ప్రేమించ్Ing సంధ్యా కవిత
Chapter 10
కొన్ని సినిమాలుంటాయి. ఎన్ని సార్లు చూసినా మళ్ళా ’ఇంకోసారి’ అంటే, సారీ అనకుండా చూసేయగలం. మరికొన్ని ఉంటాయి. చూడం చూడం అంటూ చూసినా క్రమంగా పడతాయవి. ఒక్కసారి పట్టాయా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. ఏదో మా౨జిక్ ఉంటుంది వాటిలో. సంగీతమో, దృశ్యమో, ఎమోషనో, నటీ నటుల ప్రతిభో, హీరోయిన్/హీరోల అందమో (మన జండర్‌ను బట్టీ. అవసరమనుకుంటే దిల్లీ హైకోర్టు తీర్పును కూడా జత పర్చుకోవచ్చు 😉), ఇలా ఏ ఒక్కటో అనే కాకుండా అన్నీ తెగ నచ్చేస్తాయి. మైమరపిస్తాయి. అప్పుడది ట్రా౨జెడియా, కామెడీయా అని చూడము. సినిమాను మాత్రమే చూస్తాము.
Past is past. Future is future. But present is a Present. Earn it, and Enjoy it – నేను పాటించే ఒక సిద్ధాంతం.
అలాంటి సిద్ధాంతం మీద నడిచేదే ఈ సినిమా (…Ing). ఒకసారి పూర్తిగా చూశాక, దాదాపు పుష్కర కాలం గడిచినా ఈ సినిమా పంచిన అనుభూతిని వదల్లేక పోతున్నాను. చాలా మందికి రికమెండ్ చేశాను దీన్ని. నా ఆల్టైమ్ సినిమాల లిస్టు తీస్తే ఇది తప్పక ఉండక పోయినా ఆల్టైమ్ ఎప్పుడైనా సరే చూట్టానికి రెడీ అన్న వాటిలో మాత్రం దీనిది అగ్రతాంబూలమే. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పబడ్డదీ సినిమాలో.
నేపథ్య సంగీతం వీనుల విందు. అంతే! సందర్భానికి తగ్గట్టు ఉండి సన్నివేశపు గాఢతను పట్టి ఇస్తుంది. (Jun-Seok Bang)
ఎడిటింగ్ నేను చూసిన అత్యుత్తమ ఎడిటింగ్ వర్క్స్ లో ఇదొకటి. కేవలం ఈ సినిమా ఎడిటింగ్ గురించే ఒక పెద్ద వ్యాసాన్ని వ్రాయొచ్చు. తప్పక ఈ సీరీస్ లోని వ్యాసాల్లో వ్రాస్తాను. (Hyeon-mi Lee).
“ఇంకొక్క సినిమానే చేసిన ఈ దర్శకురాలు ఇంత అందమైన హిట్ ఇవ్వలేక పోయిందంటే ఆశ్చర్యమే. వన్ హిట్ వండర్‌గా నిల్చిపోరాదని అభిలషిస్తున్నాను,” అని పదేళ్ళ క్రితం నా కొరియన్ సినిమా నోట్స్ లో రాసుకున్నాను.
అదృష్టవశాత్తు ఈమె మరో రెండు సినిమాలు తీసింది. అవి కల్ట్ హిట్స్‌గా నిలిచి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి. ఈమె తీసిన రెండవ సినిమా Love Exposure. దీని గురించి తరువాత మాట్లాడుకోవాల్సి ఉంది. ఇది 2007లో విడుదల కాగా, దాదాపు దశాబ్దం తరువాత మిస్సింగ్ (2016) అనే సినిమాతో పెద్ద హిట్ సాధించి, 2018లో వచ్చిన The Accidental Detective 2: In Action తో ఈ తరపు అగ్రశ్రేణి దర్శకులలో ఒకరిగా తన పేరు చేర్చేలా చేసుకోగలిగింది.
The Killer’s Shopping List అనే సీరీస్ 27 ఏప్రిల్ 2022లో మొదలైంది. వారానికి రెండు ఎపిసోడ్ల చొప్పున వస్తున్న ఈ సీరీస్‌కు అద్భుతమైన రేటింగ్స్ వస్తున్నాయి. Now, no need to say she’s one of my favourite filmmakers. ఈ సీరీస్ అదే పేరుతో వచ్చిన నవలను బేస్ చేసుకున్నది.
దర్శకురాలిగా అద్భుతమైన టెక్నిక్ ఉన్న Lee Eon-hee… డిసెంబర్ 25, 1976 న జన్మించింది. Filmmaking కోర్సులను యూనివర్సిటీలలో ఆధునీకరించిన తరువాత వచ్చిన తొలి తరం దర్శకులలో ఈమె ఒకరు. కొరియన్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరబోయే ముందరి రోజుల్లో 2000లో వచ్చిన The Happy Funeral అనే సినిమాకు స్క్రిప్టు ఇవ్వటమే కాక సహాయ దర్శకురాలిగా చేసింది. ఆ సందర్భంలో వచ్చిన ఆలోచనే …Ing సినిమాకు దారి తీసింది. దీని తరువాత cult favourite ఇండీ సినిమా Take Care of My Cat కు కూడా కథనం సమకూర్చింది.
ఈమె పేరును ఈ (Lee – L silent. Django స్వరంలో ఊహించుకోండి). యోన్-ఈ అని చదవాలి ట! తన పేరుని E.oni అని ఇంగ్లీషులో స్టైలైజ్ చేసుకుంది. …Ing is a loving tribute to one of her dearest persons. అంతే కాదు. ప్రేమ, తల్లీ బిడ్డల అనుబంధాలను చాలా చాకచక్యంగా subvert చేసి చూపిస్తుంది తన సినిమాలలో.
ఈ సినిమాను చూసి స్ఫూర్తి చెంది కొరియన్ దిగ్దర్శకుడు Lee Chang-dong (ఈ చాంగ్-డాంగ్) ప్రేమలో మరో పార్శ్వాన్ని, మానవ జీవిత తత్వాన్ని తెలుపుతూ పోయెట్రీ అనే సినిమా తీశాడు. ఈ రెండు సినిమాలకు సంబంధం లేకపోయినా, రెండు శంకరాచార్యుని నిర్వాణ షట్కాన్ని తడిమినట్లనిపిస్తాయి. ఆశ్చర్యకరంగా. పోయెట్రీ సినిమా ప్లాట్ కు ఆధారం ఒక నిజ జీవిత సంఘటన. విచిత్రంగా ఈ ఎపిసోడ్ తయారు చేస్తున్న సమయంలో శంకర, రామానుజ జయంతి రావటం విశేషం.
Chapter 11
పోయెట్రీ సినిమా గురించి…
కనుమరుగైపోతున్న మానవ సంబంధాలను, అంతకు ముందే ఆ ప్రమాదంలో పడ్డ కవిత్వంతో పోలుస్తూ, కొరియెన్ దిగ్దర్శకుడు లీ చాంగ్-డాంగ్ తీసిన అద్భుత దృశ్యకావ్యమే ‘పోయెట్రీ’. ఒక చిత్రం చూడండి. పోయెట్రీ… పోయె ట్రీ. వెళ్ళిపోయిన వృక్షం. ఒకప్పుడు మహా వృక్షంలా వెలిగిన కవితా సాహితి ఇప్పుడు కనుమరుగవుతున్నదా? అన్న ప్రశ్నను, మాన సంబంధాలకు జతగలిపి, లోతైన ప్రశ్నలు రేకెత్తిస్తూ సాగుతుందీ సినిమా.
ఏ సినిమాకైనా మొదటి పది నిముషాలు కీలకం. కథ వాతావరణం లోనికి తీసుకుని వెళ్ళేందుకు. ఈ సినిమా ప్రారంభ దృశ్యం ‘హన్’ నదీ జలాల మీద. మొదట దర్శకుడు మనకు నీటిని చూపుతాడు. అలా ప్రవహించే నదీ జలాల సవ్వడులు వింటూ, ఆ నీలి నీటి ప్రవాహాన్ని చూస్తూ, ఒడ్డున ఉన్న పచ్చటి చెట్లను చూస్తూ మనం ప్రయాణం సాగిస్తుండగా కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వారి ఆటల ఊసుల్లో మనమున్న సమయంలో దూరంగా నీటిలో ఏదో కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. దగ్గరకు రాగా, రాగా అది ఒకమ్మాయి శవం!
ఈ సినిమా కథను చెప్పటం చాలా కష్టం. ఎంత కష్టమంటే మానవ హృదయపు లోతులను కనుగొనే ప్రయత్నమంత.
డైవర్సీ అయిన కూతురు వదిలి వెళ్ళిన మనుమడిని భరిస్తున్న మి-జా అనే వృద్ధురాలు జ్ఞాపక శక్తి తగ్గుతోందని గ్రహిస్తుంది. క్రమంగా తన చేయి తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండటం, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుండటంతో ఇక తప్పదనుకుని డాక్టర్ను సంప్రదించటంతో అసలు కథ మొదలవుతుంది. రంగు రంగుల పూల పూల స్కర్ట్స్ వేసుకునే మి-జా, ఒక చిన్న పిల్లలా తమాషాగా సరదా అయిన వ్యక్తి. గవర్నమెంటిస్తున్న సబ్సిడీల మీద బ్రతుకు బండిని లాగిస్తుంటుంది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా పక్షవాతంతో బాధ పడుతున్న మరొక వృద్ధుడికి నానీలా పని చేస్తూ, అతను ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతుంటుంది.
అలాంటి పరిస్థితులలో ఉన్న మి-జా కు కవిత్వమంటే ఉన్న ఆసక్తి వల్ల దగ్గరలోనే ఉన్న లోకల్ కమ్యూనిటీ సెంటర్లో జరుగుతున్న పోయెట్రీ క్లా౨సుల్లో చేరుతుంది. అక్కడ కవిత్వం వ్రాయటం గురించి కన్నా, అనుభూతులను గమనించటం, వాటిని మాటల రూపంలో పెట్టటం ఎలా అన్న దానిమీద చర్చ నడుస్తున్న సమయంలో మి-జా అక్కడ అడుగు పెడుతుంది. ఇలా ఎలాగోలా తన జీవనాన్ని ఆనందంగానే గడుపుతున్న ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు మనవడి స్నేహితుని తండ్రి వల్ల వస్తుంది.
ఒక రోజు మి-జా తన కవిత్వపు క్లా౨సుకు వెళ్ళబోయే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆమె విషయం చెప్పి, క్లా౨సు ముగిశాక కలుద్దామని అంటుంది. చెప్పిన టైముకు వచ్చిన ఒకతనితో ఆమె వెళుతుంది. అప్పుడు అక్కడ మరో నలుగురు పరిచయమవుతారు. వారు మి-జా మనుమడి స్నేహితుల తండ్రులు. హైస్కూలులో చదివే హీ-జిన్ అనే బాలికను ఆరు నెలల పాటూ రేప్ చేసి హింసిస్తారు. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది.
అయితే ఈ వివరాలన్నీ ఒక డైరీలో వ్రాసుకుని పెడుతుంది. అది పోలీసుల చేతికి అందితే తమ పిల్లలకు ప్రమాదమనీ, దాన్ని తప్పించాలంటే ఆ పిల్ల తల్లిని కన్విన్స్ చేసి కేసు ఉపసంహరించుకునేలా చెయ్యాలనీ, దాని కోసం అవసరమయితే ఆమెకు డబ్బునిచ్చి అయినా ప్రమాదం నుంచీ గట్టెక్కాలనీ చెప్తారు. తన మనుమడు కూడా ఈ వ్యవహారంలో ఉండటం మి-జాను బాధిస్తుంది. ఆ పిల్ల తల్లి వేదనను గ్రహించి తల్లడిల్లుతుంది. తన మనుమడు ఇందులో ఇరుక్కున్నాడని తెలిసినా సరియయిన న్యాయం జరగాలని, అందు కోసం తను కృషి చెయ్యాలని అనుకుంటుంది.
న మృత్యుర్న శంకా న మే జాతిభేదః – పితా నైవ మే నైవ మాతా న జన్మ।
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్॥
చూడటానికి సాదా సీదాగా ఉన్న ఈ కథ ఈ చాంగ్-డాంగ్ చేతిలో పడటం వల్ల అద్భుతమైన సినిమాగా మారింది. సినిమా అన్నది దృశ్య మాధ్యమం. ఇక్కడ కథను మాటల్లో కాకుండా బొమ్మలలో చెప్పాలి. అలా కాకుండా మొత్తం మాటల రూపంలోనే లాగిస్తే అది డ్రామాకన్నా ఎక్కువేమీ కాదు. ఈ విషయం బాగా తెలిసిన అతి కొద్ది దర్శకులలో ఈ చాంగ్-డాంగ్ ఒకడు. మొదటి సినిమా గ్రీన్ ఫిష్ మినహాయిస్తే మిగిలిన అన్నిటిలోనూ తనదైన ముద్రను వేస్తాడు. తెర మీద కనిపించే ప్రతి దృశ్యంలోనూ ఎన్నో విషయాలు. ఒక్క చిన్న వివరం కూడా అనవసరంగా ఉండదు. కథా, కథనాలు కలగలసి ఉండటం అతని సినిమాలలోని ప్రత్యేకత. ఈ సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు.
కథను దృశ్యాత్మకంగా చెప్పటమే కాదు. ప్రేక్షకుని తెలివి తేటల మీద గౌరవం ఉండటం కూడా ఈ కలిగి ఉన్న సుగుణాలలో ఒకటి. అందుకే అనుకున్నదంతా గుమ్మరించ కుండా ప్రేక్షకుల ఆలోచనకు కూడా వదలివేస్తాడు. తెర మీద కనిపించే బొమ్మ ఎంత కథ చెపుతుందో, కనిపించని మన ఆలోచన కూడా అంతే స్పందనను మనలో కలుగజేస్తుంది. “The ability to help the viewer to integrate his imagination with the pictures shown on the screen is of highest class.” అని రాసుకున్నా ఈ సినిమాను చూస్తున్నప్పుడు నా నోట్స్ లో.
అలా చెయ్యగలగటమే ఈ ను తన సమకాలికులలో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలుపుతున్నది. విక్రమార్కుని కదన కౌశలాన్ని తలపించే కథన కౌశలంతో వీక్షకుణ్ణి కట్టి పడేస్తాడు ఈ. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఈ వన్నీ ఆర్టు సబ్జెక్ట్స్. అతని సినిమాలు కూడా. కానీ, అవన్నీ బాక్సాఫీసు దగ్గర కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. అలాంటి విలక్షణమైన దర్శకుడు కనుకనే ఈ అంటే ప్రపంచ సినిమాలో విపరీతమైన గౌరవం. నటీనటుల సెలెక్షన్ దగ్గర నుండీ, వారి నుంచీ కావలసిన నటనను రాబట్టుకోవటం వరకూ ‘ఈ’ తనదైన ముద్ర వేస్తాడు.