తేది: డిసెంబర్ 14,
గుల్బర్గా (కర్నాటక)
“………………….?”
ఏమని సంభోదించాలో తెలియటం లేదు. మీరు నన్ను మరిచిపోయారనుకుంటా!.. ఎందుకనో.. ఇంకా, మీరు నన్ను మరిచిపోకపోవచ్చనే నమ్మకం… కొడిగట్టిన దీపంలా ‘మిణుకుమిణుకు’ మంటుంటే, ఆశ చావక… మీకీ ఉత్తరం రాస్తున్నాను. సింగపూర్‌లో స్థిరపడిన ‘అతని’తో.. నాకు వివాహం జరిగిన విషయం… మీకు తెలియదనుకుంటా..! ఎంత దూరమయినా, భర్త చెంతనే భార్య వుండటం ధర్మం కదా..! నేనూ.. అక్కడికే వెళ్లిపోవాలనుకుంటున్నాను. మళ్లీ… ఎప్పుడు ఇండియా తిరిగి వస్తానో తెలీదు. అందుకే.. చివరిసారిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను.
మిమ్మల్ని, మీ భార్యాపిల్లల్ని…. చూసి, ఒక్కరోజు (మాత్రమే సుమా!) మీ ఆతిథ్యం స్వీకరించి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. నాకీ అవకాశమిస్తారా..? చొరవ తీసుకుంటున్నందుకు.. ఏమి అనుకోకండి.
మరో ముఖ్యవిషయం – నేను మీ ఆవిడతో ‘మన ప్రేమ’ గురించి.. ఏమీ చెప్పను. మీరూ మాటవరసక్కూడా..! ఎందుకంటే, నేను.. మీ ‘ప్రేయసి’నని మీ ఆవిడకి తెలిస్తే పాపం.. బాధపడుతుంది..!
ఇంకేమయినా విశేషాలుంటే, నేనొచ్చాక.. తీరిగ్గా మాట్లాడుకుందాం.. (మనిద్దరమే సుమా..!) మీరు నా కోసం రైల్వే స్టేషన్‌కో.. బస్ స్టేషన్‌కో.. రానక్కరలేదు. మీ అడ్రస్ నా దగ్గర వుందిగా..! సరాసరి మీ ఇంటికే వచ్చేస్తాను. నేనొచ్చేసరికల్లా.. మీరు ఇంటివద్దనే వుంటే చాలు. అన్నట్టు… నేనొచ్చేది, మా పండుగ రోజయిన ‘క్రిస్మస్-‘ డేకి అయిదు రోజుల ముందు..!
ఇక వుంటా.. ఊహూ … వస్తా..!
మీ మరిచిపో(యిన)ని జ్ఞాపకం
వినోలియా
***
వినోలియా –
చేదు మిగిల్చిన తీపి జ్ఞాపకం..!
ఎన్నో.. ఎన్నెన్నో… గ్రీష్మాలు గడిచిపోయేక…
మళ్లీ వసంతం వస్తున్నట్టు… కోకిల ‘కుహూ’ రావంలా.. ఉత్తరమొచ్చి వాలితే, మనసు పులకరించిపోయింది..! హరివిల్లుని చూసి, కుతూహలంతో పురివిప్పిన నాట్యమయూరిలా.. మనసు నృత్యం చేసింది.
శిశిరం ఆకులు రాల్చుతుందని తెలిసినా, ఒక్క వాన చినుకు పడితే చాలు.. చెట్టు చిగురించటానికి ‘తహతహ’ లాడకుండా వుంటుందా..?
వినో.. నువు వచ్చి మెరిసేది, క్షణకాలమేనని తెలిసినా.. ‘మెరుపు’ కంటే తేజోవంతంగా నా గుండెల్లో నిలిచిపోవాలని మనసు.. ఈ క్షణమే నీ రాకకోసం.. నా మనసులోకి వచ్చిన ఉగాది పండుగలా.. మామిడాకు తోరణాలు కడుతోంది..!
నింగిని తాకే పందిరి వేసి, నేల మిగల్చని పీట వేసి భాజా భజంత్రీలతో…!
అవునూ..! నీకు పెళ్లయిందన్నావు కదూ..?! పరాయిస్త్రీని ఇంకా ప్రేమించొచ్చా..? తప్పు కదూ..?!
ఎందుకనో… నీ పట్ల ప్రేమని ‘తుడిచివేయ’ లేకపోతున్నాను-వినో..! ఏం చేయనూ..??
నీ ఉత్తరం రేపిన అలజడికి, మనసు కుదుట పడలేకపోతుంది..! నా భార్యాపిల్లల్ని చూస్తానన్నావు కదూ…!
అంటే, నీ కంటే అందగత్తెని.. నేను పెళ్ళిచేసుకోక పోతాననుకున్నావా..? లేక, నిన్నే తలుచుకుంటూ, జీవితాంతం ‘ఒంటరి’గా మిగిలిపోతాననుకున్నావా..?
నిజమే! అనుకునే వుంటావు. అందుకే.. ఇంతకాలానికి నీలో పెరిగిపోయిన జెలసీ, ఎసిడిటీని… చంపుకోలేక, ‘మానసిక తృప్తి’ కోసం, కేవలం.. ‘శాటిస్ఫైక్షన్’ కోసం.. నన్నూ, నా కుటుంబాన్ని చూడటానికి వస్తున్నావ్..?!
హు.. ఎంత పిచ్చితనం.. వినో..! నేను.. నీ మనసునీ, ఆలోచనల్ని.. పసిగట్టలేకపోతాననుకున్నావా..? నో- నెవర్, ఎన్నటికీ.. జరగని పని..!
చూపిస్తాను – నీకంటే అందమైన భార్యని, గుణవంతురాలైన భార్యని.. నీకు చూపిస్తాను..!
నా భార్యని చూసి, అప్పుడు.. నీ గుండె కరిగేలా బాధపడు..! తిరిగి సర్దుకోలేని ‘పొరపాటు’ కు.. నీ జీవితకాలం పాటు, ఏడుస్తూ కూచో..!
నీవొచ్చేది, ఎల్లుండే కదూ..? సరే వెల్కమ్..!
***
ఇంటిముందు ఆటో వచ్చి ఆగిన శబ్దమయితే.. కిటికీలోంచి తొంగిచూశాను. ఇంకెవరు..? వినోలియా..!
కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి..! ఆ అందం.. హుందాతనం.. అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం మార్పులేదు. పైగా కాస్త… నునుపు తేలింది.
గోడ పై వున్న నేమ్ ప్లేట్‌ని, ఇంటి నెంబర్లనీ.. తన దగ్గరున్న అడ్రస్‌తో సరిపోల్చుకుని, ఆటోకి డబ్బులిచ్చింది వినోలియా. లగేజీతో లోనికస్తుంటే, ఎదురెళ్లి స్వాగతం పలికాను.
“ముందు కుడికాలు పెట్టి, రావాలా..?” చిరునవ్వు చిందుస్తూ, నర్మగర్భంగా అడిగిందామె.
నా కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ, ముఖ కవలికల్ని బట్టి.. మనసులోని భావాల్ని పసిగట్టడానికి ప్రయత్నిస్తోందామె. ఆమె మెడలోని శిలువ గుర్తు గల మంగళసూత్రం.. పైట చాటున అస్పష్టంగా కనిపిస్తోంది.
“ఇప్పుడు.. ఏ కాలు పెట్టి వచ్చినా, ‘ఎడమకాలు’ పెట్టినట్టే…!”
నేనేం తక్కువ తిన్నానా..? నర్మగర్భంగానే చురకంటించాను..!
నా మాటకి ‘షాక్’ తిన్నట్లుంది. లేదా, కాస్త నొచ్చుకుందేమో..! ఆమె కళ్లలో కొంచెం బాధ కనిపించింది, వచ్చీ రాగానే మాటలతో నొప్పించటం.. నా కిష్టమనిపించలేదు.
పాపం..! నాకోసం.. అంతదూరం నుంచి వచ్చింది. ఎక్కడి గుల్బర్గా..? ఎక్కడ జగిత్యాల..? రైళ్లు మార్చి.. బస్సులు మార్చి.. తిరిగి తిరిగి ఇక్కడికి వస్తే..? తనూ.. రాగానే చురకంటించాలా..?
ప్చ్..! ఏం చేస్తాం..? ఆమె మాత్రం.. అడుగు పెడుతూనే ‘గతం గుర్తొచ్చేలా’ అడగాలా..??
“అంటే నేను రావట.. మీకిష్టం లేదూ..?” తీక్షణంగా చూస్తూ అడిగిందామె.
ఒక్కసారిగా ఉక్రోషంతో అడిగే సరికి, క్షణం తడబడ్డాను. ఏమని బదులు చెప్పాలో తోచక.. మాటల కోసం వెతికాను.
“అలానీ కాదు.. మరేమో.. ఏదో.. తమాషాకి అన్నాను. జోక్ గా అన్నాను. బాధ కలిగిందా..? సారీ..సారీ..!”
‘సారీ’ చెపితే ఎంతటి కోపమైనా.. ఇట్టే కరిగిపోతుందని తెలుసు. అందులోనూ.. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన యువతికి.. తన ప్రియుడి ‘చిన్న ఫీలింగ్’ కూడా కోపాగ్నిని చల్లార్చే నీటి బిందువే..!
ఆమె ముఖం ప్రసన్నమయింది..! మెల్లిగా.. చల్లని వెన్నెల కురిసే జాబిల్లిలా విచ్చుకుంది. పెదిమలపై చిరునవ్వు.. హరివిల్లె విరిసింది.
నేనూ.. గుంభనంగా నవ్వేసి, ఆమె లగేజీని తీసుకుని.. లోనికొచ్చేను.
మూడు గదుల ఇల్లే కాబట్టి, ఆమెని బెడ్ రూమ్‍లో కూచోబెట్టాను.
అప్పటికి.. మా ఆవిడ వచ్చి, చిరునవ్వుతో పలకరించిందామెని.
వినో..కి పరిచయం చేశాను- “మా ఆవిడ. పేరు వసంతలక్ష్మీ..”
భోజానాలయ్యాక, రిలాక్స్డ్‌గా బెడ్ రూమ్‌లో కూర్చున్నాం. మా ఆవిడ వంటగదిలో సామాను సర్దుకుంటోంది.
వినో.. టేప్ రికార్డర్ ఆన్ చేసింది. ఏదో సినిమా పాట లో-వాయిలో వినిపిస్తుంది. ఆమె శ్రద్ధగా వింటోంది. నేనామెనే మౌనంగా చూస్తున్నాను.
మబ్బు పట్టిన ఆకాశంలా వుంది ఆమె ముఖం.. ముంగురులు ఫ్యాన్ గాలికి ఎగురుతున్నాయి. కళ్లలో ఏదో తేజస్సు..! టేప్లోని పాటని నేను ‘గుర్తించటానికి’.. వాల్యూమ్ పెంచింది.
“పొరపడితివో… త్వరపడితివో…
పోతేపోనీయ్ అనుకుంటివో…
చేశావు మా పెళ్ళి-స్వర్గాన….
మరిచావు… అది వ్రాయ మా నుదుటన…
ఓ బ్రహ్మయ్యా…. తప్పు నీదయ్యా….!”
పాట వింటున్న కొలదీ.. గుండెలో కెలికినట్టనిపించింది. మనసు పొరల్లో దాగివున్న గతం తాలూకు ‘ప్రేమస్మృతులు’ రియాక్టయ్యాయి.
వినో.. అందించిన ‘తియ్యని అనుభూతి’ని గుర్తుకు తెచ్చింది. చేజారిపోయిన హృదయం.. తిరిగి కళ్ళ ముందు కనిపించినట్లు… ఆగిపోయిన ప్రేమగీతం.. సుప్రభాతమై మళ్ళీ వినిపించినట్టు…
“ఎక్కడో.. మన ప్రేమలో ‘చిన్న పొరపాటు’ జరిగింది కదూ..?” అడిగిందామె.
మౌనంగా ఆమె వంకే చూశాను. నానుంచి ఎలాంటి బదులు వస్తుందోనని ఎదురు చూస్తోందామె. ఏమని చెప్పాలో తోచక, మూగవాడిలా.. దోషిలా.. చూస్తుండిపోయాను.
“నిజం.. రామూ..! నాకయితే విడదీయరాని బంధంలా ప్రేమించుకున్న మనం తిరిగి కలుసుకోలేనంత ‘దూరం’గా… వుండిపోతున్నామేమో అనిపిస్తోంది..!”
“……………….?!…”
“నేను మొదటిసారిగా మీ వర్క్‌షాపులోకి వచ్చింది- కేవలం.. ‘చెవి దుద్దులు’ చేయించటానికే..!
కానీ, ఆరోజు.. నుదుటిన, బుగ్గలపై.. అంటిన బొగ్గుల మసి, కుంపటిలోంచి ఎగిరిపడిన బూడిద.. మీ నల్లని కురులని ‘నెరిసిన జుత్తు’ని చేసింది. అప్పుడు.. విచిత్ర వేషదారునిలా కనిపించి, భలే నవ్వొచ్చింది.
నోటికి చేయి అడ్డు పెట్టుకొని, ముసిముసిగా నవ్వుతున్న నన్ను.. విచిత్రంగా చూశావు.
అందమైన బంగారు నగలు చేసే నీవు, నా బ్రతుకుని ‘బంగారుమయం’ చేస్తావనీ.. తొలిచూపులోనే ప్రేమించాను..
కానీ, కుంపటిలోకి వచ్చిన బంగారం.. కుంపటికే శాశ్వతం కాదు, ‘తాను శుద్ధి అయ్యేక’.. చివరికి బూడిదే మిగులుతుందని.. నీవూ నిరూపించావ్..! ”
“………………?!”
“గాయపడిన నా హృదయానికి.. ఒక్కోమాట గుండు సూదులతో గుచ్చినట్టనిపించింది. రక్తం స్రవిస్తున్న గాయంపై కారంపొడి జల్లితే, ఎవరు మాత్రం.. నోరు మూసుక్కూర్చుంటారు..?
“ప్రేమించినపుడు అడ్డురాని ‘మతం’.. మన పెళ్లికి అడొస్తుందని ‘పిరికిమందు’ నూరిపోసింది, నువ్వు కాదా..?”
“………….?! ”
నా మాటకి ‘షాక్’ తిన్నట్టు.. ఆందోళనగా చూస్తోందామె.
“ధైర్యంగా.. ఎచటికయినా వెళ్లి, హాయిగా బ్రతుకుదామని చెబితే.. ట్రాన్స్ఫర్ అయిన మీ నాన్నతో పాటు వెళ్లిపోయి, నన్ను ‘వదిలేసింది’ నువ్వు కాదా..?”
“……………!?”
ఇంతలో మా అవిడ వచ్చి, స్వీట్స్ అందించింది మా ఇద్దరికి.
“వసూ..! నువ్వూ తెచ్చుకొని, మాతో పాటు.. కూచోవోయ్..” లోనికి చూస్తూ కేకేశాను ఆప్యాయంగా.
వర్షం కురియడానికి సిద్ధంగా వున్న మేఘంలా.. వినో.. కనుకొలుకుల్లో నీరు ఉబికింది.
“జరిగిందేదో జరిగిపోయింది. ఒకరినొకరు ‘మాటలనుకోవటం’ వల్ల.. ప్రయోజనమేముంది? ఈ సినిమా పాటలాగే.. ఆ బ్రహ్మ మన నుదుటన వ్రాయడం మరిచిపోయాడు. అది ‘ఆయన’ తప్పే..!”
ఈ మాటతో.. ఆమె ముఖం ప్రశాంతమయింది.
“ఇకమీదట.. మిమ్మల్ని ‘రాము’ అని కాకుండా, ‘చారి’ అనే పిలుస్తాను. ఎందుకంటే ఒక్క ‘సీత’కే పరిమితం కాలేదుగా..?” చిన్నగా నవ్వుతూ చెప్పింది వినో.
నేనూ నవ్వేను రిలీఫ్‌గా. “సరే, నీ ఇష్టం.. నన్నే కాదు, ‘రామబ్రహ్మచారి’ అనే నా పేరును కూడా ‘ముక్కలు’గా చేస్తావన్నమాట..!”
వసంతలక్ష్మి వచ్చి కూర్చుంది ఆమె ప్రక్కన.
“సారీ…! నువ్విలా నొచ్చుకుంటావనుకోలేదు, చారీ…!” చెప్పింది వినో… లయబద్దంగా నవ్వుతూ. వసంతలక్ష్మి గుంభనంగా నవ్వేస్తూ చెప్పింది– “ఈ వసంతం వచ్చేక.. నొచ్చుకోవటాలు, ఫీలవ్వటాలూ.. ఏం లేవూ- అంతా ‘హాపీ’యే..!”
నవ్వుతూనే వినో..ని అడిగేను- “మరి నిన్ను.. వి’NO’లియా.. అని పిలవమంటావా..?” ఆ మాటకి ఆమె కళ్లు మెరియటం, పెదిమలపై చిరునవ్వు విరియటం.. ఒక్కసారిగా జరిగిపోయింది..!
వాటి వెనుక ‘అసలు భావం’ ఏమిటో నాకు బోధపడలేదు.
వసంతలక్ష్మి మా ఫోటో ఆల్బమ్ చూపించింది ‘వినో’కి. దాంట్లోని పిల్లల ఫోటోలని చూసి, అడగబోతుండగా.. వసంతే చెప్పింది. “పిల్లలు… హాస్టల్‌లో వుండి, చదువుకుంటున్నారు…”
మా ఇంటి ప్రక్కనే వున్న గుడిలోని గంట మ్రోగింది. బ్రీఫ్‌కేస్ పట్టుకొని వెళ్లపోతున్న ‘వినో’ తో.. డ్రమటిక్‌గా చెప్పింది వసంతలక్ష్మి.
“విన్నావా..? గుడిలోని దేవుడు కూడా, గంట కొట్టించి.. నీకు ‘టాటా’ చెపుతున్నాడు..!”
నా భార్య సమయస్ఫూర్తికి నవ్వొచ్చింది. ఆ జోక్ అంతగా నచ్చినట్లు లేదు. ఎందుకనో.. కాస్త విముఖతగా నావంక చూసింది వినో.
“అపారమైన ‘భక్తి’ని కూడా, ఆస్తికులు ఆదరిస్తారనటానికి నిదర్శనం- ఆంజనేయ స్వామికి గుడి కట్టి, కొలవటం..! అలాంటి రామ ‘ప్రేమదాసుడి’ దీవెన.. చాలా మంచింది” చెప్పేను కాస్త నవ్వుతూ.
ఆమె ‘వెళ్లిపోతుందనే’ బాధ.. మనసులో మెదులుతున్నా.. ముఖంలో కనబడకుండా.. పెదిమలపై ‘చిరునవ్వు’ని అతికించుకున్నాను.
“..! ఏం చేస్తాం..? వెళ్లిపోయేటప్పుడు కూడా బ్రహ్మచారి దీవెనలే ప్రాప్తం..!” అందామె నిర్లిప్తంగా.
ఆ మాట ఎందుకన్నదో ఆలోచిస్తున్నాను. నా వంకే నిర్వికారంగా చూస్తూ, దిగులుగా ఆటో ఎక్కింది వినో.
“బస్టాప్ దగ్గరేకదా..! మీరూ వెళ్లిరండి..!” నాతో చెప్పింది వసంతలక్ష్మి, నాకా విషయం స్ఫురించనే లేదు. వెంటనే.. మరబొమ్మలా ఆటో ఎక్కేశాను. వినో.. ప్రక్కన కూర్చున్నాక, ఆటో కదిలింది. “మీరొస్తారని తెలిస్తే, ఆటో వద్దనే దాన్ని..!”
“ఎందుకు…?”
“ఈ కాస్త దూరానికే, ఆటో ఎందుకు..? ఎంచక్కా.. ఇద్దరం నడిచివెళ్ళే వాళ్లం..! ఈ జన్మకి కనీసం.. ఏడు గజాల దూరమైనా, మీతో పాటు నడిచే అదృష్టం కలిగేది..!”
ఏమనాలో తెలియక, నిర్వికారంగా.. పైకి చూస్తూ పాట పాడాను.
“….. ఓ బ్రహ్మయ్యా..! తప్పు నీదయ్యా..!”
తన వానిటీ బ్యాగ్ లోంచి.. ఓ కవర్ తీసి, నా షర్ట్ జేబులో పెట్టి చెప్పిందామె. ”ఈ ఉత్తరం.. నేను వెళ్లిపోయేక, ఇంటికెళ్లి.. తీరిగ్గా చదువుకో..”
బస్టాప్‌లో ఆటో దిగేసరికి, వరంగల్ వెళ్లే బస్సు ప్లాట్‌ఫామ్ నుంచి కదులుతోంది. హడావుడిగా వచ్చి బస్సెక్కింది వినో. ఫుట్ బోర్డ్ మీద నిలబడి తదేకంగా చూస్తూ వుంది. చివరిసారిగా చూస్తున్నట్టు..!
‘నా రూపాన్ని’ తన కళ్లల్లో ప్రతిష్ఠించుకున్నట్లు..! చూస్తుండగానే బస్సు నానుంచి.. దూరంగా.. లాక్కెళ్లిపోయింది. నా మనస్సు.. ఆమెతో పాటు వెళ్లిపోయినట్లనిపించింది.
***
ప్రాణమున్న శవంలా.. కదిలి, ఇంట్లోకి వచ్చాను.
“ఆమె వెళ్లిపోయిందా..?” నన్ను చూడగానే అడిగింది వసంతలక్ష్మి.
“ఊ! కాజీపేట వెళ్ళి ట్రయిన్‌లో వెళ్లిపోతుంది” నిరాసక్తిగా చెప్పాను. వసంతలా ఎందుకడిగిందో నాకు తెలుసు..! జేబులోంచి డబ్బులు తీసి ఆమెకిచ్చాను.
అప్పుడు.. షర్ట్ జేబులోంచి ఉత్తరం కింద పడింది.
అది ‘వినో’ నా జేబులో పెట్టినది. విప్పి, చదివాను.
***
“నా మానస కోవెలలోని దైవమా…!
మీకు ఉత్తరంలో వ్రాసినట్లు.. నాకు ‘పెళ్లి జరిగింది’ అనే మాట అబద్దం!.. నా మెడలో ‘మంగళసూత్రం’ ఉండటం.. ఒక డ్రామా..!
నేను మిమ్మల్ని, మీ ప్రేమని.. మరిచిపోలేక పోయాను. మరొకరిని పెళ్లి చేసుకోలేకపోయాను. మనసొకరికి, శరీరం ఒకరికి ఇచ్చి నటిస్తూ బ్రతకటం నా వల్లకాదు.. అందుకే, ‘నన్’ గా మారి, జీవితం గడపాలనుకున్నాను.
ముత్తయి 7 – 7లో ఏముందో తెలుసా..?
అడుగుడి మీకియ్యబడును.
వెదకుడి- మీకు దొరుకును.
తట్టుడి-మీకు తీయబడును.
అడిగేను, వెదికేను, తట్టేను… కానీ ప్రయత్న లోపమో.. నా జీవన శాపమో.. మీతో ‘కలిసి’ బ్రతక లేక పోయాను.
మీరు మగవారు. మీ ‘మగబుద్ధే’ అంతా..! ఈ రోజు పేపర్ రాగానే, నిన్నటి న్యూస్ పేపర్ని పట్టించుకోనట్టుగా.. మరిచిపోయి, మరొకరిని పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని.. హాయిగా జీవితాన్ని గడుపుతారని.. తెలుసు…!
కానీ, ఎందుకనో.. చివరిసారిగా మిమ్మల్ని చూడాలనిపించింది. మీకు పెళ్ళయి, నాకు కాకుంటే.. ‘మీరు’ బాధపడుతారేమోనని.. అబద్దమాడి, మీ వద్దకిలా వచ్చాను. నేననుకున్నట్టుగానే జరిగింది..!
భర్త మనసులో మరొకరికి ‘స్థానం’ వుందని తెలిస్తే, ఏ భార్యా భరించలేదు. దయచేసి.. నన్ను మరిచిపోయి, మీ మనసులో ‘వసంతలక్ష్మి’కి స్థానమివ్వండి.
జన్మంటూ వేరే వుంటే, వచ్చే జన్మలో.. మనం తప్పకుండా పెళ్లి చేసుకుంటామని, కోరుకుంటున్నాను.
మరిచిపోయే పీడకల..
వి’NO’లియా…
***
ఉత్తరం చదవటం పూర్తికాగానే, మనసు విచలితమయింది.
తుఫాన్‌కి చిక్కుకున్న చెట్టు, నిలువెల్లా పడిపోయినట్టు… నేను నేలకొరిగిన ఫీలింగ్..!
అయ్యో!.. ఎంత పని చేశావ్ వినో? నేను బాధపడుతానని నాటకమాడావా..? ఉత్తరంలో వ్రాసినట్టు.. నిజంగానే నీకు పెళ్ళయిందనుకొని, నీవు బాధపడుతావేమోనని.. నేనూ నాటకమాడాల్సి వచ్చింది..! నిజం.. ఒట్టు..! నాకింకా పెళ్ళి కాలేదు..!! వసంతలక్ష్మి, పిల్లల ఫోటోలు.. నా డ్రామాలోని పాత్రధారులే..! వినో..! మనం ఎందుకు ప్రేమించుకున్నామో, నాకిప్పుడు అర్ధమయింది. ఒకే గూటి గువ్వలం.. మనం..! వినో..! నీకో విషయం తెలుసా..?! – ఆంజనేయస్వామి గుడి ప్రక్కనే వున్న ఇంట్లో ఎందుకున్నానంటే.. నేను (రామ) (బ్రహ్మచారి’నే కాబట్టి..! మరిచిపోవటం, ప్రేమించి.. మరొకరిని పెళ్ళి చేసుకోవటం… మగవాళ్ళకి మామూలే అనుకున్నావు కదూ..? కానీ, గాఢంగా ప్రేమించిన (ఆడ,మగ) ఎవరయినా.. త్వరగా మరిచిపోలేరు..!
మా ‘మగబుద్ధి’ ఏమిటో తెలుసా..? ఆడవారిలా.. మనసులోని బాధని మరొకరితో చెప్పుకోకపోవటం..! అంత త్వరగా ‘ఓటమి’ని అంగీకరించకపోవటం..!
ఎందుకంటే, మేం పురుషులం..! మాకున్న పురుషాహంకారం..!!
మా కంటిలో నీరు చూసి, ‘ఆడదాని’లా ఏడుస్తున్నావురా..! అని హేళన చేస్తారే కానీ, మాకూ ‘మనసు’ వుంటుందని.. గుర్తించరెందుకనో..?!
అయినా, ఈ ‘తప్పు’ నీది కాదులే..! ఈ సమాజంలోని మనుషుల ఆలోచనా ధోరణిది..!
టేపు రికార్డర్ చూడగానే, వినో.. గుర్తొచ్చింది. యధాలపంగానే.. ప్లే బటన్ నొక్కాను. నన్ను ఊరడిస్తున్నట్లుగా.. పాట వినిపిస్తోంది మృదువుగా.
“కూహూ.. కూహూ.. కోకిల రావే…”
ఏడాదికోసారి ఉగాది వస్తుంది.. కోకిల కూహూరాగాలు పలుకుతుంది.. నా జీవన వసంతంలోకి ఈ ఏడాదైనా కోకిల వచ్చేనా..!!
***
*The End *
LOVE never been End *