Site icon Sanchika

తప్పకచూసి ఆనందించవలసిన చిత్రం – కొండ పొలం

[dropcap]బి[/dropcap]బో శ్రీనివాస్ సమర్పణలో First Frame Entertainments Pvt Ltd వారిచే నిర్మించబడి, క్రిష్ దర్శకత్వంలో అక్టోబర్ 2021లో విడుదలైన చిత్రం ఇది.

నల్లమల కొండలకి అంకితం ఇవ్వబడింది.

అసభ్యత లేని, చెవికింపైన పాటలు కీరవాణి సంగీతంలో సమకూరాయి.

కథా నాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ (రవీంద్రనాధ్). కథా నాయిక రకుల్ ప్రీత్ సింగ్.  సాయిచంద్ తండ్రి గాను, కోట శ్రీనివాసరావు తాతగాను, అన్నపూర్ణమ్మ నాయనమ్మగాను, ఇతర ముఖ్య పాత్రల్లో రవి ప్రకాష్, హేమ మరి కొందరు నటించారు.

రాయలసీమ మాండలికంలో రాయబడ్డ సంభాషణలు దేశీయంగా ఉండి మనసుకి హత్తుకునేట్లు ఉన్నాయి. ఆలోచింపజేసే సంభాషణలతో సినిమా ఆసాంతం ఆకట్టుకున్నది. అందరు వారి వారి పాత్రలకి అవసరమైన దాని కన్న ఎక్కువగా న్యాయం చేశారు.

అడవి అందాలని, సంపదని, అక్కడ అమాయకంగా బతుకుతున్న అడవి జాతులని నిష్పక్షపాతంగా చూపించారు. అడవిలో దొరికే దుంపలు, తేనె ఆహారంగా ఉపయోగించుకునే అమాయకమైన అడవి జాతుల మనుషులని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న స్వార్థ శక్తులని, వారి ఎత్తుగడలని వివరంగా మన దృష్టికి తెచ్చారు.

చిత్ర కథకొస్తే…..

కథానాయకుడు ఇంజనీరింగ్ చదివి… తన గ్రామీణ నేపథ్యం వల్ల ఆంగ్లంలో ధాటిగా మాట్లాడలేక ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేక పోతాడు. తరువాత జాతీయ పరిపాలనా సర్వీస్ (All India Services) కి వెళ్ళాలనే తపనతో కోచింగ్ తీసుకుని రాత పరీక్షలు మెరిట్‌లో పాస్ అయి ఇంటర్వ్యూకి వెళతాడు. ఇంటర్వ్యూ బోర్డ్‌లో ముఖ్య అధికారిగా నాజర్ ప్రశ్నలు వేస్తూ కథానాయకుడి ఆలోచనా విధానానికి ఆశ్చర్యపోతాడు.

తల్లిదండ్రులు గొర్రెలు కాపరులయి చదువురాని వారయినా, ఒక క్షామ ప్రాంతం నించి వచ్చిన వ్యక్తి ఈ పరీక్షల్లో టాపర్ అవుతాడు. అదే మాట ప్రస్తావిస్తూ “ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు” అంటే “నల్లమల అడవి” అని చెబుతాడు.

ఆంగ్లంలో ఇంటర్వ్యూ నడుస్తూ ఉండగా… ప్రాంతీయ భాషల్లో కూడా ఇంటర్వ్యూ చెయ్యచ్చు అని సర్వీస్ రూల్స్‌లో అందుకు సంబంధించిన సెక్షన్స్ ఉటంకిస్తాడు కథానాయకుడు. ఆంగ్లం బాగానే మాట్లాడేటప్పుడు మాతృభాషలో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావని అడిగిన అధికారికి “ఏ భాషలో మాట్లాడినా అది మెదడుకి చేరుతుంది. మాతృభాషలో మాట్లాడితే అది గుండెకి చేరుతుంది” అని సమాధానమిచ్చి మాతృభాష ప్రాధాన్యాన్ని చక్కగా వివరిస్తాడు.

నీటి కరువు ఉన్న ప్రాంతంలో దైనందిన జీవితానికి మనుషులు, పశువులు పడుతున్న అగచాట్లు చిత్ర కథ. అడవిలో బతికే రకరకాల గుంపులు, వాళ్ళ మధ్య నడిచే రాజకీయాలు, దొంగ వ్యాపారులు బొమ్మకర్ర చెట్టు (ఎర్ర చందనాన్ని ఆ ప్రాంతం వారు అలా సంబోధిస్తారు కాబోలు) కొట్టి అమ్ముకోవటం బాగా చూపించారు.

పశువులు తాగేందుకు నీరు, మేసేందుకు గడ్డి లేక చనిపోతు ఉంటాయి.

వానలు లేక, వాళ్ళు పెంచుకునే గొర్రెలకి తాగటానికి నీళ్ళు లేక ఏం చెయ్యాలో తోచక మల్లగుల్లాలు పడుతుంటారు.

ఆ ఊర్లో కొత్త తరం వారయినా గొర్రెల పెంపకం మానేసి ఉద్యోగం తెచ్చుకుంటే తరతరానా పడే ఈ రకమైన కష్టాలు తీరతాయని, క్షామం వచ్చినా నెల తిరిగే సరికి జీతం తెచ్చే పరిస్థితి ఉండాలని వారి ఆశ..

నోరు లేని జీవాలని కాపాడటానికి…. మనుషులకి తాగటానికి సరఫరా చేసే నీటి పైపులు పగలగొడుతున్నారని ఆ గ్రామాధికారులు, ప్రజలు గొడవపడతారు.

గొర్రెల గురప్ప, ఇంకొక ఆయన అక్కడికి దగ్గరలో ఉండే అడవిలో భూమి గడ్డ మెత్తపడింది కాబట్టి త్వరలో వర్షాలు కురవచ్చు అనే అంచనాతో అక్కడికి గొర్రెలని తోలుకెళ్ళాలని తీర్మానించుకుంటారు.

గురప్పకి తోడుగా ఎవరెళ్ళాలి అనే మీమాంస కలిగినప్పుడు… అతని పెద్ద కొడుక్కి అప్పుడే కొత్తగా పెళ్ళయింది కనుక నెలరోజుల వరకు అడవిలోకి వెళ్ళటం, కొండలెక్కటం సంప్రదాయం కాదు కాబట్టి ఎవరెళ్ళాలి అనే సందేహం కలుగుతుంది.

మన కథానాయకుడు తను వెళతానంటే… కొండ పొలానికి వెళ్ళాలంటే పులుల భయం.. కొండ జొరం భయం ఉంటుంది. రొట్టె, కారం తిని బతకాలి. నేలమీద పడుకోవాలి. చదువుకున్నవాడికి ఈ కష్టాలెందుకు అని నాయనమ్మ సందేహంతో వద్దంటుంది.

జాతీయ సర్వీసులకి చదువంటే ఎంత కష్టమో, ఎన్నాళ్ళు శిక్షణ తీసుకోవాలోఏ మాత్రం తెలియని ఆ ఊరి వాళ్ళు, అతని తాత కూడా మన కథానాయకుడికి చదువయి నాలుగేళ్ళయినా ఉద్యోగం రాకపోవటం అంటే అతనికేదో గాలి సోకిందని భావిస్తారు.

జీవికి అన్నం పెట్టి కాపాడితే పుణ్యం. కాబట్టి మందలో ఉండే వంద గొర్రెల ప్రాణాలు నిలబెడితే అతనికి తప్పక ఉద్యోగం వస్తుందని, ఆ సోకిన గాలికి అదే పరిష్కారమని తన పద్ధతిలో చెబుతాడు అతని తాత.

***

పూర్వం రాజ్యాలేలాల్సిన రాజకుమారులని పట్టాభిషేకానికి ముందు దేశాటన చేసి రమ్మని పంపించేవారు. సామాన్య జీవుల కష్టాలు తెలిస్తే వారి పరిపాలన ప్రజారంజకంగా సాగుతుందని విశ్వసించేవారు.

ఈ చిత్రంలో ఒక దేశానికి సేవ చెయ్యవలసిన సివిల్ సర్వెంట్ గొర్రెల కాపరిగా అడవిలో తిరుగుతూ క్షేత్ర స్థాయిలో చూసిన విషయాలు, పొందిన అనుభవాల వల్ల తను ఒక మెరిట్ అభ్యర్ధి అయి టాపర్‌గా నిలిచి కూడా IAS, IPS కాకుండా ఫారెస్ట్ సర్వీస్ (IFS)లో చేరితే వారికి మంచి చెయ్యగలుగుతానని కోరుకుంటాడు.

మామూలు జల్లులు కాకుండా 4-5 రోజులు కుంభవృష్టి కురిస్తే తప్ప చెట్టు తడవదని, నేల మెత్తబడదని, నీరు కాలవ కట్టి కొండలు దాటి ప్రవహిస్తే తప్ప అక్కడ నీటి కరువు తీరదని, పశువులకి సరిపోయినంత మేత దొరకదని నాయిక తన అనుభవంతో చెబుతుంది.

ఎలుగుబంట్లు అడవికి ఆడపడుచులని, పెద్దపులులు పెద్ద కొడుకులని, దుప్పులు చెవుల పిల్లు వాటి పిల్లలని వాటిని చూసి భయపడకూడదని ఆరిందాలాగా చెప్పి నాయకుడికి ధైర్యం నూరిపోస్తుంది.

అడవికి వచ్చి నాలుగు రోజులు గొర్రెలని మేపుకుని చెట్టు-పుట్టా నరకకుండా చుట్టం లాగా వెళ్ళిపోవాలని… అలా కాకుండా చెట్లు నరికి జంతువులని చంపి అడవికి హాని కలిగిస్తే ముందుతరం వాళ్ళకి అడవి అనేది చూపుకి కూడా దక్కదని పెద్దాయన చెబుతాడు. అడవి దేవత అని, అడక్కుండానే వరాలిచ్చే ఇలవేల్పు అని, అడవే తమకి బడి అని ఎంతో గౌరవంతో ఆడుతూ పాడుతూ అడవిలో అమాయకంగా, ధైర్యంగా, నమ్మకంతో తిరుగుతారు.

అక్కడ అలవాటుగా పెద్ద పులిని పెద్ద నక్క అంటామని, దాన్ని చూస్తే గొర్రెలు భయపడతాయి… వాటి భయం మనం తీర్చాలి కానీ “మనమే భయపడితే వాటినేం కాపాడగలం” అని ఎండు కట్టెని చూసి కొండ చిలువ అని భయపడుతున్న కొడుకుతో అంటాడు గురప్ప!

అడవుల్లో గొర్రెలనెలా కాయాలో తండ్రి గురప్పని చూసి, గమనించి నేర్చుకోవాలి అంటాడు పెద్దాయన.. చూడటం వేరు.. గమనించటం వేరు.. గమనిస్తే ఏ విషయం మీదయినా పట్టు చిక్కుతుందని చెబుతాడు.

***

అడవి దొంగలు వడిసెలతో రాళ్ళు విసురుతూ వీళ్ళని భయపెడతారు. అలా వచ్చిన వారిని భయపెట్టాలే కానీ వారి మీద కసితో శతృత్వం పెంచుకోకూడదని గురప్ప కొడుక్కి చెబుతాడు. ఇలా జీవిత పాఠాలని మాటల్లో మాటలుగా కథానాయకుడికి అందరూ తలో సందర్భంలో చెబుతారు.

మన కథానాయకుడు వడిసెల వాడటం నేర్చుకుని, వారి మీద రాళ్ళేసి వాళ్ళని పట్టుకుని అడిగి “తాము గొర్రెలకోసం రాలేదని, అక్కడ ఉన్న ఎర్ర చందనం (బొమ్మకర్ర చెట్టు) కోసం స్మగ్లర్స్ ఉసిగొలిపారని” తెలుసుకుంటాడు.

బొమ్మకర్ర చెట్టు కొట్టటానికి కూలీలు వస్తారు కానీ అటవీ ఉద్యోగులు మాత్రం అడవిలో అంత లోపలికి రారని కథానాయిక యధాలాపంగా చెబుతుంది.

ఇలా అడవి గుతించి అనేక వాస్తవాలు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ నేర్చుకుంటాడు.

ఆ అడవినే నమ్ముకుని బతికే ఒక గుంపు ప్రజలకి చిట్టడవి లోపలి భాగంలో బొమ్మకర్రలు ఎక్కడ దొరుకుతాయో తెలుసని… దొంగ వ్యాపారం చేసేవాళ్ళు వారి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారని తెలుసుకుంటాడు. పోలీసు వాళ్ళు స్మగ్లర్స్‌ని పట్టుకోలేక.. లేదా వారితో లాలూచి పడి… వీళ్ళే చెట్లు కొడుతున్నారని కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని వారు చెబితే వింటాడు.

***

మధ్య మధ్యలో ఈ గొర్రెలు కాచుకునే వారికి వాళ్ళ ఇళ్ళ నించి పది రోజులకి సరిపడినన్ని రొట్టెలు చేసి ఆటోలో తెచ్చిస్తారు. అప్పుడు అడవికి వచ్చిన వారిలోంచి కొంతమంది వెనక్కివెళ్ళి మరి కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి చేరి డ్యూటీలు మార్చుకుంటారు.

కథానాయకుడు క్రమేణా అక్కడ సమస్యలని వంట పట్టించుకుని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పోలీసుల పేరు, అన్నల (నక్సలైట్స్) పేరు చెప్పి సమస్యల్లోంచి వారిని బయట పడేస్తాడు.

అలా అడవంతా తిరిగి గొర్రెలని కాచి, ఆ పనిలో బరువు సులువులన్నీ నేర్చుకుని రాటు దేలుతాడు.

అడవి పెద్ద బాలశిక్ష అని, ప్రతి చెట్టుకి పుట్టకి, పురుగుకి ఒక భాష ఉంటుందని.. ఆ భాధ తెలిస్తే బతుకు తెలిసినట్టే అని కథానాయిక నోటి నించి విని అడవిమీద గౌరవం పెంచుకుంటాడు.

గురప్ప నిస్సహాయ స్థితిలో చివరికి విసిగిపోయి గొర్రెలమీద విసుక్కుంటూ ఉండగా పెద్ద వర్షం పడటంతో గొర్రెలకి తాగే నీరు దొరికిందని అందరూ సంతోషపడతారు.

అలా అడవి మీద ఏర్పడిన ప్రేమ, గౌరవంతో ఫారెస్ట్ సర్వీసుని ఎంచుకుని చివరికి అందులో సెలెక్ట్ అయి ఉద్యోగస్థుడవుతాడు మన కథానాయకుడు.

ఈ చిత్రం ప్రతి నిముషం ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా మంచి సంభాషణలతో, సంగీతంతో ఆకట్టుకుంటుంది.

తప్పకచూసి ఆనందించవలసిన చిత్రం!

Exit mobile version