Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-26

సుఖీ న భవ

Chapter 24

[dropcap]1[/dropcap]960లలో అందరికీ తెలిసిన కథే ఇది. హాలీవుడ్‌లో గోల్డెన్ ఏజ్ ముగుస్తోంది. హీరోలంటే మంచివాళ్ళు, విలన్లంటే చెడ్డవాళ్ళు అనే కాలం చెల్లిపోయి, కథా నాయకుడు (protagonist – ఇక్కడో చిన్న సమస్య ఉంది. దాన్ని గురించి తరువాత చూద్దాం), ప్రతినాయకుడు (antagonist) ఇద్దరిలోనూ అటు మంచి, ఇటు చెడు రెండూ ఉన్నాయి, ఉంటాయి అనే తరహా సినిమాలు రాబోతున్నాయి.

గోల్డెన్ ఏజ్ లేదా స్వర్ణ యుగం తరువాత, బ్లాక్ బస్టర్ యుగం ఆరంభం కాక మునుపు, కొంతకాలం దర్శకులే సినిమాకు కర్త, కర్మ, క్రియ అనే ఫినామినన్ రాజ్యమేలింది. అదే న్యూ హాలీవుడ్. ఆ యుగంలో బాగా పైకి వచ్చిన వారే మార్టిన్ స్కొర్సేజీ (Martin Scorsese), Francis Ford Coppola, వుడీ అలెన్, రోమాన్ పొలాన్స్కీ, మొదలైన వారు. ఈ న్యూ హాలీవుడ్‌కు, స్వర్ణ యుగానికి మధ్య సంధి కాలంలో కొన్ని మార్పులు జరిగి Antiheroes తో సినిమాలు రావటం మొదలైంది. అదే సమయంలో white hat Hollywood hero cowboys, black hat cowboy విలన్లు కాకుండా brown/grey hat Italian cowboys రాజ్యమేలారు కొన్నాళ్ళు.

Western జాన్రా సినిమాలకు ఇదొక రకం స్వర్ణయుగం. దీన్లో క్లింట్ ఈస్ట్వుడ్ పాత్రా… అవన్నీ చదివేసిన, వినేసిన కథలే కునుక కాసేపు (ఒక ఐదొందల కోట్ల సెకన్లు) పక్కన పెట్టి ఒక చిన్న ఎలివేషన్ సీన్ చూద్దాం. అసలే ఇది హీరో ఎలివేషన్ల యుగం కదా.

అనగనగా సెర్జో లియోనె అనే ఇటాలియన్ దర్శకుడుండేవాడు. ఆయన అంతకు మునుపు కొన్ని చిన్నా చితకా అటెంప్టులు చేసినా ఒక్కసారిగా స్టార్ దర్శకుడైపోయిన సినిమా A Fistful of Dollars. అది Yojimbo అనే సినిమాకు షాట్ బై షాట్ కాపీ అని పెద్దలు అంటారు. ఇక్కడో సమస్య ఉంది. దాన్ని గురించి మనం తరువాత మాట్లాడుకోవద్దు. ప్రతిసారీ మాట్లాడుతుందాం అనుకుంటున్నాం కదా, ఈసారి వెరైటీగా.

సమురాయ్ యోధుడి కథను, కౌబాయ్ కథగా మార్చి, స్పెయిన్ రగ్డ్ లేండ్స్కేప్ లను, మొక్సికన్-అమెరికన్ లేండ్స్కేప్ అనుకోమని ఆ సినిమాను తీసి పడేశాడు లియోనే. కానీ, ఎంత గట్టిగా తీశాడంటే తీసి పడేసినా, ముక్కలు కానంత బలంగా వచ్చిందా సినిమా. ఆనోటా, ఈనోటా (ఈ NOTA కాదు) పడి ఈ సినిమా తన సినిమాకు కాపీ అని తెలిసింది జాపనీస్ దిగ్దర్శకుడు అకీరా కురొసావాకు. మన లియోనె బాబుకు ఒక ఉత్తరం రాశాడు ఆయన.

ప్రియమైన సెర్గియో లియోన్,

నిన్నే మీరు తీసిన కళాఖండం A Fistful of Dollars చూశాను. దాన్ని అంత బాగా తీసినందుకు అభినందనలు. మీ మ్యూజిక్ సెన్సు, దర్శకుడిగా మీ షాట్ మేకింగ్ సైన్సు నాకు బాగా నచ్చాయి. నటన అసలు రాని చెక్క మొహాలను క్లోజప్పులలో చూపుతూ కథనం నడిపి ప్రేక్షకులను స్క్రీన్ మీద నుంచీ చూపు తిప్పుకోనివ్వని తీరు నిజంగా అద్భుతం. మీకు దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంది. కానీ, ఇదే కథను, మీ షాట్ మేకింగ్ నే నేను ఇతఃపూర్వమే కాపీకొట్టి యోజింబో అనే జాపనీస్ సినిమా తీసిన విషయం మీ దృష్టికి రాకపోయి ఉండవచ్చు. నా మీద ప్లేజరిజమ్ కేస్ వేయని మీ ఔదార్యానికి నా ధన్యవాదాలు.

A Fistful of Dollars చాలా గొప్ప సినిమా. దాని దర్శకత్వం ఉన్నత స్థాయిలో ఉంది. అయితే నిజానికి అది నా సినిమా. ఆ విషయం గుర్తించగలరు.

అవినయంతో మీ ట్రూలీ,

కురొసావా, అకీరా.

ఈ లెటర్ పట్టుకుని అడిగిన వారికీ, అడగని వారికీ చూపిస్తూ లియోనె తన సినిమా బాగుందని దర్శక శ్రేష్ఠుడైన కురసావా మెచ్చుకున్నాడని చెప్పుకుని మురిసిపోయాడు సెర్జో లియోనె.

ఆలా తనకు అక్షింతలు పడ్డా, వాటిని వదిలేసి, మొచ్చుకోలును గుర్తు పెట్టుకుని తన బలాలనే ఆయుధాలుగా చేసుకని రెండో సినిమా For A Few Dollars More రిలీజయ్యే సమయానికి తనే ఒక చిన్నపాటి లెజండ్‌గా మారాడు. కురొసావా అంటే Western filmmakers దృష్టిలో ఉన్న విలువ ఎంత గొప్పదో చెప్పే సంఘటనలలో ఇదొకటి (western here doesn’t indicate the Western genre – పాశ్చాత్యులు అని). అంతే కాదు. కురొసావా అక్షింతలతో పులిహోర చేసుకుని తిన్నాడు (దీన్ని గురించి కూడా మనం తరువాత మాట్లాడుకోము). ఇలా రెండందాలా లియోనె లాభపడ్డాడు.

గీతాచార్య: హమ్మయ్య! ఇంటర్వెల్ తరువాత ఒక కామెడీ సీన్ పెట్టాలి కనుక దీన్ని ఇరికించాను. ఇక కొరియానం ప్రధాన timeline కు వెళదాం.

ఎలా అయితే ఇరవైయ్యవ శతాబ్దపు మధ్య కాలంలో అకీరా కురొసావా ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్‌తో కలిసి ఏలాడో, ఇప్పుడు ఆసియన్ చలన చిత్రాలంటే ఈమధ్య కాలంలో మన రాజమౌళి కథలు, జాన్ వూ, ఆంగ్ లీ మొదలైన వారిని వదిలేస్తే తీసిన ప్రతి సినిమా క్లాసిక్‌గా నిలపటమే కాదు 90 శాతం పైన సక్సెస్‌లు సాధించిన పార్క్ చాన్-వుక్ ఏలుతున్నాడు. మరో మాటగా చెప్పాలంటే వారి మెదళ్ళలో తిష్ట వేసుకుని కూర్చున్నాడీ పూర్వాశ్రమపు film critic అయిన దర్శకుడు.

నిఖార్సైన, గొప్ప పేరు పొందిన విమర్శకుడైనందు వల్లో, లేక inherent గా వచ్చిన talent వల్లో, లేదా కష్టపడి ఇష్టంతో తనదైన శైలిని మల్చుకున్నాడో కానీ, the diabolically talented writer-director from South Korea is – as of now – forgotten how to make any films that are below great. అతని సినిమా వస్తోందంటే అటు ప్రేక్షకులతో పాటూ ఇటు విమర్శకులు కూడా ఉగ్గపట్టుకుని ఎదురు చూస్తారు.

Oldboy తో ప్రపంచ వ్యాప్తంగా జయకేతనం ఎదురవేసిన తరువాత Sympathy for Lady Vengeance, I’m a Cyborg But That’s Okay, Thirst, మొదలైన ఫీచర్ ఫిల్మ్‌లు, Nightfishing లాంటి షార్ట్ ఫిల్మ్‌లు తీశాక 2011లో ప్రారంభించి, 2016 నాటికి సినిమా రూపు దాల్చిన Fingersmith అనే విక్టోరియన్ నవలను తెరకెక్కించే బృహత్కార్యం The Handmaiden అనే పేరుతో బైట పడింది. అందులో కథానాయిక పేరే Sook-hee సుక్-హీ లేదా సుఖీ అనుకుందాము. An antiheroine లేదా femme fatale.

మధ్యలో చాలా చిన్న బజట్‌తో స్టోకర్ అనే హాలీవుడ్ సినిమాను తనదైన శైలిలో చెక్కాడు పార్క్. Nicole Kidman అందులో ఒక ప్రధాన పాత్ర వేసింది. Mia Wasikowska కథానాయిక. అది 2013లో వచ్చింది.

Fingersmith అనేది చాలా పేరు పొందిన నవల. ఆ నవల టైటిల్ ఎంత గొప్పగా అమరిందంటే నవల కథాంశంలోని వివిధ లేయర్లను పట్టి ఇస్తుంది. కానీ, అలాంటి టైటిల్‌ను కాదని మన పార్క్ ఎందుకు The Handmaiden అనే సాదా సీదా టైటిల్‌ను ఎంచుకున్నాడు? దాని వెనుక కారణం మనం చూద్దాం.

ఇది నా సినిమా! నా కథ. అని చెప్పకనే చెప్పే ప్రయత్నం. ఎంత గొప్ప సోర్స్ మెటీరియల్ తీసుకున్నా, దాన్ని మించిన సినిమా తీయటం పార్క్‌కు film criticism తో పెట్టిన విద్య.

ముందు సారా వాటర్స్ వ్రాసిన 2002లో విడుదలైన Fingersmith కథ చూద్దాం.

కథ మొదలు కావటం ఒక డికెన్స్ కథలా మొదలైనా, తరువాత చదువరులకు చిన్న చిన్న షాక్స్ ఇస్తూ, వేరే కోణంలోకి మారిపోతుంది.

Sue Trinder ఒక అనాథ. ఆలివర్ ట్విస్ట్‌లో Faggin’s Den మాదిరి వాతావరణంలో పెరుగుతుంది. ఆలివర్ లాగా తనను ఉద్ధరించేందుకు రక్త సంబంధీకులైన పెద్దవాళ్ళు రారు కానీ, జీవితంలో ట్విస్టుల మీద ట్విస్టులుంటాయి. పెరిగి పెద్దయ్యాక ఆమెను ‘పెంచిన’ Mrs. Sucksby స్యూ ను జంటిల్మన్ అనే పేరు ఉన్న రిచర్డ్ రివర్స్ (ఈ Rivers, ఆ reverse కాదు. గుర్తు పెట్టుకోండి. నేను మాత్రం మర్చిపోతా) తో పంపిస్తుంది. మాడ్ లిలీ (Maud Lily) అనే కులీన యువతిని ప్రేమలో పడేసేందుకు సహకరించమని. కానీ అక్కడకు వెళ్ళగానే పరిస్థితి నిజంగానే రివర్స్ అవుతుంది.

మాడ్‌కు క్రమంగా దగ్గరై జంటిల్మన్ మీద ఆమెకు ప్రేమ కలిగేలా చేసే సమయంలో వీరిద్దరి మధ్యా అనుబంధం బలపడుతుంది. స్యూ మాడ్ తో మేడ్ (mad) గా ప్రేమలో పడుతుంది.

ఇటువైపు మాడ్ లిలీ కూడా అనాథే. చిన్నతనంలోనే తల్లికి దూరం అవుతుంది. ఆమెను (మాడ్ తల్లిని) ఒక మెంటల్ ఎసైలమ్‌లో పెడతారు. తండ్రి ఎవరో కూడా తెలియదు. అందుకే భీకరమైన ఏకాంతంలో ఆమె అంకుల్ Christopher Lily పర్యవేక్షణలో పెరుగుతుంది. అంకుల్ క్రిస్ ఆమెను తనకు ‘సెక్రటరీ’ లా ‘వాడు’కుంటాడు. తన Dictionary Project కోసం.

ఆ ఏకాంత వాతావరణం, నిశ్శబ్దమైన ప్రదేశాలలో అంకుల్‌తో మాత్రమే ఉండవల్సిన పరిస్థితుల వల్ల మాడ్ మేడ్ (mad) అవుతుందేమో అని భయపడుతుంటుంది.

సరిగ్గా నిజానికి ఇదే జంటిల్మన్‌కు కావలసింది. పెళ్ళయ్యాక ఈమెను ఎసైలమ్‌కు పరిమితం చేస్తే ఆమె ఆస్తిని తాను పొందవచ్చని ఆలోచన.

ఇలాంటి సమయంలో స్యూ మాత్రమే ఆమెకు సాంత్వన. స్యూ కు దగ్గరవటం ప్రారంభిస్తుంది.

ఎన్ని సమస్యలు ఉన్నా, చెప్పిన పని చేయక తప్పని స్థితిలో ఉన్న స్యూ మాడ్‌ను జంటిల్మన్‌ను పెళ్ళి చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ఒక దుర్ముహుర్తంలో జంటిల్మన్ పెళ్ళి ప్రమాణం చేస్తాడు మాడ్‌కు. అర్థరాత్రి వేళ వివాహం.

అక్కడి నుంచీ వీళ్ళు వెళ్ళి పోతారు. అంకుల్ క్రిస్ నిప్పులు కక్కుతాడు. ఈ ordeal వల్ల సున్నిత సుకుమారమైన మాడ్ మానసికంగా కుంకుతుంది. స్యూ ఆమెకు తోడుగా నిలిస్తుంది స్థైర్యం చెప్తూ.

ఇంతలో వారు ఒక ఎసైలమ్ చేకుకుంటారు. స్యూ కు షాక్ ఇస్తూ, ఆమెను ఆ ఎసైలమ్‌లో పడేసి, అజంటిల్మన్ అయిన Richard Rivers, టక్కులాడి Maud Lily చల్లగా జారుకుంటారు. తరువాత…!

వచ్చేవారం కలుద్దాం.

ఆలోగా మీకేం కావాలంటే అది చేయండి. స్వాతంత్ర్య దినోత్సవ అమృతోత్సవాల ముందు నేను ఏదో పిలుపు ఇవ్వటం ఎందుకు?

(సశేషం)

Exit mobile version