Site icon Sanchika

కొత్త జీవితాలు…

[dropcap]అ[/dropcap]వి శ్రావణ మాసపు రోజులు..

ఉదయాన్నే లేచి సుప్రభాతం వింటూ ఆ రోజు క్లాసులో చెప్పాల్సిన పాట పాడుకుంటూ వాకిట్లో ముగ్గు వేయడం అలవాటైంది.

అలా ముగ్గేస్తుంటే వీధిలో అలికిడైతే ఎవరా.. అని తలెత్తి చూసేసరికి ఎదురుగా గంగాధర శాస్త్రి..

అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న డాక్టర్(ట)

హఠాత్తుగా ఇలా ఇంత ఉదయాన్నే గంగ ఎందుకు వచ్చాడా.. అని అనుకుంటుంటే..

లోపలికి రావచ్చా..? అని తనే అడిగేసరికి..

నేను ఆలోచనల నుండి ఈ లోకంలోకి వచ్చి నా చేష్టలకి సిగ్గుపడి.. అయ్యో రండి.. రండి.. అంటూ లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోమని నేను వెళ్లి బట్టలు మార్చుకుని కాఫీ పట్టుకుని వచ్చాను. అతనికో కప్పు కాఫీ అందిస్తూ అడిగా.. “ఏంటి సంగతులు గంగ ..” నీ రాకకు అంతరార్థం ఏమిటా అన్నట్లు..

తను మాత్రం మౌనంగా కాఫీ తాగుతున్నాడు..

ఏం మాట్లాడటం లేదు. చెప్తాడు లే అని నేను కూడా కూర్చుని కాఫీ తాగుతున్నా..

 ఆలోచనలు కాలేజీ రోజుల్లోకి జారుకున్నాయి..

***

అది ఊర్లో పేరుమోసిన శ్రీ కృష్ణ కాలేజ్.. చాలా సందడిగా ఉంది కొత్త విద్యార్థులతో.. అమ్మాయిలు, అబ్బాయిలు అటు ఇటు తిరుగుతూ  కొత్త క్లాసు రూములు వెతుక్కుంటూ.. అప్పటికప్పుడు పరిచయాలు చేసుకుంటూ… పండగ వాతావరణం తలపిస్తోంది..

ఎవరి తరగతి గదుల్లో వాళ్ళు చేరేరు. తొందరగానే క్లాస్ రూమ్‌లు అలవాటయ్యాయి. కొత్త స్నేహాలు మొదలయ్యాయి.. ఒక్కొక్కరి అభిరుచులు అలవాట్లు మరొకరికి తెలుస్తున్నాయి..

కలిసిన అలవాట్లు కొందరిని దగ్గరకు చేర్చాయి.. కొందర్ని మరికొందరితో స్నేహం చేయడానికి పునాదిరాళ్లు వేసాయి..

నేను, రాజేశ్వరి ఒకేలాంటి అలవాట్లతో దగ్గరయ్యాం..

మేము అలా కాలేజీకి వెళ్లి రావడమే కాకుండా సంగీతం కూడా నేర్చుకుందామని, ఊర్లో సంగీతం చెప్పే సత్యం గారు (వయసులో పెద్దాయన కూడాను) అయితే అన్ని విధాలా బాగుంటుంది అని అనుకుని ఆయన దగ్గరే సంగీత పాఠాలు మొదలు పెట్టాం..

అలా గడుస్తున్న రోజుల్లో ఒక రోజు ఈ గంగ నా వెనక బెంచ్ లో కూర్చుని.. శ్యామ అని మెల్లగా పిలిచాడు..

ఇక్కడ నన్ను అలా పిలిచేవారు ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఈయన..

నా పేరు శ్యామ కాదు.. శ్యామల అని గట్టిగానే చెప్పాను.

ఇక మీదట నేను అలానే పిలుస్తా అది తన జవాబు..

నేను ఇంకా ఏదో అనే లోపే లెక్చరర్ రావడం, ఆయన యమా స్ట్రిక్టు అనే పేరు ఉండటంతో ఆ విషయాన్ని అంతటితో ఆపేసాను.

కాలేజీ అయింది ఇంటికి బయలు దేరేం. ఈ విషయం రాజీ (రాజేశ్వరిని అలా పిలుస్తా..) తో చెప్పాలా , వద్దా అని ఆలోచిస్తూ .. తర్వాత ఎప్పుడైనా చెప్పచ్చులే అని అనుకుంటూ ఇంటికి వచ్చేసాను.

మా ఇంటికి రెండు వీధుల అవతలే రాజీ వాళ్ళ ఇల్లు.

పుస్తకాలు టేబుల్ మీద పెట్టేసి, ఆ వారం వచ్చిన పత్రికను తిరగేస్తున్నాను. ఆ పత్రికలో రకరకాల ముగ్గులు ఇస్తారు. నాకు చిన్నతనం నుండి నవలలు చదవడం, పత్రికలు చూడడం, అందులో వచ్చే ముగ్గులు ప్రాక్టీస్ చేయడం అలవాటు.

ఇవాళ జరిగింది ఆలోచిస్తూ అలా మంచం మీద వాలాను.

శ్యామ అని పిల్చినట్లయితే..

ఉలిక్కి పడ్డాను.

కానీ అది అమ్మ పిలుపు..

వినేసరికి కాలేజీలో అతనెవరో పిలిచిన పిలుపు, ఆ ప్రహసనం అంతా గుర్తొచ్చింది. ఆ అబ్బాయి కూడా గిరజాల జుట్టు, మంచి మీసకట్టు, చూడచక్కని రూపం..

యద్దనపూడి సులోచనారాణి నవలలో హీరోని వర్ణించినట్లున్నాడు.

ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను..

మీ చేతివేళ్ళు బాగున్నాయి.. కాలేజీలో మరో రోజు

నేను ఏదో రాసుకుంటుంటే మళ్లీ అదే కంఠం..

చేతి వేళ్ళు బాగోడం ఏంటి అనుకుంటూ..

అతన్ని ప్రశ్నార్ధకంగా చూశాను.

అదేనండి గోరింట పెట్టుకున్నారు కదా చేతివేళ్ళు ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయి అతని జవాబు.

చిన్నగా నవ్వి ఊరుకున్నాను. ఆషాడమాసంలో గోరింట పెట్టుకోవడం అమ్మ చేసిన అలవాటు.

ఇంకో రోజు

మీ పట్టీలు బాగున్నాయి అని కితాబు.

చటుక్కున పరికిణీతో కవర్ చేసేసా.

ఇలా తను నాతో మాట్లాడడానికి నానా తంటాలు పడుతున్నాడు.

నేను, రాజీ రోజూ సంగీతం క్లాసులకి వెళ్తున్నాం. కూడా అక్కడికీ వచ్చాడు. ఇక్కడికి కూడా వచ్చేడేంటి అనుకున్నాం. తను లోపలికి కూడా వచ్చేసాడు. ఇంతలా ఫాలో చేస్తున్నాడు అనుకునేలోపే..

కూర్చుని సంగీతం క్లాసులో సా.పా. అని స్వరాలు పలుకుతున్నాడు..

బావున్నాడు సుమీ.. అనుకున్నాను తొలిసారి..

అలా పరిచయాలు స్నేహాలుగా మారి, కబుర్లు చెప్పుకునే వరకు ప్రయాణించాయి. నేను కూడా ఇష్టపడుతున్నానని గ్రహించడానికి ఎక్కువకాలం పట్టలేదు.

దీని పేరే ప్రేమేనేమో.. అంతా కొత్తగా ఉంది.. అలా రోజులు గడుస్తున్నాయి.

ఆ రోజు రాఖీ పౌర్ణమి.

కాలేజీలో రాజీ, నేను, తను లాన్‌లో కూర్చుని మాట్లాడుకుంటుంటే.. కాషాయం జెండా పట్టుకున్న కొందరు మూకగా వచ్చి, బలవంతంగా తన చేత మా ఇద్దరికీ రాఖీలు కట్టించారు.

ఫోటోలు తీశారు.. మళ్ళీ అలా కనబడితే కాళ్ళు, చేతులు విరగ్గొడతామని వార్నింగ్ ఇచ్చేరు.. అందర్నీ అక్కడనుండి తరిమేశారు.. ఇంటికొచ్చి చాలా బాధ పడ్డాము ఆరోజు..

ఏమైందో ఏమో ఆ రోజు నుండి కనబడడం మానేశాడు గంగ.

మళ్ళీ ఇన్నాళ్ళకు ఇదిగో ఇలా ఇక్కడ..

నేను ఆలోచనల నుండి తేరుకునేసరికి

తన గొంతు సవరించుకున్నాడు. ఏదో మాట్లాడడానికి అన్నట్టు.. వినడానికి సిద్ధమయ్యా..

నన్ను క్షమించు శ్యామ ..

చాలారోజులకి మళ్ళీ అదే గొంతు.. క్షమాపణతో మొదలు పెట్టాడు..

ఆ రోజు వాళ్ళు అలా చేసి నా మనసు గాయపరిచారు. ఇంటికి ఫోటోలు పంపేరు. ఇంట్లో వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారా కాలేజీకి.. అమ్మాయిలతో కబుర్లకి వెళ్తున్నారా అని చెడమడా తిట్టిపోసారు.

నన్ను మరి బయటకి వెళ్లనీయకుండా, టీసి తీసి మా అమ్మమ్మ గారి ఊరికి పంపేసారు..

ఇక నేను కూడా నా వల్ల నీకే ఇబ్బంది రాకూడదని, మొహం చూపించడానికి కూడా లేక ఆ ఊరు వెళ్ళిపోయాను. చెప్పుకుంటూ వెళ్తున్నాడు గంగ.

ఆ రోజు వచ్చిన వాళ్లతో ఘర్షణ పడతాడు, వాళ్ళని ఎదిరించి మాట్లాడతాడు అనుకున్నా.. నవలల ప్రభావంతో.

కానీ చేతకాని వాడిలా డీలా పడిపోయి, సింపుల్‌గా వాళ్లు భయపెట్టి, కట్టమంటే రాఖీ కట్టేసాడు అనుకుంటున్నా మనసులో..

ఆరోజు అలా జరగడానికి కారణం తెలుసా అడిగాడు గంగ..

ఏమై ఉంటుందా అని ఆశ్చర్యంతో ఏం జరిగింది అడిగాను.

ఆ గొడవకి కారణం మరెవరో కాదు

మీ అన్నయ్య..

నాకు ఆశ్చర్యంతో పాటు భయం వేసింది మా అన్నయ్య ఈ గొడవ కి కారణమా.. ??

అవును మీ అన్నయ్యే.

మనిద్దరం చేరువవుతూ ఉండడం, మాట్లాడుకోవడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు..

మీ అన్నయ్య అప్పటికే వ్యసనాలకు బానిస అయ్యాడు.

వాటిని ఆశ చూపి మీ అన్నయ్యను తన దారిలో పెట్టుకున్నాడు మన కాలేజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ రాంబాబు. మీ అన్నయ్య ప్రోద్బలంతో ఆ గుంపుని పంపించి రాఖీలు కట్టించమన్నాడు.

నాకు పక్కలో బాంబు పడ్డట్టయింది.. స్వంత అన్న ఇలా చేస్తాడా..అని

రాఖీ కట్టించుకుని నీకు రక్షగా ఉంటాను అని ఏనాడూ బాస చేయలేదు.. సరికదా ఇలా చేసి నా అందమైన భవిష్యత్తుని దెబ్బతీశాడు. మనసంతా వికలమయిపోతోంది..

ఇదంతా నీకెలా తెలుసు..? అప్రయత్నంగానే వచ్చింది నా నోట ఈ ప్రశ్న..

నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా అడిగాడు గంగ ..

లేదు… అది సరే..నీకెలా తెలిసాయి ఈ విషయాలన్నీ..

మొన్నామధ్య రాజీ మా హాస్పిటల్‌కి వచ్చినప్పుడు కలిసింది.. అన్నట్టు నేను ఆ తర్వాత మెడిసిన్ చదివి మరో డాక్టర్‌ని పెళ్లి చేసుకుని పట్నంలో ప్రాక్టీసు పెట్టాను.

రాజీ కూడా ఆ ఊర్లోనే ఉంటోంది.

తను ప్రెగ్నెంట్ అయినప్పుడు నా భార్య దగ్గరే చెకప్‌కి వచ్చేది..

చెప్పుకుంటు పోతున్నాడు గంగ.

అదేంటి రాజీ కూడా నాతో మాట మాత్రంగా అయినా అనలేదు.

ఎందుకు చెప్పడం అని ఊరుకుని ఉంటుందేమో అనుకున్నాను. సరే కానీ మా అన్నయ్య ఆ రోజు అలా చేసాడని మీకు ఎవరు చెప్పారు..?

ఇంకా మనసు పొరల్లో అన్నయ్య అలా చేసి ఉండడని ఓ ఆశ.

ఉండబట్టలేక అడిగా..

రాంబాబు..మన కాలేజ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్. తను కూడా నిన్ను ప్రేమించాడట. మనం ప్రేమించుకుంటున్నామని తెలిసి, మనల్ని విడదీయడానికి మీ అన్నయ్యని పావుగా వాడుకున్నాడు.

ఈ మధ్యనే రాంబాబు యాక్సిడెంట్ అయ్యి మా హాస్పిటల్‌లో చేరాడు.

తన కాలు చేయి విరిగితే నేనే ఆపరేషన్ చేసి సరిచేశాను.  ఆ సందర్భంలో పాత విషయాలన్నీ నాకు చెప్పాడు. ఆపరేషన్ టేబుల్ మీద చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ వైద్యునిగా వృత్తి ధర్మం గుర్తొచ్చింది.

ఎంతైనా మన క్లాస్మేట్ కదా.. అప్పుడే తెలిసింది నాకు కూడా ..

అంటూ తలదించుకున్నాడు..

నా శక్తినంతా ఎవరో పిండేసినట్లయింది. ఒక్క క్షణం నిస్త్రాణగా అయిపోయాను. స్వంత అన్నయ్య ఇంత పని చేస్తాడని అనుకోలేదు. చేయాల్సిందంతా చేసేసి తను మాత్రం ఏం పట్టనట్టు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. నన్ను మాత్రం ఇలా ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళిపోయారు.

ఒక్కసారిగా బాధనిపిస్తోంది.  కళ్ళముందే రంగుల కల కరిగిపోయింది. ఒంటరితనం మిగిలిపోయింది.

ఇప్పుడు ఇలా వచ్చి ఈయన చెప్పకపోయినా బాగుండేది అనుకున్నాను.

కానీ టైం అది ఎవరి కోసమూ ఆ గ దు.. సా..గి పోతూనే ఉంటుంది.

ఆలోచనల నుండి తేరుకునే సరికి మళ్లీ తనే అన్నాడు..

రాజీయే చెప్పింది నువ్వు ఇలా ఒంటరిగా ఉంటున్నావ్ అని..

స్వర గంగ అని మ్యూజిక్ స్కూల్ నడుపుతున్నావని..

ఇప్పుడు నిజంగా ఏడుపు వచ్చినట్టయింది. ఆ పరామర్శకి..

అన్నయ్య, విధి, ఆ రోజు ఆ పొలిటికల్ గ్రూప్, ఈ డాక్టర్ అందరూ నాతో ఆడుకున్నారు. నా ప్రేమతో ఆడుకున్నారు. అందరూ చక్కగా సెటిల్ అయిపోయారు..

నన్ను ఒంటరిదానిని చేసేసి. తొలిప్రేమని తొందరగానే చిదిమేసి ..

ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..

పాట రేడియోలో వస్తోంది..

అవును విధి బలీయమైనది.. ఎప్పుడు ఏం జరుగుతుందో.

ఎవరిని ఒడ్డుకు చేరుస్తుందో.. ఎవరిని అగాధంలోకి విసిరేస్తుందో..

గంగ లేచాడు.. బయల్దేరడానికి..

తనను పంపేసి.. కళ్ళు తుడుచుకుని..

అందరూ ఎవరి దారి వారి చూసుకున్నప్పుడు, నేనెందుకు బాధ పడుతూ బ్రతకాలి అని..

కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటూ.. క్లాస్‌కి బయలుదేరాను..

Exit mobile version