[dropcap]తె[/dropcap]లుగింటి రతనాల భామ
వెలిగేటి సౌందర్య సీమ
ఈ కోనసీమ. ఇది కొనసీమ
ఇదే ఇదే స్వర్గసీమ ॥తెలుగింటి॥
కొబ్బరాకు మునివేళ్ళను మెల్లగా మీటితే
గౌతమీ హృదివీణ వేదాలను నినదిస్తే
సంబరాన పైరు పంట అంబరమే అంటదా
రైతులింట ధాన్యలక్ష్మి రంగవల్లు లేయదా ॥తెలుగింటి॥
కోడెగిత్త చెంగుమని గట్లంట పోతుంటే
కన్నెపిల్ల తుర్రుమని తూనీగై పోతుంటే
పిల్ల కాలువ మనసు పొంగి పొరలిపోతుంది
పచ్చని చేల సొగసు పరవశించి పోయింది ॥తెలుగింటి॥
గోదారిలో నావ జలతరంగిణి చేసె
ఎత్తిన తెరచాప ఎల్లలకు వెల్లవేసె
వెన్నెలమ్మ రేయంతా వెండి పరుపు వేసింది
వెతలు మరిచి జగమంతా నిదురలోకి జారింది ॥తెలుగింటి॥