కోతి – జామచెట్టు

0
2

[dropcap]అ[/dropcap]నగనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక చెరువున్నది. ఆ చెరువు గట్టు మీద చాలా చెట్లు పెరిగాయి. వాటిలో ఒక జామచెట్టు కూడా వున్నది. ఆ చెట్టు బోలెడు కాయలు కాసేది. కాయలు పండే సమయానికి లోపల గింజలూ, గుజ్జూ ముదురు గులాబీ రంగులోకి మారేవి. ఆ కాయల్ని కలకత్తా జామ అని పిలిచేవారు. ఆ కాయల్ని తినటానికి చిలుకలు వచ్చేవి. ఉడుతలు కూడా చేరేవి. చెరువులో పశువుల్ని కడిగేవాళ్లు. వాళ్లు కూడా వచ్చి కోసుకు తినేవాళ్లు. కబోది పక్షులు రాత్రి పూట మాత్రమే చూడగలవు. అవి కూడా రాత్రి పూట వచ్చి ఈ జామ పళ్లను తిని వెళ్లేవి.

ఒక రోజు ఎక్కడి నుండో ఒక కోతి వచ్చింది. అది చూడటానికి కాస్త పెద్దదిగానే వున్నది. అది జామచెట్టును చూసింది. దోరకాయలు, పండిన కాయల్ని గమనించింది. నోరూరింది. పండిన వాసనను పీలుస్తూ చెట్టు చుట్టూ గిరగిరా తిరిగింది. ఇక నుంచీ,  ఈ చెట్టు మీదే వుండాలనుకున్నది. ఎన్నో రోజుల పాటు కడుపునిండా జామపళ్లను తినాలన్న ఆలోచన చేసింది. ఆ ఆలోచన రాగానే బిరబిరా చెట్టెక్కింది. జామకొమ్మ మీద కూర్చున్నది. దోరగా పండిన కాయనొక దానిని కొరికింది. చాలా రుచిగా వున్నదనిపించింది. పండిన కాయనొక దానిని కొరికింది. బాగా తియ్యగా వున్నదనుకున్నది. అమాంతం మూడో కాయనూ తిన్నది. కోతికి  కడుపు నిండింది. తప్పకుండా ఇక్కడే వుండాలి, కాయలన్నింటినీ తానే తినెయ్యాలి అని మరింత గట్టిగా అనుకున్నది. మంచి నీళ్లు కావలిస్తే పక్కనే చెఱువున్నది. ఇంకా కొన్నాళ్లపాటు హాయిగా ఇక్కడే వుండొచ్చు. అలా వుండాలంటే ఇంకెవర్నీ చెట్టు దగ్గరకు రానీయకూడదు. చెట్టు మొత్తాన్నీ తానే స్వంతం చేసుకోవాలని దురాశపడింది. ఆ దురాశతోనే చెట్టు మీద కూర్చున్నది. అటూ ఇటూ చూస్తూ చెట్టు దగ్గరకు ఎవర్నీ రానీయకుండా కాపలా కాయసాగింది.

రోజులాగే కాయలు కోసం చిలుకలు వచ్చాయి. వాటిని కోతి చూసింది. చిలుకల్ని చెట్టు మీదే వాలనివ్వకూడదనుకున్నది. కిచకిచమని గట్టిగా అరుస్తూ ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మకు దూకింది. చిలుకల వంక కోపంగా చూసింది. కోతి అరుపులు విని చిలుకలకు భయం వేసింది. జామ చెట్టు మీద వాలాలని కొన్ని చిలుకలు అటూ ఇటూ ఎగిరాయి. కాని కోతి చిలుకల్ని వాలనివ్వలేదు.

“చిలుకలూ! బాగా వినండి. ఈ రోజు నుండి ఈ జామ చెట్టు నాది. ఎందుకంటే ఇది మా తాత నాటిన చెట్టు నాకిప్పుడు ఈ సంగతి గుర్తుకొచ్చింది. వెంటనే ఇక్కడి కొచ్చేశాను. అర్థమైందిగా వెళ్లండి. ఇంకెప్పుడూ ఇటు రావద్దు” అని గట్టిగా కోతి చెప్పింది. చేసేదేంలేక చిలుకలు అప్పటికి వెళ్లిపోయాయి.

ఆ తర్వాత చెట్టు మీద పాక్కుంటూ ఉడుతలు వచ్చాయి.

“ఏయ్ ఉడుతల్లారా! నేను ఈ జామ చెట్టును నా స్వంతం చేసుకున్నాను. ఇందాకే చిలుకలకూ చెప్పాను. అవి వెళ్లిపోయాయి, మీరు కూడా చెట్టు దిగండి. ఇంకెప్పుడూ ఇటురాకండి” చెప్పి గట్టిగా కిచకిచమన్నది.

ఉడుతలు కోతి కిచకిచలకు చాలా భయపడ్డాయి. ఉసూరుమంటూ వెనక్కి వెళ్లి పోయాయి. కోతికి చాలా సంతోషమేసింది. ‘చిలుకలూ, ఉడుతలూ పారిపోయాయి. నేనే ఈ కాయలన్నీ రోజూ తినొచ్చు’ అనుకున్నది. మంచి పండ్లను చూసుకుని కడుపునిండా తిన్నది. సాయంకాలమైంది.

పశువుపల కాపర్లు వచ్చారు. పశువుల్ని చేలో దింపారు. కాయలు కోసుకు తిందామని చెట్టుకింద కొచ్చారు. వాళ్లకు కనిపించేటట్లుగా కోతి కొమ్మమీద కూర్చున్నది. పళ్లన్నీ బయటపెట్టి కిచకిచమంటూ గట్టిగా అరవసాగింది. చేతిలోని కర్రలతో పశువుల కాపర్లు కోతిని తోలారు. కింద నుంచి రాళ్లను గిరాటు పెట్టారు. దెబ్బ తగలకుండా కోతి తప్పించుకుంటున్నది. అమాంతం కిందకి ఒక్క దూకు దూకింది. తనను కొట్టే వాళ్ల మీద పడి రక్కాలని వాళ్ల పైపైకి దుముకసాగింది.

“కోతి చేసిన గాయాలు త్వరగా మానవు. పైగా ప్రమాదకరం అని కూడా అంటారు” అన్నాడు వాళ్లలో ఒకడు. “నిజమేరోయ్. దీని సంగతి రేపు చూద్దాం” అనుకుంటూ వాళ్లు తమ పశువుల్ని తోలుకుని వెళ్లిపోయారు. వాళ్లలా వెళ్లటం చూసి కోతికి చాలా సంతోషం కలిగింది. ‘మనుషుల్ని కూడా భయపెట్టగలిగాను’ అన్న గర్వం కూడా కలిగింది. చీకటి పడింది. పైన ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నాయి.  ‘చీకట్లో ఇంకెవరూ రారు’ అనుకుంటూ కోతి నిద్రపోసాగింది. ఇంతలో చెట్టు మీద పక్షి వాలిన చెప్పుడు వినపడింది. కోతి నిద్రలేచింది. కళ్లు విప్పార్చుకుని చూడసాగింది. రెండు కబోది పక్షులు కనపడ్డాయి. వాటి కళ్లు చీకట్లో మెరుస్తున్నాయి. అవి కాయల్ని వెతుక్కుంటున్నవి. కోతి తన ఒళ్లు గట్టిగా విరుచుకున్నది. కిచకిచమంటూ పెద్ద శబ్దం చేస్తూ అరవసాగింది. “ఎవరదీ, కబోది పక్షులే కదా. పగలంతా మీకు కళ్లు కనిపించవు. రాత్రి కాగానే దొంగల్లాగా వచ్చి పండ్లు తినిపోతారు. ఇక నుంచీ మీరు ఇక్కడకు రావద్దు. ఈ రోజు నుంచీ  ఈ జామ చెట్టు నా సొంతమైపోయింది. చెట్టు దగ్గరకు ఎవరొచ్చినా ఉరుకోను. ఏ పక్షినీ రానివ్వను. ఏ మనిషినీ రానివ్వను. మీరిప్పుడు ఇక్కడ నుండి వెళ్లకపోతే మీ పని పడతాను” అంటూ అరిచి చెప్పింది.

ఒక కబోది పక్షి కోతి మీద దాడి చేయాలని చూసింది. రెండవ పక్షి వద్దన్నది. ఆ తర్వాత రెండూ కలిసి తిరిగి వెళ్లిపోయాయి.

‘ఈ చీకట్లో చెట్టు దగ్గరకు ఇంకెవరారు. కంటి నిండా నిద్రపోతాను’ అనుకుంటూ కోతి మరలా నిద్రకుపడింది. తెల్లవారింది. కాస్త ఎండపడింది. కోతి జామ కొమ్మ మీద కూర్చుని అటూ ఇటూ  చూడసాగింది. ఇంతలో చిలుకలు గుంపుగా వచ్చాయి. నిన్నటి కన్నా చాలా ఎక్కువగా వచ్చాయి. చెట్టు మీద వాలాయి. కొన్ని చిలుకలు జామకాయలనందుకుని కొరకటానికి ప్రయత్నిం చేయసాగాయి. కోతికి చాలా కోపం వచ్చింది.

“ఇక్కడ నుంచి నేను వెళ్లిపోయాననుకుని వచ్చారా? లేక గుంపుగా వస్తే నేను భయపడతాననుకున్నారా? ఆ పప్పులేం వుడకవు. మీలో ఎవ్వరికీ ఒక్క కాయ కూడా దక్కనివ్వను జాగ్రత్త” అంటూ పళ్లన్నీ బయటపెట్టి అరుస్తూ చిలకల్ని బాగా బెదిరించసాగింది. చిలుకలు కూడా ఎదురుతిరిగాయి.

“మేం ఎన్నోరోజుల నుండి ఈ చెట్టు మీద వాలుతున్నాం. కాయలు తింటున్నాం. నువ్వు నిన్నవచ్చావు. చెట్టు నాది. దీన్ని మా తాతా నాటాడు అంటూ కథలు చెప్తున్నావు. దానికి మేం ఒప్పుకోం” అంటూ పొట్లాటకు దిగాయి.

“రామ చిలుకలని కూడా చూడకుండా ఒక్కోదాని మెడ విరిచి పడేస్తాను. ఇంకా అవసరమైతే నా మిత్రుడు గరుడ పక్షిని పిలుస్తాను. మీ అందరి ప్రాణాలు తీయిస్తాను. జాగ్రత్త” అంటూ కోతి వాదనకు దిగింది.

“మేం రామ చిలుకలమని నువ్వే అన్నావు. మేం ఎంతో అందమైన పక్షులం. ఎవరికీ ఏ హానీ చేయం. నువ్వు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. మా పక్షులు ఎగరటం చూసే మానవుడు విమానాన్ని తయారు చేశాడు తెలుసా? నువ్వు చేసేది మంచి పని కాదు. నువ్వు తిను. కొన్ని పళ్లు మేము తింటాం” అంటూ చిలుకలు కోతికి నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశాయి.

కాని కోతి వాటి మాటలు వినిపించుకోలేదు. ఈ రోజుల్లో ఎవరు బలవంతులైతే వాళ్ల మాటే చెల్లుతుంది. “ఇక్కణ్ణుంచి వెళతారా లేకపోతే రెండు చిలుకల్ని పట్టి నేలకేసి విసిరి కొట్టమంటారా?” అన్నది మూర్ఖంగా.

‘ఇంకేదైనా ఉపాయం ఆలోచించుదాం. ఎంత చెప్పినా ఈ కోతి వినటం లేదు’ అనుకుంటూ చిలుకలు అప్పటికి తిరిగి వెళ్ళిపోయాయి.

ఆ తర్వాత ఉడుతలు వచ్చాయి. అవీ నిన్నటి కన్నా ఎక్కువగా వచ్చాయి, రావడం, రావడంతోనే చెట్టు పైకి పాకసాగాయి. వాటిని కోతి గమనించింది.

“పిచ్చి ఉడుతల్లారా నేను వెళ్లిపోయింటానులే. కాయలు తిందామని ఆశతో వచ్చారా. నా మాటంటే మాటే. నిన్న మీతో ఏం చెప్పానో ఇవ్వాళా అదే చెప్తున్నా. ఎక్కువ మంది వచ్చారు. అనవసరంగా శ్రమపడ్డారు. ఇప్పుడే  చిలుకల్ని వెళ్లగొట్టాను.  మీరు తిరిగి వెళ్లాల్సిందే. ఆలస్యం చేయకుండా మీరంతా చెట్టు దిగండి ముందు” అన్నది కోతి గట్టిగా.

ఆ మాటలకు మన చిన్నారి చారల ఉడతలకు చాలా కోపం వచ్చింది. అవి కూడా ఎదురు తిరిగి మాట్లాడసాగాయి. “మమ్మల్ని చెట్టు దిగమంటున్నావు. మేమెందుకు దిగాలి? మేమంతా ఎప్పటినుండో ఈ చెట్టు కాయలు తింటున్నాం. చెరువుగట్టు మీద చెట్టున్నది. చెరువులోని నీళ్లు అందరూ వాడుకుంటున్నారు. అలాగే ఈ కాయలు కూడా అందరూ తినొచ్చు. కాని నువ్వొచ్చి ఈ చెట్టు నాది. కాయలు నావి అంటూ చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. దీన్ని మే ఒప్పుకోం. మేం మరీ చేతకాని వాళ్లం కాదు. అప్పుడెప్పుడోనే రాములవారు సముద్రం  మీద వంతెన కట్టారు. అప్పుడు మా జాతి వాళ్లు కూడా సాయం చేశారు. అలా మేం ఒకళ్లకి సాయం చేసేవాళ్ళమే కాని అన్యాయం చేసే వాళ్లం కాదు. కాయల్ని నువ్వు తిను. మేమేమీ ఒద్దనటం లేదు” అన్నవి ఉడుతలు.

“నన్నేదో ఒప్పిద్దామని చూడకండి. మీరే కాదు. రాములవారికి మేమే బోలెడు సాయం చేశాం. అప్పటెప్పటి సంగతులు ఇప్పుడనవసరం. ఇప్పుడు మాత్రం  చెట్టు నాదని చెప్తున్నాను. నా మాట విని ఇక్కడి నుండి వెళ్లిపొండి. లేకపోతే ఒక్కక్క ఉడుతనూ పీకపిసికి చంపేసి కింద పారేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా అవసరమైతే నా మిత్రుడు గరుడ పక్షి వస్తుంది. వచ్చి మమ్మల్నిందర్నీ ఆనందంగా తినేసి వెళ్తుంది” అంటూ కోతి ఉడుతల్ని బెదిరించసాగింది.

‘మరేదైనా దారి చూడాలి’ అనుకుంటూ ఉడుతలు కూడా వెళ్లిపోయాయి. సాయంకాలమయ్యేసరికి పశువుల కాపర్లు వచ్చారు. వారంతా కలిసి జామ చెట్టు దగ్గర కొచ్చారు. చెట్టు పైకి చూశారు. కోతి అక్కడే కనపడింది. వాళ్లలో ఒకతను గట్టిగా డప్పు మోగించాడు. ఆ శబ్దానికి కోతి భయపడలేదు. పొడవాటి కర్రతో పొడిచి చూశారు. ప్రయోజనమేమీ కనపడలేదు. ‘ఈ రోజు ప్రొద్దు గూకుతున్నది. పశువుల్ని తీసుకుని త్వరగా వెళ్లాలి’ అనుకుంటూ వాళ్లు అప్పటికి వెళ్లిపోయారు. రాత్రయింది. నిన్నటిలాగే  ఈ రోజు కబోది పక్షులు వచ్చాయి. అవి కూడా ఎక్కువ పక్షులు కలిసి వచ్చాయి. వాటిని చూడగానే కోతికి చాలా కోపం వచ్చింది.

“ఏయ్ గుడ్డి పక్షుల్లారా, నిన్న అంతగా చెప్పాను కదా అయినా మరలా ఎందుకు వచ్చారు. చిలుకలు, ఉడుతలూ, మనుషులూ అంతా నాతో ఓడిపోయి వెళ్లారు. నన్ను బాగా విసిగించి వెళ్లారు. ఇప్పుడు మీరు తయారయ్యారు. మీరు వచ్చిన దారినే తిరిగి వెళ్లండి” అన్నది విసుగ్గా కోతి. కబోది పక్షులు కోతి మీద దాడి చెయ్యాలని చూశాయి. చీకటిలో అయినా కూడా కోతి బాగా తెలివిగా తప్పించుకున్నది.

“ఏయ్ గుడ్డి పక్షుల్లారా నాతో గెలవలేరని చెప్పానా, నా మాట వినండి. లేదా నా మిత్రుడు గరుడ పక్షివున్నది. రేపు రాత్రికి ఇక్కడే వుండమని దానికి చెప్తాను. మిమ్మల్నందర్నీ తన వాడిగోళ్లతో చీల్చి పారేస్తుంది. బతకదల్చుకుంటే ఇంకెప్పుడూ ఇటు రాకండి” అన్నది కోతి.

“మాటి మాటకీ మమ్మల్ని గుడ్డి పక్షులంటూ ఎగతాళి చెయ్యవద్దు. మాలాంటి పక్షులు రాత్రి పూట బాగా చూడగలవు. మానవులు మా చూపును ఆధారంగా తీసుకున్నారు. ‘రాడార్’ లాంటి ఎంతో గొప్ప యంత్రాన్ని తయారు చేశారని జనం చెప్పుకోవటం మేం విన్నాం. ఎవరి గొప్ప వారికుంటుదని తెలుసుకో” అన్నాయి కబోది పక్షులు. ‘ఈ కోతికి ఎవరో ఒకరు తొందర్లోనే బుద్ధి చెపుతారులే’ అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాయి.

పశువుల కాపర్లు కోతిని వెళ్లగొట్టటానికి రకరకాలుగా ఆలోచించారు. చెట్టు కింది పెద్ద మంట పెడదామనుకున్నారు. జామ కొమ్మలు మాడిపోతాయని మరలా మానుకున్నారు.  చివరకు కోతుల్ని పట్టుకునే మనిషిని తీసుకొచ్చి పట్టించాలని అనుకున్నారు. అతని కోసం వెతుకుతున్నారు.

రామచిలుకలూ, ఉడుతలూ కలసి సభ పెట్టుకున్నాయి. “ఆ కోతి మనల్ని చెట్టు దగ్గరకు రానివ్వటం లేదు. ఎలాగైనా మనందరం కలిసి ఆ కోతిని అక్కడ నుండి వెళ్లగొట్టాలి. తనకు తోడుగా గరుడ పక్షిని పిలుచుకొస్తానని బెదిరిస్తున్నది. మనమూ అలాంటి ఉపాయం ఏదైనా ఆలోచించాలి. ఎవరి సహాయమైనా మనమూ తీసుకోవాలి” అని ఆలోచించాయి.

ఒక రామచిలుకకు ఒక ఉపాయం తట్టింది. “కోతులకు కొండముచ్చులంటే చాలా భయం. ఇక్కడకు దగ్గరలో ఒకసారి ఒక కొండముచ్చు తిరగడం నేను చూశాను. దాని దగ్గరకు వెళదాం. విషయమంతా చెబుదాం. ఇక్కడికి వచ్చి ఆ కోతిని బాగా భయపెట్టమని అడుగుదాం. మనకీ సహాయం చెయ్యమని బతిమాలుకుందాం. అది వింటుదనే అనుకుందాం” అని ఆ రామ చిలుక తన ఆలోచన చెప్పింది.

ఈ ఆలోచన బాగున్నదని మిగతా రామచిలుకలూ, ఉడతలూ అన్నాయి. అందరం కలిసి కొండముచ్చును వెదుక్కుంటూ పోదామని నిర్ణయించుకున్నాయి. అలాగే వెళ్లాయి. కొండముచ్చును వెదికి పట్టుకున్నాయి. తమ కొచ్చిన కష్టాన్ని చెప్పుకున్నాయి. వాటి మాటలను శ్రద్ధగా విన్నది కొండముచ్చు. దానికి బాగా జాలివేసింది. ఆ జామ చెట్టు దగ్గరకు వస్తానని చెప్పింది. ‘కోతిని బాగా బెదిరిస్తాను. అది  అక్కడ నుండి పారిపోయేటట్లు చేస్తాన’ని చెప్పింది.

ఆ మాటలతో రామచిలుకలకలూ, ఉడుతలకూ బాగా ధైర్యమొచ్చింది. “మీరీ సాయం చేస్తే మీ మేలు జన్మంతా గుర్తు పెట్టుకుంటాం” అని చెప్పి వచ్చాయి కొండముచ్చుతో.

పశువుల కాపర్లు కోతిని పట్టుకునే మనిషి దగ్గర కెళ్లారు. పరిస్థితి అంతా చెప్పారు. “ఇంతకు ముందు ఎన్నో చిలుకను కిలకిలమని అరుస్తూ జామకాయలు తింటూ వుండేవి. ఉడతలు కూడా జరజర పాకుతూ చెట్టు ఎక్కుతూ దిగుతూ వండేవి. మేమూ సాయంకాలం పూట కావలసినన్ని కోసుకుని తినేవాళ్లం. ఇంటి దగ్గర వాళ్లకు తీసుకెళ్లి ఇచ్చే వాళ్లం. రాత్రి  కబోది పక్షులు వచ్చి తినిపోయేవి. ఆ జామ చెట్టు అంత సందడిగా వుండేది. అలాంటి చెట్టు మీదకు మాయదారి కోతి ఒకటి వచ్చి చేరింది. మాతో సహా ఎవ్వర్నీ చెట్టు దగ్గరకే రానివ్వటం లేదు. నువ్వు రావాలి. ఎలాగైనా సరే ఆ కోతిని పట్టాలి” అంటూ వివరంగా ఆ చెట్టు సంగతి చెప్పారు.

పశువుల కాపర్లు వివరంగా చెప్పిన జామ చెట్టు సంగతులు విన్నాడు ఆ మనిషి.

“తప్పకుండా వచ్చి ఆ కోతిని పట్టేస్తాను. నాకు ఇది చాలా చిన్న విషయం. ఈ రోజు సాయంకాలమే బయలుదేరి వస్తాను. మీరు నా కోసం చెరువు గట్టు మీదే ఎదురు చూస్తూ వుండండి” అని చెప్పి పంపాడు.

చెప్పన విధంగానే కోతుల్ని పట్టే మనిషి చెరువు గట్టు దగ్గరకొచ్చాడు. తను ఇచ్చిన మాట ప్రకారం కొండముచ్చు కూడా ఆ సాయంకాలమే బయలుదేరి వచ్చింది. చెరువు గట్టును వెదుక్కుంటూ వచ్చింది. ఒక వైపు నుండి కొండముచ్చు, మరో వైపు నుంచి కొతుల్ని పట్టుకునే మనిషి వచ్చారు.

అక్కడ పొగయిన మనుషుల్ని చూసి కొండముచ్చు ఆలోచనలో పడింది. వీళ్లంతా కలిసి, తనను ఏమైనా చేస్తారేమోనని కొంచెం దూరంలోనే నిలబడిపోయింది. ఈ కొండముచ్చు మన మీద పడి రక్కుతుందేమోనని పశువుల కాపర్లు భయపడ్డారు. కోతుల్ని పట్టే మనిషి అందర్నీ దూరంగా పంపించి వేశాడు. “కొండముచ్చు ఇలా రావడం చాలా మంచిది. మన పని ఇంకా తేలిగ్గా అవుతుంది. చూస్తూ వుండండి. ఇంకా సేపట్లో కోతి ఎలా పారిపోతుందో” అన్నాడు.

కొండముచ్చు చెట్టు దగ్గర కొచ్చేసింది. చెట్టు కొమ్మల్లో నక్కిన కోతికి కొండముచ్చు కనబడింది. దాన్ని చూస్తూనే కోతి పై ప్రాణాలు పైనే పోయాయి. ‘కొండముచ్చు తననిక్కడ నిముషం కూడా వుండనివ్వదు. తరిమి తరిమి కొడుతుంది. దానికి దొరికానంటే వళ్లంతా చీరిపారేస్తుంద’ని భయపడింది. ఈ ఆలోచన రాగానే కిందకు ఒక్క దూకు దూకింది. సత్తువ కొద్ది పరుగెత్తింది. కొండముచ్చు వెంటపడింది. వేగంగా పరుగెత్తికెళ్లి కోతుల్ని పట్టే మనిషి బారాటి తాడుతో ఉచ్చు వేసి కోతిని పట్టేశాడు. ఉచ్చులో పడ్డ కోతిని కొండముచ్చు ఎగిరి తన్నింది. బాగా రక్కింది. కోతి కుయ్యో మొర్రో మన్నది.

ఈలోగా పశువుల కాపర్లందరూ దగ్గరకొచ్చారు. వాళ్లందర్నీ చూసి కొండముచ్చు కాస్త దూరంగా పోయింది. చిలుకలు ఎగిరి వచ్చి, ఉడుతలు పాక్కుంటూ వచ్చి కొండముచ్చుకు ధన్యవాదాలు చెప్పాయి.

“మీరనుకున్న పని జరిగిపోయింది” అంటూ కొండముచ్చు తన దారిన తాను పోయింది. కోతుల్ని పట్టే వాడు తాడుతో సహా కోతిని దూరంగా తీసుకెళ్లాడు.

మర్నాటి నుంచీ జామ చెట్టు పక్షులతో, ఉడుతలతో మనుష్యులతో కళకళలాడసాగింది. తన కాయల్ని అందరూ మరలా ఇష్టంగా తింటున్నారని జామ చెట్టు సంతోషపడ్డది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here