Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-8

Chapter 7: సోల్ సర్కస్ (Seoul Circus) – 1

[dropcap]ఉ[/dropcap]త్తర కొరియాకు, దక్షిణ కొరియాకు పెద్ద తేడా లేదు. ఉత్తరాది వాళ్ళు naive. దక్షిణాది వాళ్ళు అందమైన ముసుగు వేసుకుంటారు, అంతే! అంటుంది పార్క్ యోన్-మీ. ఈ పిల్ల ఆమధ్య అమెరికన్ యూనివర్సిటీలలో ఉండే ప్రజాస్వామ్య విలువల ముసుగు కొంత తొలగించి, Woke Mentality లో లోపాలను ఎత్తి చూపింది. అలాగే దక్షిణ కొరియా లేదా మనం ప్రస్తుతం ఏదేశపు సినిమా ప్రయాణంలో ఉన్నామో ఆ దేశాపు ముసుగును తొలగించటమే కాకుండా, అద్దాన్ని కూడా చూపించిన గొప్ప రచయిత యి మున్-యోల్ (Yi Mun-yol).

అసలు పేరు యి యోల్. మున్ (నిజానికి ‘మ’ కు ‘ము’ కు మధ్యస్తంగా పలకాలి) అంటే సృజనకారుడు లేదా రచన చేసే వ్యక్తి. తను రచయితగా మారగానే పేరులో మున్ చేర్చుకున్నాడు. ఒక రకంగా Conformist అయిన తన తండ్రి మీద నిరసనతో. ఇతను కొరియాలో అత్యంత గొప్ప రచయితలలో ఒకడిగా పేర్గాంచాడు కూడా. డజన్ల సంఖ్యలో నవలలు, నవలికలు రాయటమే కాదు. వాడే ప్రతి పదం ఒక కత్తి వేటులా ఉంటుందని చెప్తారు. యి మున్-యోల్ రచించిన Our Twisted Hero ను చదివిన వాళ్ళు Nineteen Eighty Four తో పోలుస్తారు. ఇతన్ని కొరియన్ జేమ్స్ బాల్డ్విన్ అని అమెరికన్లు అభివర్ణిస్తారు.

ఇక ప్రస్తుతం మన టాపిక్ అయిన Our Twisted Hero మూమూలు నవల కాదని ముందు ఎపిసోడ్ లోనే చెప్పాను. అలాగే Oldboy protagonist Choi Min-sik తొలి సినిమా అయిన ఈ నవల తెర రూపం నవలంత గొప్పది. ఈ కథ కు బీజం పడింది 1950ల నుంచీ 1980ల చివర వరకూ కొరియాలో వెల్లివిరిసిన నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమం, ఆ సందర్భంలో జరిగిన అత్యంత విషాదమైన సంఘటన క్వాంగ్ జు మసాకర్ సందర్భంలో. ఉత్తర కొరియాతో పోలిస్తే దక్షిణ కొరియా గొప్పది, వారి కమ్యూనిజాన్ని తేలిగ్గా జయిస్తుంది. కానీ ఆ కమ్యూనిస్టులు మనదేశం బాగుపడుతుంటే చూసి ఓర్వలేక మన మీద దాడి చేయవచ్చు. కనుక మన సైన్యం ఎల్ల వేళలా సంసిద్ధంగా ఉండాలి అని దక్షిణ కొరియా పాలకులు చెప్తూ ఉంటారు.

ఆర్నెల్లు కర్రసాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టాడు అన్న సామెతలాగా కమ్యూనిస్టులతో యుద్ధం రాలేదు కానీ, 500 పైచిలుకు ప్రజాస్వామ్య వాదులను కొట్టి చంపుతారు సైనికులు. కొన్ని వేల మంది గాయపడతారు. అదే క్వాంగ్ జు మసాకర్. సరిగ్గా ఈ క్వాంగ్ జు మసాకర్‌ను సెంట్రల్ పాయింట్‌గా తీసుకుని, నియంతృత్వానికి వ్యతిరేక పోరాటాన్ని సోల్ నగరం నుంచి వచ్చిన కొత్త విద్యార్థి హన్ బ్యాంగ్-టే క్లాస్ మానిటర్ ఓమ్ సోక్-డే మీద చేసే పోరాటంగా చూపిస్తాడు. ఎలా అయితే ప్రజాస్వామ్య వాదులు ఓడిపోయారో అలాగే హన్ కూడా ఓడతాడు. కానీ మార్పు రాక తప్పదో కొరియాలో ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ అసలైన కొరియన్ ఐడెంటిటీ దెబ్బ తిన్నది.

సరిగ్గా బోఫోర్స్ స్కాండల్ బైటకొచ్చిన 1987లో ఈ నవల విడుదలైంది. ఆర్థిక సంస్కరణల తొలి ఫలాలు జనాలకు గట్టిగా అందటం ప్రారంభమవటమే కాకుండా హర్షద్ మెహ్తా ఉదంతం బైటపడ్డ సమయంలో 1992 లో ఈ సినిమా విడుదలైంది.

ఇక నవల, సినిమా మూల కథ దాదాపు ఒకటే కనుక మనం రెంటి బదులు మామూలుగా కథ చెప్పుకుంటే చాలు. హన్ – సోల్ (Seoul) నగరంలో పుట్టి పెరిగిన most sophisticated boy from a well to do boy. మన 1980ల సినిమాల హీరోల్లాగా చదువులో ఫస్టు, ఆటల్లో ఫస్టు, టీచర్ల అభిమానం పొందటంలో కూడా ఫస్టే. హాయిగా చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్న హన్ జీవితంలో పెద్ద కుదుపు వాళ్ళ కుటుంబం రాజధాని సోల్ నగరం నుంచీ చిన్న పట్టణానికి మారాల్సి రావటం రూపంలో వస్తుంది. తనకన్నా పై మెట్టు మీద ఉన్న ఆసామితో తగూ వల్ల వీళ్ళ నాన్న కుటుంబాన్ని ఆ చిన్న ఊరుకు మారుస్తాడు (గుర్తు పెట్టుకోండి).

సోల్ లాంటి పెద్ద నగరంలో ప్రఖ్యాతి గాంచిన బడిలో తిరుగులేని స్టార్ హీరోగా వెలిగిన తనకు ఈ చిన్న ఊరి బడిలో గొప్ప admiration లభిస్తుందని ఆశపడతాడు హన్. కానీ ఆ బడిలో, ప్రత్యేకించి ఐదవ గ్రేడ్ ఒక క్లాస్ మానిటర్ గుప్పెటలో ఉంటుంది. ఆ క్లాసులో అందరికన్నా బలమైన వాడే కాదు, వయసు రీత్యా పెద్ద వాడైన ఓమ్ సోక్-డే పశు బలంతో కాకుండా తన సాఫ్ట్ పవర్‌కు బలాన్ని జోడించి టీచర్లను సైతం లొంగదీసుకుని విద్యార్థులను తన అధీనంలో ఉంచుకుంటాడు. హన్‌కు ఇది నచ్చదు. తన తెలివితేటల సహాయంతో ఓమ్‌ను ఓడిస్తానని అతని నమ్మకం. అది నిజానికి నిజం కూడా. కానీ ప్రాక్టికల్‌గా అది సాధ్యపడదు. ఎందుకంటే అతను ఒక విద్యార్థికి వ్యతిరేకంగా పోరాడటం లేదు. ఒక విద్యార్థి నాలుగేళ్ళుగా తయారు చేసుకున్న సిస్టమ్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు.

It’s more like Howard Roark standing up against the whole world. కానీ ఇక్కడ మన కథానాయకుడు మామూలు మనిషి. ఒక Roark లాంటి ideal hero కాదు. ఎంత బాగా రాసినా మార్కులు ఓమ్ తరువాతే వస్తాయి. ఎంత ప్రయత్నించినా ఒక్క టీచర్ కూడా అతనికి సహకరించరు. పైగా ఇతన్నే తప్పుపట్టి శిక్షిస్తారు. ఇలాంటి సందర్భంలో సహజంగా హన్ తన తండ్రి సహాయం తీసుకుని నెగ్గుకొస్తాడు. కానీ ఇప్పుడు అతని తండ్రి మునుపటి హీరో కాదు. తనకన్నా పెద్దవారితో పెట్టుకుని, సున్నం కొట్టించుకుని వచ్చేసిన భీరువు. మనకన్నా చిన్నవాళ్ళ మీద చూపగలిగిన పవర్, మనకన్నా పై స్థానంలో ఉన్నవారి మీద ఎందుకూ కొరగాదు. తండ్రి తన మాటనే ఆలకించడు. కొన్ని నెలల పోరాటం తరువాత ఇక తన వల్ల కాదని హన్‌కు అర్థం అవుతుంది.

ఇక మిగిలిన ఆప్షన్? పోరాడే శక్తి లేకపోతే మిగిలిన ఆప్షన్ బాన్చెన్ కాల్మొక్కుతా. సరిగ్గా అదే అమలు చేసి ఓమ్‌తో కాంప్రమైజ్ అవుతాడు హన్. హన్ సహజ తెలివితేటలు, శక్తియుక్తులు తెలిసిన ఓమ్ అతన్ని తన వర్గంలో చేర్చుకోవటమే కాక తన తరువాత స్థానాన్ని ఇస్తాడు. కానీ, దాదాపు తనకు తగిన స్థానాన్ని పొందినా, అది తన శక్తియుక్తులకన్నా ఇతరుల భిక్ష వల్ల అన్న ఫీలింగ్ హన్‌ను దహిస్తుంది. ఇలా కొంతకాలం గడుస్తుంది. కానీ అవ్యవస్థ ఎల్లకాలం నిలువదు. ఎక్కడోక్కడ కుప్పకూలాల్సిందే. అలా ఐదో గ్రేడ్ గడిచి ఆరో గ్రేడ్‌కు వచ్చేసరికి రంగంలోకి దిగుతాడు మాస్టర్ కిమ్. ముందే స్కెచ్ వేసుకున్నట్లు ఓమ్ మాఫియాను టార్గెట్ చేస్తాడు. ఓమ్ ప్రధాన బలం అతని శారీరక, వ్యవస్థాపక శక్తులే కాదు. అందరికన్నా తనే గొప్ప విద్యార్థి కావటం కూడా. కానీ, దాని వెనుక ఉన్న రహస్యం అతని సహజ తెలివితేటలు కాదు. మాఫియా లాంటి బలం.

ఏ సబ్జక్ట్‌లో ఏ విద్యార్థి గొప్పగా రాణిస్తాడో ఆ విద్యార్థి చేత తను ఆ సబ్జక్ట్ పరీక్షలు తన బదులు రాయిస్తాడు. మాస్టర్లకు కావలసినవి తన ముఠా వల్ల అందేలా చేసి తడపాల్సిన చేతులు తడుపుతాడు. ఈ విషయం హన్‌కు బోధపడేసరికే అతనికి ఓమ్ సృష్టించిన వ్యవస్థలో పావుగా వెళతాడు. విషయం మునుపు పూర్తిగా అవగతం కాదు. కానీ మాస్టర్ కిమ్ వ్యవస్థను ఎదుర్కోడు. వ్యవస్థను ఏకవ్యక్తి ఎదురుకుంటే మిగిలేది పరాజయమే చాలా సందర్భాలలో. దానికి విరుగుడల్లా అలాంటి అవ్యవస్థలకు అద్దం చూపటమే. అద్దంలో తన అసలు రూపాన్ని చూసుకున్న రాక్షసి ఆత్మన్యూనతకు గురైనట్లు, దేవతా దుస్తుల రహస్యం బైటపడ్డాక రాజుగారి పరిస్థితిలా వ్యవస్థలో కొన్ని పగుళ్ళ వస్తాయి. ఆ పగుళ్ళ మీద బలమైన దెబ్బలు కొడితే…

సరిగ్గా అలాంటి పరిస్థితే కల్పిస్తాడు మాస్టర్ కిమ్. క్లాసులో అధిక మార్కులు అనే privilege అసలు రహస్యాన్ని బట్టబయలు చేయటం ద్వారా బద్దలుకొడతాడు మాస్టర్ కిమ్. తరువాత taking force with force అన్నట్లు బలప్రయోగానికి దిగిన ఓమ్‌ను తనకున్న పైమెట్టు అన్న privilege ను వాడుకుని చావచితక బాదటం ద్వారా ఎదుర్కుంటాడు. కానీ ఇంతటితో ఆగితే కథే లేదు. తన యుద్ధాన్ని పరిధులు దాటించి మరీ చేస్తాడు. తాళలేక ఓమ్ మాయమౌతాడు. అచ్చు గొప్ప గొప్ప డిక్టేటర్ల లాగనే. అతను ఏమయ్యాడు? అతనికి తలొగ్గి ఉన్న సహచర విద్యార్థులు ఎందుకు సహాయం రాలేదు? మాస్టర్ కిమ్ విపరీత మనస్తత్వం వెనుక కారణం? అసలు మన హన్ ఈ హడావుడిలో ఎలా మసిలాడు? ఇవన్నీ నవల లేదా సినిమా ద్వారా తెలుసుకోవాలి.

ఇది వ్యక్తి వర్సెస్ వ్యవస్థ కథలా అనిపించే సామాజిక కథ కాగా, …Ing సాధారణ రొమాంటిక్ కథగా కనిపించే వ్యక్తి వర్సెస్ వ్యక్తి నుంచీ వ్యక్తి ప్లస్ వ్యక్తి మీదుగా అసలు ఈ వ్యక్తి ఎక్కడి నుంచీ వచ్చాడు? ఎక్కడికి వెళతాడు అన్నది డిస్కస్ చేస్తుంది. ఇక్కడ ఓమ్ పాత్ర మరణం కాగా, హన్ పాత్రలో మిన్-ఆ ను చూడవచ్చు. మరణంతో మిన్-ఆ పోరాటం పరాజయంతో ముగిసి, ఒక ఆత్మగా మిన్-ఆ విముక్తమై గెలుపొందుతుంది. మరి అలాంటి అంతిమ విజయం హన్ దక్కించుకుంటాడా? మిన్-ఆ కథలో మాస్టర్ కిమ్‌లు ఉండరు.

ఈ రెండు పరస్పర వ్యతిరేక, ఏ మాత్రం సంబంధం లేని సినిమాలను ఎందుకు పోలుస్తున్నాను? The allegory and other techniques used in Our Twisted Hero is so unique. ఆ యునిక్నెస్ …Ing లో మరో రూపంలో కనిపిస్తుంది. అంతేకాదు. పార్క్ చాన్-వుక్ తీసిన The Hndmaiden కు వీటితో ముడిపడి ఉంది. ఆశ్చర్యంగా ఉందా? అదెలాగో ముందు ముందు చూద్దాం.

ఈలోగా Our Twisted Hero సినిమా గురించి కొన్ని వివరాలు. సరిగ్గా మనదేశపు స్వాతంత్ర్య దినోత్సవం నాడు 1992లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు పార్క్ జాంగ్-వన్. ఇతని తొలి సినిమా కురో అరియాంగ్. నిజానికి అదే మన చోయ్ మిన్-సిక్ తెరపై కనిపించిన తొలి సినిమా. కానీ, Our Twisted Hero తన తొలి సినిమాగా అభిమానులు భావిస్తారు. కారణం… (తెలుసుకుందాం). కొరియన్ వేవ్‌కు మూలకారణమైన సినిమాలలో ప్రధానమైన వాటిలో ఒకటైన Our Twisted Hero తీసిన పార్క్ జాంగ్-వన్, కొరియన్ వేవ్ ఊపందుకొంటున్న మిలీనియమ్ సంవత్సరాలైన 1999-2001 తో తన కెరియర్ ముగించాడు. కానీ కొరియన్ సినిమా చరిత్రలోనే గొప్ప నటుడిని వెలికి తీసిన ఘనత మాత్రం ఈయనదే. ఇతని మొదటి మూడు సినిమాలు పాతిక గొప్ప కొరియన్ సినిమాలలో చోటు సంపాదిస్తాయి. మూడో సినిమా The Great Empire.

కొరియన్ సినిమాకు ఇచ్చే గొప్ప అవార్డులన్నీ ఇతను మొదటి మూడు సినిమాలతోనే పొందేశాడు. ఇంత గొప్ప సినిమాలు తీసినా ఇతన్ని గొప్ప దర్శకుడిగా ఎంచరు. కారణం… ఇతని దర్శకత్వ శైలికి ఒక ప్రత్యేక రూపం లేకపోవటం. Our Twisted Hero లో ప్రధాన పాత్రలైన ఓమ్, హన్‌లు గా నటించిన Hong Kyung-in, Go Jeong-il లు అద్భుతమైన నటన కనబర్చినా తరువాతెందుకో నిలదొక్కుకోలేక పోయారు. టీచర్ చోయ్‌గా నటించిన వెటరన్ నటుడు Shin Goo కొరియన్ వేవ్‌లో ఎన్నదగిన చిత్రాలలో నటించాడు. 1970 నుంచీ నటిస్తున్న ఇతని లేటెస్ట్ సినిమా Hi.5. ఈ సంవత్సరం విడుదలకు షెడ్యూల్ చేయబడింది. విచిత్రంగా Our Twisted Hero రిలీజైన 1992లో కొరియాలో విడుదలై టాప్ ఐదు స్థానాలలో నిలిచిన సినిమాలలో ఒక్కటంటే ఒక్క కొరియన్ సినిమా లేకపోవటం. డిస్నీ సినిమా అలాడిన్ తొలి స్థానంలో నిలిచింది.

Exit mobile version