కొత్త బాట

1
2

[box type=’note’ fontsize=’16’] “నీ జీవితం నీ చేతుల్లో ఉన్నది. దాన్ని స్వర్గమే చేసుకుంటావో లేక నరకంగా మార్చుకుంటావో నీ ఇష్టం. నేనంటోంది మాత్రం, ఇక మీ అమ్మని కలవలేనని.” అన్న ఆ భార్య భర్త నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో తాడికొండ కె. శివకుమార శర్మ వ్రాసిన కథ “కొత్త బాట” చెబుతుంది. [/box]

[dropcap]”పె[/dropcap]ళ్లి చేసుకోవడానికి నల్లమ్మాయే దొరికిందట్రా?” తల్లి ప్రశ్న రాజీవ్ మనసులో మారుమూలకి నెట్టెయ్యబడినా, అడిగిన ఏడాదిన్నర తరువాత అది ఫ్రంట్ అండ్ సెంటర్లో అతని ముందు నిలబడింది. అతనికా పరిస్థితి వారం రోజులనించీ.

“మనవాళ్లే కరువయ్యారా, ఇండియన్ని పట్టుకొచ్చావ్ ఈసారి?” అని గేబీ తరఫువాళ్లు ఆమె నడిగి వుంటారని అతని కెప్పుడూ అనిపించలేదు. మహా అయితే, “ఆ డేవిడ్ ఏమయ్యాడు?” అని అడిగి వుండొచ్చు ననుకున్నాడు. “చూడు, ఏం కొని తెచ్చుకున్నావో?” అని ఇప్పుడు వాళ్లు ఆమెను అంటారేమో నన్న ఊహే అతని మనసులోకి ప్రవేశించలేదు.

ఆ అమ్మాయి రాజీవ్‌ని పెళ్లి చేసుకుంటా ననడం అతని తల్లి కంత విడ్డూరంగా ఏమీ అనిపించలేదు. “ఇది వాళ్లల్లో మామూలే. ఎక్కడో చదివాను. పాతిక శాతం నల్లవాళ్లల్లో తెల్లవాళ్ల జీన్స్ ఉన్నయ్యట,” అని ఆమె అన్నది కూడా. ఆ అభిప్రాయాన్ని చర్చకు పెడితే ఒరిగేది ఏదీ లేదని అతని అనుభవం గనుక ఆమె మాటల్లో తప్పుని సరిదిద్దాలని అతనికి అనిపించలేదు.

గేబీ రికవరీ త్వరగానే అయింది గానీ, దాని అవసరానికి కారణమైన అఖాతం పూడ్చబడేది కాదని ఖచ్చితంగా ఈనాడు తెలిసిం దతనికి. నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా గేబీ అతనికి ఇవ్వలేదు.  ఆనాడు తల్లితో వాదనకి దిగివుంటే ఈనాడు ఈ పరిస్థితి తప్పేదేమో నన్న అనుమానం అతనికి కలిగింది గానీ ఆ ఉపయోగం లేని వ్యాపక మెందు కిప్పుడు అని చేతుల మధ్యలో తలని పెట్టుకుని కళ్లు మూసుకున్నాడు.

***

రాజీవ్‌ స్వయంగా చెప్పకపోయినా తమ్ముడి గర్ల్‌ఫ్రెండ్ వివరాలని సుమ తల్లికి చేరవేసేది. ఇండియన్లతో, తెల్లమ్మాయిలతో వున్న ఫోటోలని ఫేస్‌బుక్‌లో తల్లికి చూపించేది. సుమ రెడ్లబ్బాయిని చేసుకుంటే మనవాళ్లు కాకపోయినా తెలుగువాళ్లు అని తల్లి సర్దుకుపోయింది. స్నేహితుల కుటుంబాల్లో రెండు పధ్ధతుల్లో జరిగిన పెళ్లిళ్లని చూసి, పోనీలే మనకా శ్రమ తప్పింది అని సంతోషించింది కూడా. ఎవరిని ఎన్నాళ్లు డేట్ చేసినా, రాజీవ్ కూడా అక్క బాటలోనే నడుస్తా డనుకొంది. ఎందుకయినా మంచిదని చాలాసార్లు “అక్కయ్యని చూసి నేర్చుకో!” అని డైరెక్టుగానే చెప్పిం దావిడ.

తెలుగమ్మాయి కాకపోయినా తను కనీసం తెల్లమ్మాయి అయ్యుంటే తల్లి ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టేది కాదని గేబ్రియెల్లా అనలేదు గానీ – మనుషులని ఇట్టే చదవగలిగిన గేబీ ఓపెన్‌గా అంత మాటనక్ఖర్లేదు – అది రాజీవ్ నమ్మకం.  అదే తెలుగమ్మాయి అయ్యుంటే ఏడాదిన్నర పాటు వెయిట్ చేసేది కాదేమో నన్న అనుమానం అతని మనసులో పొడచూపింది కూడా.

“రెండేళ్లపాటు నీ లవ్‌లైఫ్ గూర్చి వార్తలే లేకపోతే పాపం, వీడికి ఎంత కష్టం వచ్చింది అని జాలిపడ్డాను కూడా. మామ్ ఏమో, ఎప్పుడెప్పుడు నువ్వు ఓకే చెబుతావో నని నీకు సంబంధాలని వెదకడం కోసం కాచు క్కూర్చుంది. ఎంత సీక్రెట్‌గా ఉంచావు!”  అన్నది సుమ.

“అంతకు ముందు పిల్లతనం. సెల్ఫీలతనం. నువ్వు మాత్రం? బాయ్‌ఫ్రెండుని ఫ్రెండ్ మాత్రమే నని ఎన్నిసార్లు రెట్టించలేదూ?” అన్నాడు రాజీవ్.

“కాలేజీలో ఉన్నప్పుడు అదే అడ్వాంటేజ్. ఇంటికి తీసుకువచ్చి పరిచయం చెయ్యక్ఖర్లేదు, వాళ్లు నన్ను కలవడానికి కాలేజీకి వచ్చినప్పుడు కలిస్తే తెలియనట్లుగా నటించ నక్ఖర్లేదు!” అన్నది సుమ.

“నా కనుమానంగానే ఉండేది!” అన్నది తల్లి.

“పోనీలే, ప్రతి గర్ల్‌ఫ్రెండునీ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చెయ్యడంవల్ల, అది పెళ్లికి దారి తియ్యనప్పుడు ఉసూరుమనే ఇక్కడి తల్లిదండ్రులకంటే మా పరిస్థితే బెటర్,” అన్నాడు తండ్రి.

“ఇంగ్లీషు సినిమాల్లో ఈయన గమనించేవి ఇవీ!” అన్నదావిడ.

“గేబీని ఇంటికి తీసుకువచ్చినప్పుడు అమ్మ మొహంలో డిజప్పాయింట్‌మెంటుని చూడడం నువ్వు మిస్సయ్యావు. మేమిలా ఇంట్లోకి అడుగు పెట్టాం, ఆవిడ గభాల్న కిచెన్లోకి వెళ్లిపోయింది ఏదో పనున్నదంటూ,” అన్నాడు రాజీవ్ ఫోన్లో అక్కతో.

“మాతో, వాళ్లకి గర్ల్‌ఫ్రెండుని పరిచయం చేస్తున్నాని చెప్పావు తప్పితే అంత త్వరలో నెక్స్ట్ స్టెప్పని చెప్పలా. లేకపోతే మేమా రోజున అక్కడుండేవాళ్లం,” అన్నది సుమ.

“మీరేమో ఉండేది ఫ్లారిడాలో. అట్లాంటాకి ఓ గంట దూరంలో వుండుంటే తప్పకుండా అందరినీ ఒకేసారి పరిచయం చేసేవాణ్ణి . నిజానికి నేనామెకి అప్పటికే ప్రపోజ్ చేశా. తను దానికి అగైన్స్ట్ కాదు గానీ అమ్మా నాన్నలని కలిసిన తరువాతనే తన నిర్ణయాన్ని చెబుతా నన్నది గేబీ,” రాజీవ్ అక్కకు పరిస్థితిని వివరించాడు.

“ఇది నేనెక్కడా వినలా. ఇండియాలోనే, కాపురం చేసేది అత్తమామలతో కాదు అని, పెళ్లవగానే వాళ్లని గెంటేస్తారని అమ్మ మనకు చెబుతూండేది కదా. అలాంటిది గేబీ రివర్స్‌లో వచ్చింది!” ఆశ్చర్యపోయింది సుమ.

“అంకుల్సూ, ఆంట్సూ, కజిన్లతో కలిపి వాళ్లది పెద్ద కుటుంబం. చాలా క్లోజ్‌గా వుంటారు. వాళ్లని కలిసినప్పుడు నన్ను వేరేగా ఏమీ ట్రీట్ చెయ్యలేదు,” అన్నాడు రాజీవ్.

“థాంక్స్‌గివింగ్ మనింట్లో స్కిప్ చెయ్యడానికి కారణం నువ్వక్కడ వుండడం అని ఇప్పుడు అర్థమయింది.  ఇంకెన్నిసార్లు కలిశా వేమిటి?”

“నాలుగు సార్లు. మొదటిసారి జులై నాలుగున కుకవుట్ అప్పుడు.”

“నన్ను మీ వాళ్లకి ఎప్పుడు పరిచయం చేస్తావని తను అడగలేదా?”

“షి ఈజ్ వెరీ స్మార్ట్. వెరీ గుడ్ ఫేస్ రీడర్. ఇమోషన్లని ఇట్టే పట్టేస్తుంది. సైకాలజిస్టులే. అది కూడా నీకు చెప్పలే దిప్పటిదాకా. నేను రడీ అయినప్పుడే ఆ పని చేస్తే తప్ప తను పోక్ చెయ్యడంవల్ల లాభమేమీ ఉండదని గ్రహించింది. నే నడిగాన్లే. ఓపెన్‌గా చెప్పింది.”

“మరి మామ్‌ని కలిసిన తరువాత ఏమన్నది?”

“యువర్ మామ్ డజన్ట్ లైక్ మి – అన్నది.”

“మరీ అంత ఓపెన్‌గానా?”

“తప్పే మున్నది? మామ్ మనసులో అనుకున్నది తను బయటి కన్నది. అంతేగా? అయాం ష్యూర్ యు అగ్రీ –

 ఆఫ్టర్ టూ యియర్స్ ఆఫ్ మారేజ్ – ఓపెన్నెస్ ఈజ్ బెటర్!”

“నో. సర్టెన్లీ నాట్. వేరీజ్ ది ఫన్ ఇన్ ఇట్? మరి పెళ్లి కెలా ఒప్పుకుంది?”

“తమాషా ఏమిటంటే, తను ఒప్పుకుంటున్న సంగతి వాళ్లింట్లోవాళ్ల ముందర చెప్పింది నేను వాళ్లతో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు.”

“అప్పటికి నువ్వు ప్రపోజ్ చేసిన సంగతి వాళ్లకి చెప్పేవుంటుంది.”

“అహఁ. చెప్పలేదు. తను ఒక అనౌన్స్‌మెంట్ చేస్తా నన్నది. అందరూ ఆమెని కళ్లెత్తి చూస్తున్నప్పుడు, నేను ప్రపోజ్ చేశానని చెప్పింది. ‘నువ్వేమన్నావ్?’ అనడిగారు వాళ్ల డాడ్. ‘వేలికి రింగేదీ?’ అన్నది వాళ్ల మామ్. ‘నేనింకా ఒప్పుకోలేదు గదా!’ అంటూ పెట్టెలోంచి రింగుని తీసి వాళ్లకి చూపింది. నా గుండె శబ్దం నాకే ఎంత పెద్దగా చెవుల్లో వినిపించిందో నా కిప్పటికీ గుర్తుంది. ‘నో చెప్పడానికి నన్నిక్కడిదాకా తీసుకురావడ మెందుకు?’ అన్న అనుమానం నాలో కలిగి, చిన్న ఆశ తలెత్తింది. అయితే, ఆ రింగుకేసి చూస్తూ, ‘హిజ్ మామ్ డజన్ట్ లైక్ మి-‘ అన్నది. నా గుండె ఆగినంత పనైంది. తన చేతులకేసి చూస్తూ, ‘అసలే వేరే రంగు. దానికి తోడు నా ప్రశ్నల వర్షం. దానికి ఆవిడ తట్టుకోలేకపోయింది,’ అన్నది.”

“ప్రశ్నల వర్ష మేమిటి?” సుమ అడిగింది. ఏమని తన తల్లిని ఆమె ఇంటర్వ్యూ చేసివుంటుందో సుమకు అర్థం కాలేదు.

“తనకి అలర్జీలు కొన్ని వున్నయ్. ప్రాణాంతకం కాదుట గానీ శరీర మంతా రియాక్ష నొస్తుందట. అందుకే, తను తినబోయే పదార్థం మీద ప్రశ్నలు వేసి, సమాధానంతో తృప్తి పడితే గానీ దాన్ని నోటిదాకా రానివ్వదు. ఇండియన్ రెస్టారెంట్లల్లో కూడా వాటి నడిగింది. అక్కడ పనిచేసేవాళ్లు జవాబు చెప్పలేక తెల్లమొహం వేసేవాళ్లు. ఆ ప్రశ్నల్లో కొన్ని గుర్తుంచుకుని మామ్‌ని ముందే ఫోన్లో అడిగా. కొన్నింటికి జవాబు లిచ్చినా, మిగతావాటికి, ‘ఏమోరా, బజార్లో కొన్నవి, ఎప్పుడూ పట్టించుకోలేదుగదా, అందుకని తెలియదు,’ అన్నది. నేనయితే ఇంకే మనలేకపోయాను గానీ, తన జాగ్రత్తలో తనుండాలి గదా, అందుకని, చివరికి తన ప్రశ్నలకి తృప్తినిచ్చే సమాధానాలు దొరక్కపోవడంతో ప్లెయిన్ రైసూ, గ్రీన్ సలాడూ మాత్రం ముట్టుకుంది అంతే.”

“మై గాడ్! మామ్‌ బాగా అప్సెట్ అయ్యుంటుంది!”

“తరువాత ఫోన్లో నా బుర్ర తినేసింది. గేబీ చెప్పినవన్నీ లేకుండా వంట చెయ్యడం తనకు చేతకాదంది. తనకు తెలిసిన పెళ్లీడు కొచ్చిన ఆడపిల్లలు బోల్డుమం దున్నారంది. ‘పోన్లే, పెళ్లయిన తరువాత మీ ఇంటికి ఎన్నోసార్లు రాములే!’ అన్నందుకు ఫోన్ హాంగప్ చేసింది.”

“నువ్వెదురుగా ఉండుంటే ఆవిడ కళ్లల్లో నీళ్లు చూసేవాడివి!”

“ఐ నో. బట్ వాట్ కెన్ ఐ డు? బట్, ది రియాలిటీ ఈజ్ – ఏదో గంట దూరంలో ఉంటే తప్ప, సంవత్సరంలో కలిసేది ఎన్నిసార్లు, చెప్పు? థాంక్స్‌గివింగుకీ, క్రిస్మస్‌కీ, మధ్యలో మహా అయితే ఒకసారీ, అంతేగా? పెళ్లయిన తరువాత నువ్వెన్నిసార్లు అట్లాంటా వచ్చావో చెప్పు!”

“సరేలే. టెన్షన్ తట్టుకోలేక ఛస్తున్నా. గేబీ వాళ్లింట్లో డిన్నర్ టేబుల్ దగ్గర ఏమయిందో చెప్పు!”

“‘సో?’ అన్నారు వాళ్ల డాడ్. ‘నో చెప్పెయ్ ముందరే. ఇష్టం లేదని ముందరే తెలియడం మంచి దయింది,’ అన్నారు వాళ్ల మామ్‌. ‘షి డజన్‌ట్ లైక్ మి, బట్ షి వజ్ నాట్ హోస్టైల్,’ అన్నది గేబీ. ఒక్క క్షణ మాగి నా వైపు తిరిగి, ‘యు వాంట్ టు పుటిటాన్?’ అన్నది. నేను ఎగిరి గంతేసి కుర్చీలోంచి లేస్తూ పడబోతే అందరూ నవ్వారు. రింగుని తొడిగి ఆమెని గట్టిగా కావలించుకున్నాను. నా గుండె వేగం ఆమెని చేరి, ఆమె చేత ‘టేక్ డీప్ బ్రెత్’ అనిపించింది,” అన్నాడు రాజీవ్.

“వావ్! కంగ్రాట్యులేషన్స్!” అన్నది సుమ. ఆమె పక్కనే నిలబడి స్పీకర్ ఫోన్లో వింటున్న ఆమె భర్త కూడా జతకలిపాడు.

***

“ఇక మీ యింట్లో గేబీకి తెల్ల అన్నమూ, పచ్చ గడ్డీ మాత్రమే!” నన్నాడు డేనియల్ కంగ్రాట్యులేషన్స్ చెప్పిన తరువాత అక్కని ఉడికించడానికి.

“నో, మై మామ్ విల్ కాచప్ ప్రెటీ క్విక్!” అని తనిచ్చిన జవాబు రాజీవ్‌కు గుర్తొచ్చింది.

కాచప్ చెయ్యలేకపోవడం వేరు.

వారం రోజుల క్రితం గేబీ తన ప్రశ్నల వర్షాన్ని మళ్లీ కురిపించింది.

“మొదటిసారి మనింటికి వచ్చినట్లు మాట్లాడుతుం దేమిటి?” అని తండ్రి కోపగించుకున్నాడు.

“మనవాళ్లమ్మాయిని చేసుకొమ్మంటే విన్నాడా?” అన్నది తల్లి.

ఇద్దరూ తెలుగులోనే! అది రాని గేబీ ముందరే! భావాలని చదవగల్గిన గేబీకి భాష అవసర మే మున్నది?

“ఈ ఏడాదిన్నర పాటూ మీరూ, మేమూ కలిసుంటే మిమ్మల్ని ట్రెయిన్ చెయ్యడానికి నాకు అవకాశ ముండేది. చుట్టపు చూపుగా వస్తున్నందుకు, మళ్లీ గుర్తు చెయ్యడం,” అన్నాడు రాజీవ్ ఇంగ్లీషులో.

“జస్ట్ గివ్ మి ది ఆన్సర్,” అన్నది గేబీ.

“అవేవీ వాడలేదు,” అన్నది తల్లి.

చికెన్ ముక్కని నోట్లో పెట్టుకున్న పది నిముషాలకి గేబీ కళ్లు ఎర్రగా అయ్యాయి. కళ్లల్లోంచి నీళ్లు కారడం మొదలయింది. మొహం కందినట్లయి వాస్తున్నట్లు చూసేవాళ్లకి స్పష్టంగా తెలిసింది. చేతుల మీద రాష్ అందరికీ కనిపించడం మొదలయింది.

“ఇంట్లో బెనడ్రిల్ ఉన్నదా?” అడిగింది గేబీ.

మైలు దూరంలో ఉన్న గ్రోసరీ స్టోర్ కెళ్లి పది నిముషాల్లో పట్టుకొచ్చాడు రాజీవ్. అతనికి కూడా ఆమెలో అలాంటి రియాక్షన్ని చూడడం అదే మొదటిసారి. ఇరవై నిముషా లయిం దప్పటికి అటాక్ మొదలై.

మందు పడ్డ రెండుగంటలకి కూడా పరిస్థితిలో మార్పులేదు.

“డ్రైవ్ మి టు ది ఎమర్జెన్సీ!” అన్నది గేబీ.

ఆమెని తీసుకుని రాజీవ్ వెళ్లాడు. హాస్పిటల్లో కోర్టిజన్ ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత కొంతసేపటికి ఫలితం కనబడడం మొదలయింది. ట్రియాజ్ రూములో ఆమె పక్కనే కుర్చీలో కూర్చుని, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెవైపే చూస్తూ ఉండిపోయాడు రాజీవ్.

“హాస్పిటల్‌కి రావడం చాలా ఏళ్ల తరువాత మొదటిసారి. చిన్నప్పుడు మా పేరెంట్స్‌తో రావడం లీలగా గుర్తుంది. ఇవాళ నాకు తెలియని కొత్త ఐటమ్ ఏదో పరిచయ మయినట్లుంది. దాన్ని కూడా నా లిస్టులో చేర్చాలి. కానీ, అదేమిటో ముందు తెలియాలి గదా,” అన్నది గేబీ.

వెనకే తమ కారులో వచ్చిన రాజీవ్ తల్లిదండ్రులని హాస్పిటల్ వాళ్లు ట్రియాజ్ రూములోకి రానివ్వలేదు.

పరిస్థితి మెరుగవుతోందని నిర్ధారణ అయిన తరువాత, “మీ పేరెంట్స్ లాబీలో వెయిట్ చేస్తూంటారు. వెళ్లి, నేను బాగానే ఉన్నానని చెప్పు,” అన్నది గేబీ.

నర్సుకూడా గేబీ అసెస్‌మెంటుతో ఏకీభవించిన తరువాత రాజీవ్ లాబీలో వెయిట్ చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు.

“వర్ యు ట్రూత్‌ఫుల్ విత్ గేబీ?” ఎలా ఉన్నదని అడిగిన తల్లిదండ్రులకి అతను సంధించిన మొదటి ప్రశ్న అది.

“నన్ను నమ్మవా?” అన్నది తల్లి కళ్లనీళ్లతో.

“పెళ్లాం వచ్చింది గదా, ఇంక నిన్నూ, నన్నూ ఎందుకు నమ్ముతాడు?” అన్నాడు తండ్రి.

“మామ్, ఆన్సర్ మై క్వశ్చన్!” గొంతు పైకి లేస్తుండగా అన్నాడు రాజీవ్.

“అందరూ మనవైపే చూస్తున్నారు!” అన్నది తల్లి.

“అబ్బా!” అని పెద్దగా అరిచి జుట్టు పీక్కున్నాడు రాజీవ్.

“కారు దగ్గరకు పద. ఇక్కడ పెద్ద సీన్ చేస్తున్నావు!” అని తండ్రి రాజీవ్ చెయ్యి పట్టుకుని బయటకు లాక్కెళ్లాడు. తల్లి వాళ్ల ననుసరించింది.

పార్కింగ్ గరాజ్‌లో కారు దగ్గర కెళ్లిన తరువాత తండ్రి రాజీవ్‌తో కోపంగా, “కంట్రోల్ యువర్సెల్ఫ్! లేకపోతే నిన్ను కారులోకి తోసి తలుపులేస్తాను. అప్పుడు నీ ఇష్ట మొచ్చినట్లు అరుచుకోవచ్చు,” అన్నా డాయన.

“మామ్! ఇప్పుడయినా నిజం చెప్పు, ప్లీజ్! తనకి అలర్జీ కలిగించే కొత్త పదార్థ మేది ఎదురయిందో కనుక్కోవాలంటే అది ముందు తెలిసినవాటిల్లోది ఏదీ కాదని ఋజువు చేసుకోవాలి,” రాజీవ్ అర్థించాడు.

ఆమె అన్నీ నిజాలే చెప్పా నన్నది.

“కొడుకట, కొడుకు! ఇంట్లో ఎన్నిసా ర్లడిగావ్ అదే ప్రశ్నని? వందసా ర్లడిగితే తొంభై తొమ్మిదిసార్లు అబధ్ధం చెప్పి, వందోసారికి మాత్రం నిజం మీ అమ్మ చెబుతుం దనుకున్నావా? ఇంకా గేబీయే నయం. ఒక్కసారి మాత్రం అడిగి ఊరుకుంది. ఏదో తెలియని సబ్స్టెన్స్ పడుంటుంది. కొత్తది. ప్రతీ దానికీ మొదటిసా రంటూ ఒకటుంటుంది,” అన్నారు కోపంగా తండ్రి.

“ఓకే. నేను మీ ఇంట్లో ఇక అడుగు పెట్టక్ఖర్లేదు. అక్కడ నా భార్యకి ఏ హాని జరుగుతుందో తెలియనప్పుడు నేనెట్లా ఆమెని తీసుకుని రాగలుగుతాను, ఆమె లేకుండా ఒక్ఖణ్ణే ఎలా వస్తాను?” అన్నాడతను.

ఆమె ఎక్కి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది.

“ఓక్, ఫైన్! యూ అండ్ యువర్ వైఫ్ కెన్ గో టు హెల్! నా పెళ్లాన్ని ఏడిపించింది ఇంక చాలు!” అన్నాడతని తండ్రి కోపంగా, చేతిని ఆమె భుజం మీద వేసి ఆమెని దగ్గరకు తీసుకుంటూ.

“చేసిన చిన్న తప్పుకి,” అని ఆమె ఎక్కిళ్ల మధ్య అనడం అక్కడున్న మిగతా ఇద్దరికీ వినబడింది.

“వాట్?” అన్నా రిద్దరూ. తండ్రి ఆమెని తన కౌగిలిలోంచి వదిలేసి తను విన్నది నమ్మలేనట్టు ఆమె మొహంలోకి చూశాడు.

“చెప్పు, ఏమిటది?” అన్నాడు రాజీవ్ ఆత్రంగా. తండ్రి ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.

“చికెన్ వేయించింది -” అని ఆమె ఆగిపోయింది.

“ఆగకు, పూర్తిచెయ్!” ఆదుర్దాగా అన్నాడు రాజీవ్.

“అంతకు ముందు ఆ నూనెలో చేపని వేయించాను,” అన్న దామె.

రాజీవ్, అతని తండ్రీ స్టన్ అయ్యారు.

“తనకి చేపలంటే పడదని మొదటిసారే చెప్పింది గదా? పైగా, మనింటి కొచ్చిన ప్రతిసారీ గుర్తు చేస్తూనే వుంది!” తేరుకుని అడిగారు ఆయన.

“ఇంటిదగ్గర అన్నిసా ర్లడిగినా, ఇప్పటిదాకా నిజమే చెబుతున్నానని బుకాయించా వెందుకని?” రాజీవ్ నమ్మలేకపోతున్నాడు.

“దాని ముందు అరిచీ, గోల చేసీ నా పరువు తీస్తావని భయపడి,” అన్న దామె.

“తెలిసే చేశావు కదూ?” అన్నాడు తండ్రి. రాజీవ్ స్టన్ అయ్యాడు. ఆమెతో అన్నేళ్లు సంసారం చేసిన వ్యక్తికే ఆ ప్రశ్న సాధ్య మవుతుంది.

“మీరు కూడా నా నుండీ దూరంగా వెళ్లిపొండి. నా చావు నేను ఛస్తాను,” అన్న దామె కోపంగా.

“మామ్, ఎందుకు చేశా విలా?” రాజీవ్ నిస్సహాయంగా అన్నాడు.

“అయినా, చేపని వేయించిన నూనెలో చికెన్ వేయిస్తే వచ్చే రుచి ఆమాత్రం తెలియదా? పైగా, నోటి దగ్గరకు రాగానే ముక్కు వాసన పట్టేస్తుంది గదా! తను తెలిసే తిన్న దనుకున్నాను. అందుకే, నా అనుమానం నిజమయిం దనుకున్నాను,” అన్న దావిడ.

“ఏమిటి? గేబీ ఇంతకాలం అబధ్ధం చెప్పిందనా?” ఆశ్చర్యంతో కళ్లని వెడల్పు చేస్తూ అన్నాడు రాజీవ్.

“ఆమె బాబాయ్ ఒకాయన, తనకి అది పడదూ, ఇది పడదూ అని చెబుతుంటే, తమాషా చేద్దామని అతని కజిన్స్ ఒక రోజున ఆయన్ని కట్టేసి ఆ పదార్ధాలని నోట్లో కూరార్ట – వాళ్ల చిన్నప్పటి సంగతిలే, ఆయనకి ఏమీ కాలేదట. ఈ కథని గేబీని నువ్వు మొదటిసారి మనింటికి తీసుకువచ్చిన తరువాత మీ అమ్మ చెప్పింది. ‘వేషాలు,’ అని కొట్టిపారేసి, తను వీటిని అబధ్ధాలని ప్రూవ్ చేస్తానంది. అప్పటికీ, ‘ఎదుటివాళ్లకి  రెస్పెక్టు నివ్వు, వాళ్లు చెప్పేది నమ్ము,’ అని చెప్పాను. ఇట్లా తనే పరీక్షకు పూనుకోవడం మన దురదృష్టం,” అన్నాడు తండ్రి.

“సుమ మొగుడిక్కూడా – అదే, నీ అల్లుడికి – ఇలాంటి పరీక్ష పెట్టేదానివా?” తీవ్రంగా అడిగాడు రాజీవ్.

“నన్నింకా ఏడిపించకురా,” అన్నదామె వెక్కుతూ.

“యూ లాస్ట్ మై ట్రస్ట్. ఇంక మేము మీ ఇంటికి రాము. మీ రెప్పుడయినా మా ఇంటికి రావచ్చు,” అన్నాడు రాజీవ్.

“అంత మాట అనకురా. నేను గేబీ పాదాల మీద పడి క్షమాపణ కోరుతాను,” అన్న దామె.

“నువ్వా పని చేస్తే నేను చూస్తూ ఉండగలనని ఎలా అనుకుంటావు మామ్? నేనిక్కణ్ణించీ తనని తిన్నగా మా ఇంటికి తీసుకు వెడతాను. మా వస్తువులు మీ ఇంట్లో ఉన్నయ్యంటారేమో, నేనొక్కణ్ణే అక్కడికి వచ్చి వాటిని పట్టుకొచ్చి, ఇక్కడ గేబీని ఎక్కించుకుని వెడతాను. నీ తప్పునీ, నా నిర్ణయాన్నీ తనకు తెలియజేస్తాను. ప్లీజ్ గో హోమ్! ఆమె మిమ్మల్ని ఇప్పుడు చూడడం నా కిష్టం లేదు!” అని రాజీవ్ హాస్పిటల్ వైపు నడిచాడు.

***

“దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్!” అన్నది గేబీ వాళ్లింటి కొచ్చిన మరునాడు.

హాస్పిటల్లో తను ఆమెకు కారణాన్ని తెలియజేసినప్పటి నించీ ఆమె దీర్ఘంగా ఆలోచిస్తోందని రాజీవ్ కు తెలుసు. పైగా ఇది అక్కడ మాట్లాడుకోవాల్సిన సంగతి కాదని ఆమె గ్రహించడం, అక్కడ ఆ సంగతిని పొడిగించక పోవడం మరొకసారి ఆమె మెచ్యూరిటీని తెలియజేసిందని కూడా అతను గ్రహించకపోలేదు. “వై నాట్?” మెల్లగా అన్నాడు.

“కొడుకు నించీ తల్లిదండ్రులని దూరంగా ఉంచినందుకు నాకు చెడ్డపేరు వస్తుంది. మా వాళ్లల్లో. కాకపోయినా నీ జీవితంలో ముఖ్యమయినవాళ్లు!’ అన్న దామె.

“నువ్వు కాదా?”

“కాదని ఎలా అంటాను?”

“మరి?” రాజీవ్‌కు ఆమె ఎటువైపు వెడుతోందో అర్థం కాలేదు.

“నీ సొల్యూషన్ వేరే ఏదయినా చెప్పు!”

“వాళ్లనించీ నన్ను దూరంగా ఉంచుతున్నానని నువ్వనుకునే ట్లయితే, అక్కడికి వెళ్లేటప్పుడు మన తిండిని మనమే తీసుకువెళ్లడం.”

“అంటే, ఎప్పుడెళ్లినా ఒక పూటకి మాత్రమే అక్కడి కెడతామా? మరి థాంక్స్‌గివింగ్ బ్రేక్‌కి అక్కడి కెడితే?”

“నేను చేసిపెడతాను. … నవ్వుతా వెందుకు?”

“పొరబాటున అన్ని పూటల వంటా అందరికీ నువ్వే చేస్తా ననట్లేదు గదా? నువ్వు చేసినా, నేను చేసినా, ఆ వేరే వంట మీ అమ్మకి ప్రతిసారీ గాయాన్ని కెలికినట్లు కాదూ?”

“అది నీ తప్పువల్ల కాదుగా!”

“ఆమె బాధపడడం నేను చూళ్లేను.”

“నన్ను మాత్రం బాధపెడతావు!”

“యూ విల్ రికవర్.”

“ఎలా?”

“నీకూ, మీ అమ్మకూ మధ్య నేను లేకుండా.”

“ఏం మాట్లాడుతున్నావ్?”

“రేపటినించీ నీ దారి నీది, నా దారి నాది!”

“ఇంత చిన్నదానికా? సారీ, సారీ, దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఆమె చేసినదానికి నువ్వూ, నేనూ ఎందుకు వేరుపడడం?”

“చెప్పాగా, నేను నీ తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ, నిన్ను వాళ్లకి దూరంగా ఉంచుతూ – ఐ డోన్ట్ లైక్ దిస్. నిన్ను మనస్ఫూర్తిగా నా జీవితంలోకి ఆహ్వానిస్తే మా కుటుంబం అభ్యంతరం చెప్పలేదు. మీ అమ్మగారి మొహంలో హోస్టిలిటీ కనిపించలేదు గనుక పెళ్లయిన తరువాత కొంతకాలానికి టెన్షన్లు సర్దుకుంట య్యనుకున్నాను. నాది అత్యాశ అని తేలిపోయింది. ఇదొక అనుభవం. నీ మీద నాకు కోపమేమీ లేదు.”

“నువ్వు నన్నొదిలి వెడితే సినిమాల్లో చూపినట్లు నేను నీ ఇంటి ముందర కొచ్చి పెద్దగా అరుస్తా – నువ్వు లేకుండా బతకలేను – అని. తాగి తందనా లేస్తా.”

“చేసి చూడు. పోలీసులకి నేనే కాల్ చేస్తా. మీ అమ్మా, నాన్నా నిన్ను పోలీస్ స్టేషన్నించీ విడిపించి తీసుకెళ్లే ముందర ఆవిడ నా కాళ్లు పట్టుకుని, ‘వాణ్ణి మేం చూడకపోయినా ఫర్లేదు, వాణ్ణిలా చెయ్యకు తల్లీ!’ అని ఏడుస్తుంది. ఆవిణ్ణి అలా చూడగలవా? చూడలేవనే గదా, వాళ్లని పంపిన తరువాత హాస్పిటల్లోకి వచ్చి ఆమె క్షమాపణ ఎలా చెబుతానన్నదో నాతో చెప్పానన్నావు? నో. నువ్వు చెయ్యలేవు. చెయ్యవు.”

“తరువాత నా కో ఇండియన్ని చూసి పెళ్లి చేస్తుంది. పైగా, తను మొదటి కోడలిని ఎలా ప్లాన్ వేసల్లా వదిలించుకున్నదో గొప్పలు చెప్పుకుంటుంది. ఆమె గెలవా లనుందా?”

“అది ఆమె గెలుపు కాదు. ఇట్స్ యువర్ సఫరింగ్ యూ హావ్ టు థింక్ అబవుట్. ఆవిడ చెప్పే ఆ గొప్పలు నీ చెవిన పడ్డ ప్రతిసారీ నీ కెలా ఉంటుందో ఆలోచించుకో!”

“నా జీవితాన్ని నరకం చెయ్యాలని ఎందు కనుకుంటున్నావు?”

“నీ జీవితం నీ చేతుల్లో ఉన్నది. దాన్ని స్వర్గమే చేసుకుంటావో లేక నరకంగా మార్చుకుంటావో నీ ఇష్టం. నేనంటోంది మాత్రం, ఇక మీ అమ్మని కలవలేనని. అలాగని, ఆమెకు నిన్ను, భవిష్యత్తులో పిల్లలకీ దూరంగా ఉంచలేను అని. ఐ వాన్ట్ మై కిడ్స్ టు మీట్ అండ్ – అండ్ టు బి ఏబుల్ టు ప్లే విత్ గ్రాండ్‌పేరెంట్స్ ఆన్ బోత్ సైడ్స్!”

“యు ఆర్ నాటె నార్మల్ వుమన్, యు నో?” అన్నాడు రాజీవ్ నిస్సహాయంగా.

“అయామ్ గ్లాడ్ వుయ్ గాటిట్ అవుటాఫ్ ది వే!” అన్న దామె సన్న నవ్వు నవ్వి.

“ఐ మెన్టిట్ యాజె కాంప్లిమెంట్! అందరు ఆడవాళ్ల లాగా, ‘నేను కావాలో లేక మీ మామ్ కావాలో తేల్చుకో!’ అనవెందుకు?” అతని కళ్లల్లో తడి ఆమె కంట పడకపోలేదు.

“బికాజ్, అయామ్ నాటె నార్మల్ వుమన్!” అన్నది గేబీ. ఆమె గొంతులోని విషాదపు ఛాయ అతణ్ణి చేరకపోలేదు.

***

‘ఈ పరీక్షేదో ముందే పెట్టుంటే సరిపోయేది. ఏడాదిన్నరపాటు ఆ యాతన తప్పేది!’ – అని తల్లి అనుకుంటుందా?

‘పెళ్లి అయింది కాబట్టి వాడు ఆ అమ్మాయిని కాళ్లు పట్టుకుని ప్రార్థించే ఉంటాడు ఫుడ్ పాయిజనింగ్ కేసు పెట్టొద్దని. తెలిసిన లాయర్ని కనుక్కుంటే కోర్టువరకూ రాకుండా చూసుకోండి అని సలహా ఇచ్చాడు. లేకపోతే బోల్డంత నష్టపరిహారాన్ని చెల్లించుకోవలసి వచ్చేదట!’ అని తండ్రి నిట్టూర్పు విడుస్తాడా?

‘పెళ్లి ఖర్చు లేమయినా తక్కువయ్యాయా ఏమిటి? లక్ష డాలర్లు దాటెయ్ గదా, అదే నష్టపరిహార మనుకోవడం’ – అని తల్లి అంటుందా?

‘వాటీజ్ మై ఫ్యూచర్?’

రాజీవ్ ఆలోచిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here