Site icon Sanchika

కూతురుకు తల్లి ఉత్తరం

(ఇది కథ కాదు. ఓ యదానిక. విజిటింగ్ డే రోజున విద్యార్థుల ఏడుపులను, తల్లిదండ్రుల బుజ్జగింపులను చూసిన రచయిత్రి స్పందనలు.)

[dropcap]నా[/dropcap]నమ్మ ఎలా ఉన్నావ్?

హాస్టల్లో ఉండనని ఏడుస్తున్న నిన్ను వదిలేసి వచ్చానని, నాకు హృదయం లేదని అనుకుంటున్నావు కదూ? ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? నీ ఏడుపు లాగా మన ఊరి ఆకాశం కూడా ఆగి ఆగి ఏడుస్తూనే ఉంది. నీలి ఆకాశంలో నేరేడు పళ్ళ లాంటి దిగులు మేఘాల దుప్పటి కప్పుకొని కన్నీటి దారలను కారుస్తుంది. ఆ కన్నీటి దారాలను, పూల పూల జల్లులను తల్లి భూదేవి అమృతంలా స్వీకరిస్తుంది. వాటిని తన గర్భంలో దాచుకుని ఆకలిగా ఉన్న తన ముద్దు ముద్దు బిడ్డలైన చెట్టు చేమలకు, మొక్క మొలకలకు, దరువులకు, చెరువులకు, గుట్టా గులకలకు చనుబాల దారలుగా, తనలో దాచుకున్న రసాయనాలతో కలిపి అందిస్తుంది. మొక్కలకే కాదు, తన లోపల, బయట, తన మీద ఉన్న సమస్త ప్రాణికోటికి జీవనాధారంగా ఇస్తుంది. ఇవన్నీ తల్లి భూదేవికి సంతృప్తి, సంతోషదాయకాలే కదా!?

కాని నీ ఏడుపు నాకు నిద్రలో కూడా హృదయాన్ని పిండేస్తుంది. తనువంతా సూదులతో పొడుస్తూ గాయాలను చేస్తుంది తల్లి. ఏం చేస్తున్నా మరిచిపోనివ్వకుండా మెలి తిప్పేస్తుంది. నీవు అడిగినట్లు వెనక్కి తీసుకొస్తే ఎలా? నీకు అందమైన బాల్యం ఇవ్వాలని అరకోరగా ఉన్న మన ఊరి బడిలోనే చదివించాను కదా? రవాణా సౌకర్యాలు, రహదారులు, రక్షణ, భద్రత సరిగ్గా లేకపోయినా, నిండుగా వేసుకున్న వస్త్రాల లోపల ఏముందోనని ఎకిలిగా చూసే ఈ మగమృగాల చురకత్తులలాంటి చూపుల్ని, చూచి చూడనట్లుగా రోజు అంత దూరం వెళ్లి రావడం కష్టంగా ఉందనే కదా, మన స్థాయికి మించి అంత దూరం అంత ఖర్చు అయినా హాస్టల్‌కి వెళ్ళింది.

ఆలోచించు.. తల్లి. చదువే జీవితం కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. కాని జీవితం అంతటికి మూలం కూడా చదివే. మన లాంటి మధ్యతరగతి వారికి మరీ మరీ ముఖ్యం. అలవాటైన ఈ మధ్యతరగతి జీవితం నుంచి ఒక మెట్టు కిందకు దిగి బ్రతకడం అంటే పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం లాంటిది. బ్రతకడానికి కట్టెలమ్మినా తప్పు కాదు. నాలుగిళ్ళ మధ్య దోశెల కొట్టు పెట్టుకొని దోశెలు అమ్ముకున్నా తప్పు కాదు. నాలుగిళ్ళల్లో అంట్లు తోముకున్నా తప్పు కాదు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని చేయాల్సిందే. ఏ పని చేయకుండా తిండి తినే అర్హత మనుషులకు లేదు.

నా బంగారు తల్లి! నది ఎప్పుడూ ముందుకే ప్రవహిస్తుంది. ఎప్పుడు వెనక్కు ప్రవహించదు. తుఫానులు తాకిళ్ళను, వరదల హోరును తట్టుకొని, ఒడ్డులను వరుచుకుంటూ ముందుకే దుముకుతూ, గలగల ప్రవహిస్తుంది. వాన జోరు ఎక్కువైనప్పుడు ప్రశాంత ప్రవాహంలా కనిపిస్తుంది. ఆనకట్టల అడ్డు లేనంతవరకు నదీ ప్రవాహం ముందుకే మునుముందుకే. నిశ్చల (స్టాగ్నెంట్) స్థితిలో కూడా ఉండదు. రాళ్ళను కొట్టుకుంటూ గుట్టలను ఈడ్చుకుంటూ అనేకం మురుగులను కలుపుకుంటూ తన తల్లి సముద్రం వైపుకే సాగుతుంది. ఎన్ని మురుగులను తనలో నింపుకున్నా, ఎప్పుడు స్వచ్ఛమైన నీటినే అందిస్తుంది. నదీ ప్రయాణంలా నీ పయనం ఉండాలనే నా ఆకాంక్ష.

నీవు గోదావరి నది ఒడ్డున ఉన్నావు. గోదావరి పరవళ్ళు తొక్కుతూ, ఎర్రని నీటితో గలగలా ప్రవహిస్తూ, జరజర దుముకుతూ, తన చుట్టూ ఉన్న భూతల్లిని సారవంతం చేస్తూ సంద్రం వైపే సాగుతుంది. గోదావరి ఎప్పుడన్నా వెనక్కి ప్రవహిస్తుందా? చిన్నప్పుడు నీకు కథలు చెప్పిన గుoడ్లకమ్మ నది లాగే గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టి చదువనే బంగాళాఖాతం వైపు ప్రవహించు తల్లి.

‘ఏ నది అయినా ముందుకే, వెనక్కి ప్రవహించదు.’

నా బంగారు తల్లి! మీ కాలేజీ తోటలో మనం దొంగిలించిన పచ్చి మామిడి కాయను ఉప్పు కారంతో నంజుకుంటూ తిన్నావా? చాలా ఇష్టంగా తింటావు కదా! కళ్ళు మూసుకుని నాలుకతో రిక్కలు వేసుకుంటూ. నువ్వు తినే సీను గుర్తొచ్చి నవ్వుకున్నాను. తినడానికి నేనూ ప్రయత్నించాను. కాని ఆ పులుపు నా వల్ల కాలేదు. వేస్ట్ చేయడం ఎందుకని కొద్దిగా పప్పు వేసి వండుకున్నాను. భలే ఉంది. నిన్ను తలుసుకుంటూ తిన్నాను.

అయినా అది దొంగిలించటం ఎలా అవుతుంది. ఎరువులు, రసాయనాలు ఏయని, చెట్టు నుండి వేలాడే పండును కోసుకోవడం మనిషి సహజ లక్షణం. ఉదయం మనం చూసినప్పుడు నిండుగా వేలాడుతూ కొంచెం పెద్ద పెద్ద కాయలు కనిపించాయి. నాలుగు గంటలకు మనం చూసేటప్పటికీ అలంకరణలు తీసేసిన సౌందర్యవతి లాగా చిన్న చిన్న పిందెలు మిగిలాయి. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు ‘విజిటింగ్ డే’కు వచ్చిన వాళ్ళు తలా ఒకటి కోసుకోని ఉంటారు. రా రమ్మని నోరూరిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎవరైనా. పైగా ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడి కాయలు. తిండి అందించేదే చెట్టు. మనుషులకే కాదు, సమస్త జీవులకు ఆహారాన్ని అందించేది మొక్కలే కదా!

ఓ సంఘటన చెప్పనా? శారదా రమేష్‌ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. శారదా కుటుంబం అంతా మనకు పరిచయమే. శారదా అన్నయ్యలకు ఓపిగ్గా అన్ని చెప్పి ఒప్పించాం, నేను, నాన్న ప్రసాదoకల్. మాదేముంది మా అమ్మ ఒప్పుకోవాలి అన్నారు. వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి వాళ్ళ ఊరు వెళ్ళాము. ఆ అమ్మకు 70 ఏళ్ళు. చాకిరి చేసి చేసి బాగా వంగిపోయి ఉంది. ఆ పెద్దమ్మతో విషయాలన్నీ చెప్పాము. ఆ పెద్దమ్మ “మగ పిల్లలు ఒప్పుకున్నారు కదమ్మా, వాళ్లకి మంచి చెడు తెలుసు. నలుగురిలో తిరుగుతున్నారు. అయినా రైతు దుక్కి దున్ని, విత్తు లేసి, కలుపు తీసి, కంచె వేసి పంటను రక్షించుకుంటాడు. పూచిన పువ్వు కాచిన కాయ అంతా రైతుకే దక్కుతుందా? ఎండకి ఎండి, వానకు తడిచి, గాలికి పోయి, పురుగు పుట్రా, పక్షులు, గొడ్డు గోదా తినగా మిగిలిందే కదా రైతుకు దక్కేది. మన దగ్గర ఉన్న వాళ్ళే మన బిడ్డలు.” అని తన నిర్ణయాన్ని రైతుతో పోల్చి ఎంత బాగా చెప్పిందో. ఆమె చెప్పిన తీరుకు అందరం ఆశ్చర్యపోయాం. ఆమె ఏమి చదువుకోలేదు. వ్యవసాయ కూలీగా జీవితాన్ని చదివింది. ఆమె చెప్పిన పోలికకు వినమ్రంగా ఆమె ముందు తలవంచి మా ఆనందాన్ని ప్రకటించాం. ఆ పోలికను మర్చిపోగలమా? ఎవరైనా?

నువ్వు పుట్టక ముందు ఈ ఇంట్లో ఉన్నామని, ఓ ఇల్లు చూపిస్తాం కదా! కొత్తపట్నం బస్టాండ్ దగ్గర. ఆ ఇంటిలోనే వారి పెళ్ళి చేసాం. జిల్లా జైళ్ల సూపర్నెట్ గారు, చంద్రయ్య మాస్టర్ గారు సాక్షి సంతకాలు పెట్టారు. అతను తిక్క వేషాలు వేయకుండా ఉoడాలనే సూపర్నెంట్ గారితో సంతకాలు పెట్టించాము. మాస్టర్ గారు హక్కుల ఉద్యమంలో పని చేస్తారు. మేము చేసిన చివరి పెళ్లి అదే. అంతకుముందు ప్రతి సంవత్సరం రెండో మూడో చర్చించి, ఒప్పించి చేసే వాళ్ళం.

నేను టీచర్‌గా ఎంత ఆనందాన్ని పొందుతానో నీకు తెలుసు. కంప్లైంట్‌గా అంటావు కదా, నాకన్నా మీ పిల్లలే (విద్యార్థులు) ఎక్కువ, మీ పిల్లలే తెలివిగల వాళ్ళు, మీ పిల్లలకే తల్లిదండ్రుల పట్ల హృదయం ఉందని. ఆ మాటలే కళ్ళ ముందుకొచ్చి నవ్వుకుంటున్నాను. ఇంకో మాట గుర్తొచ్చింది. అమ్మకు స్కూల్‌కి వెళ్తే ఇల్లు, మనము ఏం గుర్తున్నాము నాన్నా, మనకు బాగా లేకపోయినా అమ్మకు బాగా లేకపోయినా స్కూల్‌కి వెళ్లి అన్ని మరిచిపోయిదని అంటావుగా.

మర్చిపోవడం కాదమ్మా! ఆ విద్యార్థుల ఆనంద సంతోషాలను, వారి ఇబ్బందులను, వారి కబుర్లను, జోక్స్ లను, కథలను, కల్పనను, తెలివితేటలను అమ్మ ఆస్వాదిస్తుంది. సిరంజన్ రోజుకు ఒక కథ ఎంత బాగా ఊహలతో రాసుకోస్తాడు. దుర్గాప్రసాద్ నడిచే క్యాట్ వాక్ లను, అతను వేసే బొమ్మలను వాళ్ళ ఆఫీసర్లు కూడా మెచ్చుకొని ఫోటోలు, వీడియోలు తీసుకెళ్ళతారు గదా. ఆ విద్యార్థుల గురించి అమ్మ చెప్పే కబుర్లు అన్ని మనం కూడా ఎంతో సంతోషంగా వింటాముగా నానమ్మ! అనే మీ నాన్న సమర్థింపులు గుర్తొస్తున్నాయి.

టీచర్‌గా ఎంత ఆనందాన్ని పొందుతానో అంతకన్నా రెట్టింపు రైతుబిడ్డగా, రైతుగా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాను. అందుకే నేను చెయ్యలేని వ్యవసాయాన్ని నువ్వైనా చేయాలనే వ్యవసాయ శాస్త్రం చదువు అని ప్రోత్సహిస్తున్నది. పొలం లేదు కనుక వ్యవసాయం చేయలేకపోయినా విత్తనాలు, ఎరువులు, భూసారం, ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులు మొదలైనవి చాలా ఉంటాయని మన మురళి డాక్టర్ గారు నీకే చెప్పారు కదా. ఓ సైనికుడిగా ఓ రాజకీయ నాయకుడిగా ఉండే కంటే రైతుగా ఉండటమే నాకు అత్యంత ఇష్టం తల్లి. ఓ ఎకరం పొలం కొనుక్కోవాలని కోరిక నా జీవితాంతం తీరలేదు. తీరదు కూడ.

సరే ఆ సంగతులు వదిలి అసలు సంగతులలోకి వస్తున్న. నీరు తాగుతుంటే అందమైన నీ బుడ్డి రాగి చెంబు చూడగానే ప్రాణం చివుక్కుమoటుంది. అన్నం తింటు నీకు ఇష్టమైన నువ్వు తినే పువ్వుల పువ్వుల ప్లేటు, టిఫిన్ తినే బాదంకాయాకారపు గిన్నే చూడగానే ఏమి తిన్నదో? ఏమి తింటున్నదో?ననే బెంగ వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి నానమ్మ. బ్రతకడానికి తినాలి తప్ప తినడానికి బ్రతకకూడదు. కొత్తగా వెళ్ళావు కాబట్టి హాస్టల్ నచ్చకపోవచ్చు. చెంగుచెంగున దూకే నీ వయసు పిల్లలందరూ అక్కడే ఉన్నారు. వారితో కలిసిపోయి స్నేహ సంబంధాలు ఏర్పడితే అది ఒక అద్భుత ప్రపంచం కాదా? హాస్టల్ నచ్చకపోయినా తప్పదు. చదవాలి.

చదువు లేకపోయినా ఆర్థికంగా ఏదో ఒకటి చేసుకుని బ్రతకవచ్చు. కాని శ్రీశ్రీ తాత, చలం తాతలు రాసింది చదవగలవా? స్త్రీల గురించి, బిడ్డల పెంపకం గురించి చలం తాత ఏం రాసాడో తెలుసుకోగలవా? ఎవడు వాడు, ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు, కారులో షికార్ కెళ్లే పాల బుగ్గల చిన్నదాన, హాలాలన్ని పొలాలు దున్ని హేమం పండించగ, గర్జించు రష్యా గాడ్రిoచు రష్యా లాంటి శ్రీశ్రీ పాటలను, వీరగంధం తెచ్చినాము, వీరులెవ్వరో చెప్పండి లాంటి పాటలను రోమాలు నిక్కబొడుచుకొని వినగలవా? చే, చారు, భగత్ మామల గురించి తెలుసుకోగలవా? నువ్వు అమ్మమ్మ అని పిలిచే రంగాజీ గారు రాసిన ఎనభై పుస్తకాలను చదవగలవా? చాచా నెహ్రూ గారు ఇందిరాగాంధీకి జైల్ నుంచి రాసిన అద్భుతమైన లేఖల గురించి తెలుసుకోగలవా? కందుకూరి వీరేశలింగం గారు వితంతు వివాహాలు చేయడానికి ఎన్ని కష్టాలు పడింది తెలుస్తుందా? శ్రీపాద రచనల్లో అద్భుత శైలి గురించి తెలుస్తుందా? చింగీజు ఐత్ మాతోవ్ రాసిన తల్లి భూదేవి, జమీల్యా, తొలి ఉపాధ్యాయులను మైమరిచి చదవగలవా? ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మక్సింగోర్కీ ‘అమ్మ’ను చదవగలవా?

మన స్వతంత్ర పోరాటం గురించి, అల్లూరి సీతారామరాజు, గాంధీ, గాడిచర్ల, పింగళి వెంకయ్య, ఆజాద్ హింద్ పౌజు గురించి తెలుసుకోగలమా? మార్క్స్ ఏంగిల్స్ చెప్పిన సమాజ విజ్ఞాన శాస్త్రం గురించి, డార్విన్ జీవపరిణామ శాస్త్రం గురించి, ఫ్రాన్స్, రష్యా పోరాటాల గురించి తెలుసుకోవాలి అంటే చదవాలి. కచ్చితంగా చదవాలి. గాంధీ గారు చెప్పిన, “చినిగినా చొక్కా నైనా తొడుక్కో, మంచి పుస్తకాన్ని కొనుక్కొని చదువుకో” మణిపూస లాంటి మాటలను స్లోగన్‌గా మార్చి మన ఇంట్లో, బడిలో పెట్టుకున్నది నీకు తెలుసు. తెలియటం కాదు నిత్యం గుర్తుంచుకో.

బ్రతకడం కోసం, బ్రతుకు పోరాటం చేస్తూ సమయాన్ని చాలకుండా చేసుకోవడం కన్నా కొంత బ్రతుకు కోసం, కొంత పుస్తకాలు చదవడం కోసం సమయాన్ని కేటాయించుకునే వెసులుబాటున్న బ్రతుకును ఎన్నుకోవాలని నా అభిమతం. మోహన్ సుందరం పాత్ర సృష్టించిన డాక్టర్ వి. చంద్రశేఖర్ గారు రెండు చేతులా సంపాదించగల డాక్టర్ వృత్తిని చదవటానికి, రాయడానికి టైం చాలాటం లేదని వదిలి, రైల్వే ఉద్యోగoలో చేరి అనేక పుస్తకాలు రాశాడు. దానికి మించి విస్తృతంగా చదివాడు. ఈ సమయo కోసమే నా దిగుళ్ళను, నీ ఏడుపులను కొంతకాలం అణుచుకుంటూ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాలి నేను గాని, నువ్వు గాని. తప్పదు. నా బ్రతుకు పోరాటం నీకు తెలుసుగా ఎంతెంత ప్రయాణాలు, ఎంతెంత రికార్డుల రాచేదాన్ని. చదవడానికి సమయమే లేకుండా అలసిపోయేదాన్ని కదా! ఓ ఉపాధ్యాయురాలుగా, తల్లిదండ్రులు, అధికారులు నా పని మెచ్చుకున్నప్పుడు నా అలసట లెక్కలేనిది కదా! దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. మినిమం చదువైనా ఉండాలిగా తల్లి. అర్థం చేసుకో బంగారు.

మార్కులు మెమరీని బట్టి, సమయస్ఫూర్తిని బట్టి, చదివేదాన్ని బట్టి కూడా వస్తాయి. నా విద్యార్థులు దుర్గ, వెంకటేశులు గురించి నీకు తెలుసుగా ఎంత తెలివిగా ఉండేవారు. వెంకటేష్‌ని అయితే మూడో (థర్డ్) టీచర్ అనే వాళ్ళం. మేము తల్లిదండ్రుల మీటింగులో లేదా మరో మీటింగ్‌లో ఉన్నా, ఆఫీసర్లు వచ్చినప్పుడు వారికి కావలసినవి చెపుతూ బిజీగా ఉన్నప్పుడు స్కూల్ మొత్తాన్ని నిశ్శబ్దంగా, బాధ్యతగా నిర్వహించేవాడు. ఒక క్లాస్కు ఒక పాఠం చెప్పి, అర్థం కాని పిల్లలకు మరొకసారి నువ్వు చెప్పు అని దుర్గకు చెప్పి, నేను మరో క్లాస్ తీసుకునే దాన్ని. దుర్గ పాఠం చెబుతుంటే నేను ఆశ్చర్యపోయి చూసేదాన్ని. నేను ఎలా చెప్పానో అలానే చెప్పేది. దుర్గ చెపుతుంటే, నేను ఇంత బాగా చెప్పానా? అని నాకు నాకే డౌట్ వచ్చేది. కాని ఇద్దరికీ 50 కి 40 ,42 మార్కులు మించేవి కావు. ఏంట్రా అంటే ,చాల్లే మేడం నలబై రెండు మార్కులు వచ్చాయి గదా అనేవాళ్ళు. పెద్దగా కష్టపడని మరియమ్మ, నాగార్జునలకు నలబై ఆరు, నలబై ఏడు వచ్చేవి. పరీక్షలు రాయడం కూడా వంటలాగా ఒక కళ. దుర్గా, వెంకటేషులకు రాస్తున్నప్పుడు మధ్యలో కొంత మేటర్ ఎగిరిపోయేది. బిట్స్ ఆలోచించకుండా దబదబా పూర్తి చేసేవాళ్లు. ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని అవన్నీ చెప్పి బాగా రాయమని ప్రోత్సహించేదాన్ని. వెంకటేష్ ఇప్పుడు ఓ సాఫ్ట్‌వేర్. దుర్గ గుర్తువస్తే నాకు కన్నీళ్లు ఆగవు. వాళ్ళ నాన్నకు వచ్చిన హెచ్.ఐ.వి.కి వాళ్ళమ్మ, ఐదో తరగతి చివర్లో దుర్గా బలైంది. సంక్రాంతి సెలవుల వలన దుర్గను చివరి సూపులు కూడా చూడలేదు. దుర్గని ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకొచ్చాను, వాళ్ళ అమ్మమ్మకు తెలియదని. దుర్గ విషయం నాకు తెలిసీ, చెప్పలేదని మిగతా విద్యార్థుల తల్లిదండ్రులంటే అలా చెప్పకూడదని, కేసులు అవుతాయని, ఎవరు ప్లేటు, గ్లాసు నంబర్స్ వేసి సపరేట్‌గా ఎవరవి వారికే ఉంటాయని, పిల్లలందరి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటానని, ఎలా చెప్పాల్సిన వారికి అలా నచ్చచెప్పాము. ఈ అన్ని విషయాల్లో మా కొలీగ్ మార్గరెట్ గారు నాకు ఎన్నుదన్నుగా నిలిచింది. దుర్గను వాళ్ళ బంధువులు మర్చిపోయారేమో కాని ఈ పదిహేను ఏళ్లుగా మనం మర్చిపోయామా!

ఇప్పుడు డాక్టర్లయిన, లాయర్లయిన, సాఫ్ట్‌వేర్లయిన క్లాస్ పుస్తకాల నాలెడ్జి తప్ప సామాజిక, ఆర్థిక సాంస్కృతిక నాలెడ్జ్ లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌కు తేడాలు తెలీయవు. అవి ఎలా ఏర్పడింది తెలుసా? పొట్టి శ్రీరాముల ఆత్మబలిదానం తెలుసా? విశాఖ ఉక్కు గురించి తెలుసా? అశోకుడు, అక్బర్, టిప్పు సుల్తాన్‌ల గురించి తెలుసా! చారిత్రక, సామాజిక నాలెడ్జ్ లేకుండా ఏ పని చేసినా మెకానికల్‌గా, క్లాసు పుస్తకాలలో చదువుకున్నది చదువుకున్నట్లుగా ఆచరించటమే అవుతుంది. కాని ప్రాక్టికల్‌గా ఆలోచించలేకపోతున్నారు. మన దేశానికి ముందు, ‘చైనా’కు తర్వాత స్వాతంత్రం వచ్చినా, మనం ఎందుకు వెనకబడి ఉన్నాము. ఈనాడు ప్రపంచమే మేడిన్ ఇన్ చైనా (made in China) వస్తువుల కోసం ఎదురుచూస్తున్నది. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న మనం బంగారు పతకాల స్థానంలో ఎక్కడున్నాము.

అందుకే మార్కులు కోసం చదవొద్దు. విజ్ఞానం కోసం, సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం చదువు. ఇష్టంగా చదువు. “విద్యలేనివాడు వింత పశువు” అనే మన పెద్దల మాటలను స్మరిస్తూ, స్ఫూర్తిగా తీసుకొని చదువు. “బుద్ధిని నాగరికరించు దేహాన్ని మొరటుగా చేయి” అని మావో చెప్పిన మాటలను నిత్యం గుర్తించుకో.

పున్నమి వెన్నెల చంద్రుడిలో నిన్ను చూస్తున్న. ముద్దులన్నీ నీకే నీకే. నీలాగా మిరపపoడేరుపు చంద్రుడు ముద్దొస్తున్నాడు. బై తల్లి! అందమైన కలలు కంటూ నిద్రపో.

బోలెడంత ప్రేమతో అమ్మ.

బలవంతంగా హాస్టల్లో వదిలిపెట్టి వెళ్లిందని నువ్వు తిట్టుకుంటున్న అమ్మని కూడా.

Exit mobile version