Site icon Sanchika

కోలన్న

[dropcap]రా[/dropcap]బోవు మూడు నెలల్లో మా ‘పాఠశాల వార్సికోత్సవాలు’ జరగబోతావుండాయి. దాండ్లలో భాగంగా యాటాలక్కనే ఆటపాటల పోటీలు, ఇతరత్రా కార్యక్రమాల సరీగే (పాటుగ) ఇంగా కొత్తగ ఏదన్న సేస్తే బాగుంటాది కదా! అని మా టూషను (లాల్‌సాబ్) సారు.. లీడర్లమైన నాతోన, మా ‘రమేషు’ గాడితోన వారం దినాల్నుంచి ఒగటే తీరంగ ఆలోసన సేత్తుండాడు. మన ‘రాజుల మండగిరి’ నుంచి సుమార్గ నలవై మంది పిల్లలు ఆ బళ్ళో సదువుతుండారు కదా… వాళ్ళందరితోన మనమంతా యప్పుడో మర్సి, మరుగున పారేసిన ఈ ‘కోలన్న ఆట’ ఆడిస్తే బాగుంటాది కదా! అంతే కాకుండ మన కళల్ని కాపాడుకునే ప్రయత్నం సేసినట్లయితాదని ఆలోసన సేసి, అదే మాట ఊర్లో నలుగురు పెద్దలతోన ఇశారించి సూస్తిమి.

వాళ్ళు- “దానికేం! పిల్లలకి ఒగ రొన్నెళ్లు తండ్లాడి నేర్పిచ్చినామంటే మన జీరంగులు కదా ఆడినట్ల ఆడి గెల్సరా..! కాకపోతే ఈ రోజుల్లోన వాళ్ళకి ఆ ‘కోలన్న’ నేర్పేదెవరు మరి?” అనే ప్రశ్న పుట్య! అందర్లోన? వాళ్ళలో ఒగతను- ‘ఏ ఇంగెవరుండారు?! ఆప్పట్లో కోలన్నలో బాగ ఆడి-పాడి ఆరితేరినోళ్ళు… మన ‘రామాంజి’, లసమన్న, రంగన్న ఇట్లావోళ్ళంత వుండారు కదా. వాళ్ళలోనే ఎవుర్నో ఒగర్ని పట్టుకోని పిల్లలకి నేర్పిచ్చుకోవల్ల. ఏరే దావ లేదింక’ని తెగేసి సెప్య!

‘వాళ్ళు కడుపు సేత పట్టుకోని; యాడో బెంగుళూరు, హైద్రాబాదు, కడప అంటా దేశాలు పట్టుకోని పొయ్యి దిక్కులకొగరుండారు. వాళ్ళొద్దికి పొయ్యి యట్లో ఒగట్ల నచ్చజెప్పుకోని తోలుకొచ్చుకుంటే పని అయితాద’ని కొందరంటే; ‘ఏంటికి వాళ్ళని బుడుక్కుంట పొయ్యి యతలు పడేకంటే ఈడే రాతన, దూదేకొండ, వోసూరుల్లో ఎవురన్న పాతొళ్ళలో కోలన్న తెలిసినోళ్ళు ఎవరైనా వుండారేమో కనుకోని నెలకింత జీతంలక్క మాట్లాడి పెట్టుకుంటే సరిపోతాది కదా!’ అని మరికొందరండ్రి.

జరుగుబాటు కాలేదని టూషను ఫీజే ఒగ నెల ఇస్తే రెన్నెళ్ళు సేతులెత్తేస్తారు వూరి జనం. అట్లాది పిల్లలకి కోలన్న నేర్పేకి గురువుని జీతానికి పెడతామంటే, దుడ్లు కట్టేబేకయితాదని [1] ఒగరు కూడా ముందుకు రారు. పైగా ఏంటికప్పా ఆ కోలన్న? బువ్వ పెడతాదా? బట్ట కప్పుతాదా? అని ఎత్తిపోటు మాట్లు మాట్లాడుతారని మాము(మేము) ‘సార్’తో అన్యాము.

దాంతో ‘సార్’కి ఏం సెయ్యల్నో అర్తం కాక తిక్కెక్కిపొయ్యి తలకాయ పట్టుకోని బడి దావ పట్య! మాము అతనెనుకనే అడుగులేస్తిమి. ఇంగయాళంత దానిగురించి ఏమి మాట్లాడుకోలేదు.

మర్సునాడు బడికి పొయ్యొచ్చి మాసారి[2] పూట దినాములక్కనే ప్రవేటు బళ్ళోకి పోతిమి. అట్లపొయ్యి కుస్కోని గడి(య) సేపు ఆయినో లేదో ‘మచ్చన్న’ మామొచ్చి సార్‌తో- ‘కాదు లాల్‌సాబ్..! కోలన్న నేర్పేవోళ్ళ గురించి ఆలోసనేదో సేత్తుండారంట కదా! దానిగురించి నువ్వేమి దిగులు సెయ్యొద్దు. నానుండాను కదా! నాను పొయ్యి మనోళ్ళుండే వూర్లన్ని తిరిగి ఎవుర్నో ఒగర్ని కోలన్న నేర్పేవొళ్ళని పట్టుకోనొస్తాను. కాకపోతే…” అని నెత్తి గీరుకుంట., రాను-పోను శార్జీలకి దుడ్లు ఏర్పాటుజేయమని సన్నగ సెవులో గొణిగినాడు.

ఆ మాటకి మా సారు, ఇదేదో బాగుండాదిల్యా.. ఈ మనిషయితే అక్కడ వూర్లన్ని తిరిగొచ్చినోడు కదా! ఇబ్బంది ల్యాకుండ వుంటాది. అందులో పెద్దమనిషి వున్నట్ల.. వాళ్ళుగూడ ఈ మనిషి మాట తీసెయ్యకుండ వస్తారు కదా! అని ఆలోసన సేసి, యాదో రేత్రి (రైలు)బండి వుండాదంటే, ఆ బండికి ఎదుక్కునేతట్ల అప్పటికప్పుడు దుడ్లు సర్దుబాటు సేసి అంపిచ్చి, అమ్మయ్య! యాదో అనుకునిన పని జరుగబోతుండాది కదా అని మనిషి నిమ్మళపన్నాడు.

నాను మర్సునాడు పొద్దన్నే నిద్రలేసి బాయి నీళ్ళు ఎత్తు కొస్తా వుండాను. మచ్చన్న మామ పెండ్లాం ఊరాకిల్లో నిలబడి, ‘యాయప్పకి దుడ్లు ఒత్తుకుంటున్నా మరి! మాఆయప్పకి(నా మొగునికి) యక్కువైయ్యేతట్ల తాపిచ్చి సచ్చినారు. ఆతను తాగొచ్చి రేతిరల్ల ఒగటే తీరంగ కక్కుకుంటుండాడు. ఆ మనిషి గురించి వూర్లో అందరికి తెల్సిందే కదా! మా సంసారం సెట్లు.. గుట్ల పాలు కావల్లని పనికట్టుకోని తాపిచ్చినారో ఏమో మరి! దొంగ నా కొ..లు. అతనికి యాదన్న ఒగటిగావళ్ళ.. వాళ్ళ కత సెప్తానంటా నోటికొచ్చినట్ల తిడుతుండాది!

ఆ మామ ఈ మద్దెన సారాయి బాగ తాగ మరిగినాడనాడంట! దాని కోసరం అడ్డమైన మూడుకాసుల పన్లన్ని సేసుకుంట వూర్లో మర్యాద దమ్మిడీకి ల్యాకుండ సేసుకునేన్నంట! నిద్ర లేసినాయాళ్నుంచి బడి.. బడి అంటా బడి సుట్టు తిరిగే మాకి.. మా సారుకి ఈ సంగతి తెలకపాయ! ఆతని మాటలకి బోల్తాపడి దుడ్లు జారిడుసుకోవడమే గాకుండ ఆతని పెండ్లాంతో మాట కూడ పడాల్సొచ్చ కదా! అని, మా సారు, శానా అంగలాసి, ఆయతొద్దికి పోయి ‘యట్లోల్యామ్మా! నాదే పొరపాటయ్యేద! శమించమని అడిగితే, ఆయత్త ‘అయ్యో! యన్నెన్ని మాట్లన్నాను! నా నోటి మింద బండ పడ! పాపిష్టి దాన్ని! ఎవురో తనతో పాటు దినాము తాగేటోళ్ళయింటారని పొరపాటుతో అన్న్యానన్నే.! నువ్వనుకోని అన్లేదన్నే.! ఏమనుకోవద్దన్నే.! ఆ దసిగిరయ్య స్వామితోడు! ఆ సుంకులమ్మవ్వ తోడు!’ అంటా నెత్తిమింద సెయ్యిబెట్టుకొని, కండ్లల్లో నీళ్ళు ఇడ్సుకుంట.. ‘మూన్నెళ్ళ పొద్దాయన్నా! రెయ్యాదో పొగుల్యాదో తేడా ల్యాకుండ దినాము తాగొస్తావుండాడు. అరే! ఇంట్లో ఇద్దురు కందమ్మ పిల్లలుండారే వాళ్ళనెట్ల బతుకిచ్చుకోవల్ల అనే ఆలోసన ల్యాకుండ, తినే గింజలు కాట్నుంచి; తాగే సెంబులు గూడ అమ్ముకొచ్చుకోని తన కడుపుకి సింపిచ్చుకుంటుంటే.. కడుపులో బాధలేసి తట్టుకోల్యాక ఇట్లా మాట్లు యల్లగక్కేనన్నే! యాదో పొరపాట్న నీ సెల్లెలే నోరు జారిందనుకోని నువ్వే నన్ని శమించన్నే!’ అని నలుగుర్లో ఏడ్సుకుంట కాల్లు పట్టుకునే కొచ్చ!

‘యట్లో తెల్సో తెలకో అంటే అంటివి నా నెత్తిమింద కిరీటం కింద పల్లేదుగాని, నువ్వేమి బాధ పడొద్దుల్యామ్మా!’ అని రోంత సేపు ఒదార్పు మాట్లు సెప్పి బయటికి యల్లబారొచ్చినాడు.

ఇట్ల వాళ్ళ.. వీళ్ళమింద ఆధారపడే కన్నా ఆ యతలేవో మనమే పడదాం తాలని బళ్ళో పిలవోళ్ళతో తలాకింత శందాల్లక్క ఏపిచ్చి, మిగతా తక్కువొచ్చిన దుడ్లని మా సారు సేతినుంచి ఎగేసుకోని యట్లన్నగాని కోలన్న నేర్పేవోళ్ళని తోలుకొచ్చితీరల్లన్న పట్టుదలమింద బయలెల్లినాడు.

యా పనైనా మంచి తలసి సేత్తే కచ్చితంగ అయితాదని పెద్దలు అనేల్లేదా! అట్లే మా సారు పోయిన పని ఒకేటుకయ్యిందంట సూడు! తొట్టతొలుతే ‘కడప’లో వున్నిన మా రామాంజులుమామ వద్దకి పోయి అడిగినాడంట. అతను – ‘ఏ లాభం ఆశించకుండా పిల్లల కోసరం తాపాత్రం సెందుతా ఇంతదూరమొచ్చి అడుగుతుండావు. నీ కోసమేమన్న అడుతుండావా తీ!’ అని నోట్లో మాట నోట్లో వుండంగనే ‘వస్తాను పదా’మని ఆయాళే రేత్రికే పయనమైనాడంట! అప్పుడు మా’సారు’ శానా సంతోపన్నాడంటల్యా!

***

పిల్లోలమంత జమై ‘కోలన్న’కి సేతిపట్టులావుతో వుండి శబ్దం బాగ పలికే కట్టెల్ని తగిన జొంపు[3] పెట్టి నరక్కొచ్చుకున్యాము. బడిముందర న్యాలని తగ్గులుమిట్టలు ల్యాకుండ సాపూగ సేసి, దుమ్ము లేయకుండ నీళ్ళు చిమకరిచ్చినాము. ఇయ్యాళ బేస్తారము. దినము బాగుండాదని ఎంకటేశులు స్వామి పటమొకటి తెప్పిచ్చి పూజించినాడు మా మామ. అందరం నుదిట్న కుంకుం బొట్టు పెట్టుకోని బిరాన నేర్సుకునేతట్ల సూడుస్వామి అని మొక్కోని కట్టెలు సేతపట్న్యా ము.

ఆపొద్దు.. కోలన్న కట్లు ఎట్ల పట్టుకోవల్ల? కోలన్నలో ఇద్దర్ని కలిపి ఒక వుద్ది అంటారు. వాళ్ళలో పైవుద్ది.. అని ఒగర్ని, కిందుద్ది అని ఒగర్ని పిలుస్తారు! అని, వుద్దిల్ని జత సేసి, ఆ వుద్దుల్ని యా తీరులో నిలబడల్లనేది సూపిచ్చినారు. ఇయ్యాళ ‘తాళం కట్టి’ అనేది నేర్సుకుందాం. ఇదేం అంత కష్టమైంది కాదంటా.. మా పిల్లలందర్ని గర్ర..న కొంచెం ఎంచుముంచులుగా(ఒకర్ని కాస్త వెలుపలికి, మరొకర్ని కాస్త లోపలికి) నిల్సోబెట్టి అతనే ఒక్కొక్కరొద్దికి వొచ్చి, ఎదుటి మనిషికి కట్టెనెట్ల అందీయల్నో కొట్టి సూపుతా… అట్లే కిందుద్దికున్నోడు కింది పక్కనే, పై వుద్దికున్నోడు పై పక్కనే అడుగులేస్తా సుట్రూగ తిరుగుతా వుండల్లని ఓ ఐదారు సుట్లు తిరిగి సూపి, ‘ల్యాండి..[4] వుద్దులందురు గర్రన సుట్టుకోని నిలబడండి. ‘స్యామీ రామా’ అని ఇయ్యాళ నామాకార్తానికి నాలుగు సుట్లన్న తిరుగి సూతాం యామాత్రంగ ఆడతారో.. అని,

కిందుద్ది కట్టెలమింద పై వుద్ది కట్టెలు తట్టుకుంట.. ఇగుడుదయసుత ధిమితా.., ఇగుడుదయసుత ధిమితా.. అని లయబద్దమైన పలుకులు పలుకుతా తొలి అడుగులేపిచ్చినాడు. సరే అని నాలుగే నాలుగు అడుగులు అట్ల ఏసే తలకే తికమక పట్టిపొయ్యి తిర్నాల్లో తప్పిపోయిన సన్న పిలవోళ్ళలక్క బిక్క మొకాలేసుకోని యాడొళ్ళమాడే నిలబడిపోతిమి. వాళ్ళు నగుకుంట.. ‘ఎవురైనా తొలుత తడబడేది మామూలేల్యాండి! నిగతో సూసి నేర్సుకోమ’ని మరొకసారి నిదానంగ సూపిచ్చి, అందరికీ వుద్దులు జతసేసి మరి ఏయండన్యాడు. మరి తప్పిచ్చి కుసోని యాఆటంటే మొదలాటే! అన్నట్ల నిలబన్నాము. అట్ల పదిపన్నెండు మాట్లు ఎంతో ఒపికంగ సూపిచ్చినా.. కట్టి అందిచ్చేకి పోతే అడుగు తప్పిస్తుండాము, అడుగు సరిగేస్తే కట్టె తప్పుకొడుతుండాము. న్యమ్మ! సుమార్గ అర్ధగంట సేపు నుంచి ఒకటే… తండ్లాడుతున్యా అర్ధం ‘సుట్టు గూడ తిరగల్యాకపోతుండామేమని మా తిప్పలు మాకయ్యింటే, ఈ సూసేకొచ్చిన వూరోళ్ళలో అత్తమామ వరసలయ్యే వాళ్ళు- ‘బో.. సింగారంగ ఏత్తుండారు ల్యాండి మామొల్లో..! అగా ముక్కుల్లోనుంచి సీమిడి కారిపోతుండాది తూడుసుకోండి! ఆగ..గా.. నిక్కర కిందికి జారిపోతుండాది మొలతాల్లేకి ఎగజెక్కుకోని బిర్రుపుల్లలు పెట్టుకో’మంటా.. కువ్వాడం పట్టిచ్చి, మా మర్యాద గుడ్డబట్లకి ల్యాకుండ తీసిపారేత్తుంటే మా తరగతి ఆడపిల్లోల్ల ఎదురూగ తలకాయెత్త ల్యాక పోతుండాము.

యట్లతేనేమి.. కోలన్న తప్పు అన్న్యప్పుడు మా మామతో తిట్లు తిని, కొట్లు కొట్టిచ్చుకుంటా కిందామీదా పడి వారం గడిసే లోపల అన్నిట్ని దాటేసి అందరం ఒక దావన పన్యాం.

నేర్సుకునే వరకు ఏంటికి తీ! పిల్లోల్లు తికమక పడతారు అని రొన్నాళ్ళు మూకెద్దులక్క ఏపిచ్చినాడో ఏమో మరి., యప్పుడైతే ‘ఆట’ గాడిలో పన్నో అప్పున్నుంచి మా ఆటకి పాటని జత సేసినాడు మా మామ. పాట జతయినంక మాలో ఆటతీరు మరింత మెరుగుపడింది.

‘కోలన్నలో.. తాళం, సిత్తారి, కుప్ప, కులుకు, జడ, ఇట్లా శానా రకాల కోపులుంటాయి. తాళం కోపులో మెల్లంగ సాపూగ అడుగులేస్తా పోతే, సిత్తారిలో రెండు మూడు రకాల మెలికలు తిరుగుతా పోతుంటాము. ఏత్తున్న కోపునే బిరిబిరి అడుగులేస్తాపోతే అది ఎత్తుగడి. ఎత్తుగడిలో ఆట-పాట రెండు వుషారుగుంటాయి. యా కోపులోనైనా ఎదుటి మనిషికి కట్టెని అందిచ్చేది మాత్రం మామూలే! ఇట్లా.. ఒక్కో కోపుకి ఒక్కో రకంగ ఆడతాం. నాక్కూడ అన్ని రావ’ని సెప్పి, తనకొచ్చినంత మాత్రం నేర్పుతావుండాడు మామ. రోజులు జరిగే కొద్ది కోలన్నఆటలో వుండే మజా తెల్సొచ్చి మాలో వుషారుతనాన్ని ఇమరపట్టుకోల్యాకపోతుండాము. నిద్రలేసినప్పన్నుంచి సేసే పనుల్లోన, నడిసే నడకలోన సదువుల్లోన, ఇట్ల అదీ.. ఇదీ అని సెప్పనీకి ల్యాకుండ అన్నిట్లోన వుషారైనామని మాకి మాకే తెలిసిపోతావుండాది. ఊరాకిల్లో బండి శక్రమేదన్న కంటికి కనపడితే సాలు, అది మనిషెత్తు వున్నీగాక కుప్పలిచ్చి ఎగిరి దాని కత సూసినంతవరకు ఇంటికి రాను బుద్ధిపుట్టదు.

బాయి కాట్నుంచి ఒక్కోసారి రొండు.. రొండు కడవలు భుజాల మీద ఎత్తుకొచ్చి ఇంట్లో ‘బాన’లు ఎక్కిపారేతట్ల పోస్తుండాము. గోడల్నైనా సరే పిచ్చిలు..పిచ్చిలు సేయగలమేమో అనేంత వుసులు వుంటాది మనిషిలోన! దావన పోతా వూరక పోబుద్ధి కాక కులుకుతున్నట్ల నడుస్తా పోతుంటామా..! అది మా ‘జానమ్మత్త’ట్లాటోళ్లు సూసి, “ఏమోయ్ మొగాతనీ పాయం పట్ల్యాకుండి[5] నగ్గ[6] కులుకుతా వుండావు..? మీ అమ్మనాయనల్ని అడిగి ‘పెండ్లి’ గీన సెయ్యమంటావా యట్ల..! అని కువ్వాడం పట్టిస్తావుండారు.

ఒగ నెల..నెలన్నరకంత దాదాపుగ మా మామకొచ్చింది నేర్పినాడు. ఆట..పాట రొండూ వస్తేనే పూర్తి కోలన్న నేర్చుకున్నట్లని, యా కోపులో యా పాట లయ కలుస్తాదనేది తెలిపి, ప్రార్థన పాటలు, ఎత్తుగడ పాటలు, కడాన పాడే హారతి పాటలు… అన్ని రకాలు రాపిచ్చి, అవిట్లని కంఠస్తం సేపిచ్చి, తప్పో..తడో వచ్చింది పాడతావుంటే అదే అలవాటైతాదని, ప్రతిదినము సాధన సేపిస్తావొస్తుండాడు.

అందురు క్రమము తప్పీకుండ ఎత్తుండారని రూఢి సేసుకున్నెంక, మా మామ, సారు కల్సి, ఒగ ఆదివారంనాడు పొద్దు వాలి నీడలు తిరిగనంక అందర్ని కోలన్న ఏసేదానికని పిలిపిచ్చినారు. ఇయ్యాళ మీకో పరీచ్చ పెడుతుండాము. ఇదే మీ పత్తికొండ బడి అనుకోండి. ఈ పోద్దే మీ బడి వార్సికోత్సవాలు జరుతున్నాయనుకోండి. ఇగా ఈ సూసేకొచ్చిన వూర్లోవోళ్ళందర్ని మీ బళ్ళోన.., సారొళ్ళు, మీ తోటి పిల్లలు అనుకోని, కోలన్న ఏయండని సెప్పి, పక్కాకి పొయ్యి నిలబన్యారు.

ఏమిట్ల ఇరకత్తు కేసుండ్రని అందురు బిక్కి..బిక్కిమని ఒగరి మొకాలొగరు సూసుకోని, అన్సకారికి ఏమైతే అది కానని ధైర్నం తెచ్చుకోని, ఎవురి వుద్దిని వాళ్ళు జతకట్టుకొని గర్రన నిలబడుకుంటిమి.

ముందు తలా రొళ్ళ తిమ్మప్ప ఇగుడుదయసుత దిమితా… అని మా మామ మాదిరిగానే పలుకుతా..

గజాననా ఓం గజాననా.. గజననా ఓం గజవర్ధనా….. ॥2॥

మూషిక వాహన గజాననా ఓం // మునిజనవందిత గజవర్ధనా.. // గజాననా// శంకర తనయా గజాననా ఓం// శంఖు చక్రధర గజవర్ధనా..

పార్వతి పుత్రా గజాననా ఓం// పాలించే ప్రభు గజవర్ధనా // గజాననా// అని, తాళం కట్టిలో తొలిపూజ అందుకునే బెణకుడి పాట పాడితే, అతని ఎన్కనే ముత్తుకూరు లసమన్న కొడుకు అదే తాళం కట్టిలో…

శరణు శ్రీ వైకుంఠ నాయక ॥2॥ శరణు శ్రీహరి చోద్యమా(వేడుక..)

గరుడవాహన స్వామి వెంకటనాయక.. హరి.. దేవి వెంకట నాయకా…

గజ్జెలందెలు ఘల్లుఘల్లున ॥2॥ అని విష్ణుమూర్తి పాట పాడి, ప్రార్థన ముగిచ్చినాము. భక్తి పాటలైనంక కోలన్నలో రక్తి పాటలు మొదలైతాయి. దాంతో మనిషికి ఎక్కలేని వుషారొచ్చి కాళ్ళు న్యాల మింద నిల్సక, జూలు ఇదిరిచ్చిన పందెం పుంజుల్లక్కన తొక్కులు తొక్కులాడుతుంటాము. అదే తాళం కోపుని కొనసాగిస్తా మేకలోల్ల శందరగాడు..

ఏటిగడ్డన్నాది సేను సిన్నవాడా నన్నేరూ దాటించరా సిన్నవాడా ‘పాలేరూ’ దాటించరా సిన్నవాడా //2//

నా ముక్కుకుండే ముక్కెరిస్తా సిన్నవాడా నన్నేరూ దాటించరా సిన్నవాడా పాలేరూ దాటించరా సిన్నవాడా.. అని, ఒంటిమీదుండే నగలు తీసుకోనైనా నన్ని ‘ఏరు’ దాటించమని బతిమాలే ఒక పడచు.., అవేటివి నాకొద్దూ… నీ పొందు కావాలని ఆశపడే పడుచోడు; వాళ్ళిద్దరి సంభాషన్తో సాగే పాటని బలే ఇనసొంపుగ పాన్న్యాడు. కానీ, ఎత్తుగడ పాట నాకి రాదని ఎనుకుముందులాడుతుంటే, పులిరాజన్న….

ఆ. గాజులొచ్చినాయి మామ గట్టుమిందికి మంచి గాజులొచ్చినాయి మామ గట్టుమిందికి //గాజు//

అ. ఏయ్ వూరకుండూరకుండూరకుండు.. నా జేబులో ‘కాసు’లేదు వూరకుండు.

ఆ. చీరలొచ్చినాయి మామ.. అంటా వూర్లోకొచ్చిన పతీది కొనీమనే పేరాశ పెండ్లాంతో, నువ్వెంత పోరినా నా జేవులో దుడ్లు లేవని వాదులాడే పీసు [7] మొగుని పాట పాడినాడు. అయినంక..

మామరా కొండాలరెడ్డి మామరా కొండాలరెడ్డి మామిడి పువ్వంటి దాన్ని, న్యాయమాడి గెలుకొస్తీవో..,

కొండాలరెడ్డి పాయమెవ్వరి పాలు సేతునురా..! //మామరా.. //

కోసిగి కొనగుట్ల నడుమ //కోసిగి// కొర్రకోసే ఎర్రపిల్లకి ఎడమ సెంపకి ఎండ తగిలెన్న.. కొండాలరెడ్డి

గొర్రు ఇడిసి గొడుగు పట్టన్న..! //మామరా.. // అని మూలింటి కాశీముగాడు… పాడుతుంటే కంఠమట్లే కన..కనమని కంచుమోగినట్లే మోగుతుంటే అందురు మేలగ పాన్యాడని భో మెచ్చుకుండ్రి!

అన్సకారి తలారి దస్తగిరి ‘సిత్తారి’ కోపు అని తెలిపి……

కలగట్ల కలబాయి నీళ్ళు.. నా స్వామి; కడవ నిండ నింపుకోని,

కడవ మింద రెండు సేతులు నా స్వామి… వాని మింద వాలు సూపులు…

గుంట కింద గంట మొలకా నా స్వామి కలుపు తీసే కాపు[8] కొడకా;

కలుపు తీస్తా కన్ను గీటు.. నా స్వామి మునుము[9] లోనే ముద్దు పెట్టు… అని, ఒక రైతు బిడ్డ మింద మనసు పారేసుకోని అతనితో సరసాల్నిలా కలలు కనే కన్నెపిల్ల పాట పాడి, ఎన్కనే ఎత్తుగడికి,

బాయిలో బంగారు చేప బాలుడేసిన పూటతోట //బాలుడేసిన//

పూలు రెండు కొయ్యబోతేనూ.. పుష్పగిరి తేరు కదిలెనురా.. అనే పాటని పాన్యాడు. అయినంక సాకలోల్ల పులికొండ,

పొద్దు మునిగి మద్దెమాయ //పొద్దు// యాపకొమ్ములడ్డమాయ దూరాదేశము చిన్నదాన్నిరా..! నా

ఓరిగంటి వంశాలింగా దుఃఖపడితే బ్రమలు తీరునా… అనే పాట పాడి, ఎత్తుగడికి మాంచి కుషాలుండే పాట.. ‘పోతులన్న’ అనే పాటని వూరక రెండు నురుగులు[10] అన్యాడో లేదో, ఆ పాట గురించి తెలిసిన సుట్టుపక్కల జనం పగలబడి నగబట్టిరి. ఏసినప్పుడు ఒగ అర్ధం; యిప్పినప్పుడు ఇంగో అర్థమొచ్చే తట్లు(పొడుపుకథలు)ని పోలినట్లుండి భో తమాషాగుంటాది ఆ పాట. అది..

పోతులన్న దున్నపోతులన్న సై పోతులన్న కల్డి పోతులన్న //2// వూరకుండేందిరా? వూగులాడేందిరా? కాలిసందనేందిరా? కమ్ముకునేదేందిరా? //పోతులన్న//

వూరకుండేది ఆవు రా. వూగులాడేది ‘దూడ’రా. కాలి సందన సెంబురా. కమ్ముకునేది సెయ్యిరా //పోతు//

బోడోడు ఎవుర్రా? బొచ్చోడు ఎవుర్రా? ముడ్డి సుట్టు బాకులుండు వాని పేరేమిరా..? // పోతులన్న//

బోడోడె వుల్లిగడ్డ. బొచ్చోడే టెంకాయ. ముడ్డి సుట్టు బాకులుండు వాని పేరే వంకాయ. //పోతులన్న//

ఇట్లా ఒగరుమొచ్చొగరు పాడుకుంట పోతావుంటే, మా గురువు మెల్లంగ లేసొచ్చి, మీరంతా సిన్ని సిన్ని సేతుల్తో ఏత్తుంటే పొప్పన్నం తిన్నట్ల కమ్మంగనే వుండాది గాని, దాంట్లేకి ‘సింతొక్కు’లక్క రోంత నంజుడు కలిస్తే ఇంగా బాగుంటాదని సెప్పి, రంగం లేకి దిగి, పాట ఎత్తుకున్యాడిట్ల…

తూర్పునుండి వానలొచ్చ.. //తూర్పు// తుమ్మలమ్మ సెరువు నిండె.. జగన్నాథుని వంకదొర్ల్యన్నా..!

ఓరి ఓబులేశా వామిదొడ్లు వడ్లు పండెన్నా..! //తూర్పు//

వడ్లు పండి వరిబువ్వ ఎరుగా..! నూలు నూబిండి ఎరుగా..! ముగ్గురు పిల్లల తల్లినై తన్నా! ఓరి

ఓబులేశా! మొగుడు తెచ్చిన మొగలి ఎరుగన్నా! ఇట్లా పాడి ఇంగా పాట పూర్తిగాకముందే, తయ్యకతద్దిమిత..! అని తెగ్గొట్టి, ఎనకనే ఎత్తుగడి అందుకున్యాడు. మాము అది ఊహించల్యాకపోయి తర్జనబర్జనలో కట్టి లయ తప్పిచ్చి అన్సకారి దావకొచ్చి ఊపిరి పీల్సుకున్యాము. ఆ ఎత్తుగడి పాట…

రావే ముద్దులగుమ్మా లలనా రమణీ కుచ్చులబొమ్మా…

నీ రమణీ కుచ్చుల మింద బంగారు రవ్వలే రావే ముద్దులగుమ్మా.. //రావే ముద్దులగుమ్మా//

దావంటా పొయ్యేదానా లలనా! దారాల రైక దానా..

నీ దారాల రైకలోకి దూరింది మనసు రావే ముద్దులగుమ్మా //రావే// ఈ ఎత్తుగడి పాటగూడ పూర్తి సెయ్యకుండానే, తయ్యకుతద్ధిమిత! అని తెగ్గొట్టి, మరి తొలుత పాడిన పాట ఎత్తుకుంటే ఈ యెత్తు ముందరంగనే పసిగట్టి, అందుకున్యాం..

మండగిరి కొండమింద //మండగిరి// మల్లెపువ్వు సెట్టుపుట్టె మామకూతురు మాట తప్పెన్నా! ఓరి ఓబులేశా! కండ్ల నీరు కాలువాయన్నా..!

అదిగదిగో అనంతపురమూ అంచునా టెంకాయ వనమూ పచ్చికొబ్బెర పందెమాడెన్నా! ఓరి ఓబులేశా! ఒట్టి కొబ్బెర వాదులాడెన్నా! మరి, తయ్యకుతద్ధిమిత! ఎత్తుగడి పాట…

వంకేంటి పొయ్యేదానా లలనా! వంకాయల గంపదానా నీ వంకాయల గంప పైన వాలింది మనసు.. రావే ముద్దులగుమ్మా //రావే// తయ్యకుతద్ధిమిత! తిరిగి మూమూలు పాట.., తిరిగి ఎత్తుగడి… మరి మామూలు..! ఇట్లా దీపావళప్పుడు దిక్కు ముక్కలు తిరిగిన సుట్టల్ల కురిసే వానలక్క రోంత సేపు అల్లల్లాడిచ్చే తలకే సెమటలు పట్టి బట్లన్నీ తడిసి ముద్దలు… ముద్దలైపోతుండాయి. దినాము ఏత్తుంటిమి గాని యా పొద్దు ఈతిరంగ[11] అల్సిపోయిందిల్యా! మాము గసపోసుకునేది సూసి మా అయ్యవారు సన్నగ నగుకోని పాటని తెగ్గొట్టిపడేసి, ఇదీ అసలైన కోలన్న ఏయడమంటే! అని, ఈయాల్టికి ఏసింది సాలింక మంగళారతి పాట పాడి సాలీయండన్యాడు. ఆ పాట నాగాజ్జున అందుకున్యాడు…

శ్యాసుమిందనే సూసికాలు శ్యాసుమిందనే సూసికాలు చెంగాయి కుచ్చులదండ నిమ్మపండు నిలువుటద్దాలు… సుంకులమ్మ తల్లి నీకేగాని ఎవరికి లేదమ్మా..! //శ్యాసుమిందనే//

ఆడేటప్పుడు అంచు చీర ఆడేటప్పుడు అంచు చీర పాడేటప్పుడు పట్టుచీర గుళ్ళేకి పొయ్యేటప్పుడు సుంకులమ్మ తల్లి అచ్చమైన పసుపు చీరమ్మా..! //ఆడేటప్పుడు// ఎడమ సేతిలో ఎం(వెం)డి కత్తి ఎడమ సేతిలో ఎండి కత్తి కుడి సేతిలో కుంకుమ భరణి నెత్తి మీద నాగజ్యోతమ్మా..! సుంకులమ్మ తల్లి రౌద్దమైన రూపం నీదమ్మా..! //ఎడమ సేతిలో// అని, భక్తితో పాడి ఆపొద్దుటి కోలన్నని ముగిచ్చినాము.

తొలినాళ్ళలో భో సింగారంగ ఏత్తుండారు ఈయప్పొళ్ళు అని తిట్టి తమాషాలు ఆడినొళ్ళే; ‘పిల్లలు కోలన్న ఏస్తుంటే ఎంత ముద్దొస్తుండారు కదా!’ అని మెచ్చుకొని పోతుంటే, మా మామ, లాల్‌సాబు సారు, సంగన[13] సంతోషం పన్యారు.

ఆటతో పాటు అలంకారము కూడా ముక్యమే కదా అని, కట్టెలకి రంగులు కొట్టుకోవడం, అందరు ఒకే రకమైని బట్లు కుట్టిచ్చుకోవడంతో పాటు మిగతా అన్ని రకాలుగ సిద్ధమై, మరుగున పడిన కళల్ని కాపాడుకునే ప్రయత్నం సేసిన మా సారుని, దానికి సహకరించిన మా మామని గెలిపించి తీరల్లనే గెట్టి పట్టుదలతో అందరం మా పాఠశాల వార్సికోత్సవాళ్ళో పాల్గొన్యాము.

సమాప్తం

***

కొన్ని పదాలకు అర్థాలు:

  1. డబ్బు కట్టవలసి వస్తుందని
  2. సాయంత్రం
  3. పొడవు
  4. కానీయండి, (బహుశా ‘లెగండి’ అన్న పదం నుండి పుట్టుండవచ్చు)
  5. నిగ్రహించకోలేక
  6. చాలా
  7. పిసినారి
  8. రైతు
  9. (నాగటి) చాల
  10. వరుసలు
  11. ఇంత ఎక్కువగా (ఈ తీరుగ)
  12. చాలా
Exit mobile version