[dropcap]అం[/dropcap]తేసి మనసుపెట్టి చూస్తావుకానీ,
కనుకొసలన మెరిసే
నీటిచుక్కల మాటేమిటీ.
ఉన్నంత హృదయాన్నీ దోసిలిపట్టి
ఇచ్చేయాలనే చూస్తావుకానీ,
వెన్నంటిఉన్న దుఃఖశిల మాటేమిటీ.
ఆసాంత మస్తిష్కాన్నీ
అపాత్రదానం చేయచూస్తావు కానీ
గుట్టలుగా పడిఉన్న వేదనాతరంగాల మాటేమిటీ.
ప్రియపిపాసీ మధుపాత్ర ఒలికిపోలేదు, ఖాళీచేయబడింది.
ప్రేమంతా మత్తువలెనే అగుపిస్తుంది,..
నిన్ను నువ్వు ఎలా ఖాళీచేసుకున్నా..!
విషాదం వేయికన్నులుగా ప్రవహించి
చెంపలపై చారికలు కట్టి, అవును మనసు చచ్చుపడుతుంది కావొచ్చు.
హృదయం మౌనమవుతుంది కావొచ్చు.
మస్తిష్కం స్తబ్ధత చెందుతుంది కావొచ్చు.
చిందించబడిన సర్వమూ, ఒకానొక నిర్లిప్త క్షణానికి
ఉరివెయ్యబడేదే అనే సత్యం పురుడుపోసుకున్నమ్మట
నీకు నువ్వులా మాత్రమే ఉండగలవనుకుంటా.