Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-28

సత్యం శివం Sue0దరం

Chapter 25

[dropcap]స్యూ [/dropcap]కి పిచ్చెత్తి పోతూ ఉంటుంది అక్కడ ఎసైలమ్‌లో.

ఏవేవో అనుకుని రంగంలోకి దిగితే మరింకేవో జరిగి చివరికి తన బ్రతుకు ఇలా అయింది. జీవితంలో మొదటిసారి తనను తానుగా గుర్తించి ప్రేమ చూపిన వ్యక్తి తనను మోసం చేసి తన స్థానంలో ఎసైలమ్‌లో పడవేసి, చక్కా పోయింది. తనకి పట్టబోయే దుర్దశ నుంచీ తప్పించాలని ఎంత తాపత్రయపడింది?

ఇందుకోసమా తాను మాడ్‌కు అనుకూలంగా మారుతున్న మనసును చూసి అసలు వచ్చిన పనికి న్యాయం చేయలేకపోతున్నానని బాధ పడింది?

మొదట్లో తన ఆస్తిని చేత వేసుకుని, ఎలాగైనా వచ్చి మాడ్ తనను విడిపిస్తుందేమో అని ఆశ పడుతుంది. ఒక పదిశాతం ఆశ. పిచ్చి మనసు కదా. మోసం జరిగినా ఏదో ఆశ.

మరోవైపు నూటికి తొంభై ఆలోచనలు తనను మాడ్ ఎందుకు మోసం చేసింది అనే దాని చుట్టూ తిరుగుతాయి.

చిత్రమేమిటంటే సమస్య వస్తే దానికి పరిష్కారం ఆలోచించకుండా ముందు కంగారు పడతాం. ఆందోళనలో కాలం గడుపుతాం. ఎవరో వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తాం.

నిజానికి ఆ సమస్య మీద అందులో ఉన్న మనకు తప్ప ఇతరులకు వంద శాతం అవగాహన ఉండదు. పైపెచ్చు అది చాలా చిన్న సమస్య అనిపించవచ్చు. లేదా, దాని తీవ్రత మనకు తెలిసినంత బాగా తెలియదు. అందుకే సమస్యలో ఉన్నవారే కాస్త మనసు కుదుట పరచుకుని ఎక్కడెక్కడ tangles మన ఆలోచనను కట్టివేస్తున్నాయో వెతకాలి. ముందు వాటిని మన తెంపగలగాలి. అది జరిగితే సగం సమస్య కుప్పకూలుతుంది.

ఇప్పుడు మనది పైచేయి అవుతుంది. సమస్య ఆల్రెడీ డౌన్వార్డ్ స్పైరల్‌లో పడింది. ఈలోపు కాస్త ఊపిరి పీల్చుకుని బుర్రను గిలక్కొడితే సమస్యకు పరిష్కారం లభించటం అంత కష్టమేమీ కాదు. ఏవో కొన్ని సందర్భాలలో తప్ప. స్యూ ఇప్పుడు ఇలాంటి సందర్భంలోనే ఉంది.

తన ప్రమేయం లేకుండా, తనకు తెలియని ప్రదేశంలో తనది కాని సమస్యలో తాను కూరుకుపోయి దారీతెన్నూ తెలియని స్థితి.

అందుకే ఎప్పుడైతే మాడ్ తనను విడిపిస్తుందనే చిగురంత ఆశ అడుగంటిందో, అసలు తన మీద తనకే అపనమ్మకం జరిగి నిజంగా తాను స్యూ నా? లేక స్యూ గా భ్రమించుకుంటున్న మాడ్ లిలీ రివర్స్ ఆ? అనే ఆలోచనల్లో పడుతుంది.

తన మీద తనకున్న కొద్దిపాటి కంట్రోల్ కూడా తప్పి, ఇక కోలుకోలేనంత అగాధంలో చిక్కుకు పోతున్న సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక మాదిరిగా చెప్పాలంటే రచయిత్రి సారా వాటర్స్ deus ex machina వాడింది.

ఇలాంటివి వాడకుండా దర్శకుడు పార్క్ కాస్త passive character గా నిలిచిన Sue ని మరికొంత యాక్టివ్‌గా మార్చి సుఖీని తయారుచేశాడు. ఆ మార్పే సినిమాను నవలకున్నా గొప్పగా మార్చింది. అటు artistic గా. ఇటు commercial కోణంలో కూడా.

ఇంత వరకూ నేను (yours truly) ఇస్తున్న నేరేషన్ కథా స్ట్రక్చర్‌ను తడుముతూ కాస్త తప్పుదోవ పట్టిస్తూ మొత్తం మీద అసలు కథను దాటకుండా నడుస్తోంది. ఎక్కడా అసలైన స్పాయిలర్లు చెప్పటంలా. ఇక్కడ ఆ అద్భుతం అన్న దాన్ని చెప్తే చదివేవారికి reading pleasure పోతుంది కనుక వదిలేస్తున్నాను. గతంలో కూడా ఇలా reading or viewing pleasure పోతుంది అనిపించిన విషయాలు/విశేషాలు వదిలేస్తూ లేదా కాస్త దారి తప్పిస్తూనే నడిచింది నేరేషన్. అందుకే కొరియానం ప్రకటనలో Unreliable Narrator అని వాడింది. కేవలం ఈ పర్పస్ కోసమే.

సినిమా చూడని లేదా నవల చదవని వాళ్ళకు విషయావగాహన కలుగుతుండాలి. At the same time చదివే, చూసేటప్పుడు కలగాల్సిన మజా మిస్ కాకూడదు.

అక్కడ మాడ్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ఎసైలమ్‌లో కాకుండా బైట ప్రపంచంలో ఉందనే మాటే తప్పిస్తే, అక్కడ బ్రయర్‌లో అంకుల్ దగ్గర ఎలా ఉందో ఇక్కడ Mrs. Sucksby దగ్గర అలాగే ఉంది. అటు అజంటిల్మన్ చేసిన మోసం హృదయాన్ని గాయపరచింది. మరోవైపు తను స్యూకు చేసిన ద్రోహం హృదయాన్ని కోసేస్తోంది. ఇంకోవైపు Mrs. Sucksby జైలు కాని జైలులో బందీగా ఉండాల్సి రావటం.

మధ్యలో మాడ్ తప్పించుకుని బైటపడి తన అంకుల్ ద్వారా పరిచయమైన ‘సాహిత్యాభిమానులైన’ ఆయన స్నేహితుల దగ్గరకు వెళుతుంది. కొందరు ఆమె స్థితిని advantage గా తీసుకోజూస్తారు, మరికొందరు మొహాన్నే ఛీ కొడతారు. పోర్నోగ్రఫీ రచనలు చదివి వినిపించే అమ్మాయి తమ ఇంట ఉండటమా?

ఇంకొందరు మాడ్ Christopher Lily ని తప్పించుకుని వచ్చేసిన విషయాన్ని, తరువాత ఆమె జీవితం ఎలా మారింది అన్నదాన్ని పెద్ద స్కాండల్‌గా భావిస్తారు. ఆ కారణం చేత తమ ‘మర్యాద’కు భంగం కలుగుతుంది కనుక ఆమెకు ఆశ్రయం ఇవ్వటానికి తిరస్కరిస్తారు.

ప్రపంచంలో ఎక్కడైనా మర్యాదస్థులు పడుతూనే ఉంటారు.

ఇటువైపు స్యూ మాడ్ మీద పగబడుతుంది. అంత అనలేము కానీ ధర్మాగ్రహం ప్రదర్శిస్తుంది. మొదట తను కూడా మాడ్‌ను మోసం చేసే ప్లాన్‌లో భాగంగానే ఆమె వద్దకు వెళ్ళిన విషయాన్ని చాలా convenient గా మర్చిపోయి.

మాడ్‌ను Mrs. Sucksby ఇంటి కిటికీలో చూసిన స్యూ కోపంతో మేడ్‌గా మారుతుంది. తనను మోసం చేసింది అజంటిల్మన్ రిచర్డ్ రివర్స్, మాడ్‌లు మాత్రమే అని భావించి, జరిగిందంతా వివరిస్తూ Mrs. Sucksby కి ఉత్తరం రాస్తుంది. మాడ్‌ను తన సంరక్షణ నుంచీ ఇది చదివాక పంపేస్తుంది అనే భ్రమతో.

ఆ ఉత్తరం మాడ్ చేత చిక్కుతుంది. సమాధానంగా తాను ఎన్నటికీ స్యూ ను ప్రేమిస్తున్నాను అనే సంకేతం పంపిస్తుంది. ఇది కచ్చితంగా Mrs. Sucksby ఇచ్చిన సమాఝానం కాదని స్యూ కు అర్థమవుతుంది. మాడ్ involvement దీనిలో కచ్చితంగా ఉందని గ్రహించి ఇక ముఖాముఖీ తేల్చుకుందామని స్యూ Mrs. Sucksby ఇంటికి వెళ్తుంది.

ఈలోపలే Mrs. Sucksby ఒక భయంకరమైన కుట్రపూరిత నిజాన్ని చెప్పి మాడ్‌ను పూర్తి కంట్రోల్‌లో ఉంచుతుంది. కానీ ఒక సంఘటన ఆమెను స్యూ విషయంలో మోరల్ డైలమాలో పడేస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో స్యూ మాడ్ మీదకు ఎటాక్ చేస్తుంది. ఘర్షణకు దిగితుంది. ఇంతలో అజంటిల్మన్ వస్తాడు. ముగ్గురు ఆడవాళ్ళను నియంత్రిస్తే మొత్తం ఆస్తి తన చేతికి వస్తుందని వారిని అదుపులోకి తీసుకోబోతాడు.

సరిగ్గా అప్పుడే స్యూ చేతిలోని కత్తి అజంటిల్మన్ గుండెలో దిగుతుంది. అనుకోని twist గా Mrs. Sucksby చేసిన ఒక పనితో ఈ మోసపు చట్రం బద్దలయి ఆ ముగ్గురిలో ఇద్దరు తప్పించుకుని తమ జీవితాన్ని సుఖాంతం చేసుకుంటారు. మరొకరు విధివంచితులుగా మిగిలిపోతారు.

ఎవరది? అనే ప్రశ్నకు సమాధానమే నవల క్లైమాక్సు. కానీ, అసలు కథ అక్కడే మొదలవుతుంది. మరి ఈ నవల ఎలా ముగుస్తుంది? నవలలో ఉన్న లోటుబాట్లేంటి? వాటిని పార్క్ సినిమాగా మార్చినప్పుడు ఎలా సరిచేశాడు?

***

March 30, 2009.

Guntur.

Sportstar లో మోనికా సెలెస్‌తో ఇంటర్వ్యూ చదువుతున్నాను. ఎప్పటిలాగే indifferent గా విశ్లేషించుకుంటూ చూస్తున్నాను. ఇంతలో ఒక ప్రశ్న. అందులో.

“మోనికా… నువ్వు ఆడేటప్పుడు ఒక పోరాట యోధురాలివి. గెలవటం తప్ప మరేమీ పట్టనట్టుంటావు. పోరాట పటిమకీ, ధైర్యానికీ మారు పేరుగా చెప్పుకోబడే నువ్వు నీ మీద జరిగిన దాడి తరువాత ఇరవైఎనిమిది నెలలు gap తీసుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక paradox కాదా?”

ప్రశ్నలో ఏమీ లేదు. కాస్త పొగడ్త. ఒక చిన్న డౌట్. ఎప్పుడూ చాంపియన్లని అడిగే లాంటి ప్రశ్నే. కానీ సమాధానమే నా మనస్సుని చివుక్కు మనిపించింది. అంతో ఇంతో కాదు. అప్పటికప్పుడు ఈ క్రిందటి వాక్యాలు వ్రాసుకునేలా.

ఆ సమాధానం ఏమైనా ఒక గొప్ప కొటేషనా అంటే అదేమీ కాదు. అలా అని ఏదో డిప్లొమేటిగ్గా చెప్పబడినదా అంటే అదీ కాదు.

వింబుల్డన్ సామెత: స్టెఫీనభిమానించరా అంటే సెలెస్సుని పొడిచాట్ట.

సెలెస్ సమాధానం: “గెలవటం తప్ప వేరేమీ తెలియని నేను, జీవితం అంటే అదో ఆట, సరదా, అని తప్ప వేరే భావన లేని నేను.. అప్పటికి పందొమ్మిది ఏళ్ల దానిని. అలాంటి సంఘటన అంతకు మునుపూ, ఆ తరువాతా జరుగలేదు. అది ఒక అసాధారణమైన సంఘటన. I had to deal with a lot of issues. దురదృష్టవశాత్తూ ఆ సంఘటన నా జీవితం లోని అత్యున్నత దశని కరిగించేసింది. అది నేను కలలో సహితం ఊహించని సంఘటన. కానీ ఒకసారి నేను మళ్ళా కోర్టులో అడుగుబెట్టాలని అనుకున్నాక మళ్ళా నేను వెనుతిరిగి ఆలోచించలేదు. నేను టెన్నిస్ రాకెట్ పట్టుకునేటప్పటికి నాకు ఆరేళ్ళు. అంతే. నేను ఆడిందే ఆ ఆటంటే నాకు ప్రాణం కనుక. ఆ భయానక సంఘటన తరువాత నేను మళ్ళీ కోర్టులో అడుగు పెట్టిందే ఆట మీదున్న వెర్రి ప్రేమతోనే. ఇప్పటికీ ఆడుతున్నదీ అంచేతనే. ఆలస్యం అనేది నన్ను నేను రికవర్ చేసుకునే ప్రయత్నంలో జరిగింది. ఆ దాడి శారీరకంగా జరిగింది కాదు. మానసికంగా ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంది. ఎవరు నన్ను కలసిన అడిగినా దాని దగ్గరకే మాటలను తీసుకుని వెళ్తారు. సెలెస్ జీవితం… దాడికి ముందూ వెనుకా.”

“ఊహించని సంఘటన”!

తెల్లవారగానే.. నిద్ర లేచి, చక్కగా రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరి దారిలో స్నేహితురాలిని కలసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో campus లో అడుగుబెట్టి, చివరి పరీక్షకి సిద్ధమై.. వైవాకి తయారవుతున్న ‘శ్రీలక్ష్మి’ ఊహించిందా తనని ఒక ఉన్మాది తెగనరుకుతాడని?

సరదాగా అలా బీచి ఒడ్డున కూచుని పిల్లలతో, సఖులతో, స్నేహితులతో, ఆ సాగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆ వేలాది మంది మాత్రం ఊహించగాలిగారా తమని సునామీ బలిగొంటుందని?

ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండి తనకు పాదాభివందనం చేయబూనిన స్త్రీ ఒక మానవ బాంబనీ, ఆమె వల్లే క్షణ కాలంలో తన పంచ ప్రాణాలూ పంచ భూతాలలో కలవ బోతున్నాయనీ.. రాజీవ్ గాంధీ ఊహించగాలిగాడా?

వింబుల్డన్ వివేకం: ఒక దారి మూసుకునేది మరో దారి తెరచుకునేటందుకే. రాజీవ్ గాంధీ ఆ రోజు అలా ఊహించి ఉంటే ఈనాడు మనకి పీవీ లాంటి మహా మేధావి ప్రధాని అయ్యేవాడా? మన్మోహన్ లాంటి ఆర్థిక మంత్రి లభించి ఉండేవాడా? మన దేశంలో ఆర్థిక సంస్కరణలు జరిగి ఉండేవా?

సరదాగా అలా బీచి ఒడ్డున ఉన్న వారు ఊహించి ఉంటే ఈనాడు మనకి (మన భారతీయులకి)సునామీ గురించి తెలిసి ఉండేదా? దశావతారం లాంటి సినిమా వచ్చి ఉండేదా? 😉

శ్రీలక్ష్మి లాంటి వారు అలా ఊహించి ఉంటే ఈనాడు మన మీడియాకి సెన్సేషనల్ న్యూసులు దొరికి ఉండేవా? మహిళా సంఘాల వారికి మంచి మేత దొరికేదా? మనలో ఉన్న పశుత్వం బయట పడేదా? ఒక్కసారి ఊహించండి. ఆరోజు సెలెస్ మీద ఆ దాడి జరగక పోయి ఉంటే.. స్టెఫీ గ్రాఫ్ ఆటని మనం మరింత కాలం ఆస్వాదించి ఉండేవారమా?

కానీ.. కానీ.. ఒక ఆలోచన, నా చిన్నప్పుడు కలిగిన ఒక పైశాచికానందం నన్ను దహించివేసింది. అది తెలియని వయసు. ఇప్పుడు సత్యాన్వేషణ జరుపుతున్న వయసు.

వింబుల్డన్ సూక్తి: మనిషికీ పశువుకీ ఉన్న తేడా వివేచన, విచక్షణా జ్ఞానం.

తెలియని తనం నుండీ తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టే వరకూ మనిషి చేసే పయనమే జీవితం. చాలాకాలం క్రితం మిత్రుడు కీశే॥ కత్తి మహేశ్‌తో సంభాషిస్తూ నేను అన్న మాటలవి. తెలియకుండా కొరియానానికి బీజాలు నా మనసులో నాటుకున్నది కూడా అదే సమయంలో. చిన్నప్పుడు నాకు స్టెఫీ గ్రాఫ్ అంటే ఇష్టం. ఎందుకో తెలియదు. కానీ ఇష్టం. మొదటి సారి గెలవటం అంటే ఏంటో నాకు చూపిన మైకస్ స్టిచ్ లాగే అదే టైంలో ఒక్కరోజు ముందు అదే అనుభవాన్ని నాకు చూపించటం వల్ల కావచ్చు. కానీ దానికి ఒక logical base కానీ, rational perspective కానీ లేవు. స్టెఫీ రైవల్ ఐన సెలెస్ అంటే ఒకింత కచ్చగా ఉండేది. దానికీ ఏ విధమైనటువంటి కారణం లేదు.

అందుకే సెలెస్ చేతుల్లో 1992 French Open ఫైనల్లో (ఎపిసోడ్ 22 ప్రారంభం ఈ మ్యాచ్ గురించే) స్టెఫీ ఓడినప్పుడు నాకు మంట పుట్టిపోయింది. సెలెస్ అంటే ఇంకా కచ్చ పెరిగి పోయింది. అది అలా అలా పెరిగి పెరిగి తన మీద ఆ దాడి జరిగినప్పుడు నేను అనుకుందొకటే. “హమ్మయ్య. ఇక స్టెఫీని ఎవరూ ఓడించలేరు.”

అదప్పుడు నాకు అర్ధం కాలేదు కానీ ఎందుకో నాకు ఒకరకమైన reproach ఏర్పడింది. అలా ఎలా అనుకున్నానా అని. అలా అనుకోవటానికి కారణం నాకు స్టెఫీ మీద ఉన్న అభిమానమే. అంటే అభిమానం ఒకరి మీద ఉంటే వేరే వాళ్ల మీద కచ్చింపు ఉండాలా? అప్పటికి, ఆ క్షణంలో నాకు తెలియలేదు. కానీ ఒకటి అనుకున్నాను. స్టెఫీ అంటే నాకు ఎందుకు అభిమానమో సరిగా తెలియక పోవటం వల్లే ఈ రకమైన అమానుషమైన ఫీలింగ్ నాకు కలిగింది. అప్పుడనుకున్నా అభిమానం ఉండాలంటే దానికి ఒకరకమైన ప్రాతిపదిక ఉండాలని. లేకుంటే.. ఇలాంటి దురభిమానంగా మారే ప్రమాదం ఉంటుందని.

అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ప్రతి దానికీ ఒక rational ప్రాతిపదిక ఉండాలని. నేను చేసే ప్రతీ పనికీ ఒక లక్ష్యం ఉండాలని. హేతువుకి అందని ఏ పనినీ చేయరాదనీ. నాకు నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని ఎన్నటికీ కల్పించుకోకూడదని. ఈ సంఘటనే జరిగి ఉండకపోతే.. నాకు రేషనల్ వ్యూ యొక్క ఆలోచనే వచ్చేది కాదేమో?

అలా rational గా ఉండందే నాకూ ఆ ఉన్మాదులకీ ఏం తేడా ఉంటుందని.

ఎందుకీ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాను? కొరియానం చివరలో తెలుస్తుంది. Wait and see. The Handmaiden విశ్లేషణలో ఉపయోగపడుతుంది. Try to guess how!

Rational గా ఉండందే నాకూ ఆ ఉన్మాదులకీ ఏం తేడా ఉంటుందని. సుఖీ కూడా ఒక సందర్భంలో ఈ మాటలు అనుకుంటుంది.

సుఖీని ఇప్పటికే 21 రోజులు వేచి ఉండేలా చేశాను. నా మీద తను రివెంజెన్స్ ఆలోచన చేయక ముందే వచ్చే వారం తనను ఆహ్వానిద్దాం.

ఈ లోగా శ్రావణ శుక్రవారం పూజలు బాగా చేశారా? ప్రసాదాలు అవీ… సరే!

వినాయక చవితికి, ఆ పైన వారం రోజుల్లో ట్రాఫిక్ జామ్ లకు రెడీ అయిపోండి … 😂

(సశేషం)

Exit mobile version