Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-42

అనుబంధం రసాత్మకం జీవితం

Chapter 38

[dropcap]మి[/dropcap]డు కూర్చుని ఉంది. ప్రైవేట్ జైలర్ రక్షణలో. ఎందుకు? ఓ డే-సు తనను ఈ వు-జిన్ ఎందుకు బంధించాడో కనుక్కున్నాడు. ఒప్పందం ప్రకారం ఈ వివరాలు ఓ డే-సు ఈ వు-జిన్ కు చెప్తే, ఈ వు-జిన్ తనను తాను అంతమొందించుకుంటాడు.

ఆ ఉత్సాహం మీద ఉంటాడు డే-సు. కానీ, తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మిడు ను రక్షణలో ఉంచాలి. ఇది తన అంతిమ యుద్ధం. విజయం సాధించినా, పరాజయం పొందినా (పరాజయం పొందే అవకాశాలు లేవు నిజానికి, if the antagonist is a true gentleman) పర్యవసానాలు life changing.

అందుకే మిడు కు అవసరమైన రక్షణ కల్పించేందుకు ఈ వు-జిన్ తో చెడిన ప్రైవేట్ జైలర్ Park Che-ol-woong దగ్గర దింపుతాడు. ఎంతనా ఇస్తానంటాడు. ఎందుకు?

మిడు తన ప్రియురాలు కనుక. తన ప్రాణానికన్నా మిన్న కనుక. తన వారిని రక్షణలో ఉంచటం, రక్షించుకోవటం తన బాధ్యత కనుక. భార్యను, కూతురుని కోల్పోయిన తనకు ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న anchoring point మిడు మాత్రమే కనుక.

మి సుక్ తన కూతురు కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉంది. కూతురును సంతోషంగా ఉంచేందుకు గుండెలు బద్దలయ్యే విషాదాన్ని తనలోనే తొక్కి పట్టింది. అటు మనసులో, ఇటు తనువులో లేని ఉత్సాహాన్ని పళ్ళ బిగువున తెచ్చిపెట్టుకుని మిన్-ఆ కు మిగిలిన కొద్ది జీవితాన్ని బాగా గడిపేందుకు ఏర్పాట్లు చేసింది. కూతురుకు ఒక తల్లిగా కన్నా స్నేహితురాలుగా ఉంది. అవసరమైతే తన షాప్ అమ్మేసి అయినా మిన్-ఆ ను ఆ బ్యాలేకు తీసుకు వెళ్ళేందుకు సదా సిద్ధంగా ఉంది.

నిమ్ తనకు నప్పదు, తన జీవితంలో అనవసరపు కుదుపులు ఎందుకు? అని అనుకోకుండా మింక్ విషయాన్ని అంత గట్టిగా పట్టించుకుని, ఆమెను దుష్ట ఆత్మల నుంచీ కాపాడాలని చేసే ప్రయత్నాలు, తగిలించుతున్న గాయాలు, లేని కర్మను నెత్తిన వేసుకోవటాలు.. వీటన్నిటికీ ఒకటే కారణం.. మింక్ తన అప్పగారైన నోయ్ కూతురు.

మరోవైపు ఇన్నాళ్ళు తాను తప్పించుకు తిరిగిన షమానిక్ జీవితాన్ని నెత్తిన వేసుకోజూసినా, కూతురుకు Acceptance Ceremony చేయబూని చావుతప్పి కన్ను లొట్టపోయినా, చివరకు తానే ఆ ఎపిక్ exorcism ను ముగించాలి అని చూసి ప్రాణాలే పోగొట్టుకున్నా..

వీటన్నిటికీ ఒకటే కారణం. అనుబంధం.

సాంగ్ స్యో-రే మీద మనసు పారేసుకుని, నానా ఇబ్బందులూ పడ్డ డిటెక్టివ్ జాంగ్ హే-జున్ కూడా ఈ బంధాలలో చిక్కుకున్నవాడే. వాటిలో ఏదో తీపి మిఠాయి ఉంటుంది. అందుకే అన్నీ తెలిసిన ఆత్మ మనలో ఉన్నా కూడా మనం ఈ జీవితాలను అంత త్వరగా వదలలేకపోవటానికి.

అటు అజంటిల్మన్ ను చంపి Mrs. Sucksby Susan Trinder బదులు జైలుకు వెళ్ళటానికి సిద్ధమైనా. ఇటు సుఖీ లేడీ హిడేకో కోసం అన్ని కష్టాలు పడినా.

ఎదుటివారి మీద ఎందుకో కలిగిన ఒక పాశం.

అదే మనల్ని ముందుకు నడుపుతుంది. పట్టి నిలుపుతుంది. కింద పడేస్తుంది. పైకి లేపుతుంది. వేధిస్తుంది. సాధిస్తుంది. ఈ భూమి మీద మన బతుకు మీద ఉండాల్సి తీపిని కలిగిస్తుంది. అది మంచికేనా అంటే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం.

అనుబంధం రసాత్మకం జీవితం.

అదే లేకపోతే జీవితం మీద విరక్తి కలుగుతుంది. బతుకు మీద ఆసక్తి రాదు. ఒక zombie లాగా మనం తయారౌతాం. అందుకే ఈ అనుబంధాలు.

అన్నదమ్ముల మధ్య అనుబంధానికి పట్టాభిషేకం చేసిన Taegukgi కొరియన్ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీన్ని జీవితంలో ఒక్కసారైనా చూడని కొరియన్ ఉండడు. అంతగా ఆ సినిమా కొరియన్ ప్రజానీకానికి పట్టింది. నార్త్, సౌత్ కొరియా సబ్జక్ట్ అంటే కొరియన్లకు ఎందుకంత ఇష్టం అంటే ఎంత ఒకరి మీద ఒకరికి రకరకాలైన అభిప్రాయాలు ఉన్నా, రెండు దేశాలవారి రక్తం ఒకటే అని వారి ఫీలింగ్.

అటు షిరీలో (షిరీ చేప అటు ఉత్తర కొరియా నీటిలోను, ఇటు దక్షిణ కొరియా నీటిలోను స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. మనుషులమైన మనమే ఈ తేడాలన్నీ చూపిస్తుంటాము అని వాపోతాడు దర్శకుడు ఒక పాత్ర చేత చెప్పించిన డైలాగ్ రూపంలో. ఇటు Taegukgi లో కూడా దాదాపు అదే విషయం గురించి వ్యాఖ్యానిస్తాడు.

1999, 2001 ల మధ్య బాలకృష్ణతో రెండు పెద్ద బ్లాక్బస్టుర్లు ఇచ్చి, మధ్యలో రాజశేఖర్, superstar కృష్ణ లాంటి వారికి కోలుకోలేని డిజాస్టర్లు అందించి, ఇంద్రతో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ సాధించి వెంటనే ఫేడవుట్ అయిపోయిన మన బి. గోపాల్ లాగా ఒక ట్రెండ్ సృష్టించడానికి, కొరియన్ సినిమా గ్లోబల్ గా గొప్ప స్థితికి చేరటంలో ఒక దశ దిశ అందించి వెంటనే ఫేడవుట్ అయ్యాడు కాంగ్ జే-గ్యు. బి. గోపాల్ కు, కాంగ్ జే-గ్యు కు అంత వరకే పోలిక.

గోపాల్ కొంతకాలం సక్సెస్ అనుభవించాక ఒక సక్సెస్ఫుల్ టెంప్లేట్ అందించాడు టాలీవుడ్‌కు. పోకిరి, మగధీర కన్నా ముందే తెలుగు సినిమా మార్కెట్ ఒక స్థాయి దాటి విస్తరించటంలో మాస్ దర్శకుడిగా పేరు పొందిన బి. గోపాల్ హస్తం ఉంది.

మూడేళ్ళలో మూడు పెద్ద హిట్ల ద్వారా బాక్సాఫీసు కలక్షన్ల పరిధిని పెంచాడు. కానీ, ఆ బర్డెన్ వల్లే ఇక ముందుకు సాగలేక చతికిల పడ్డాడు.

తీసిన రెండు సినిమాలతో కొరియన్ సినిమాల రేంజ్‌ను అమాంతంగా పదిరెట్లు పెంచేసిన కాంగ్ జే-గ్యు కూడా అలానే దెబ్బతిన్నాడు.

2004 లో టే గుక్-గి అందించాక ఏడేళ్ళ తరువాత 2011లో My Way తీశాడు. ఇది కూడా War Movie నే. ఈసారి కూడా బజట్ భారీగా పెరిగింది. కానీ, తరం మారటం వల్ల ఆ సినిమా Box Office Bomb గా మిగిలింది. జనం నాడి పట్టుకోలేక ఫెయిల్యూర్ మూటకట్టుకున్నాడు.

ఇతని సినిమాలను మనవైపు కొరియన్ సినీ అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు కానీ, షిరీ, Taegukgi రెండే కాదు, My Way కూడా చూడదగ్గ సినిమానే.

అటు యాక్షన్.. ప్రత్యేకించి యుద్ధ సన్నివేశాలను.. అయినా, ఇటు ఎమోషన్లను అయినా సరైన రీతిలో తెరకెక్కించగలిగే సామర్థ్యం ఉన్న కాంగ్ రాబోయే సినిమా Boston 1947 మీద మంచి అంచనాలున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన తొలి మారథాన్ రేస్ నేపథ్యంలో జరిగే కథ ఇది. కరోనా పేండమిక్ వల్ల ఈ సినిమా చిక్కుల్లో పడింది.

ఇక్కడికి మరొక అంకం ముగిసింది కొరియానంలో.

ఎక్కడో మాంఛి పాట వినిపిస్తోంది. సరే! ప్రస్తుత కొరియన్ ఇంటర్నేషనల్ స్టార్ Song Kang-ho గురించి చూద్దాం వచ్చేవారం.

అప్పటిదాకా… సరే! ఇంతకీ మన దక్షిణ తెలుగూఫ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జీతాలు పడ్డాయా?

(సశేషం)

Exit mobile version