పీఠిక
[dropcap]ప[/dropcap]దమూడున్నరేళ్ళ క్రితం లీ చాంగ్-డాంగ్ తీసిన Barkha Satang లేదా Peppermint Candy అన్న సినిమాని మా ఫ్రెండ్ బలవంతం మీద చూశాను. పేరు తమాషాగా ఉంది. నాకసలే రొమాన్సెస్, రొమాన్టిక్ కామెడీలంటే ఇష్టం. అప్పట్లో. అఫ్కోర్స్! ఒక జాన్ర కి చెందిన థ్రిల్లర్స్ అన్నా కూడా ఇష్టమే. కాకపోతే అవి పాప్కార్న్ తింటూ ఎన్జాయ్ చేసే తరహావి 🙂 . ఇది కూడా అలాంటిదేనేమో అని చూసే ప్రయత్నం చేస్తే, ప్రారంభమే అదో రకంగా అనిపించింది. ఎక్కడో తేడా కొట్టి కాస్త ఎన్క్వైరీ చేస్తే ఇది నేననుకున్న రొమాన్టిక్ కామెడీనో, పేరులాగా పాప్కార్న్ ఎన్టర్టెయిన్మెంట్ తరహానో కాదు. చూడాలన్నా కాస్త స్టఫ్ ఉండాలి అని అర్థమయింది. సరే అని మళ్ళా చూశాను.
Narration లో ఒక రకమైన రిథమ్ ఉంది. గుండెనెక్కడో తట్టి పలకరించే తడి ఉంది. ఏడు భాగాలుగా (narration packets అనుకోవచ్చు. అంటే ఏడు ఎపిసోడ్లలో సినిమా కథ నడుస్తుంది) ఉన్న సినిమాలో మొదటి భాగం చివర ప్రోటగనిస్ట్ (హీరో మన తెలుగూఫ్ ల వ్యవహారికంపు) “I’m going back,” అంటూ మనని వెనక్కి తీసుకుని వెళతాడు. అంత వరకూ ముగిసే సరికి కథలో లీనమయ్యాను. Then rest is history! ఆ విధంగా విశ్రాంతి చరిత్ర అయింది.
ఈ సినిమాని గురించి వివిధ రకాలుగా నేను చాలా చోట్ల వ్రాశాను. నవతరంగంలో మొదటగా తెలుగులో వ్రాసినా, తరువాత వ్రాసినది మాత్రం ఆంగ్లంలోనే. అలా ఆంగ్లంలో మొదటగా వ్రాసినది… Passion for Cinema లో. అక్కడ వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి Oldboy సినిమాను పరిచయం చేసింది. చేస్తూ, సినిమా ఎంత బాగుంటుందో, వయలెన్స్ అంత భీకరంగా (Shall we say gruesome?) ఒక కాషన్ కూడా అందింది. కాస్త ప్రయత్నాలు చేసి, దొరక్క అక్కడే వ్యాఖ్యలో ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తే, మరికొన్ని వివరాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూస్తుంటే 25:1 Best fight scene in movie history అన్న పేరుతో Oldboy లో దాదాపూ నలభై నిమిషాల దగ్గర వచ్చే ఒక ఐకానిక్ సన్నివేశం దొరికింది.
నాలుగైదు సార్లు చూస్తే బాగా నచ్చింది. అందులో ఉన్న సినిమాటిక్ ఇంటెన్సిటీ, నటుల హావభావాలు (నిజంగానే కసితో పగతో కొట్టుకుంటున్నారనుకుంటాం) అక్కడే దొరికిన మిగతా వీడియోలను చూశాను. రకరకాల సినిమాలు. ఎక్కువ భాగం స్టంట్ సన్నివేశాలే. అన్నింటి గురించీ ఎన్క్వైరీ చేశాను. ఆ ప్రయత్నంలో నాకు మొదటగా దొరికింది Sympathy for Mr. Vengeance. అప్పుడే తెలిసింది Oldboy ఇదే డైరక్టర్ తీసిన Vengeance Trilogy లో రెండవ భాగమని. మొదట మిస్టర్ వెన్జెన్స్ చూస్తే ఒక పనైపోతుందని వెతికితే, అసలలాంటివి మా ఊళ్ళో (నరసరావుపేట/గుంటూరు) దొరకనే దొరకవని తేలింది.
పైగా… కొంత మంది వింతగా చూడటం కూడా తటస్థించింది. లాభం లేదని ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో ఆల్రెడీ కొరియానంలో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్ని హలోలూ, మరికొన్ని Hi లూ తరువాత, ఇనీవిటబుల్‌గా, “నువ్వేమి చేస్తుంటావబ్బాయీ?” అన్న ప్రశ్న వచ్చింది. ఫలానా, ఫలానా అన్న వివరాలు ఇచ్చాను. మాటల్లో బఖా సటాంగ్ గురించి రావటంతో, ఆ మిత్రుడితో నేను వ్రాసిన ఆర్టికిల్స్ గురించి చెప్పాను (సెల్ఫ్ డబ్బా, స్వోత్కర్షా, స్టెఫీ గ్రాఫ్, అనిల్ కుంబ్లే ఎట్సెటరా ఎట్సెటరా). పంపించరా పిల్లకాయ్ అంటే పంపించాను. బ్రహ్మాండంగా వ్రాశావురా బాలకా (SSSA) అని అయితే కొరియన్ సినిమా మీద ఇంటరెస్టుందా? అన్న ప్రశ్న వేశారు.
వెంకీలో రవి తేజ ఇష్టైల్లో, “ఫఢి ఛచ్చిఫోథానన్హుఖోంఢీ”. అన్నా. “అయితే నీకు కిమ్ రే-వన్ తెలుసా?” అన్నారు. “వాడా? మా ఇంటి ప్రక్కనే,” అన్న లెవిల్లో… “సూపరు, ఫాస్పేటు, లైము,” అదీ ఇదీ అంటూ బిల్డప్ ఇచ్చాను. ఎందుకంటే ఆ సదరు మా సూపరు, ఫాస్పేటు, లైము నటించిన “…Ing” అన్న సినిమాని చూసి ఉన్నాను. “అయితే సోక్రటేస్ చూశావా?” అన్నారు. “సోక్రటీస్ తెలుసు కానీ, మీరు చెప్పిన సినిమా తెలియదు. సోక్రటీస్ జీవిత చరిత్రా? అది సెవెన్త్ లోనో, ఎయ్త్ లోనో ఇంగ్లీషు రీడర్లో ఉండేది,” అన్నా. “ఇలా అయితే నీకు ఘాట్ఠిగా తెలిసిన నాలుగు వరల్డ్ సినిమా చెప్పు బాబూ,” అన్నారు. “Michelangelo Antonioni (అప్పట్లో కాస్త ప్రెస్టీజియస్ ఆ పేరు 😉 ), మార్టీన్ స్కార్సీసీ, పీటర్ జాక్సన్… అలా నాలుగైదున్నరారు పేర్లు వదిలి చివరగా అస్మత్ (సినిమా) గురుభ్యోన్నమః, “ అన్నాను. “ఆయనెవరు?” అన్న ప్రశ్న వస్తే, “ఆయనెవరో తెలియదా? ఆగస్టు పాదారున పుట్టిన వీరుడూ, కెనడియన్ యోధుడూ…,” అన్న లెవిల్లో బిల్డప్పిచ్చాను.
రెండు నెల్ల పాటూ అటు వైపు నుంచీ సమాధానం లేదు. నేనూ నా గొడవల్లో పడి మర్చిపోయాను. కానీ Oldboy వదల్లా నన్ను. దాంతో అసలు ఏమి జరిగిందబ్బా అని కాస్తంత ఎన్క్వైరీ చేస్తే తెలిసిన విషయం… మా కొరియాన మిత్రుడికి ఒక మెసేజ్ వెళ్ళిందట! ఏమనంటే… “ఒక్కొక్కటీ కాదు షేర్ ఖాన్! వంద సినిమాల్ని పంపు. లేక పోతే వీణ్ణి భరించటం కష్టం,” అని. గట్టిగా ఆన్లైన్ పరిచయమే తప్ప ముఖం కూడా చూసి ఎరుగను. వీడికి అన్ని సినిమాలా?” అనుకుని, వాడు అడిగినప్పుడే చూద్దామని ఊరుకున్నారట. నేనూరుకోనుగా, మెయిల్స్ పెట్టి, నా వ్రాత కోతలు పంపీ, అలా ఇలా విసిగిస్తే, చివరాఖరికి “నీ రాతల్లో ఒక స్పార్కుందబ్బాయీ,” అన్నారు. “అయ్యా! స్పార్కుంది హైదరాబాదు విద్యానగర్ లో కదా! (స్పార్క్ ఒక గేట్/పీజీ ఎన్ట్రన్స్ కోచింగ్ సెన్టర్)” అన్నాను as usual గా నా స్టైల్లో. “ఇదే నీతో సమస్య. కుళ్ళు జోకులేస్తావు. నువ్వు వ్రాసిన స్టైల్లో ఒక స్పార్క్ ఉంది. స్ట్రీమాఫ్ కాన్షస్నెస్ లా ఉన్నా, మల్టిపుల్ రీడింగ్స్‌కి ఆస్కారమిచ్చే గుణముంది. కీపిటప్! అని కహృ,” అన్నారు. (SSSA 😉 ). “ధన్యుండ, ఆ విషయం నాకునూ తెలుసును,” అని పళ్ళికిలించా ఇలా స్మైలీ రూపంలో.
“నీకు సరిగ్గా సినిమాలు చూట్టం రాదు. ముందు అది నేర్చుకో. ఇప్పటికి వెన్జెన్స్ ట్రైలాజీ పంపుతున్నాను. సినిమాల మీద మామూలు ఇంట్రస్టు కాకుండా కాస్త ఆపేక్ష ఉంటే కనుక వీటిని చూడు. నువ్వు విన్నట్టే వయలెన్స్ ఎక్కువ వీటిలో. కానీ, ఎలాగోలా చూడు. ఏమన్నా సాయం కావాలంటే నన్ను అడుగు. అంటే వన్ ఫీట్ కాదు. ఆస్క్ మీ అని కహృ. ఆ పెసిమిజ్మ్ నీకు నచ్చదు. డార్కర్ టోన్ నీకు సహించదు as of what I gathered in our conversations. కానీ సినిమాల మీద మామూలు ఇష్టం కన్నా ఎక్కువ ఇష్టం ఉంటే మట్టుకూ చూడు. అలా అయితే చెప్పు. బాక్స్ సెట్ పంపుతాను,” అన్నారు.
“తప్పకుండా! ధన్యోస్మి సోదరా!” అన్నాను తెలుగులో టైప్ చేస్తూ. “నాకు తెలుగు రాదు కనుక ఇంగ్లీషులో చెప్పు,” అన్నారు. “Thanks a lot అని కహృ,” అని సెలవిచ్చాను. పదిహేను రోజుల తరువాత బాక్స్ సెట్ అందింది. అలా ఆ మిత్రుని సహాయంతో, కొరియానం మొదలెట్టాను. క్రమంగా ఆయన చెప్పిన ‘నాకు సినిమాలు చూట్టం రాదు’ అన్న మాటకర్థం తెలిసింది. విషయం తెలిసింది కనుక ఎలా చూడాలో (ఒక filmmaker లేదా screenwriter) అలా చూట్టం నేర్చుకున్నాను. క్రమంగా కొరియన్ సినిమాతో ప్రేమలో పడి, దాన్నే మాతృ భాషగా అంగీకరించి, దాదాపూ 21వ శతాబ్దంలో విడుదలైన మేజర్ కొరియన్ సినిమాలు అన్నీ చూశాను. బఖా సటాంగ్ తో మొదలయి, Oldboy సెర్చింగ్ లో లోపలకు వెళ్ళి, వెన్జెన్స్ ట్రైలాజీ బాక్స్ సెట్ తో వేగం పుంజుకున్న నా కొరియానం ఎంతో అద్భుతంగా సాగింది. సాగుతూనే ఉంది. ఆ ఎడ్లెంచరస్ జర్నీలోని కొన్ని కీలక ఘట్టాలే ఈ కొరియానం – A Journey Thru (Korean) Cinema.
ఇంతకీ కొరియానం అంటే కొరియన్ సినిమా ప్రయాణమనే కాదు. కొరియన్ సినిమా అనే పడవనెక్కి ఒక తెలుగూఫ్ కొరియన్ కల్చరల్ వేవ్ లో సృష్టించిన హంగామా. ఈ కొరి Kori కాదు. Query. ప్రశ్న, బదులు రూపంలో సినిమాను గురించి నేను నేర్చుకుంటూ చేసిన ప్రయాణం. అలా Oldboy అన్నది నా సినీ ప్రస్థానంలో ఒక మైలు రాయిలా నిల్చిపోయింది. ఇంత కాలంలో ప్రపంచ సినిమా మీద సాధికారికంగా మాట్లాడగలిగిన రాయగలిగిన వ్యక్తిగా రూపుదిద్దుకున్నాను.
ఇక రాండి! Oldboy సినిమా గురించి లోతుగా చూద్దాం తరువాత ఎపిసోడ్లో.
Fun trivia:
- నాకు Oldboy suggest చేసిన వాళ్ళలో జగపతి బాబు హితుడు సినిమా దర్శకుడు విప్లవ్ కె (నవతరంగంలోనే పరిచయం) కూడా ఉన్నారు.
- తెలియని వాళ్ళకు అస్మత్ గరుభ్యోన్నమః = James Cameron