Site icon Sanchika

కూతురు

[box type=’note’ fontsize=’16’] కూతురుని చేతిలోకి తీసుకున్నప్పుడు అక్షరాలకు లొంగని, భావాలకి అందని అవ్యక్తమైన ఆనందమేదో కలుగుతుందని అంటున్నారు ఎం.కె. కుమార్. [/box]

[dropcap]శూ[/dropcap]న్యానికి తగిల్చిన చూపులు
ఏ అంతర్లీన భావాలను పలికిస్తున్నాయో
చప్పరిస్తున్న పెదవులు అద్వితీయమైన
ఏ అమృత ఫలరసాలను రుచి చూస్తున్నాయో

కదలాడుతున్న ఊహలు ఏ అనంత
ప్రపంచ చీకటి లోతులను తొలుస్తున్నాయో
నిర్విరామంగా కదలాడే లేలేత, పల్చని సాయం సంధ్య
వర్ణ చేతులు ఏ విశ్వపు నిగూఢ రహస్యాన్ని
పిడికిళ్లలో బిగించి బంధిస్తున్నాయో
ఆ చిన్న పెదవులు లేత వెన్నెలను పూయిస్తూ
అవధులు లేని నిర్భీతి ఆనందాలను అనుభవిస్తున్నాయో

జీవితపు తాత్వికతను ఏడుపు ద్వారా విడుదల చేసేదానికి
తను బిగుస్తున్న లేత నరాల సవ్వడి సరిగమల
ఆలాపనను పలికిస్తూ, శరీరంలోకి మరుమల్లెల పరిమళాలను
వెదజల్లుతున్నాయో
నిర్విరామ, నిర్వికార, ఊహించని భావాల దొంతరలను తన లేత
మస్తిష్క లోతుల్లో జరిపే రహస్య వాదాలను ఎలా పరిష్కరిస్తోందో

నా హృదయం భరించలేని పారవశ్యాన్ని తన లేత చెక్కిళ్లలో
ఎలా దాచుకుందో తన హృదయ స్పందనలకు నా ఉచ్చ్వాస, నిశ్వాసాలు
ఎలా నాట్యం చేస్తున్నాయో
నా పెదాలను తన పల్చని బుగ్గలకు
ఆనించిన ప్రతిసారీ అవ్యక్తమైన, ప్రగాఢ
భావ తృప్తికి ఎందుకు లోనవుతానో
ఇదే అక్షరాలకు లొంగని, భావాలకి అందని
అవ్యక్తమైన ఆనందమేమో.

Exit mobile version