద్ద కాలేజీలో చదివించాడు. ఆ పిల్ల వాడు డబ్బున్న పిల్లలతో స్నేహము చేసి, బాగా జులాయిగా మారాడు. క్లబ్బులు, షికార్లకు అలవాటు పడ్డాడు. అక్కడ చెడిపోతున్నాడని, ఇక్కడికి తెచ్చి లక్షలు పోసి ఇజనీరింగ్ కాలేజ్‌లో చేర్పించాడు. వాడు అతి కష్టము మీద రెండు సంవత్సరాలు చదివి, అన్ని సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయ్యాడు. పోతే పోయింది. ప్రైవేట్ గా డిగ్రీ చేయమన్నాడు వాడి నాన్న. అదీ చేయలేదు. ఇది ఇలా ఉండగా నాడు పొద్దంతా పడుకోవడము, లేదా ఇంటిలో ఉన్నంత సేపు టీవీ చూస్తూ, సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ, రాత్రిళ్ళు ఊరంతా బలాదూర్‌గా తిరుగుతూ,….. దిన చర్యగా గడిపేవాడు. నాకు కాస్తా ఆ ఫ్యామిలీతో చనువు ఉండటముతో, అబ్బాయిని తీవ్రముగానే ఖండించేవాడిని. ఇలా ఉండగా నాడు ఒక బాగా డబ్బు, అధికారము, పరపతి గల కుటుంబములో నుండి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కూడా వాడిని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా ఇంటి నుండి వెళిపోయి పెళ్ళి చేసుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తనకున్న పలుకుబడితో వీళ్ళను పట్టుకొన్నాడు, ఆ అమ్మాయి మెడలోని తాళిని తెంచి వేసి, వీడిని పోలీసులకు అప్పగించి, మళ్ళీ మా అమ్మాయి జోలికి రావద్దని, వస్తే ప్రాణాలు తీస్తానని హెచ్చరించి, అమ్మాయిని తీసుకువెళ్ళాడు. నేనూ, వాళ్ళ అమ్మా నాన్నలు కిందా మీద పడి పిల్లవాడిని పోలీసులనుండి విడిపించాము. ఇంటికి వచ్చిన తరువాత “జరిగినదేదో జరిగిపోయినది,ఇంక ఆ పిల్ల జోలికి వెళ్ళవద్దు కుదురుగా ఉండు. నీకు తోచినది చదువుకో. లేదా యేదైనా వ్యాపారము చేసుకో. నీ కాళ్ళ పైన నీవు నిలబడు. ఇక ఆ పిల్లను మరిచిపో. మనసు మళ్ళించుకో. వాళ్ళతో మనము తూగలేము. మన స్థాయి పిల్లతో పెళ్ళి చేస్తాము. హాయిగా ఉండు” అని వాళ్ళ అమ్మానాన్నలు హితబోధలు చేసారు. మేమంతా కూడా రకరకాలుగా కౌన్సిలింగ్ చేసాము. ఇక ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయికి మరొక వివాహము చేసి స్టేట్స్‌కు పంపారు. ఇదంతా విచిత్రముగా కొన్ని రోజుల వ్యవధిలో జరిగినది. ఈ సంఘటన జరిగిన తరువాత ఆ అబ్బాయి మరీ పిచ్చివాడిగా మారాడు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. మేము మార్చే ప్రయత్నాలు చేసాము. డాక్టర్లతో కౌన్సిలింగ్ చేయించాము. రిహాబిలిటేషన్‌కు పంపాము. చాలా జాగ్రత్తగా వాడిని చూసుకుంటూ వచ్చాము. కానీ….”

“కానీ……….”

“పోయిన శనివారము నాటి మధ్య రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పిల్లవాడి అంత్యక్రియల సమయములో ఆ దంపతులను పట్టలేకపోయాము. తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోవడము కన్నా నరకము ఏముంది?”

“పున్నామ నరకము నుండి తప్పిస్తాడనుకుంటే, నాకింత నరకాన్ని మిగిల్చాడు ఏమిటి” అని ఆ తండ్రి పుత్రశోకముతో విలపిస్తుంటే అతడిని పట్టలేకపోయాము. మా అపార్ట్ మెంట్ వాసులు కూడా కన్నీరు మున్నీరు అయ్యారు” అంటూ ముగించాడు.

రాజారావు ఎంతటి ధర్మాత్ముడు. అందరికి తలలో నాలుకలా ఉంటాడు. మరి ఆయన కొడుకేంటి ఇలా? వాడి వల్ల ఒక్క రోజు వాళ్ళు సంతోషపడినది లేదు. ఆ కుటుంబము కూడా మంచి పేరెన్నికగన్నది. తులసి వనములో గంజాయి మొక్కలా ఎలాపుట్టాడు” అంటూ ఆవేశంగా అన్నాడు సెక్రటేరియట్‌లో పనిచేసే రాధాకృష్ణ.

“ఏది ఏమయినప్పటికీ తల కొరివి పెట్టాల్సిన కొడుకుకే తలకొరివి పెట్టాల్సి రావడము నిజంగా బాధాకరము” అన్నాడు రమణారావు.

“మీరివన్ని చెబుతుంటే నాకు మా దూరపు బంధువు అయిన రంగస్వామి అంకుల్ విషయము మీకు చెప్పాలి అనిపిస్తుంది” అన్నాడు సేల్స్‌మన్ సూర్యము.

“ఏమిటి?” అన్నట్లుగా చూసారు అందరు.

“రంగస్వామి మాకు దూరపు బంధువు, వరుసకు పెదనాన్న. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడు. నలుగురు కొడుకులను బాగా చదివించాడు. ఒకడు డాక్టర్, ఒకడు సైంటిస్ట్, ఒకడు ఇంజనీర్, ఒకడు బిజినెస్ మాన్. వృద్ధాప్యములో నలుగురికి తన ఆస్తిని సమానంగా పంచాడు. ఒక్కొక్కరికి సుమారు కోటి రూపాయల దాకా ముట్ట చెప్పాడు. ఆ తరువాత మా పెద్దమ్మ, పెదనాన్న జబ్బు పడ్డారు. వీళ్ళను యే ఒక్క కొడుకు పట్టించుకోలేదు. వీళ్ళకు పచ్చి మంచి నీళ్లేనా పోసే వారు కరువయ్యారు. వారి దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకు పని వాళ్ళని ఇచ్చిందే తప్ప సేవించే వారిని ఇవ్వలేదు. మా పెదనాన్న తన కొడుకుల చదువులూ, స్టేటస్ చూసి  గర్వపడుతూ, బంధువులను చులకన చూస్తూ, యే రోజు ఎవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కొడుకులను చూసి ఆత్మీయులను దూరము చేసుకున్నాడు. ఆత్మీయత పంచాల్సిన కొడుకులు ఆయనను తరిమికొట్టారు. చేసే వాళ్ళు చూసే వాళ్ళు లేక ఇద్దరూ మనోవేదనతో చనిపోయారు” చెప్పాడు సూర్యము.

“నేటి సమాజములో తల్లిదండ్రులను పిల్లలు బ్లాంక్ చెక్కులలాగా , ఏటిఎమ్ లాగా చూస్తున్నారు. ఇదిగో అలాంటి వాడూ అయిన మా హెడ్ మాస్టర్ గారి అబ్బాయి ఫిలిప్స్ గురించి చెప్పాలి” అన్నాడు ప్రభుత్వోపాధ్యాయుడు అయిన కామేశ్వరరావు.

“వీడి ఘనత ఏమిటీ” అన్నాడు లక్ష్మీపతి.

“పై చదువులకు ఆస్ట్రేలియా పంపించాలని తండ్రితో అస్తమానము గొడవ పడుతుండేవాడు. అన్ని లక్షలు పెట్టి నిన్ను పంపించలేను అని ఈయన అనేవాడట. వాడు ‘ఎలాగైనా నన్ను పంపించాల్సిందే’ అని పట్టు బట్టాడట.

“నా దగ్గర చిల్లి గవ్వలేదు కావలిస్తే నా రక్త మాంసాలు అమ్ముకో అన్నాడట కోపంగా.

“రక్త మాంసాలు ఎందుకు కానీ కిడ్నీలు అమ్ముకో. నాలుగు అయిదు లక్షలు అయినా వస్తాయి” అన్నాడట. దానితో కలత చెందిన మా హెడ్ మాస్టర్ గారు ఉన్న ఇల్లు అమ్మి ఆ డబ్బుతో వాడిని ఆస్ట్రేలియా పంపించాడు” అని తెలిపాడు కామేశ్వర రావు.

“మా బాబాయి కొడుకులు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. మా బాబాయి మరణించినా, పిన్ని మరణించినా చూడడానికి కూడా రాలేదు. వాళ్ళు కోరి కోరి వీళ్లని విదేశాలకు పంపారు” అన్నాడు రిటైర్డ్ ఎంప్లాయి ఆచారి.

“ఏది ఏమైనా మన తరము వాళ్ళు అటు పెద్దలకు భయపడ్డాము. ఇటు పిల్లలకు భయపడాల్సి వస్తుంది” అన్నాడు కామేశ్వరరావు.

“మాస్టారూ! అసలు ఈ పరిస్థితులు ఉత్పన్నము కావడానికి కారణములు ఏమిటి? అసలు ఈ రోజుల్లో సన్ స్ట్రోక్ తగలని తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు జోసఫ్.

“ఏముందండి, తప్పు మనది. అంటే అక్షరాలా తల్లిదండ్రులమైన మనది. పిల్లలు బాగా చదవాలని, బాగా సెటిల్ అవ్వాలని కలలు కంటూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాము. తాహతుకు మించి అప్పులు చేసి, చదువులు చెప్పిస్తున్నాము. మనము చాలా కష్టాలు అనుభవించాము, పిల్లలు ఆ కష్టాలు అనుభవించవద్దు అని అనుకొని, అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ, సుఖవంతమైన జీవితాన్ని అందిస్తున్నాము. మన సంపాదనలో, మన యాంత్రిక జీవన విధానములో మనము పడిపోయి, పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని పట్టించుకోవడము లేదు. ఎవరితో తిరుగుతున్నారు?ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? అని కనుక్కోవడము లేదు. ముందుగా మనము నీతి వంతముగా, ఆదర్శముగా ప్రవర్తించడము లేదు. మన జీవన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని పిల్లలు క్లోజ్‌గా గమనిస్తుంటారు. వారు బాగుండాలి అంటే ముందు మనము వారికి రోల్ మాడల్ కావాలి. మన మెంత బాగుగా ఉన్నప్పటికీ ఇలాంటి వాళ్ళు ఎలాగూ ఉంటారు. దానికి మనమేమి చేయలేము” వివరించాడు రమణారావు.

“అది నిజమేనండి. మరొక మాట. మన విద్యా వ్యవస్థను కూడా పటిష్టము చేసుకోవాలి. విద్య పిల్లకు నైతికతను, మానవతా మూల్యాలను అందించడము లేదు. మంచీ చెడుల విచక్షణను ఇవ్వడము లేదు. వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడము లేదు, జీవన నైపుణ్యాలను, సమస్యా పరిష్కా దృక్పధాలను నేర్పించడము లేదు” అన్నాడు ముకుందము.

“సినిమాలు, ప్రైవేట్ టీవీ చానళ్ళు, మారిన వాతావరణము, పెరిగిన భౌతిక సౌకర్యాలు కూడా దీనికి కారణమే” అన్నాడు లక్ష్మీపతి.

“మనము ఒక విషయము గమనించాలి. పిల్లల్ని కని, పెంచి ఉన్నత స్థాయికి తీసుకొని రావడము మన బాధ్యత. వాళ్ళు పెద్దవాళ్ళయిన తరువాత మనలను చూస్తారా లేదా అన్నది తరువాత విషయము. చూస్తే మంచిది. చూడకపోయినా బాధ పడేది లేదు. దేనికైనా మనము సిద్ధంగా ఉండాలి. అయితే ఒక విషయము పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడి యే చీకు చింతా లేకుండా బ్రతికితే చాలు. ఈ రోజుల్లో అది కూడా గొప్ప విషయమే”రమణారావు.

“పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవడానికి వాళ్ళలోని దుర్మార్గమే కాక మరికొన్ని అనివార్య పరిస్థితులు కూడా ఉంటాయి” జోసెఫ్.

“కర్ణుడి చావుకు కారణాలు అనేక మైనట్లు పేరెంట్స్‌కు తగిలే సన్ స్ట్రోక్‌కు కూడా అనేక కారణాలుంటాయన్నమాట” లక్ష్మీపతి.

“పుత్రులు పున్నామ నరకము నుండి తప్పించడము కాదు, పుట్టుకతో నరకాన్ని మోసుకొస్తారు అనిపిస్తుంది” సూర్యము.

ఇంత సేపు ఇన్ని మాటలు, ఇంత చర్చ జరుగుతున్నా రాజశేఖరము మాత్రము మౌనంగా ఉన్నాడు.

“యేమిటండి. మీరు అదోలా ఉన్నారు” అన్నాడు ముకుందము రాజశేఖరము భుజము పైన ఆప్యాయంగా చేయివేసి.

రాజశేఖరము ఒక్కసారిగా భావుకుడయ్యాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరగ సాగాయి, చాతి ఎగిరిపడుతుంది. “యేమిటండీ! మీ అబ్బాయికి ఎలా ఉంది?” అన్నాడు రమణారావు.

రాజ శేఖరము ప్రభుత్వ ఉద్యోగి. ఒక్క కొడుకు, ఒక్క కూతురు. కూతురు వివాహమయి అత్తవారింటికి వెళ్ళింది. రేపోమాపో రిటైర్డ్ కాబోతున్నాడు. కొడుకు శారీరక, మానసిక వికలాంగుడు. వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉంటాయి. ఈ రోజుకు వాడి పనులు అన్ని భార్యాభర్తలు చేస్తుంటారు. పిల్లవాడి సేవలో వారి జీతాలు, జీవితాలు కరిగిపోయాయి. వాడి బాగు కోసమని చేయించని వైద్యము లేదు. వాడు బాగు పడడు, చచ్చేంత వరకు భరించవలసిందే అని తేల్చిచెప్పారు డాక్టర్లు. వారు పాపము ఎక్కని కొండ లేదు. మొక్కని బండ లేదు. వారి ఇంటిలో ముఖములో నవ్వులు, వారి ఇంటిలో ప్రశాంతత మాయమయ్యాయి.”

రాజ శేఖరము కళ్లల్లో నీళ్లు, మనసులో దిగులు ఇంటి పరిస్థితులు అక్కడ అందరికీ తెలుసు. వాళ్ళ అబ్బాయి విషయమే మళ్ళీ యేదో బాధ కలిగించి ఉంటుందని భావించి, “బాధపడకండి రాకశేఖరము గారు, మీరు కాబట్టి ముప్పై సంవత్సరాలుగా యేగుతున్నారు. మరొకరైతే యేమి చేసే వారో, యేమి అయ్యే వారో? మీకొక విషయము చెప్పాలి. గాజు బొమ్మలను ఎవరి చేతిలో పెడితే వారి చేతిలో పెట్టము. ఎవరైతే శ్రద్ధగా, జాగ్రత్తగా పట్టుకోగలరో వాళ్ళ చేతిలో పెడతాము. అలాగే ఇలాంటి పిల్లలను ఎవరు పడితే వారు సంరక్షించలేరని, మీ లాంటి వారి చేతుల్లో భగవంతుడు పెడుతుంటాడు” అన్నాడు రమణారావు.

“బహుశ భగవంతుడే ఆ రూపములో వచ్చి మీ సేవలు అందుకుంటున్నాడేమో? ఎవరికి తెలుసు?” అన్నాడు మస్తాన్ వలీ.

“ఏమోనండి. రాను రాను వాడికి చేసే ఓపిక సన్నగిలుతుంది. మునుపటి ధైర్యము, విశ్వాసము లేదు. మమ్మల్ని నెమ్మది నెమ్మదిగా రోగాలు ఆక్రమించుకుంటున్నాయి. మేము బ్రతికి ఉన్నంత కాలము చేస్తాము. ఆ తరువాత వాడి పరిస్థితి యేమిటీ అన్న ఆలోచనలు మాకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. వృద్ధాప్యములో తోడుగా ఉంటాడని కొడుకులు కావాలనుకుంటాము. కానీ కొడుకుకు వృద్ధాప్యములో తోడుగా ఉండలేమని భయడుతున్నాము” అన్నాడు దిగులుగా రాజశేఖరము.

“మీ కధ దైవ తప్పిదమైతే మా తమ్ముడి కొడుకు కధను యేమని చెప్పాలి. మా తమ్మునికి ఒకడే కొడుకు. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరము చదువుతుండేవాడు. సినిమాలలో హీరోలాగా ఆరోగ్యంగా, అందంగా ఉండేవాడు. ఇంజనీరింగ్ లోకి రాగానే పట్టు బట్టి రెండు లక్షలు విలువ చేసే మోటర్ బైక్ తల్లిదండ్రులను వేధించి కొనిపించుకున్నాడు. సెల్‌లో మాట్లాడుతూ, వేగంగా నడుపుతూ, మెట్రో పిల్లర్‌కు గుద్దుకొని ప్రాణాలు విడిచాడు. మీ అబ్బాయి అనారోగ్యముతో మీరు, మా తమ్ముడు వాడి అబ్బాయి కొవ్వు ఎక్కిన చేష్టతో శోకము అనుభవిస్తున్నారు” అన్నాడు సూర్యము.

“యేది యేమైనప్పటికి ఒక విషయము మాత్రము నిజము. ఇపుడు రకరకాల కొడుకుల కధలు విన్నాము. వాళ్ళందరి కంటే రాజశేఖరము గారి కొడుకు పెట్టే కష్టము కష్టము కాదు. అది కేవలము దైవికము. ఇందులో ఎవరి తప్పులేదు. ఎవరి కష్టము వారికి పెద్దది కావచ్చు. అలాగే పక్క వాడి కష్టము తమ కష్టము కన్నా చిన్నగా కనబడవచ్చు” అన్నాడు రఘుపతి.

“నిజమే కావచ్చు, కానీ ఇలాంటి కష్టము ఎవరికీ రాకూడదు, దీని వల్ల మేము పడే నరకము కంటే వాడు పడే నరకమే ఎక్కువ” రాజశేఖరము.

“ఉన్నట్టుండి ఈ చల్లని సాయంత్రం మన డిస్కషన్ విచిత్రముగా కొడుకుల దౌర్జన్యము పైన, సన్ స్ట్రోక్ పైన నడిచింది. ఈ రోజు సన్స్ డే అయితే కాదు కదా” అన్నాడు వాతావరనాన్ని తేలిక జేస్తూ జోసఫ్.

“ఇదంతా చూస్తుంటే చిన్నప్పడు మనము చదువుకున్న ‘కొడుకుల్ పుట్టరటంచు..’ అన్న ధూర్జటి గారి పద్యము గుర్తుకు వస్తుంది” కామేశ్వరరావు.

“సంభాషణలో పడి చాలా సమయమే గడిపాము. పదండి వెళదాము. చీకట్లు పడుతున్నాయి” రాజశేఖరము.

అందరూ తమతమ ఇండ్లకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వారందరూ పార్క్ గేట్ వైపు నడిచారు. అక్కడ ఒక పిల్లవాడు తండ్రి భుజలపైన తలపైకి ఎక్కే ప్రయత్నము చేస్తున్నాడు.

“రేపటి రోజులలో తండ్రి తలపైకి ఎక్కి ఊరేగడానికి ఇప్పటి నుండే ప్రాక్టీసు చేస్తున్నట్లున్నాడు” అన్నాడు ముకుందము.

“ఔను! నిజమే!” అన్నట్లుగా అందరూ నవ్వుకుంటూ ముందుకు సాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here