Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-58

దాక్కుని ఉంటాయి

Chapter 52

[dropcap]కొ[/dropcap]రియానం రాయటానికి నాకు inspiration ఏంటి?

పనీ పాటా లేకుండా ఖాళీగా కూర్చోవటం.

ఒక అన్నోన్ వ్యాఖ్యాత (పేరు చెప్పుకోవటానికి మొహమాటం): కొరియానాన్ని 500 మందికి పంపించాను. ఒక్కళ్ళ నుంచీ జవాబు రాలేదు. కథలు సీరియస్‌గా ఉండవచ్చు కానీ, కథే సీరియస్ కాకూడదు.

కొరియానం Narrator (కొనా): 🤦🏻🤦🏻🤦🏻. నాకున్నదే ముగ్గురు రీడర్లు అని నొక్కి వక్కాణిస్తున్నాను కదా మాస్టారూ. 500 మందికి పంపిస్తే ఎలా చదువుతారనుకున్నారు? By the way, కొరియానం is not a కథ.

అది సరే. ఒక చిన్న ప్రశ్న.

సినిమాలను రకరకాల టెక్నిక్ లతో తీస్తుంటారు. అలాగే రచనలను కూడా రకరకాలుగా చేస్తుంటారు. అలా ఇంత వరకూ ఎవరూ అలా వాడని టెక్నిక్‌తో ఒక కొరియన్ సినిమా వచ్చింది. చూస్తావా అని నా కొరియన్ మిత్రుడు మెయిల్ చేశాడు 22 మార్చి 2012 నాడు.

అంత వాడని టెక్నిక్ ఏంటబ్బా అనుకుంటూ పంపమని అడిగాను. మిత్రుడు సినిమా చూడటానికి ఏర్పాటు చేశాడు.

నా చిన్నప్పుడు మా క్లాస్ పక్కన మాకన్నా పెద్ద క్లాస్ పిల్లలను వరండాలో కూర్చోపెట్టి తెలుగు టీచరమ్మ పాఠాలు చెప్పేది. అది సాధారణంగా చివరి పీరియడ్. అప్పుడు చెప్పిన పాఠాల్లో ఒకటి గడ్డిపూలు అనే కవిత.

దాక్కుని ఉంటాయి!
దారంట గడ్డి నిరుక్కుని ఉంటాయి.
తలువగ రానీ పూలు, పిలువగబోనీ పూలు,
నిలుపగలేని పూలు
దాక్కుని ఉంటాయి!
దారంట గడ్డి నిరుక్కుని ఉంటాయి.
గ్రుక్కెడు వాననీళ్లకు ఫక్కున నవ్వుతాయి
లెక్కకు రావో లక్షే, చిక్కవు మాలను గ్రుచ్చ
ఇక్కడనక్కడ బచ్చ, జక్కన పూస్తాయి
దాక్కుని చూస్తాయి!
దారంట గడ్డి నిరుక్కుని కూస్తాయి!
ఒక్కడ నడుస్తువుంటే,
చుక్కలు పొడుస్తూ ఉంటే
మక్కువ కూర్చోమంటాయి
ఎక్కడో ఎందుకో చెప్పవు
దాక్కుని వుంటాయి!
దారంటగడ్డి నిరుక్కుని ఉంటాయి.
మంచు బిందువు పడిన,
ఎంచి బాష్పము విడిన
అంచుల గాస్తాయి,
వంచక మోస్తాయి.
దాక్కుని వుంటాయి!
దారంట గడ్డి నిరుక్కుని వుంటాయి.

జ్ఞాపకం ఉండి పోయింది. దాన్నే ఇలా ఇక్కడ రాశాను. తప్పులుంటే నా బాధ్యత కాదు. ఈ కవితను రాసింది ఎవరో అప్పట్లో తెలీదు. తరువాత ఎక్కడో ఏదో వెతుకుతుంటే కవి పేరు కవికొండల వెంకటరావు అని తెలిసింది. కరక్టేనా?

టీచరమ్మ కమ్మగా పాడుతూ ఆ పాఠం చెప్తుంటే ఆ వాక్యాలలా గుండెల్లో ఇరుక్కుని పోయాయి. ఆవిడ కట్టిన ట్యూన్ కూడా ఏ ఎచ్చులూ లేకుండా ఒక ఐఫోన్ డిజైన్‌లా మినిమలిస్టిక్‌గా ఉండి అలా గుర్తుండి పోయింది. ఇది రాత కనుక నేను పాడి వినిపించే అవకాశం లేదు కనుక బతికిపోయారు.

But anyway I don’t have any intention to sing. నా గొంతు నాకే నచ్చదు. అందుకే ఎక్కువ మాట్లాడను.

సరిగ్గా ఇలాంటి సినిమానే అది. సరిగ్గా కొరియన్ వేవ్ మొదలయ్యి, ఒకవైపు కాంగ్ జే-గ్యు షిరీ తో వచ్చాడు. కొన్నాళ్ళలో మన పార్క్ తన తొలి blockbuster-masterpiece అయిన జేఎస్ఏ – జాయింట్ సెక్యూరిటీ ఏరియా వదలబోతున్నాడు. ఇంకోవైపు ఈ చాంగ్-డాంగ్ Peppermint Candy ని pack చేస్తున్నాడు. ఆ పెద్ద హిట్ల సందడిలో సడేమియా అంటూ వచ్చిందీ సినిమా. వస్తూనే surrealistic masterpiece అని గుర్తింపు పొందింది.

ప్రపంచంలో ఎక్కడైనా ఆర్టు సినిమాలలో action thriller ఉండటం చూశారా?

నేననేది ప్యూరార్టు. ఇది అలాంటి సినిమానే. 112 నిముషాల రన్ టైమ్‌లో 63 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.

విచిత్రంగా ఈ సినిమా కొరియానం బాటలో దారంట గడ్డినిరుక్కుని ఉండే ఒక చిన్న పువ్వుగానే మిగిలిందా రోజులకు. చూసిన వాళ్ళలో నూటికి ఎనభైమందికి నచ్చింది. కానీ ఆ చూసిన వందమందీ ఎవరు అన్నదే ప్రశ్న.

ఆ సినిమా పేరు..

Nowhere To Hide. 1999 విడుదల.

చూశాక నాకైతే చాలా నచ్చింది. మరి త్రివిక్రమ్‌కు ఎంత నచ్చిందో మరి. చూసి ఉంటాడా? వారి చాలా సినిమాల్లో ఫైట్లు ఈ తరహాలోనే స్లోమోషన్‌లో ఉంటాయి.

ఎందుకు ఈ సినిమా గురించి ముందే చెప్పలేదు అని అడిగాను.

ఈ సినిమా చూసి ఆస్వాదించేంత మెచ్యూరిటీ రావాలి కదా అని సమాధానం వచ్చింది. ఇంకా నయం. అప్పటికి కుమారి 21ఎఫ్ లేదు.

నిజమే. ఎంత film buffs అయినా కూడా ఈ సినిమా నచ్చాలని లేదు. దీన్ని అమెరికాలో విడుదల చేస్తే చూసిన వాళ్ళు 346 మంది. న్యూ యార్క్ నగరంలో. ఒక్క షోనే పడింది. ఇంతకంటే దిక్కుమాలిన సినిమాను నా జీవితంలో చూడలేదు అని రాసిందొక రాటెన్ టొమాటోస్‌లో రిజిస్టర్ అయిన ప్రముఖ విమర్శకురాలు.

ఇది సినిమానా? అన్నారు సగం మంది Tomato క్రిటిక్కులు సుత్తి వీరభద్రరావు గొంతుతో.

Adoor Gopalakrishnan తీసిన Strombolian film అయిన Elippathayam మాదిరి ఒకసారి అర్థమయితే నచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా ఇందులో action sequences చాలా ఉన్నాయి. దాంట్లో లాగా పడక్కుర్చీలో కూర్చుని ఉత్తినే ఊగే సీన్లు కాకుండా.

సినిమా ప్రోలోగ్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్. డిటెక్టివ్ వూ (Detective Woo) ఒక క్రిమినల్ గ్యాంగ్ మధ్యలోకి వెళతాడు. ఎందుకో మరి అరికాలి మంట నెత్తికెక్కి ఉంటుంది. అక్కడో ఫైట్. చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. కానీ, చూడాలి. వైలెన్స్ వల్ల కాదు డిస్టర్బెన్స్. ఆ ఫైట్ కంపోజ్ చేసిన విధానం, అక్కడి ఎడిటింగ్, తెఱ మీద రంగులూ.. అన్నీ మనకు తెలిసినవే. కానీ, ఈ విధమైన రీతిలో వాటిని మనం అనుభూతించలేదు. ఈ సీన్ నలుపు తెలుపులలో ఉంటుంది.

ఈ సినిమా విచిత్రంగా బాగా లాభాలు తెచ్చుకుంది. తరువాత ఈ దర్శకుడు ఈ మ్యుంగ్-సే (Lee Myung-se) అమెరికన్ సినిమాలను ఉద్ధరిద్దామని ప్రయత్నించి సరైన డీల్ కుదరక వెనక్కి వచ్చేశాడు. అంతకు మునుపు మన పార్క్ కూడా ఒక అమెరికన్ సినిమా తీశాడు. దాని పేరు Stoker.

తీయటం బాగానే తీశాడు కానీ అదొక పార్క్ చాన్-వుక్ తీసిన Hitchcock thriller మాదిరి ఉంది కానీ, నిజమైన పార్క్ సినిమాలాగా లేదు. Stoker was praised for its atmospheric narration, traversing the dark alleys of human hearts, rich imagery, and deliberately paced plotting. కానీ పార్క్ సినిమాకు సాధారణంగా ఉండే కళ మిస్ అయింది. Exposing చేయకుండా నట ప్రతిభను చాటుకునేందుకు రంభ సరిగమలు సినిమాలో చేసిన పాత్ర లాగా. పోలిక బాగలేదా? సరే! వదిలేయండి. అంత ఆలోచించాల్సిన పని లేదు.

ఆ తరువాత ఐదేళ్ళకు Duelist అనే ఇంకో సినిమా చేశాడు. ఇది కూడా దాదాపు Nowhere To Hide లాంటి కథాంశమే. కాకపోతే contemporary Korea లో కాకుండా జోస్యూన్ రాచరిక రోజుల చివరి కాలంలో జరుగుతుంది. In the late 1800s.

రెండింటిలో కూడా ఒక ఫ్రాడ్ లేదా క్రైమ్ జరుగుతుంది. ఒక మగ డిటెక్టివో, లేడీ డిటెక్టివో రంగంలోకి దిగుతారు. వారి అధికార వర్గంలోనే ఈ క్రైమ్ లేదా ఫ్రాడ్‌కు ఆశీస్సులు అందించేవారు ఉంటారు. అంతే కథ.

ప్రేమకు వేళాయరా లో సూర్య చెప్పినట్లు..

ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక బావ. అంతే కథ. మధ్యలో వ్యాంపు (ఇది ట్విస్టు అంటాడు) బదులు యాక్షన్ సన్నివేశాలు. అలా రకరకాల కెమేరా యాంగిల్స్, ఎడిటింగ్ మెథడ్లు, కొత్తరకాలైన సౌండ్లు.. ఇలా వాడి కథను ఒక action ballet గా మార్చేస్తాడు.

ఈ సినిమా గురించి ఈ దర్శకుడు ఈ విధంగా చెప్తాడు.

ఒక క్యూలో మనిషి ఇరుక్కుని పోయాడు. విపరీతమైన తొక్కిసలాట. గొంతు తడారిపోతోంది. ఒంట్లో ఓపిక తగ్గిపోతోంది. అలాంటి సమయంలో అతని కన్ను ఎదురుగా ఉన్న దృశ్యాలను ఏవిధంగా చూస్తుందో అదే రకమైన దృశ్యాలను తెర మీద పాత్రల, ప్రేక్షకుల point of view లో చూపించాలి అనేది నా లక్ష్యం అంటాడు.

దానికోసం కెమేరా కదలికల కోసం footballers కాళ్ళ కదలికలను పరిశీలించాడు. ఒక సాకర్ ఆటగాడు ఒక పూర్తి మ్యాచ్ లో తన పాదాల కదలికలను ఒక గ్రాఫ్ లాగా గీస్తే వచ్చే పాథ్‌లో కెమేరాను కదిలిస్తాడు.

కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే అదంత సరిగ్గా చేయలేదని తెలుస్తుంది. కెమేరాను మాత్రం నూతనమైన పద్ధతిలో ఆపరేట్ చేశాడు. అంతవరకు నిజం.

ఈ సాకర్ రిఫరెన్స్‌ను దర్శకుడు మరో మూడేళ్ళలో కొరియాలో జరుగబోయే సాకర్ ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడని నా కొరియన్ మిత్రుడు అన్నాడు.

ఇటు Duelist అయినా, అటు Nowhere To Hide అయినా చూడదగ్గ సినిమాలు. ఒక సరికొత్త అనుభూతినిస్తాయి.

ఇక చివరగా 2007 లో M అనే సైకలాజికల్ థ్రిల్లర్‌ను తీశాడు.

ఇది కూడా పెద్దగా ఆడలేదు. మంచి రివ్యూలు వచ్చినా కూడా. ఎందుకింత ఫెయిలయిన ఫిల్మ్ మేకర్ గురించి మనం ఇంతగా చెప్పుకుంటున్నాం? కారణం ఇతను ప్రవేశ పెట్టిన లేదా వాడి చూపించిన టెక్నిక్ లను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఔత్సాహిక దర్శకులే కాదు. దిగ్గజాలు కూడా ఉపయోగించుకున్నారు.

డియర్ కామ్రేడ్ లో కిటికీ బద్దలు కొట్టుకు వచ్చి ముద్దు పెట్టుకునే సీన్, ప్రభాస్ పూరి జగన్నాధ్‌ల బుజ్జిగాడులో కొంత ఎడిటింగ్ టెక్నిక్, Mad Max: Fury Road, KGF లలో యాక్షన్ కొరియోగ్రఫీతో కలిపి వాడిన ఎడిటింగ్..

ఊఁ!

అదన్నమాట సంగతి.

సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఈ మ్యుంగ్-సే తీసిన చివరి సినిమా M. ఈ సినిమా ఒక అద్భుతం. కానీ, ఎప్పటిలాగే అందరికీ ఎక్కే సినిమా కాదు. అలా అని తీసి పడేయాల్సిందీ కాదు. మేకింగ్‌లో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన సినిమా.

మిన్-వూ ఒక వర్ధమాన రచయిత. మంచి సక్సెస్‌ను చూస్తున్నాడు. ఇంతకు క్రితం రాసి పెద్ద విజయం సాధించిన నవలకు మన సినిమా మొదలయ్యే సమయానికి కొనసాగింపు రాస్తున్నాడు. కానీ రైటర్స్ బ్లాక్ అడ్డం పడింది. ఎడ్వాన్స్‌లు గట్రా తీసుకుని ఉండటం వల్ల పబ్లిషర్ల నుంచీ ఒత్తిడి.

ముందు వచ్చిన సక్సెస్ కన్నా పెద్ద స్థాయిలో కొట్టాలని తన మీద తనకున్న expectations, వీటన్నిటి వల్లా మనిషి బాగా ఒత్తిడికి గురవుతాడు. దాని వల్ల క్రిస్ నోలాన్ హీరోల్లాగా డిప్రషన్లో పడతాడు. తనను ఎవరో వెంటాడుతున్నారని, వేటాడుతున్నారని భ్రమలు మొదలవుతాయి. నిజానికీ, భ్రాంతికీ తేడా తెలుసుకోక, వాస్తవవాస్తవ జగత్తుల మధ్య విభజన రేఖ తెగిపోయి ఇబ్బంది పడుతుంటాడు. ఈ సమస్య కాని సమస్య నుంచి తప్పించుకునేందుకు పరిగెడుతూ ఒక కఫే కు వెళతాడు. అది చీకటి గుయ్యారం లాంటి వీధి.

అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి మోహిస్తాడు. ఆమె పేరు మిమీ. ఎందుకింత మోహం ఆ అమ్మాయి మీద అని తనను తానే ప్రశ్నించుతుంటాడు (ఇక్కడ నాకు క పలకలేదు). తనకూ ఆమెకూ ఏదో సంబంధం ఉందన్న ఊహ కలుగుతుంది. గతంలోకి తొంగి చూసుకుంటాడు. ఈ స్త్రీ తన చిన్నతనంలో ప్రేమించిన అమ్మాయి ఒకరేనా అనే ఆలోచన కలుగుతుంది.

కానీ ఇక్కడే పెను ప్రమాదం పొంచి ఉంటుంది.

సినిమా మొత్తం ఒక కల లాగా తీసాడు. Not just dreamy photography or visuals. The narration itself is dreamy. సినిమాలో సన్నివేశాలు కూడా ఒక కలలో మాదిరిగా ఉంటాయి. కలలో మనకు అంతా నలుపు తెలుపు రంగులలో కనిపిస్తుంది.

ఒక నలుపు తెలుపు ఛాయాచిత్రానికి ఏఐ ద్వారా రంగులద్దితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో విజువల్స్ అలా ఉంటాయి.

ఈ మ్యుంగ్-సే సినిమాలను పరిశీలనగా చూడాలి. ఒకసారి పూర్తిగా చూస్తే, మరోసారి, మరోసారి చూస్తాం. లేదా మొదటి ఐదారు నిముషాలలోనే – రవితేజ సినిమాలు చెత్తవి అని ముందే తీర్మానించుకున్న మేధావి వర్గీయుల లాగా – చూడటం ఆపేస్తాం.

సమస్య ఏముంది.

నేనిచ్చే సలహా. ముందు Duelist ప్రయత్నించండి. తరువాత దాక్కోవచ్చు. M ను కలువ వచ్చు.

ఈలోగా రాహుల్ గాంధీ అరెస్టు గురించి..

పవన్ కళ్యాణ్ గొంతులో: ఎవడెవడి అభిప్రాయాలు వాళ్ళు వాళ్ళు గోడక్కొట్టుకోండి ( I mean.. in social media).

(సశేషం)

Exit mobile version