[మాయా ఏంజిలో రచించిన ‘Unmeasured Tempo’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. సకాలంలో జరగని, తీరని వేడుకలు కోరికలు వృథానే అన్న నిర్వేదభరితపు కవిత ఇది!!]
~
[dropcap]మి[/dropcap]ట్టమధ్యాహ్నం సూర్యుడు ఉదయించాడు
బిగుతైన వక్షోజాలు
నడుము చుట్టు రేఖ దాకా
సాగిపోయాయి
లేలేత నడుము శుష్కించిపోయింది
చాలా.. ఆలస్యమైపోయింది
కన్న రంగుల కలలన్నీ
పెంపుడు కుక్కపిల్లలాగా
ఒళ్ళో ముడుచుకుని ఉండిపోయాయి
ఎంతో ప్రేమించావు గానీ
ఏ మాత్రం అర్థం చేసుకోలేదు
ఎక్కువ తెలివితేటలు
హృదయాన్ని ముడుచుకునేలా చేస్తాయా
ఎగసిన ఎత్తులు
ఇరుకిరుకు శకలాలుగా విరిగిపోతాయా
అత్యంత గొప్ప ఆకాంక్షలన్నీ
అతి మామూలు కోరికలుగా
మిగిలిపోయాయి
ఇన్నాళ్ళకి..
ఇప్పుడిక
నువ్వు నవ్వుతూ వచ్చావు
ఎంతో..
ఎంతో.. ఆలస్యంగా..!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవితలు వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.