[డా. కోగంటి విజయ్ రచించిన ‘కొన్ని అప్రకటిత సందర్భాలు’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]వా[/dropcap]న మబ్బు పట్టగానే
నెమలి పురివిప్పి తయారవుతుంది
నెమలి పింఛపు రంగు చూసి
నీలి మబ్బేమో చిన్నబోతుంది
పంట చేలను మరచి వానలు
సముద్రంలో కురిసి పోతాయి
వానను నింపుకున్న సంద్రం దాని
తీయదనాన్ని మరచిపోతుంది
నేను నీతో మాటాడాలనుకున్నపుడు
నీవు ఉరుముతూ మరలి పోతావు
నువ్వు నవ్వి పలకరించినపుడల్లా
నేను మెరుపునై ఆవిరౌతాను
తన పరిమళాన్ని గాలి దోచుకుంటోందని
పూలకి తెలియదు
పూలు కాబట్టే తన ప్రతి అడుగుకూ
తలలూస్తున్నాయని గాలికీ తెలియదు