కొడుకులు – పోకడలు

0
3

[dropcap]రా[/dropcap]ఘవరావు ప్రభుత్వ ఉద్యోగం చేసేరు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆ రోజుల్లో జీతాలు చాలా తక్కువ. పిల్లల్ని పెంచడానికి చాలా శ్రమ పడ్డారు. తనను మించి మంచి అంతస్తుకు వాళ్ళు ఎదగాలని ఆయన కోరిక. అద్దె ఇల్లే. ఎలాగో నెట్టుకొచ్చేరు. పిల్లల్ని కాన్వెంట్ బడికి పంపేరు. దగ్గర వుండి చదివించేరు.

సాయిరాం పెద్దవాడు. నాన్న మాట విని, ఆ ప్రకారం నడుచుకొన్నాడు. అప్పుడప్పుడు నాన్న కఠినంగా వున్నా మనస్సులోనే ఏడ్చుకొని, పైకి నోరు మెదపలేదు. తల్లి పార్వతి పిల్లల్ని బ్రతిమాలేది. “నాన్న మాట వినండి. మావి అరకొర బ్రతుకులు. మీరు వృద్ధిలోకి రావాలని ఆయన తపన. ప్రేమ లేక కాదు. ఎక్కువయ్యే ఇలా – బయటకు కఠినంగా వున్నారు” అనేది. ఏం కావాలన్నా అమ్మ దగ్గరే – కోపాలు, తాపాలు ఆమెకే చెప్పేవారు.

పదో తరగతి నెగ్గంగానే వారిని సంప్రదించకుండా, వాళ్లకు లెక్కల గ్రూపు ఇప్పించేరు. దెగ్గరగా  వున్న జూనియర్ కాలేజీలో చేర్చేరు. ఆ రోజుల్లో మన రాష్ట్రంలో ‘ఎమ్‌సెట్’ పరీక్ష ప్రొఫెషనల్ కోర్సుల అర్హత కోసం నిర్వహించేవారు. ఆ పరీక్ష మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగేది. సాయికి పదివేల లోపు రాంక్ వచ్చింది. కొంచెం ఖర్చయినా ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చేరు.

సాయిరాం బాధ్యతగా చదివేడు. రాఘవరావు లోకం తెలిసిన మనిషి. తల్లిదండ్రులంతా వారి పిల్లల్ని అమెరికా పంపి ఎం.స్. చేయించే రోజులవి. తనకు ఒక ప్రమోషన్ వచ్చింది. వేరే చిన్న పనులు చేసేవారు. కనుక బ్యాంకు లోను పెట్టి సాయిరాంను పై చదువులకు అమెరికా పంపేరు. సాయిరాం అక్కడ చదువు పూర్తి చేసేడు. చదువుకుంటూ పక్కనే ఏవో చిన్న చదువులు చెప్పి సంపాదించుకొనే అవకాశం వుండే దేశం గనుక, సాయిరాం తండ్రి మీద ఎక్కువ ఆధారపడకుండా పనులు పూర్తి చేసుకున్నాడు. అలా రాఘవరావు కల నెరవేరింది. అక్కడే వెంటనే ఉద్యోగం లభించింది సాయికి. ఇంకేం! రాఘవరావుకు ఆనందమే ఆనందం.

నెల జీతం అందుకున్నది మొదలు “నీకు స్టడీ లోన్ తీసికున్నాను. బ్యాంకుకు కట్టాలి. డాలర్లు పంపు” అని ఫోన్లో చెప్పేవారు. లోన్ తీరింది. అయినా ఇంట్లో వస్తు సామగ్రి – A.C., సోఫాసెట్లు వంటివి కొనాలని ప్రతి నెలా సాయిరాంను డబ్బులు పంపు అని అడుగుతూనే ఉండేవారు. ఓ చిన్న ఫ్లాట్ కొనుక్కున్నారు.

రెండో కొడుకు వరుణ్. సాయికి పూర్తి వ్యతిరేక స్వభావం. కోపం, ఆవేశం పాళ్లు ఎక్కువే – అవును మరి నాన్న పోలికలు! తండ్రితో వాదనకి దిగి ఘర్షణ పడేవాడు. అయితే తండ్రి మాటే నెగ్గేది. అతణ్ణి కూడా ఇంజినీరింగ్ చదివించి, అమెరికా పంపేరు, M.S. చేయడానికి. “ఒరేయి సాయీ – తమ్ముడి చదువు నీ బాధ్యత. స్టడీ లోన్ పెట్టి ఫీజులు కట్టేను. మిగతావి నువ్వు చూసుకో” అన్నారు. ఆలా వరుణ్ కూడా అమెరికాలో సెటిల్ అయ్యేడు.

కూతురి టైము వచ్చేసరికి డిగ్రీ అవగానే M.C.A. లో చేర్చేరు. పిల్లలు ముగ్గురికి చక చక వివాహాలు చేసేరు.

తరువాత ప్రారంభమయ్యేయి చిక్కులు. “డబ్బులు పంపు” అన్నప్పుడల్లా వరుణ్ “ఇప్పుడేమైంది? మీకేం బాధ్యతలున్నాయి? నా చదువు అప్పు అంతా నేను కట్టేసేను కదా” అనేవాడు. నెమ్మదిగా నాన్నకు ఫోన్ చేయడం తగ్గించేసేడు. ఒక వేళ తండ్రి బయటకు వెళ్లి ISD కాల్ చేస్తే ఒక్కోసారి తీసుకునేవాడు కాదు. తీసుకున్నా “నేను పనిలో వున్నాను. బాగానే వున్నాను” అని  ముక్తసరిగా చెప్పేవాడు.

వరుణ్‌కు మంచి సంబంధమే వచ్చింది. అందమైన చదువుకున్న భార్య లభించింది. తరువాతి పరిణామాలు మాత్రం మారిపోయేయి.  ఆ అమ్మాయితో వరుణ్ కాపురం కలహాల కాపురమే – వాళ్లకు ఒక పాప, బాబు కలిగేరు. అన్నట్లు పిల్లలంతా అమెరికాలోనే పుట్టేరు. అక్కడి సిటిజెన్‌షిప్ ఒక గొప్ప వరం కదా!!! దురదృష్టవశాత్తూ ఇద్దరూ మూగ పిల్లలు. వరుణ్‌కు ఆవేశం పెరిగి పోయింది. తీవ్ర ఒత్తిడితో  బాధ పడేవాడు. తండ్రిని, తల్లిని, భార్యని – నిందించేవాడు. ఆమె మీద చెయ్యి చేసుకునేవాడు. ఆమె చాలా పట్టుదలగల అమ్మాయి. ఆమె ‘అవునంటే అతడు కాదని’ – ఇలా ఎన్నాళ్లు? ఆమె ఇండియా వచ్చేసింది. విడాకులు ఇచ్చింది. “నీ పిల్లల్ని ఏం చేసుకుంటావో తీసుకుని పో – నాకేం సంబంధం లేదు – నాకు భరణం అక్కర్లేదు” అంది.

అనుకోని మార్పులకు వరుణ్ దిగ్భ్రాంతి చెందేడు. అమ్మ నాన్నలకు ఇవన్నీ చెప్పలేదు. పిల్లల్ని తీసుకొని తిరిగి అమెరికా వెళ్లిపోయేడు. ఇలాంటి స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని పెంచడం అక్కడ కొంత తేలిక. ఆనాటి నుంచి అతని ఆచూకీ ఎవ్వరికీ తెలియదు. అమ్మా నాన్నలకు, అన్న, చెల్లికి – ఏమీ తెలియదు..

తన తండ్రి తనకు బధ్ధ శత్రువు. తాను హాయిగా ఆనందంగా ఇంతవరకు ఏనాడూ జీవించలేదు. చిన్నతనం, కౌమార్యం ఆస్వాదించిన రోజులేవి లేవు. నాన్న బలవంతంగా చదివించేడు. భార్యతో సుఖపడిన రోజే లేదు. పిల్లలు!!! ఏం పిల్లలు. ఏమి ఖర్మ వల్లనో – ఇప్పటికి అయిదేళ్లయింది వరుణ్ జాడ తెలిసి. ఫోన్ నంబరు మార్చేసేడు. ఎక్కడ వున్నాడో భగవంతుడికే ఎరుక!!!

రాఘవరావుకు ముసలితనం వచ్చింది. డెబ్భయి దాటేయి. బాధపడుతూ ఉంటాడు. కొడుకులిద్దర్నీ దూరం చేసుకున్నాడు. ‘డబ్బు, డబ్బు’ తప్ప మరో ఆలోచన లేదు. వాళ్ళు వృద్ధిలోకి వచ్చేరు, సరే, కాని, బంధాల మాట!

సాయిరాం రెండేళ్లకోసారి ఇండియా వస్తాడు. పది రోజులు అమ్మ నాన్న దగ్గర ఉంటాడు. మిగతా ఇరవై రోజులు అత్తవారింట్లో గడుపుతాడు. అమ్మ వాళ్ళను అమెరికా రమ్మని పిలవడు. ఆపేక్ష ఎంత ఉందో తెలియదు. బయటకు తేలడు. బ్రతక నేర్చిన మనిషి.

రాఘవరావు స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర – ఈ విషయాలు చెప్పడానికి నామోషీ పడతాడు. మొదట్లో ఇంటింటికీ వెళ్లి – “నా కొడుకులను అమెరికాలో చదివించేను – అక్కడ ఉద్యోగాలు పొందేరు. డాలర్లు సంపాదిస్తున్నారు” అని గొప్పగా చెప్పేవాడు. ఇప్పుడు వాళ్లకి మాత్రం పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి కదా! మనో వ్యథ.

పార్వతి మరీను. కంట తడి పెట్టని రోజే లేదు. “మీరే వాళ్ళను తరిమి తరిమి కొట్టేరు – దూరం చేసేసేరు” అని అప్పుడప్పుడు ఏడిచి బాధపడుతూ ఉంటుంది.

***

లలిత.. ఉదయం ఏడయింది. కాఫీ తెచ్చుకుని ముందు గదిలో కూర్చుంది. వార్తా పత్రిక తిరగవేస్తూ కాఫీని ఆస్వాదిస్తోంది.

ఇంతలో ఫోన్ “హలో..” అంది.

అవతలనుండి సరళ గొంతు వినపడింది. “ఆంటీ! ఘోరం జరిగి పోయింది” అని ఏడుస్తూ బిగ్గరగా అంది సరళ.

“అమ్మకు రాత్రి సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. అర్ధరాత్రి ఎలాగో ఏంబులెన్స్  పిలిచి ఆస్పత్రికి తీసికొని వెళ్ళేము. అప్పటికే మరణించిందని డాక్టర్లు ప్రకటించేరు” అంది సరళ ఏడుస్తూ..

“అయ్యో! ఎంత అన్యాయం సరళా! నేను ఇప్పుడే బయల్దేరి వస్తున్నాను” అని ఫోన్ ఆఫ్ చేసింది.

లలిత భర్త ఆమెను జాగ్రత్తగా సరిత ఇంటికి చేర్చేరు. ఇంటి ప్రాంగణంలో నిర్జీవంగా పడి ఉన్న సరిత భౌతిక కాయాన్ని చూసి లలిత గొల్లుమని విలపించింది.

సరిత, లలిత – ఇద్దరూ మంచి స్నేహితులు. కాలేజీలో చదువుతూండగా మొదలయింది స్నేహం. ఇద్దరూ ఒకే విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. ఇంకా రెండేళ్లు సర్వీసు వుంది రిటైర్మెంటుకు.

సరిత హాస్య ప్రియురాలు. చలాకీగా – తను నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ సమయం గడిపేది. ఆమెను పలకరించి, ఆమె ఆప్యాయత పొందనివారు ఆ ప్రాంతంలో లేరంటే అతిశయోక్తి లేదు. ఇటీవల సడన్‌గా అనారోగ్యం చేసి, స్థూల కాయంవచ్చింది. B.P., షుగరు, ఉన్నట్లు తెలిసింది. వైద్యం జరుగుతోంది. ఆమె ఒక్క నిమిషం కూర్చోదు. ఇంటి పని, యోగా, నడక, ఉద్యోగం ఇలా దిన చర్య. ఇప్పుడు ఇంత హడావిడిగా నిష్క్రమించింది.

సరితకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి సరళ అమెరికాలో స్థిరపడింది. యథాలాపంగా ఇండియా వచ్చి అమ్మ ఇంట్లో ఉండటం అదృష్టమే. కొడుకు శశాంక. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం, అయిందంకెల జీతం.

పావనితో అతని వివాహం జరిగింది. శశికి, పావని ఇంటర్మీడియట్ చదువుతుండగా పరిచయమయింది. ఆమె కూడ ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగంలోనే వున్నది. నెమ్మదైన స్వభావం. మితభాషి. వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు అమ్మాయిలు. పావని పెద్దది.

శశాంక పరిచయమయ్యేక కొన్నేళ్ళకు చిన్నగా వాళ్ళ యింటికి రాకపోకలు సాగించేడు. పావని తల్లిదండ్రులు కూడా వీళ్ల వివాహానికి సుముఖంగా వున్నారు. మరి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేక వివాహం కోసం సంప్రదించవలసిన సమయం వచ్చింది.

ఓ రోజు – సరిత, ఆమె భర్త నారాయణ రావుతో భోజన సమయంలో – శశాంక అన్నాడు “అమ్మా, నాన్నగారూ – నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. మన వాళ్లే, నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం. వాళ్లదీ మంచి కుటుంబమే. ఆమె కూడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. వచ్చే ఆదివారం ఆమె తల్లిదండ్రులు మనింటికి వచ్చి మీతో మాట్లాడుతారు” అన్నాడు.

సరిత కొంచెం ఆశ్చర్యంగా చూసింది. కానీ నారాయణ రావు కళ్లతో వారించేడు. “సరే శశీ, చాలా సంతోషం. అలాగే కానీ” అన్నారు.

ఆ విధంగా శశాంక పావనిల వివాహం జరిగింది. సరిత హడావిడికి అంతు లేదు. పెళ్లి నిశ్చయం కాగానే తమ ఇంటిపై మరో అంతస్తు ఇల్లు కట్టించింది. రేపు కొడుకు, కోడలు హాయిగా కావాలంటే మేడ మీద ఉంటారని ఆమె ఉద్దేశం. ప్రోవిడెంట్ ఫండ్ లోన్ తెచ్చింది. బ్యాంక్ లోన్  తీసికొన్నది.

పెళ్లయిన నెల రోజులు ఇట్టే గడిచేయి. బంధువులు, రద్దీ, తిరుపతి మొక్కు, హనీమూన్ వగైరా వగైరా..

ఓ రోజు శశాంక పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నాడు. చాల పెద్ద సూట్ కేస్ అది. “ఏదైనా క్యాంపు వుందా శశీ” అంది సరిత ఆత్రంగా.

“లేదమ్మా, ఇక్కడ నించి మా ఆఫీసులు చేరుకోడానికి కనీసం గంటన్నర పైన బస్సుల్లో తిరగాల్సి వస్తోంది. రోజూ క్యాబ్ అంటే చాలా ఖర్చయి పోతోంది. పైగా పావనికి, నాకు వేళలు కుదరటంలేదు. కనుక ఆఫీసులకు దగ్గరలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసికున్నాను. అక్కడ వుంటాము” అన్నాడు నిదానంగా.  సరిత అవాక్కయింది. అలా – శశాంక ఇంట్లోనించి వెళ్లిపోయేడు.  రెండు రోజులు ముందుగానే పావని పుట్టింటికి వెళ్లింది. మొదట్లో రోజుకో సారి ఫోన్ చేసేవాడు. పదిహేను రోజులకోసారి వచ్చేవారు – ఇద్దరూనూ; మధ్యాహ్నం భోజనాలు అయ్యేక సాయంత్రం వెళ్లేవారు. తర్వాత రాకపోకలు తగ్గేయి. దూరాలు పెరిగేయి – భౌతికం గానూ, మానసికం గానూ కూడా.

పావని ఇదివరకు వలె లేదు. అందరి ఎదురుగానే భర్త మీద చేయి వేసి మాట్లాడటము, ప్రక్కనే కూర్చుని, నలుగురిలో గారాలు పోవడము – ఇలా ఉంటోంది ప్రవర్తన.

కొద్ది రోజల తర్వాత శశాంక ఫోను “అమ్మా, ఇక్కడ మేం ఓ ఫ్లాట్ కొనుక్కున్నాము. మా అత్త గారింటికి దగ్గరలోనే. పావని చెల్లెలు కూడా తీసికొన్నది. వచ్చే పద్నాలుగో తేదీ గృహ ప్రవేశం. మీరు రండి. అడ్రస్ పెడుతున్నాను” అన్నాడు. సరిత నిర్ఘాంతపోయింది. శశాంక, కోడలు తన దగ్గరే స్వంత ఇంట్లో ఉంటారన్న కలలు నెరవేరలేదు. దుఃఖం కట్టలు తెంచుకుంది. నారాయణ రావు ఆమెను ఓదార్చేడు. గృహప్రవేశానికి వెళ్ళేరు.

అతిథులను చూసినట్లే అమ్మ, నాన్నలతో శశాంక ప్రవర్తించేడు. పెద్దరికం, పెత్తనం, అన్నీ పావని తల్లిదండ్రులే. వారు కూడా మునుపటివలె కాదు. “వచ్చేరా”, “కూర్చోండి” – అంటూ ముక్తసరిగా మాట్లాడి, మిగత బంధు మిత్రులతోనే కబుర్లు. సరిత, నారాయణ రావులది ప్రేక్షక పాత్ర!!!

ఇలా శశాంక దూరమయి పోతున్న కొద్దీ సరిత ఒత్తిడికి గురి అయింది. ఆరోగ్యం దెబ్బ తిన్నది. రెండేళ్లు గడిచేయి. లలిత ఎన్నో సార్లు సరితతో “ఏం చేస్తాం, ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తన చిత్రంగా ఉంటోంది. నిత్యం వార్తాపత్రికల్లో అవే చూస్తున్నాం. ఆరోగ్యం పాడు చేసుకోకు” అని ఎంతో బ్రతిమాలేది.

ఒక రోజు అనుకోని పనిగా శశాంకను చూసింది లలిత. కారు ఆపి, “హలో, ఆంటీ బాగున్నారా” అని పలకరించేడు. “ఆ బాగున్నాను – అవునూ, అర్జెంటు పని మీద వున్నావా. కాసేపు నీతో మాట్లాడాలి. చాలా రోజులైంది మనం కలిసి. పక్కనే పార్కుకు వెళదామా” అంది లలిత.

“సరే, కారు ఎక్కండి” అన్నాడు శశాంక.

ఓ బెంచీ మీద కూర్చున్నారు. “అవునూ, శశీ, చనువుతోనే చెప్తున్నాను. అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది. బాగా బెంగ పెట్టేసుకుంది నీ గురించి..” అంది.

“నేనేమి చెయ్యను ఆంటీ – పుట్టినది మొదలు 28 ఏళ్లు వచ్చే వరకూ అక్కడే వున్నాను. హైదరాబాదు మహా నగరం – చదువంతా ఇక్కడే. ఉద్యోగమూ ఇక్కడే..”

గొంతు సవరించుకున్నాడు. “పావని తన తల్లిదండ్రులకు మాట ఇచ్చిందిట. తాను దగ్గర వుండి వాళ్ళను చూసుకుంటానని – కనుక ఇది తప్పదు” అన్నాడు శశాంక.

“సరే” అన్నాను. “ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. హాయిగా వున్నాం. వాళ్ల చెల్లి, భర్త కూడా అదే అపార్టుమెంటులో వున్నారు. వాళ్లకు ట్రాన్స్‌ఫర్ అవుతుందిట. అప్పుడు మేము అందులోకి మారుతాం. ఇదేమైనా ఘోరమైన నేరమా” అన్నాడు

“కాదులే.. కానీ – అమ్మ నాన్న ఒంటరిగా వున్నారు” అంది లలిత.

“నేనేం చెయ్యను? మేం హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. దేశ విదేశీ పర్యటనలు చేసి వస్తున్నాం. బయట తింటున్నాం. పని వేళల్లో మార్పులు కదా. పైగా పావనికి కెరీర్ చాలా ముఖ్యం. తర్వాత ఆమె అమ్మ, నాన్న.. ఇంకా ఏవో కోర్సులు చేస్తున్నది. నైపుణ్యాలు పెంచుకుంటోంది”.

“మరి, మీకు పిల్లలు – పెళ్లయి ఐదేళ్లు దాటేయి కదా!” లలిత అడిగింది.

“ఆ విషయం మేం ఇంత వరకు చర్చించనే లేదు. దేశం నిండా ఎంత జనాభా!!! చూడండి రోడ్లన్నీ కిటకిట! నిత్యం ట్రాఫిక్ జాములు – మనకే పిల్లలుండాలా – చూద్దాం” అన్నాడు – కొంచెం ఆవేశంగా. “అది ఇప్పట్లో అసంభవం. నన్ను కంపెనీ ఆర్నెల్లు జర్మనీ పంపిస్తోంది. భవిష్యత్తు మాకు కీలకం” అన్నాడు. లలిత నిశ్చేష్టురాలయింది.

కాసేపు సరదాగా కబుర్లు చెప్పి – “సరే శశీ – వస్తాను” అంది.

ఈ విషయాలేవీ సరితకు చెప్పలేదు లలిత. ఈ లోపల ఇలాగ..

***

రెండు కుటుంబాలు – ఇద్దరు కొడుకులు – కొత్త పోకడలు.

ఆధునిక యుగం కదా – ఇంకా ఎన్ని చూడాలో మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here