Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-19

కర్మర్మమ్

సాంటి చెప్పిన నిజం

[dropcap]ఎ[/dropcap]వరీ దుష్కర్మ చేసింది? దేవత విగ్రహం నాశనం చేసింది ఎవరు? చేసిన వారికి ఏమైంది? ఏ ధైర్యంతో ఈ పని చేశారు? నిమ్ ప్రశ్నలకు అంతుండదు. వాటికొక పట్టాన సమాధానాలూ దొరకవు. ఒకానొక క్షణంలో అసలు దేవత ఉందా అన్న ఆలోచన కూడా తనలో తలెత్తుతుంది. ఇంతకాలం తను సహాయం చేసిన జనాలు, వారికి జరిగిన మేలు అవన్నీ ఆ బలహీన క్షణంలో గుర్తుకు రావు.

చకచకా ఇంటికి వెళ్తుంది. వెళ్ళే సరికి నోయ్ ఆధ్వర్యంలో జరిగిన తంతు తెలుస్తుంది. అప్పటికే జరిగిన ఘోరాలు తెలుసుకుని విలవిలలాడిపోతుంది. ఇంతలో మరో షాక్. కుక్కను తిన్న రోజున మింక్ పక్క ఇంట్లో ఉన్న మేనమామ కొడుకును (పసి పిల్లవాడు) తీసుకుని వెళ్తుంది. ఎలాగో దొరికినా క్షణం ఆలస్యం అయితే మింక్ ఆ పిల్లాడిని చంపేసేది అనేది ఖాయం. కొన్ని ఆధారాలను చూసి ఇక లాభం లేదని మింక్ కోసం ఒక రక్షణ క్రతువు మొదలుపెడుతుంది నిమ్. అదే టైమ్‌లో మింక్ చేష్టలు శృతిమించుతాయి. ఒకానొక రోజు మింక్ కనబడకుండా పోతుంది. క్రతువు పూర్తయ్యాక మింక్ విషయంలో ఆమె అన్న Mac ప్రమేయం లేదు అని అర్థమవుతుంది.

ఇంకా లోతుగా ఆలోచిస్తే మింక్ ఎక్కడ ఉండేందుకు అవకాశముందో స్ఫురిస్తుంది నిమ్‌కు. మింకినా తాతగారిది ఒక పాడుపడిన భవనం ఉంటుంది. అక్కడ కొన్ని అకృత్యాలు జరిగి ఉంటాయి. అక్కడ వెతికితే మింక్ దొరకవచ్చు అని చూస్తుంది. అక్కడే రక్తమోడుతూ నీరసించి పోయి ఉంటుంది. నిమ్ మింక్‌ను కంట్రోల్ చేస్తూ ఎలాగో ఇంటికి చేరుస్తుంది. పరిస్థితి తీవ్రత అర్థమయిన నోయ్, మిన్నకుంటుంది. తమ సోదరుడిని మింక్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పి చివరి ఆప్షన్ కింద తన స్నేహితుడు, మంత్రవేత్త అయిన సాంటి దగ్గరకి వస్తున్నట్లు కబురు పంపి, చివరి అవకాశంగా మింక్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.

నీకీ దేవత వల్ల ఒరిగింది ఏమిటి? ఒక్కరోజన్నా సుఖం అనుభవించావా? కనీసం నీకంటూ ఒక మనిషున్నాడా? జీవితం అంతా ఇతరులకే అంకితం చేశావ్. ఏం బావుకున్నావ్ అని అడుగుతుంది మింక్.

నిమ్‌కు సమాధానం దొరకదు. చెప్పలేదు. ఈ దేవత వల్ల కాకుండా, Mac ఆత్మ వల్ల కాకుండా మింక్ ఎందుకు ఇలా అయిపోతోంది?

సాంటి నిమ్ చెప్పినదానికి భిన్నంగా ఆలోచించాడు. కుటుంబానికి చెందని వ్యక్తి కనుక భావోద్వేగాలకు లోను కాలేదు. తనది కాని సమస్య కనుక ఒక మూడవ మనిషిగా ఆబ్జెక్టివ్‌గా చూశాడు. శక్తి సామర్థ్యాలు కలిగిన మనిషి కనుక సమస్యను లోతుగా పరిశీలించాడు.

నిమ్ రాగానే వియయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. ఒళ్ళు గగుర్పొడిచే నిజం. మింక్ సమస్యలకు కారణం Mac కాదు. బాయన్ దేవత శాపం కాదు. అసలు బాయన్ దేవత శపించటం ఊహించని, కూడని మాట.

ఇదంతా జరిగింది నోయ్ వల్ల!

కర్మర్మమ్!

తను షమన్ కావలసింది తప్పుకోవటమే కాకుండా పూర్తిస్థాయిలో బాయన్ దేవతను భరాయించలేని, అమాయకురాలైన నిమ్ వైపు ఆకర్షించటం. ఆమెకు అందాల్సిన కౌటుంబిక జీవనాన్ని మొగ్గలోనే ఛిద్రం చేయటం.

ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు మోస్తోంది మింక్. ఇది కేవలం పదిశాతం మాత్రమే. ఇప్పుడు అసలైన బాంబు పేలుస్తాడు. అందరూ అనుకుంటున్నట్లు ప్రస్తుతం మింక్‌లో నాలుగు ఆత్మలు కాదు. కొన్ని వందల ఆత్మలున్నాయి.

అవన్నీ నిమ్ ప్రమేయం లేకుండా నోయ్ చేసిన సెరిమనీ సమయంలో వచ్చి చేరాయి. ఈ పరిస్థితులలో మింక్‌ను కాపాడటం నిమ్ వల్ల కాదు. అది అసలు ఆమె బాధ్యత కాదు. లేనిపోని తలనొప్పి వ్యవహారాన్ని తన మీదకు తెచ్చుకోవటమే అది. అయినా ఒక potentially full life ahead ఉన్న యువతిని రక్షించటమే కాదు, ఇన్ని ఆత్మలు ఇలా జనజీవనంలో ఉండటం మంచిది కాదు కనుక సాంటి తను, శిష్యులు, వారి శిష్యులు కూడా an Epic Exorcism ను చేసి మింక్ ప్రాణం కాపాడే ప్రయత్నం చేస్తానంటాడు.

రోజును నిర్ణయిస్తారు. నిమ్ కేవలం నిమిత్తమాత్రురాలు. అవసరానికి సహాయం. అంతే.

క్రతువులో వెజల్ కింద నోయ్‌నే ఉంచాలని అంటాడు సాంటి. ఆ రోజు దగ్గర పడుతుంటుంది. మరోవైపు మింక్ చేష్టలు దిగజారిపోతుంటాయి. సరిగ్గా తెల్లవారితే exorcism అనగా నిమ్ మరణిస్తుంది.

మింక్‌ని బంధిస్తారు మేనమామ ఇంట్లో. బైటకు రాకుండా యంత్రాలను ప్రతిష్ఠించి, అక్కడ డాక్యుమెంటరీ కుర్రాళ్ళు ఇద్దరిని కాపలా పెడతారు. మింక్ కోసం నెరిపే క్రతువు కోసం ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. అదే ఆమె తండ్రి తరఫు ancestral home.

అక్కడ కొన్ని వందల ప్రాణాలను విరోజ్ వంశీకులు తీస్తారు. మింక్ తాత insurance కోసం factory ని తగులబెడితే ఆ ప్రమాదంలో కొందరు వర్కర్లు కూడా చనిపోతారు. అందుకు ప్రతీకారంగా అతన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. సరిగ్గా అదే ప్రదేశంలో క్రతువు. Epic Exorcism.

ఒకవైపు సాంటి. మింక్‌ను కాపాడటమే కాక ప్రతీకారంతో రగిలిపోతున్న ఆత్మలను పంపి చేయటానికి. మరోవైపు మింక్ తండ్రి వంశం మీద తరతరాలుగా రగిలిపోతూ వస్తున్న వ్యక్తుల ఆత్మలు.

ఫలితం

  1. దాదాపు విజయవంతం కాబోతున్నప్పుడు మింక్‌లో మిగిలి ఉన్న ఆత్మల శక్తిలేశాలు తిరగబడి, మింక్ మేనత్త భార్యను manipulate చేసి, డాక్యుమెంటరీ కుర్రాళ్ళు వద్దు వద్దంటున్నా వినకుండా ఆ యంత్రాలను భేదించి తలుపు తీసేలా చేస్తాయి. ఆ పని కోసం ఆమె కొడుకు (ఇంతకు మునుపు మింక్ చంపబోయిన పసి పిల్లాడు) మింక్ దగ్గర ఉన్నట్లు భ్రమింప చేస్తాయి. మింక్ మేనమామ భార్యను, డాక్యమెంటరీ కుర్రాళ్ళను చంపి కొడుకుని పీక్కుతిని, Exorcism జరిగే చోటుకు వెళ్తుంది.
  2. దీనివల్ల అక్కడ ఆత్మలు బలపడి వాటి బంధనాలు తొలగి విధ్వంసం సృష్టిస్తాయి. ఆపబోయిన సాంటి, అతని శిష్యులను చంపేసి కరాళ నృత్యం చేస్తాయి.
  3. అక్కడికి వెళ్ళిన మింక్‌ను చూసి తన మీదకు బాయన్ దేవతను ఆహ్వానించి మిగిలిన సాంటి శిష్యుల సహాయంతో చివరి ఘట్టాన్ని పూర్తి చేయాలని చూస్తుంది నోయ్. కానీ, మింక్ ఎప్పుడైతే ప్రేమగా అమ్మా అని పిలిచేలా ఆత్మలు చేస్తాయో అప్పుడు ఆమె పట్టుతప్పుతుంది. అవకాశం చూసుకుని మింక్ ఆమెను నూనెలో ముంచి తగలబెడుతుంది. ఆమె ఆర్తనాదాలు వినవస్తుండగా మింక్ కెమేరా కన్ను లోంచీ అలా బైటకు నడుస్తుండగా సినిమా ముగుస్తుంది.
  4. చివరి దృశ్యంగా నిమ్ మరణానికి కొన్ని గంటల ముందు ఆమె పూర్తిగా బాయన్ దేవత మీద విశ్వాసం కోల్పోయి దుఃఖిస్తూ అసలు దేవత నిజంగానే తనను ఏనాడైనా ఆవహించిందా అని అనుమానంతో కన్నీళ్ళు పెట్టుకునే విజువల్.

Chapter 17

ఈ సినిమా కథ థాయిలాండ్‌లో అంతర్భాగాలలో ఉన్న షమనిజమ్, ఇతర నమ్మకాల ఆధారంగా అల్లుకున్నది. దాన్ని వీలైనంత రియలిస్టిక్‌గా కొరియన్ దర్శకుడు, ఈ సినిమా నిర్మాత న హాంగ్-జిన్ రాయగా, థాయిలాండ్ శైలి స్క్రీన్ ప్లేకు, కొరియన్ శైలి కైనెటిక్ ఎనర్జీ నిండిన visual language ని థాయ్ దర్శకుడు బాంజాంగ్ పిశాంతనకున్ జోడించటం వల్ల ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది.

కొందరు సినిమాను వైలెన్స్‌తో తీయటాన్ని విమర్శించారు. మరికొందరు మాక్యుమెంటరీ శైలిని ఎన్నుకోవటాన్ని తప్పుబట్టారు. వీటన్నిటికీ దీటైన సమాధానాలున్నాయి ఈ దర్శక ద్వయం దగ్గర.

మొదట ఈ సినిమా కథను కథగా, తరువాత గత ఎపిసోడ్‌తో కలిపి పాత్రల పరంగా, వాటి దృక్కోణంలో చూశాను కనుక ఇప్పుడు ఈ రెండు ఎపిసోడ్లలో వచ్చిన హెడింగ్‌ల కింద ఉన్న వివరాలను కార్యకారణ సంబంధంగా విశ్లేషిస్తే ఈ సినిమాలో చర్చించిన సామాజికాంశాలు, వాటికి ఈ సినిమా సూచించిన పరిష్కారాలు మనకు అవగతమవుతాయి.

ఎందుకంటే ఈ సినిమా ఏదో భయపెట్టేందుకు తీసి పడేసిన బాపతు కాదు. ఇద్దరు దర్శకమేధావుల పరిశ్రమ.

ఇంతకీ మింక్ ఏమయ్యింది? ఆమె మేనమామ ఎక్కడికి వెళ్ళాడు? చివరికి మిగిలింది వారేనా? ఇంకెవరైనా ఉన్నారా?

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతూ వచ్చేవారం కలుద్దాం!

Exit mobile version