Site icon Sanchika

కొత్త, పాత విలువల మధ్య సంఘర్షణను చూపిన చిత్రం ‘కొత్త నీరు’

[dropcap]‘కొ[/dropcap]త్త నీరు’ 1982లో వచ్చిన సినిమా. కె.ఎస్. ప్రకాశరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మూలం, ‘పరసంగద గెండె తిమ్మ’ అనే కన్నడ సినిమా. 1978లో వచ్చిన ఈ కన్నడ సినిమా శ్రీకృష్ణ అలనహళ్ళి అనే రచయత నవల అధారంగా తీసారు. నవల పేరునే కన్నడ సినిమాకు పెట్టారు. ఈ సినిమాకు మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. 1979లో ఇదే కథను ‘రోసప్పో రవిక్కై కారి’ అనే పేరుతో తమిళంతో తీసారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన శివకుమార్‌కు ఫిలింఫేర్ పురస్కారం లభించింది. రెండు భాషలలోను ఈ సినిమా బాగా అడింది. క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. తెలుగులో ఇదే కథను ‘కొత్త నీరు’గా తీసారు. చంద్రమోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా వారి నటనా ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. కాని అనుకున్నంతగా ఇది తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాని ఈ సినిమా నిస్సందేహంగా తెలుగులో వచ్చిన ఒక మంచి సినిమా.

నాగరికత మానవ సమాజంలో అతి మెల్లిగా ప్రవేశించాలి. అప్పుడే మార్పుకు సమాజం అలవాటు పడుతుంది. తరాల మధ్య సంయమనం సాధ్యమవుతుంది. గత ముప్పై సంవత్సరాలుగా త్వర త్వరగా వస్తున్న సామాజిక, సాంస్కృతిక మార్పులు మనిషి జీవనంపై ఎంతటి ప్రభావం చూపిస్తున్నాయో మనం ప్రత్యక్ష్యంగా చూస్తున్నాం. కొన్ని ప్రామాణికలకు, విలువలకు అలవాటుపడి జీవిస్తున్న తరం వాటిని ఒకే సారి వదులుకొని కొత్తను స్వీకరించడానికి సిద్ధంగా ఉండదు. ఇది సాధ్యం కాదు కూడా. బలవంతంగా వారిపై కొత్త ఆలోచనలను, విలువలను రుద్దడం వలన వారి జీవితాలలో అలజడి మొదలవుతుంది. దీని కారణంగా అటు పాత విలువలు, కొత్త ఆలోచనలు రెండూ కూడా సంఘర్షణకు లోనవుతాయి. ఈ పాత కొత్తల ప్రయోగంలో ఎప్పుడయితే అలజడి ఎక్కువవుతుందో, అక్కడ ఆ విలువల రూపం మారుతుంది. జీవితాలు కంట్రోల్ తప్పుతాయి. ఒక కొత్త మందును శరీరంలో ప్రవేశపెట్టేటప్పుడు ఎంతగా జాగ్రత్తలు పాటిస్తారో, కొత్త ఆలోచనలను సమాజంలో ప్రవేశపెట్టేటప్పుడు అంతే సంయమనం పాటించినప్పుడే కొత్త మరియు పాత కలిసి మరో నూతన రూపాన్ని సంతరించుకుని ఏకమవుతాయి. అది జరగకుండా వేగంగా కొత్త నీరు ప్రవేశించినప్పుడు నదిలో కలకలం ఏర్పడుతుంది. అందులో బ్రతికే జీవులు ప్రాణాలు పోగొట్టుకుంటాయి. ‘కొత్త నీరు’ సినిమా మనకిచ్చే సందేశం ఇదే.

నాగరికత తెలియని ఒక చిన్న పల్లెటూరిలో ఇంటింటికీ వెళ్ళి సరుకులు అమ్ముకుంటాడు కనకయ్య. పూర్తి పల్లెటూరి మొరటు మనిషి ఇతను. అతనికి కామాక్షితో వివాహం జరుగుతుంది. నాగరికత తెలిసిన ఊరి నుండి కోడలిగా ఈ మారుమూల ప్రాంతానికి వస్తుంది కామాక్షి. ఆమెతో పాటు టౌను నాగరికత ఆ ఊరిలోకి ప్రవేశిస్తుంది. పౌడర్లు, స్నోలు, షిఫాన్ చీరలు, రిబ్బన్లు, సెంట్లు, తలకు వాసన నూనె ఇవన్నీ ఆమెతో ఆ ఊరికి పరిచయమవుతాయి. ఇంత నాజూకుతనానికి అలవాటు పడని ఊరి జనాలు ఆమెని వింతగా చూస్తారు. అసూయగా చూస్తారు. ఆమెలో విలాస జీవితం గడిపే స్త్రీ మాత్రమే వారికి కనిపిస్తుంది. ఆ ఇంట్లో అత్తకు కోడలికి ఈ విషయంలో గొడవలు అవుతాయి. భార్య భర్తలు విడి కాపురం పెడతారు.

భర్తను నాగరికతను అలవాటు చేయాలని కామాక్షి ప్రయత్నిస్తుంది. కాని తాను అనుకున్నట్లు ఆ పని చేయలేకపోతుంది. మొరటు ప్రజల మధ్య, నాగరికత తెలియని తల్లి పెంపకంలో పెరిగిన కనకయ్య, భార్యని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, కాని ఆమెలా మారలేకపోతాడు. కొద్దిగా తన అలావాట్లు పద్ధతులు మార్చుకున్నా ఆ నాగరికతకు పూర్తిగా వశం కాలేకపోతాడు. ఉరివారందరూ కామాక్షి వాడే వస్తువులు చాటుగా కనకయ్యతో తెప్పించుకుంటూ ఉంటారు. అతని వ్యాపారం పుంజుకుంటుంది. కాని సహజంగా ఎవరూ కూడా కామాక్షిగా పూర్తిగా మారలేకపోతారు. కామాక్షి ఒక రకంగా ఒంటరిదవుతుంది. ఆమె నాజూకుతనాన్ని చూసి అసూయ పడేవారు తప్ప, ఆమెలా ఉండాలని చాటుగా అనుకునే వారు తప్ప ఆమెను తమలో కలుపుకునే వారెవ్వరూ ఆ ఊరిలో ఉండరు.

ఈ సమయంలోనే సుందరం అనే ఒక వ్యక్తి మలేరియా ఇన్‌స్పెక్టర్‌గా ఆ ఊరికి వస్తాడు. ఇతను ఆరడుగుల అందగాడు. నాజూకువాడు. అతని ముందు కనకయ్య మరీ మొరటగా కనిపిస్తాడు. కామాక్షి సుందరం పట్ల ఆకర్షితురాలవుతుంది. తన ఆలోచనలను, టేస్ట్‌ను అతనొక్కడే అర్థం చేసుకున్నట్లు ఆమెకు అనిపిస్తుంది. ఊరివారందరూ తనను దూరం పెట్టడం, కుటుంబ సభ్యులు తనను దగ్గరకు తీయలేకపోవడం ఆమెలో అంతులేని కసిని, ఒంటరితనాన్ని కలిగిస్తాయి. ఇది సుందరంతో అక్రమ సంబంధానికి దారి తీస్తుంది. కనకయ్యను తల్లితో పాటు ఊరి వారందరూ ఈ విషయంలో హెచ్చరిస్తారు. కాని అతను వారి మాటలు నమ్మడు. ఒక రోజు భార్యను సుందరంతో చూసే దాకా అతనికి భార్య పట్ల అంతులేని నమ్మకం ఉంటుంది. తన కళ్ళతో నిజాన్ని చూసినప్పుడు అతనికి భార్యపై విపరీతమైన కోపం వస్తుంది. ఆమెను చంపేయాలి అన్నంత అసహ్యం వెస్తుంది. కాని అతను స్వతహాగా మంచివాడు. ఆమె తనను ద్రోహం చేయడం, తన చేతకానితనం అని నిర్ణయించుకుంటాడు. చివరకు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. భర్త ఒక్క మాట కూడా తనను అనకుండా తిరిగి వెళ్ళిపోతుంటే ఆపరాధ భావంతో కామాక్షి కూడా అత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. వీరిద్దరి జీవితాలు ఇలా ముగుస్తూ కొత్తనీరు పాతనీరుని బలంగా తోసెవేయాలనుకునేటప్పుడు కలిగే కల్లోలాన్ని చూపుతాయి.

ఇందులో ఎవరినీ తప్పుపట్టాలని అనిపించదు. సున్నితమైన రుచులతో, మొరటుదనాన్ని పారద్రోలి జీవితాన్ని ఆనందించాలి అనుకునే కొత్త ఆలోచనలకు నాజూకుతనానికి రూపం కామాక్షి. ఊరి వారందరూ ఆమె చూపే ఆకర్షణల నుండి తప్పించుకోలేరు. కాని ఒకే రోజుతో వారి పాతను తుడిచివెయ్యలేరు. ఊరిలోని స్త్రీలంతా కామాక్షిలా నాజుకుగా మారాలనుకునే క్రమంలో అ మార్పుకు సిద్ధంగా లేని పురుష సమాజంలో మరో రకమైన అలజడి మొదలవుతుంది. పక్కింటి స్త్రీని బలత్కారం చేయాలనుకున్న ఒక వ్యక్తిని పట్టుకుని నీవిలాంటి పని చేయడం ఏంటని ఊరి పెద్ద ప్రశ్నించినప్పుడు, ఆమెను అలా కొత్తగా చూసి తనను తాను నియంత్రించుకోలేకపోయానని బదులిస్తాడు అతను. ఇది వినడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా, ఆలోచిస్తే ఇలాంటి నాజూకుతనాన్ని ఎప్పుడూ చూడని, ఆస్వాదించని మొరటు వ్యక్తి ఆ అనుభవం ఎదురయినప్పుడు ఆనందించలేడు సరి కదా రాక్షసంగా మారతాడు అన్నది అర్థం అవుతుంది. ఇది మానవ నైజం. అందుకే కామాక్షిలోని నాగరికతకు ఆకర్షితులయిన వారు కూడా దాన్ని స్వీకరించడం ఊరికి అరిష్టం అనే నమ్ముతారు. ఏ తప్పు లేకపోయినా కామాక్షిని అందుకే అందరూ వెలి వేస్తారు. ఆ ఊరు విడిచి పోవాలని ఆ దంపతులు అనుకునే పరిస్థితులు కలుగుతాయి. కాని ఈ లోపు సుందరం రాక, ఊరి వారు తనకు చేస్తున్న అన్యాయానికి ప్రతీకార చర్యగా భావిస్తుంది కామాక్షి, అతని పట్ల ఆకర్షణ ఆమె ఆలోచనను కప్పేస్తుంది. చివరకు అదే కామాక్షి, కనకయ్య మరణానికీ కారణమవుతుంది.

సినిమాలో ఈ కొత్తనీరు తెచ్చే ఉపద్రవాన్ని అక్రమ సంబంధంతో పోల్చిచూపించడం ఒక కథకు అల్లుకున్న విషయం మాత్రమే. దీన్ని మరోలా గమనిస్తే, ఇప్పుడు గ్లోబలైజేషణ్ పుణ్యమా అని కొట్టుకు వచ్చిన పాశ్చాత్య పరంపరలో కొన్ని సుగుణాలు, సౌకర్యాలు ఉన్న మాట వాస్తవమే. కాని త్వరత్వరగా అది ఒక తరాన్ని ప్రభావితం చేయడం వలన, తరాల మధ్య అంతరాలు, కొత్త సమస్యల ఆవిర్బావం గమనించవచ్చు. మన సమాజం, సంస్కృతి మార్పుకు సిద్ధపడి ఉన్నప్పుడే మార్పుని స్వీకరించి, మన జీవితంలో ఒక భాగంగా దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. కాని ఏ మార్పుకు సిద్ధంగా లేని సమాజం మధ్య దూసుకు వచ్చే కొత్త నీరు విద్వంసాన్నే సృష్టిస్తుంది. దానికి బలయి పోయే అమాయకులు ఎంతో మంది. వారి జీవితాలలోని విషాదానికి కారణం ఎంటి అన్నది ఆలోచించలేకపోతే, కొత్తనీరుతో కొట్టుకుపోతున్న తరలను, జీవితాలను ఆదుకోవడం కష్టం అవుతుంది. మానవ సమాజంలో ఇలాంటి విషాదాలను నియంత్రించలేకపోతే ఏ ‘కొత్త ఆలోచన’ వలన కూడ సహేతుకమైన మార్పు సాధ్యం కాదు. మార్పును స్వీకరించడానికి సిద్ధంగా లేని సమాజంలో మార్పును రుద్దడం వలన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని జీవితాలనే కాదు, సమాజంలోని ఆ లయను కూడా కుదిపివేసి ఎవరూ సరిచేయలేని పరిస్థితులను సృష్టిస్తుంది. ‘కొత్త నీరు’ సినిమా అలాంటి పరిస్థితులను మనకు పరిచయం చేస్తుంది.

ఈ చిత్రనికి రమేష్ నాయుడు గారు సంగీతం అందించారు. పాటలన్నీ ఆరుద్ర గారు రాసారు. శైలజ గారు గానం చేసిన ‘ఊగిసలాడకే మనసా’ అన్న గొప్ప పాట ఈ చిత్రంలోదే. ఈ సినిమా అర్థాన్ని పూర్తిగా విశదికరించే పాట అది.

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా..

ఊసుపోలేదనో… ఆశగా ఉందనో… ఉర్రూత లూగకే మనసా…

 

తలలోన ముడిచాక విలువైన పువ్వైనా, దైవపూజకు తగదు మనసా…

పొరపాటు చేసావో దిగజారిపోతావు, నగుబాటు తప్పదు మనసా…

పెడదారి మురిపాలు మొదటికే మోసాలు, చాలు నీ వేషాలు మనసా…

తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను, దిమ్మరిని నమ్మకే మనసా…

చపల చిత్తము విపరీతమవుతుంది, చలియించకే వెర్రి మనసా..

కపటాలు సరదాలు కవ్వించు సరసాలు.కాలు జారేనేమో మనసా…

ఈ పాటను అర్థం చేసుకుంటే ఆకర్షణలకు జీవితపు విలువలకు మధ్య సంఘర్షణను విచక్షణతో ఎదుర్కోగలడం లోని అవసరం అర్థం అవుతుంది. కామాక్షి తనలో సుందరం పట్ల పెరుగుతున్న ఆకర్షణను గుర్తించి ఈ పాట పాడుతుంది. తనను తాను నియంత్రించుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది. కాని చివరకు ఆ ఆకర్షణకు లొంగిపోతుంది. పాతను స్వీకరించలేదు, తనను ఆ పాత తరం అంగీకరించదు. అలాంటప్పుడు ఆమెలోని ఒంటరితనం ఆమెతో చేయించే తప్పు ఆమె జీవితాన్నే అతలాకుతలం చేస్తుంది.

సినిమాలో చంద్రమోహన్ గారి నటనను ప్రశంసించకుండా ఉండలేం. సామాన్య మానవుడిని సినిమాకు ముఖ్య పాత్రగా చేసి చూపించగలిగిన గొప్ప నటుడు ఆయన. ఆనాటి సినీ హీరోలందరిలో మధ్యతరగతి సబ్జెక్టును ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళేవి వారి పాత్రలు. సీతామాలక్ష్మి, పదహారేళ్ళ వయసు, లాంటి సినిమాలలో ఆయన చేసిన పాత్రలను అప్పట్లో మరే తెలుగు నటుడు చేసే సాహసం చూపనప్పుడు, ఆ పాత్రలను పోషించి అతి సామాన్యమైన వ్యక్తులలోని హీరో ఎలిమెంట్‌ను ప్రెజెంట్ చేయగలిగిన గొప్ప నటులు ఆయన. అయన నటిస్తుంటే హీరో కనిపించరు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తెలుగు తెరపై ఆయనకు రావలసినంత హీరో వర్షిప్ రాకపోయినా వారి నటనను విస్మరించలేం. ఈ సినిమాలో కనకయ్య పాత్రను చాలా ఈజ్‌తో పోషించారు చంద్రమోహన్ గారు. తమిళంలో ఆ పాత్ర పోషించిన శివ కుమర్, కన్నడలో అదే పాత్ర చేసిన లోకేశ్ గారిని అక్కడి ప్రజలు అభిమానించి ఆదరించినంతగా తెలుగువారు చంద్రమోహన్ గారికి అంతటి గౌరవాన్ని ఇవ్వకపోవడం వెనుక కారణాలు ఏమి ఉన్నా నటనను అభిమానించే వారందికీ వీరి ఫర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.

Exit mobile version