Site icon Sanchika

కూడు

[dropcap]”మ[/dropcap]న కళాచారము ఉదార్కము కావాలంటే మొదలు మనము చేతిలా కూడు తినేది యిడిసి పెట్టి ఇస్పూన్లు, చెంచాలలా తినేది నేరాలా” నేస్తాగాడు రాజుపాల్ అనిన మాటల్ని యిన్నబుటినింకా కెంచగాని మనసు ఆ మాటల చుట్టే తిరగతా వుంది. ఇట్ల తిరిగి తిరిగి ఇంగ సాలు అనుకొని కూడు తినేకి కూకొనె.

వాళ్లమ్మ తెలెలా (కంచం) సంగటి ముద్ద పెట్టి ఉలువల పులుసు చారు పోసే.

రెండు ఇస్పూన్లా ముద్దపైన యుద్ధము చేసి పిడసంత ముద్దను పీకి చారులా దొర్లాడిచ్చి నోట్లో పెట్టుకొని మింగి “ఉడుకు….. ఉడుకు” అని కిర్లిపెట్టేశా కెంచగాడు.

“ఎబుడు లేనిది ఈ పొద్దు ఎట్ల చిన్నా అంత ఉడుకు మింగితివి” అంటా వాళ్లమ్మ మూలింట్లా నింకా పారొచ్చె.

“చేతిలా తింటే ఉడుకు ఎంతుందని తెలిసేది, వాడు ఈ పొద్దు యిచిత్రముగా ఇస్పూనులా తినే దాన్నింకానే ఇట్లాయ” అపక్కనింకా వాళబ్బ అనె.

“ఇట్లేల చేస్తవి చిన్నా ఆ పాడు ఇస్పూల్లకి సొరణ (స్పర్శ) వుంటుందా పాడా, నువ్వు చేతిలానే తిను. కడుపుకెంత ఉడుకు కావాలని చేతికి బాగా తెలుసు” అని ఇస్పూలని పక్కేసె అమ్మ.

“రేయ్! మనపడా. పదివేళ్లకి పని చెప్పి, ఐదు వేళ్ళలా ముద్దను మింగే కళాచారము మనది. కష్టపడకుండా కాటికి కాళ్లు సామినవాళ్లు మాద్రిగా కత్తిరి, కటారుల్లా తినే బుద్ధి నీకేమిటికి” అంటా గట్టిగా గదిరే తాత.

అబుడు బుద్ధివచ్చె కెంచగానికి, చేతి కూడు మంచిదా, ఇస్పూన్లలా తినేది మంచిదా ఏది కళాచారం ఏది  గాచారము (గ్రహచారం) అనేది తెలిసి వచ్చే. చేతి వేళ్లని ఇష్టముగా చూసుకొని ముద్దను ముట్టి పిడస ఇంచుకొని చారులా కలుపుకొని కడుపు నిండా తినె.

*కూడు – తిండి, భోజనం

Exit mobile version