కొరియానం – A Journey Through Korean Cinema-21

0
3

Go పంచకం

[dropcap]మ[/dropcap]హేశ్‌తో Oldboy రీమేక్ అన్న కవర్ ఫొటో చూడగానే ఒక మిత్రుడి instant రియాక్షన్ 🤮.

లోపల ఏమి రాశారు. ఏమి చెప్పారు. ఎందుకు చెప్పారు. ఎంత కాన్ఫిడెన్స్ లేదా వెనకాల సపోర్ట్ చేసే డేటా లేనిదే ఆ రాసిన వ్యక్తి, అంత పేరున్న వెబ్ పత్రికకు రాసే సీరీస్‌లో కవర్ పేజీ పెట్టి మరీ రాస్తాడు అన్నపాటి ఆలోచన కూడా రాలేదు. అన్నిటికీ Instant reactions. చదివే ఓపిక ఉండదు. చూసే ఓపిక ఉండదు. పరిశీలించి చూడటమా? అంటే ఏంటి? ఒక వ్యక్తి/వస్తువు గురించి మన ఆలోచనలు రివైజ్ చేసుకోవచ్చు అన్న భావన లేనే లేదసలు. The current and the immediate previous generation.

కానీ, value degradation జరిగిపోతోందని బాధ మాత్రం పడిపోతుంటారు.

అందుకే

న హి నిమ్బాత్ స్రవేత్ క్షౌద్రమ్

అని పెద్దల మాట. వేపచెట్టు నుంచీ తేనె కారదు. అంతే!

సమాజం ఎలా ఉంటే కళ అలాంటిది తయారౌతుంది. లేదా కొన్నిసార్లు కళ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది.

ఒక్కసారి ఊహించండి!

మిస్టర్ సినిమా అనిపించుకున్న విజయ్ సేతుపతి ఓ డే-సు పాత్రలో. మహేశ్ వు-జిన్ గా.

ఏ లోకేశ్ కనగరాజ్ కానీ, పుష్కర్ గాయత్రి జోడీ కానీ, ఈమధ్య సంచలనం సృష్టిస్తూ (2018 తరువాత) తమిళంలో కొరియన్ సినిమా ఇన్టెన్సిటీ తీసుకువస్తున్న అరుణ్ మాతేశ్వరన్ కానీ (పొన్ని/సాని కాయిదం) ఈ కథను ఇండియనైజ్ చేసి తీస్తే కచ్చితంగా గొప్ప సినిమా వచ్చే అవకాశం ఉంది.

అదే సినిమా ఎందుకు? మరో సినిమా తీయొచ్చుగా?

తీయవచ్చు. కాదని ఎవరన్నారు? ఇదొక theorisation, speculation. ఒక అందమైన ఊహ. 1:నేనొక్కడినే పరాజయం తరువాత మహేశ్ పూర్తిగా ప్రయోగాలకు దూరమయ్యాడు. పరశురామ్ లాంటి దర్శకుడికి అవకాశం ఇస్తే తీసింది సర్కారు వారి పాట. ఎన్టీఆర్ (అన్నగారు కాదు), మహేశ్ లాంటి నటులను పెట్టుకుని మనవాళ్ళు తీసేవి faction కథలో, సమాజ సేవలో నీతులు చెప్పే సినిమాలు. ఒక కొత్త ఆలోచనను ఆహ్వానించలేము. ఒక స్పెక్యులేషన్‌ను లాజికల్ కంక్లూజన్‌కు తేలేము. ప్రయోగాల పేరిట తీస్తోంది half-baked సినిమాలు. Well intended bad films.

విరాటపర్వం, దొరసాని, శ్రీదేవి సోడా సెంటర్, జయమ్మ పంచాయితీ లాంటి half good కథలను, సినిమాలను ఫర్లేదనో, బాగున్నాయనో, ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందనో అనుకుని సంతృప్తి పడటమే. కానీ, కొత్తతరం దర్శకుల హవా, కథా కథనాలు 2016 నుంచీ మార్పు మొదలైందన్నారు. ఎంత మార్పు వచ్చింది? ఆరేళ్ళు చాలదా? కన్నార్పకుండా చూసే సినిమాలు ఎన్ని వచ్చాయి?

ఒక పెద్ద నటుడిని ఒక గొప్ప సినిమాకు రీమేక్‌లో ఊహించలేకపోవటం, అవే సినిమాలు, అవే టెంప్లేట్ కామెడీలు, అవే ఆ పాత సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయి. కనుక ఈసారి హిట్టే! ఏంటో ఈ ఆలోచనలు. ఎక్కడ చూసినా stagnation. Seriously, it’s time for a serious shakeup. మార్వెల్ దెబ్బకు మామూలు యాక్షన్ సినిమాలు, స్టూడియో ప్రోగ్రామర్లో, దర్శకుల సినిమాలో కాకుండా స్టార్ల సినిమాలు అంతరించిపోతున్నాయి, మిడిల్ ఏజ్ ఆడియన్స్ సినిమాలు చూడటం లేదు అన్న వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ టాప్ గన్: మావెరిక్ సాధించిన బిలియన్ డాలర్ల సక్సెస్, తీసే దమ్ముండాలే కానీ, ఇప్పటికీ చూసే ఆడియన్స్ ఉన్నారు. వారిని షేకప్ చేసి, నిద్ర మత్తొదలగొట్టి థియేటర్లకు రప్పించాలంటే అలాంటి సినిమాలే పడాలి.

Oldboy నేను చెప్పిన నటుల కాంబినేషన్‌లో సరైన క్రియేటివిటీ ఉన్న దర్శకులు తీయగలరు. లేదా అంతే ఇన్టెన్సిటీ ఉన్న మరింత గొప్ప సినిమాని కూడా రూలౌట్ చేయలేము. కానీ, చేయగలమని ముందు నమ్మాలంతే.

Oldboy ఎలా తీయవచ్చో ముందు ముందు చూద్దాం.

Chapter 19

కొరియానంలో ప్రధానంగా కొన్ని సినిమాల విశ్లేషణ ఎక్కువగా, మరికొన్ని సినిమాల గురించి పరిచయం రూపంలోనో, రివ్యూ రూపంలోనో చూశాం.

వాటితో పాటూ కొన్ని సినిమాల గురించి వ్యాఖ్యగానో, ఉదాహరణగానో ఇచ్చాను. ఈ సీరీస్‌లో నేను మెన్షన్ చేసిన ప్రతి సినిమా చూడదగ్గదే. చాలామందికి అంత అవగాహన ఉండనివే. ఒక్క Oldboy తప్ప.

చోయ్ మిన్-సిక్ పుట్టినరోజు ట్రిబ్యూట్‌గా ఆయన నటించిన క్లాసిక్స్ గురించి పరిచయాలు కూడా చూశాము. ఈసారి కూడా అంతగా పరిచయం లేని, కచ్చితంగా చూడదగ్గ ఐదు సినిమాలు చూద్దాం. ఈ ఆదివారం ఈ సినిమాలు చూసి ఆనందించవచ్చు. ఎందుకంటే వాటిలో వైలెన్స్ కాస్త తక్కువే.

1.Miracle: Letters to the President (2021)

North Gyeongsang Province. అది 1980ల కాలం. ఒకవైపు డెమాక్రసి కత పెరిగి ఉద్యమ రూపం దాల్చుతూ Kwang-ju Massacre తో క్లైమాక్స్‌కు చేరిన సమయం. మరోవైపు కొరియాలో prodigies పుట్టుకొస్తూ ఆ దేశ భవిష్యత్‌ను మార్చటానికి బీజాలు పడుతున్న సమయం కూడా అదే. Miracle on the Han River, Gangnam Dreams, Korean Wave ఎంతో దూరంలో లేని కాలమది.

North Gyeongsang Province కొరియాలో చాలా రిమోట్ ఏరియా. అక్కడి ఒక పల్లెలో పిల్లలు చదువుకోవాలంటే తమ ఊరిలో ఉన్న కాస్త చదువు పూర్తికాగానే దగ్గరలో ఉన్న మరో ఊరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఒక రైలు మార్గంలో పట్టాల మీదుగా వెళ్ళాలి. ఎదురుగ్గా కానీ, వెనక నుంచి కానీ రైలు వస్తే తప్పుకుని దారి ఇవ్వక తప్పదు. పైగా కొండ ప్రాంతం కనుక అక్కడక్కడా టనెళ్ళు. వాటిలో నడుస్తున్నప్పుడు రైలెదురొస్తే తప్పుకునే అవకాశం కూడా లేక ప్రాణాలు కోల్పోవటం మాత్రమే చేయగలరు.

అదే ఊళ్ళో ఒక మాత్ జీనియస్ అయిన పిలగాడుంటాడు. అతన్ని అతని galfriend ప్రోత్సహించి ప్రెసిడెంట్‌కు లెటర్ రాయిస్తుంది. ఎన్ని ఉత్తరాలు రాసినా, ఉత్త రాళ్ళ మీద ప్రయాణం మాత్రం తప్పదు వారికి. దాంతో, ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు తీసుకునే అవకాశమిచ్చే కొన్ని పరీక్షలు రాయాలనే ఐడియా ఇస్తుంది. ప్రెసిడెంట్ కరుణించినా, రైల్వే అధికారులు కరుణించరు. వారి ఊరిలో చిన్న స్టేషన్ పెట్టినా రైలు ఆగదు. ఆ రైలులో మన మాత్ జీనియస్ తండ్రి ఇంజనియర్ అయినా కూడా. చివరికి పరిస్థితి ఎలా మారింది?

నిజ జీవితపు కథకు ఫిక్షన్ రూపం. నిరుడు రిలీజై మంచి విజయం సాధించింది.

ఇందులో కథానాయకుడు కొరియాలో ప్రస్తుత డ్రీమ్ బాయ్ లలో ఒకడు – పార్క్ జియాన్-మింగ్. కథానాయిక యూనా. ఈమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలా అని వీరిద్దరూ టీనేజర్లు కాదు. 30 కి కొంచం అటూ ఇటూ వయసున్న వారే. సినిమాలో టీనేజర్ల పాత్రలు సమర్థవంతంగా పోషించారు.

2.Crying Fist (2005)

మన చోయ్ మిన్-సిక్ నటించిన మల్టీస్టారర్ గొప్ప హిట్. మెలోడ్రామా మిళితమైన యాక్షన్ డ్రామా.

మాజీ ఆసియా గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ మన కథానాయకుడు బాక్సింగ్‌లో. అదంతా గతం. ప్రస్తుతం అతని ప్రతిభ కానీ, ఆటగాడిగా అతని గొప్పతనం కానీ, ఇప్పుడు ఎందుకూ కొరగావు. డబ్బులేక అలమటిస్తుంటాడు. భార్యతో మనకు తెలిసిన కారణాలవల్ల రోజూ ఇంట్లో తగవులే. అందుకే వీథుల్లో Human Punching Bag గా అవతారమెత్తి పొట్టపోసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతని జీవితంలో ఇక చూడని ఘోరం లేదు అనే సమయంలో మరో యువకుడు రంగంలోకి దిగుతాడు.

అతను ఒక చిన్న సైజు దొంగ. లేదా క్రిమినల్. దొంగతనాలు, స్టూడెంట్లను వెంటాడి వేధించటం చేస్తుంటాడు. అతనికి తండ్రితో, సోదరుడితో, బామ్మతో సత్సంబంధాలుండవు. ఇక భరించలేదని స్థితిలో చాలా ఎదురుదెబ్బల తర్వాత బాక్సింగ్ ఎంచుకుంటాడు. తనను తాను సంస్కరించుకునేందుకు. ఇద్దరికీ ఒక అవకాశం వస్తుంది. తమ జీవితాలను ఏక్దమ్ సెటిల్ చేసుకునేందుకు. కానీ ఇద్దరిలో ఒకరే ఆ అవకాశం అందుకోగలరు. ఇద్దరూ మంచివాళ్ళే. ఇద్దరికీ తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. చివరికి ఏమౌతుంది? Emotional roller coaster ఈ సినిమా.

3.The Charming Girl (2005)

21 సంవత్సరాల యువతి. పోస్టాఫీసులో పనిచేస్తుంటుంది. జీవితం సాఫీగా నడిచిపోతుంటుంది. కథ ప్రారంభం అయే సమయానికి ఆమె సింగిల్. చీటికిమాటికీ ఫోన్ కాల్స్ ద్వారా చిరాకుపెట్టే మేనత్తకు పొలైట్‌గా సమాధానాలు చెప్పటం, మొక్కలు పెంచటం ఆమెకు సత్కాలక్షేపాలు. ఏదో అలా రోజులు గడిపేస్తూ ఉండగా ఒక ఆబ్సెంట్ మైండ్ రచయిత పరిచయమవుతాడు. అదే సమయంలో ఆమెకు ఒక చిన్న పిల్లిపిల్ల దొరుకుతుంది. అన్నట్లు చెప్పటం మరచితిని. అలా అని మరీ మడికట్టుకుని కూర్చునే రకం కాదు. మన కథానాయిక ఈ కాలం అమ్మాయిల్లా అప్పుడప్పుడూ బీర్ తాగుతూ, తన కొలీగ్స్‌తో వారాంతాలు ఎంజాయ్ చేస్తుంటుంది.

ఒకరోజు ఆమెకు ఒక మానసికంగా దెబ్బతిన్న Rejected Piece లాంటి కుర్రాడు పరిచయం అవటంతో ఆమె గత జీవితంలోకి ట్రామా తిరిగి ఆమెను ఇబ్బంది పెట్టటం మొదలుపెడుతుంది.

చక్కటి కేరక్టర్ స్టడీ ఉన్న ఈ సినిమాని కాస్త ఓపిక చేసుకుని చూడాలి. కానీ మంచి rewarding experience. It’s unlike many of the highly popular films of this style.

4.My Wife Is A Gangster (2001)

జేమ్స్ బాండ్ – నేను కాదు మా ఆవిడ అనే అల్లరి నరేశ్ సినిమాగా తెలుగు వాళ్ళకు పరిచయం ఉన్న ఈ క్రైమ్ కామెడీ కొరియన్ సినిమాలో క్లాసిక్. కథ దాదాపు తెసిసినదే కనుక చెప్పేదేమీ లేదు. కానీ వదలకుండా చూడదగ్గ గొప్ప సినిమా. చివరలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. దాన్ని మనవాళ్ళు కప్పెట్టేశారు. ఈ సినిమా గురించి, దాని స్క్రీన్ ప్లే గొప్పతనాన్ని ప్రముఖ సినీ విమర్శకులు, స్క్రీన్ ప్లే గురు సికందర్ గారు చాలా గొప్పగా విశ్లేషించారు.

5.Wang Sib Ri, My Hometown (1976)

14 సంవత్సరాల తరువాత తన హోమ్ టౌన్‌కు వస్తాడు మన కథానాయకుడు. అన్నీ మారిపోతాయి. జనాలు. ఇళ్ళు. పరిస్థితులు. మనస్తత్వాలు. అతని జిగిరీ దోస్తులు కూడా పట్టించుకోరు. లోకల్ బిలియర్డ్స్ క్లబ్ మేనేజర్ మాత్రం అతన్ని కలుపుకుంటాడు. అక్కడ ఒక రమా మంచి బాలిక తరహా అమ్మాయితో స్నేహం కుదురుతుంది. కానీ అతనికి తన పాత ప్రేయసి గుర్తుకొస్తుంటుంది. ఆమెకోసం వెతుకులాట మరో త్రెడ్. మరోవైపు అతని సోదరుడు అతన్ని ఎలా అయినా జపాన్ తీసుకుని వెళ్ళాలని ఎత్తులు వేస్తుంటాడు. అక్కడ పెద్ద Gang War కు బీజం పడి ఉంటుంది. టిపికల్ 1970ల కొరియన్ మెలోడ్రామాలా మొదలై మంచి intense storytelling తో నడిచే ఈ సినిమా ఆ తరం కొరియన్ సినిమాలు ఎలా ఉండేవో చెప్తుంది. మన తెలుగు, తమిళ, మలయాళ సినిమాలకు దగ్గరగా ఉంటుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here