Site icon Sanchika

కొత్త ఆశలు చిగురించాయి

[dropcap]“అ[/dropcap]మ్మా! ఇవాళ నిన్ను చూడాలని మనింటికి మా పి.టి.మాస్టారు వస్తున్నారు” అన్నాడు కాలేజీకి బయలుదేరుతూ కొడుకు ఆకాశ్.

గేదెకు గడ్డి వేస్తున్న తల్లి అన్నమ్మ “ఎందుకటయ్యా! పిలిపిస్తే నేనే వెళ్ళి చూసేదాన్నిగా” అంటుండగానే బైకు మీదొచ్చి దిగాడు పి.టి.మాస్టారు.

“నమస్తే అయ్యా! కూర్చోండి” అంటూ పమిటను బొడ్లో దోపుకుని ప్రక్కనే వున్న స్టూలు తుడిచి చూపింది అన్నమ్మ కాస్త బెరుకుగా.

“ఏంలేదు అన్నమ్మా! ఆకాశ్‌ చదువులోనే కాదు ఆటల్లో ముఖ్యంగా కబడ్డీ ఆడ్డంలోనూ చాలా ఘటికుడు. అతని వల్ల మా కాలేజీకి కూడా గొప్ప పేరుంది. అతణ్ణి నేషనల్ లెవల్లో కబడ్డీ అడటానికి కాలేజీ యాజమాన్యం ఎన్నుకొంది. తన్నడిగితే ‘పొరుగు రాష్ట్రనికి వెళ్ళాలంటే మా అమ్మను అడగాలండి సార్’ అని అంటున్నాడు. అందుకోసమే ఇందాక వచ్చాను!” వచ్చిన విషయాన్ని క్లుప్తంగా వివరించి అన్నమ్మ జవాబు కోసం ఎదురు చూశాడు పి.టి.మాస్టారు.

“ఇంకా వాడికి ఆటలు పాటలు ఎందుకయ్యా! ఆ డిగ్రీ కాస్తా పూర్తయితే వుద్యోగానికి పంపాలనుకొంటున్నాను” తెగేసి చెప్పింది అన్నమ్మ.. ఆ మాటల్లో ‘వద్దు’ అన్న భావం స్ఫష్టమైంది.

“అందరూ ఆ పనే చేస్తారు అన్నమ్మా! ఇప్పుడు మీ అబ్బాయి వద్ద వున్న కప్పులు, సర్టిఫికేట్లు వుద్యోగం కోసం అంతగా పని చేయవు. ఒక్కసారి జరగబోయే ఇంటర్ స్టేట్సు కబడ్డీలో పాల్గొంటే ప్రభుత్వపు రంగంలోనే వుద్యోగమే వస్తుంది. దానికంత గుర్తింపు వుంది. పంపించు. ఓ వారమేగా” అన్నాడు.

అన్నమ్మ సాలోచనగా ఆలోచించి “సరేనయ్యా! నా బిడ్డను మీరే జాగ్రత్తగా చూసుకొని తీసుకురావాలి. డబ్బెంత కావాలి?” ప్రశ్నించింది.

“అన్నీ కాలేజి యాజమాన్యం చూసుకుంటుంది. వుంటే… తన ఖర్చులకేమైనా ఇచ్చి పంపు” అంటూ బైకు స్టార్టు చేసుకొని ఆకాశ్‌ను వెనుక సీటులో కూర్చోపెట్టుకొని కాలేజీకి వెళ్ళిపోయాడు పి.టి మాస్టారు.

అన్నమ్మకు భర్త పోయి చాలా కాలమైయ్యింది. చిన్న పెంకుటిల్లు, రెండు గేదెలు ఆమెకున్న ఆస్తి. పాల వ్యాపారం చేసుకుంటూ, వూరి ప్రెసిడెంటు రంగనాధంగారి ఇంట్లో పని చేసుకొంటూ వచ్చే రాళ్ళతో ఇల్లు గడుపుకొంటూ పిల్లాడ్ని డిగ్రీ చదివిస్తోంది. ఆకాశ్‌ తెలివిగలవాడు. బాగా చదువుతాడు. తన చదువుకు, తెలివికి తోడు కబడ్డీ ఆడ్డంలోనూ దిట్ట. ఆ తాలూకు గెలుచిన బహుమతులు బోలెడన్ని అటకమీద ట్రంకు పెట్టెలో వున్నాయి.

ఎన్నున్నా నేషనల్ లెవల్లో కబడ్డీ ఆడి పేరు గడించటమే ధ్యేయంగా వున్నాడు ఆకాశ్. అందుకు తోడు తన పి.టి.మాస్టారు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అమ్మ కూడా నేషనల్ లెవల్లో కబడ్డీ ఆడ్డానికి ఒప్పుకొన్నందుకు అమితానంద భరితుడైయ్యాడు. మరి అమ్మ డబ్బు ఎలా ఏర్పాటు చేస్తోందో!

***

పనులు పూర్తి చేసుకొని వరాండాలో వాలుకుర్చీలో కూర్చొని వున్న ప్రెసిడెంటు రామనాధం వద్దకొచ్చి చేతులు నలుపుకొంటూ నిలబడింది అన్నమ్మ .

“ఏంటి అన్నమ్మా! డబ్బేమైనా కావాలా?” అడిగాడు ప్రెసిడెంటు .

“అవునయ్యా! పిల్లాడు నేషనల్ లేవల్ కబడ్డీ పోటీలకు చెన్నై వెళుతున్నాడు. అందులో నెగ్గితే ప్రభుత్వపు రంగంలో వుద్యోగం వచ్చుదంట”అని అంటుండగా ప్రెసిడెంటుగారి కొడుకు హీరోలా తయారై తండ్రి వద్దకొచ్చి “డాడ్! క్రికెట్ బ్యాట్ పాడైపోయింది. కొత్త బ్యాటు, బాలు కొనుక్కోవటానికి డబ్బు కావాలి” అని అడిగాడు.

వెంటనే జేబులో నుంచి అయిదువేలు తీసి కొడుకు చేతికిచ్చాడు. ‘థ్యాంక్యూ డాడ్’ అంటూ అక్కడే వున్న తన పల్సర్ బైకులో వెళ్ళిపోయాడు ప్రెసిడెంటు కొడుకు. బైకు కనుమరుగు అయ్యేంత వరకూ కొడుకును చూస్తూ ఆనందించిన ప్రెసిడెంటు అన్నమ్మ వేపు తిరిగి “డబ్బెంత కావాలి అన్నమ్మా!”అని అడిగాడు.

“రెండు వేలివ్వయ్యా! చాలా దూరంలో వున్న చెన్నైకి వెళ్ళి అక్కడ వారం రోజులు వుంటాడు. నా జీతంలో నెలకు వెయ్యొంతున తీసేసుకొండి!” అంటుండగా ప్రెసిడెంటు నవ్వి “ఇదిగో… తీసుకో!” అని రెండు వేలు చేతికిచ్చి”అన్నమ్మా! నీకు ఒక్క మాట చెప్పాలి”అన్నాడు.

“చెప్పండయ్యా” అంటూ డబ్బును బొడ్లో దాచుకొని అంది అన్నమ్మ..

“విని నువ్వు బాధపడకూడదు. మీ అబ్బాయి ఆడే ఆ కబడ్డీ ఆట ఏమంత గొప్పది కాదు. దీనికన్నా ఏ క్రికెట్టో, టెన్నీసో నేర్చుకొని రాణించగలిగితే పేరు ప్రఖ్యాతులు, పలుకుబడులన్నవి వాటంతట అవే వచ్చేవి. నేను చెపుతున్న ఆటలను లక్షల మంది చూస్తారు. కబడ్డీకి ప్రేక్షకులు వందల్లోనే వుంటారు. అందుకే మా వాడ్ని క్రికెట్టు ఆటలో గొప్పవాడు కావాలని వేలకు వేలు పోసి కోచ్చిల చేత నేర్పిస్తున్నాను. తెలుసా?” సగర్వంగా అన్నాడు.

“అంత పెద్ద ఆట వాడికెందుకయ్యా! పైగా మీరు పెడుతున్నంత డబ్బు నేనెలా పెట్టగలను! ఈ కబడ్డీ ఖర్చు లేని ఆట. మా వాడికి ఇష్టమైన ఆట. పైగా ప్రభుత్వపు రంగంలో వుద్యోగ మొచ్చుద్దని మా వాడి మాస్టరు చెప్పాడు” అంటూ ఇంటికి బయలుదేరింది అన్నమ్మ.

‘అన్నమ్మ అంది నిజమే! పేరు ప్రతిష్ఠల మాట దేవుడెరుగు. పైసలు ఖర్చు లేకుండా ఆడగలిగే ఆటే ఈ కబడ్డీ. బహుశా అన్నమ్మ కొడుకుని ప్రభుత్వం గుర్తించి వుద్యోగం ఇచ్చుద్దేమో! ఆమె కొడుక్కు కబడ్డీ ఆట తగినదే!’ అనుకొంటూ లేచి ఇంట్లోకి నడిచాడు ప్రెసిడెంటు.

సంవత్సరం తరువాత –

ప్రెసిడెంటు రంగనాధం కొడుక్కి అమెరికాలో ఎం.ఎస్. చదవటానికి సీటు రావడంతో కుటుంబ సమేతంగా విసిటర్సు వీసాతో కొడుకుతోపాటు తనూ అమెరికా వెళ్ళిపోయాడు. అయిదు నెలలు గడిచాయి. మరో నెల్లో రంగనాధం ఇండియాకు రావలసి వుంది.

అన్నమ్మ కొడుకు డిగ్రీ పాసైయ్యాడు. తల్లి,కొడుకులు పి.టి.మాస్టారు సూచనల ప్రకారం ప్రభుత్వపు రంగాలలో వుద్యోగం కొరకు అప్లై చేస్తే ఇంటర్వ్యూలు రాసాగాయి. అందుకు కారణం తనకున్న పస్టు క్లాసు డిగ్రీతోపాటు నేషనల్ లెవల్లో పాల్గొన్న కబడ్డీ ఆట తాలూకు సర్టిఫికెటే! ఇంటర్వ్యూకెళ్ళిన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెలెక్టు అయ్యాడు ఆకాశ్. రెండు ఆర్డర్లు తీసుకొని తల్లికొడుకులద్దరూ కాలేజి పి.టి.మాస్టారు ఇంటికి వెళ్ళారు. ఆర్డర్లను ఆయన ముందుంచారు. మన దేశంలోనే అతి పెద్ద సంస్థ అయిన రైల్వేలో వచ్చిన సెక్షన్ ఆఫీసరు వుద్యోగంలో చేరమన్నాడు పి.టి.మాస్టారు. వారంలోపే వెళ్ళి సికందరాబాద్ హెడ్డాఫీసులో జాయినయ్యాడు ఆకాశ్ .

విషయం ఆ వూరు వాడా మొత్తానికి తెలిసిపోయింది. అందరూ అన్నమ్మ ఇంటికొచ్చి ఆమెను అభినందిస్తుంటే సంతోషంతో వుక్కిబిక్కిరై పోయింది అన్నమ్మ. విషయాన్ని అమెరికాలో వున్న వూరి ప్రెసిడెంటు రంగనాధానికి ఫోన్లో చెప్పాడు వూరి సంక్షేమ సంఘం కార్యదర్శి. ఎందుకంటే వ్యవసాయం, చిన్నాచితకా పనులు చేసుకొంటూ జీవనాన్ని సాగిస్తున్న ఆ జనంలో మొట్ట మొదటిగా ఓ ప్రభుత్వపు రంగంలో అదీ భారతీయ రైల్వేలో సెక్షన్ ఆఫీసరుగా ఆ వూరి పిల్లాడు ఆకాశ్ వుద్యోగం సంపాయించటం ఆ వూరికే కాదు చుట్టు ప్రక్కలున్న నాలుగు గ్రామాలకు గర్వకారణం. వెంటనే సంక్షేమ సంఘంలో ఆకాశ్‌కు అభినందన సభను ఏర్పాటుచేయాలని తీర్మానించి ప్రెసిడెంటుగారిని రమ్మని ఫోన్ చేశాడు కార్యదర్శి.

ఆ రోజు ఆదివారం. ఊరికి మధ్య రాములవారి దేవాలయానికి దాపులో ఆకాశ్‌కి అభినందన సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరున్నర గంటలవుతూనే బిలబిలమంటూ ఊరి జనం మొత్తం ఆకాశ్ అభినందన సభకు వచ్చి వాలారు. వూరిలో వున్న ప్రాథమిక పాఠశాల పిల్లల కొందరు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డ్యాన్సులు చేశారు. పాటలు పాడారు. జనం వాటిని తిలకించిన తరువాత సభ ప్రారంభమైంది. వేదిక మీదకి కొందరు పెద్దలు, ఆకాశ్ తల్లి అన్నమ్మ, నిన్నే అమెరికానుంచి వచ్చిన ప్రెసిడెంటు రంగనాధం, కార్యదర్శి తదితరులతో పాటు పి.టి.మాస్టారు కూడా ఆశీనులైయ్యారు. అందరూ అన్నమ్మను, ఆకాశ్‌ను, ప్రోత్సహించిన పి.టి.మాస్టారును ప్రసంశలతో ముంచెత్తారు. జీవితంలో చదువే ముఖ్యమని చెబుతూ మరో ప్రక్క ఆటలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని ఆకాశ్ నుద్దేశించి, అతనికి వుద్యోగాన్ని తెచ్చి పెట్టిన కబడ్డీ ఆటను గూర్చి వక్తలు మాట్లాడారు. చివరగా వూరి ప్రెసిడెంటు రంగనాధం ఉపన్యసించటానికి లేచారు.

“వూరి జనానికి నమస్కారం. ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికి కారణం మొట్టమొదటిగా మన వూరినుంచి కేంద్ర ప్రభుత్వపు ఆధీనంలోని భారతీయ రైల్వే శాఖలో సెక్షన్ ఆఫీసరుగా వుద్యోగాన్ని పొందిన మన ఆకాశ్‌ను అభినందించటానికే! మీకు తెలియందేమీ కాదు. ఆకాశ్ నాన్నగారు పోయిన తరువాత అన్నమ్మ కొడుకు కోసం అహర్నిశలు కష్టపడి పెంచి చదివించి వుద్యోగంలో వుంచి పెద్ద స్థాయిలో ఇవాళ మన ముందుకు తెచ్చింది. ఈ శుభ సందర్భంలో ఆమెను హర్షించక తప్పదు. ఇక ఆకాశ్ ఈ స్థితికి రావటానికి వాళ్ళ కాలేజీ పి.టి.మాస్టారైన వీరు ఎంత అక్కర తీసుకొన్నారంటే అది వర్ణనాతీతం. ఇక్కడొక ముఖ్యమైన సంగతిని ప్రస్తావించుకోవాలి. ఆకాశ్ తల్లి అన్నమ్మ, కాలేజీ పి.టి.మాస్టరు కలిసి మాట్లాడుకొని ఏదో ఆలోచనతో ఆకాశ్‌ను నేషనల్ లెవల్లో కబడ్డీ ఆటగాడుగా తీర్చిదిద్ది అందులో పాల్గొన చేసినందునే ఆకాశ్‌కు కప్పు, స్పోర్ట్సు కోటాలో వుద్యోగం సంపాయించి పెట్టే సర్టిఫికేటులు వచ్చాయి. ఇంతటి గౌరవం పొంది, మనకూ మన వూరికి ఖ్యాతిని సంపాయించి పెట్టాడు ఆకాశ్. అందుకే ఆకాశ్ హర్షనీయుడు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓ రోజు అన్నమ్మ నా వద్దకొచ్చి ‘పిల్లాడు కబడ్డీ ఆడటానికి చెన్నై వెళుతున్నాడయ్యా! కాస్త డబ్బు కావాల’ని అడిగింది. డబ్బయితే ఇచ్చాను. కాని కబడ్డీ అన్నది ఆటే కాదు. ఏ క్రికెట్టో, టెన్నీసో,లేక చదరంగంలాంటి ఆటలైతే హర్షనీయం కానీ ఈ కబడ్డీ ఏమిటమ్మా అని ఎద్దేవా చేశాను. అంతేకాదు నా కొడుకు గొప్ప క్రికెట్టు ప్లేయరని, ఆ ఆటలో వాడ్ని ప్రపంచం మొత్తం చూస్తుందని గొప్పలు చెప్పుకున్నాను. అన్నమ్మ నా మాటలను నింపాదగా విని కాస్తైనా కలత చెందక తనలోని నమ్మకాన్ని విడువకుండా డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. ఇవాళ వాళ్ళు వూహించినట్టే స్పోర్ట్సు కోటా ద్వారా వుద్యోగం సంపాయించుకొని సఫలీకృతులై మన ముందుకు వచ్చారు. అంటే పల్లెటూళ్ళలో వున్న మనం అటు బడిలో కాని ఇటు వూళ్ళో కాని ఆడే ఆటలు మనకు అనుకూలమైన, డబ్బు ఖర్చు పెట్టనవసరం లేని బంతాట, వాలీబాల్, బాస్కట్ బాల్, ఖోఖో, మరియు ఈ కబడ్డీ అంటే చెడుగుడు లాంటివి ఎన్నో!! ఈ ఆటలు దేహ దారుఢ్యానికి, ఆరోగ్యంగా వుండటానికి దోహదపడతాయి. ఇంకా మనకు మన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న స్పోర్ట్సు కోటాలో వుద్యోగాలను వస్తాయి. మన పల్లెటూరి పిల్లలకు ఇది ఒక వరమే మరి. అలాగే సిటీలో ఆడే ఆటలు బోలెడు వున్నాయి. వున్నా… ప్రాధాన్యత సంతరించుకున్నవి కొన్ని. వాటిలో గొప్పగా చెప్పుకునేవి క్రికెట్టు, టెన్నీస్ లాంటి వ్యయంతో కూడుకున్న ఆటలు. అవి ప్రపంచ వ్యాప్తి, ఖ్యాతిని పొందినవి. అలాంటి ఆటలు ఆడగలిగితే వెంటనే గుర్తింపు కూడా రాగలదు. కాని మనలాంటి పల్లెటూరి వారికి ఆర్థిక రీత్యా అవి అందుబాటులో వుండవు. అలా అని వూరుకోకూడదు. వాటికోసం కూడా ప్రయత్నించాలి. ఏదేమైనా అటలు అన్నవి మనిషికి చాలా ముఖ్యం. ఆటలు ఆరోగ్యాన్నిచ్చి దేహ ధారుఢ్యానికి తోడ్పడి వుల్లాసాన్ని కలిగిస్తాయి. ఆట అన్నది ఏదైనా సరే మన పిల్లలకి నేర్చుకోవాలని ఆసక్తికి కలిగితే చక్కగా నేర్పించాలి. అందులో నంబర్ ఒన్‌గా రావాలే తప్ప టివీలకు, సెల్ ఫోనులకు బానిసలు కాకూడదు. ఈ శుభ సందర్భంలో ఆకాశ్‌ను అభినందిస్తూ వారిని ఈ జ్ఞాపికతో, శాలువతో సత్కరిస్తూ ఇలాంటి ఆకాశ్‌లు మరెంతో మంది మనవూరి నుంచి రావాలని కోరుకొంటున్నాను” అని ముగించాడు ప్రెసిడెంటు రంగనాధం. అప్పుడు అందరి కరతాళ ధ్వనుల మధ్య సభ ముగిసింది.

అదే సమయంలో యువతలో ఉత్తేజం పెరిగి చదువుతో పాటు ఆటలకూ ప్రాధాన్యతనివ్వాలన్న ఆశలు వాళ్ళలో చిగురించాయి.

Exit mobile version