కొంచెం మసాలాతో

0
2

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘కొంచెం మసాలాతో’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]త[/dropcap]లువు తట్టిన వైపు చూస్తూ, “ఆ సుబ్బారావుగారు రండి, మీకోసవే ఎదురు చూస్తున్నాను. వార్తలు అన్నీ మీరు విపులంగా రాసేసారు కదా, అవి తీసుకువెళ్లి కొత్తగా వచ్చిన న్యూస్ రీడర్‌కి ఇవ్వండి. ఆ అమ్మాయి ఒకసారి చూసుకుని, కొన్ని మార్పులు చేసి, కొంత మసాలా యాడ్ చేసి టి.వి.లో చదివేస్తుంది. అయితే ఆ అమ్మాయి ఇదివరకు ఒక పేరున్న చానల్లో పనిచేసింది. చూడ్డానికి పిట్టలా కనబడుతుంది కానీ, వార్తలు చదవటంలో దిట్ట. అందుకనే ఇంటర్వ్యూకి రాగానే మన న్యూస్ ఛానల్లో తీసుకున్నాం. ఆ అమ్మాయి మార్పులు, చేర్పులు చెబుతుంది, శ్రద్ధగా విని, మీరు ఏమన్నా సలహాలు, సూచనలు ఆమెకి ఇవ్వాలంటే ఇవ్వండి. ఆమె వార్తలు  చదివితే అవి వినేకొద్దీ వినాలనిపిస్తుందని బయట టాకు. అందుకే ఆ అమ్మాయిని కావాలని తీసుకున్నది. మీరు వెళ్లి ఒకసారి అమ్మాయిని కలవండి” చెప్పాడు ఎడిటర్.

సుబ్బారావుకి అంత స్పష్టంగా అర్థం కాలేదు. ‘ఇంకా యాడ్ చేయడానికి ఏం ఉంటుంది నా బొంద. ఇదేవన్నాగుత్తొంకాయ్ కూరా? మసాలా, ఉప్పూ, కారం వగైరా యాడ్ చేయడానికి’  అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లి “నేను ఇక్కడ, మనకి వచ్చిన వార్తలు మొత్తం సేకరించి, ఒక ఆర్డర్‌లో రాసేసి మీకు ఇస్తూ ఉంటాను, మీరు వాటిని చదవడమే” అన్నాడు అతని చేతిలోని పేపర్లు ఆమెకు అందిస్తూ.

ఆమె, “అలాగా! నా పేరు కల్పిత, ఇది వరకు జింగ్ జింగ్ న్యూస్ చానల్లో పని చేశాను” అని చెప్పి ఆ వార్తలు ఒకసారి చూసింది. తరువాత పెదవి విరిచి, మాడు మొహం పెట్టి, నీరస పడిపోయి, కాస్త చిరాగ్గా “ఏమిటి మరీ అంత సింపుల్‌గా రాశారు? ఇవి వార్తలు అనిపించడం లేదే. హెడ్ లైన్స్ మరీ పొడిపొడిగా ఉన్నాయి. ఇలా అయితే వినే ప్రేక్షకులకి ఆసక్తి ఏముంటుంది?” అందామె.

ఆమె మాటలకి బుర్ర గోక్కుంటూ, “వార్తలు బానే వ్రాసానమ్మా!” అన్నాడు తెల్లమోహంతో.

“అలాగా! అసలు హెడ్ లైన్స్ ఏం రాసారో ఒకసారి చదవండి, వింటాను” అందామె.

దాంతో సుబ్బారావు కళ్ళజోడు సరిచేసుకుని, కాస్త పెద్ద స్వరంతో, “బస్ స్టాప్‌లో యువతిని ఏడిపించిన నలుగురు యువకుల అరెస్టు. బొటనవేలికి స్వల్ప గాయం కావడంతో, షూటింగ్ వాయిదా వేసుకున్న జుమాంజిస్టార్ జింగిడిబాబు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం. పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైన హీరోయిన్ అరసుకుమారి” అని చదివేసి గర్వంగా ఆమె వైపు చూసాడు.

ఆ హెడ్ లైన్స్ విన్న ఆమె, ఒక క్షణం మూతి విరిచి, “అబ్బే ఇలా ఉంటే ఎవరు న్యూస్ చూస్తారు చెప్పండి.ఇందులో ఆసక్తి ఏది? హెడ్ లైన్స్ విన్న తర్వాత న్యూస్ చూడాలనిపించేలా ఏవుంది? ఇలా సాదాసీదాగా ఉంటే వార్తలని ఈ రోజుల్లో ఎవరు చూస్తారూ. ఇలా అయితే మన టి.ఆర్.పి. గాలిపటంలా ఎగరదు సరి కదా, ఉన్న ఆ  టి.ఆర్.పి. కూడా గాలిపోయిన టైర్‌లా తుస్సుమంటుంది. ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం, మనం చదివితే అందరూ చెవులు రిక్కించి, కళ్ళు పెద్దవి  చేసి లీనమైపోయి మరీ మన వార్తా ఛానెల్ చూడాలి. కాబట్టి నేను ఇందులో కొన్ని మార్చి వినిపిస్తాను వినండి” అని గొంతు సవరించుకుని, “బస్టాప్‌లో ఒంటరి అమ్మాయిని టార్గెట్ చేసిన కుర్రాళ్ళు. ఊహించని ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న హీరో జింగిడి బాబు. అల్పపీడనం రూపంలో నగరానికి ముంచుకొస్తున్న మరో పెనుముప్పు. బాయ్ ఫ్రెండ్‌కి హ్యాండిచ్చి, హీరో పిల్లబాబుతో పెళ్ళి పీటలు ఎక్కిన హీరోయిన్ అరసుకుమారి” అని చదివి సుబ్బారావు వంక చూసి, “నేను మార్చి చదివిన కంటెంట్ ఎలా ఉంది” అడిగింది.

“మిగతావి పర్లేదు కానీ, పాపం ఆ హీరోయిన్‌పై చదివిన ఆఖరి హెడ్ లైన్ బాలేదమ్మా. ఆమె శుభవా అని పెళ్ళి చేసుకుంటే, ఆమె బాయ్ ఫ్రెండ్‌ని కాదని ఇంకొకరిని చేసుకుందనడం బాలేదు. పైగా అది ఫేక్ న్యూస్. ఎవరో సోషల్ మీడియాలో కావాలని వ్రాసింది. ఒక వేళ అది నిజమే అయినా, మనకి వాళ్ళ వ్యక్తిగత జీవితం అనవసరం కదా” అన్నాడు అసహనంగా పళ్ళు కొరుకుతూ.

“అబ్బా సుబ్బారావ్ గారూ, అది నిజమో అబద్ధమో మనకెందుకు, ఇలా ముడిపెట్టి వార్త ప్రసారం చేస్తేనే ఎక్కువ మంది చూస్తారు. అంతెందుకు, ఏదైనా సినీ వేడుకలో ఎవరైనా సెలబ్రిటీ కపుల్ కొంచెం ఎడంగా నడిస్తే చాలు, వాళ్లు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా అనీ, ఎవరో ఒక ఎం.ఎల్.ఏ మరో పార్టీలోకి మారిపోబోతున్నాడూ అనీ, ఎవరైనా హీరో, హీరోయిన్లు రెండు మూడు సినిమాలు కలిసి చేస్తే వారి మధ్య ఏదో ఉన్నట్టు పూకార్లు వస్తున్నాయనీ వార్తలు ప్రసారం చేయొచ్చు. అంతెందుకు, సినిమా వాళ్ళు చేసే చిన్న ట్వీట్ లని పట్టుకుని కూడా పెద్ద వార్తలు సృష్టించవచ్చు. ఇలా ఊహించి, కొన్ని గాలిలో సృష్టించి, మరికొన్ని కల్పించి మసాలాతో ప్రసారం చేస్తే, మన టి.ఆర్.పి ఎక్కడికో వెళ్ళిపోతుంది.కనుక వెంటనే ఇలా మార్చి ఎడిటర్ గారికి చూపించి తీసుకురండి. లైవ్‌లో చదివేస్తాను” చెప్పింది ఉత్సాహంగా.

“అలాగే” అని ఎడిటర్ రూమ్ లోకి వెళ్ళి, “ఇలాంటివి చేస్తున్న ఒకటి, అర న్యూస్ ఛానెళ్ళ వల్ల, మిగతా చానెల్స్‌కి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మంచి పేరున్న మన ఛానెల్‌కి ఇలాంటి పోకడలు అవసరమా సార్. ఆమెని తీసేస్తే మంచిదేమో సార్, ఆలోచించండి” అడిగాడు ఎడిటర్‌ని.

“కొన్ని తప్పవు సుబ్బారావ్. ఆమె పని ఆమె చేస్తుంది, మీ పని మీరు చూసుకోండి” చెప్పాడు.

“సరే, ఇక మీరే ఆలోచించుకోవాలి” అని నీరసంగా వాలిపోయి, ఓ టీ తాగి ఆమె డెస్క్ దగ్గరకి వెళ్ళాడు, ఆమె లేదు. “న్యూస్ రీడర్ ఏది” అడిగాడు పక్క డెస్క్ వ్యక్తిని.

“మసాలా వద్దనీ, మీరు వ్రాసిందే ఎడిటర్ గారు చదవమని చెప్పారని మాడు మొహంతో నసుగుతూ, వార్తలు చదవడానికి లైవ్ లోకి వెళ్ళింది” చెప్పాడతను.

ఆ మాట వింటూనే, ఓ టన్ను ప్రశాంతత సుబ్బారావు ముఖంలో స్పష్టంగా తొంగి చూసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here